
ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ఈవీలతో సుధీర్ఘ ప్రయాణాలు చేసే వాహనదారులకు ఛార్జింగ్ పెట్టుకునే సమయం ఎక్కువ పట్టడం, ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడు ఈ సమస్యల్ని అధిగమించేందుకు పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ పరిశోధనల్లో సత్ఫలితాలు నమోదవుతున్నాయని సైంటిస్ట్‌లు చెబుతున్నారు.
ఇడాహో నేషనల్ లాబొరేటరీ (Idaho National Laboratory) సంస్థ ఛార్జింగ్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించేలా కొత్త పద్దతుల్ని సృష్టించినట్లు తెలిపింది. ఈ పద్దతులతో వాహనదారులు సెల్ ఫోన్ ఛార్జింగ్ కంటే వేగంగా..కేవలం 10 నిమిషాల్లో ఈవీ వెహికల్స్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని ఇడాహో సైంటిస్ట్ ఎరిక్ డుఫెక్ స్పష్టం చేశారు.
ఫాస్ట్‌గా ఛార్జింగ్
ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు పెట్టే ఛార్జింగ్ అన్నీ వాహనాలకు ఒకేలా ఉండదు. వాహనాన్ని బట్టి మారుతుంటుంది. కొన్ని ఈవీ బ్యాటరీలకు మొత్తం ఛార్జింగ్ పెట్టాలంటే సుమారు 40 నుంచి 50 గంటల సమయం పడుతుంది. మరికొన్నింటికి 20 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పెట్టొచ్చు. ఉదాహరణకు ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో అగ్ర గామిగా ఉన్న టెస్లా సంస్థ 320 కిలోమీటర్ల ప్రయాణించే కార్లకు కేవలం 15 నిమిషాల్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
ఇదే కొత్త టెక్నిక్
ఎలక్ట్రిక్ బ్యాటరీలను ఛార్జింగ్ పెట్టే సమయంలో అనేక లోపాలు తలెత్తుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే దీర్ఘకాలంలో బ్యాటరీకి హాని కరం. ఒక్కోసారి ఆ బ్యాటరీలో అగ్నికి ఆహుతైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
అందుకే బ్యాటరీ లైఫ్ టైమ్ అంచనా వేస్తే ఫాస్ట్ చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందుకోసం డుఫెక్ బృందం మెషిన్ లెర్నింగ్ సాయంతో బ్యాటరీ లైఫ్ టైంను పరిశీలించింది. ఈ అల్గోరిథంలో 20,000 నుండి 30,000 డేటా పాయింట్లను అంచనా వేసింది. ఈ డేటా పాయింట్ల సాయంతో బ్యాటరీ మన‍్నికను గుర్తించి 10నిమిషాల్లో 90శాతం ఛార్జింగ్ పెట్టింది. ప్రస్తుతం 10నిమిషాల కంటే తక్కువ సమయంలో ఈవీలకు ఛార్జింగ్ పెట్టే పద్దతిపై తమ ప్రయోగాల్ని ముమ్మురం చేసినట్లు అమెరికాకు చెందిన ఇడాహో నేషనల్ లాబొరేటరీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment