సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) నిరంతర సేవలతో అద్భుతమైన పనితీరు కనపరుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. రాష్ట్రంలో నూటికి నూరు శాతం గ్రామీణ పీహెచ్‌సీలు 24 గంటలూ పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు వందకు వంద శాతం 24 గంటలపాటు పనిచేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. ఆ తరువాత స్థానంలో సిక్కిం నిలిచింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ తరహాలో నూటికి నూరు శాతం పీహెచ్‌సీలు నిరంతరం సేవలందించడం లేదని ఇటీవల తెలిపింది.
ఏపీలో 100 శాతం.. దేశంలో 45.1 శాతం
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా అవన్నీ నూటికి నూరు శాతం 24 గంటలు పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. సిక్కింలో 24 పీహెచ్‌సీలుండగా 24 గంటల పాటు సేవలందిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 24,935 పీహెచ్‌సీలుండగా 11,250 పీహెచ్‌సీలు మాత్రమే (45.1 శాతం) 24 గంటలు పని చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరచేందుకు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్– 2022ను నిర్దేశించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందులో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, డయాగ్నస్టిక్స్, పరికరాలు, మందులు తదితరాలకు సంబంధించిన నిబంధనలున్నాయి. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
మూడున్నరేళ్లలో పెను మార్పులు..
ఆంధ్రప్రదేశ్‌లో గత మూడున్నరేళ్లలో ప్రజారోగ్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019 – 20 నుంచి 2021 – 22 మధ్య మూడేళ్లలో ఏపీలో పెద్ద ఎత్తున ఆస్పత్రులు ఏర్పాటైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. రాష్ట్రంలో 11,480 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటయ్యాయి.
దేశంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా సబ్ హెల్త్ సెంటర్లున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 20,781 సబ్ హెల్త్ సెంటర్లు ఉండగా రాజస్థాన్‌లో 13,589 సబ్ హెల్త్ సెంటర్లున్నాయి. ఇక ఏపీలో మూడున్నరేళ్లలో కొత్తగా 304 పీహెచ్‌సీలు ఏర్పాటు కాగా మరో 179 కేంద్రాల పనులు ఇప్పటికే ప్రారంభమై పురోగతిలో ఉన్నాయి.
47 వేలకుపైగా పోస్టుల భర్తీ
రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న శ్రద్ధకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు చొప్పున డాక్టర్ల సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న విషయం విదితమే.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీ లేకుండా రికార్డు స్థాయిలో 47 వేలకుపైగా పోస్టులను వైద్య ఆరోగ్యశాఖలో భర్తీ చేశారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను మారుస్తూ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు ఇప్పటికే సేవలందిస్తున్న వైద్య కళాశాలల ఆధునికీకరణ చేపట్టారు.
వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,222.85 కోట్లను వ్యయం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయించడంతోపాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ప్రజలకు ఆరోగ్య ధీమాను కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment