5 ఏళ్లలో 75 వేల సీట్లు | Increase in medical seats by 10000 annually | Sakshi
Sakshi News home page

5 ఏళ్లలో 75 వేల సీట్లు

Published Sun, Feb 2 2025 4:45 AM | Last Updated on Sun, Feb 2 2025 4:54 AM

Increase in medical seats by 10000 annually

ఏటా 10 వేల మెడికల్‌ సీట్లు పెంపు

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన

అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్‌ కేన్సర్‌ సెంటర్ల ఏర్పాటు

ఈ సంవత్సరంలో 200 సెంటర్లు

కేన్సర్, దీర్ఘకాల రోగాల ఔషధాల చికిత్సకు వాడే 36 మందులపై కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు 

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.99,858.56 కోట్ల కేటాయింపు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్‌లో రూ.99,858.56 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.89,974.12 కోట్లు కేటాయించగా, ఈసారి 11 శాతం మేర పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అలాగే దేశంలో వచ్చే ఏడాది నుంచి మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల్లో అదనంగా పదివేల సీట్లను పెంచనున్నట్లు తెలిపారు. ఈ పెంచిన సీట్ల ద్వారా వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారి కల సాకారమైనట్లేనన్నారు. 

కాలేజీల్లో మెడికల్‌ సీట్ల కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు మెడికల్‌ సీటు రాక.. మరో ఏడాదిపాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ఏడాదికి 10 వేల సీట్ల చొప్పున ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచుతున్నట్లు శనివారం నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2025–26 వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు. తమ ప్రభుత్వం గత పదేళ్లలో 1.1 లక్షల అండర్‌ గ్రాడ్యుయేట్, పీజీ మెడికల్‌ సీట్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు.

జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్‌ కేన్సర్‌ సెంటర్లు
ఇటీవల కాలంలో కేన్సర్‌ బారిన పడుతూ ఎంతోమంది రోగులు ఆసుపత్రుల్లో బారులుతీరుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్రం.. ఆ రోగులకు ఉపశమనం కలిగించేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా డే కేర్‌ కేన్సర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్‌ కేన్సర్‌ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. 2025–26లో సుమారు 200 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కేటాయింపులు ఇలా...
» వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొత్తం రూ.99,858.56 కోట్లను కేటాయించగా, ఇందులో వైద్య, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ.95,957 కోట్లు, ఆరోగ్య పరిశోధనల విభాగానికి రూ.3,900.69 కోట్లు కేటాయించారు.
»  ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు రూ.3,992.90 కోట్ల కేటాయింపు. గత బడ్జెట్‌లో రూ.3,497 కోట్లను కేటాయించారు.. ఇప్పుడు 14.15 శాతం పెంపు.
»  జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.37,226.92 కోట్ల కేటాయింపు. గత బడ్జెట్‌లో రూ.36,000 కోట్లు.
» ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజనకు (ఏబీపీఎం–జేఏవై) రూ.9,406 కోట్లు.
» స్వయంప్రతిపత్తి గల సంస్థలకు రూ.20,046.07 కోట్లు కేటాయించారు. 2024–25లో రూ.18,978.72 కోట్లు కేటాయించారు.

36 మందులకు సుంకం మినహాయింపు
»  కేన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఉపశమనం అందించేందుకు వారు వాడే మందులపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ (బీసీడీ)ని పూర్తిగా మినహాయించను న్నారు. వారు చికిత్సకు వినియోగించే 36 రకాల జీవ ఔషధాలపై ఈ మినహాయింపు వర్తిస్తుందని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 

అలాగే, ఫార్మాకంపెనీలు పేషెంట్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రామ్స్‌ కింద రోగులకు అందించే మరో 37 రకాల మందులతోపాటు 13 కొత్త ఔషధాలకు బీసీడీని మినహాయించనున్నారు. దీంతో ఆయా మందులను రోగులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 
»  ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో దేశంలో మెడికల్‌ టూరిజం, ‘హీల్‌ ఇన్‌ ఇండియా’ను ప్రోత్సహించడంతోపాటు, సులభతర వీసా విధానాన్ని తెస్తామని చెప్పారు. 
»   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ప్రభుత్వ మాధ్యమిక స్కూళ్లకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

మెరుగైన ఆరోగ్య జీవితం కోసం...
ఈ బడ్జెట్‌ మెరుగైన ఆరోగ్య జీవితాన్ని అందించేందుకు దోహదపడుతుంది. దేశంలో 200 డేకేర్‌ కేన్సర్‌ సెంటర్ల ఏర్పాటు, కేన్సర్, దీర్ఘకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులపై కస్టమ్స్‌ డ్యూటీని మినహాయించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ చర్యలు సంక్రమణేతర వ్యాధులపై పోరాటానికి, రోగుల జేబులపై భారం తగ్గించేందుకు దోహదపడతాయి. కొత్త విద్యావకాశాలతోపాటు ఉపాధి కల్పనకు కూడా ఈ బడ్జెట్‌ ఊతమిస్తుంది.
– ప్రతాప్‌ సి.రెడ్డిఅపోలో హాస్పిటల్స్‌ ఫౌండర్, చైర్మన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement