'ఒక్క మెసెజ్తో స్మార్ట్ఫోన్ హ్యాకింగ్'
లండన్: అమెరికా మాజీ నిఘా కాంట్రాక్టర్, విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడన్ బ్రిటన్ గూఢచారులకు సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టారు. బ్రిటన్ వేగులు ఒక చిన్న టెక్ట్స్ మెసెజ్తోనే ప్రజలకు తెలియకుండానే వారి ఫోన్లను హ్యాక్ చేయగలరని, వారి ప్రమేయం లేకుండానే స్మార్ట్ ఫోన్ల నుంచి ఫొటోలు తీయడం, ఆడియో రికార్డింగ్ చేయగలరని స్నోడన్ వెల్లడించారు. "మీ ఫోన్కు వారే యజమానులు కావాలనుకుంటున్నారు' అని ఆయన చెప్పారు. బీబీసీ పానోరమ ప్రొగ్రామ్కు ఇంటర్వ్యూ ఇచిన ఆయన బ్రిటన్కు చెందిన ప్రభుత్వ సమాచార ప్రధాన కార్యాలయ ఏజెన్సీ (జీసీహెచ్క్యూ)ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 'స్మర్ఫ్ సూట్' పేరిట పలురకాలు నిఘా సాధనాలను జీసీహెచ్క్యూ ఉపయోగిస్తున్నదని, స్మార్ట్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉన్నా.. "నోసే స్మర్ఫ్' అనే టూల్ ద్వారా ఆ ఫోన్లోని మైక్రోఫోన్ను స్విచ్చాన్ చేయవచ్చునని తెలిపారు. 'ట్రాకర్ స్మర్ఫ్', 'డ్రీమీ స్మర్ఫ్' అని జీసీహెచ్క్యూ ముద్దుపేర్లు పెట్టుకున్న ప్రొగ్రామ్స్ ద్వారా దూరం నుంచే ఫోన్లను స్విచ్చాన్, స్విచ్చాఫ్ చేయవచ్చునని చెప్పారు.