PHC services
-
Andhra Pradesh: ఆరోగ్య సేవలు సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) నిరంతర సేవలతో అద్భుతమైన పనితీరు కనపరుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. రాష్ట్రంలో నూటికి నూరు శాతం గ్రామీణ పీహెచ్‌సీలు 24 గంటలూ పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు వందకు వంద శాతం 24 గంటలపాటు పనిచేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. ఆ తరువాత స్థానంలో సిక్కిం నిలిచింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ తరహాలో నూటికి నూరు శాతం పీహెచ్‌సీలు నిరంతరం సేవలందించడం లేదని ఇటీవల తెలిపింది. ఏపీలో 100 శాతం.. దేశంలో 45.1 శాతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా అవన్నీ నూటికి నూరు శాతం 24 గంటలు పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. సిక్కింలో 24 పీహెచ్సీలుండగా 24 గంటల పాటు సేవలందిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 24,935 పీహెచ్సీలుండగా 11,250 పీహెచ్‌సీలు మాత్రమే (45.1 శాతం) 24 గంటలు పని చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరచేందుకు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్– 2022ను నిర్దేశించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందులో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, డయాగ్నస్టిక్స్, పరికరాలు, మందులు తదితరాలకు సంబంధించిన నిబంధనలున్నాయి. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. మూడున్నరేళ్లలో పెను మార్పులు.. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడున్నరేళ్లలో ప్రజారోగ్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019 – 20 నుంచి 2021 – 22 మధ్య మూడేళ్లలో ఏపీలో పెద్ద ఎత్తున ఆస్పత్రులు ఏర్పాటైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. రాష్ట్రంలో 11,480 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. దేశంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా సబ్ హెల్త్ సెంటర్లున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 20,781 సబ్ హెల్త్ సెంటర్లు ఉండగా రాజస్థాన్‌లో 13,589 సబ్ హెల్త్ సెంటర్లున్నాయి. ఇక ఏపీలో మూడున్నరేళ్లలో కొత్తగా 304 పీహెచ్‌సీలు ఏర్పాటు కాగా మరో 179 కేంద్రాల పనులు ఇప్పటికే ప్రారంభమై పురోగతిలో ఉన్నాయి. 47 వేలకుపైగా పోస్టుల భర్తీ రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న శ్రద్ధకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు చొప్పున డాక్టర్ల సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న విషయం విదితమే. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీ లేకుండా రికార్డు స్థాయిలో 47 వేలకుపైగా పోస్టులను వైద్య ఆరోగ్యశాఖలో భర్తీ చేశారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను మారుస్తూ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు ఇప్పటికే సేవలందిస్తున్న వైద్య కళాశాలల ఆధునికీకరణ చేపట్టారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,222.85 కోట్లను వ్యయం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయించడంతోపాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ప్రజలకు ఆరోగ్య ధీమాను కల్పిస్తున్నారు. -
Andhra Pradesh: ఊరికి ఆరోగ్య రేఖ
సాక్షి, అమరావతి: ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వారి సొంతూరులోనే ప్రాథమిక వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రతి 2,500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా చిన్న చిన్న జబ్బులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం డిసెంబర్‌లోగా బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన 7,112 మంది మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించనుంది. ఇప్పటికే 2,920 క్లినిక్‌లలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు అందుబాటులో ఉన్నారు. ఈ క్లినిక్‌లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికిల్ ఎక్విప్మెంట్ను అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే 10,032 విలేజ్ క్లినిక్‌లలో ఏఎన్ఎంలు 24 గంటలూ అందుబాటులో ఉన్నారు. హెల్త్ అసిస్టెంట్‌తో పాటు ఆశా వర్కర్లు క్లినిక్‌లో ఉంటారు. చదవండి: భూ సర్వేపై 26 నుంచి శిక్షణ ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ అనుసంధానం విలేజ్ క్లినిక్స్‌ను పీహెచ్‌సీలు, ల్యాబ్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. తద్వారా టెలి మెడిసిన్ వైద్య సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. మండలానికి రెండు పీహెచ్‌సీలను అందుబాటులోకి తేవడమే కాకుండా ఒక్కో పీహెచ్సీలో ఇద్దరేసి డాక్టర్లు ఉంటారు. ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ కూడా విలేజ్ క్లినిక్స్‌కు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య శ్రీ కార్డు క్యూ ఆర్‌కోడ్ ద్వారా ప్రజల ఆరోగ్య సమాచారం స్పష్టంగా ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా వైద్యుడు ఆ గ్రామానికి వెళ్లినప్పుడు చికిత్సకు ఆరోగ్య శ్రీ కార్డులోని వివరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో సత్వరమే నిర్ధారణలతో కూడిన వైద్యం అదించడానికి ఉపయోగపడుతుంది. చదవండి: లోకేశ్ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష 12 రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు ఇవీ – గర్భిణులకు, చిన్నారుల సంరక్షణకు అవసరమైన వైద్య సేవలు – నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవలు – బాల్యం, కౌమార దశ ఆరోగ్య సంరక్షణ సేవలు – కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక సేవలు, ఇతర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలు – అంటు వ్యాధుల నిర్వహణ.. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు – తీవ్రమైన సాధారణ అనారోగ్యాలు, చిన్న జబ్బులకు జనరల్ అవుట్ పేషెంట్ కేర్ – అసాంక్రమిక వ్యాధుల స్క్రీనింగ్, నివారణ, నియంత్రణ, నిర్వహణ – సాధారణ ఆఫ్తాల్మిక్ (కంటి సమస్యలు), ఈఎన్టీ సమస్యల కోసం జాగ్రత్తలు – ప్రాథమిక నోటి ఆరోగ్య సంరక్షణ – వృద్ధాప్య వ్యాధులకు చికిత్స, ఉపశమన ఆరోగ్య సంరక్షణ సేవలు – కాలిన గాయాలకు, ప్రమాదాల్లో గాయపడిన (ట్రామా) వారికి అత్యవసర వైద్య సేవలు – మానసిక ఆరోగ్య వ్యాధుల స్క్రీనింగ్, ప్రాథమిక నిర్వహణ వైద్య రంగంలో పెనుమార్పులు గ్రామాల్లోని ప్రజలు తమ ఊరు దాటి వెళ్లకుండా ఉన్న ఊరిలోనే వైద్య చికిత్సలు అందించేందుకు వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. దీంతో గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోను లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రాధాన్యత ఇస్తే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం సామాజిక బాధ్యతగా ప్రభుత్వ రంగంలోనే వైద్య ఆరోగ్య రంగాన్నిబలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.1466.80 కోట్ల అంచనాతో 8,585 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కానున్నాయి. ఒక్కో విలేజ్ క్లినిక్‌లో అవుట్ పేషెంట్ రూమ్, ఎగ్జామినేషన్ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, వెయిటింగ్ హాల్, ఏఎన్ఎం క్వార్టర్స్ ఉంటాయి. 14 రకాల ప్రాథమిక పరీక్షలు ఇవీ... ► హిమోగ్లోబిన్, గర్భవతులకు యూరిన్ పరీక్ష, ఇతర యూరిన్ టెస్టులు, బ్లడ్ షుగర్, మలేరియా, హెచ్ఐవీ, డెంగీ, కంటి పరీక్షలు, అయోడిన్ సాల్ట్ పరీక్షలు, వాటర్ టెస్టింగ్, హెపటైటిస్ బి, ఫైలేరియా, ర్యాపిడ్ టెస్ట్, కఫం పరీక్షలు. -
పీహెచ్‌సీల్లో స్పెషాలిటీ వైద్యసేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య ముఖచిత్రం మారిపోనుంది. ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం మరింత చేరువ కానుంది. అర్ధరాత్రో అపరాత్రో పేషెంటు వెళితే ఎవరూ అందుబాటులో లేరన్న విమర్శలకు ఇక తావుండదు. పేద రోగులకు నూతన సంవత్సర కానుకగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఈనెల నుంచి 24 గంటలూ పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిపై రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు జారీచేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఔట్‌పేషెంటు సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వస్తే డాక్టర్‌కు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకుంటారు. దీనికితోడు ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రతి రెండువేల కుటుంబాలకు ఒక వైద్యుడు బాధ్యుడుగా ఉంటారు. కేరళ, తమిళనాడు తరహాలో ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేసే దిశగా చర్యలు పూర్తయ్యాయి. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు రాష్ట్రంలో ప్రస్తుతం 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ప్రతి పీహెచ్సీలోను ఇద్దరు వైద్యులు ఉండేలా నియామకాలు పూర్తయ్యాయి. వైద్యసేవలతో పాటు రక్తపరీక్షలు కూడా అక్కడే చేసి వైద్యం చేస్తారు. రాత్రిపూట వైద్యానికి వస్తే డాక్టర్‌కు ఫోన్ చేస్తే వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఫార్మసిస్ట్, ల్యాబ్‌టెక్నీషియన్, స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉంటారు. ప్రాథమిక వైద్యానికి సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి షుగరు, బీపీకి ఇకమీదట ఆదివారం మినహా మిగిలిన ఆరురోజులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అసాంక్రమిక వ్యాధులకు ఔట్‌పేషెంటు సేవలు అందుబాటులో ఉంటాయి. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వ్యాధులకు ఈ క్లినిక్‌లు పనిచేస్తాయి. వ్యాధి తీవ్రతను బట్టి రిఫరల్ విధానం అంటే పెద్దాస్పత్రులకు పంపించే ఏర్పాట్లు జరుగుతాయి. ఈ వ్యాధులకు మందులన్నీ రోగులకు ఉచితంగా ఇస్తారు. ఆరురోజులు స్పెషలిస్టుల సేవలు ఇప్పటివరకు పీహెచ్‌సీల్లో ప్రాథమిక వైద్యమే (ఎంబీబీఎస్ డాక్టరు చేసే వైద్యమే) లభించేది. ఇకమీదట ఆరురకాల స్పెషాలిటీ వైద్యసేవలు అందించనున్నారు. ఈఎన్టీ, డెంటల్, కంటిజబ్బులు, మెంటల్ హెల్త్, గేరియాట్రిక్, గైనకాలజీ సేవలు అందిస్తారు. ఒక్కో స్పెషాలిటీకి ఒక్కోరోజు చొప్పున ఆరురోజులు ఆరుగురు స్పెషాలిస్టు డాక్టర్లు ఔట్‌పేషెంటు సేవలు అందిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి ఈ డాక్టరే పెద్దాస్పత్రికి రిఫర్ చేస్తారు. ప్రతి స్పెషలిస్టు డాక్టరు ఉదయం, మధ్యాహ్నం వేర్వేరు పీహెచ్‌సీల వంతున వారంలో 12 పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అందించాలి. నిరంతరం అందుబాటులో ఫ్యామిలీ డాక్టరు పీహెచ్సీలో వైద్యుడికి రెండువేల కుటుంబాల ఆరోగ్య బాధ్యతలు అప్పగించారు. ఆ రెండువేల కుటుంబాలకు అతడు ఫ్యామిలీ డాక్టరుగా ఉంటారు. వారికి ఆరోగ్యపరంగా ఎప్పుడు అవసరమైనా ఆ వైద్యుడు సంబంధిత సమాచారాన్ని విశ్లేషించి తగిన చికిత్స అందిస్తారు. అవసరమైతే పెద్దాస్పత్రికి రిఫర్ చేస్తారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం పీహెచ్‌సీలన్నిటినీ 24 గంటలు పనిచేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. స్పెషలిస్టు డాక్టర్లను కూడా ఏర్పాటు చేశాం. అన్ని పీహెచ్‌సీల్లో డబుల్ డాక్టర్ ఉంటారు. డాక్టరు లేడు, మందులు లేవు అన్న మాట వినిపించదు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
పేద రోగులంటే నిర్లక్ష్యమా?
సాక్షి, బలిజిపేట (విజయనగరం): వైద్యసేవల నిమిత్తం స్థానిక పీహెచ్‌సీకి వచ్చే రోగులంటే సిబ్బందికి లెక్కలేకుండా పోతోందని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పీహెచ్‌సీకి ఎక్కువగా నిరుపేదలే వస్తుంటారు. అయితే వీరిపట్ల వైద్యసిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. బలిజిపేట గొల్లవీధికి చెందిన బూర్ల భవాని శని వారం మధ్యాహ్నం కుక్కకాటుకు గురైంది. చికిత్స నిమిత్తం బలిజిపేట పీహెచ్‌సీకి రాగా కుక్కకాటు ఇంజక్షన్ లేదని చెప్పి టీటీ ఇంజక్షన్ చేసి పంపించేశారు. శనివారం అర్ధరాత్రి అదే గొల్లవీధికి చెందిన ఎన్ లక్ష్మణకు అదేకుక్క కాటు వేయగా స్థానికులు వెంటనే పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు కుక్కకాటు ఇంజక్షన్ చేసి అవసరమైన చికిత్స చేశారు. మధ్యాహ్నం ఇంజక్షన్ లేదన్నారు కదా? ఇప్పుడు ఎలా వచ్చిందని వారు ప్రశ్నించగా, ఇప్పుడే దొరికిందని సిబ్బంది సమాదానం చెప్పారు. కాగా ఆదివారం ఉదయం భవాని మళ్లీ పీహెచ్‌సీకి ఇంజెక్షన్ కోసం వెళ్లింది. ‘ఇంజక్షన్ లేదని చెప్పాం కదా మళ్లీ ఎందుకు వచ్చావు’ అంటూ వైద్య సిబ్బంది రుసరుసలాడారు. శనివారం రాత్రి కుక్కకాటుకు గురైన లక్ష్మణరావు ఆస్పత్రికి వచ్చినపుడు ఇంజక్షన్ చేశారు కదా, ఇప్పడు లేదని ఎందువల్ల బుకాయిస్తున్నారని బాధితురాలు నిలదీయగా ‘ఆ విషయం డాక్టర్‌ను అడుగు’ అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాదానం చెప్పడంపై బాధితురాలు భవాని, ఆమె బంధువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం లేని ఇంజక్షన్ రాత్రి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. పేదరోగులపై వైద్య సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైద్యాధికారి మహీపాల్ను వివరణ కోరగా సోమవారం వరకు తాను సెలవులో ఉన్నానని వచ్చిన తర్వాత వివరాలు తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
అసంక్రమణ వ్యాధులపై సర్వే
ఉట్నూర్(ఖానాపూర్): రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అసంక్రమణ వ్యాధుల నిర్ధారణపై దృష్టి సారించింది. అసంక్రమణ వ్యాధులను అదుపులో ఉంచుతూ ప్రజల జీవణ ప్రమాణం పెంచేందుకు చర్యలు చేపట్టింది. 30 సంవత్సరాలు పైబడిన వారు అసంక్రమణ వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించిన వైద్యఆరోగ్యశాఖ నివారణ చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన వారందరికీ మార్చి నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తోంది. ఇప్పటివరకు 96వేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించింది. అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ ఒక్కప్పుడు మనిషి జీవన ప్రమాణం సాధారణంగా 70 ఏళ్లకు పైబడి ఉండేది. కాలక్రమంలో మనిషి ఆయుష్సు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 30 ఏళ్లుపై బడిన వారు ఏదో ఒక్క వ్యాధిబారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనికి ప్రధానంగా నాలుగు రకాల అసంక్రమణ వ్యాధులే కారణమని గుర్తించిన వైద్య ఆరోగ్యశాఖ వయస్సు పైబడిన వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందించాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఫిబ్రవరిలో వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మార్చి నుంచి జిల్లాల్లో 30 ఏళ్లు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తోంది. వైద్య పరీక్షల్లో భాగంగా అసంక్రమణ వ్యాధుల కిందకు వచ్చే మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్లు (నోటి, గర్భాశయ, రొమ్ము), పక్షవాతం వ్యాధుల నిర్ధారణకు పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో 2.72 లక్షల