vyapam scam
-
చౌకీదార్లను అవమానించారు
విదిశ: అవినీతిని కాచుకునే చౌకీదార్(కాపలాదారుడు)ని అని చెప్పుకునే ప్రధాని మోదీ దేశంలోని కాపలాదారులు అందరినీ అవమాని ంచారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మండిపడ్డారు. ఇప్పుడెక్కడా ‘చౌకీదార్’ అనే మాట వినిపించినా, ప్రజలు వెంటనే ‘అతను దొంగ’ అని అంటున్నారన్నారు. మధ్యప్రదేశ్‌లోని విదిశలో శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సభల్లో రాహుల్ మాట్లాడారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యాపమ్ స్కామ్‌లో రాష్ట్ర సీఎం కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ‘ఇప్పుడెక్కడ చౌకీదార్ అనే పదం వినిపించినా, ప్రజలు వెంటనే దొంగ అని బదులిస్తున్నారు. దేశంలోని వాచ్మెన్లందరికీ నేను క్షమాపణ చెబుతున్నా. తప్పు మీది కాదు. మీరు దొంగలు కారు..మీరెంతో నిజాయతీపరులు. కానీ మోదీ మీకు చెడ్డపేరు తెచ్చారు’ అని అన్నారు. 2014లో అధికారంలోకి రావడానికి ముందు అవినీతి నిర్మూలన, నిరుద్యోగం, రైతుల సంక్షేమం గురించి ఊదరగొట్టిన మోదీ..ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని మండిపడ్డారు. వ్యాపమ్, ఈ–టెండరింగ్, మైనింగ్, మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు సీఎం మిన్నకుండిపోయారని, ఈసారి పరువు నష్టం గురించి ఎందుకు నోరు మెదపలేదని సీఎంను, ఆయన కొడుకును రాహుల్ ప్రశ్నించారు. -
డాన్సింగ్ వీడియో : సీఎంకు చేదు అనుభవం
భోపాల్ : గత రెండురోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ.. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా ఆకర్షించిన డాన్సింగ్ అంకుల్ ఎవరో తెలిసిపోయింది. అయన పేరు సంజీవ్ శ్రీవాస్తవ. గోవిందా వీరాభిమాని అయిన సంజీవ్ మధ్యప్రదేశ్‌లోని విదిశకు చెందినవారు. మధ్యప్రదేశ్‌లోని బాబా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సంజీవ్‌కు.. వాళ్ల అమ్మ నుంచి ఈ నృత్యకళ అబ్బిందని తెలిపారు. ‘నా డాన్సింగ్ వీడియో ఇంతలా వైరల్ అవుతుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. నన్ను సపోర్టు చేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు అంటూ’ సంజీవ్ వ్యాఖ్యానించారు. అయితే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఈ డాన్సింగ్ అంకుల్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంజీవ్‌ను పొగడుతూ చేసిన ట్వీట్ ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ‘మా విదిశలోని భోపాల్‌లో పనిచేసే ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవ డాన్స్ భారత్ మొత్తానికి వినోదం పంచుతోంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సరే.. మధ్యప్రదేశ్ నీళ్లలోనే ఏదో మహత్తు, ప్రత్యేకత ఉన్నాయి’అంటూ శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు స్పందనగా.. ‘ మధ్యప్రదేశ్ నీళ్లల్లో ప్రత్యేకత ఉన్నప్పటికీ పాపం ఎందుకనో అన్నదాతల కష్టాలు తీరడం లేదు. మరి వారి కష్టాలకు కారణం ఎవరో అంటూ’ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘ మధ్యప్రదేశ్‌లో అందరూ, అన్నీ ప్రత్యేకమైనవే.. ఒక్క మీరు తప్ప.. మీ శ్రద్ధ కాస్త రైతుల మీదకి కూడా మళ్లిస్తే మంచిది’ అంటూ మరొకరు వ్యంగంగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా రైతుల పట్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, వ్యాపమ్ కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. हमारे विदिशा के भोपाल में कार्यरत प्रोफ़ेसर श्री संजीव श्रीवास्तव जी की ज़िंदादिली ने पूरे भारत में इंटरनेट पर तहलका मचा दिया है। मानो या ना मानो मध्यप्रदेश के पानी में कुछ तो ख़ास बात है... pic.twitter.com/8qM15uZVXF — ShivrajSingh Chouhan (@ChouhanShivraj) June 1, 2018 -
వ్యాపం స్కామ్... ఉచ్చు బిగుస్తోందా?
భోపాల్ : సంచలనం సృష్టించిన వ్యాపం నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. నిందితుల బెయిల్ పిటిషన్లను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు గురువారం మధ్యాహ్నాం 3గం. నుంచి శుక్రవారం వేకువ ఝామున (2గం.41ని.) దాకా కొనసాగాయి. మధ్యప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి ఇలా జరగటం విశేషం. ఈ సందర్భంగా దాఖలైన 30 ఇంటీరియమ్ బెయిల్ దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. చిరయూ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ అజయ్ గోయెంకతోపాటు డీకే సప్తపతి, డాక్టర్ రవి సక్సేనా, ఎస్ ఎన్ సక్సేనా, డాక్టర్ వినాయక్ భవసర్, డాక్టర్ అశోక్ జైన్ తదితరుల అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. వీరితోపాటు పీపుల్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ విజయ్వార్గియా, డైరెక్టర్ అశోక్ నంగ్నాథ్, వైస్ ఛాన్స్లర్ విజయ్ కుమార్ల పిటిషన్లను కూడా తిరస్కరించింది. అంతకు ముందు వాదనలకు హాజరుకానీవారికి న్యాయస్థానం అరెస్ట్ వారెంట్లు జారీ చేయగా, ఒక లక్ష రూపాయల పూచీకత్తు మీద 15 మంది నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. మొత్తం 592 మందిలో నలుగురు వ్యాపమ్ అధికారులు, ముగ్గురు దళారులు, 22 మధ్యవర్తిత్వం వహించనవారు, 334 విద్యార్థులు, 155 మంది విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయని సీబీఐ తరపు న్యాయవాది సతీశ్ దినకర్ తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు(ఎమ్పీపీఈబీ) నిర్వహించే పరీక్షలో అక్రమాలకు పాల్పడటంతో వ్యాపం స్కామ్ వెలుగులోకి వచ్చింది. 1995 నుంచి ప్రవేశ పరీక్షల్లో అక్రమాల ద్వారా దాదాపు రూ.2 వేల కోట్ల రూపాయలు అధికారులకు చేరాయి. చిరయూ, పీపుల్స్, ఎల్ ఎన్ మెడికల్ కాలేజీలతోపాటు మరో మెడికల్ కాలేజీ యాజమాన్యాల పాత్రలపై ప్రధాన ఆరోపణలు వినిపించగా.. ఆయా కాలేజీ ఛైర్మన్లకు అరెస్ట్ కూడా చేశారు. గడిచిన పదేళ్లుగా ఈ కేసులో ఏదో ఒక కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. ఇందులో కీలక నేతల పేర్లు తెర మీదకు రావటం.. కేసులో నిందితులు ఆత్మహత్య చేసుకోవడమో లేదా విద్యార్థులకు సాయం చేసిన వ్యక్తులు హత్యకు గురికావడం వంటివి ఇప్పటికీ వ్యాపం స్కామ్ ఓ పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. -
సీఎం పేరు లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వ్యాపమ్ పరీక్షల కుంభకోణంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఈ కేసులో సీబీఐ మంగళవారం అభియోగపత్రం దాఖలు చేసింది. కుంభకోణానికి సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు, కంప్యూటర్ ఫైళ్లలో సీఎం పేరును లేదా ఏకంగా ఆ ఫైళ్లనే తొలగించారన్న ఆరోపణలను సీబీఐ కొట్టిపారేసింది. అభియోగపత్రాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సీబీఐ సమర్పించింది. పైళ్లను అన్నింటినీ ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో పరీక్షించామనీ, వాటిపై ఇంతకు ముందెప్పుడూ సీఎం అన్న పదం ఉన్నట్లు కనిపించలేదని సీబీఐ అధికారులు తెలిపారు. మొత్తం 490 మందిని సీబీఐ ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. వారిలో ముగ్గురు వ్యాపమ్ అధికారులు ఉన్నారు. ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్(వ్యాపమ్) హిందీలో నిర్వహించిన ప్రీ మెడికల్ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇండోర్‌కు చెందిన ప్రజా వేగు డాక్టర్ ఆనంద్ రాయ్, గ్వాలియర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆశిశ్ చతుర్వేది వెల్లడించడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఈ స్కాంలో గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువులు, ఇద్దరు ఆరెస్సెస్ నేతలు, డజన్ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలువచ్చాయి. హైకోర్టు ఆదేశాలతో సిట్, ఎస్టీఎఫ్ 2013లో దర్యాప్తు చేపట్టాయి. ఇప్పటిదాకా ఈ స్కాంకు సంబంధించి దాదాపు 2 వేల మందిని అరెస్టు చేశారు. అయితే కేసు నిందితుల్లో ఒకరైన గవర్నర్ కుమారుడు శైలేశ్ యాదవ్‌తో సహా కేసుకు సంబంధం ఉన్న 46 మంది అసహజ, అనుమానాస్పద రీతిలో మరణించారు. దీంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. -
వ్యాపమ్ స్కాంపై సీబీఐ ఛార్జిషీట్
భోపాల్ : అంతు చిక్కని మరణాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపం (యవసాయిక్ పరీక్షా మండల్) కుంభకోణం కేసులో సీబీఐ మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీటుల్ 490మంది పేర్లను సీబీఐ చేర్చింది. కాగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. సీజ్ చేసిన హార్డ్‌డిస్క్‌ను ట్యాంపర్ చేసినట్లు దిగ్విజయ్ చేసిన ఆరోపణలపై ఎలాంటి ఎవిడెన్స్ లేదని పేర్కొంది. కాగా మధ్యప్రదేశ్ మెడికల్ కాలేజీలతోపాటు వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్న అంశం ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. స్కాంతో ప్రమేయం ఉన్న పలువురు అనుమానాస్పదంగా మృతిచెందడంతో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో స్కాం విచారణ బాధ్యతలను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు, పోలీసు, రెవెన్యూ, తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన కేసులన్నింటి నుంచీ సిట్, ఎస్టీఎఫ్లను సుప్రీంకోర్టు తప్పించింది. ఈ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ... స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అలాగే వ్యాపం కుంభకోణం దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనూహ్య తీర్పునిచ్చింది. 2008 నుంచి 2012 మధ్య ఎంబీబీఎస్‌లో చేరినవారి అడ్మిషన్లు చెల్లుబాటుకావంటూ సంచలన తీర్పును వెల్లడించింది. దీంతో దాదాపు 600 మంది విద్యార్థులపై ఈ తీర్పు ప్రభావం పడింది. అదే సమయంలో విద్యార్థులు వేసిన పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇక కొత్తగా పునర్విచారణ పిటిషన్లకు దాదాపు అవకాశం లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
నేతల పాపానికి విద్యార్థులకు శిక్షా?
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని వ్యాపం కుంభకోణంలో దాదాపు వెయ్యి మంది విద్యార్థుల మెడికల్ డిగ్రీలను సుప్రీం కోర్టు సోమవారం నాడు రద్దు చేయడం పట్ల బాధితులతో పాటు పలు ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోట్లాది రూపాయలను ముడుపులుగా పుచ్చుకొని విద్యార్థులకు వైద్య ప్రవేశ పరీక్షల్లో అవినీతికి ద్వారాలు తెరిచిన రాజకీయ పెద్దలను, ఉన్నతాధికారులను వదిలేసి విద్యార్థులకు శిక్ష విధించడం ఏమిటని బాధితులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డును హిందీ షార్ట్ ఫామ్‌లో వ్యాపం అని పిలుస్తారు. వ్యాపం 2008 నుంచి 2013 వరకు నిర్వహించిన అన్ని వైద్య ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ దర్యాప్తులో తేలింది. విద్యార్థుల దగ్గరి నుంచి కోట్లాది రూపాయలను తీసుకొని వారికి ప్రశ్న పత్రాలను లీక్ చేయడంతోపాటు విద్యార్థులకు బదులుగా ప్రొఫెషనల్స్ ప్రవేశ పరీక్షలు రాసేందుకు అనుమతించినట్లు తేలింది. 2013లో జరిగిన వైద్య ప్రవేశ పరీక్షలో విద్యార్థులకు బదులుగా కొంత మంది ప్రొఫెషనల్స్ పరీక్షలు రాశారని ఫిర్యాదు అందడంతో తీగలాగితే డొంక కదిలినట్లు 2008 నుంచి జరిగిన అవకతకలన్నీ వెలుగులోకి వచ్చాయి. అమాయకులకు కూడా నష్టం.... ఈ కేసులో అధికార పక్షానికి చెందిన పలువురు బీజేపీ నాయకులతో పాటు ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు, పలువురు ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు వెల్లడయింది. ముందుగా ఈ కేసును విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు అక్రమాలకు పాల్పడిన 634 మంది వైద్య విద్యార్థుల పట్టాలను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. వారు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి మొత్తం 2008 నుంచి 2013 మధ్య అడ్మిషన్లు పొందిన విద్యార్థుల మెడికల్ డిగ్రీలను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పు కారణంగా అమాయకులమైన తాము కూడా నష్టపోతున్నామని అవకతకలతో ప్రమేయంలేని దాదాపు 400 మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దలంతా బయటే ఉన్నారు.... వ్యాపం స్కామ్ విచారణ సందర్భంగా దాదాపు 25 మంది సాక్షులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. వారిలో ఈ కుంభకోణంను వెలుగులోకి తీసుకొచ్చిన జర్నలిస్టు కూడా ఉన్నారు. అలా మరణించిన వారిలో 17మంది మృతిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పాలక పక్ష బీజేపీ నాయకులతో సత్సంబంధాలు కలిగిన, వ్యాపం స్కామ్ సూత్రధారి డాక్టర్ జగదీష్ సాగర్‌ను మినహాయించి ఈ కేసులో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, మధ్యవర్తులు దాదాపు రెండు వేల మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో నాటి వ్యాపం ఎగ్జామినేషన్ కంట్రోలర్ పంకజ్ త్రివేది, చీఫ్ సిస్టమ్ అనలిస్ట్ నితిన్ మహీంద్ర, మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, ఆయనకు ఓఎస్డీగా పనిచేసిన ఓపీ శుక్లా, మైనింగ్ దిగ్గజం సుధీర్ శర్మ, కాంగ్రెస్ నాయకుడు సంజీవ్ సక్సేనా తదితరులతోపాటు వ్యాపారవేత్తలు, పలువురు డాక్టర్లు ఉన్నారు. వారంతా ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. ఆత్మహత్య మినహా మరో మార్గం లేదు..... తాము ఎంతో కష్టపడి ఇంటర్నల్ పరీక్షలు రాసి పాసయ్యామని, న్యాయపోరాటంలో కూడా ఎంతో సమయం వృధా అయిందని, ఈ దశలో తమ వైద్య పట్టాలను రద్దు చేస్తే తమ జీవితమంతా మంట కలసిపోతుందని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు తమకు ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో మార్గం లేదని భవేశ్ నాయక్ అనే బాధితుడు వ్యాఖ్యానించారు. నమ్ముకున్న వైద్య విద్య నట్టేట మునిగిపోయిందని, రెండో భవిష్యత్తుకు ప్రభుత్వం తమకు గ్యారంటీ ఇవ్వగలదా? అని సునీల్ జాట్ అనే మరో బాధితుడు ప్రశ్నించారు. నిజమైన నేరస్థులు సమాజంలో స్వేచ్ఛగా సంచరిస్తుంటే తమను శిక్షించడం ఏమిటని దీపక్ బుండేలా అనే బాధిత విద్యార్థి ప్రశ్నించారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగాలని, అందుకు సోషల్ మీడియా కూడా తమకు సంఘీభావం తెలపాలని బాధిత విద్యార్థులు పిలుపునిచ్చారు. నిర్బంధ సామాజిక సేవే సబమేమో! అసలే దేశంలో వైద్య విద్యార్థుల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు, విద్యార్థుల వైద్య పట్టాలను రద్దు చేయడం భావ్యం కాదని, కొన్నేళ్లపాటు వారికి నిర్బంధ సామాజిక సేవను విధించి ఆ తర్వాత వారి పట్టాలను వారికివ్వడం సమంజసమని కేసును విచారించిన సుప్రీం త్రిసభ్య బెంచీలో ఒకరైన జస్టిస్ జే.చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. దేశ అవసరాలనో, సామాజిక అవసరాలనో దృష్టిలో పెట్టుకొని తీర్పు ఇవ్వలేమని, విద్యార్థులు అవినీతి మార్గంలో అడ్మిషన్లు పొందినందున వారి పట్టాలను రద్దు చేయడం సబబేనని ఇద్దరు మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు సుప్రీం త్రిసభ్య బెంచీ స్పష్టం చేసింది. న్యాయం పట్ల అంత స్పష్టత కలిగిన బెంచీ అసలైన నిందితులకు ఎప్పుడు శిక్ష విధిస్తుందో చూడాలి. -
చాయ్ వాలాకు సీబీఐ కోర్టు సమన్లు
కాన్పూర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపమ్ స్కామ్ కేసులో చాయ్ వాలాకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. కాన్పూర్ లోని లాలాలజపతి రాయ్ ఆస్పత్రి ఎదుట టీ అమ్ముకుని జీవిస్తున్న రాజుకు కోర్టు సమన్లు పంపింది. జనవరి 13న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటివరకు గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్(జీవీఎస్ఎం) కాలేజీ విద్యార్థులపైనే దృష్టి సారించిన సీబీఐ చాయ్ వాలాకు సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది. కాగా, తనకు సీబీఐ కోర్టు సమన్లు పంపడంపై రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాను ఏ తప్పు చేయలేదని, వ్యాపం కుంభకోణం గురించి అసలు తనకేమీ లేదని మీడియా ముందు వాపోయాడు. తానెప్పుడు మధ్యప్రదేశ్ కు వెళ్లలేదని చెప్పాడు. లాలాలజపతి రాయ్ ఆస్పత్రి ఔట్ షేపెంట్ విభాగం గేటు వెలుపల 20 ఏళ్లుగా అతడు టీ కొట్టు నడుపుతున్నాడు. రాజుకు సమన్లు పంపడానికి గల కారణాల గురించి సీబీఐ అధికారులు, స్థానిక పోలీసులు పెదవి విప్పడం లేదు. -
ఎంపీ గవర్నర్‌కు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్‌కు నోటీసులు పంపించింది. వ్యాపం కుంభకోణంలో గవర్నర్ రామ్ నరేశ్‌కు కూడా భాగస్వామ్యం ఉందని, ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తున్నందున ఆయనను వెంటనే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో స్పందన తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటు ఒక వేళ గవర్నర్ స్ధానంలో ఉండి అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైతే అతడిని తొలగించడానికి కావాల్సిన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేయాలని హోంశాఖను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. సంజయ్ శుక్లా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. -
వ్యాపమ్ కేసులో మధ్యప్రదేశ్ గవర్నర్‌కు నీటిసులు
-
వ్యాపంలో మరో అనుమానాస్పద మరణం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 'వ్యాపం' కేసులో మరో మరణం నమోదైంది. ఒడిషాకు చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్ బహదూర్ (ఐఎఫ్ఎస్) అనుమానాస్పదంగా శవమై తేలారు. భోపాల్ సమీపంలోని రాయఘడ్కు వెళ్లిన ఆయన మృతదేహాన్ని అక్టోబర్ 15 ఉదయం ఝార్సుగూడ రైల్వే ట్రాక్‌పై పోలీసులు కనుగొన్నారు. దీంతో ఈ కుంభకోణంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన వారి సంఖ్య 51కి చేరింది. కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత నమోదైన తొలి అనుమానాస్పద మరణం ఇదే. 1978 బ్యాచ్‌కి చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల సమావేశానికి హాజరయ్యేందుకు విజయ్ బహదూర్, భార్య నీతాసింగ్తో కలిసి పూరీ వెళ్లారు. తర్వాత తిరిగి భోపాల్ వస్తుండగా ఈ మరణం సంభవించింది. అయితే ఏసీ కంపార్ట్మెంట్లో తలుపు మూయడానికి వెళ్లిన ఆయన తిరిగి రాలేదని నీతూ చెబుతుంటే.. ప్రమాదవశాత్తూ రైల్లోంచి కిందపడి చనిపోయారని జిల్లా ఎస్పీ దిలీప్ బాగ్ చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా 2012లో ఈ కేసులో ప్రధాన సాక్షి నమ్రతా దామోర్ కూడా రైల్వేట్రాక్‌పై శవమై తేలారు. మరోవైపు వ్యాపం కుంభకోణం విచారణను సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు... దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఇటీవల సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల మరణాలపై సీబీఐ విచారణ చేపట్టింది. ఆ తర్వాతి నుంచి అనుమానాస్పద మరణాలు దాదాపు తగ్గిపోయాయి. కానీ మళ్లీ ఇప్పుడు మరో మరణం వెలుగుచూడటం ఆందోళనలు రేపుతోంది. కేసును తారుమారు చేసేందుకే సాక్షులను ఒక్కొక్కరిని హతమారుస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. -
వ్యాపమ్ కుంభకోణంలో సీబీఐ దూకుడు
-
బెయిల్ ఇప్పించండి.. లేదా చనిపోనివ్వండి!
ప్రణబ్‌కు వ్యాపమ్ నిందితుల లేఖ భోపాల్: వ్యాపమ్ స్కాంలో అరెస్టయి గ్వాలియర్ జైలులో ఉన్న నిందితుల్లో 70 మంది వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు.. తమను బెయిలుపై విడుదల చేయాలని.. లేదంటే ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. అక్రమ పద్ధతుల్లో వ్యాపమ్ ప్రి-మెడికల్ పరీక్షను రాసి వైద్య సీట్లు పొందారన్న ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేశారు. ‘విచారణ ఖైదీలుగా సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్నాం. తీవ్ర మానసిక, సామాజిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. ఇది మాలో ఆత్మహత్య ఆలోచనలను ప్రేరేపిస్తోంది. మాతో పాటు ఇవే సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులు బెయిలు పొందితే.. జూనియర్ వైద్యులమంతా జైలులోనే మగ్గిపోతున్నాం’ అని ఆవేదన వ్యక్తంచేశారు. తమ వైద్య విద్యాభ్యాసానికి సుదీర్ఘంగా అవరోధం కలగకుండా ఉండేలా చూసేందుకు తమకు బెయిల్ ఇప్పించాలని కోరారు. -
వ్యాపమ్ స్కామ్‌లో దోషులను వదలం
న్యూఢిల్లీ: వ్యాపమ్ స్కామ్‌లో ఒక్క దోషిని కూడా వదలిపెట్టేదిలేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. తన రాజీనామాకు కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌ను ఆదివారం తోసిపుచ్చారు. 2013లో ఈ స్కామ్‌ను గుర్తించి తొలుత ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించింది తానేనని తెలిపారు. కేసు సంక్లిష్టత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తుకోసం టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేశామన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ హైకోర్టు నియమించిన సిట్ కింద పనిచేస్తోందని వివరించారు. రాష్ట్రంలో జరిగిన లక్షలాది ఉద్యోగ నియామకాల్లో కేవలం కొన్ని వందల కేసుల్లో మాత్రమే అవకతవకలు జరిగాయని, ఈ విషయాన్ని గతంలో అసెంబ్లీలోనే తాను ఒప్పుకున్నానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దోషులు ఎంతటివారైనా వదిలేదిలేదని ఆయన స్పష్టంచేశారు. -
మా కుటుంబాన్ని వేధిస్తున్నారు
పోలీసులపై ‘వ్యాపమ్’ను బయటపెట్టిన పాండే ఆరోపణ ఇండోర్: మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపమ్ స్కామ్‌ను బయటపెట్టి, సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రశాంత్ పాండే భార్య మేఘనా పాండేను పోలీసులు హవాలా ఆరోపణలపై కొద్దిసేపు నిర్బంధించి తర్వాత వదిలిపెట్టారు. ఆమె నుంచి రూ.9.96 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పాండే మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. వ్యాపమ్ స్కామ్‌పై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత తమపై వేధింపులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే లక్ష్మీ మోటార్స్ అనే సంస్థలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్టు తమకు సమాచారం అందడంతో శనివారం అక్కడ నిఘా పెట్టామని, అదే సమయంలో మేఘన ఓ బ్యాగ్‌తో సంస్థనుంచి బయటకు వస్తుండగా ఆపి తనిఖీ చేయడంతో ఆమె వద్ద రూ.9.96 లక్షల నగదు లభించిందని ఎస్పీ త్రిపాఠీ తెలిపారు. మేఘన ఆ డబ్బుకు సంబంధించి సరైన వివరాలు చెప్పకపోవడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని, డబ్బును స్వాధీనం చేసుకుని ఆమెను వదలిపెట్టామని వివరించారు. అయితే తన భార్య లక్ష్మీ మోటార్స్ సంస్థలో ఉద్యోగం చేస్తోందని, ఆ డబ్బు తమ సొంతమని, ఫ్లాట్‌ను కొనుగోలు చేయడంకోసం బిల్డర్‌కు ఆ డబ్బు ఇవ్వాల్సి ఉందని ప్రశాంత్ పాండే వెల్లడించారు. -
గవర్నర్ ఓఎస్డీపై కేసు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ గవర్నర్ మాజీ ఓఎస్డీ ధన్‌రాజ్ యాదవ్‌పై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. మరో 37 మందిపై కూడా కేసులు నమోదు చేసింది. పోలీసు అధికారుల నియామకాల నోటిఫికేషన్ సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ నమోదుచేసిన కేసుల్లో పేర్కొన్నారు. దీంతోపాటు, కుట్రపూరిత నేరం, మోసం, సంతకాల మార్పిడి, చట్టాల అతిక్రమణ, టెక్నాలజీకి చెందిన చట్టాలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలన్నీ ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆదివారం కేసు నమోదైనవారిలో పరీక్షల నిర్వహణ అధికారి పంకజ్ త్రివేది కూడా ఉన్నారు. -
లాయర్ని ఎప్పుడు నియమిస్తారు?
న్యూఢిల్లీ: వ్యాపం కుంభకోణం కేసులపై పూర్తిస్థాయి దర్యాప్తు ఎప్పుడు ప్రారంభిస్తారని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులన్నింటినీ ఎప్పుడు తమ ఆధీనంలోకి తీసుకుంటారని అడిగింది. వ్యాపం కేసుల విచారణలో వాదించేందుకు న్యాయవాదిని ఎప్పుడు నియమిస్తారని ప్రశ్నించింది. ఈ కేసు విచారణను తాము పర్యవేక్షించాలా, వద్దా అనే దానిపై వచ్చే శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వ్యాపం స్కామ్ పై విచారణను సుప్రీంకోర్టు... సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. -
మోదీపై విశ్వసనీయత తగ్గుతోంది
సాక్షి, చెన్నై: దివంగత నేత కే కామరాజ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా తమిళనాడులోని తిరుచ్చిలో గురువారం జరిగిన బహిరంగసభలోకాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై దాడిని కొనసాగించారు. ‘అధికారంలో ఉన్నవారు మీ సమస్యలను పట్టించుకోవడం లేదు. మీ మాటలను వినిపించుకోవడం లేదు. మా దగ్గర అధికారం ఉందని, మీ మాటలు వినాల్సిన అవసరం లేదని వారనుకుంటున్నారు.’ అంటూ పరోక్షంగా కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారిపై ధ్వజమెత్తారు. మోదీపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయత తగ్గుతోందన్నారు. జోరుగా పడుతున్న వానను సైతం లెక్కచేయకుండా.. తడుస్తూనే రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించడం విశేషం. సభకు హాజరైన వారు కూడా అంతే ఉత్సాహంతో రాహుల్ ప్రసంగానికి స్పందించారు. తడుస్తున్న రాహుల్‌కు గొడుగు పట్టడానికి వచ్చిన ఒక నాయకుడిని సున్నితంగా రాహుల్ వారించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన కామరాజ్ గొప్పదనాన్ని రాహుల్ పలుమార్లు ప్రస్తావించారు. ఆయన పాలన నాటి స్వర్ణయుగం కోసం కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలన్నారు. -
మోదీ మౌనంపై మండిపడ్డ రాహుల్
-
సభలో ఇక సమరమే...
-
సభలో ఇక సమరమే...
* అధికార - విపక్షాల మధ్య సయోధ్య మృగ్యం * ప్రతిష్టంభనతో ముగిసిన అఖిలపక్ష సమావేశం న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య సమరం ఖరారయింది. లలిత్‌గేట్, వ్యాపమ్ స్కాంలపై పాలక, ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదరలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు పదవుల నుంచి వైదొలగకపోతే సమావేశాలను సాగనివ్వబోమని కాంగ్రెస్ స్పష్టంచేయగా.. అటువంటి రాజీనామాలు ఏవీ ఉండబోవని, ఎవరి హెచ్చరికలకూ తాము లొంగబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. పార్లమెంటు నిర్వహణ సమష్టి బాధ్యత అని, అందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. పార్లమెంటు సమావేశాల్లో ఏ అంశంపైన అయినా చర్చించేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. మంగళవారం నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నిర్వహణలో ఒకటి, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహణలో మరొకటి.. మొత్తం రెండు అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. ఈ రెండు భేటీల్లోనూ ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్షం..తమ వైఖరులపై భీష్మించటంతో ఆ భేటీలు ప్రతిష్టంభనతో ముగిశాయి. వెంకయ్య నిర్వహించిన అఖిలపక్ష భేటీలో.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. పార్లమెంటు సమావేశాలను సజావుగా నిర్వహించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లయితే.. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి రైల్వేమంత్రి పవన్‌కుమార్ బన్సల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్చవాన్లపై ఆరోపణలు వచ్చినపుడు వారు ఎలా రాజీనామా చేశారో ఆయన ఉదహరించారు. వ్యాపమ్ కుంభకోణంలో వరుస మరణాలను ఖండిస్తూ.. పాకిస్తాన్ ఐఎస్ఐ కానీ, ఇక్కడి ఉగ్రవాదులు లేదా నక్సలైట్లు కానీ ఈ పని చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోందా అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన హామీలను గుర్తుంచుకుని అవినీతిపై మాటలను చేతల్లో చూపించాలని కాంగ్రెస్ సూచించింది. ఆజాద్ డిమాండ్లను వెంకయ్య తిరస్కరించారు. ‘ఎవరి నుంచైనా తుదిహెచ్చరికలను అంగీకరంచేది లేదు. రాజీనామా అనే ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ప్రభుత్వానికి ఎవరూ షరతులతో ఆజ్ఞలు జారీచేయజాలరు. ప్రభుత్వం నుంచి ఏ కేంద్రమంత్రి కూడా అక్రమమైన, అనైతికమైన పని ఏదీ చేయలేదు’ అని ఆయన పేర్కొన్నారు. లలిత్‌మోదీ వివాదంపై సుష్మాస్వరాజ్ సభలో ప్రకటన చేస్తారని చెప్పారు. సమావేశాలు సాగకపోతే.. చర్చించేదెలా? కాంగ్రెస్, జేడీ(యూ), ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే, వామపక్షాలు, ఎన్డీఏ మిత్రపక్షాలు సహా 29 పార్టీల నుంచి పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ 42 మంది నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్, అన్నా డీఎంకే పార్టీల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొనలేదు. అయితే.. వసుంధర, చౌహాన్లు ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేయకపోతే సమావేశాలను సాగనివ్వబోమన్న కాంగ్రెస్ వైఖరితో సమావేశానికి హాజరైన ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏకీభవించలేదు. పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోవటం పరిష్కారం కాబోదని పలు పార్టీలు అభిప్రాయపడ్డాయి. కాంగ్రెస్ వైఖరి గురించి ప్రస్తావించగా.. ‘ఇది సరికాదు. పార్లమెంటు జరుగుతుంది. ప్రభుత్వం చర్చకు అనుమతించాలి’ అని జేడీ(యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ సర్కారు ప్రతిపాదిస్తున్న భూసేకరణ బిల్లును తాము అంగీకరించేది లేదన్నారు. సమావేశాలు సజావుగా సాగుతాయా అన్నది అనుమానమేనని ఎస్పీ నేత రాంగోపాల్‌యాదవ్ స్పందించారు. ఆజాద్ లేవనెత్తిన అంశాలపై చర్చజరగాలని.. పార్లమెంటు పనిచేయకుండా అడ్డుకుంటే చర్చ ఎలా జరుగుతుందని శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌దేవ్‌సింగ్ ధిండ్సా వ్యాఖ్యానించారు. భారత్ - పాక్ సరిహద్దులో సంఘటనలపై చర్చ జరగకుండా పార్లమెంటుకు ఆటంకం కలిగించేవారిని జాతి క్షమించదని శివసేన నేత సంజయ్‌రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై సవివరమైన చర్చ జరగాలని టీఆర్ఎస్ నేత కె.కేశవరావు అన్నారు. చర్చల ద్వారా స్పష్టత వచ్చేందుకు వీలుగా వివిధ అంశాలపై ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని సీపీఎం నేత సీతారాంఏచూరి కోరారు. చర్చకు ప్రతిపాదించిన అంశాలివీ... సమావేశాల్లో చర్చించటానికి ప్రతిపాదించిన అంశాల్లో.. భారత్, పాక్ సంబంధాలు - విదేశాంగ విధానం, పెరుగుతున్న సామాజిక అంతరాలు, రైతుల ఆత్మహత్యలు - వ్యవసాయ రంగ సంక్షోభం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - దాని అమలు, పదోన్నతుల్లో ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు, పొగాకు రైతుల సమస్యలు, సామాజిక - ఆర్థిక కుల గణన తదితర అంశాలున్నాయి. కాంగ్రెస్ చేతిలో బ్రహ్మాస్త్రాలు..! సుష్మాస్వరాజ్: ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీ బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు ట్రావెల్ డాక్యుమెంట్స్లభించేలా సహకరించారన్న ఆరోపణలతో వివాదం రేగింది. మోదీ భార్య కేన్సర్ చికిత్సకు పోర్చుగల్ వెళ్లడం కోసం మోదీ కోరడంతో మానవతా దృక్పథంతోనే సాయం చేశానని సుష్మా వివరణ ఇచ్చినప్పటికీ.. విపక్షం శాంతించలేదు. వసుంధర రాజె: ‘లలిత్‌గేట్’లో రెండో వికెట్. తన బ్రిటన్ ఇమిగ్రేషన్‌కు సాక్షిగా వచ్చేందుకు రాజె ఒప్పుకున్నారని, ఈలోపు ఆమె సీఎం కావడంతో కుదరలేదని లలిత్ ట్వీట్‌తో రాజె ఇందులో ఇరుక్కున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్: వ్యాపమ్.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్పె భారీ ఎత్తున బురదజల్లిన కుంభకోణం. వైద్య విద్యలో ప్రవేశాలు, ప్రభుత్వోద్యోగాల్లో నియామకాల్లో జరిగిన రూ.కోట్ల స్కాం చౌహాన్ ఇమేజిని దారుణంగా దెబ్బతీసింది. నిందితులు, సాక్ష్యులు.. దాదాపు 50 మంది అనుమానాస్పదంగా మృతి చెందడం ఈ స్కాంలోని చీకటి కోణాలను బట్టబయలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రభుత్వ, పార్టీ పెద్దల పాత్ర ఉందన్న ఆరోపణలు రావడంతో శివరాజ్ సింగ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పట్టుపడుతోంది. భూబిల్లుపై సర్దుకుపోవాలి: మోదీ దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన తొలి అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ కొద్దిసేపు పాల్గొని ప్రసంగించారు. పార్లమెంటు సజావుగా సాగటానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. అది సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు. భూబిల్లుపై సర్దుకుపోవాలన్నారు. గత సమావేశాల్లో చర్చించిన అంశాలపై అన్ని రాజకీయ పార్టీలూ సమష్టిగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. పార్లమెంటు సమయాన్ని అన్ని అంశాలనూ చర్చించేందుకు వినియోగించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఆగస్ట్ తొలివారంలో ‘భూ’ నివేదిక * మరింత గడువు కోరిన జేపీసీ న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లును అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదిక సమర్పించే గడువును ఆగస్టు మొదటివారం వరకు పొడగించినట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు. నివేదికను పార్లమెంటు వర్షాకాల స మావేశాల తొలిరోజైన జూలై 21వ తేదీన సమర్పించాల్సి ఉండగా మొదట జూలై 27 వరకు గడవును పొడగించాలని కమిటీ చైర్మన్ అహ్లూవాలియా(బీజేపీ) అభ్యర్థించారని, మరోసారి పొడిగింపును కోరుతూ తాజాగా లేఖ రాశారని వివరించారు. దాంతో ఆగస్ట్ తొలివారం వరకు గడవును పొడగించామని చెప్పారు. 2013 భూ సేకరణ చట్టానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలపై మరింత వివరణ కావాలని జేపీసీ సభ్యులు కోరుతున్నందున నివేదిక సమర్పణకు గడువు కావాలని అహ్లూవాలియా కోరారన్నారు. జూలై 6న జేపీసీ ముందు హాజరుకావాల్సి ఉన్న వివిధ శాఖలకు చెందిన ముగ్గురు కార్యదర్శులు గైర్హాజరయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆగస్ట్ 3 వరకు గడువు కో రుతూ రేపు(బుధవారం) అహ్లూవాలియా లోక్‌సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టనున్నారని వెల్లడించాయి. అయితే, ఈ గడువులోపు కూడా ని వేదిక సిద్ధం కాకపోవచ్చని, మరోసారి గడువు పొడగింపును జేపీసీ కోరవచ్చని పేర్కొన్నాయి. అదే జరిగితే, భూ ఆర్డినెన్సును ప్రభుత్వం మరోసారి(4వ సారి) జారీ చేయాల్సి వస్తుంది. భూబిల్లును వ్యతిరేకించడమంటే అభివృద్ధిని వ్యతిరేకించడమే భూ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడాన్ని వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. అది రైతు వ్యతిరేకత, అభివృద్ధి వ్యతిరేకత అని వ్యాఖ్యానించారు. అంగుళం భూమి కూడా రైతుల నుంచి సేకరించనివ్వబోమన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వాళ్లు అధికారంలో ఉండగా సరైన పరిహారం ఇవ్వకుండానే 20 లక్షల ఎకరాల భూమిని పరిశ్రమలకు, ఎస్ఈజీలకు కట్టబెట్టారంటూ ట్వీట్ చేశారు. పార్లమెంటుకు విదేశీ అధికారుల లంచాల బిల్లు న్యూఢిల్లీ: లంచం ఇవ్వజూపే లేదా తీసుకునే విదేశీ ప్రభుత్వాధికారులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు కాలవ్యవధి ముగిసింది. దీంతో తాజాగా దీన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన ప్రభుత్వం...ఈ బిల్లుపై సూచనలు, అభిప్రాయాలు తెలపాల్సిందిగా లా కమిషన్‌ను కోరింది. అయితే మంగళవారం పార్లమెంటులో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుందా లేదా అనే విషయం తెలియరాలేదు. -
'వ్యాపం' విజిల్బ్లోయర్పై బదిలీ వేటు
భోపాల్: వ్యాపం కుంభకోణాన్ని బట్టబయలు చేసిన విజిల్ బ్లోయర్, ప్రభుత్వ వైద్యుడు ఆనంద్ రాయ్ పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇండోర్‌లో పనిచేస్తున్న ఆయనను ధార్ జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ వైద్యురాలే అయిన రాయ్ భార్యను కూడా ప్రభుత్వం గత నెలలో బదిలీ చేసింది. అయితే కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చినందుకే తనపై, తన కుటుంబంపై ప్రభుత్వం, బీజేపీ పెద్దలు కక్ష పెంచుకున్నారని రాయ్ ఆరోపిస్తున్నారు. వ్యాపం కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత విక్రం వర్మ పాత్రపై ఈ నెల 17న రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బదిలీ నిలుపుదల చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆనంద్ రాయ్ మీడియాకు చెప్పారు. మరో విజిల్ బ్లోయర్ ఆశిష్ చతుర్వేది సోమవారం మీడియాతో మాట్లాడుతూ తప్పుడు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వం నడుస్తున్నదని, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడేదిలేదని, వ్యాపం నిందితులకు శిక్షపడేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. -
'వ్యాపమ్ స్కామ్ తో ముడిపెట్టొద్దు'
నాగ్ పూర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వ్యాపమ్ స్కామ్ మరణాలపై బీజేపీ మరోసారి స్పందించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న వరుస మరణాలు అన్నింటినీ వ్యాపమ్ స్కామ్ తో ముడిపెట్టొద్దని స్పష్టం చేసింది. వ్యాపమ్ స్కామ్ అంశంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను లక్ష్యంగా చేస్తూ రాజకీయ వేడి తీవ్రం కావడంతో బీజేపీ ఎంపీ రాకేశ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అనుమానాస్పద మరణాలకు వ్యాపమ్ స్కామ్ తో జతచేయడం తగదని సూచించారు. వ్యాపమ్ స్కామ్ తో సంబంధమున్న వ్యక్తుల్లో 44 మంది మరణించినట్లు చెబుతున్నారని.. అయితే ఈ మరణాలు అన్నీ కూడా వ్యాపమ్ స్కామ్ కు సంబంధం లేదన్నారు. -
'వ్యాపం' నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వ్యాపం కుంభకోణంలో దాఖలైన అన్ని చార్జీషీట్లను దర్యాప్తు పూర్తయ్యేవరకు భద్రంగా ఉంచాలని 'సిట్' ఆదేశించాలని సుప్రీంకోర్టును సీబీఐ అభ్యర్థించింది. వ్యాపం స్కామ్ లో దాఖలైన 185 కేసుల బదిలీకి సమయం పడుతుంది కాబట్టి నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కోరింది. సీబీఐ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యాపం కుంభకోణంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. -
వ్యాపమ్ స్కాంలో మూడు ఎఫ్ఐఆర్లు
దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ భోపాల్: మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తును ప్రారంభించింది. బుధవారం ఈ స్కాంకు సంబంధించి మూడు ఎఫ్ఐఆర్లను సీబీఐ నమోదు చేసింది. మధ్యప్రదేశ్‌లో 2010 నాటి ప్రీ-మెడికల్ టెస్ట్ అక్రమాలకు సంబంధించి ఆ రాష్ట్ర వెనుకబడిన తరగతులు, మైనార్టీల కమిషన్ సభ్యుడు గులాబ్ సింగ్ కిరార్, ఆయన కుమారుడితో సహా మొత్తం 21 మందిని సీబీఐ నిందితులుగా చేర్చింది. అలాగే, 2011 నాటి ప్రీ-పీజీ ఎగ్జామినేషన్స్‌కు సంబంధించి మరో 8 మందిని ఎఫ్ఐఆర్లో చేర్చింది. తాజా ఎఫ్ఐఆర్లలో చేరినవారిలో వ్యాపమ్ మాజీ కంట్రోలర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుధీర్ భాదౌరియా, పంకజ్ త్రివేదీలు కూడా ఉన్నారు. పెరిగిన రాజకీయ వేడి..: వ్యాపమ్ స్కాంలో ప్రధాన నిందితుడు సుధీర్ శర్మ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు పలువురు బీజేపీ ఆరెస్సెస్ నేతలు లబ్ధిపొందారంటూ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు పలు పత్రాలను విడుదల చేశారు. నిందితుడు గనుల వ్యాపారి సుధీర్ శర్మ నుంచి ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్ ద్వారా, ప్రధాన్‌తో పాటు పలువురు నేతల ప్రయాణపు ఖర్చులను శర్మ భరించినట్లు తేలిందని వారు ఆరోపించారు. -
విపక్షాలను ఎదుర్కొనేదెలా?
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రేపు మంత్రులు-కార్యదర్శుల సమావేశం {పభుత్వానికి తలనొప్పిగా మారనున్న వ్యాపమ్-లలిత్‌గేట్ బిల్లుల ఆమోదం కంటే ఆత్మరక్షణే సర్కారు ముందున్న సమస్య న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దగ్గరపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం విపక్షాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేంద్ర ప్రభుత్వం మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో గురువారం(జూలై 16) వ్యూహాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వాన్ని కుదిపేసిన వ్యాపమ్ స్కామ్, లలిత్ మోదీ వివాదం, కులగణన గణాంకాల వంటి అవకాశాలపై ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. దీంతో పాటు ఈ సమావేశాల్లో చేపట్టాల్సిన వివిధ అంశాలను కూడా ఖరారు చేయనున్నారు. 3 వారాల సాగే వర్షాకాల సమావేశాల్లో సభ ముందుంచటానికి 35 శాసన ఆర్థిక అంశాలను జూలై 9న జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖలోని శాసన విభాగ కార్యదర్శులతో జరిగిన భేటీలో ప్రభుత్వం గుర్తించింది. గురువారం జరిగే సమావేశంలో వీటికి తుదిరూపాన్నిస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో దాదాపు 9 బిల్లులు, లోక్‌సభలో నాలుగు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా సుమారు 11 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వివాదాస్పదమైన భూసేకరణ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్నందున ఈ సమావేశాల్లో చర్చకు రాకపోవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇవి కాకుండా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నియంత్రణ చట్ట సవరణ బిల్లు, ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులు లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్నాయి. సమావేశాలకు ముందు రోజు(జూలై 20) లోక్‌సభ స్పీకర్ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారు. మోదీతో రాజ్‌నాథ్, జైట్లీ, అమిత్ షా భేటీ పార్లమెంట్ సమావేశాలపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు మంగళవారం ప్రధాని మోదీని కలసి చర్చించారు. కాగా, సమావేశాలు వాడివేడిగా జరగనున్న నేపథ్యంలో బీజేపీ తన మిత్రపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని బలమైన వ్యూహరచన చేయాలని శివసేన హితవు పలికింది. సోనియాతో రాహుల్ మన్మోహన్ భేటీ పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మరికొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో మంగళవారం సమావేశమయ్యారు. వ్యాపమ్, లలిత్‌గేట్, కుల గణన అంశాలపై విపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసేలా వ్యూహరచన చేయాలని ఈ భేటీలో కాంగ్రెస్ నిర్ణయించింది. సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ లాంటి పార్టీలు వేరే మార్గం అనుసరించినా.. వీలైనంత వరకు అన్ని పార్టీలను కలుపుకు పోవాలని నిర్ణయించారు. సభలో సహకరించండి: వెంకయ్య వినతి వ్యాపమ్, లలిత్ గేట్ వివాదాల నేపథ్యంలో ముంచుకొస్తున్న వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు ప్రభుత్వం అన్ని పార్టీల నేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తుందని చెప్పారు. తానూ జూలై 20న ఉదయం 10 గంటలకు ఉభయసభల్లోని అన్ని పార్టీల నేతలతో సమావేశం అవుతానన్నారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన ప్రధాన అంశాలకు ఈ సమావేశాల్లో ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. రాజీనామాల ప్రశ్నేలేదు లలిత్ వివాదంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేసే ప్రసక్తి తలెత్తదని వెంకయ్య స్పష్టం చేశారు. అంతే కాకుండా లలిత్ గేట్‌తో పాటు వివిధ స్కామ్‌లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీ ముఖ్యమంత్రులు వసుంధ రాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్‌లు సైతం రాజీనామాలు చేయరని తేల్చి చెప్పారు. సుష్మ ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. -
వ్యాపం స్కామ్ పై వివాదస్పద వ్యాఖ్యలు
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వ్యాపం కుంభకోణంపై బీజేపీ సీనియర్ నాయకుడొకరు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా చిన్న కుంభకోణం అని బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవార్జియా వ్యాఖ్యానించారు. 'ఇది మాకు చాలా చిన్న కుంభకోణం. కానీ మీకు ఇది పెద్ద స్కామ్ గా కనబడుతుంద'ని విలేకరులతో అన్నారు. వ్యాపం స్కామ్ గురించి భయపడుతున్నవారి నైతికస్థితే దిగజారిందన్నారు. తాము మాత్రంగా ధైర్యంగా ఉన్నామని పేర్కొన్నారు. వ్యాపం స్కామ్ పై కథనాలు వెలువరించిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ అనుమానాస్పద మృతిపైనా కౌలాశ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తన కంటే జర్నలిస్టు గొప్పవాడేం కాదని వ్యాఖ్యానించి నాలుక్కరుచుకున్నారు. మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న 43 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంగతి విదితమే. -
'మా సీఎం గంగలా స్వచ్ఛమైన వ్యక్తి'
భోపాల్: వ్యాపం కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సొంత పార్టీ నేతలు అండగా నిలిచారు. మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షడు నంద్ కుమార్ ఆదివారం భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం శివరాజ్‌ను గంగా నదితో పోల్చారు. 'మా ముఖ్యమంత్రి గంగా నది అంతటి పవిత్రమైనవారు. కావాలనే విపక్షాలు ఆయనపై బుదర జల్లుతున్నాయి. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆయన కడిగిన ముత్యంలా బయటికొస్తారు' అని నంద్ కుమార్ వ్యాఖ్యానించారు. -
చదువు'కొంటే' ఇలాగే ఉంటుంది!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపం కుంభకోణం కారణంగా మధ్యప్రదేశ్‌లో వైద్య విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. 'గత ఏడెనిమిదేళ్లలో వైద్య విద్యార్థుల్లో కనిపించిన చురుకుదనం ప్రస్తుత విద్యార్థుల్లో ఉండడం లేదు. తరగతి గదుల్లో జరిగే చర్చల సందర్భంగా వారిలో ఎక్కువ మంది మౌనంగా ఉంటున్నారు. వాళ్లు ఏ ప్రశ్నా అడగడం లేదు. మేము చెబుతున్నది వారి బుర్రలోకి ఎక్కుతోందో లేదో తెలియదు. కనీసం అర్థమైనా కాకున్నా వింటున్నారా లేదా కూడా తెలీదు. మాలో కూడా చెప్పాలన్న ఉత్సాహం దాదాపు చచ్చిపోయింది' అని ఇండోర్‌లోని ప్రతిష్ఠాత్మకమైన మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీలో ఓ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్న ఓ సీనియర్ ప్రొఫెసర్ (పేరు వెల్లడించేందుకు ఇష్టపడలేదు) వ్యాఖ్యానించారు. 'క్లాసులో మొద్దు విద్యార్థులను గుర్తించడం సులభమే. ఏ ప్రశ్న అడిగినా వారి నుంచి మౌనమే సమాధానం వస్తోంది. ఇంటర్నల్ పరీక్షల్లో అత్తెసరు మార్కులు తెచ్చుకుంటారు. ఫైనల్ పరీక్షల్లో మేనేజ్ చేసుకుంటారు' ఇవి ఓ సీనియర్ ఫాకల్టీ సభ్యుడి నుంచి వచ్చిన వ్యాఖ్యలు. నేడు స్పెషలైజ్డ్ వైద్యకోర్సుల్లో రేడియోలజీ, సైకియాట్రీ ఆఫ్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ కోర్సులకు డిమాండ్ బాగా ఉందని, ఈ కోర్సుల్లో చేరేవారు దాదాపు కోటి రూపాయలు చెల్లిస్తున్నట్టు తెలుస్తోందని రాయ్ అనే ఓ వైద్య విద్యార్థి ఆరోపించారు. 'రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో బ్యాడ్ స్టూడెంట్స్ ఎక్కువగానే ఉన్నారు. మంచి డాక్టర్ కావాలంటే ఏ కేసునైనా విశ్లేషించే సామర్థ్యం ఉండాలి. రోగానికి, లక్షణాలకున్న సంబంధం కనుగొనే తెలివితేటలు ఉండాలి. ఇప్పటి పీజీ విద్యార్థుల్లో అది కనిపించట్లేదు. ప్రతి చిన్న జబ్బుకు పరీక్షలు, ఎమ్మారై స్కాన్లను ప్రిస్క్రైబ్ చేయడం పరిపాటిగా మారిపోయింది' అని భారతీయ వైద్య సంఘానికి చెందిన భోపాల్ చాప్టర్ మాజీ సెక్రటరీ వ్యాఖ్యానించారు. ఇలాంటి వారంతా బయిటికెళ్లి ప్రాక్టీస్ చేస్తే రోగులను ఆ భగవంతుడే కాపాడాలి. -
ఒక సక్సెస్ వెనుక.. ఫెయిల్యూర్ స్టోరీ
ప్రతి మనిషి విజయాల వెనక అపజయాలు ఉంటాయన్నది అందరికి తెల్సిందే. ఆ అపజయాల వెనక వ్యవస్థీకృత అవినీతి దాగింటుందన్నది పూనం శర్మ సక్సెస్ స్టోరీ చెబుతోంది. ఆమె తండ్రి జూనియర్ పోలీసు అధికారి. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో నివాసం. డాక్టర్ కావాలని కలలు కన్నది. గ్వాలియర్‌లో మంచి కోచింగ్ సెంటర్లు ఉంటాయని తెలుసుకొని 2009లో అక్కడికి మారింది. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఎంబీబీఎస్ పరీక్ష కోసం ఏడాది పాటు కోచింగ్ తీసుకుంది. రోజుకు 14 గంటల చొప్పున కష్టపడి చదువుతూ వచ్చింది. వైద్యకోర్సులో ప్రవేశానికి పరీక్ష దగ్గరపడింది. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోందన్న అనుమానం ఆమెకు వచ్చింది. చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తే తన తోటి విద్యార్ధుల్లో అడ్మిషన్ టెస్టులో సులభంగా పాస్ అవుతామనే ధీమా ఆమెకు కనిపించింది. మెల్లగా తనతో చనువుగా ఉండేవారిని కదిలించింది. . వారి ధీమాకు కారణం ఏమిటని వాకబు చేసింది. జనరల్ క్యాటగిరీలో సీటుకు 12 లక్షల రూపాయలు, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీ సీట్లకు మూడు, నాలుగు లక్షల రూపాయలు చెల్లించినట్టు వారి నుంచి సమాధానం వచ్చింది. పరీక్ష రోజున తెల్లవారుజామున నాలుగు గంటలకు ఓ తెల్లటి వ్యాన్ వారుంటున్న హాస్టల్ వద్దకు వచ్చింది. డబ్బులు చెల్లించినవారంతా ఆ వ్యాన్‌లో బయల్దేరి వెళ్లారు. వారందరికీ ప్రశ్నపత్రాలు చదువుకోమని తెల్లవారే ఐదు గంటలకే ఇచ్చారని ఆ తర్వాత తెలిసింది. వారితోపాటే పరీక్ష రాసిన పూనం శర్మ ప్రవేశ పరీక్షలో ఫెయిలైంది. మళ్లీ రెండోసారి కోచింగ్ సెంటర్లో చేరి ఇదివరకన్నా ఎక్కువ కష్టపడి చదివింది. మళ్లీ పరీక్షలో ఫెయిలయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె మూడోసారి కోచింగ్ సెంటర్లో చేరకుండానే పరీక్షలకు ప్రిపేరయింది. 200 మార్కులకు 162 మార్కులు సాధించింది. ఆ ఏడాది 164 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించడంతో మూడోసారి కూడా సీటు రాలేదు. నాలుగోసారి మళ్లీ ప్రయత్నించి వెయిటింగ్ లిస్ట్‌లో ఆరోస్థానంలో నిలిచింది. వెయిటింగ్ లిస్ట్‌పై పోరాటం జరిపింది. లాభం లేకపోయింది. మొత్తం నాలుగేళ్లు కష్టపడి చదివినా వ్యాపం కుంభకోణం కారణంగా ఆమెకు వైద్య కోర్సులో అడ్మిషన్ దొరకలేదు. అయినా నిరాశా నిస్పృహలకు గురికాకుండా 2014లో ఐదోసారి ప్రవేశ పరీక్ష రాసింది. ఈసారి అఖిల భారత స్థాయిలో ఏడో ర్యాంకు సాధించి తాను కోరుకున్న ఇండోర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో సీటు సాధించింది. దీనికి ఆమె కృషి ఒక్కటే కారణం కాదు. పీకలోతు కుంభకోణాల్లో కూరుకుపోయిన వ్యాపం (మధ్యప్రదేశ్ వ్యవసాయక్ పరీక్షా మండల్)ను రద్దు చేసి అఖిల భారత స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించడమే అసలు కారణం. ఇది ఒక పూనం శర్మ సక్సెస్ స్టోరీ. దీని వెనుక అనేక ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయి. పూనంలాగా పదే పదే ప్రయత్నించే వయస్సుగానీ, సామాజిక పరిస్థితులుగానీ లేని వారు ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేరిపోయారు. అందులో ఒకరు వ్యాపం కుంభకోణానికి వెలికితీసుకొచ్చిన వారిలో ఒకరైన వెటర్నరీ ఫిజీషియన్ ఆనంద్ రాయ్. మరికొందరు డెంటిస్ట్రీ, ఆయుర్వేద, హోమియోపథిలాంటి కోర్సుల్లో చేరిపోయారు. ఇది వారందరి ఫెయిల్యూర్ స్టోరీ. మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన తన తోటి విద్యార్థిని అడ్మిషన్ రాక ఆత్మహత్య చేసుకుందని పూనం శర్మ తెలియజేస్తున్నారు. ఇది అలాంటి వారందరి ఫెయిల్యూర్ స్టోరీ. మొత్తంగా ఈ వ్యవస్థ ఫెయిల్యూర్ స్టోరీ. -
'గొంతు నీదని ఒప్పుకో.. కాదంటే విచారణకు సిద్ధంకా'
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారానికి సంబంధించి టేప్ లో ఉన్న గొంతు తనదో కాదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. లేదంటే విచారణకు సిద్ధమవ్వాలని సవాలు విసిరారు. చంద్రబాబు తీరు ప్రజలను తప్పు దోవపట్టించేలా ఉందని అన్నారు. ఇప్పుడు సెక్షన్ 8ని అమలు చేయాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. మరోపక్క, వ్యాపం కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించడం మంచి పరిణామం అని సురవరం అన్నారు. గవర్నర్‌ను భర్తరఫ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని చెప్పారు. ఫంకజ్ముండే, వసుంధర రాజే, సుష్మా స్వరాజ్, వ్యాపం కేసులు మోదీ ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనాలని చెప్పారు. ఉత్తరాధిన మత ఘర్షణలకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలను చేర్చడానికి తాము వ్యతిరేకమని సురవరం స్పష్టం చేశారు. -
ఆ గవర్నర్ కు ఉద్వాసన తప్పదా..!
న్యూఢిల్లీ : వ్యాపమ్ కుంభకోణంలో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. అదే విధంగా ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కు ఉద్వాసన తప్పదా... అంటే అవుననే కథనాలు వినిపిస్తున్నాయి. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి రాగానే ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఈ రోజు గవర్నర్, కేంద్రానికి నోటీసులు జారీచేసిన విషయం విదితమే. నాలుగు వారాల్లో ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవాలని నోటీసులలో పేర్కొంది. మధ్యప్రదేశ్ కి చెందిన లాయర్లు గవర్నర్‌ను తొలగించాలంటూ దాఖలు చేసిన పిటీషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు కేంద్రం, గవర్నర్ కు నోటీసులిచ్చింది. వ్యాపమ్ కేసులో నిందితుడు-10 గా గవర్నర్ పేరును నమోదు చేసినట్లు పోలీసు డాక్యుమెంట్లలో ఉంది. గత మార్చిలో లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో గవర్నర్ సహా అతని కుమారుడు శైలేశ్ యాదవ్‌లు నిందితులుగా ఉన్నారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు ఒక్కొక్కరు చనిపోతున్న విషయం విదితమే. ప్రభుత్వ టీచర్ల అర్హత పరీక్షల నేపథ్యంలో గవర్నర్ ఆఫీసులో శైలేశ్‌కు రూ.3 లక్షలు లంచం ఇచ్చిన ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. ఈ విషయాలను గమనిస్తే గవర్నర్ రామ్ నరేశ్ పాత్ర ఉందన్న విషయం అర్థమవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. వ్యాపమ్ కేసుకు సంబంధించిన వ్యక్తులు మృతిచెందడం వంటి ఘటనలు, గవర్నర్ పై ఆరోపణలకు ఊతమిస్తుండడాన్ని గమనిస్తే ఆయనపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నమ్రత దామర్‌ది హత్యే!
వెలుగులోకి వ్యాపమ్ మృతురాలి అటాప్సీ రిపోర్ట్ * సీబీఐ దర్యాప్తుపై ‘సుప్రీం’ను కూడా ఆశ్రయిస్తాం * రాజీనామా ప్రసక్తే లేదు; ఎంపీ సీఎం శివరాజ్ * నేడు సుప్రీంలో ‘వ్యాపమ్’ విచారణ ఉజ్జయిన్/న్యూఢిల్లీ: వ్యాపమ్ స్కామ్‌లో భాగంగా.. అక్రమ పద్ధతుల్లో మెడికల్ సీట్ సంపాదించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటూ, 2012లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన నమ్రత దామర్‌ది హత్యేనని తాజాగా తేలింది. ఇండోర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న నమ్రత.. ఈ స్కామ్‌లో తన పేరు బయటపడిన తరువాత 2012లో ఉజ్జయిన్‌లోని ఒక రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించింది. నాటి పోస్ట్‌మార్టం నివేదిక బుధవారం వెల్లడై సంచలనం సృష్టించింది. 2012, జనవరి 9నాటి ఆ నివేదికలో.. ‘బలంగా గొంతు నులమడం వల్ల శ్వాస ఆగిపోయి ఆమె మరణించింది. దీన్నిబట్టి ఇది హత్యగా భావించవచ్చు. ఆమె ముఖంపై చేతిగోర్లతో చేసిన గాయాలు కూడా ఉన్నాయి’ అని ఉంది. దీన్నిబట్టి ఇన్నిరోజులు భావిస్తున్నట్లు ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని స్పష్టమవుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నమ్రత మృతిని మొదట హత్యకేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ తరువాత దాన్ని ఆత్మహత్య కేసుగా మార్చి, కేసును మూసేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నమ్రతది ఆత్మహత్యగా పేర్కొనలేదని పోస్ట్‌మార్టం పరీక్ష నిర్వహించిన ఉజ్జయిన్ జిల్లా ఆస్పత్రి వైద్యుల బృందం సభ్యుడు డాక్టర్ బీబీ పురోహిత్ స్పష్టం చేశారు. ఆమెపై లైంగికదాడి జరిగిందా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు అవసరమైన పరీక్షలు చేయాలని సూచించామన్నారు. నమ్రతది హత్యేనని తేల్చే పోస్ట్‌మార్టం నివేదిక వెలుగులోకి రావడంతో.. ఈ కేసు దర్యాప్తును పునఃప్రారంభిస్తామని తొలుత చెప్పిన పోలీసులు తర్వాత మాట మార్చారు. కేసు దర్యాప్తు ముగిసిందని, నివేదిక ఇచ్చేశామని చెప్పారు. వ్యాపమ్ మరణాల్లో ‘హత్య’కోణం ససాక్ష్యంగా వెలుగులోకి రావడం ఇదే ప్రథమం. నమ్రత మృతిపై పరిశోధన జరిపేందుకు వచ్చిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ శనివారం ఆమె తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసిన కాసేపటికే నురగలు కక్కుకుని చనిపోయిన విషయం గమనార్హం. ఆ తరువాతే ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. మరోవైపు, స్కామ్‌ను సీబీఐకి అప్పగించాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టులో దాఖలైన పిల్‌కు సంబంధించి పిటిషన్‌దారుల తరఫున వాదించిన న్యాయవాది ఆదర్శ్ మున్నీ త్రివేదీ బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన త్రివేదీ.. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అక్రమ అడ్మిషన్లకు సంబంధించిన మరో పిల్‌పై బుధవారం వాదించాల్సి ఉండగా, అనారోగ్యానికి గురయ్యారు. విషాహారం ప్రభావంతోనే అనారోగ్యం పాలయ్యారని త్రివేదీ కుటుంబ సభ్యులు అనుమానం. సీబీఐతో వేర్వేరు దర్యాప్తులు.. స్కాంపై వేరుగా.. అలాగే దానికి సంబంధించిన అనుమానాస్పద మరణాలపై వేరుగా.. ఇలా రెండు వేర్వేరు దర్యాప్తులను సీబీఐచే జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అనుమానాస్పద మరణాలపై సీబీఐ దర్యాప్తు గురించి రాష్ట్రప్రభుత్వం ప్రస్తావించలేదని విమర్శించింది. వ్యాపమ్‌పై తక్షణమే సీబీఐ దర్యాప్తునకు అదేశించకుండా శివరాజ్ సింగ్ నేరపూరిత జాప్యానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. ‘49 మంది అమాయకులు బలైన ఇంత భయంకరమైన స్కామ్‌పై ఇంతవరకు ప్రధాని మోదీ నోరు మెదపకపోవడం దారుణం’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆర్పీఎన్ సింగ్ విమర్శించారు. స్కాంలో సీఎం పాత్ర ఉందనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని, ఈ విషయంపైనా కూలంకష దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. సీఎం పదవిలో శివరాజ్‌సింగ్ కొనసాగితే.. సీబీఐ దర్యాప్తు కూడా నిష్పక్షపాతంగా జరగబోదని అన్నారు. కాగా, ఇండోర్ జైల్లో వారం క్రితం ఒక వ్యాపమ్ నిందితుడు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవండంతో జైల్లో ఉన్న 17 మంది ఇతర వ్యాపమ్ నిందితులను మరో జైలుకు తరలించాలని అధికారులు యోచిస్తున్నారు. అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ అంతర అవయవాల శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం బుధవారం అధికారులు రోహిణిలోని కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు. సంబంధిత పరీక్షల చేసే సౌకర్యాలు తమవద్ద లేవంటూ ఢిల్లీ ఎయిమ్స్ ఆ శాంపిల్స్‌ను వెనక్కు ఇవ్వడంతో మధ్యప్రదేశ్ పోలీసులు వాటిని రోహిణిలోని ఎఫ్ఎస్ఎల్కు తీసుకువెళ్లారు. ఢిల్లీలో చనిపోయిన జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ మృతదేహానికి ఢిల్లీలో బుధవారం పోస్ట్‌మార్టమ్ జరిపి అవయవ నమూనాలను హైదరాబాద్‌లోని సీఎఫ్ఎస్ఎల్ కు పంపారు. ‘సీబీఐ’ బంతి సుప్రీం కోర్టులో.. సంచలనం సృష్టిస్తున్న వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలా? వద్దా? అనే అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. వ్యాపమ్ పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు విచారించనుందని పేర్కొంటూ.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మధ్య ప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు జూలై 20వ తేదీకి వాయిదా వేసింది. దాంతో, సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అలాగే, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనపై కుట్ర జరుగుతోందని, వ్యాపమ్‌పై దర్యాప్తు పూర్తయిన తరువాత అన్ని విషయాలు బయటపడ్తాయని వ్యాఖ్యానించారు. సీబీఐ దర్యాప్తు కోరాలని తనను పార్టీ అగ్రనాయకత్వం ఆదేశించలేదని, అది తాను స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై పార్టీ నాయకులతో చర్చించేందుకు ఆయన బుధవారం ఢిల్లీ వచ్చారు. వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించిన బెయిళ్లు, ఇతర పిటిషన్ల విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. -
నమ్రతది హత్యే: వైద్యుల నిర్ధారణ
వ్యాపం స్కాంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆత్మహత్యగా కొట్టిపారేసిన నమ్రత అనే 19 ఏళ్ల వైద్యవిద్యార్థినిది హత్యేనని ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు చెబుతున్నారు. అది సహజ మరణం కావడానికి ఒక్కశాతం కూడా అవకాశం లేదని నమ్రతా దామర్ అనే ఆ అమ్మాయికి పోస్టుమార్టం చేసిన వైద్య బృందంలోని డాక్టర్ బీబీ పురోహిత్ చెప్పారు. వాస్తవానికి నమ్రత మూడేళ్ల క్రితమే మరణించినా.. ఆ విషయం గురించి ఆరా తీసేందుకు ఆమె తండ్రి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన విలేకరి అక్షయ్ సింగ్ అత్యంత అనుమానాస్పద రీతిలో ఆమె ఇంటిముందే మరణించడంతో నమ్రత మరణం విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. నమ్రత 2012 జనవరి నెలలో ఉజ్జయినిలోని రైల్వే పట్టాల వద్ద మరణించి కనిపించింది.ఈ కేసును విచారించిన పోలీసులు.. ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి.. 2014లో కేసును మూసేశారు. అయితే.. ముగ్గురు వైద్యుల బృందం ఆమెకు పోస్టుమార్టం చేసిందని, తమకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉందని డాక్టర్ పురోహిత్ తాజాగా వెల్లడించారు. ఆమె ముక్కుమీద, నోటిమీద గాయాలున్నాయని, దాన్ని బట్టి చూస్తే ముక్కు, నోరు మూసేసి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. అలాగే, ఆమె మరణించిన తర్వాత మృతదేహాన్ని రైలుపట్టాల మీదుగా లాక్కెళ్లినట్లు కూడా శరీరం మీద గాయాలను బట్టి స్పష్టం అవుతోందన్నారు. కాగా, నమ్రత అక్రమ మార్గంలో మెడిసిన్ సీటు సంపాదించిందన్న ఆరోపణలున్నాయి. -
అసలేం జరుగుతోంది?
'ఈ నగరానికి ఏమైంది....' సినిమా ధియేటర్ లోకి అడుగు పెట్టగానే ప్రేక్షకుడిని పలకరించే సర్కారువారి ప్రకటన ఇది. ఇప్పుడీ మాటను బీజేపీ ముఖ్యమంత్రులకు అన్వయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కాషాయ సీఎంలు వివాదాల్లో చిక్కుకుని వరుసగా పతాక శీర్షికలకు ఎక్కుతున్నారు. 'ముఖ్య' నేతలపై ఆరోపణలు వెల్లువెత్తడం కమలం పార్టీ గుబులు రేపుతోంది. ఇక సాధారణ ఎన్నికల ముందు మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీలను ఏకీపారేసి పీఎం సీటులోకి వచ్చిన నరేంద్ర మోదీ తమ సీఎంలపై వచ్చిన ఆరోపణలతో మౌనమునిగా మారిపోవడం విచిత్రం. అసలేం జరుగుతోంది? రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె 'లలిత్ గేట్'లో చిక్కుకుంటే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 'వ్యాపమ్' స్కామ్ తో విలవిల్లాడుతున్నారు. అనూహ్యంగా సీఎం సీటు దక్కించుకున్న మహారాష్ట్ర 'ముఖ్య' నేత దేవంద్ర పఢ్నవిస్.. తన మంత్రుల కక్కుర్తి పనులతో చిక్కుల్లో పడ్డారు. ఆర్థిక మోసగాడుగా ముద్రపడి దేశాలు పట్టిపోయిన ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీకి 'చిన్నమ్మ' సాయం చేశారన్న వాస్తవం వెలుగుచూడడంతో 'లలిత్ గేట్' తెరుచుకుంది. సుష్మతో పాటు రాజె పేరు బయటికి రావడంతో కాషాయ దళంలో కలకలం రేగింది. అందివచ్చిన అస్త్రాన్ని అందుకుని విపక్షాలు చెలరేగడంతో అధికార పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. పార్టీ కొమ్ముకాయడంతో 'కమలమ్మ'లకు పదవీ గండం దాదాపు తప్పింది. ఇక అంతుచిక్కని చావులతో మృత్యుగీతం మార్మోగిస్తున్న 'వ్యాపమ్' స్కామ్ చౌహాన్ మెడకు చుట్టుకుంది. ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న వారు పిట్టల్లా రాలుతుండడంతో చౌహాన్ సీఎం పీఠం కిందకు నీళ్లు వచ్చాయి. ఎట్టకేలకు మేల్కొన్న శివరాజా వారు 'వ్యాపమ్' మరణాల వెనుకున్న వాస్తవాలను వెలికి తీయాలంటూ సీబీఐ దర్యాప్తుకు కేంద్రానికి అర్జీ పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే 43కు చేరిన 'వ్యాపమ్' మరణాల సంఖ్య ఎక్కడిదాకా ఎగబాకుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. 'పల్లీ చిక్కీ' కొనుగోళ్లలో రూ.206 కోట్లకు మహిళా శిశు సంక్షేమ మంత్రి పంకజ ముండే 'టెండర్' పెట్టారని ప్రతిపక్షాలు దుమారం రేపడంతో 'మహా' ప్రభుత్వం ఉలిక్కిపడింది. విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే రూ.191 కోట్ల కాంట్రాక్టు కుంభకోణం చేశారని విపక్షాలు ఇష్యూ రైజ్ చేశాయి. నీటిపారుదల శాఖ మంత్రి లోణికర్ నకిలీ డిగ్రీ వివాదం, తావ్డే బోగస్ వర్సిటీ అంశం ఫడ్నవిస్ సర్కారుకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎయిరిండియా విమానం నుంచి ప్రయాణికుల దించేశారన్న ఆరోపణలతో ఫడ్నవిస్ కూడా వివాదాలపాలయ్యారు. 'ముఖ్య'నేతలు వరుస వివాదాల్లో చిక్కుకున్నా కమలం పార్టీ వారికి కాపాడుకుంటూ వచ్చింది. ప్రధాని మోదీ అయితే మౌనవ్రతం పాటిస్తున్నారు. సిల్లీ విషయాలపై తాను మాట్లాడబోనంటూ తన పరివారంతో ప్రకటనలిప్పిస్తున్నారు. మోదీ నోరు విప్పాలంటూ విపక్షాలు మాత్రం గొంతు చించుకుంటూనే ఉన్నాయి. -
'సీఎం తప్పుకోవాలి.. సుప్రీం విచారించాలి'
న్యూఢిల్లీ: తీవ్ర అవినీతి, ఘోర నేరాల కలయికగా వ్యాపం కుంభకోణాన్ని అభివర్ణించిన సీపీఎం.. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది. ' కేసు విచారణ సజావుగా సాగేలా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పదవినుంచి తప్పుకోవాలి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలి' అని ఆ పార్టీ పేర్కొంది. ఢిల్లీలో జరిగిన రెండురోజుల పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను విడుదలచేసింది. సీబీఐ విచారణకు ఆదేశించడంద్వారా వరుస మరణాలకు అడ్డుకట్టపడుతుందని, త్వరితగతిన నిజానిజాలు నిగ్గుతేల్చి దోషులకు శిక్షపడేలా చేయాలని కోరింది. ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి సహకరించిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా తక్షణమే పదవికి రాజీనామాచేయాలని డిమాండ్ చేసింది. -
సీబీఐ దర్యాప్తుతో ఏమౌతుంది?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తున్న వ్యాపమ్ కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చివరకు తన మంకుపట్టు వీడారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా హైకోర్టుకు సిఫారసు చేస్తానని మంగళవారం ఆదరబాదరగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఇంతకాలం సీబీఐ దర్యాప్తునకు ససేమిరా అన్న ఆయన ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారో సులభంగానే గ్రహించవచ్చు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వ్యాపమ్ కుంభకోణం కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ సహా పలువురు విజిల్‌బ్లోవర్స్ పిటీషన్లు దాఖలు చేయడం, వాటిని ఈ నెల 9వ తేదీన విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ప్రకటించింది. కేసు సీబీఐ చేతికి పోయినా ఫర్వాలేదుగానీ సుప్రీం కోర్టు పర్యవేక్షణలోకి వెళ్లకూడదని భావించిన చౌహాన్, సీబీఐ దర్యాప్తు నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమౌతోంది. ఇప్పటికే లలిత్‌గేట్ కుంభకోణంతో తలబొప్పికట్టిన కేంద్రంలోని బీజీపి ప్రభుత్వం, ఉన్నంతలో పరువు దక్కించుకునేందుకు ఈపాటికే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఇప్పటికే ఎంతో పరువు పోగొట్టుకుంది. సీబీఐ దర్యాప్తునకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఆందోళనకు అనవసరమైన ఆస్కారమిచ్చింది. పైగా వ్యాపమ్ కుంభకోణం ‘సిల్లీ’ విషయం అంటూ సాక్షాత్తు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యానించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న పరువు కాస్త ఊడగొట్టుకుంది. సీబీఐ దర్యాప్తునకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంగానీ ఎందుకంత భయపడుతుందో అర్థం కావడం లేదు. సీబీఐ ఎలాంటి ప్రలోభాలకు, ప్రభావాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతుందని, కుంభకోణంతో సంబంధమున్న రాజకీయ నేతల గుడ్డలిప్పి దోషులుగా నగ్నంగా నిలబెడుతుందని ఈ ప్రభుత్వాలు భావిస్తున్నాయా? యూపీఏ ప్రభుత్వం కుంభకోణాలపై దర్యాప్తు ముందుకు సాగకపోవడానికి ఆ ప్రభుత్వం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారడమేనంటూ తానే స్వయంగా చేసిన విమర్శలను బీజేపీ అప్పుడే మరిచిపోయిందా ? లేక ఇప్పటికీ సీబీఐపై కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉందని భయపడుతుందా ? సీబీఐ తటస్థంగా వ్యవరిస్తుందని, దానికి వ్యాపమ్ కేసును అప్పగిస్తే ‘మ్యాజిక్’లా దోషులంతా దొరికిపోతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయోమోగానీ సామాన్య ప్రజలకు అంత విశ్వాసం కలగడం లేదు. ఎందుకంటే 2జీ, అక్రమ బొగ్గు కేటాయింపుల కేసుల్లో సీబీఐని సాక్షాత్తు సుప్రీంకోర్టు ‘పంజరంలో రామచిలక’ అని అభివర్ణించింది. ఇప్పటివరకు ఈ కేసు విచారణకు సంబంధించిన బంతి రాష్ట్రం కోర్టులో ఉండగా.. ఇక మీదట కేంద్రం కోర్టులోకి వెళ్తుందన్న మాట. -
'వ్యాపమ్ స్కామ్ సిల్లీ ఇష్యూ'
ఉదయ్ పూర్: మధ్యప్రదేశ్ లో మృత్యుగీతం ఆలపిస్తున్న వ్యాపమ్ కుంభకోణంను 'సిల్లీ ఇష్యూ'గా కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వర్ణించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, సంబంధిత శాఖల మంత్రులతో పాటు తమ పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా కూడా దీనిపై స్పందించారని గుర్తు చేశారు. అన్ని అంశాలకు సమాధానాలిచ్చారని చెప్పారు. ప్రతి చిన్న విషయానికి ప్రధాని జవాబు చెప్పాల్సిన పనిలేదన్నారు. దేశ ప్రజయోనాలకు సంబంధించిన సీరియస్ విషయమైతే స్పందించాలని ప్రధాన మంత్రిని విజ్ఞప్తి చేయవచ్చని చెప్పారు. వ్యాపమ్ కుంభకోణంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన నేపథ్యంలో సదానంద గౌడ ఈ వ్యాఖ్యలు చేశారు. -
'వ్యాపమ్'పై సీబీఐ విచారణకు సిఫారసు
భోపాల్: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారు. ఈ కేసును విచారణ చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని చౌహాన్ మధ్యప్రదేశ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోట్లాది రూపాయల వ్యాపమ్ కుంభకోణం మిస్టరీగా మారింది. ఈ కేసులో సాక్షులు, నిందితులు దాదాపు 48 మంది అనుమానస్పద స్థితిలో చనిపోయారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీబీఐ విచారణకు మొదట్లో నిరాకరించిన మధ్యప్రదేశ్ సీఎం చివరకు అంగీకరించారు. -
వ్యాపమ్ కుంభకోణంపై స్పందించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపమ్ కుంభకోణంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కుంభకోణానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై ఈ నెల 9న విచారణ జరుపుతామని వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ కుంభకోణంలో అనుమానాస్పద మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై స్పందించిన కోర్టు అన్ని పిటిషన్లపై ఈ నెల 9న విచారణ జరుపుతామని మంగళవారం వెల్లడించింది. మరోవైపు... వ్యాపమ్ మృత్యుపాశంగా మారుతోంది. నిందితులు, సాక్షుల వరుసమరణాలు పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా... కానిస్టేబుల్ రమాకాంత్ పాండే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మధ్య ప్రదేశ్ తికమ్‌ఘర్‌లో తన ఇంట్లో రమాకాంత్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. ఈ స్కామ్‌కు సంబంధించి ఎస్టీఎఫ్ అధికారులు పాండేను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒత్తిడి భరించలేకే కానిస్టేబుల్ ఉరి వేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించి గత మూడు రోజుల్లో ఇది నాలుగో మృతి. నిన్న ట్రైనీ ఎస్ఐ అనామిక కుష్వాహా సాగర్ ట్రైనీ సెంటర్ సమీపంలోని ఓ చెరువులో శవమై తేలగా, అంతకుముందు టీవీ టుడే రిపోర్టర్ అక్షయ్‌సింగ్, జబల్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ డాక్టర్ అరుణ్ శర్మ అనుమానాస్వద స్థితిలో మృత్యువాత పడ్డారు -
గవర్నర్‌ను కాపాడుతున్నదేమిటి?
భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై వ్యాపమ్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫారెస్టు గార్డులుగా నియామకానికి ఐదుగురి పేర్లను ఆయన సిఫారసు చేశారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. నిజానికి నైతిక బాధ్యతతో ఆయన తక్షణం గవర్నర్ పదవికి రాజీనామా చేయాలి లేదా కేంద్రమైనా ఆయనను అలా చేయమనాలి. ఈ రెండూ జరగలేదు. గవర్నర్‌గా తనకు రాజ్యాంగపర రక్షణ ఉన్నందున(పదవిలో ఉండగా క్రిమినల్ కేసులో విచారించడం కుదరదు) ఎఫ్ఐఆర్ నుంచి తన పేరు తొలగించాలని ఆయన హైకోర్టుకు వెళ్లి ఉపశమనం పొందారు. ఇంతజరిగినా కేంద్రంలోని మోదీ సర్కారు రామ్‌నరేశ్ జోలికి వెళ్లలేదు. నిజానికి యూపీఏ హయాంలో గవర్నర్లుగా నియమితులైన షీలా దీక్షిత్, బి.ఎల్.జోషి, శేఖర్‌దత్ తదితరులను ‘రాజీనామా’ చేసి వెళ్లిపోయేలా చేసిన మోదీ ప్రభుత్వానికి మరి కాంగ్రెస్‌కు చెందిన, అపఖ్యాతి మూటగట్టుకున్న రామ్‌నరేశ్‌పై ప్రత్యేకప్రేమ ఎందుకు? గవర్నర్‌కు గతంలో ఓఎస్డీగా పనిచేసిన ధన్‌రాజ్‌యాదవ్, స్వయంగా గవర్నర్ కుమారుడు శైలేష్ యాదవ్(ఈయన మార్చిలో అనుమానాస్పదంగా మృతిచెందారు) కూడా ఈ స్కాం నిందితులే. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ దగ్గరి బంధువులకు ఈ స్కాంతో సంబంధముందని ఆరోపణలున్నాయి. గవర్నర్‌గా రామ్‌నరేశ్‌ను సాగనంపితే... రాజ్యాంగపర రక్షణ తొలగిపోయి వెంటనే ఆయనపై కేసు నమోదవుతుంది. సిట్ విచారణలో ఆయన మరిన్ని విషయాలు వెల్లడిస్తే... తెరవెనకున్న పెద్దలకు ఇబ్బందే. గవర్నర్ హోదాలో వ్యాపమ్‌కు సంబంధించిన కీలక ఫైళ్లు, నిర్ణయాలు, సమాచారం రామ్‌నరేశ్ దగ్గరకు వచ్చాయి. మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనేది ఆయనకు లోతుగా తెలుసు. కాబట్టే కేంద్రం ఆయన జోలికి వెళ్లలేదన్న అభిప్రాయం నెలకొంది. 2011లో గవర్నర్‌గా నియమితులైన ఆయన పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్టుతో ముగుస్తుంది. -
ఆగని ‘వ్యాపమ్’ మృత్యుహేల
ట్రైనీ ఎస్సై అనుమానాస్పద మృతి * మధ్యప్రదేశ్ సీఎంపై దాడిని తీవ్రం చేసిన విపక్షాలు * పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ * వ్యాపమ్‌పై సీబీఐ దర్యాప్తును తోసిపుచ్చిన రాజ్‌నాథ్ * ఈ కుంభకోణం విచారణకు అంగీకరించిన సుప్రీం భోపాల్/న్యూఢిల్లీ: ‘వ్యాపమ్’ మరణాలు ఆగడం లేదు. తాజాగా శిక్షణలో ఉన్న ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయి కనిపించారు. వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించి 48 గంటల్లో ఇది మూడో మరణం. మధ్యప్రదేశ్ ‘వైద్య విద్య ప్రవేశాలు, ప్రభుత్వోద్యోగ నియామకాల కుంభకోణం’తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు వరుసగా చనిపోతుండడంపై దేశవ్యాప్తంగా భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ వ్యాపమ్ మరణాల సంఖ్య అధికారికంగానే 26 ఉండగా.. అనధికారికంగా 46కి చేరింది. ఈ భారీ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని, లేదంటే అతడిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ స్కామ్‌తో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్‌ను తొలగించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. మరోవైపు, ఈ స్కామ్‌తో శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రత్యక్షంగా సంబంధం ఉందని ఆరోపించి ప్రజావేగు ఆశిశ్ చతుర్వేది సంచలనం సృష్టించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తదుపరి అనుమానాస్పద మరణం తనదే కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 26 ఏళ్ల ఆశిశ్ ఈ కుంభకోణం బయటపడటానికి ప్రధాన కారకుల్లో ఒకరు. తన ప్రాణానికి కూడా ముప్పుందని మరో ప్రజావేగు ఆనంద్ రాయ్ భయం వ్యక్తం చేశారు. ట్రైనీ ఎస్సై మృతి.. సాగర్ జిల్లాలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఎస్సై ట్రైనింగ్ పొందుతున్న అనామిక సికర్వార్(25).. ట్రైనింగ్ సెంటర్ పక్కనే ఉన్న చెరువులో సోమవారం శవమై కనిపించింది. స్కామ్‌ను పరిశోధించేందుకు వచ్చిన జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్, స్కామ్‌లో భాగంగా మెడికల్ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరిపిన జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన 48 గంటల్లోపే అనామిక మృతి చెందడం గమనార్హం. వ్యాపమ్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆమె ఎస్సైగా ఎంపికయ్యారు. ఎస్సైగా ఆమె నియామకానికి, స్కామ్‌కు సంబంధం లేదని, ఆమె ఈ ఉద్యోగాన్ని అక్రమంగా సంపాదించలేదని పోలీసులు చెబుతున్నారు. అనామిక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నామని సాగర్ ఎస్పీ గౌతమ్ సోలంకీ తెలిపారు. స్కాంకు, ఈ మరణానికి సంబంధం లేదని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ‘వ్యాపమ్ స్కామ్‌తో కానీ, ఆ స్కామ్ దర్యాప్తుతో కానీ అనామిక మృతికి సంబంధం లేదని నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నా. ప్రతీ సంఘటననూ వ్యాపమ్‌తో ముడిపెట్టడం సరికాదు’ అన్నారు. రిజర్వ్‌లో అక్షయ్‌సింగ్ అటాప్సీ నివేదిక జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ మృతదేహానికి గుజరాత్‌లోని దహోద్ జనరల్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యుల బృందం.. ఆయన మృతికి కారణాలపై తమ అభిప్రాయాలను రిజర్వ్‌లో ఉంచింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆ వైద్యులు మృతికి కారణాలను వెల్లడించలేదని జబువా ఎస్పీ ఆబిద్ ఖాన్ తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పరీక్షించేందుకు అక్షయ్‌సింగ్ శరీరాంతర్గత అవయవాలను దహోద్ ఆసుపత్రిలో భద్రపరిచారని ఖాన్ చెప్పారు. మరోవైపు, జబల్పూర్ మెడికల్ కాలేజ్ డీన్ అరుణ్ శర్మ మృతికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి అనుమానాస్పద సాక్ష్యాధారాలు లభించలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ వెల్లడించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు సభ్యుల వైద్య నిపుణుల బృందం శర్మ మృతదేహానికి సోమవారం పోస్ట్‌మార్టం నిర్వహించింది. అక్షయ్‌సింగ్ దేహంపై అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఎలాంటి గాయాలు లేవని పోస్ట్‌మార్టంలో తేలిందన్నారు. ఆ జర్నలిస్ట్ గుండె వ్యాకోచించి ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. మెడికల్ కాలేజ్ డీన్ అరుణ్ శర్మ శరీరంపై గొంతు నులిమిన ఆనవాళ్లున్నాయన్న బస్సీ.. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తామని తెలిపారు. సీఎంగా శివరాజ్ వైదొలగాలి: కాంగ్రెస్ తాజా మరణాలతో సీఎం శివరాజ్‌పై దాడిని కాంగ్రెస్ సోమవారం మరింత తీవ్రం చేసింది. సీఎంగా ఆయన వైదొలగుతేనే ఈ స్కామ్‌లో నిష్పక్షపాత దర్యాప్తు సాధ్యమవుతుందని పేర్కొంది. 45 మరణాల బాధ్యత నుంచి ఆయన తప్పించుకోలేడంది. ఈ స్కామ్ సూత్రధారి ముఖ్యమంత్రేనని ఆరోపించింది. ‘ఈ స్కామ్‌కు సంబంధించి సీఎం, ఆయన కుటుంబసభ్యులపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను తప్పేం చేయలేదని ఆయన భావిస్తే.. తక్షణమే సీబీఐ దర్యాప్తు కోరాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో డిమాండ్ చేశారు. కుంభకోణంపై ప్రధాని ఇంకా మౌనం పాటించడాన్ని వామపక్షాలు, ఆప్ ప్రశ్నించాయి. వ్యాపమ్ మరణాలను కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్‌గా అభివర్ణించిన టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. అవినీతిని, నేరాలను కేంద్రం ప్రోత్సహిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. గవర్నర్ తొలగింపు పిటిషన్‌పై విచారణ వ్యాపమ్ స్కామ్‌లో హస్తం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్‌ను గవర్నర్ పదవి నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సోమవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించిన ఇతర పిటిషన్లతో పాటు దీనిపై కూడా జులై 9న విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. ప్రాణ హాని ఉంది:ఆశిశ్ చతుర్వేది ఈ స్కామ్‌తో సం బంధమున్న వ్యక్తులు చంపేస్తామంటూ తనను బెదిరిస్తున్నా రని స్కామ్ వెల్లడవడానికి ప్రధాన కారకుల్లో ఒకరైన ఆశిశ్ చతుర్వేది తెలిపారు. ‘సైకిల్‌పై వెళ్తుంటాను. నాకు రక్షణగా ఇచ్చిన పోలీసు మరో సైకిల్‌పై తోడుగా వస్తుంటా డు. ట్రాఫిక్‌లో నేనెక్కడో, తానెక్కడో చిక్కుకుంటాం. దాంతో నాపై దాడి సులభసాధ్యమవుతుంది. నాకు రాష్ట్ర, లేదా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి’ అని కోరారు. సీబీఐ దర్యాప్తు ఉండదు: రాజ్‌నాథ్ వ్యాపమ్ స్కామ్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న విపక్షాల డిమాండ్‌ను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. స్కామ్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ జరుపుతోందన్నారు. ‘సుప్రీంకోర్టునో, హైకోర్టునో మేం ఆదేశించలేం. దర్యాప్తు సరిగ్గా సాగడం లేదని హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ భావిస్తే.. సీబీఐ దర్యాప్తునకు అవి ఆదేశాలిస్తాయి. ఆ ఆదేశాలను పాటిస్తాం’ అన్నారు. సీబీఐ దర్యాప్తుకు సంబంధించి దాఖలైన పిల్‌ను హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేశాయన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందన్నారు. కాంగ్రెస్ శవరాజకీయాలు చేస్తోందని మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి నరోత్తమ్ మిశ్రా విమర్శించారు. కోర్టు అనుమతి లేకుండా సీబీఐ కానీ, మరే ఇతర దర్యాప్తు సంస్థను కానీ ఈ స్కాంపై విచారణ జరపాలని ఆదేశించడం కోర్టు పరిధిని అతిక్రమించడమవుతుందని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వివరించారు. జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ మృతిపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులతో.. ‘ఈ రోజు నాకన్నా పెద్ద జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారా!?’ అని వ్యాఖ్యానించి మధ్యప్రదేశ్ బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఇటీవలే ఎంపికైన కైలాశ్ విజయ్‌వర్గియా వివాదంలో చిక్కుకున్నారు. -
స్కాం మొత్తానికి సూత్రధారి ముఖ్యమంత్రే: కాంగ్రెస్
దేశం మొత్తాన్ని వరుస మరణాలతో వణికిస్తున్న 'వ్యాపమ్' స్కాంకు సూత్రధారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహానేనని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయించాలని, సీఎం చౌహాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతేనే విచారణ సవ్యంగా సాగుతుందని, అందువల్ల ఆయన వెంటనే రాజీనామా చేసి స్వతంత్ర విచారణ వేయాలని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ పీసీసీ కూడా సీఎం రాజీనామాకు డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కూడా వ్యాపం స్కాంలో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసును స్పెషల్ టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేస్తోందని, కానీ తమ పార్టీకి ఈ దర్యాప్తుపై నమ్మకం లేదని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఈ స్కాంతో సంబంధమున్న 43 మంది వరకు మరణించిన విషయం తెలిసిందే. -
'శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలి'
భోపాల్: మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టించిన వ్యాపం (వ్యవసాయక్ పరీక్షా మండల్) కుంభకోణంలో నిజాలు నిగ్గు తేలాలంటే ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. శివరాజ్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేసి స్వచ్ఛందంగా విచారణ కోరాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రందీప్ సుర్జేవాల పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణంలో శివరాజ్ చౌహాన్ కూడా నిందితుడేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వ్యాపం పరీక్షల్లో చోటుచేసుకున్న కుంభకోణం శివరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందని.. అందువల్ల ఆ స్కామ్ లో ఆయన్ను కూడా నిందితుడిగా చేర్చాలని కాంగ్రెస్ పేర్కొంది. ఆ అనుమానాస్పద మరణాల వెనుక అసలు విషయాలు బయటకు రావాలంటే శివరాజ్ తక్షణమే రాజీనామా చేయాలని పేర్కొంది. -
'శర్మ మృతి వెనుక కుట్ర లేదు'
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ కుంభకోణంతో సంబంధమున్న జబల్ పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ మృతి వెనుక ఎటువంటి కుట్ర లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఆయన మరణం వెనుక ఎటువంటి కుట్ర ఉన్నట్టు కనబడడం లేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బాసి తెలిపారు. క్రైమ్ విభాగం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారని చెప్పారు. సఫర్దార్ జంగ్ ఆస్పత్రిలో శర్మ మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించారని తెలిపారు. సీసీ టీవీ పుటేజీని పరిశీలించామని చెప్పారు. శర్మ కుటుంబ సభ్యులతోనూ టచ్ లో ఉన్నామని వెల్లడించారు. జబల్పూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్‌శర్మ ఆదివారం ఢిల్లీలో ఒక హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో విగతజీవుడై కనిపించారు. ఇప్పటికే వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించి దోషులుగా, సాక్షులుగా ఉన్న వారి వరుస అసహజ మరణాల సంఖ్య అధికారికంగానే 25 దాటిపోతుండటంతో.. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. -
'అన్ని మరణాలను కుంభకోణానికి ముడిపెట్టొద్దు'
-
వరుసగా డాక్టర్లు కూడా..
ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, బడా వ్యాపారవేత్తల ప్రమేయం ఉన్న 'వ్యాపం' కుంభకోణంలో మరణమృదంగం మోగుతూనే ఉంది. సాక్షులు, నిందితుల ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కుంభకోణం దర్యాప్తునకు సహకరిస్తున్న డాక్టర్లూ బలవుతున్నారు. ఈ కుంభకోణంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్)కు సహకరించడంలో భాగంగా భారత వైద్యమండలి తరఫున అగర్తలాకు వెళ్లాల్సిన జబల్పూర్ వైద్య కళాశాల డీన్ డాక్టర్ అరుణ్ శర్మ ఆదివారం ఢిల్లీ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ కుంభకోణానికి సంబంధించి 200 పేజీల సమాచారాన్ని ఆయన ఎస్టీఎఫ్కు ఇచ్చినట్టు సమాచారం. రిగ్గింగ్ ద్వారా మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందినవారి వివరాలు అందులో ఉన్నట్టు తెలుస్తోంది. డాక్టర్ అరుణ్ శర్మకు ముందు జబల్పూర్ వైద్యకళాశాలకు డీన్‌గా పని చేసిన డాక్టర్ డీకే శకల్లే కూడా ఏడాది క్రితం, అంటే జూన్ 28వ తేదీన అగ్నికి ఆహుతయ్యారు. చైనా తయారీ లేజర్ గన్ ద్వారా ఆయనను కాల్చివేసినట్టు అనుమానాలు ఉన్నాయి. ఆయన కూడా ఇదే కుంభకోణం కేసు విచారణలో దర్యాప్తు సంస్థ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు సహకరించారు. తర్వాత ఇదే కేసుతో సంబంధం ఉన్న గ్వాలియర్ ఆస్పత్రి డాక్టర్ రాజేంద్ర ఆర్య, పశువైద్యుడు నరేంద్ర సింగ్ థోమర్‌లు కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఇదే కేసులో అక్రమ అడ్మిషన్లు రద్దయిన విద్యార్థుల నుంచి వస్తున్న బెదిరింపులను తట్టుకోలేక బుందేల్‌ఖండ్ వైద్య కళాశాల డీన్ డాక్టర్ ఎల్పీ వర్మ నెల రోజులు సెలవుపై వెళ్లడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. -
వ్యాపం స్కామ్: చెరువులో శవమై తేలిన ట్రైనీ ఎస్ఐ
-
'గవర్నర్ తొలిగింపు' దావాను స్వీకరించిన సుప్రీంకోర్టు
-
'గవర్నర్ తొలగింపు' దావాను స్వీకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సంచలనాత్మక వ్యాపం స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేశ్ యాదవ్‌ను తొలగించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిచంది. తీవ్రస్థాయిలో ఆరోపణలను ఎదుర్కొంటున్న కారణంగా పదవి నుంచి తప్పుకోవాలని కేంద్రప్రభుత్వం గతంలోనే ఆయనను ఆదేశించినప్పటికీ రాంనరేశ్ యాదవ్ మాత్రం ఇప్పటికీ గవర్నర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పదవినుంచి తొలిగించాల్సిందిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణంలో గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడు శైలేశ్ యాదవ్ ప్రధాన ముద్దాయి. కాగా గత మార్చిలో శైలేశ్ అనుమానాస్పద రీతితో మరణించారు. గవర్నర్ రాంనరేశ్ యాదవ్ పాత్రకూడా నిర్ధారణ కావడంతో కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్.. హైకోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్లో గవర్నర్ పేను చేర్చింది. ఇప్పటివరకు ఈ కేసులో 2 వేల మందికిపైగా అరస్టుకాగా, మరో 800 మందిని తర్వరలో అరెస్టుచేస్తారనే వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు నిందితులు, సాక్షులు వరుసగా చనిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
వ్యాపం స్కామ్: చెరువులో శవమై తేలిన ట్రైనీ ఎస్ఐ
భోపాల్: దేశవ్యాప్తంగా కలకలం రేపిన వ్యాపం స్కామ్ అంతుచిక్కని మిస్టరీగా మారుతోంది. మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ కుంభకోణంలో అనుమానాస్పద మృతుల సంఖ్య 48కి పెరిగింది. గత మూడు రోజుల్లో ముగ్గురు చనిపోయారు. తాజాగా మహిళా ట్రైనీ ఎస్ఐ అనామికా కుష్వాహ అనుమానస్పద స్థితిలో మరణించారు. సాగర్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ట్రైనీగా ఉన్న కుష్వాహ మృతదేహాన్ని సోమవారం ఉదయం చెరువులో గుర్తించారు. వ్యాపం ద్వారా కుష్వాహ 2014 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికయ్యారు. గత 48 గంటల్లో ఈ కేసు విచారణతో సంబంధమున్న జర్నలిస్టు అక్షయ్ సింగ్, మెడికల్ కాలేజీ డీన్ అరుణా శర్మ అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. కోట్లాది రూపాయల వ్యాపం స్కాంలో సాక్షులు, నిందితులు వరుసగా చనిపోతుండటం మిస్టరీగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ స్కామ్‌పై న్యాయస్థానం ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు కానీ, మరెలాంటి విచారణకు అయినా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. -
వ్యాపం కేసులో మరో అనుమానాస్పద మృతి
-
'వ్యాపం' కేసులో మరో అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ వ్యాపం (వ్యవసాయిక్ పరీక్షా మండల్) కుంభకోణంతో సంబంధం ఉన్న మరొకరు ఆదివారం ఉదయం అనుమానాస్పద రీతిలో మరణించారు. కుంభకోణాన్ని దర్యాప్తుచేస్తోన్న ఉన్నతాధికారుల బృందంలో సభ్యుడు, జబల్ పూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ అరుణ్ శర్మ ఢిల్లీలో శవంగా కనిపించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఉప్పల్ హోటల్ లోని తన గదిలో విగతజీవిగా పడిఉన్న ఆయనను హోటల్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పక్కనే కొన్ని మందులతోపాటు మద్యం సీసాను గుర్తించామని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు వ్యాపమ్ స్కామ్‌లో 42 మరణాలు సంభవించాయి. పలువురు నిందితులు, సాక్షులు అంతుచిక్కని రీతిలో చనిపోతున్నారు. కాగా, ఈ అనుమానాస్పద మరణాలన్నింటిపై దర్యాప్తు జరిపిస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇంకా ఎంతమంది మరణిస్తారో!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపమ్ (వ్యావసాయక్ పరీక్షా మండల్ లేదా మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు) కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన 30 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ నరేంద్ర తోమర్ శనివారం రాత్రి ఇండోర్ జిల్లా జైల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, బెయిల్పైనున్న మరో నిందితుడు రాజేంద్ర ఆర్య (40) కూడా ఇటీవలనే ఆర్ధాంతరంగా చనిపోవడం కలకలం రేపింది. నత్తనడక నడుస్తున్న కేసు విచారణను తట్టిలేపింది. ముఖ్యంగా పరారీలోవున్న తోమర్ గత ఫిబ్రవరిలోనే అరెస్టుకావడం, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఎలాంటి గుండె జబ్బులేని తోమర్ గుండె జబ్బుతో మరణించాడని పోలీసులు చెప్పడం మరిన్ని అనుమానాలకు తెరతీసింది. 2009లో వ్యాపమ్ నిర్వహించిన వైద్య విద్యా పరీక్షల్లో అభ్యర్థుల స్థానంలో ప్రొఫెషనల్స్‌ను పెట్టి రాయించారన్నది తోమర్‌పై ప్రధాన ఆరోపణ. 2013 నుంచి కేసు విచారణ జరుగుతున్న ఈ కేసులో గత ఐదేళ్ల నుంచి ఇప్పటి వరకు నిందితులు, సాక్షులను కలిపి చూస్తే 25 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అనధికార లెక్కల ప్రకారం మాత్రం దాదాపు 40 మంది చనిపోయారు. రాజేంద్ర ఆర్య మరణానికి ముందే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అనుమానాస్పద పరిస్థితుల్లో 23 మంది సాక్షులు, నిందితులు మరణించారని కేసు దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న మధ్యప్రదేశ్ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. నిందితుల్లో ఒకడైన అప్పటి మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ కుమారుడు శైలేష్ యాదవ్ కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం కూడా ఈ కేసులో సంచలనమే. పరువుపోతుందన్న కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తులు వచ్చాయి. ఏది నిజమో, కేసు ఎటు పోతుందో కూడా కేసు దర్యాప్తు చేస్తున్న రాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు తేల్చలేకపోయారు. అనూజ్, అంశూల్ సచన్, శ్యామ్‌వీర్ యాదవ్ అనే ముగ్గురు 2010, జూన్ 14వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ కేసులో అనుమానాస్పద మరణాలు మొదలయ్యాయి. 2009లో జరిగిన ఈ కుంభకోణం 2013లో ఇండోర్ మెడికల్ ప్రాక్టీషనర్ డాక్టర్ ఆనంద్ రాయ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలుతో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 1800 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అరెస్టుకాగా, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కలుపుకొని 129 మంది అరెస్టయ్యారు. రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది బీజేపీ నాయకులే ఉన్నారు. ఓ ప్రొఫెషనల్ అడ్మిషన్ల కేసులో ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం చోటుచేసుకోవడం, ఇంతమంది అరెస్టు అవడం దేశంలో ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఎంతోమంది రాజకీయకులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉండడం, ఎక్కువ మంది నిందితులు, సాక్షులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడమూ కూడా దేశంలో మొదటిసారే. ఈ కేసు కారణంగానే అప్పటి మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖా మంత్రి లక్ష్మీకాంత్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ వ్యాపమ్ కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిచయస్తులు కూడా ఉండడంతో ఈ కుంభకోణంలో ఆయనకు కూడా ప్రమేయం ఉందన్న ఆరోపణలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని, కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుదు దిగ్విజయ్ సింగ్ ఆదివారం నాడు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌ను ఆ రాష్ట్ర హోం మంత్రి బాబూలాల్ గౌర్ సోమవారం నాడు నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారు. కేసుతో సంబంధం ఉండి, మరణించిన నిందితులు, సాక్షులది సహజమరణమేనని, తోమర్ మరణం కూడా సహజమైనదేనని ఆయన స్పష్టం చేశారు. తోమర్ అటాప్సీ నివేదిక రాకముందే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. కేసు విచారణ ముగిసి ప్రధాన చార్జిషీటు దాఖలు చేసేలోగా ఇంకా ఎంతమంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తారో తెలియదు. జూలై 15వ తేదీన కేసులో ప్రధాన చార్జిషీటు దాఖలు చేస్తామని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు గతంలో ఆ రాష్ట్ర హైకోర్టుకు హామీ ఇచ్చారు. మరేం అవుతుందో చూడాలి. -
'ఆ నిందితులవి సహజ మరణాలే'
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మధ్యప్రదేశ్ పరీక్షల కుంభకోణంలో నిందితులుగా ఉంటూ మరణించినవారి సంఖ్య 24కు పెరిగింది. తాజాగా ఇండోర్ జైలులో ఉన్న నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం అనుమానాస్సద రీతిలో మరణించారు. ఇదే కేసులో మరో నిందితుడైన మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేశ్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్ గత మార్చిలో చినిపోయారు. నిందితులు, సాక్షులు కలిపి ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధం ఉన్న 40 మంది మృత్యువాతపడ్డారు. అయితే ఈ మరణాలన్నీ సహజమైనవేనని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించేది లేదని మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ సోమవారం తేల్చిచెప్పారు. 2009లో వెలుగులోకి వచ్చిన మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) కుంభకోణంలో అనేక మంది బడా రాజకీయ నేతల హస్తం ఉదని అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో కేసును దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను నియమించింది. అయితే కేసుతో సంబంధం ఉన్న 40 మంది మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. దరిమిలా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని విపక్షాలు పట్టుపట్టాయి. కానీ సర్కార్ అందుకు నిరాకరిస్తోంది. -
ఆ కేసులో మరో నిందితుడు మరణించాడు
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్(ఎంపీపీఈబీ) కుంభకోణంలోని మరో నిందితుడు చనిపోయాడు. గత రాత్రి తనకు ఛాతి నొప్పి ఉందని చెప్పిన నరేంద్ర సింగ్ తోమర్ ఇండోర్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో నిందితులై ఉండి చనిపోయివారి సంఖ్య 24కు చేరింది. 2009లో ఎంపీపీఈబీ ప్రీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్టు పరీక్ష కోసం అసలు అభ్యర్థులకు నకిలీ అభ్యర్థులను ఏర్పాటుచేసి పరీక్ష రాయించినట్లు నరేంద్ర సింగ్ తోమర్‌పై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కుంభకోణం అప్పట్లో భారీ సంచలనం సృష్టించింది. దీనికే వ్యాపం స్కాం అని కూడా పేరు ఉంది. ఇందులో బడా నేతల హస్తం కూడా ఉంది. ఇప్పటికీ ఆ కేసు కోర్టుల్లోనే నలుగుతుంది కూడా. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు విభాగం(సిట్) ఈ కేసులో నిందితులైనవారిలో 23 మంది చనిపోయారని చెప్పగా.. వాస్తవానికి 40 మంది వరకు చనిపోయారని ఇతర వర్గాలు చెబుతున్నాయి. కాగా, తాజాగా గత శనివారం రాత్రి ఇండోర్‌లోని ఓ జైలులో ఉన్న నరేంద్రసింగ్ తోమర్ తనకు ఛాతీ నొప్పి వస్తుందని చెప్పడంతో అతడిని మహారాజ్ యశ్వంత్ రావ్ అనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు ప్రాణాలుకోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో దీనిపై మేజిస్టీరియల్ దర్యాప్తు జరపాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ కేసులో కీలక నిందితుడు శైలేశ్ యాదవ్(మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కుమారుడు) కూడా ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే. -
ప్రత్యేక విమానంలో అంత్యక్రియలకు...
భోపాల్: మధ్య ప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ తన కుమారుడు శైలేష్ యాదవ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో హాజరుకానున్నారు. అయితే తీవ్ర అనారోగ్యంతో భోపాల్ లోని సంజయ్ గాంధీ మెడికల్ ఇన్సిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు, యాభై ఏళ్ళ కొడుకు శైలేష్ మరణవార్తను కుటుంబ సభ్యులు ఇంకా చెప్పలేదు. డాక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయనను లక్నోకు తరలించే ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలు, అనంతరం పదమూడు రోజుల కార్యక్రమం ముగిసేవరకు గవర్నర్ లక్నోలోనే ఉంటారని సమాచారం. వ్యాపమ్ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న శైలేష్ యాదవ్ బుధవారం లక్నోలోని తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు టీచర్ల పరీక్షలో ఉత్తీర్ణతకు పది మంది విద్యార్థుల నుండి 3 లక్షలను ముడుపులుగా తీసుకున్నట్లు శైలేష్ పై ఆరోపణలున్నాయి. మెదడులో రక్తస్రావమై మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ , పోస్ట్‌మార్టమ్ నివేదిక ఇంకా రావాల్సి ఉంది.