Health and Family Welfare Department
-
అధిక జనాభా వరమా!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా జనాభా అంశంపై చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరో ఏణ్ణర్థంలో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ఎంతో అవసరమైనదీ, తప్పనిసరైనదీ. అయితే ఇందులో ఇమిడివున్న, దీనితో ముడిపడివున్న అనేకానేక ఇతర విషయాలను కూడా స్పృశిస్తే ఈ చర్చ అర్థవంతంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామూహిక వివాహాల సందర్భంగా సోమవారం కొత్త దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చిన్న కుటుంబానికి బదులు ఎక్కువమంది సంతానాన్ని కనాలని ఆశీర్వదించే రోజులొచ్చేశాయి’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. తెలుగునాట అష్టయిశ్వర్యాలు లభించాలని దంపతులను ఆశీర్వదించినట్టే తమిళగడ్డపై కొత్త దంపతులకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆకాంక్షించటం సంప్రదాయం. ఆ ఆకాంక్షను పొడిగించి ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించాల్సి వస్తుందన్నది ఆయన చమత్కారం. ఆ మాటల వెనక ఆంతర్యం చిన్నదేమీ కాదు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ అమాంతం 753కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కసారిగా 210 స్థానాలు పెరుగుతాయన్న మాట! ఆ నిష్పత్తిలో శాసన సభల్లో సైతం సీట్ల పెరుగుదల ఉంటుంది. జనాభా పెరుగుదల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్న నేపథ్యంలో అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలూ... ఆ పెరుగుదల అంతగా లేని దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో స్థానాలూ వస్తాయన్నది ఒక అంచనా. మరో మాటలో చెప్పాలంటే జనాభా నియంత్రణపైనా, విద్యపైనా, ఆర్థికాభివృద్ధిపైనా పెద్దగా దృష్టి పెట్టని రాష్ట్రాలు లాభపడబోతున్నాయన్నమాట!దేశంలో చివరిసారిగా 1976లో పునర్విభజన జరిగింది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేస్తే సమస్యలకు దారి తీయొచ్చన్న కారణంతో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజన ప్రక్రియను 2000 వరకూ స్తంభింపజేశారు. అయితే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. దాని ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య, వాటి పరిధి 2026 తర్వాత జరిగే జనగణన వరకూ మారదు. అయితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను హేతుబద్ధీకరించవచ్చు. దాని పర్యవసానంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని 294 స్థానాల సంఖ్య మారకపోయినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలవారీగా సీట్ల సంఖ్య మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగింది.ప్రతి రాష్ట్రానికీ దాని జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం కల్పించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదని కేంద్రం ప్రకటించింది. కనుక వాస్తవ జనాభా ఎంతన్నది తెలియకపోయినా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ సంఖ్యను 142 కోట్లుగా లెక్కేస్తున్నారు. రాష్ట్రాలవారీగా జనాభా ఎంతన్న అంచనాలు కూడా వచ్చాయి. దాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 80 కాస్తా 128కి చేరుతాయి. బిహార్‌కు ఇప్పుడు 40 స్థానాలున్నాయి. అవి 70కి ఎగబాకుతాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు ఇప్పుడున్న 29 నుంచి 47కూ, రాజస్థాన్‌కు ప్రస్తుతం ఉన్న 25 కాస్తా 44కు పెరుగుతాయని అంచనా. మహారాష్ట్రకు ప్రస్తుతం 48 ఉండగా అవి 68కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ అదే సమయంలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావటం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా, ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ!దక్షిణాదిన జనాభా పెరుగుదల పెద్దగా లేకపోవటానికి ఆర్థికాభివృద్ధి, స్త్రీలు బాగా చదువు కోవటం, దారిద్య్రం తగ్గటం ప్రధాన కార ణాలు. దేశ జనాభాలో 18 శాతంగల దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 35 శాతం వాటా అందిస్తున్నాయి. కుటుంబాల్లో స్త్రీల నిర్ణయాత్మక పాత్ర ఉత్తరాదితో పోలిస్తే పెరిగింది. కీలకాంశాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం వరం కావటం న్యాయమేనా? స్టాలిన్ మాటల ఆంతర్యం అదే. మరికొందరు నేతలు జనాభా పెంచమంటూ ముసిముసి నవ్వులతో సభల్లో చెబుతున్నారు. ఇది నవ్వులాట వ్యవహారం కాదు. పునరుత్పాదక హక్కు పూర్తిగా మహిళలకే ఉండటం, అంతిమ నిర్ణయం వారిదే కావటం కీలకం. అసలు పునర్విభజనకు జనాభా మాత్రమే కాక, ఇతరేతర అభివృద్ధి సూచీలనూ, దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రనూ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఈ విషయంలో విఫలమైతే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరగటం ఖాయమని కేంద్రం గుర్తించాలి. -
తెలంగాణ జనాభా 4.10 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనాభా ప్రస్తుతం 4.10 కోట్లు అని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం తెలంగాణ సంతానోత్పత్తి రేటు 1.6గా అంచనా వేసినట్టు తెలిపింది. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరిస్తామని తెలిపింది. స్వాతంత్ర అమృత మహోత్సవాల సందర్భంగా కుటుంబ నియంత్రణపై ప్రతిజ్ఞ చేయాలని ఆ శాఖ కోరింది. రెండు విడతలుగా పక్షోత్సవాలు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతలుగా పక్షోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి పక్షోత్సవం ఈ నెల 27 నుండి జూలై 10వ తేదీ వరకు, రెండో పక్షోత్సవం జూలై 11 నుండి జూలై 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. మొదటి పక్షం రోజుల్లో జనాభా పెరుగుదల, దానివల్ల కలిగే అనర్ధాల గురించి విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో పక్షోత్సవంలో కోవిడ్ నిబంధనలను అమలు చేస్తూ తాత్కాలిక పద్ధతులు, కుటుంబ నియంత్రణకు శాశ్వత పద్ధతులతో క్యాంప్‌లు నిర్వహిస్తారు. కాపర్–టిపై అవగాహన ఈ క్యాంపుల్లో అర్హులైన పురుషులకు వేసెక్టమీ, స్త్రీలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తారు. ప్రసవం అయిన 48 గంటల్లో వేసే కాపర్–టి గురించి అవగాహన కల్పిస్తారు. ఈ కాపర్–టి 10 సంవత్సరాల వరకు కూడా పని చేస్తుంది. దీనివల్ల బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండటమే కాక అధిక ప్రమాదం గల గర్భములను, మాతృ మరణాలను నివారించవచ్చు. ఈ సేవలన్నీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా లభిస్తాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వేసెక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకున్న వారికి నగదు ప్రోత్సాహకాలు శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అయిన వేసెక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకున్న వారికి, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన అంతర ఇంజెక్షన్ వేయించుకున్న వారికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు. గతేడాది ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న స్త్రీల సంఖ్య 1,14,141, వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న పురుషుల సంఖ్య 3,229 అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ అదనపు సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. -
రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం, కాకినాడలలో మంత్రులు రజిని, చెల్లుబోయిన వేణు, తానేటి వనిత సోమవారం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల భవనాలు, ప్రభుత్వాస్పత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను మంత్రి రజిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాలల్లో మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. వీటిలో 750 సీట్లకు గాను 300 సీట్లకు అనుమతులు మంజూరు కాగా, మిగతా 450 సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు రావాల్సి ఉందన్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళలను చిన్నచూపు చూడటం మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి రజిని సూచించారు. గోదావరి గట్టుపై జ్యోతిరావుపూలే, అంబేడ్కర్ భవన నిర్మాణానికి మంత్రులు రజిని, చెల్లుబోయిన వేణు, తానేటి వనితలు శంకుస్థాపన చేశారు. రాజానగరం నియోజకవర్గం కోటికేశవరంలో రూ.1.54 కోట్లతో నాడు–నేడులో నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని మంత్రి రజిని ప్రారంభించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీరంగపట్నం కళాకారులు నలుగురి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన 8 మందికి రూ.లక్ష వంతున సీఎం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని రజిని, వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అందించారు. కాకినాడ జీజీహెచ్‌లో రంగరాయ పూర్వ విద్యార్థులు సమకూర్చిన రూ.50 కోట్లతో మదర్ అండ్ చైల్డ్‌బ్లాక్, గాంధీనగర్‌లో రూ.1.20 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్, ఆర్ఎంసీలో మెన్స్ హాస్టల్‌ను మంత్రి రజిని ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి) -
పెరుగుతున్న నాన్ కమ్యునికబుల్ జబ్బులు.. 63 శాతం మరణాలకు ఇవే కారణం!
సాక్షి, అమరావతి: ఏం చేస్తున్నారు.. ఏం తింటున్నారు.. ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకొనే వరక మీ దినచర్య, ఆహారాన్ని జాగ్రత్తగా గమనించండి. అవసరమైన మార్పులు చేసుకోండి... మీ జీవిత కాలాన్ని పెంచుకోండి.. అంటోంది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. జీవన శైలి, ఆహార అలవాట్ల వల్లే దేశంలో నాన్ కమ్యునికబుల్ వ్యాధులు పెరుగుతున్నాయని, 63 శాతం మరణాలు వీటి వల్లే కలుగుతున్నాయని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా గుండె పోటుతో పాటు బీపీ, సుగర్, క్యాన్సర్ వ్యాధులకు ప్రధాన కారణం ప్రజల జీవన శైలేనని ఈ మంత్రిత్వ శాఖ 2021–22 వార్షిక నివేదికలో పేర్కొంది. నాన్ కమ్యునికబుల్ జబ్బులతో పాటు గుండెపోటుతో ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజలు కూడా జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించింది. ఈ వ్యాధుల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం స్క్రీనింగ్ చేస్తున్నాయి. అయినా ప్రతి సంవత్సరం బీపీ, సుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ జబ్బుల రోగుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ప్రజలు కూడా ఈ జబ్బులకు కారకాలైన వాటికి దూరంగా ఉండాలని, దిన చర్యలో మార్పులు చేసుకొని, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. నాన్ కమ్యునికబుల్ వ్యాధులు 21వ శతాబ్దంలో కొత్త సవాళ్లను విసురుతున్నాయని పేర్కొంది. పట్టణీకరణతో పాటు జీవనశైలిలో మార్పులకు దారి తీసిందని, కొత్త కొత్త ఆహారపు మార్కెట్లు రావడం, వాటికి ప్రజలు ఆకర్షితులు కావడం, వాటికి తోడు పొగాకు, మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి నాన్ కమ్యునికబుల్ వ్యాధులతో పాటు, గుండెపోటుతో అకాల మరణాలకు దారితీస్తున్నాయని నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 3.53 కోట్ల మందికి స్క్రీనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలకు పైబడిన జనాభాలో 92 శాతం మందికి నాన్ కమ్యునికబుల్ వ్యాధుల స్క్రీనింగ్‌ను పూర్తి చేశారు. ఇప్పటివరకు 3,53,44,041 మంది జనాభాకు పరీక్షలు చేశారు. గుండె జబ్బులు, రక్తపోటు, సుగర్, శ్వాస సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి జబ్బులున్నట్లు పరీక్షల్లో తేలిన వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. వ్యాధుల నివారణోపాయాలు ♦ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి ♦ శారీరక శ్రమను పెంచాలి ♦ మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి ♦ పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి ♦ ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. ఆహారంలో రోజుకు 5 గ్రాములకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి ♦ ఏరేటెడ్ డ్రింక్స్, వేయించిన ఆహారాన్ని తీసుకోకూడదు ♦ పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమలో పాల్గొనాలి ♦ 5 ఏళ్ల నుంచి ఏడేళ్ల లోపు పిల్లలకు ప్రతిరోజు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమ అవసరం. దేశంలో 2020–21లో నాన్ కమ్యునికబుల్ వ్యాధులు స్క్రీనింగ్, చికిత్స వివరాలు -
ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. అటు కాబోయే అమ్మలకు, ఇటు పిల్లలకు రోగ నిరోధక టీకాలివ్వడంలో మొదటి స్థానంలో ఉంది. ఆస్పత్రుల్లో కాన్పులు, నవజాత శిశువులకు 24 గంటల్లో హెపటైటిస్–బి డోసులివ్వడం, గర్భిణులకు యాంటి నేటల్ చెకప్ల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. పిల్లలకు, పోలియో టీకాలు అందించడంలోనూ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. 2021–22లో వివిధ రాష్ట్రాల్లో వైద్య సేవలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. నివేదికలోని కీలక అంశాలు ♦ జాతీయ స్థాయిలో గర్భిణులకు రోగ నిరోధక టీకాలు 86.5 శాతం ఇవ్వగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో నూటికి నూరు శాతం వ్యాక్సిన్లు ఇచ్చారు. తమిళనాడు, దాద్రా నగర్ హవేలీ, డామన్ –డయ్యూ, మహారాష్ట్ర ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ♦9 నుంచి 11 నెలల వయసున్న చంటి బిడ్డలకు రోగ నిరోధక టీకాలివ్వడంలోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉంది. జాతీయ సగటు 91 శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో నూటికి నూరు శాతం చిన్నారులకు రోగ నిరోధక వ్యాక్సిన్లు ఇచ్చారు. గుజరాత్, జమ్మూ– కశీ్మర్, జార్ఖండ్, మహారాష్ట్ర తరువాత స్థానాల్లో నిలిచాయి. ♦ పిల్లలకు పోలియో చుక్కలు వేయడంలో జాతీయ సగటు 87.1 శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో నూరు శాతం నమోదైంది. హెపటైటిస్–బి డోస్‌లకు సంబంధించి జాతీయ సగటు 75.8 % కాగా ఆంధ్రప్రదేశ్‌లో 98.4 %ఉంది. ♦ ఆస్పత్రుల్లో ప్రసవాల జాతీయ సగటు 95.5 శాతం కాగా రాష్ట్రంలో 99.9 శాతం ఆస్పత్రుల్లోనే కాన్పులు జరుగుతున్నాయి. ♦ పూర్తిగా రోగ నిరోధక వ్యాక్సిన్లు 9,14,644 మంది గర్భిణులకు ఇచ్చారు. ♦ 9 – 11 నెలల వయసున్న 8,42,404 మంది చిన్నారులకు టీకాలిచ్చారు. ♦పాఠశాలలకు వెళ్లే 2,58,68,458 మంది బాలికలు, 2,58,19,968 మంది బాలురకు, అంగన్వాడీ కేంద్రాల్లో 4,33,490 మంది బాలికలకు ఐఎఫ్ఐ మాత్రలను అందించారు. రాష్ట్రంలో 1,16,80,448 మంది కౌమార బాలికలకు శానిటరీ న్యాప్కిన్లను అందించి బాలికా విద్యను ప్రభుత్వం ప్రోత్సహించింది. -
Andhra Pradesh: ఆరోగ్య సేవలు సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) నిరంతర సేవలతో అద్భుతమైన పనితీరు కనపరుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. రాష్ట్రంలో నూటికి నూరు శాతం గ్రామీణ పీహెచ్‌సీలు 24 గంటలూ పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు వందకు వంద శాతం 24 గంటలపాటు పనిచేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. ఆ తరువాత స్థానంలో సిక్కిం నిలిచింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ తరహాలో నూటికి నూరు శాతం పీహెచ్‌సీలు నిరంతరం సేవలందించడం లేదని ఇటీవల తెలిపింది. ఏపీలో 100 శాతం.. దేశంలో 45.1 శాతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా అవన్నీ నూటికి నూరు శాతం 24 గంటలు పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. సిక్కింలో 24 పీహెచ్సీలుండగా 24 గంటల పాటు సేవలందిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 24,935 పీహెచ్సీలుండగా 11,250 పీహెచ్‌సీలు మాత్రమే (45.1 శాతం) 24 గంటలు పని చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరచేందుకు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్– 2022ను నిర్దేశించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందులో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, డయాగ్నస్టిక్స్, పరికరాలు, మందులు తదితరాలకు సంబంధించిన నిబంధనలున్నాయి. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. మూడున్నరేళ్లలో పెను మార్పులు.. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడున్నరేళ్లలో ప్రజారోగ్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019 – 20 నుంచి 2021 – 22 మధ్య మూడేళ్లలో ఏపీలో పెద్ద ఎత్తున ఆస్పత్రులు ఏర్పాటైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. రాష్ట్రంలో 11,480 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. దేశంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా సబ్ హెల్త్ సెంటర్లున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 20,781 సబ్ హెల్త్ సెంటర్లు ఉండగా రాజస్థాన్‌లో 13,589 సబ్ హెల్త్ సెంటర్లున్నాయి. ఇక ఏపీలో మూడున్నరేళ్లలో కొత్తగా 304 పీహెచ్‌సీలు ఏర్పాటు కాగా మరో 179 కేంద్రాల పనులు ఇప్పటికే ప్రారంభమై పురోగతిలో ఉన్నాయి. 47 వేలకుపైగా పోస్టుల భర్తీ రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న శ్రద్ధకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు చొప్పున డాక్టర్ల సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న విషయం విదితమే. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీ లేకుండా రికార్డు స్థాయిలో 47 వేలకుపైగా పోస్టులను వైద్య ఆరోగ్యశాఖలో భర్తీ చేశారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను మారుస్తూ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు ఇప్పటికే సేవలందిస్తున్న వైద్య కళాశాలల ఆధునికీకరణ చేపట్టారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,222.85 కోట్లను వ్యయం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయించడంతోపాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ప్రజలకు ఆరోగ్య ధీమాను కల్పిస్తున్నారు. -
నర్సింగ్‌లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో రోగులకు నిరంతరం సేవలందించేది నర్సులే. వైద్యుల సూచనలకు అనుగుణంగా రోగికి కాన్యులా అమర్చడం నుంచి సమయానికి మందులివ్వడం, వైద్య పరికరాలను అమర్చడం, వాటిని నిరంతరం పర్యవేక్షించి రోగి ఆరోగ్య పరిస్థితిని వైద్యులకు తెలియజేస్తుండటం వంటి ఎన్నో రకాల సేవలు అందిస్తుంటారు. ఆస్పత్రుల్లో వీరి సేవలు అత్యంత కీలకం. అందుకే ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆస్పత్రుల్లో వైద్యులతోపాటు నర్సుల నియామకానికీ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. దేశంలో శిక్షణ పొందిన నర్సులు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంటులో వెల్లడించింది. దేశంలో మొత్తం 35.14 లక్షల నర్సులు నమోదైతే అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 1,39 లక్షల మంది ఉన్నారు. అలాగే డాక్టర్ల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతోందని ఆ శాఖ తెలిపింది. దేశంలో డాక్టర్ల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉందని తెలిపింది. శిక్షణ పొందిన నర్సుల సంఖ్యలో రెండో స్థానంలో రాజస్థాన్, మహారాష్ట్ర మూడో స్థానంలోఉన్నాయి. దేశంలో 13,08,009 మంది వైద్యులు నమోదైనట్లు ఆ శాఖ తెలిపింది. వైద్యుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు రెండో స్థానంలో ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం డాక్టర్ల నిష్పత్తి 1:834గా ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే నర్సుల సంఖ్య ప్రతి వెయ్యి జనాభాకు 2.06గా ఉందని పేర్కొంది. మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచడం ద్వారా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. 2014కు ముందు దేశంలో వైద్య కళాశాలలు 387 ఉండగా ఇప్పుడు 654కు పెరిగినట్లు పేర్కొంది. దేశంలో 2014కు ముందు 51,348 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ఇప్పుడు 99,763కు పెరిగినట్లు తెలిపింది. దేశంలో నర్సింగ్ సీట్లను పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా నర్సింగ్ విద్యలో విద్యార్థి, రోగి నిష్పత్తిలో మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపింది. విద్యార్ధి, రోగి నిష్పత్తిని 1:5 నుంచి 1:3కు తగ్గించినట్లు పేర్కొంది. రాష్ట్రంలో మరింతగా పెరగనున్న వైద్యులు, నర్సులు ప్రభుత్వ రంగంలో వైద్య విద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలతో కలిపి ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటునకు రాఫ్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇవన్నీ కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో డాక్టర్లు, నర్సుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. మరో పక్క దేశంలో వైద్య సిబ్బంది కొరత నివారించడానికి కేంద్ర ప్రభుత్వమూ పలు చర్యలు చేపట్టిందని, తద్వారా డాక్టర్లు, నర్సుల సంఖ్య బాగా పెరిగినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. -
టెలిమెడిసిన్ సేవల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: టెలిమెడిసిన్ సేవల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ విశాల్ చౌహాన్ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకుని టెలిమెడిసిన్ సేవలను మరింత మెరుగైన రీతిలో అందించాలని సూచించారు. దేశంలో టెలిమెడిసిన్ విధానాన్ని బలోపేతం చేసే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయ ఆసియా రీజియన్ ఆధ్వర్యాన ఢిల్లీలో నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ చౌహాన్ మాట్లాడుతూ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా టెలిమెడిసిన్ సేవలను అమలు చేస్తున్నామని తెలిపారు. టెలిమెడిసిన్ సేవలకు కరోనా కష్టకాలంలో అత్యంత ఆదరణ లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు టెలిమెడిసిన్ సేవలను విస్తరించిందని తెలిపారు. రాష్ట్రంలో 27 టెలిమెడిసిన్ హబ్‌లను ఏర్పాటు చేశామని, రోజుకు 60వేల టెలి కన్సల్టేషన్లు నమోదవుతున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9.7 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదు కాగా, ఇందులో 3.1కోట్లు (32 శాతం) ఏపీలోనే నమోదయ్యాయని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసి రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్థంగా నడపాలని సీఎం వైఎస్ జగన్ సూచించారన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో టెలిమెడిసిన్ కోసం ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టి అందులో 6,145 మంది డాక్టర్లను రిజిస్టర్ చేయడం ద్వారా అప్పట్లో ప్రజలకు విశేష సేవలు అందించామన్నారు. ఈ డాక్టర్లు 13,74,698 కాల్స్ స్వీకరించి సేవలు అందజేశారన్నారు. -
TB Deaths: రాష్ట్రంపై క్షయ పంజా.. ఐదు నెలల్లోనే 798 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై క్షయ పంజా విసురుతోంది. నాలుగైదు ఏళ్లుగా తెలంగాణలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు టీబీ కారణంగా 798 మంది మరణించారు. గతేడాది (2021) 1,876 మంది చనిపోయారు. క్షయ మరణాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 15వ స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో ఇదేకాలంలో అత్యధికంగా 6,896 మంది మరణించారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 2,845 మంది, గుజరాత్లో 2,675 మంది, మధ్యప్రదేశ్‌లో 2,450 మంది మరణించారు. రాష్ట్రంలో ఏడు నెలల్లో 33,907 కేసులు... రాష్ట్రంలో టీబీ పూర్తి నియంత్రణకు రావడంలేదు. 2017లో 44,644 టీబీ కేసులను గుర్తించగా 2018లో 52,269 మందికి వ్యాధి సోకింది. 2019లో 71,665 మందికి వ్యాపించింది. 2020లో 63,209, 2021లో 60,714 మందికి వ్యాధి సోకింది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూలై 25 వరకు అంటే దాదాపు ఏడు నెలల్లో 33,907 మంది టీబీ బారినపడ్డారు. రాష్ట్రంలో టీబీ కేసులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. ఈ ఏడు నెలల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 6,235 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 2,356 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 2,294 కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 1,409 కేసులు, ఖమ్మం జిల్లాలో 1,299 కేసులు నమోదయ్యాయి. అత్యంత తక్కువగా ఈ కాలంలో ములుగు జిల్లాలో 232 టీబీ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2021 జనవరి–సెప్టెంబర్ మధ్య రాష్ట్రంలో టీబీ రోగులకు చికిత్స అందించగా 89 శాతం మంది నయమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విశ్లేషించింది. మెదక్ జిల్లాలో అత్యధికంగా సక్సెస్ రేటు 97 శాతం ఉండగా జనగామ జిల్లాలో అత్యంత తక్కువగా 79 శాతమే ఉందని తెలిపింది. అదే కాలంలో 1,592 మంది వ్యాధి తగ్గక మరణించగా 192 మందికి చికిత్స విఫలమైందని పేర్కొంది. 28 మంది రోగులు వైద్యానికి నిరాకరించారని వివరించింది. ఆర్థిక సాయం 67 శాతం మందికే... క్షయ వ్యాధిగ్రస్తులకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 500 అందిస్తోంది. అందులో కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్ర వాటా 40 శాతం. అయితే రాష్ట్రంలో అనేక మంది క్షయ రోగులకు ఆ ఆర్థిక సహకారం పూర్తిస్థాయిలో అందడంలేదు. దీంతో అనేక మంది పేద రోగులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై 25 వరకు 67 శాతం మందికి అంటే 22,795 మంది క్షయ రోగులకు ఆర్థిక సాయం అందగా మిగిలిన వారికి రాలేదని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక తెలిపింది. ఆదిలాబాద్‌లోని క్షయ రోగులకు అత్యధికంగా 91 శాతం మందికి ఆర్థిక సాయం అందింది. అత్యంత తక్కువగా రంగారెడ్డి జిల్లా బాధితులు 49 శాతమే సాయం పొందారు. జనగామ జిల్లాలో 52 శాతం, మహబూబాబాద్ జిల్లాలో 56 శాతం, సిద్దిపేట, ములుగు జిల్లాల్లో 55 శాతం, కామారెడ్డి జిల్లాలో 57 శాతం చొప్పున ఆర్థిక సాయం అందింది. మందులకు బ్యాక్టీరియా లొంగకపోవడం, చికిత్సపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గడంలేదని వైద్య నిపుణులంటున్నారు. -
తగ్గుతున్న జననాల రేటు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి స్థాయి తగ్గిపోవడంతో జననాల రేటు గణనీయంగా తగ్గనుందని జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంచనా వేశాయి. 2035 నాటికి దేశంలో జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి, జననాల రేటుపై అంచనా నివేదిక రూపొందించాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందిలో 20.1 జనన రేటు ఉండగా 2031–35 నాటికి 13.1కి తగ్గిపోనుందని అంచనా వేశారు. బిహార్‌లో మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో జననాల రేటు గణనీయంగా తగ్గనుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, పంజాబ్‌లో అత్యల్పంగా ప్రతి వెయ్యి మందిలో 9.9కి జననాల రేటు పడిపోనుందని నివేదిక అంచనా వేసింది. 1951లో దేశంలో ప్రతి వెయ్యి మందిలో 40.8 జనన రేటు ఉండగా 2001 నాటికి 25.4కు తగ్గిపోయింది. 2005లో 23.8 జనన రేటు ఉండగా 2011 నాటికి 20.1కి క్షీణించింది. సంతానోత్పత్తి స్థాయి గణనీయంగా తగ్గుతుండటంతో జననాల రేటు తగ్గిపోతున్న విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 2021–22 వార్షిక నివేదికలో కూడా ప్రస్తావించింది. -
ఎంబీబీఎస్ సీట్లలో రాష్ట్రానికి ఏడో స్థానం
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యధికంగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో తమిళనాడు 10,725 సీట్లతో తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాత కర్ణాటకలో 10,145 సీట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో 9,895 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 9,053 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో 5,040 సీట్లున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అయితే వచ్చే వైద్య విద్యా సంవత్సరంలో తెలంగాణలో కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. Üసంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు, రామగుండం జిల్లాల్లో కొత్త కాలేజీలు రానున్న సంగతి తెలిసిందే. తద్వారా మరో 1,200 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా వస్తాయి. అయితే జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఈ సీట్లకు అనుమతి ఇస్తున్నట్లు తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 91,927 ఎంబీబీఎస్ సీట్లు.. ఇటీవల నిర్వహించిన నీట్– 2022 పరీక్ష ఫలితాలు త్వరలోనే రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులు ఎక్కడెక్కడ కాలేజీలున్నాయి.. తమకు వచ్చే ర్యాంకు ప్రకారం ఏ కాలేజీలో సీటు వస్తుందనే దానిపై గతేడాది లెక్కల ప్రకారం అంచనాలు వేస్తున్నారు. కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ తాజా నివేదిక ప్రకారం ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు గణనీయంగా పెరిగాయి. 2017–18 లో 67,523 సీట్లుంటే.. ఇప్పుడు ఏకంగా 91,927 సీట్లు అందుబాటు ఉండటం గమనార్హం. జిప్మర్, ఎయిమ్స్‌తోపాటు ఈ సీట్ల సంఖ్యను కేంద్రం ప్రకటించింది. మొత్తం 322 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 48,212 సీట్లుంటే, 290 ప్రైవేట్ మెడికల్ కాలే జీల్లో 43,915 సీట్లున్నాయి. అంటే ప్రైవేట్‌లో కంటే ప్రభుత్వ కాలేజీల్లోనే ఎక్కువ సీట్లున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం 11 ప్రభుత్వ మెడికల్ కాలే జీల్లో 1,840 ఎంబీబీఎస్ సీట్లుంటే, 23 ప్రైవేట్ కాలేజీల్లో 3,200 సీట్లున్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ సారి కటాఫ్ తగ్గే అవకాశం.. కేంద్రం ఈ ఏడాది దేశవ్యాప్తంగా కొత్తగా 4,058 పీజీ మెడికల్ సీట్లకు అనుమతి ఇవ్వగా, అందులో తెలంగాణలో 279 సీట్లు పెరిగాయి. మరో పక్క ఈసారి నీట్ పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని నిపుణులు అంచనా వేశారు. కాబట్టి గతేడాది కంటే ఈసారి పది మార్కుల వరకు కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. 2020 నీట్లో జనరల్ కటాఫ్ 147, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 113 మార్కులకు ఉంది. 2021 నీట్లో జనరల్ కటాఫ్ 138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 108గా ఉంది. ఈసారి జనరల్ కటాఫ్ 125–130 మధ్య, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 100 వరకు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్ష ర్యాంకు వరకు వచ్చినా కూడా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. -
ఈ మందులకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ మందుల చీటీ (ప్రిస్కిప్షన్) లేకుండా 16 రకాల మందులను ఔషధ దుకాణదారులు విక్రయించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. లైసెన్స్ ఉన్న దుకాణదారులే వీటిని విక్రయించాలని స్పష్టం చేసింది. రోగి సమాచారాన్ని తీసుకొని మందులు ఇవ్వాలని పేర్కొంది. ఆయా మందులను ఐదు రోజుల వరకే వాడాలని, అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలని రోగులకు విజ్ఞప్తి చేసింది. ప్రిస్క్రిప్షన్ అవసరం లేని మందుల జాబితా 1) పొవిడోన్ అయోడిన్ – యాంటీ సెప్టిక్; 2) క్లోరోహెక్సిడైన్ గ్లుకోనేట్– మౌత్ వాష్; 3) క్లోట్రిమాజోల్ క్రీం (యాంటీ ఫంగల్); 4) క్లోట్రిమాజోల్ డస్టింగ్ పౌడర్(యాంటీ ఫంగల్); 5) డెక్స్ట్రోమితార్పన్ హైడ్రోబ్రోమైడ్ లొంజెస్– 5 ఎంజీ (దగ్గు తగ్గేందుకు); 6) డైక్లోఫినాక్ క్రీమ్/ఆయింట్మెంట్/జెల్ (నొప్పి తగ్గించేందుకు); 7) డైఫెన్‌హైడ్రామైన్ కాప్సూ్యల్స్–25 ఎంజీ (యాంటీ అలెర్జిక్); 8) పారాసిటమాల్–500 ఎంజీ మాత్రలు; 9) సోడియం క్లోరైడ్ నాజల్ స్ప్రే (ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం); 10) ఆక్సిమెటాజోలైన్ నాజల్ సొల్యూషన్ (ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం); 11) కీటొకోనాజోల్ షాంపూ (చుండ్రు నివారణ); 12) లాక్టులోస్ సొల్యూషన్ 10 గ్రా/15 ఎంల్ (మలబద్దక నివారణ); 13) బెంజోల్ పెరాక్సైడ్ (మొటిమల నివారణ); 14) కాలమైన్ లోషన్ (యాంటీ సెప్టిక్); 15) జైలోమిటాజోలైన్ హైడ్రోక్లోరైడ్ (ముక్కు దిబ్బడ తగ్గించేందుకు); 16) బిసాకొడిల్–5 ఎంజీ మాత్రలు (మలబద్దక నివారణ) -
పెరుగుతున్న ఆయుష్షు
సాక్షి, అమరావతి: మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటంతో దేశంలోను, రాష్ట్రంలోను ప్రజల జీవిత కాలం పెరుగుతోంది. ప్రధానంగా పురుషుల కన్నా స్త్రీల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందని జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక పేర్కొంది. 2031–35 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, స్త్రీ, పురుషుల ఆయర్దాయంపై నివేదికను రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మగవాళ్ల కన్నా ఆడవాళ్ల ఆయుర్దాయం నాలుగేళ్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. రాష్ట్రంలో 2011–15 మధ్య మహిళల ఆయుర్దాయం 71.2 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 75.6 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో పురుషుల ఆయుర్దాయం 2011–15 మధ్య 67.1 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 71.4 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా వేశారు. అంటే పురుషులకంటే స్త్రీల ఆయుర్దాయం నాలుగేళ్లు ఎక్కువ ఉంటుందని నివేదిక వెల్లడిస్తోంది. దేశంలో 2011–15 మధ్య స్త్రీల ఆయుర్దాయం 70 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 74.7 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా. పురుషుల ఆయుర్దాయం 2011–15 మధ్య 66.9 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 71.2 సంవత్సరాలు ఉంటుందని అంచనా. దేశంలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక దేశం మొత్తంమీద కేరళ రాష్ట్రంలోనే పరుషులు, స్త్రీల ఆయుష్షు అత్యధికంగా ఉంటుందని అంచనా వేశారు. కేరళలో మహిళల ఆయుర్దాయం 2031–35 మధ్య 80.2 సంవత్సరాలు, పురుషుల ఆయుర్దాయం 74.5 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్‌లో పురుషుల, స్త్రీల ఆయుర్దాయం అత్యల్పంగా ఉంటుందని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో 2031–35 మధ్య పురుషుల ఆయుర్దాయం 69.4 సంవత్సరాలు, మహిళల ఆయుర్దాయం 71.8 సంవత్సరాలు ఉంటుందని అంచనా. దేశంలో ఏటేటా పురుషులు, స్త్రీల ఆయుష్షు పెరుగుతుందని నివేదిక తెలిపింది. పెరుగుతున్న వృద్ధులు అన్ని రాష్ట్రాల్లో ఆయుర్దాయం పెరుగుతుండటంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. దేశంలో సంతానోత్పత్తి క్షీణించడంతో పాటు జనం ఆయుర్దాయం పెరుగుతుండటం దీనికి కారణమని వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం జనాభాలో వృద్ధుల వాటా 8.4 శాతం ఉంది. 2031–35 మధ్య వృద్ధుల సంఖ్య రెండింతలు పెరిగి 14.9 శాతానికి చేరుతుందని నివేదిక అంచనా వేసింది. -
రూ.100 కోట్లతో ఎన్సీడీసీ ఏర్పాటు
తాడేపల్లి రూరల్: దేశం మొత్తం మీద ఏదైనా ఆరోగ్యపరమైన విపత్తులు సంభవించినపుడు వాటి గురించి రీసెర్చ్ చేయడం కోసం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ సెంటర్ (ఎన్సీడీసీ)ను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కొలనుకొండ నుంచి ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లే దారిలో రెండెకరాల స్థలాన్ని ఇందుకోసం గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ కేటాయించారు. సర్వే నం. 372/10 రెండెకరాల భూమిని ఎన్సీడీసీ సంస్థకు అప్పగించాలని స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. 5వ తేదీన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ సంస్థకు ఈ స్థలాన్ని అప్పగించనున్నట్లు సమాచారం. కాగా, రూ.100 కోట్ల వ్యయంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతోమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రెండెకరాల స్థలం కేటాయించాం.. ఎన్సీడీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు స్థలం కావాలని ప్రతిపాదనలు పంపింది. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ çఆదేశాల మేరకు ఎయిమ్స్‌కు వెళ్లే రహదారిలోని జాతీయ రహదారి వెంబడి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. త్వరలోనే ఎన్సీడీసీకి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేస్తాం. – తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి -
వ్యాక్సిన్: ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్రం వింత సమాధానం
సాక్షి, హైదరాబాద్: కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లకు సంబంధించిన ఇండెంట్ సమాచారం తమ వద్ద లేదని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టంచేసింది. దేశంలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లకు అనుమతి ఎప్పుడు ఇచ్చారు? దేశ ప్రజల కోసం ఎన్ని డోసుల వ్యాక్సిన్లు ఆర్డర్ ఇచ్చారు? ఏ తేదీన ఇచ్చారు? అన్న వివరాలు కోరుతూ హైదరాబాద్‌కు చెందిన విజయ్‌గోపాల్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా జూన్ 18న దరఖాస్తు చేశారు. దీనికి కేంద్రం సమాధానం చూసి ఆయన అవాక్కయ్యారు. ఏ వ్యాక్సిన్‌కు, ఏ రోజున ఎంత ఆర్డర్ పెట్టారు? అన్న ప్రశ్నకు తమ వద్ద సమాచారం లేదని బదులిచ్చింది. -
Corona: పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవే..
న్యూఢిల్లీ: కరోనా మొదటి దశలో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. గత ఏడాది పిల్లలు, టీనేజర్లు కరోనా బారిన పడిన దాఖలాలు చాలా తక్కువగా కనిపించాయి. కానీ సెకండ్ వేవ్‌లో మహమ్మారి పిల్లలను కూడా వదలడం లేదు. చిన్నారులకు కోవిడ్ సోకుతున్న కేసులు ఇటీవల దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. కారణమేంటంటే.. ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. దాంతో పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టారు. యువత కాలేజీలు, పాఠశాలలకు వెళ్లారు. ఈ లోపు కరోనావైరస్లో కొత్త మ్యుటేషన్లు పుట్టుకొచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో రద్దీ పెరగడం, సామాజిక దూరం పాటించకపోవడం, వైరస్ కొత్త మ్యుటేషన్లకు వేగంగా సోకే లక్షణం ఉండటం.. కేసుల పెరుగుదలకు కొన్ని కారణాలుగా భావిస్తున్నారు. కరోనా సోకిన పిల్లల్లో ఉండే లక్షణాలేంటి.. పిల్లల్లో కోవిడ్ లక్షణాలు ఉన్నాయో లేదో.. ఒకవేళ చిన్నారులు మహమ్మారి బారిన పడితే తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక మార్గాలు, మార్గదర్శకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇక మంత్రిత్వ శాఖ ప్రకారం పిల్లల్లో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే మహమ్మారి బారిన పడుతున్నారని.. చాలా తక్కువ కేసుల్లోనే సింప్టమ్స్ కనిపిస్తున్నాయని తెలిపింది. (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే) పిల్లల్లో జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు,రుచి, వాసన కోల్పోవడం, మయాల్జియా(కండరాల నొప్పి, స్నాయువులో నొప్పి), రినోరియా(ముక్కు నుంచి విపరీతంగా నీరు కారడం.. క్రమేణా అది చిక్కని శ్లేష్మంగా మారడం), కొద్ది మంది పిల్లల్లో జీర్ణశయాంతర సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వీటితో పాటు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటే కచ్చితంగా కరోనావైరస్ సోకిందని అనుమానించాలి. పసివాళ్లు నొప్పిగా ఉందని చెప్పలేరు కాబట్టి వాళ్లు నిరంతరం ఏడుస్తున్నా, విచిత్రంగా ప్రవర్తిస్తున్నా నొప్పితో బాధపడుతున్నారని అనుమానించాలి. చికిత్స, ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు సాధారణంగా పిల్లలు కోవిడ్ బారిన పడితే త్వరగానే కోలుకుంటారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక లక్షణాలు కనిపంచని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందివ్వాలని.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. విడవకుండా గొంతు నొప్పి, దగ్గు ఉన్నప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా, ఆయసం, ఆక్సిజన్ లెవల్స్ 90 శాతం కన్నా పడిపోయినా, విడవకుండా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ఉంటే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే) కోవిడ్ సెకండ్ వేవ్‌ల్లో పైన చెప్పినా లక్షణాలే కాక ఇతర లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. చర్మం, పెదవులు, గోళ్లు పాలిపోవడం, చిరాకు పడటం, ఆపకుండా ఏడ్వడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. చదవండి: పిల్లలకు కరోనా వస్తే.. ఈ మందులు వాడొద్దు 12 ఏళ్లు పైబడిన పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ -
జ్వరమొస్తే కరోనా, డెంగీ టెస్టులు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఒకవైపు, కరోనా మరోవైపు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ, కరోనాతో జనం గజగజలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండూ ఒకేసారి వస్తే చికిత్స అందించడం వైద్యులకు సవాల్‌గా మారిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే కరోనా, డెంగీ పరీక్షలు రెండూ చేయించాలని సూచించింది. కరోనా, డెంగీ జ్వరాల్లో లక్షణాలు దాదాపు దగ్గరగా ఉండటం వల్ల వ్యాధిని గుర్తించడంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని తెలిపింది. మరో విషయం ఏంటంటే రెండింటిలోనూ 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదని తెలిపింది. ఇవి తీవ్రమైతే మాత్రం ఆస్పత్రిలో చేరాల్సిన స్థితి ఎదురవుతుంది. కాబట్టి వేగంగా చికిత్స అందించడమే ముఖ్యమని తెలిపింది. రెండింటికీ నిర్దిష్టమైన చికిత్స లేనందున వైద్యుల సమక్షంలో లక్షణాలకు అనుగుణంగా చికిత్స పొందాల్సి ఉంటుంది. పైగా రెండింటికీ వేర్వేరు చికిత్స చేయాలి. ఎందుకంటే డెంగీలో ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు. కరోనా రోగుల్లో వాటిని ఇవ్వడం ద్వారా అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్ సిండ్రోమ్, ఊపిరితిత్తుల్లో వాపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టకుండా ఇచ్చే హెపారిన్ మందు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. డెంగీ రోగుల్లో హెపారిన్ ఇస్తే రక్తస్రావం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్లో కరోనా, డెంగీ బారిన ప్రజలు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం కోరింది. ఇంకా ఏం చేయాలంటే? ► రెండింటి బారిన పడిన బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స అందించాలి. బాధితుడిలో లక్షణాలు, సమస్యలను బట్టి చికిత్స చేసే విధానాన్ని మార్చాలి. ► డెంగీ బాధితుల్లో ‘ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ (పీసీవీ)’ఎక్కువగా ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. అలాగే ప్లేట్లెట్స్ ఎక్కించే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. ► రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడూ పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించాలి. ► ఛాతీలో ఇన్ఫెక్షన్ తీవ్రతను తెలుసుకోవడానికి ఎక్స్‌రే, సీటీ స్కాన్ చేయించాలి. ► ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డెంగీ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ముఖానికి మాస్కు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి కరోనా నివారణ పద్ధతులు పాటించాలి. -
20 శాతం మందికి వైరస్ వచ్చి పోయింది
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొందరిలో వారికి తెలియకుండానే వైరస్ వచ్చి తగ్గిపోతుంది. ఇలాంటి వారిని అంచాన వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సీరో సర్వైలెన్స్ నిర్వహించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో రెండు దఫాలుగా ఈ సర్వే నిర్వహించారు. ముందుగా తూర్పుగోదావరి, అనంతపురం, నెల్లూరు, కృష్ణా జిల్లాలో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకూ నిర్వహించారు. ఆ తర్వాత ఆగస్టు 26 నుంచి 31 వరకూ మిగిలిన 9 జిల్లాల్లో సర్వే జరిగింది. వీటి ఫలితాలను ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. ఈ సందర్భంగా కమ్యూనల్ డీసీజ్ ఎంత తీవ్రస్థాయిలో ఉందో తెలుసుకోవడం కోసం సీరో సర్వేలేన్స్ చేపడతారన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్. కోవిడ్-19 వ్యాప్తిని అంచనా వేయడానికి ఈ సీరో సర్వే చేశామన్నారు. దేశంలో తొలుత హరియాణాలో ఈ సర్వే చేయగా.. ఆ తర్వాత ఏపీలోనే చేశామని తెలిపారు. ఇందుకు గాను రెండు దశల్లో సీరో సర్వే నిర్వహించామన్నారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో ఐదు వేల మంది శాంపిల్స్ టెస్ట్ చేశామన్నారు. పూర్తిగా ఏ లక్షణాలు లేని వారి మీద కూడా ఈ సర్వే చేపట్టామన్నారు. (కరోనా నియంత్రణకు నిర్దిష్ట ప్రణాళిక) కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ.. ‘అనంతపురం, కృష్ణా, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలో ఆగస్టు 5 నుంచి 15 వరకు మొదటి దశ సర్వే లెన్స్ నిర్వహించాం. దీనిలో భాగంగా 3500 మంది శాంపిల్స్ సీరో సర్వే చేశాం. ఆ తర్వాత రెండో దశలో భాగంగా ఆగస్టు 26 నుంచి 31 వరకు మిగతా జిల్లాల్లో 5వేల మందికి చొప్పున సర్వే చేశాం. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక రౌండ్ సిరో సర్వే పూర్తయ్యింది. దీని వల్ల ఇప్పటికే 19.7శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతంలో 18.2 శాతం.. పట్టణ ప్రాంతంలో 22.5 శాతం.. కంటైన్మెంట్ జోన్లలో 20.5 శాతం.. నాన్ కంటైన్మెంట్ జోన్లలో19.3 శాతం.. హై రిస్క్ పాపులేషన్ జోన్లలో 20.5 శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినట్లు తెలుస్తోంది అన్నారు. పురుషుల్లో 19.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ కాగా.. మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. (పారదర్శకంగానే ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లు) ఈ సర్వే ద్వారా త్వరలోనే కర్నూల్, విజయనగరం జిల్లాలో కేసులు తగ్గుముఖం పడతాయని అంచనా వేశామన్నారు భాస్కర్. అలానే రానున్న రోజుల్లో చిత్తూరు, విశాఖలో తగ్గుముఖం పట్టనుండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు పెరిగే అవకాశం ఉందని సీరో సర్వే ద్వారా అంచనా వేయడం జరిగిందన్నారు. ఇక్కడ పరీక్షలు ఎక్కువగా చేస్తాం, బెడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. -
కరోనా పిల్లల వార్డుల్లోకి తల్లిదండ్రులకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పిల్లల వార్డుల్లోకి తల్లిదండ్రులను కొన్ని షరతుల మేరకు అనుమతించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది. పిల్లలతో కలసి ఉంటే వైరస్ వ్యాప్తికి గల ప్రమాదాలను తల్లిదండ్రులకు వివరించాలని, వారి అంగీకారం తీసుకున్నాక వార్డుల్లో ఉండేందుకు అనుమతినివ్వాలని తెలిపింది. ఈ మేరకు వివిధ అంశాలపై స్పష్టతనిస్తూ బుధవారం మార్గదర్శకాలు జారీచేసింది. ఇక పెద్దలు ఎవరైనా ఆసుపత్రుల్లో కరోనాతో బాధపడుతుంటే, వారి వద్దకు బంధు వులు, కుటుంబ సభ్యులను ఏమాత్రం అనుమతిం చొద్దని స్పష్టంచేసింది. అలా వెళ్లనిస్తే వారికి వ్యాధి సోకి, తద్వారా ఇతరులకూ వ్యాప్తి చెందే ప్రమాదముందని పేర్కొంది. ప్రస్తుతం కొన్ని ఆసుపత్రులు కరోనా రోగులుండే వార్డుల్లోకి బంధువులు, కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నాయి. దీనివల్ల వైరస్ వ్యాప్తి జరుగుతుందన్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు కీలకం కానున్నాయి. ప్రారంభ దశలోనే ప్లాస్మా.. కరోనా తీవ్రత ఉన్న రోగులకు ప్రారంభ దశలోనే ప్లాస్మా చికిత్స చేయాలని కేంద్రం స్పష్టంచేసింది. అయితే దీన్ని జాగ్రత్తగా చేయాలని పేర్కొంది. దీన్ని ప్రయోగాత్మక చికిత్సగా కూడా పరిగణించాలని వెల్లడించింది. కరోనా రోగుల్లో కొందరు తీవ్రమైన నిరాశ, ఒత్తిడికి గురవుతుంటారు. ఒంటరిగా ఉండటం, వ్యాధికి సంబంధించిన కారణాల వల్ల ఆందోళన చెందుతుంటారు. ఇటువంటి రోగులకు మానసిక వైద్యుల సలహా అందించాల్సి ఉంటుందని వివరించింది. ఇతర అంశాలపైనా కేంద్రం మార్గదర్శకాలు.. ► వైద్య సిబ్బందిలో రోగ నిరోధక శక్తి కోసం కొన్ని పరిమితుల్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలను వాడొచ్చు. ► అలాగే కరోనా నుంచి రక్షించడానికి పీపీఈ కిట్లను సరైన పద్ధతుల్లో వాడాలి. ఇతర ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులను ఉపయోగించాలి. ► కరోనాలో కొన్ని ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. కొన్నిసార్లు గుండెపోటు వంటివి వస్తున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువున్న రోగులను దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు, ఇతరత్రా అనారోగ్య సమస్యలుంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వీటన్నింటినీ గమనించకుండా కరోనా రోగులను డిశ్చార్జి చేయడానికి అనుమతించకూడదు. ► కార్టికోస్టెరాయిడ్స్ ప్రస్తుతం మధ్యస్థం నుంచి తీవ్రమైన కరోనా రోగులకు వాడొచ్చు. ► టోసిలిజుమాబ్ మందును డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించింది. అయినప్పటికీ ఇది ఒక ప్రయోగాత్మక చికిత్సనే. దీనివల్ల ప్రయోజనం అంతంతే. ఇన్ఫెక్షన్లు పెద్దగా లేని సైటోకిన్ సిండ్రోమ్ ఉన్న రోగుల్లో మాత్రమే వాడాలి. ► ఫావిపిరావిర్‌ను ప్రధానంగా తేలికపాటి లేదా లక్షణాలు లేని వారికి ఉపయోగిస్తున్నారు. దీని వాడకంపై జాతీయ మార్గదర్శకాల్లో ఎక్కడా సిఫార్సు చేయలేదు. ► రెమిడెసివిర్ కూడా ప్రయోగాత్మక చికిత్సే. వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని డీసీజీఐ ఆమోదించింది. అందువల్ల అనుమానాస్పద కరోనా కేసులకు వీటిని వాడకూడదు. అవసరమని వైద్యులు భావించిన కరోనా రోగుల్లో మాత్రమే ఉపయోగించాలి. -
పెరుగుతున్న పట్టణ జనాభా
సాక్షి, అమరావతి: దేశంలో పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతోంది. రానున్న కాలంలో ఇది రికార్డు స్థాయిలో ఉండనుందని, 2021–36 మధ్య కాలంలో మరింతగా పెరగనుందని ‘నేషనల్ కమిషన్ ఆన్ పాప్యులేషన్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ దేశ జనాభాపై నిర్వహించిన అధ్యయనంలో.. 2011–21తో పోలిస్తే 2021–36లో దేశ జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గనుందని చెప్పింది. అయితే, మొత్తం జనాభాలో మాత్రం భారత దేశం చైనాను అధిగమించి మొదటి స్థానానికి చేరుకోనుంది. నివేదికలోని మరిన్ని ప్రధాన అంశాలను పరిశీలిస్తే... పల్లెల్లో తగ్గుతున్న జనాభా ► 2011తో పోలిస్తే 2036 నాటికి దేశంలో పట్టణ జనాభా 57 శాతం పెరగనుంది. ► 2011లో 37.70 కోట్లుగా ఉన్న పట్టణ జనాభా 2036 నాటికి 59.40 కోట్లకు చేరుకోనుంది. అంటే, 31 నుంచి 39 శాతానికి చేరుకుంటుంది. ► ఇక 2011లో 69 శాతంగా ఉన్న గ్రామీణ జనాభా 2036 నాటికి 61 శాతానికి తగ్గుతుంది. ► ఢిల్లీ జనాభాలో 98 శాతం పట్టణ జనాభా ఉండగా 2036 నాటికి 100 శాతానికి చేరుకుంటుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో 50 శాతానికి పైగా జనాభా పట్టణాల్లోనే ఉంటుంది. ఏపీలో పట్టణ జనాభా 42 శాతానికి చేరుకుంటుంది. ఉత్తరాదిలోనే పెరుగుదల.. దక్షిణాదిలో నియంత్రణ ఎప్పటి మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందంజలో ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే జనాభా పెరుగుదల అధికంగా ఉండనుంది. ► ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు జనాభా పెరుగుదలలో మొదటి రెండు స్థానాల్లో ఉండనున్నాయి. పెరిగే జనాభాలో 36 శాతం ఆ రాష్ట్రాల్లోనే ఉండనుంది. ఇక 2011లో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మందిగా ఉన్న స్త్రీలు , 2036 నాటికి 952 మందికి చేరుకోనున్నారు. కాగా ఏపీ, తమిళనాడు, కేరళలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. 2036 నాటికి 152 కోట్ల జనాభా ► దేశ జనాభా 2021 నాటికి 136 కోట్లకు, 2031 నాటికి 147 కోట్లకు, 2036 నాటికి 152 కోట్లకు చేరుతుంది. ► 2011–21లో దేశ జనాభా పెరుగుదల రేటు 12.5 శాతం ఉంటుందని కమిషన్ పేర్కొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇదే అతి తక్కువ జనాభా పెరుగుదల రేటు. కాగా, 2021–31లో దేశ జనాభా పెరుగుదల రేటు 8.4 శాతానికి తగ్గుతుంది. -
15 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 48,512 తాజా కేసులు వెలుగుచూడటంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 15,31,669కి ఎగబాకింది. మహమ్మారి బారినపడి ఒక్కరోజులో 768 మంది మరణించారు. దీంతో దేశంలో కోవిడ్-19 మరణాల సంఖ్య 34,193 దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,09,447 యాక్టివ్ కేసులుండగా, మహమ్మారి నుంచి కోలుకుని 9,88,030 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. భారత్‌లో కోవిడ్-19 రికవరీ రేటు 64 శాతంగా ఉందని తెలిపింది. ఇక ఈనెల 28 వరకూ దేశవ్యాప్తంగా 1,77,43,740 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 4,08,0855 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. చదవండి : కరోనా: రెండున్నర నెలల్లో ఇదే అత్యధికం -
రిస్క్ జోన్స్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమవుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుం బ సంక్షేమ మంత్రిత్వ శాఖ చెబుతోంది. కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే అది ఒక్కరికే పరిమితం కావడం లేదని, కుటుంబ సభ్యుల్లో సగటున 60 శాతానికి పైగా సోకుతోందని విశ్లేషించింది. కరోనా వైరస్ భారినపడుతున్న వారిలో ఎక్కువగా అపార్ట్మెంట్లు, గేటె డ్ కమ్యూనిటీ సొసైటీలు, రెసిడెన్షియ ల్ కాంప్లెక్స్‌ల్లో ఉండే వారే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సం క్షేమ మంత్రిత్వ శాఖ పరిశీలనలో తే లింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అంచనాకందే స్థితిలో ఉన్నప్పటికీ జాగ్రత్తలు పాటించకుంటే వ్యాప్తి వేగం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తోంది. ఈ మేరకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రతులను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్లో కూడా అందుబాటులో పెట్టింది. నిఘా కట్టుదిట్టం చేస్తేనే... గేటెడ్ కమ్యూనిటీ సొసైటీలు, అపార్డ్‌మెంట్‌ల్లో ఎక్కువ సం ఖ్యలో కుటుంబాలు ఉండడంతో సాధారణంగా రాకపోకలు అధికంగానే ఉంటాయి. నివాసితులతో పాటు వారి కో సం వచ్చే విజిటర్స్ సంఖ్య కూడా ఎక్కువే. ఈ క్రమంలో నిఘా కట్టుదిట్టం చేసి జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షే మ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విజిటర్స్‌ను అనుమతించేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు మాస్కు, హ్యాండ్‌వాష్ లేక శానిటైజర్‌తో చేతు లు శుభ్రం చేసుకున్న తర్వాతే లోనికి రానివ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లొద్దని చెబుతున్న ప్రభుత్వం... ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన పదేళ్లలోపు పిల్లలంతా ఇంటికే పరిమితం కావాలని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. అదేవిధంగా ముఖానికి ఫేస్‌షీల్డ్‌లు లేదా 3 లేయర్ల మాస్కు లు తప్పకుండా ధరించాలి. ఇతర వస్తువులు, వేరేచోట్ల చేతులతో తాకాల్సిన పరిస్థితుల్లో తప్పకుండా హ్యాండ్‌వాష్ లేదా శానిటైజర్లతో చేతుల్ని శుభ్రంగా కడగాలి. బహిరంగంగా ఉమ్మివేయడాన్ని పూర్తిగా నిషేధించాలి. నిర్లక్ష్యం చేస్తున్నారు... కోవిడ్–19ను ఎదుర్కొవాలంటే ఈ వ్యాధి వ్యాప్తి, నిలువరిం చే అంశాలపై అవగాహన అతిముఖ్యమని ప్రభుత్వం చెబు తోంది. ఈ దిశగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. కానీ జాగ్రత్తలు పాటించడంలో చాలామంది నిర్లక్ష్యం చూపుతున్నారనే అభిప్రాయాన్ని కేంద్రం వ్యక్తం చేస్తోంది. అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ సముదాయాల్లో నివాసితులు అవాస ప్రాంత పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో చర్చిం చుకుంటే మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ సొసైటీలు, ఇతర కాలనీల్లో ఉంటున్న వారంతా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో టచ్‌లో ఉంటున్నారు. ఈ పద్ధతిని అందరూ కొనసాగిస్తే తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే కోవిడ్–19ను వీలైనంత వరకు నిలువరించవచ్చునని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. -
లక్షణాలనుబట్టి చికిత్స
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాప్తి విస్తృతం అవుతున్న నేపథ్యంలో రోగులకు చికిత్స అందిస్తున్న విధానాలకు సంబంధించి కేంద్రం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇకపై పాజిటివ్‌గా నిర్ధారించిన వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లడం కంటే వ్యాధి తీవ్రతను బట్టి ఇంటి వద్దే చికిత్స అందించేలా కొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘క్లినికల్ గైడెన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ కరోనా’పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని పాటిస్తూ కరోనా పేషంట్లకు చికిత్స అందించాలని సూచించింది. మూడు కేటగిరీలుగా విభజన.. కరోనా రోగులను మూడు రకాలుగా విభజిస్తారు. రోగి లక్షణాలు, తీవ్రతను బట్టి మైల్డ్ (స్వల్ప లక్షణాలు), మోడరేట్ (వ్యాధి తీవ్రత మధ్యస్తంగా ఉంటే జ్వరం, దగ్గు తదితర లక్షణాలు కలిగి ఉండటం), సివియర్ (లక్షణాలు తీవ్రంగా ఉండటం) కేటగిరీలుగా గుర్తిస్తారు. స్వల్ప లక్షణాలతో ఉన్న వారికి ఇంట్లోనే క్వారంటైన్ చేసి చికిత్స అందించొచ్చు. అయితే వైద్యుల సలహా మేరకు ఇంటి వద్ద చికిత్స అందించే స్థాయి వాళ్లను మాత్రమే ఈ కేటగిరీగా గుర్తిస్తారు. మోడరేట్, సివియర్ కేటగిరీల్లోని రోగులను తప్పకుండా ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందించాలి. తాజా మార్గదర్శకాల ప్రకారం.. మోడరేట్ కేటగిరీ రోగులపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. వీరికి లక్షణాలు ఉండటం వల్ల చికిత్సలో నిర్లక్ష్యం జరిగితే సివియర్‌గా మారే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వారి ప్రాణాలు కాపాడేందుకు మోడరేట్ స్థాయిలోనే చికిత్స అందించి కోలుకునేలా చేయాలనేది కేంద్రం ప్రధాన ఉద్దేశ్యం. మోడరేట్‌గా గుర్తించిన వారిని జిల్లా ఆస్పత్రి లేదా కరోనా కోసం గుర్తించిన ఆరోగ్య కేంద్రంలోకి తరలించి చికిత్స చేయాలి. కరోనా వైరస్ రోగి ఊపిరితిత్తులపైనే కాకుండా రక్తనాళాలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో రక్తం గడ్డకట్టకుండా నిర్దేశించిన మందులను ముందే ఇస్తే మంచి ఫలితం ఉంటుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. రోగి నుంచి వైరస్ సోకుతుందిలా.. కరోనా వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే విధానంపై కేంద్రం మరింత స్పష్టత ఇచ్చింది. రోగికి వ్యాధి లక్షణాలు ప్రారంభమయ్యే రెండ్రోజుల ముందు నుంచి.. లక్షణాలు మొదలైన 8 రోజుల వరకు ఇతరులకు సోకే వీలుంటుంది. మొత్తంగా 10 రోజుల పాటు వైరస్ సోకే అవకాశాలు ఎక్కువని కేంద్రం స్పష్టం చేసింది. అయితే కరోనా వైరస్ సోకి, లక్షణాలు లేని వాళ్లు ఎంతమందికి ఈ వైరస్‌ను అంటిస్తారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. 48 శాతం మందిలో జ్వరం, దగ్గు కరోనా వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేసిన పరిశోధనలో తేలింది. కరోనా సోకిన వారి దరఖాస్తుల్లోని సమాచారం ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చింది. 15,366 మంది దరఖాస్తులను పరిశీలించి విశ్లేషించగా.. అందులో జ్వరం 27%, దగ్గు 21%, గొంతులో గరగర 10%, దమ్ము 8%, బలహీనత 7%, ముక్కు నుంచి నీరు కారడం 3%, ఇతర లక్షణాలున్న వారు 24% మంది ఉన్నట్లు గుర్తించారు. వాసన, రుచి తెలియట్లేదా? కరోనా లక్షణాల్లో తాజాగా వాసన, రుచి గుర్తించలేకపోవడాన్ని కేంద్రం తాజాగా జతచేసింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి జ్వరం, దగ్గు, త్వరగా అలసిపోవడం, దమ్ము రావడం, కీళ్లు, కండరాల నొప్పులు, గొంతులో గరగర, ముక్కు నుంచి నీరు కారడం, విరోచనాలు తదితర లక్షణాలుంటాయి. తాజాగా కేంద్రం కరోనా లక్షణాల్లో వాసన, రుచి గుర్తించకపోవడాన్ని జోడించింది. కరోనా వైరస్ సోకిన పిల్లల్లో మాత్రం ఈ లక్షణాలు కనిపించవు. వారికి త్వరగా నయమయ్యే అవకాశం ఉన్నా.. ఎక్కువ వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. మరోవైపు వయసు పైబడ్డ వారిలో, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ లక్షణాలకు బదులుగా చికాకుగా ఉండటం, ఒక్కసారిగా మంచం పైనుంచి లేవలేని పరిస్థితికి వెళ్లడం, సోయి లేకుండా పోవడం, విరోచనాలు ఉంటాయి. కృత్రిమ శ్వాస చివరి ప్రయత్నం కరోనా వైరస్ సోకిన రోగికి కృత్రిమ శ్వాస అందించడం చివరి ప్రయత్నంగా ప్రభుత్వం నిర్దేశించింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాతే ఈ పద్ధతి ఎంచుకోవాలి. అయితే ఈ ప్రయత్నాన్ని అమలు చేసే ముందు రోగి మూత్రపిండా లు, కాలేయం పని తీరు సంతృప్తికరంగా ఉంటేనే చేయాలి. కృత్రిమ శ్వాసలో భాగంగా ఎక్కువ ఆక్సిజన్‌ను అందిస్తారు. ఎన్–95 మాస్కులు ఐసీయూలో ఉండే వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రమే వాడాలి. మిగతా రోగులకు మాత్రం ట్రిపుల్ లేయర్ మాస్కులు ఇస్తే సరిపోతుంది. కరోనా రోగుల్లో అరవై ఏళ్లు పైబడిన వాళ్లు, షుగర్, బీపీ, ఊపిరితిత్తులకు సం బంధించిన జబ్బులు, అవయవాలు మార్పిడి చేసుకున్న వాళ్లతో పాటు ఇతర కారణాలతో రోగనిరోధక శక్తి తగ్గించే మందులు వాడే వాళ్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. – కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి,నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల -
స్థానిక భాగస్వామ్యం పెంచండి
న్యూఢిల్లీ: పట్టణ నివాస ప్రాంతాల్లో కోవిడ్–19 కేసులు ఎక్కువ సంఖ్యలో బయటపడుతుండటంతో కేంద్రం మరిన్ని వనరులను ఉపయోగించుకునేందుకు యోచిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు స్థానికులతో సన్నిహితంగా ఉండే రాజకీయ, మత నాయకుల సేవలను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కోరింది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేలా ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను వీరికి అప్పగించాలంది. అదేవిధంగా, ‘పట్టణ ప్రాంతాల్లో ‘సంఘటన ప్రతిస్పందన వ్యవస్థ’ను ఏర్పాటు చేసి, సమర్థుడైన వ్యక్తిని ‘ఇన్సిడెంట్ కమాండర్’గా నియమించాలి. ఈ కమాండర్ కరోనా సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం అందించడంతోపాటు ఆయా కంటైన్మెంట్లలో ప్రణాళిక, నిర్వహణ, రవాణా, ఆర్థిక వ్యవహారాలను అమలు చేస్తుంటారు. ఇన్సిడెంట్ కమాండర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే సమన్వయ కమిటీలో ఆరోగ్య, మహిళాశిశు సంక్షేమ శాఖల అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, ఇప్పటికే ఆ ప్రాంతంలో సేవలందిస్తున్న ఎన్జీవోలు సభ్యులుగా ఉంటారు’ అని పేర్కొంది. ‘ప్రజలు తమ నివాస ప్రాంతాలకే పరిమితమయ్యేందుకు సెక్షన్–144 అమలు చేయడంతోపాటు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలి. ఇతర ప్రాంతాల నుంచి కంటైన్మెంట్లలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించాలి. వీటిని ఎంత కచ్చితంగా అమలు చేస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి’అని తెలిపింది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం వరకు ఏపీ, తెలంగాణల్లోని కర్నూలు, గ్రేటర్ హైదరాబాద్‌లతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 30 మున్సిపాలిటీల్లోనే ఉన్న విషయం తెలిసిందే. -
వారందరికీ సామూహిక పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వలసదారులకు సామూహిక కరోనా నిర్ధా రణ పరీక్షలు (పూల్డ్ శాంపిలింగ్) చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ గురువారం రాష్ట్రా లను ఆదేశిస్తూ, మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి వేలాది మంది ఇక్కడకు వస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొందరు వైరస్ అనుమానిత లక్ష ణాలతో ప్రభుత్వ క్వారంటైన్లో ఉన్నారు. అలాగే, విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పర్య వేక్షణలో తమ సొంత ఖర్చులతో హోటళ్లు, లాడ్జిల్లో క్వారంటైన్లో ఉన్నారు. వీరందరికీ సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కేంద్రం పేర్కొంది. వాస్తవంగా విదే శాల నుంచి వచ్చే వారు, సంబం ధిత దేశంలో ప్రయాణానికి ముందే కరోనా నిర్ధా రణ పరీక్షలు చేయించుకొని వచ్చారు. నెగెటివ్ వచ్చి న వారినే ప్రయాణానికి అనుమతించారు. అయినా తాజా మార్గదర్శకాల ప్రకారం వారందరికీ ఈ పద్ధతిలో నిర్ధారణ పరీక్షలు చేస్తారు. మరోవైపు 21 రోజులుగా ఒక్క కేసూ నమోదుకాని గ్రీన్‌జోన్ జిల్లాలకు చెందిన వారికీ నిర్ణీత సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలుసుకోవడానికి వీలవుతుంది. 25 మందికి ఒకేసారి.. రివర్స్ ట్రాన్స్‌స్క్రిప్షన్ పాలిమరెస్ చైన్ రియాక్షన్ (ఆర్టీ–పీసీఆర్)గా పిలిచే ఈ సామూహిక కరోనా నిర్ధా రణ పరీక్షల వల్ల ఒకేసారి ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ విధానంలో 25 మంది శాంపి ళ్లను కలిపి ఒకేసారి పరీక్షిస్తారు. ఇం దులో పాజిటివ్ వస్తే, వారిలో ఎంత మందికి వైరస్ సోకిందో గుర్తించేం దుకు మరోసారి ఆ 25 మందికి విడివిడిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తారు. ఒకవేళ నెగెటివ్ వస్తే వారందరికీ కరోనా లేనట్టు గుర్తించి ఇంటికి పంపిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సామూహిక కరోనా పరీక్షలను సీసీఎంబీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం వల్ల వంద మందిలో కరోనా ఉందో లేదో అంచనా వేయాలంటే, నాలుగు పరీక్షలు చేస్తే సరిపోతుంది. దీంతో టెస్టింగ్ కిట్లు సరిపోతాయని, సమయం, డబ్బు ఆదా అవుతాయని అంటున్నారు. ఒక్కో పరీక్షకు సగటున రూ.4,500 ఖర్చవుతుందని అంచనా. ప్రతి ఒక్కరినీ విడివిడిగా పరీక్షించే కన్నా ఈ పద్ధతిలో టెస్టులు జరిపితే తక్కువ టెస్టింగ్ కిట్లను సమర్థంగా వినియోగించుకున్నట్టవుతుంది. ప్రస్తుతం అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సామూహిక పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడనుంది. అదీగాక సర్కారు క్వారంటైన్లలో ఉండే వలసదారులకు, విదేశాల నుంచి వచ్చే వారికి, గ్రీన్జోన్లలో ఉన్నవారికి సామూహిక పరీక్షలు చేయడమే మేలని అంటున్నారు. సిబ్బంది కోసం ఇదీ ప్రొటోకాల్ సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం ప్రొటోకాల్ రూపొందించింది. దీని ప్రకారం.. శిక్షణ పొందిన లేబరేటరీ సిబ్బంది ఆప్రాన్, హ్యాండ్‌గ్లోవ్స్, గాగుల్స్, ఎన్–95 మాస్క్‌లు ధరించాలి. ప్రొటోకాల్ ప్రకారం ఆయా వ్యక్తుల గొంతు నుంచి స్వాబ్ శాంపిళ్లను సేకరించాలి. శాంపిళ్లు ఎవరివనే వివరాలను లేబులింగ్‌పై రాయాలి. ఇలా ఒక ధపాలో సేకరించిన 25 శాంపిళ్లను ట్రిపుల్ లేయర్లో ప్యాకేజ్ చేస్తారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కోల్డ్–చైన్‌లో లేబరేటరీలకు తరలించి వాటిని ఒకేసారి పరీక్షిస్తారు.