మందికి పరీక్షలు జిల్లాలో 16 గిరిజన, 06 మైదాన ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7.37 లక్షల జనాభా ఉంది. వీరిలో 2,72,690 మంది 30 ఏళ్లు నిండిన జనాభా ఉంది. అసంక్రమణ వ్యాధుల నిర్ధారణలో భాగంగా వీరందరికీ ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఏప్రిల్ చివరి నాటికి 96,324 మందికి వైద్యపరీక్షలు చేశారు. ఇందుకోసం అధికారులు వైద్యసిబ్బందితో బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతీ బృందంలో హెల్త్ అసిస్టెంట్, ఇద్దరు ఏఎన్ఎంలు, సూపర్వైజర్ ఉంటారు. వీరు ప్రతీరోజు గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేలా ట్యాబ్‌లు అందించారు. దీంతో వైద్యబృందం ప్రతీరోజు 60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు చేపట్టారు. ఆన్లైన్ నమోదు సమయంలో సదరు వ్యక్తి ఫొటోతో పాటు ఆధార్ నంబర్‌కు అనుసంధానం చేసి ఆ వ్యక్తికి ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక ఐడీ నంబర్ కేటాయిస్తారు. దీంతో వ్యక్తి ఆరోగ్య వివరాలు సంబంధిత పీహెచ్సి వైద్యాధికారి ట్యాబ్‌కు, వైద్య ఆరోగ్యశాఖకు అనుసంధానం అయి ఉంటాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా వైద్యసేవలు పొందే ఉంది. ప్రతీ శనివారం పరీక్షలు అసంక్రమణ వ్యాధులతో బాధపడుతూ ఆన్లైన్లో నమోదు చేయబడిన వ్యాధిగ్రస్తులకు ప్రతీ శనివారం ఆయా పీహెచ్‌సీల పరిధిలో వైద్యాధికారులు వైద్య పరీక్షలతోపాటు కావాల్సిన మందులు అందిస్తుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి పైఆస్పత్రులకు రెఫర్ చేసే అవకాశం వైద్యాధికారులకు ఆరోగ్యశాఖ కల్పించింది. జిల్లాలో ఇప్పటి వరకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్న వారిలో 372 మంది మధుమేహం, 2213 మంది అధిక రక్తపోటు, 20 మంది నోటి, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ల బారిన పడిన వారు, 28 మంది పక్షవాతంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడంతో వైద్యఆరోగ్యశాఖ ప్రతీ శనివారం ఆయా పీహెచ్సీలో వైద్యం అందిస్తోంది. -
ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యం
సాక్షి, కొత్తూరు (శ్రీకాకుళం): పాలకుల నిర్లక్ష్యానికి ఆస్పత్రులు అధ్వానంగా తయారయ్యాయి. రోగులకు కనీస సౌకర్యాలు అందక అవస్థలు పడుతున్నారు. కొత్తూరు పీహెచ్సీలో ఏళ్లుగా వసతి, వైద్య సిబ్బంది కొరత వేధిస్తుండడంతో ప్రజలు వైద్యం కోసం ఇతర మండలాలు, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. సీహెచ్‌సీ, పీహెచ్‌సీలను అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తామని చెప్పిన కలమట ఇచ్చిన హామీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఐదుగురు రెగ్యులర్ వైద్యులు ఉండాల్సిన ఆస్పత్రిలో ఒక్క రెగ్యులర్ వైద్యుడు కూడా లేకపోవడం దారుణం. ముగ్గురు వైద్యులు డెప్యుటేషన్‌పై సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో అరకొరగా మందులు అందుబాటులో ఉండడం, సిబ్బంది లేకపోవడం, వైద్య పరికరాల, వసతి సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. కుటుంబ నియంత్రణ అపరేషన్ల కోసం బాలింతలు మండల కేంద్రం నుంచి 13 కిలోమీటర్లు దూరంలో ఉన్న కురిగాం పీహెచ్‌సీకి, లేదా సీతంపేట మండలం మర్రిపాడు పీహెచ్‌సీకి వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. గైనకాలజిస్టు లేక పోవడంతో గర్భిణులు, మహిళలు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌రే మిషన్ పాడై 12 సంవత్సరాలు దాటుతున్నా నేటకీ కొత్తది మంజూరు చేయలేదు. దీంతో ఎముకలకు సంబంధించిన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. పేరుకే 50 పడకల ఆస్పత్రి..కానీ రోగులకు పడకలు లేక వరండాలో చికిత్స పొందాల్సిన పరిస్థితి. తమకు అనారోగ్యం వస్తే విదేశాల్లో చికిత్సలు చేయించుకునే టీడీపీ నేతలు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందించే ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిని గాలికొదిలేశారని పలువురు విమర్శిస్తున్నారు. ఎక్స్‌రే మిషన్ లేక అవస్థలు ఆస్పత్రిలో ఉన్న ఎక్స్‌రే మిషన్ పాడై 12 సంవత్సరాలవుతోంది. కొత్త మిషన్ మంజూరు చేయాలని పాలకులకు పలుమార్లు వినతులు అందజేశాం. కానీ ఇంతవరకు మంజూరు చేయలేదు. ఎక్స్‌రే సదుపాయం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకో, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికో పరుగులు తీయాల్సి వస్తోంది. గైనకాలజిస్ట్, ఆర్థోపెడీషియన్ లేకపోవడంతో గర్భిణులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. – లోతుగెడ్డ ఉపేంద్ర, కొత్తూరు సీహెచ్‌సీ ఉన్నా పీహెచ్‌సీకి పరుగులు మండల కేంద్రంలో సీహెచ్‌సీ ఉన్నా వైద్యులు, మందులు, వసతి లేకపోవడంతో వైద్యం కోసం సీతంపేట, పాలకొండ పీహెచ్‌సీలకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులు అంత దూరం వెళ్లి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కొత్తూరు సీహెచ్‌సీలో సదుపాయాలు కల్పించాలి. – పడాల వెంకటకృష్ణ, ఎన్.ఎన్.కాలనీ, కొత్తూరు -
తీరనున్న ఇబ్బందులు
సాక్షి, నార్నూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవానంతరం పుట్టిన శిశువు పేరుతో తక్షణమే ఈ–బర్త్ పేరిట జనన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ మన్ననలు పొందే విధంగా చర్యలు చేపడుతోంది. అదే విధంగా పీహెచ్సీలలో సుఖ ప్రసవాలు జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని రకాల పరీక్షలు (రక్త, మూత్ర, షుగర్, బీపీ) చేయించుకునేందుకు హెమోటాలజీ ఎనలైజర్ మిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఇప్పటివరకు పీహెచ్సీలలో జరిగే ప్రసవ అనంతరం తక్షణమే కేసీఆర్ కిట్టు అందజేస్తున్నారు. దీంతో పాటు మరింత పారదర్శకంగా ఉండేందు కు 2019 జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవం జరిగే శిశువుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి అప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా ఈ–బర్త్ పేరిట జనన ధ్రువీకరణపత్రం జారీ చేస్తున్నారు. పీహెచ్సీ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణపత్రం ఆధారంగా సబంధి త మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో ఒరి జినల్ ధ్రువీకరణ పత్రం క్షణాల్లో పొందే అవకాశం కల్పించారు. దీంతో నిరక్షరాస్యులు భవి ష్యత్ అవసరాల నిమిత్తం అధికారుల చుట్టూ జన న ధ్రువీకరణ పత్రం పొందేందుకు కార్యాలయా ల చుట్టూ తిరిగే పరిస్థితికి చెక్ పెట్టారు. ఈ–బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నాం జనవరి ఒకటి నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పీహెచ్సీలో కాన్పు అయిన వారికి వెంటనే ఈ–బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నాం. ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియను చేపడుతున్నాం. దీంతో బాధితులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సర్టిఫికెట్ గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీలో చూపిస్తే వెంటనే సర్టిఫికెట్ జారీ చేస్తారు. –శ్రీకాంత్, పీహెచ్సీ వైద్యాధికారి, నార్నూర్ డాక్టర్లు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం -
చండ్రుగొండ పీహెచ్‌సీకి జాతీయ అవార్డు
సాక్షి, చండ్రుగొండ: చండ్రుగొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా పీహెచ్సీలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. తొలుత ఎంపీపీ బాలునాయక్, జెట్పీటీసీ సభ్యులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి కేక్‌కట్ చేసి వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రికార్డుల నిర్వహణ, డెలివరీలు, వ్యాక్సిన్స్, పారిశుద్ధ్యం, గర్భిణుల పట్ల సిబ్బంది తీసుకున్న చొరవ ఇలా అనేక కోణాల్లో జాతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ పరిశీలించన సర్వేలో చండ్రుగొండ పీహెచ్‌సీకి జాతీయస్థాయిలో 86 మార్కులు రావడం విశేషం. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సీతారాంప్రసాద్, హోమియో డాక్టర్ ప్రవీణకుమార్, డాక్టర్ భవ్య, ఎస్ఐ కడారి ప్రసాద్, ఎంఈఓ ఝంకీలాల్, ఉపసర్పంచ్ బాబురావు, నాయకులు సారేపల్లి శేఖర్, పులి సత్యం, తుమ్మలపల్లి సురేష్, డి.మల్లేష్, పకీర్కుమార్, కిరణ్‌రెడ్డి, బాబ పాల్గొన్నారు. -
పీహెచ్‌సీల సందర్శన తప్పనిసరి
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాలను తప్పనిసరిగా సందర్శించి, వాటి వివరాలు నెలాఖరులోగా టూర్ డైరీ రూపంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి పంపాలని వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ జి.సావిత్రి ఆదేశించారు. శ్రీకాకుళంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నూతనంగా నియమితులైన వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడ్వాన్స్ టూర్ ప్రోగ్రాం(ఏటీపీ), టూర్ డైరీని గత నెలలో జరిగిన ఫీల్డ్ విజిట్ వివరాలు, ఒక నెలలో 15 నుంచి 20 రోజులు తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాలను సందర్శించి వాటి వివరాలు అందజేయాలన్నారు. సెలవు రోజుల్లోనూ, ఆదివారాలలో వైద్యాధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పీహెచ్‌సీల్లో ఓపీ చూడాలని సూచించారు. పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ జిల్లాలో జరుగుతున్న అమలు తీరు, ప్రతి స్కానింగ్ సెంటర్‌కు సంబంధించి ఫారం–ఎఫ్ రిపోర్టును జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ప్రతినెలా 5 లోగా పంపాలన్నారు. వైద్యాధికారులు తమ పరిధిలోని స్కానింగ్ సెంటర్లను పర్యవేక్షించాలని, ఆర్బీఎస్కే, రిఫరల్ సర్వీసెస్, చైల్డ్ హెల్త్, అబార్షన్స్ తదితర వాటిపై వివరంగా తెలియజేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.చెంచయ్య మాట్లాడుతూ ప్రతి వైద్యాధికారి సమయపాలన పాటిస్తూ తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్‌లో ఉండాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్టీసీ(ఎం) డాక్టర్ ఉమాసుందరీదేవి, అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్, డీఐఓ డాక్టర్ బగాది జగన్నాథరావు, జెబీఏఆర్ డాక్టర్ ఎం.ప్రవీణ్, పీఓడీటీటీ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, ఏఓ పి.చిట్టిబాబు, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ప్రతినిధులు ఎం.మురళీధరరావు, ఎం.వెంకటేశ్వర్రావు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
అరచేతిలో ఆరోగ్యం!
పాలమూరు: జ్వరం వచ్చినప్పుడు లేదా అస్వస్థతకు గురైనప్పుడు సమీపంలోని ఆస్పత్రికి వెళ్తాం.. వైద్యులను సంప్రదించి వారు రాసిచ్చిన మందులు వాడతాం... జబ్బు తగ్గుముఖం పట్టాక మళ్లీ దైనందిన కార్యకలాపాల్లో నిమగ్నమవుతాం.. కానీ కొన్ని వ్యాధులు పూర్తిగా తగ్గినా.. మరికొన్ని అప్పటి వరకే తగ్గినట్లు కనిపించి కొద్దిరోజులకు తిరగబెడతాయి.. తద్వారా ముంచుకొస్తున్న ముప్పును గుర్తించేలోగానే నష్టం జరిగిపోతుంది... ఇలాంటి పోకడల వల్లే దేశంలో నూటికి 60శాతం మరణాలు సంభవిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీంతో ఆరోగ్యకర సమాజం ఏర్పాటుతో పాటు మరణాల సంఖ్యను తగ్గించడం, వ్యాధులను నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. అధిక రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్), కేన్సర్, శ్యాసకోస వ్యాధులు, గుండె జబ్బులను గుర్తించడానికి అసంక్రమిత వ్యాధుల(నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–ఎన్సీడీ) పేరిట సర్వేను ప్రారంభించింది. 