ఎవరీ సుచీర్‌ బాలాజీ? ఎలాన్‌ మస్క్‌ ఎందుకు అలా స్పందించారు? | Who is Suchir Balaji? Elon Musk Reacts on OpenAI Whistleblower Death | Sakshi
Sakshi News home page

సుచీర్‌ బాలాజీ మృతిపై ఎలాన్‌ మస్క్‌ స్పందన.. ఎవరీ భారత సంతతి యువకుడు?

Published Sat, Dec 14 2024 11:38 AM | Last Updated on Sat, Dec 14 2024 11:51 AM

Who is Suchir Balaji? Elon Musk Reacts on OpenAI Whistleblower Death

ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్‌ సుచీర్‌ బాలాజీ హఠాన్మరణం చెందాడు.  భారత సంతతికి చెందిన ఈ 26 ఏళ్ల యువ రీసెర్చర్‌..  శాన్‌ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు ధృవీకరించారు.

ఏఐ రీసెర్చర్‌ అయిన బాలాజీ ఓపెన్‌ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024)   పని చేశాడు. అయితే ఈ ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్‌..  అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

నవంబర్‌ 26వ తేదీన బుచానన్‌ స్ట్రీట్‌ అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో బాలాజీ మరణించాడని, అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. ఇప్పటివరకు జరిగిన విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు తాజాగా ప్రకటించారు. 

ఓపెన్‌ఏఐలో చేరడానికి ముందు.. సుచీర్‌ బాలాజీ బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేశాడు. అతని తల్లిదండ్రులు, భారత మూలాల వివరాలు తెలియాల్సి ఉంది.

ఎలాన్‌ మస్క్‌కు ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ అల్ట్‌మన్‌కు చాలాకాలంగా నడుస్తున్న వైరం గురించి తెలిసిందే. వాస్తవానికి.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్‌-అల్ట్‌మన్‌లే ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్‌ఏఐకు పోటీగా X ఏఐను మస్క్‌ స్థాపించాడు. ఈ నేపథ్యంలో.. ఓపెన్‌ఏఐ మాజీ ఉద్యోగి బాలాజీ మృతిపై ఎక్స్‌ వేదిక ఎలాన్‌ మస్క్‌ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు hmm అంటూ బదులిచ్చారాయన. 

తాను ఓపెన్‌ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్‌ బాలాజీ షాకింగ్‌ కామెంట్లు చేశాడతను. డాటా కలెక్షన్‌ కోసం ఓపెన్‌ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్‌జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్‌ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్‌ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. మరోవైపు సుచీర్‌ బాలాజీ మరణం.. AI సాంకేతికత నైతిక, చట్టపరమైన చిక్కుల గురించి చర్చలకు ఇప్పుడు దారితీసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement