'వ్యాపం' విజిల్బ్లోయర్పై బదిలీ వేటు
భోపాల్: వ్యాపం కుంభకోణాన్ని బట్టబయలు చేసిన విజిల్ బ్లోయర్, ప్రభుత్వ వైద్యుడు ఆనంద్ రాయ్ పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇండోర్లో పనిచేస్తున్న ఆయనను ధార్ జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ వైద్యురాలే అయిన రాయ్ భార్యను కూడా ప్రభుత్వం గత నెలలో బదిలీ చేసింది. అయితే కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చినందుకే తనపై, తన కుటుంబంపై ప్రభుత్వం, బీజేపీ పెద్దలు కక్ష పెంచుకున్నారని రాయ్ ఆరోపిస్తున్నారు.
వ్యాపం కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత విక్రం వర్మ పాత్రపై ఈ నెల 17న రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బదిలీ నిలుపుదల చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆనంద్ రాయ్ మీడియాకు చెప్పారు. మరో విజిల్ బ్లోయర్ ఆశిష్ చతుర్వేది సోమవారం మీడియాతో మాట్లాడుతూ తప్పుడు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వం నడుస్తున్నదని, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడేదిలేదని, వ్యాపం నిందితులకు శిక్షపడేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.