భోపాల్: మధ్యప్రదేశ్‌లోని వ్యాపం కుంభకోణంలో దాదాపు వెయ్యి మంది విద్యార్థుల మెడికల్ డిగ్రీలను సుప్రీం కోర్టు సోమవారం నాడు రద్దు చేయడం పట్ల బాధితులతో పాటు పలు ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోట్లాది రూపాయలను ముడుపులుగా పుచ్చుకొని విద్యార్థులకు వైద్య ప్రవేశ పరీక్షల్లో అవినీతికి ద్వారాలు తెరిచిన రాజకీయ పెద్దలను, ఉన్నతాధికారులను వదిలేసి విద్యార్థులకు శిక్ష విధించడం ఏమిటని బాధితులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డును హిందీ షార్ట్ ఫామ్‌లో వ్యాపం అని పిలుస్తారు. వ్యాపం 2008 నుంచి 2013 వరకు నిర్వహించిన అన్ని వైద్య ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ దర్యాప్తులో తేలింది. విద్యార్థుల దగ్గరి నుంచి కోట్లాది రూపాయలను తీసుకొని వారికి ప్రశ్న పత్రాలను లీక్ చేయడంతోపాటు విద్యార్థులకు బదులుగా ప్రొఫెషనల్స్ ప్రవేశ పరీక్షలు రాసేందుకు అనుమతించినట్లు తేలింది. 2013లో జరిగిన వైద్య ప్రవేశ పరీక్షలో విద్యార్థులకు బదులుగా కొంత మంది ప్రొఫెషనల్స్ పరీక్షలు రాశారని ఫిర్యాదు అందడంతో తీగలాగితే డొంక కదిలినట్లు 2008 నుంచి జరిగిన అవకతకలన్నీ వెలుగులోకి వచ్చాయి.
అమాయకులకు కూడా నష్టం....
ఈ కేసులో అధికార పక్షానికి చెందిన పలువురు బీజేపీ నాయకులతో పాటు ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు, పలువురు ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు వెల్లడయింది. ముందుగా ఈ కేసును విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు అక్రమాలకు పాల్పడిన 634 మంది వైద్య విద్యార్థుల పట్టాలను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. వారు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి మొత్తం 2008 నుంచి 2013 మధ్య అడ్మిషన్లు పొందిన విద్యార్థుల మెడికల్ డిగ్రీలను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పు కారణంగా అమాయకులమైన తాము కూడా నష్టపోతున్నామని అవకతకలతో ప్రమేయంలేని దాదాపు 400 మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దలంతా బయటే ఉన్నారు....
వ్యాపం స్కామ్ విచారణ సందర్భంగా దాదాపు 25 మంది సాక్షులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. వారిలో ఈ కుంభకోణంను వెలుగులోకి తీసుకొచ్చిన జర్నలిస్టు కూడా ఉన్నారు. అలా మరణించిన వారిలో 17మంది మృతిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పాలక పక్ష బీజేపీ నాయకులతో సత్సంబంధాలు కలిగిన, వ్యాపం స్కామ్ సూత్రధారి డాక్టర్ జగదీష్ సాగర్‌ను మినహాయించి ఈ కేసులో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, మధ్యవర్తులు దాదాపు రెండు వేల మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో నాటి వ్యాపం ఎగ్జామినేషన్ కంట్రోలర్ పంకజ్ త్రివేది, చీఫ్ సిస్టమ్ అనలిస్ట్ నితిన్ మహీంద్ర, మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, ఆయనకు ఓఎస్‌డీగా పనిచేసిన ఓపీ శుక్లా, మైనింగ్ దిగ్గజం సుధీర్ శర్మ, కాంగ్రెస్ నాయకుడు సంజీవ్ సక్సేనా తదితరులతోపాటు వ్యాపారవేత్తలు, పలువురు డాక్టర్లు ఉన్నారు. వారంతా ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు.
ఆత్మహత్య మినహా మరో మార్గం లేదు.....
తాము ఎంతో కష్టపడి ఇంటర్నల్ పరీక్షలు రాసి పాసయ్యామని, న్యాయపోరాటంలో కూడా ఎంతో సమయం వృధా అయిందని, ఈ దశలో తమ వైద్య పట్టాలను రద్దు చేస్తే తమ జీవితమంతా మంట కలసిపోతుందని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు తమకు ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో మార్గం లేదని భవేశ్ నాయక్ అనే బాధితుడు వ్యాఖ్యానించారు. నమ్ముకున్న వైద్య విద్య నట్టేట మునిగిపోయిందని, రెండో భవిష్యత్తుకు ప్రభుత్వం తమకు గ్యారంటీ ఇవ్వగలదా? అని సునీల్ జాట్ అనే మరో బాధితుడు ప్రశ్నించారు. నిజమైన నేరస్థులు సమాజంలో స్వేచ్ఛగా సంచరిస్తుంటే తమను శిక్షించడం ఏమిటని దీపక్ బుండేలా అనే బాధిత విద్యార్థి ప్రశ్నించారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగాలని, అందుకు సోషల్ మీడియా కూడా తమకు సంఘీభావం తెలపాలని బాధిత విద్యార్థులు పిలుపునిచ్చారు.
నిర్బంధ సామాజిక సేవే సబమేమో!
అసలే దేశంలో వైద్య విద్యార్థుల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు, విద్యార్థుల వైద్య పట్టాలను రద్దు చేయడం భావ్యం కాదని, కొన్నేళ్లపాటు వారికి నిర్బంధ సామాజిక సేవను విధించి ఆ తర్వాత వారి పట్టాలను వారికివ్వడం సమంజసమని కేసును విచారించిన సుప్రీం త్రిసభ్య బెంచీలో ఒకరైన జస్టిస్ జే.చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. దేశ అవసరాలనో, సామాజిక అవసరాలనో దృష్టిలో పెట్టుకొని తీర్పు ఇవ్వలేమని, విద్యార్థులు అవినీతి మార్గంలో అడ్మిషన్లు పొందినందున వారి పట్టాలను రద్దు చేయడం సబబేనని ఇద్దరు మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు సుప్రీం త్రిసభ్య బెంచీ స్పష్టం చేసింది. న్యాయం పట్ల అంత స్పష్టత కలిగిన బెంచీ అసలైన నిందితులకు ఎప్పుడు శిక్ష విధిస్తుందో చూడాలి.