
చదువు'కొంటే' ఇలాగే ఉంటుంది!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపం కుంభకోణం కారణంగా మధ్యప్రదేశ్‌లో వైద్య విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. 'గత ఏడెనిమిదేళ్లలో వైద్య విద్యార్థుల్లో కనిపించిన చురుకుదనం ప్రస్తుత విద్యార్థుల్లో ఉండడం లేదు. తరగతి గదుల్లో జరిగే చర్చల సందర్భంగా వారిలో ఎక్కువ మంది మౌనంగా ఉంటున్నారు. వాళ్లు ఏ ప్రశ్నా అడగడం లేదు. మేము చెబుతున్నది వారి బుర్రలోకి ఎక్కుతోందో లేదో తెలియదు. కనీసం అర్థమైనా కాకున్నా వింటున్నారా లేదా కూడా తెలీదు. మాలో కూడా చెప్పాలన్న ఉత్సాహం దాదాపు చచ్చిపోయింది' అని ఇండోర్‌లోని ప్రతిష్ఠాత్మకమైన మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీలో ఓ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్న ఓ సీనియర్ ప్రొఫెసర్ (పేరు వెల్లడించేందుకు ఇష్టపడలేదు) వ్యాఖ్యానించారు.
'క్లాసులో మొద్దు విద్యార్థులను గుర్తించడం సులభమే. ఏ ప్రశ్న అడిగినా వారి నుంచి మౌనమే సమాధానం వస్తోంది. ఇంటర్నల్ పరీక్షల్లో అత్తెసరు మార్కులు తెచ్చుకుంటారు. ఫైనల్ పరీక్షల్లో మేనేజ్ చేసుకుంటారు' ఇవి ఓ సీనియర్ ఫాకల్టీ సభ్యుడి నుంచి వచ్చిన వ్యాఖ్యలు.
నేడు స్పెషలైజ్డ్ వైద్యకోర్సుల్లో రేడియోలజీ, సైకియాట్రీ ఆఫ్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ కోర్సులకు డిమాండ్ బాగా ఉందని, ఈ కోర్సుల్లో చేరేవారు దాదాపు కోటి రూపాయలు చెల్లిస్తున్నట్టు తెలుస్తోందని రాయ్ అనే ఓ వైద్య విద్యార్థి ఆరోపించారు. 'రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో బ్యాడ్ స్టూడెంట్స్ ఎక్కువగానే ఉన్నారు. మంచి డాక్టర్ కావాలంటే ఏ కేసునైనా విశ్లేషించే సామర్థ్యం ఉండాలి. రోగానికి, లక్షణాలకున్న సంబంధం కనుగొనే తెలివితేటలు ఉండాలి. ఇప్పటి పీజీ విద్యార్థుల్లో అది కనిపించట్లేదు. ప్రతి చిన్న జబ్బుకు పరీక్షలు, ఎమ్మారై స్కాన్లను ప్రిస్క్రైబ్ చేయడం పరిపాటిగా మారిపోయింది' అని భారతీయ వైద్య సంఘానికి చెందిన భోపాల్ చాప్టర్ మాజీ సెక్రటరీ వ్యాఖ్యానించారు. ఇలాంటి వారంతా బయిటికెళ్లి ప్రాక్టీస్ చేస్తే రోగులను ఆ భగవంతుడే కాపాడాలి.