whistleblower
-
ఎవరీ సుచీర్ బాలాజీ? ఎలాన్ మస్క్ ఎందుకు అలా స్పందించారు?
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్ సుచీర్ బాలాజీ హఠాన్మరణం చెందాడు. భారత సంతతికి చెందిన ఈ 26 ఏళ్ల యువ రీసెర్చర్.. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు ధృవీకరించారు.ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే ఈ ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 26వ తేదీన బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్‌లో బాలాజీ మరణించాడని, అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. ఇప్పటివరకు జరిగిన విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు తాజాగా ప్రకటించారు. ఓపెన్ఏఐలో చేరడానికి ముందు.. సుచీర్ బాలాజీ బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. అతని తల్లిదండ్రులు, భారత మూలాల వివరాలు తెలియాల్సి ఉంది.ఎలాన్ మస్క్‌కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్‌కు చాలాకాలంగా నడుస్తున్న వైరం గురించి తెలిసిందే. వాస్తవానికి.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్-అల్ట్మన్లే ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి బాలాజీ మృతిపై ఎక్స్ వేదిక ఎలాన్ మస్క్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు hmm అంటూ బదులిచ్చారాయన. Hmm https://t.co/HsElym3uLV— Elon Musk (@elonmusk) December 14, 2024తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడతను. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. మరోవైపు సుచీర్ బాలాజీ మరణం.. AI సాంకేతికత నైతిక, చట్టపరమైన చిక్కుల గురించి చర్చలకు ఇప్పుడు దారితీసింది.I recently participated in a NYT story about fair use and generative AI, and why I'm skeptical "fair use" would be a plausible defense for a lot of generative AI products. I also wrote a blog post (https://t.co/xhiVyCk2Vk) about the nitty-gritty details of fair use and why I…— Suchir Balaji (@suchirbalaji) October 23, 2024 -
మాజీ మహిళా ఉద్యోగి దెబ్బ, కదులుతున్న లక్షల కోట్ల విలువైన కంపెనీ పునాదులు?
ఒక్క మహిళా ఉద్యోగి. 8.48 నిమిషాల నిడివి గల వీడియో. వందల కొద్దీ డాక్యుమెంట్లు.వెరసీ ప్రపంచంలో అత్యంత విలువైన సోషల్ మీడియా కంపెనీ మెటా పునాదులు ఒక్కొక్కటిగా కదులుతున్నాయా? 2021లో మెటా (అప్పడు ఫేస్బుక్)లోని అక్రమాల్ని బయటపెట్టింది తానేనంటూ వెలుగులోకి వచ్చిన ఓ వీడియోతో గంటల వ్యవధిలో ఆ సంస్థ రూ.50 వేల కోట్లు నష్టపోయింది. ప్రారంభంలో మహిళ చేసిన ఆరోపణల్ని సీఈవో జూకర్ బెర్గ్ సైతం ఇదంతా 'టీ కప్పులో తుఫాను' అని అనుకున్నారు. కానీ మెటాను ముంచే విధ్వంసానికి దారితీస్తుందనుకోలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తాజాగా, ఆ వీడియో తాలుకు ప్రభావం మరోసారి మెటాపై పడింది. మెటా, ఆ సంస్థకు చెందిన ప్రముఖ ఫొటో/వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు భారీ షాక్ తగిలింది. 41 రాష్ట్రాలకు చెందిన పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు యువతను వ్యసనపరులుగా మార్చడం ద్వారా వారిలో మానసిక రుగ్మతలు పెరిగేలా ఆజ్యం పోస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుల వెల్లువ మెటా, ఇన్‌స్టాగ్రామ్‌పై ఓక్లాండ్, కాలిఫోర్నియా, ఫెడరల్ కోర్టులో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కాలిఫోర్నియా, న్యూయార్క్‌తో పాటు మరో 33 రాష్ట్రాల పిటిషనర్లు.. ఈ రెండు ఫ్లాట్‌ఫామ్‌లు తప్పుడు ప్రచారాలు చేస్తూ పదే పదే తప్పుదారి పట్టిస్తున్నాయని.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రలోభపెట్టి.. ఆన్లైన్లో గంటల కొద్ది గడిపేలా శక్తివంతమైన టెక్నాలజీని మెటా ఉపయోగించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ఆదాయాన్ని గడించి లాభపడుతుందని అన్నారు. యూజర్ల కన్నా.. డబ్బులే ముఖ్యం ఓ వైపు అడ్వటైజర్లు చేజారిపోకుండా యువతను కట్టిపడేయడంలో మెటా వ్యూహాత్మకంగా ఎలా వ్యాపారం చేస్తుందో వారు వివరించారు. ముఖ్యంగా, పలు అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా చిన్న వయస్సు వారినే తమ వ్యాపారానికి అనువుగా మార్చుకుంటున్నాయి. ఇలా చేయడం వల్ల పిల్లలు యుక్తవయస్సు వచ్చే వరకు తమ సంస్థ బ్రాండ్లను వినియోగించుకుంటారనే ఉద్దేశ్యంతో ఈ తరహా వ్యాపార వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వారికి లాభం చేకూరేలా మెటా,ఇన్‌స్టాగ్రామ్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయి’ అని కోర్టు దావాలో తెలిపారు. పిల్లల్ని నాశనం చేస్తున్నాయ్ అంతేకాదు, ‘నిరాశ, ఆందోళన, నిద్రలేమి, విద్య, రోజువారీ జీవితంలో జోక్యం, అనేక ఇతర ప్రతికూల ఫలితాలు పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నాయని పిటిషన్లు కోర్టు మెట్లెక్కారు. దీంతో మెటాపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వివిధ రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించినందుకు మెటా 1,000 వెయ్యి నుంచి 50,000 డాలర్ల వరకు సివిల్ పెనాల్టీలను ఎదుర్కొంటుంది. కేసు తీవ్రతను బట్టి భారీ మొత్తంలో మెటా చెల్లించాల్సి ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించే మిలియన్ల మంది పిల్లలు, యవకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రాన్సెస్ హౌగెన్ దెబ్బే ఇలా మెటా వరుస ఇబ్బందులు ఎదుర్కొవటానికి ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ కారణం. ఆమె గతంలో ఫేస్బుక్లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా పని చేశారు. 2021లో ఫ్రాన్సెస్ హౌగెన్ మెటా తీరును తప్పుబట్టారు. ప్రజల భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు ముఖ్యమని..ద్వేషాన్నిరెచ్చగొట్టే తప్పుడు సమాచారాన్ని ఎంతగా వ్యాప్తి చెందిస్తున్నదీ కంపెనీ సొంత పరిశోధన కూడా చెబుతోందంటూ కొన్ని డాక్యుమెంట్లను విడుదల చేశారు. ఇద్దరు టీనేజర్ల అభిప్రాయాలు ఆ డాక్యుమెంట్లలో వీడియోలు కూడా ఉన్నాయి. వీడియోల్లో ఇద్దరు టీనేజర్లు మెటాకి చెందిన సోషల్ సైట్లపై తమ అభిప్రాయాల్ని వివరించారు. ‘‘14ఏళ్ల ఎలీనార్, ఫ్రేయా’లు ఇద్దరూ తమ వయస్సు వారిలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. ఓ టీనేజర్‌గా మేం ఇందులో మోడల్స్‌ను ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను చూస్తుంటాం. వాళ్లందరూ స్కిన్నీగా పర్ఫెక్ట్ బాడీతో ఉంటారు. వాళ్లని చూసినప్పుడు అనుకోకుండానే వాళ్లతో మనల్ని పోల్చి చూసుకుంటాం. ఇదే అన్నింటికన్నా ప్రమాదకరమైందని నాకు అనిపిస్తుంది. ‘‘మనసుకు ఏదీ తోచనప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళుతుంటాం. అందులో చాలా వరకు మనల్ని టార్గెట్ చేసేవే మనకి కనిపిస్తుంటాయి. అంటే ఉదాహరణకు మోడల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను సెలబ్రిటీస్ మనకి కనిపిస్తుంటారు. అప్పుడనప్పిస్తుంది. ఓహ్! ‘అలా మనం ఎప్పటికీ అవ్వలేమని’ ఫ్రేయా అన్నారు. ఎలీనార్, ఫ్రేయాల ఆందోళనని షేర్ చేసింది.మానసిక ఆరోగ్య సమస్యలపై బాధపడుతున్న టీనేజర్ల పరిస్థితిని ఇన్ స్టాగ్రామ్ మరింత దారుణంగా చేస్తుందని లీకైన ఫేస్బుక్ అంతర్గత పత్రాల్లో ఉంది. ఈ డాక్యుమెంట్స్‌ను ఫ్రాన్సెస్ హౌగెన్ లీక్ చేసింది. లీకైన కొద్ది సేపటికే రూ.50 వేల కోట్లు నష్టం ఇలా లీకైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో అంతరాయం ఏర్పడడంతో ఫేస్‌బుక్‌కు 7 బిలియన్ డాలర్లు అంటే సుమారు మన కరెన్సీలో రూ.50 వేల కోట్లకు పైగానే నష్టం వాటిల్లింది. ఈ ప్రభావం ఫేస్బుక్ స్థాపించినప్పటి నుంచి సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్లో డ్యామేజీ జరగడం ఇదే మొదటి సారి. అంతేకాదు ఈ అంతరాయంతో అపరకుబేరుల జాబితా నుంచి మార్క్ జూకర్ బర్గ్ స్థానం కిందకి దిగజారింది. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. కోలుకోలేని నష్టం నాటి నుంచి మెటా ఊహించని విధంగా నష్టపోతూ వస్తుంది. లీకైన పత్రాల వల్ల కొన్ని గంటల వ్యవధిలో వేల కోట్ల నష్టంతో పాటు, సంస్థ పేరును మార్చడంతో పాటు అన్నీ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. అయితే తాజాగా, 41 రాష్ట్రాల్లో మెటాపై దాఖలైన వాజ్యం ఆ సంస్థ ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కొనుందో చూడాల్సి ఉంది. చదవండి👉సంచలన నిర్ణయం.. భారత్‌కు గుడ్‌బై చెప్పిన రెండు దిగ్గజ కంపెనీలు -
టీసీఎస్‌లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ
ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో పెద్ద కుంభకోణం జరిగిందని ఆంగ్ల పత్రికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దీనిపై స్పందించింది. తమ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని స్పష్టం చేసింది. తమ నుంచి కీలక వ్యక్తులు ఎవరూ ఇందులో లేరని తెలిపింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగాల కుంభకోణంపై స్పందించింది. సంస్థలోని కీలక ఉద్యోగులు రూ.100 కోట్ల కమిషన్లను వసూలు చేశారనే ఆరోపణలపై స్పష్టత ఇచ్చింది. ఇందులో తమ ఉద్యోగుల పాత్ర ఏదీ లేదని వివరించింది. శుక్రవారం పలు మీడియాల్లో వచ్చిన వార్తలు సత్యదూరమైనవని తెలిపింది. ఈ మేరకు టీసీఎస్ కీలక ప్రకటన జారీ చేసింది. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) రిక్రూట్మెంట్ స్కాంపై అందిన ఫిర్యాదు మేరకు అంశాన్ని పరిశీలించామని అయితే తమ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎలాంటి మోసం జరగలేదని తేలిందని వెల్లడించింది. ఇందులో తమ ఉద్యోగుల పాత్ర లేని తెలిపింది. అంతేకాదు టీసీఎస్ నియామకాల్లోరిక్రూట్మెంట్ విభాగం పాత్ర ఉండదని వివరించింది. ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి అందుబాటులో ఉన్న వనరులను ఉద్యోగులకు చూసుకునే బాధ్యత మాత్రమే ఆర్ఎంజీ అని చెప్పింది. ఇప్పుడు వచ్చిన వార్తలన్నీ సంస్థ ప్రధాన నియామక బృందానికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని వివరించింది. (అపుడు తప్పింది..ఇపుడు మింగేసింది: పాకిస్తాన్ టైకూన్ విషాద గాథ) -
ఎయిరిండియా పైలెట్ ఘనకార్యం..కాక్‌పిట్‌లో స్నేహితురాలితో ముచ్చట్లు!
పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) ఎయిరిండియా (ఏఐ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో భద్రతా లోపాలపై ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతికి ఏప్రిల్ 21న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎయిరిండియాకు చెందిన ఓపైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి తన స్నేహితురాల్ని కాక్‌పిట్‌లో కూర్చోబెట్టుకున్నాడు. దీనిపై ఎయిరిండియా సకాలంలో స్పందిచకపోవడంపై డీజీసీఏ మండిపడింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియా విమానంలో అసలేం జరిగింది ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా 915 విమానానికి చెందిన పైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. ప్రయాణం ముగిసే వరకు అక్కడే కూర్చోపెట్టుకున్నాడు. అయితే ఈ ఘటనపై మార్చి 3న కేబిన్ సూపర్వైజర్ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పట్టించుకోకపోవడంతో డీజీసీఏని ఆశ్రయించారు. దీంతో డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించిన ఎయిరిండియా 915 విమానం పైలెట్ కమాండ్ కెప్టెన్ హర్ష్ సూరీ, కేబిన్ క్రూ, కాక్‌పిట్‌లో కూర్చున్న ఎకానమీ క్లాస్ ప్రయాణికురాలికి సమన్లు అందించింది. కాగా, సకాలంలో జోక్యం, చర్యలు తీసుకోకపోవడం విజిల్ బ్లోయర్ ఈ విషయాన్ని డీజీసీఏకి చెప్పాల్సి వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మహిళా సిబ్బందిపై వేధింపులు సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతి హెన్రీ డోనోహోకు పంపిన నోటీసులో ఫిర్యాదు దారుడు మాట్లాడుతూ.. కమాండర్‌ని బెదిరించడం, అవమానించడం, తిట్టడం, అసభ్యంగా ప్రవర్తించడంపై చింతిస్తున్నాను. షాక్‌కు గురయ్యాను. మహిళా ప్రయాణీకురాలిని కాక్‌పిట్‌లోకి అనుమతించడాన్ని పైలట్ ఉల్లంఘించడమే కాకుండా, తాను చెప్పినట్లు చేయలేదనే అకారణంగా మహిళా సిబ్బందిని వేదించినట్లు మైలెట్ చేసింది. కాగా, విజిల్ బ్లోయర్ ఫిర్యాదుతో డీజీసీఏ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి👉 జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే! -
ట్విటర్‌పై బాంబ్ పేల్చిన విజిల్ బ్లోయర్!
సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌పై విజిల్ బ్లోయర్ బాంబు పేల్చారు. ట్విటర్లో అనేక సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని హెచ్చరించారు. ఇదే విషయంపై కాంగ్రెస్ సభ్యులు, ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌తో సంప్రదింపులు జరపడంతో ఇప్పుడీ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. విజిల్ బ్లోయర్ ఎంట్రీతో మస్క్ కంపెనీలో తన పంథా మార్చుకుంటారా? లేదంటే అలాగే కొనసాగుతారా? అనేది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్, ఎఫ్‌టీసీతో జరిపిన చర్చల్లో విజిల్ బ్లోయర్ ట్విటర్లోని సెక్యూరిటీ లోపాల్ని ఎత్తిచూపినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ముఖ్యంగా ‘గాడ్‌మోడ్’ తో ట్విటర్‌కు చెందిన ఇంజినీర్లు ప్రపంచంలో ఎవరి ట్విటర్ అకౌంట్లోనైనా లాగిన్ అవ్వొచ్చు. ట్వీట్ చేయొచ్చు. ఎలాన్ మస్క్ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గాడ్ మోడ్‌ను కాస్త ప్రివిలేజ్డ్మోడ్గా మార్చారు. పేర్లు మారాయే తప్పా.. భద్రత విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని ఆరోపించారు. అంతేకాదు ట్విటర్ ఉద్యోగులు(అందరు కాదు) సులభంగా కోడ్‌లో ఫాల్స్ టూ ట్రూ అనే ఆప్షన్ మార్చితే ట్వీట్లు చేయొచ్చని అన్నారు. ప్రోగ్రామ్ పేరు మార్చనప్పటికీ.. యూజర్ల అకౌంట్స్‌ను యాక్సిస్ చేసేందుకు టెస్ట్ చేసే ప్రొడక్షన్ కంప్యూటర్, శాంపిల్ కోడ్ ఉంటే సరిపోతుందని విజిల్‌బ్లోయర్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో హైలెట్ చేసింది. -
వాళ్లిద్దరిని క్షమించేద్దామా ? మస్క్ ట్వీట్‌పై యూజర్ల రియాక్షన్ ఇదే!
యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) విజిల్‌బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్, వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజ్లను యుఎస్ ప్రభుత్వం క్షమించాలా? వద్దా? అనే అంశం ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ చర్చకు తెరలేపారు. ఇదే విషయంపై నెటిజన్ల నుంచి అభిప్రాయం తీసుకునేందుకు ఓ పోల్ చేశారు. ‘నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు. కానీ పోల్ మాత్రమే చేశాను. అసాంజే, స్నోడెన్‌లను క్షమించాలా?’ అని మస్క్ ట్వీట్ చేశారు. అసాంజే,స్నోడెన్ ఇద్దరూ అమెరికా ఆర్మీ, ఇంటెలిజెన్స్ చేసిన తప్పులు, వాటి తాలుకూ ఆధారాల్ని బహిర్గతం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అసాంజేను, రష్యాలో ఉంటున్న స్నోడెన్‌ను దేశానికి రప్పించేలా యూఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్నోడెన్‌కు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రష్యన్ పౌరసత్వం మంజూరు చేశారు. తాజాగా, రష్యా పాస్ పోర్ట్ అందుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక మస్క్ చేసిన పోల్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. పోస్ట్ చేసిన గంటలోపే 560,000 కంటే ఎక్కువ మంది ఓట్ చేశారు. వారిలో చాలా మంది యూజర్లు మస్క్ ట్వీట్‌కు మద్దతు పలుకుతూ ఓట్ చేశారు. ఇద్దరు విజిల్బ్లోయర్లను క్షమించాలని 79.8 శాతం మంది యూజర్లు అంగీకరిస్తూ ఓటు వేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. I am not expressing an opinion, but did promise to conduct this poll. Should Assange and Snowden be pardoned? — Elon Musk (@elonmusk) December 4, 2022 -
ట్విటర్‌పై మరో బాంబు వేసిన ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్‌పై మరో బాంబు వేశారు. తన 44 బిలియన్ డాలర్ల కొనుగోలు డీల్‌నుంచి బయటికి రావడాన్ని మరోసారి గట్టిగా సమర్ధించుకున్నారు. దీనికి సంబంధించిన కారణం చూపుతూ ట్విటర్‌కు ఒక లేఖ రాశారు. జూలైలో ట్విటర్ డీల్‌ను ఉపసంహరించు కుంటున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత ఆగస్టులో మరొక లేఖలో, పీటర్ జాట్కో కోర్టుకు హాజరు కావాలని మస్క్ డిమాండ్ చేశారు. తాజాగా మూడో లేఖ రాయడం గమనార్హం. ట్విటర్ మాజీ సెక్యూరిటీ హెడ్ , విజిల్‌బ్లోయర్ పీటర్ జాట్కోకు మిలియన్ డాలర్లను చెల్లించిన విషయాన్ని తన వద్ద దాచిపెట్టిందని మండి పడ్డారు. దీనిపై ట్విటర్ మూడో లేఖను కూడా పంపించారు. ఈ మేరకు ట్విటర్ చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గాడేకు సెప్టెంబర్ 9న లేఖ రాశారు. జాట్కోకు నెలల తరబడి జీతం ఇవ్వకపోవడం, ఇతర పరిహారం కింద సుమారు 7 మిలియన్ల డాలర్లు సెవెరెన్స్ పేమెంట్ చేసిందట. మరోవైపు మస్క్ ఆరోపణలపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. (Dolo-650: వెయ్యికోట్ల ఫ్రీబీస్,ఐపీఏ సంచలన రిపోర్టు) కాగా ట్విటర్ నకిలీ ఖాతాలపై సమాచారం అందించలేదని ఆరోపించిన మస్క్ ట్విటర్ కొనుగోలు డీల్‌నుంచి జూలైలో వైదొలిగారు. దీన్ని వ్యతిరేకించిన ట్విటర్ కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంపై డెలావర్ కోర్టులో అక్టోబర్ 17న విచారణ ప్రారంభమవుతుంది. -
ఫేస్‌బుక్‌పై విజిల్ బ్లోయర్ ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు..!
అమెరికా వెలుపల నివసిస్తున్న ప్రజల డేటాను మెటా ఉద్దేశపూర్వకంగా ప్రమాదంలో నెట్టివేస్తుందని ఫేస్బుక్ విజిల్ బ్లోయర్ ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వెలుపల ఖర్చులను తగ్గించడం కోసం ఫేస్బుక్ యూజర్ల డేటాను ప్రమాదంలో నెడుతున్నట్లు ఫ్రాన్సెస్ హౌగెన్ సోషల్ మీడియా, ఆన్లైన్ భద్రత అంశంపై నేడు ఆస్ట్రేలియా సెలెక్ట్ కమిటీకి చెప్పారు. హానికరమైన కంటెంట్ విషయానికి వస్తే ఫేస్బుక్ "బేర్ మినిమమ్"ను తీసివేస్తుందని హౌగెన్ తెలిపారు. హోం వ్యవహారాల శాఖ కమిటీతో ఇందుకు సంబంధించిన ఫలితాలను పంచుకుంది. సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని ప్రోత్సహించడం, భద్రతా-బై-డిజైన్ విధానాన్ని అవలంబించడం, ఆన్లైన్ వల్ల కలిగే హానిని తగ్గించడం కోసం తగిన సానుకూల చర్యలు తీసుకోవాలని అన్నప్పుడు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా "తరచుగా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి చాలా విముఖత చూపుతుంది" అని ఆమె తెలిపింది. విషపూరిత ఆన్లైన్ వార్తలను అరికట్టడానికి ప్రధాన సాంకేతిక సంస్థల విధానాలపై సోషల్ మీడియా విచారణలో భాగంగా హౌగెన్ కమిటీతో ఈ వివరాలను పంచుకున్నారు. ఫేస్బుక్ అల్గోరిథంలు విపరీతమైన కంటెంట్ ప్రోత్సాహిస్తాయని, తద్వారా లాభాలు ఆర్జిస్తుందని హౌగెన్ వివరించింది. విపరీతమైన కంటెంట్ తొలగించడానికి మానిటరింగ్ వ్యవస్థను ఫేస్బుక్ కలిగి ఉన్న సరైన చర్యలు తీసుకోదని ఆమె పేర్కొంది. ఇలాంటి, కంటెంట్ తొలగించడం వల్ల దాని ద్వారా వచ్చే లాభాలను తగ్గించుకోవడం ఇష్టం లేక నామ మాత్రంగా మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. (చదవండి: కొత్త ఈ-పాస్ పోర్ట్‌లను హ్యాక్ చేస్తే ఇక అంతే సంగతులు..!) -
మార్క్ జుకర్‌బర్గ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఫ్రాన్సెస్ హౌగెన్!
ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్‌గా మారిపోయి..ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. యూజర్ భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు పరమావధిగా మారిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా మరోసారి ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌పై ఘాటుగా విమర్శలు చేసింది. గతంలో ఫేస్‌బుక్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె, మొదటిసారి బహిరంగ ప్రసంగంలో తన మాజీ బాస్ మార్క్ జుకర్‌బర్గ్‌ను సీఈఓ పదవి నుంచి దిగిపోవాలని బాంబ్ పేల్చింది. అలాగే, సంస్థ పేరు మార్చడం కంటే ఫేస్బుక్ నాయకత్వంలో మార్పును కోరుకోవాలని సూచించారు. "మార్క్ జుకర్‌బర్గ్ సీఈఓగా కొనసాగితే సంస్థ పరిస్థితి మారే అవకాశం లేదని నేను భావిస్తున్నాను" అని హౌగెన్ ఒక వెబ్ సమ్మిట్‌లో చెప్పారు. కాగా, ఒక మాజీ ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజర్ ను జుకర్ బర్గ్ రాజీనామా చేయాలా అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చాడు.. "బహుశా మరొకరు పగ్గాలు చేపట్టే సమయం వచ్చిందని భావించవచ్చు.. భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టె వ్యక్తి వల్ల ఫేస్బుక్ తిరిగి బలంగా నిలబడే అవకాశం ఉంది" అని అన్నారు. (చదవండి: ద్విచక్ర వాహనాలు కొనేవారికి ఎస్బీఐ తీపికబురు) ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల విమర్శలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మాతృ సంస్థ పేరును మార్చిన విషయం తెలిసిందే. జుకర్‌బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంతకుముందు ఫేస్బుక్ కింద కొనసాగిన సామాజిక మాధ్యమాలు(ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లు) ఇకపై ‘మెటా’ కింద కొనసాగుతాయి. ‘‘ప్రస్తుత బ్రాండ్ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మన సంస్థ బ్రాడ్ పేరును మార్చాల్సి వచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు. కానీ, పేరు మార్చిన తర్వాత కూడా విమర్శలు, నష్టాలు తగ్గకపోవడంతో జుకర్‌బర్గ్‌పై ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. -
ఫేస్బుక్ నెత్తిన మరో పిడుగు..!
New Whistleblower Accuses Facebook Of Promoting Hate Speech Misinformation: గత కొద్దిరోజుల నుంచి ఫేస్‌బుక్‌కు కంటిమీద కునుకులేకుండా పోయింది. వరుస ఆరోపణలు ఫేస్‌బుక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమెరికన్ మీడియా సంస్ధ వాల్‌స్ట్రీట్ జనరల్ ఫేస్‌బుక్‌పై దుమ్మెతిపోసిన విషయం తెలిసిందే. చివరికి మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెన్స్ హాగెన్ కూడా ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలను చేసింది. తాజాగా మరో విజిల్‌బ్లోయర్ కూడా ఫేస్‌బుక్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫేస్బుక్లో సమస్యలు ఇప్పుడే ముగిసేలా కన్పించడం లేదు. కొద్దిరోజుల క్రితం మాజీ ఉద్యోగి రూపంలో ఫేస్‌బుక్‌పై పిడుగు పడితే...ఇప్పుడు మరో విజిల్‌బ్లోయర్ కంపెనీ చీకటి నిజాలను బయటపెట్టారు. ఇంటిగ్రీటి టీమ్ మాజీ సభ్యుడు ఫేస్‌బుక్‌పై మరిన్ని ఆరోపణలను చేశారు. పలుదేశాల్లో ద్వేషపూరిత ప్రసంగాలను, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఫేస్బుక్ ప్రోత్సహించిందని పేర్కొన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను అరికట్టడంలో ఫేస్బుక్ తీవ్రంగా విఫలమైందని వెల్లడించారు. కంపెనీ ఎప్పుడు లాభాల కోసమే పాకులాడదనే ఫ్రాన్సెస్ హాగెన్ చేసిన వ్యాఖ్యలను బలపరుస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించారు. చదవండి: మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్...! ఫేస్బుక్ ఇంటిగ్రీటి టీమ్‌లో భాగమైన ఈ కొత్త విజిల్‌బ్లోయర్ తన ఆరోపణలను అమెరికన్ మీడియా వాషింగ్టన్ పోస్ట్‌తో పంచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫేస్‌బుక్‌పై అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భయపడి భద్రతా నియమాలను అమలు చేయడానికి ఫేస్బుక్ నిరాకరించిందని ఆరోపించారు. కొత్త విజిల్‌బ్లోయర్ చేసిన ఆరోపణలు ఫ్రాన్సిస్ హుగెన్ చేసిన ఆరోపణలను ప్రతిధ్వనించాయి. చదవండి: హైదరాబాద్‌లో ఇవి కూడానా? ఓపెన్ కొరియన్ మెనూ! -
ఫేస్‌బుక్‌లోనే బ్లాక్ షీప్స్.. విచిత్ర పరిణామాలు!
సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్బుక్ కంపెనీలో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యూజర్ భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తోందని సోషల్ మీడియా దిగ్గజ కంపెనీపై మాజీ ఉద్యోగి ఒకరు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరోపణలకు సంబంధించిన రుజువు పత్రాలతో సైతం ఆమె మీడియా ముందుకు సైతం వచ్చారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక దిద్దుబాటు చర్యలకు దిగింది ఫేస్బుక్. కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల కదలికలపై నిఘా పెంచింది. బ్లాక్ షీప్స్ లిస్ట్ తయారు చేసి.. అనుమానం ఉన్నవాళ్లపై వేటుకి సిద్ధమైంది. ఈ తరుణంలో న్యూస్ ఫీడ్‌ను డిలీట్ చేసే యాప్‌ను కనిపెట్టినందుకు ఓ డెవలపర్‌పై శాశ్వత నిషేధం విధించింది. యూకేకు చెందిన లూయిస్ బార్క్లే అనే డెవలపర్.. ‘అన్‌ఫాలో ఎవ్రీథింగ్’ అనే బ్రౌజర్ ద్వారా ఆటోమేటిక్‌గా ఫ్రెండ్‌లిస్ట్‌ను, పేజీలకు అన్‌ఫాలో అయ్యే వెసులుబాటు అందిస్తోంది. అంతేకాదు న్యూస్ ఫీడ్‌ను సైతం ఖాళీ చేసేస్తోంది. అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని లూయిస్ ఖండిస్తున్నాడు. ఇది కేవలం ఎక్స్టెన్షన్ సర్వీస్ మాత్రమేనని, అన్‌ఫాలోకి సంబంధించింది ఏమాత్రం కాదని, న్యూస్‌ఫీడ్ క్లియరెన్స్ వల్ల యూజర్ మానసిక స్థితి మెరుగుపడడంతో పాటు(పదే పదే ఫేస్బుక్లో గడిపే పని తగ్గుతుంది), కుటుంబంతో సంతోషంగా గడుపుతారని చెప్తున్నాడు. అయినప్పటికీ ఫేస్బుక్ ఈ వివరణతో సంతృప్తి చెందలేదు. బార్క్లేను ఫేస్బుక్, దాని అనుబంధ సంస్థ అయిన ఇన్స్టాగ్రామ్ నుంచి శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఈ వేటు వెనుక.. ఫ్రాన్సెస్ హౌగెన్‌కు బార్క్లే అందించిన సాయమే కారణం అయ్యి ఉండొచ్చన్న! అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగులను బతిమాలుతూ.. ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్, విజిల్‌బ్లోయ(వ)ర్గా మారిపోయి.. ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆపై ఈ పంచాయితీ అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్) దగ్గరికి చేరింది. ఈ క్రమంలో ఫేస్బుక్ గురించి పాజిటివ్ ప్రచారం చేయాలని ఉద్యోగులను బతిమాలుతోంది యాజమాన్యం. ఆరోపణల్ని ఖండించడం, ఫేస్బుక్ గురించి ఇంట్లోవాళ్లతో, ఇతరులతో మంచిగా చెప్పడం లాంటివి చేయాలంటూ క్లాసులు తీసుకుంటోంది. ఇక కిందిస్థాయి ఉద్యోగులకు ఈ అంశాలతో కూడిన మెమోలను ఉద్యోగులకు జారీ చేసిందని ది టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హౌగెన్‌ను ఎవరూ విమర్శించకూడదనే కఠిన ఆదేశాలు ఉద్యోగులకు జారీ చేసిందట. ఆమెను కలవనున్న బోర్డ్ ఫేస్ బుక్ మీద సంచలన ఆరోపణలతో ప్రపంచం ముందుకు వచ్చారు మాజీ ప్రొడక్ట్ ఇంజినీర్ ఫ్రాన్సెస్ హౌగెన్. ‘ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్లైన్’ పేరిట ఆమె సమర్పించిన నివేదిక ఓ ప్రముఖ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌తో టీనేజర్ల మానసిక స్థితి ఎంత దారుణంగా దెబ్బతింటుందో అనే విషయంతో పాటు వివిధ దేశాల్లో రకరకాల రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ విభాగాల ప్రయోజనాల కోసం ఫేస్బుక్ ఏ విధంగా పని చేసిందనే విషయాల్ని సైతం అందులో క్షుణ్ణంగా వివరించినట్లు చెబుతున్నారామె. ఈ తరుణంలో వ్యక్తిగత భద్రత కోసం ఆమె సెనెటర్లను సైతం ఆశ్రయించారు. అయితే ఆమె ఆరోపణలను బహిరంగంగా ఖండించిన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.. ఇప్పుడు రాజీ కోసం ప్రయత్నిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఫేస్బుక్ కంపెనీలో స్వతంత్ర్య దర్యాప్తు సంస్థగా పేరున్న ఓవర్‌సైట్ బోర్డ్.. త్వరలో ఫ్రాన్సెస్ హౌగెన్‌ను స్వయంగా కలవబోతుందట. తద్వారా ఆరోపణలపై నిజనిర్ధారణ చేయనున్నట్లు సోమవారం ఒక ప్రకటన చేసింది బోర్డు. అయితే ఇదంతా రాజీ చర్యల్లో భాగమేనని ది టైమ్స్ అనుమానం వ్యక్తం చేస్తూ మరో కథనం ప్రచురించింది. చదవండి: TIME Cover Ft. Zuckerberg: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? చదవండి: పైసల కోసమే ఫేస్బుక్ కక్కుర్తి! చదవండి: నవంబర్ 10న.. ఏం జరగబోతోంది? -
మాట్లాడితే మీనింగ్ ఉండాలి: జుకర్‌బర్గ్ ఆగ్రహం
ఫేస్బుక్ పంచాయితీ సెనెట్‌కు చేరిన క్రమంలో మాటల తుటాలు పేలుతున్నాయి. ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్‌గా మారిపోయి.. ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సైతం ఘాటుగా స్పందిస్తున్నారు. నెలకు మూడు బిలియన్ల మంది యూజర్లు ఉపయోగించుకునే ఫేస్బుక్ మీద మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. యూజర్ భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు పరమావధిగా మారిందని ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ఫ్రాన్సెస్ హౌగెన్, ఇతరత్ర మీడియా కథనాలను కొట్టిపడేస్తున్నారాయన. ఏమైనా అర్థం ఉందా? లాభం కోసం ప్రజలను రెచ్చగొట్టే కంటెంట్‌ని మేం ఉద్దేశపూర్వకంగా ముందుకు తెస్తామనే వాదన చాలా అవాస్తవికమైనంటూ జుకర్‌బర్గ్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేశారాయన. ‘‘ ఆమె(ఫ్రాన్సెస్ హౌగెన్) మాట్లాడేదాంట్లో అర్థం లేదు. కంటెంట్ ద్వారా ప్రజలను రెచ్చగొట్టడం, వాళ్లను నిరాశలోకి నెట్టేయడమా? బహుశా ఏ టెక్ కంపెనీ చేయదేమో. నైతిక విలువలు, వ్యాపారం.. పరస్సర విరుద్ధ అంశాలు. వాటిని ముడిపెట్టి విమర్శలు చేయడం లాజిక్‌గా అనిపించడం లేదు. ఫేస్బుక్ అనేది యాడ్స్ నుంచి డబ్బు సంపాదిస్తోందని ముందు నుంచి చెబుతున్నాం. అలాగే తమ యాడ్స్ జనాల్ని రెచ్చగొట్టేవిగానో, కోపం తెప్పించేవిగానో, వాళ్లకు హాని చేసివిగానో ఉండవని అడ్వటైజర్స్ సైతం చెప్తున్నారు. అలాంటప్పుడు ఆమె ఆరోపణలు.. ఆ ఆరోపణల ఆధారంగా వచ్చిన కథనాలు ఎలా నిజం అవుతాయి’’ అని మార్క్ ప్రశ్నిస్తున్నాడు. కాంగ్రెస్ ముందర వివరణ ఇదిలా ఉంటే ఫేస్బుక్లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా(ప్రొడక్ట్ ఇంజినీర్)గా గతంలో పని చేసిన ఫ్రాన్సెస్ హౌగెన్.. సంచలన ఆరోపణలతో తెర ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై ఎలాంటి చెడు పరిణామాలు చూపిస్తుందో సవివరింగా వివరిస్తూ.. ఫ్రాన్సెస్ హౌగెన్ ‘ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్లైన్’ పేరుతో సమగ్ర నివేదికను రూపొందించారు. అది ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితం అయ్యింది కూడా. ఆ తర్వాత ఓ టీవీ ఛానెల్ ద్వారా కెమెరా ముందుకు వచ్చిన ఫ్రాన్సెస్.. మంగళవారం తాను రూపొందించిన నివేదికను సెనెట్ సభ్యులకు సైతం అంచారు. ‘‘ఫేస్బుక్ పిల్లలకు హాని చేస్తోందని, లాభం కోసమే ప్రయత్నాలు చేస్తోందని నియంత్రించాల్సిన అవసరం ఉంద’ని ఆమె చాలా బలంగా ఆరోపిస్తోంది. తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఫేస్బుక్ ప్రయత్నిస్తోందంటూ సెనెటర్ల ముందు ఆమె వివరణ కూడా ఇచ్చారు. ఇక ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు సమాచారం, సమాజంపై చెడు ప్రభావం చూపుతున్న వైనంతో పాటు పొరపాటు సరిదిద్దుకోకుండా మరిన్ని తప్పులు చేస్తోందని, అందుకే కంపెనీ నుంచి బయటకు వచ్చినట్టు వెల్లడించారు. ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణలతో ఫేస్బుక్ వివాదం కొత్త మలుపు తీసుకుంది.ఇందులో వివరాలు కనుక పక్కా ఆధారాలతో రుజువైతే ఫేస్బుక్ చిక్కులు ఎదుర్కొనడం ఖాయం. కొసమెరుపు: భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి ఆరు నుంచి ఏడు గంటలపాటు ఫేస్బుక్ అండ్ కో సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. పైకి ఇది టెక్నికల్ ప్రాబ్లం అని చర్చ జరుగుతున్నప్పటికీ.. కొందరు మేధావులు మాత్రం ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాకే ఇది జరగడంతో ఫేస్బుక్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా కోట్ల మంది యూజర్ల డాటా అమ్ముకుందనే ఆరోపణల్ని ఫేస్‌బుక్‌పై గుప్పిస్తున్నారు. చదవండి: ఆరు గంటల్లో.. ఫేస్బుక్లో ఇది జరిగింది -
ఇన్‌స్టాగ్రామ్‌తో ప్రమాదం.. చిక్కులో ఫేస్బుక్
టీనేజీ అమ్మాయిలపై ఇన్స్టాగ్రామ్ చెడు ప్రభావం చూపుతోందంటూ అమెరికాలో చెలరేగిన వివాదం కొత్త మలుపు తీసుకుంది. బలమైన ఆధారాలు ఉన్నందునే ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌పై విమర్శలు వస్తున్నాయనే అంశం తేటతెల్లమవుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఫేస్బుక్ ఉంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే వాట్సాప్, ఇన్స్టావంటి పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ రన్ అవుతున్నాయి. తమ వినియోగదారుల రక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఫేస్బుక్ నిత్యం ప్రకటనలు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు తమ ప్లాట్‌ఫామ్స్‌పై తప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్నామని చెబుతుంది. అయితే ఇప్పుడవన్నీ కట్టుకథలేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. తప్పుడు ప్రచారం ఫేస్బుక్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఇన్స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై చెడు ప్రభావం చూపుతోందంటూ ఇటీవల అమెరికాకు చెందని వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ పట్ల నియంత్రణ లేకపోవడం వల్ల కొందరు టీనేజీ అమ్మాయిలు సూసైడ్ దిశగా ఆలోచనలు చేస్తున్నారనేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకటించింది. అయితే ఫేస్బుక్ స్పందిస్తూ.. ఇన్‌స్టా గ్రామ్ వల్ల టీనేజర్లపై ఎటువంటి ప్రభావం లేదని, పైగా టీనేజీ యూజర్లకు ఎంతో మేలు చేస్తుందంటూ తెలిపింది. అవన్ని నిజాలే వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం, ఫేస్బుక్ స్పందన మీద చర్చ నడుస్తుండగానే ఆదివారం నాడు మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఫేస్బుక్లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా పని చేస్తోన్న ఫ్రాన్సెస్ హౌగెన్ అనే మహిళా ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ తన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఫేస్బుక్ ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టారు. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు సమాచారం, సమాజంపై చెడు ప్రభావం చూపుతున్న వైనానికి సంబంధించిన వివరాలను తానే మీడియాకు అందించినట్టు చెప్పుకున్నారు. జరగిన పొరపాటు సరిదిద్దుకునేందుకు ఫేస్బుక్ ప్రయత్నించకుండా మరిన్ని తప్పులు చేస్తోందని, అందుకే తాను బయటకు వచ్చినట్టు వెల్లడించారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. సెనేట్ ముందుకు ఇన్స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై ఎటువంటి దుష్పరిణామాలు కలిగిస్తుందో సవివరింగా తెలియజేస్తూ ఫ్రాన్సెస్ హౌగెన్ ‘ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్లైన్’ పేరుతో సమగ్ర నివేదికను రూపొందించారు. మంగళవారం ఆమె ఈ నివేదికను సెనెట్ సభ్యులకు అందించే అవకాశం ఉంది. ఇందులో వివరాలు కనుక పక్కా ఆధారాలతో ఉంటే ఫేస్బుక్ చిక్కుల్లో పడటం ఖాయం. లాభాలే ముఖ్యం టెలివిజన్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రాన్సెస్ మాట్లాడుతూ సమాజానికి మంచి చేయాలా ? లేక ఫేస్‌బుక్‌కి మంచి జరగాలా అనే విషయంలో అక్కడ సందిగ్ధం నెలకొందని, చివరకు ఫేస్బుక్ లాభాల వైపే మొగ్గు చూపడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా ఫేస్బుక్ వ్యవహార శైలి వివాస్పదమైంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయంటూ ట్విట్టర్ పేర్కొనగా ఆ పని ఫేస్బుక్ చేయలేదు. పైగా అలా చేయడాన్ని సమర్థించుకుంది కూడా. ఈ అంశంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఫేస్బుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. చదవండి: కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్ -
కరోనా వైరస్ ‘హీరో’ కన్నుమూత
బీజింగ్: చైనాలోని వుహాన్ పట్టణంలో కరోనా వైరస్ బట్టబయలు కావడానికి 15 రోజుల ముందే పొంచి ఉన్న ఆ వైరస్ గురించి బంధు, మిత్రులను, తెలిసిన వారిని అప్రమత్తం చేసిన లీ వెన్లియాంగ్ అనే 34 ఏళ్ల డాక్టర్ అదే వైరస్ బారిన పడి శుక్రవారం తెల్లవారుజామున ‘వుహాన్ సెంట్రల్ హాస్పిటల్’లో దురదష్టవశాత్తు మరణించారు. ఆయన మరణం పట్ల ఆస్పత్రి సిబ్బంది దిగ్భ్రాంతిని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ‘కరోనా వైరస్ బారిన పడిన ఎంతో మంది రోగులకు చికిత్స అందించిన డాక్టర్ లీ వెన్లియాంగ్ కూడా ఆ వైరస్ బారిన పడ్డారు. ఆయన్ని రక్షించేందుకు మేము చివరి నిమిషం వరకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఏడవ తేదీ తెల్లవారు జామున 2.58 నిమిషాలకు లీ వెన్లియాంగ్ ప్రాణం విడిచారు. బాధాతప్త హృదయాలతో మేము విచారాన్ని, నిజాయితీగా నివాళిని అర్పిస్తున్నాం’ అని ఆస్పత్రి సోషల్ మీడియా ‘వైబో’ వైద్యులు లిఖిత పూర్వకంగా తెలిపారు. (విషాద ఛాయల మధ్య ఆనందోత్సవాలు..) 1.40 కోట్ల మంది జనాభా కలిగిన వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్లో ‘సార్స్’ వైరస్ ఉందంటూ లీ వెన్లియాంగ్ డిసెంబర్ 30న సోషల్ మీడియా ద్వారా పరిచయస్థులందరిని హెచ్చరించారు. జనవరి 15న కరోనా వైరస్‌కు సంబంధించి తొలి వార్తలు వచ్చాయి. అది సీఫుడ్ మార్కెట్ నుంచి వ్యాపించినట్లు తెలుసుకొని జనవరి 20వ తేదీన దాన్ని అధికారులు మూసివేశారు. ఆప్తమాలజిస్ట్ అయిన లీ వెన్లియంగ్ హెచ్చరికలకు తీవ్రంగా పరిగణించి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉన్నట్లయితే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదు. ఆయన కరోనా వైరస్ అని చెప్పకుండా ‘సార్స్’ అని చెప్పారు. సార్స్ కూడా కరోనా వైరస్‌తో వచ్చేదే. కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 630 మంది మరణించగా, దాదాపు 30 వేల మందికి సోకింది. (భారతీయ శాస్త్రవేత్త కృషి..కరోనాకు వ్యాక్సిన్) చదవండి: కరోనా భయం; వీడియో కాల్లో ఆశీర్వాదాలు కరోనా వైరస్‌కు ‘వితిన్ డేస్’ కరోనా వైరస్ మృతుల సంఖ్య వేలల్లోనా! కరోనా విశ్వరూపం -
ఇన్ఫీ సీఈవోకు మరో విజిల్ ‘బ్లో’!
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌పై విజిల్ బ్లోయర్ల (ప్రజావేగుల) ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరిన్ని ఆరోపణలు గుప్పిస్తూ.. మరో ప్రజావేగు ఫిర్యాదు చేశారు. నియామక నిబంధనల ప్రకారం ప్రధాన కార్యాలయమైన బెంగళూరు నుంచి కార్యకలాపాలు సాగించాల్సి ఉండగా ఆయన ముంబైలోనే ఉంటున్నారని అందులో పేర్కొన్నారు. పరేఖ్ తరచూ ముంబై నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుండటం వల్ల కంపెనీకి రవాణా చార్జీలు, విమాన టికెట్ చార్జీల రూపంలో ఇప్పటికి రూ.22 లక్షల దాకా ఖర్చయిందని తెలిపారు. ఆయన బెంగళూరుకు మారని పక్షంలో ఖర్చులన్నింటినీ సీఈవో జీతం నుంచే రాబట్టాలని కోరారు. చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్లు, నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీని (ఎన్ఆర్సీ) సంబోధిస్తూ ప్రజావేగు ఈ ఫిర్యాదు పంపారు. ‘‘నేను ఇన్ఫీ ఫైనాన్షియల్ విభాగంలో ఉద్యోగిని. విషయ తీవ్రత దృష్ట్యా కక్ష సాధింపు చర్యలుంటాయనే భయంతో పేరు వెల్లడించలేకపోతున్నా. నేను కూడా సంస్థలో వాటాదారునే. సలీల్ పరేఖ్ తీరు వల్ల కంపెనీ ప్రతిష్ట, విలువలు దిగజారిపోతున్న సంగతిని యాజమాన్యం దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే ఉద్యోగులు, వాటా దారుల తరఫున నేను ఈ లేఖ రాస్తున్నా’’ అని ఆ ప్రజావేగు పేర్కొన్నారు. ఈ అంశంపై తగు చర్యలు తీసుకోవాలని.. సంస్థపై ఉద్యోగులు, షేర్హోల్డర్లు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడాలని అభ్యరి్థంచారు. ఆదాయాలు పెంచి చూపిస్తూ.. సలీల్ పరేఖ్‌తో పాటు సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఇప్పటికే వచి్చన ఫిర్యాదులతో ఇన్ఫీ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఇలాంటి సీఈవోను చూడలేదు.. ‘నియామకం సమయంలోనే బెంగళూరు కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుందని పరేఖ్‌కు కంపెనీ స్పష్టంగా చెప్పింది. ఆయన చేరి ఇప్పటికి ఏడాది దాటి ఎనిమిది నెలలవుతోంది. ఇప్పటికీ ఆయన ముంబైలోనే ఉంటున్నారు. నెలలో రెండు సార్లు బెంగళూరుకు వస్తూ, పోతూ ఉన్నారు. ప్రతి నెలా నాలుగు బిజినెస్ క్లాస్ టికెట్లు, రెండు చోట్ల విమానాశ్రయాలకు డ్రాపింగ్, పికప్ వంటి ఖర్చులుంటున్నాయి. ఇలా రూ. 22 లక్షల దాకా ఖర్చయ్యింది. ఈ ఖర్చులను ఆయన దగ్గర్నుంచే రాబట్టాలి. అసలు.. ఆయన బెంగళూరులోనే ఉండాలని కంపెనీ బోర్డు ఎందుకు గట్టిగా చెప్పడం లేదు‘ అని ప్రజావేగు తన ఫిర్యాదులో ప్రశ్నించారు. పైపెచ్చు బోర్డును, వ్యవస్థాపకులను తప్పుదోవ పట్టించేందుకు పరేఖ్.. బెంగళూరులో అపార్ట్మెంటును అద్దెకు తీసుకున్నట్లు చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఇంత అధ్వానంగా వ్యవహరించే సీఈవోను చూడలేదని వ్యాఖ్యానించారు. ఠంఛనుగా బోనస్ తీసుకుంటారు... ముంబైలోని పలు చిన్న కంపెనీల్లో సలీల్ పరేఖ్ సొంతంగా పెట్టుబడులు పెట్టారని, వాటిని చూసుకోవడం కోసమే అక్కడి నుంచి రావడం లేదని ప్రజావేగు ఆరోపించారు. గ్రీన్ కార్డును కాపాడుకోవడం కోసమే ఆయన ప్రతి నెలా అమెరికా వెడుతుంటారు తప్ప సదరు టూర్లలో ఎన్నడూ ఏ క్లయింటునూ కలవలేదని, ఇన్ఫీ కార్యాలయాలకు కూడా వెళ్లలేదనే ఆరోపణలూ ఉన్నాయని పేర్కొన్నారు. ఇక, సీఈవో హోదాను అడ్డం పెట్టుకుని నిధులిస్తానని చెబుతూ అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతుంటారని ప్రజావేగు వెల్లడించారు.తన సంతానానికి ఆయా వర్సిటీల్లో సీట్లు దక్కించుకోవడం కోసమే ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు.మిగతా ఉద్యోగులందరికీ ఈసారి జూలై, ఆగస్టుల్లో గానీ బోనస్‌లు అందలేదని.. సీఈవో మాత్రం ఠంఛ నుగా ఏప్రిల్‌లోనే తీసేసుకున్నారని చెప్పారు. వీటన్నింటిపైనా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఇన్ఫోసిస్ సీఈవోపై మరోసారి సంచలన ఆరోపణలు
సాక్షి, బెంగళూరు : టెక్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ వివాదం మరింత ముదురుతోంది. సెప్టెంబర్ 20 న బోర్డుకు 2 పేజీల లేఖలో అనైతిక పద్ధతులపై ఆరోపించిన స్వల్ప వ్యవధిలోనే మళ్లీ ఇలాంటి ఫిర్యాదు రావడం ఇది రెండోసారి. విజిల్ బ్లోయర్ ఈ ఆరోపణలు రేపిన సెగ ఇంకా చల్లారకముందే, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌పై మరో విజిల్ బ్లోయర్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు సలీల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇన్ఫీ చైర్మన్ నందన్ నీలేకనితోపాటు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఒక లేఖ రాశారు. సీఈవో పరేఖ్ కంపెనీలో చేరి ఒక సంవత్సరం 8 నెలలు అయినప్పటికీ, ముంబైలో కాకుండా బెంగళూరులో నివాసం ఉండాలన్న షరతును ఉల్లంఘించారని ఆరోపించారు. 11 బిలియన్ డాలర్ల కంపెనీ ఫైనాన్స్ విభాగ ఉద్యోగిని అని చెప్పుకున్న విజిల్‌బ్లోయర్, పరేఖ్ అక్రమాలను బహిర్గతం చేసినందుకు తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తన గుర్తింపును వెల్లడించలేకపోతున్నానంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగిగా, వాటాదారుగా, సంస్థ విలువ వ్యవస్థలను క్షీణింపజేస్తున్న పరేఖ్ గురించి కొన్ని వాస్తవాలను ఛైర్మన్, బోర్డు దృష్టికి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని చెప్పారు. తక్షణమే స్పందించి, సంస్థ భవిష్యత్తు కనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు. పరేఖ్‌కు రెండు నెలల గడువు ఇచ్చినప్పటికీ కేవలం తన వ్యాపార ప్రయోజనాలకోసమే బెంగళూరుకు మకాం మార్చకుండా, ముంబైలోనే ఉంటున్నారని ఆరోపించారు. సీఈవోకు స్టాక్ మార్కెట్ కనెక్షన్లు ఉన్నాయని, అనేక సంస్థలలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించిన ఫిర్యాదుదారుడు, పరేఖ్ తన పెట్టుబడుల పర్యవేక్షణ కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకున్న చాలామంది ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం ప్రారంభించారన్నారు. సీఈవో నెలకు రెండు సార్లు ఆఫీస్‌కు వచ్చేందుకు విమాన చార్జీలు, ఇతర రవాణా చార్జీలకే సంస్థ రూ. 22 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. నెలకు నాలుగు బిజినెస్ క్లాస్ విమాన టిక్కెట్లు, ఇంటికి నుంచి ముంబై, బెంగళూరు విమానాశ్రయాలకి, ఆఫీసు నుంచి విమానాశ్రయం వరకు పికప్, డ్రాప్ చార్జీలు ఇందులో ఉన్నాయని విజిల్ బ్లోయర్ ఆరోపించారు. అయితే తాజా ఆరోపణలపై, అటు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్, ఇటు ఇన్ఫోసిస్ ఇంకా స్పందించలేదు. -
దేవుడే చెప్పినా మా లెక్క తప్పదు!
న్యూఢిల్లీ: స్వయంగా దేవుడే వచ్చి చెప్పినా సరే తాము తప్పుడు లెక్కలు రాయబోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. టాప్ మేనేజ్మెంట్ అనైతిక విధానాలకు పాల్పడుతోందంటూ ప్రజావేగులు చేసిన ఆరోపణలు అవమానకరమైనవని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న విచారణపై తమ అభిప్రాయాలు రుద్దే ప్రసక్తి లేదని ఇన్వెస్టర్లతో సమావేశంలో నీలేకని చెప్పారు. మరోవైపు, ఫిర్యాదుల వెనుక సహ వ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస్థాపకుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలని వ్యాఖ్యానించారు. భారీ ఆదాయాలు చూపేందుకు సీఈవో సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నీలేకని వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ వదంతులు హేయమైనవి. అంతా ఎంతగానో గౌరవించే వ్యక్తుల ప్రతిష్టను మసకబార్చే లక్ష్యంతో చేస్తున్నవి. సంస్థకు జీవితాంతం సేవలు అందించిన మా సహ–వ్యవస్థాపకులంటే నాకెంతో గౌరవం. వారు కంపెనీ వృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేశారు. భవిష్యత్‌లోనూ కంపెనీ శ్రేయస్సు కోసం పాటుపడేందుకు కట్టుబడి ఉన్నారు‘ అని ఆయన తెలిపారు. టాప్ మేనేజ్మెంట్పై వచ్చిన ఆరోపణల మీద ఇప్పటికే స్వతంత్ర న్యాయ సేవల సంస్థ విచారణ జరుపుతోందని, ఫలితాలు వచ్చాక అందరికీ తెలియజేస్తామని నీలేకని పేర్కొన్నారు. వివరాలు కోరిన ఎన్ఎఫ్ఆర్ఏ.. ప్రజావేగుల ఫిర్యాదులకు సంబంధించి నిర్దిష్ట వివరాలివ్వాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ), కర్ణాటకలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కోరినట్లు ఇన్ఫీ తెలిపింది. ఎక్సే్ఛంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు కూడా మరింత సమాచారం అడిగినట్లు పేర్కొంది. అడిగిన వివరాలన్నింటిని సమర్పించనున్నట్లు ఇన్ఫీ వివరించింది. ప్రజావేగుల ఫిర్యాదులపై ఇన్ఫోసిస్ అంతర్గతంగా విచారణ జరుపుతోంది. అటు అమెరికన్ ఇన్వెస్టర్ల తరఫున అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా వేస్తామంటూ ఒక న్యాయ సేవల సంస్థ ప్రకటించింది. -
ఆ ఆరోపణలను తోసిపుచ్చిన ఇన్ఫోసిస్
బెంగళూర్ : కంపెనీ సహ వ్యవస్ధాపకులు, మాజీ ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలను దేశీ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తోసిపుచ్చింది. కంపెనీలో సహవ్యవస్ధాకులు, మాజీ ఉద్యోగులపై వచ్చిన విజిల్‌బ్లోయర్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇన్ఫోసిస్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత నెలలో కంపెనీ ఉద్యోగులు కొందరు రాసిన విజిల్‌బ్లోయర్ లేఖలో ఉటంకించిన ఆరోపణలకు తాము ఆధారాలు అందుకోలేదని తెలిపింది. లాభాలు తగ్గుముఖం పడితే షేర్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ తమతో పాటు మరికొందరిని భారీ ఒప్పందాలకు అనుమతులు ఇవ్వరాదని ఒత్తిడి చేశారని ఆ లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. -
‘అనైతిక’ ఆరోపణలకు ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: కంపెనీ టాప్ మేనేజ్మెంట్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతోందంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంకా ప్రాథమిక ఆధారాలేమీ లభించలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ‘ప్రస్తుతం ప్రాథమిక ఆధారాలేమీ లేవు. గుర్తు తెలియనివారు చేసిన ఆరోపణలపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సదరు ఆరోపణల విశ్వనీయత, నిజానిజాల గురించి కంపెనీ వ్యాఖ్యానించే పరిస్థితిలో లేదు‘ అని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీకి (ఎన్ఎస్ఈ) తెలియజేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కంపెనీని నియమించుకున్నామని, అలాగే అంతర్గతంగా స్వతంత్ర ఆడిటర్ ఎర్న్స్ట్ అండ్ యంగ్‌తో కూడా చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. ఆరోపణల్లో ప్రస్తావించిన నిర్దిష్ట ప్రక్రియలను సమీక్షించాల్సిందిగా స్వతంత్ర ఆడిటర్‌ను కోరినట్లు ఇన్ఫీ వివరించింది. భారీ ఆదాయాలు చూపించడం కోసం ఇన్ఫీ సీఈవో సలిల్ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతున్నారంటూ పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు కంపెనీ బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆధారాలు కూడా అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సత్వరం ఇన్ఫోసిస్ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. అటు అమెరికాలో కూడా సెక్యూరిటీస్ ఎక్సే్ఛంజీ (ఎస్ఈసీ) దీనిపై విచారణ జరుపుతోంది. ఈ ఆరోపణల గురించి ముందుగానే ఎందుకు వెల్లడించలేదన్న దానిపై ఎన్ఎస్ఈ వివరణ కోరిన మీదట.. ఇన్ఫోసిస్ తాజా అంశాలు తెలియజేసింది. సోమవారం ఇన్ఫోసిస్ షేరు 3 శాతం పెరిగి రూ. 709 వద్ద క్లోజయ్యింది. -
ఇన్ఫీపై సెబీ విచారణ
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపించడంపైనా, సీఈవో.. సీఎఫ్‌వోలపై వచ్చిన ఆరోపణలమీద స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. కంపెనీ షేరు ధరను ప్రభావితం చేసే కీలక సమాచారాన్ని ముందుగానే తెలియజేయకపోవడంపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అలాగే, కంపెనీ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదైనా జరిగిందా అన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దిశగా ఇన్ఫోసిస్ షేర్లలో ట్రేడింగ్ డేటాతో పాటు డెరివేటివ్ పొజిషన్ల గురించిన వివరాలు ఇవ్వాలని స్టాక్ ఎక్సే్చంజీలకు సెబీ సూచించినట్లు వివరించాయి. ఈ వివాదంపై ఇన్ఫీ టాప్ మేనేజ్మెంట్తో పాటు ఇతరత్రా కీలక వ్యక్తులను కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇన్వెస్టిగేషన్ పురోగతిని బట్టి ఆడిటింగ్ సహా ఇతరత్రా ఆర్థిక వ్యవహారాలు చూసే బోర్డు కమిటీల నుంచి కూడా సెబీ వివరాలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వతంత్ర డైరెక్టర్లపైనా దృష్టి..: ఈ వ్యవహారంలో ఇన్ఫీ స్వతంత్ర డైరెక్టర్ల తీరుపైనా సెబీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రజావేగు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఇన్ఫీ యాజమాన్యం.. స్టాక్ ఎక్సే్చంజీలకు, సెబీకి సత్వరం తెలియజేసేలా, తక్షణ చర్యలు తీసుకునేలా చూడటంలో స్వతంత్ర డైరెక్టర్లు ఏ విధంగా వ్యవహరించారన్నది తెలుసుకోనుంది. మరోవైపు, ప్రజావేగు ఫిర్యాదు గురించి సత్వరం ఎందుకు తెలియజేయలేదో వివరణనివ్వాలంటూ ఇన్ఫోసిస్‌కు బుధవారం బోంబే స్టాక్ ఎక్సే్చంజీ (బీఎస్ఈ) సూచించింది. కంపెనీ లాభాలు పెంచి చూపించేందుకు సీఈవో సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్‌లు అనైతిక విధానాలను అవలంబించారంటూ ’నైతిక ఉద్యోగుల బృందం’ పేరిట కొందరు ఉద్యోగుల నుంచి ఇన్ఫోసిస్ బోర్డుకు ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. అటు అమెరికాలోని ఆఫీస్ ఆఫ్ ది విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాంకు కూడా ప్రజావేగుల నుంచి ఫిర్యాదు వెళ్లింది. సోమవారం బైటికొచ్చిన ఈ వార్తలతో ఇన్ఫీ షేరు మంగళవారం భారీగా పతనమైంది. అటు అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా వేయనున్నట్లు రోజెన్ లా ఫర్మ్ అనే న్యాయసేవల సంస్థ ప్రకటించింది. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు సంస్థ చైర్మన్ నందన్ నీలేకని వెల్లడించారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం ఇన్ఫోసిస్ షేరు సుమారు ఒక్క శాతం లాభపడింది. బీఎస్ఈలో రూ. 650.75 వద్ద ముగిసింది. అయితే ట్రేడింగ్ మొదలయ్యాక ఒకానొకదశలో 4.5% మేర దిగజారి రూ.615 కనిష్ట స్థాయిని కూడా తాకింది. -
ఇన్ఫీలో మరో దుమారం!
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి ‘అనైతిక విధానాల’ ఆరోపణల్లో చిక్కుకుంది. సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలు పాటిస్తున్నట్లు పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు ఇన్ఫీ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ‘ఇటీవలి కొన్ని త్రైమాసికాలుగా సీఈవో పాటిస్తున్న అనైతిక విధానాలను మీ దృష్టికి తేగోరుచున్నాము. స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలు పెంచి చూపేందుకు ప్రస్తుత త్రైమాసికంలో కూడా అలాంటి విధానాలే పాటిస్తున్నారు. బోర్డు తక్షణమే విచారణ జరిపి, చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం‘ అంటూ సెప్టెంబర్ 20న డైరెక్టర్స్ బోర్డుకు వారు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఈ–మెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్ కూడా తమ దగ్గర ఉన్నట్లు తెలిపారు. అందులో తమను తాము ’నైతికత గల ఉద్యోగులుగా’ ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. మరోవైపు, ప్రజావేగుల ఫిర్యాదును కంపెనీ పాలసీ ప్రకారం ఆడిట్ కమిటీ ముందు ఉంచినట్లు ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలోనూ ఫిర్యాదు.. గడిచిన రెండు త్రైమా సికాలుగా ఇన్ఫీ ఖాతాలు, ఆర్థిక ఫలితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అమెరికాలోని ‘విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం’కు కూడా ప్రజావేగులు ఫిర్యాదు చేశారు. లాభాలను పెంచి చూపడం కోసం వీసా ఖర్చుల్లాంటి వ్యయాలను పూర్తిగా చూపించొద్దంటూ తమకు ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ‘ఈ సంభాషణకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. ఆడిటరు వ్యతిరేకించడంతో దీన్ని వాయిదా వేశారు‘ అని తెలిపారు. ఈ క్వార్టర్లోనూ లాభాలు తగ్గిపోయి, స్టాక్ ధరపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ఓ కాంట్రాక్టుకు సంబంధించి 50 మిలియన్ డాలర్ల చెల్లింపులను ఖాతాల్లో చూపొద్దంటూ చాలా ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారులు తెలిపారు. కీలకమైన సమాచారాన్ని ఆడిటర్లు, బోర్డుకు తెలియకుండా తొక్కిపెట్టి ఉంచడం జరుగుతోందని తెలిపారు. సీఈవోనే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.. ‘భారీ డీల్స్ కుదుర్చుకోవడంలో బోలెడు అవకతవకలు జరుగుతున్నాయి. సీఈవో అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. భారీ మార్జిన్లు వస్తున్నాయని తప్పుదోవ పట్టించేలా నివేదికలు తయారు చేయాలంటూ సేల్స్ టీమ్‌ను ఆదేశిస్తున్నారు. సీఎఫ్‌వో కూడా ఆయన చెప్పినట్లే చేస్తున్నారు. భారీ డీల్స్‌లో లొసుగులు బోర్డు సమావేశాల్లో ప్రస్తావనకు తేనివ్వకుండా మమ్మల్ని ఆపేస్తున్నారు. బోర్డు సభ్యులకివేవీ పట్టవని.. షేరు ధర బాగుంటే వాళ్లకు సరిపోతుందని సీఈవో మాతో చెప్పారు‘ అని ఫిర్యాదుదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని త్రైమాసికాలుగా కుదుర్చుకున్న బిలియన్ల డాలర్ల డీల్స్‌లో పైసా మార్జిన్ లేదని పేర్కొన్నారు. చాలా మటుకు స మాచారాన్ని ఆడిటర్లకు చెప్పకుండా దాచిపెట్టేస్తు న్నారని, కేవలం లాభాలు, సానుకూల అంశాలే ఆర్థిక ఫలితాల్లో చూపాలని సీఈవో, సీఎఫ్‌వో ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించా రు. దీన్ని వ్యతిరేకించే ఉద్యోగులను పక్కన పెడుతున్నారని, ఫలితంగా వారిలో చాలా మంది సం స్థ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో కూడా ఇన్ఫీ.. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెలీ టెక్నాలజీ సంస్థ పనయా కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ ప్రజావేగుల ఆరోపణలు వచ్చిన దరిమిలా అప్పటి సీఈవో విశాల్ సిక్కా, ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితర వ్యవస్థాపకుల మధ్య వివాదం తలెత్తింది. చివరికి 2017 ఆగస్టులో సిక్కా వైదొలిగారు. ఆయన స్థానంలో గతేడాది జనవరిలో పగ్గాలు చేపట్టిన సలిల్ పరేఖ్ కూడా తాజాగా గవర్నెన్స్ లోపాల ఆరోపణల్లో చిక్కుకోవడం గమనార్హం. ఇన్ఫీ ఏడీఆర్ క్రాష్... తాజా పరిణామాలతో అమెరికా నాస్డాక్లో లిస్టయిన ఇన్ఫోసిస్ ఏడీఆర్ (అమెరికన్ డిపాజిటరీ రిసీట్) సోమవారం కుప్పకూలింది. ఒక దశలో ఏకంగా 16 శాతం క్షీణించింది. -
మరో వివాదంలో ఇన్ఫోసిస్
సాక్షి,ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. కంపెనీ రాబడి, లాభాలని అధికంగా చూపేందుకు ఉన్నతాధికారులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నిలంజన్ రాయ్‌పై కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా క్వార్టర్స్ నుంచి తక్కువసమయంలో ఆదాయం, లాభాల కోసం కంపెనీ అనైతిక విధానాలను ఆచరిస్తుందని ఆరోపించారు. 'ఎథికల్ ఎంప్లాయిస్' పేరుతో ఏర్పడిన సంస్థలోని ఉద్యోగుల బృదం ఈ మేరకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డుకు, అలాగే అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసి) కి ఫిర్యాదు చేసింది. ఆడిటర్లను ఆయా డీల్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించాలని, మార్జిన్లు, అప్రకటిత ముందస్తు కమిట్మెంట్లు, రాబడికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలనీ కోరింది. ఈ ఫిర్యాదును కంపెనీ విధానం ప్రకారం ఆడిట్ కమిటీ ముందు ఉంచామనీ, విజిల్‌బ్లోయర్స్ పాలసీకి అనుగుణంగా దీనిపై విచారణ ఉంటుందని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్వార్టర్(త్రైమాసికం)లో ఎఫ్డిఆర్ కాంట్రాక్టులో 50 మిలియన్ డాలర్ల ముందస్తు చెల్లింపు రివర్సల్‌లను గుర్తించవద్దని చాలా ఒత్తిడి తెచ్చారని, ఇది అకౌంటింగ్ ప్రాక్టీస్‌కు విరుద్ధమని, ఇది త్రైమాసికంలో లాభాలను తగ్గిస్తుందని, స్టాక్ ధరకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇన్ఫోసిస్ సీఈవో,సీఎఫ్‌వో ఒత్తిడి చేస్తున్నారని సెప్టెంబర్-20,2019న బోర్డుకి రాసిన లేఖలో వారు ఆరోపించారు. తమ ఆరోపణలకు సంబంధించిన ఈమెయిల్స్, వాయిస్ రికార్డింగ్‌లు ఉన్నాయని ఫిర్యాదు దారులు వాదిస్తుండటం విశేషం. వెరిజోన్, ఇంటెల్,ఏబిన్ అమ్రో వంటి పెద్ద కాంట్రాక్టులలో ఆదాయ గుర్తింపు విషయాలు అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం లేవని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, విచారణ అధికారులు తమను అడిగినప్పుడు వీటిని సమర్పిస్తామని విజిల్ బ్లోయర్స్ తెలిపారు. ఆడిటర్స్ కి పెద్ద డీల్ సమాచారం తెలియజేయవద్దని తమను అడిగినట్లు కూడా వారు ఆ లేఖలో తెలిపారు. కాగా 2017లో ఇన్ఫోసిస్ ఫౌండర్లు, అప్పటి బోర్డు మధ్య విభేదాలతో సంక్షోభం ఏర్పడింది. మాజీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్‌కు చెల్లించిన ప్యాకేజీ వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే అప్పటి సీఈవో విశాల్ సిక్కా పదవినుంచి వైదొలిగారు. ఆ తరువాత ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది జనవరిలో సలీల్ పరేఖ్ సీఈవోగా ఎంపికయ్యారు. ఇంతకుముందు, ఇజ్రాయెల్ ఆటోమేషన్ టెక్నాలజీ సంస్థ పనయాను కొనుగోలుపై ఆరోపణలతో కూడిన నివేదికను ఇన్ఫోసిస్ తన అంతర్గత ఆడిట్ కమిటీ, దర్యాప్తు తరువాత, ఆరోపణలకు ఆధారాలు లేవని తోసి పుచ్చింది. అంతేకాదు ఈ ఏడాది ఆరంభంలో బన్సాల్‌కు చెల్లించిన చెల్లింపులకు సంబంధించి బహిర్గతం చేసిన లోపాల కేసును ఇన్ఫోసిస్ సెబీతో పరిష్కరించుకుంది. ఇందుకు మార్కెట్ రెగ్యులేటర్‌కు రూ .34.34 లక్షలు చెల్లించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్‌పై ఫిర్యాదు.. తొక్కిపెట్టిన వైట్‌హౌజ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనేందుకు ఆధారాలున్నాయని ఒక రహస్య విజిల్ బ్లోయర్ చేసిన ఫిర్యాదు వెల్లడించింది. వచ్చే సంవత్సరం జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరో దేశం జోక్యాన్ని ట్రంప్ కోరారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తొక్కిపట్టేందుకు వైట్‌హౌజ్ ప్రయత్నించిందని గురువారం వెలుగులోకి వచ్చిన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున తన ప్రత్యర్థి కానున్న జో బిడెన్, ఆయన కుమారుడు హంటర్ బిడెన్ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వలొదిమిర్ జెలెన్స్కీపై డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకు వచ్చిన వివరాలను ఆ ఫిర్యాదులో పొందుపర్చారు. రౌల్ కాస్ట్రోపై అమెరికా ఆంక్షలు క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో, ఆయన కుటుంబసభ్యుల విదేశీ ప్రయాణాలపై అమెరికా ఆంక్షలు విధించింది. అధ్యక్ష పదవి నుంచి వైదొలగినప్పటికీ అధికార కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి హోదాలో రౌల్ కాస్ట్రో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఏకపక్షంగా వేలాది మందిని నిర్బంధిస్తున్నారని, ప్రస్తుతం 100 మంది క్యూబన్లు రాజకీయ ఖైదీలుగా ఉన్నారని విమర్శించింది. దివంగత విప్లవ నేత సోదరుడైన రౌల్ కాస్ట్రో(88) ఆంక్షల కారణంగా అమెరికా వెళ్లడం వీలుకాదు. (చదవండి: ట్రంప్‌పై మళ్లీ అభిశంసన) -
కుట్ర జరుగుతోంది.. జోక్యం చేసుకోండి
న్యూఢిల్లీ: కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు తమ కంపెనీకి, కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించే, విద్వేషపూరిత విధానాలకు పాల్పడుతున్నారంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్స్ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై జోక్యం చేసుకోవాలని సెబీని చైర్మన్ అజయ్ త్యాగిని కోరుతూ సన్ ఫార్మా ఒక లేఖ రాసింది. నిరాధారమైన ఫిర్యాదులు, ఆరోపణల కారణంగా వాటాదారుల విలువ భారీగా హరించుకుపోయిందని ఈ లేఖలో కంపెనీ పేర్కొంది. ఈ కుట్రలో కొన్ని మీడియా సంస్థల, వ్యక్తుల పాత్ర ఉందని ఈ విషయమై పూర్తిగా విచారణ జరపాలని కోరింది. సన్ ఫార్మాకు వ్యతిరేకంగా సెబీకి రెండో ప్రజావేగు ఫిర్యాదు అందిందన్న వార్తల నేపథ్యంలో సన్ ఫార్మా షేర్ భారీగా నష్టపోయింది. కంపెనీకి వ్యతిరేకంగా సెబీకి అందిన రెండో ఫిర్యాదు ఇది. తాజా వార్తలతో శుక్రవారం ఈ కంపెనీ షేర్ 8% క్షీణించి రూ.390 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8,735 కోట్లు ఆవిరైంది. -
'ఒక్క మెసెజ్‌తో స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్'
లండన్: అమెరికా మాజీ నిఘా కాంట్రాక్టర్, విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడన్ బ్రిటన్ గూఢచారులకు సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టారు. బ్రిటన్ వేగులు ఒక చిన్న టెక్ట్స్ మెసెజ్తోనే ప్రజలకు తెలియకుండానే వారి ఫోన్లను హ్యాక్ చేయగలరని, వారి ప్రమేయం లేకుండానే స్మార్ట్ ఫోన్ల నుంచి ఫొటోలు తీయడం, ఆడియో రికార్డింగ్ చేయగలరని స్నోడన్ వెల్లడించారు. "మీ ఫోన్‌కు వారే యజమానులు కావాలనుకుంటున్నారు' అని ఆయన చెప్పారు. బీబీసీ పానోరమ ప్రొగ్రామ్‌కు ఇంటర్వ్యూ ఇచిన ఆయన బ్రిటన్‌కు చెందిన ప్రభుత్వ సమాచార ప్రధాన కార్యాలయ ఏజెన్సీ (జీసీహెచ్‌క్యూ)ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 'స్మర్ఫ్ సూట్' పేరిట పలురకాలు నిఘా సాధనాలను జీసీహెచ్‌క్యూ ఉపయోగిస్తున్నదని, స్మార్ట్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉన్నా.. "నోసే స్మర్ఫ్' అనే టూల్ ద్వారా ఆ ఫోన్లోని మైక్రోఫోన్‌ను స్విచ్చాన్ చేయవచ్చునని తెలిపారు. 'ట్రాకర్ స్మర్ఫ్', 'డ్రీమీ స్మర్ఫ్' అని జీసీహెచ్‌క్యూ ముద్దుపేర్లు పెట్టుకున్న ప్రొగ్రామ్స్ ద్వారా దూరం నుంచే ఫోన్లను స్విచ్చాన్, స్విచ్చాఫ్ చేయవచ్చునని చెప్పారు.