30ఏళ్లు దాటిన ప్రతీ మహిళ, పురుషుడి వ్యక్తిగత ఆరోగ్య వివరాలను సేకరించడమే ఈ సర్వే లక్ష్యం. ఈ నేపథ్యంలో అయిదు రకాల వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన మందులు, వైద్యాన్ని ప్రభుత్వమే ఉచితంగా అందించడానికి ఈ పథకాన్ని రూపొందించింది. ఈ మేరకు 1వ తేదీ నుంచి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సర్వే ప్రారంభించారు. ఆరు నెలల్లో లక్ష్యం పూర్తి చేయాలి జిల్లా పరిధిలో 28 పీహెచ్‌సీలు 217 సబ్ సెంటర్ల పరిధిలో ఉన్న 5,62,000 మందికి ఆరు నెలల్లో ఎన్సీడీ కింద పరీక్షలు పూర్తి చేయాలి. ఈనెల 1వ తేదీన సర్వే ప్రారంభం కాగా.. శుక్రవారం వరకు 15,232మందికి పరీక్షలు చేశారు. ఒక్క సబ్‌సెంటర్ పరిధిలో ఇద్దరు ఏఎన్ఎంఎలు, ఆద్దరు ఆశా కార్యకర్తలు కలిసి రోజుకు 30మందిని పరీక్షించాల్సి ఉంటుంది. బీపీ, మధుమేహ పరీక్షలు చేయడమే కాదు బరువు, ఎత్తు, నడుము కొలతలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉంటే మందులు వాడుతున్నారా, లేదా అనే వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఇలా సేకరించిన వివరాలను తొలుత రిజిస్టర్లో రాసుకుని ఆ తర్వాత వాటిని ట్యాబ్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఆ తర్వాత సమస్త ఆరోగ్య సమాచారాన్ని కార్డులో పొందుపరిచి వారికి అందజేస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోకుండా అనారోగ్యానికి గురైతే ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాల్సి వచ్చినప్పుడు ఈ కార్డులోని సమాచారం అక్కడి వైద్యులకు ఉపయోగపడుతుంది. తద్వారా మళ్లీ పరీక్షలు చేయాల్సిన సమయం, ఖర్చు కలిసొస్తుంది. అంతేకాకుండా సకాలంలో చికిత్స మొదలుపెట్టే అవకాశం ఉండడంతో ప్రాణాలు కాపాడుకోవచ్చు. పీహెచ్‌సీల్లో ప్రత్యేక విభాగం ప్రతీ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)ల్లో నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్(ఎన్సీడీ) క్లినిక్‌ల పేరిట ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం సిబ్బందిని సైతం నియమించనున్నారు. ఎండీ స్థాయి వైద్యుడి ఆధ్వర్యంలో ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు, నలుగురు హెడ్ నర్సులతో ఈ ప్రత్యేక విభాగం పనిచేయనుంది. ఈ కేంద్రాల్లో రోగ నిర్ధారణ చేయనుండగా కేన్సర్‌ను గుర్తించే పరికరాలు సైతం ఎన్సీడీ క్లినిక్‌లకు చేరాయి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సర్వేలో బీపీ, మధుమేహం ఉన్నట్లు తేలిన వారికి ప్రభుత్వమే ఉచితంగా మందులను సరఫరా చేయనుంది. ప్రతీనెల సంబంధిత గ్రామ సబ్ సెంటర్ ఏఎన్ఎం వీటిని అందిస్తారు. పరిధి దాటిన దీర్ఘకాలిక వ్యాధులు, కేన్సర్లతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడానికి జిల్లా వైద్యశాలల్లో ఎన్డీసీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తారు. ఎన్సీడీ అంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందని వ్యాధులను అసంక్రమిత వ్యాధులు(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) అంటారు. ఇందులో రక్తపోటు, మధుమేహంతో పాటు మహిళల్లో వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్స ర్లు, పొగాకు వినియోగించే వారిలో వచ్చే నోటి, గొం తు కేన్సర్లను ఈ పథకం కిందకు తీసుకొస్తున్నారు. గుర్తింపు ఇలా దీర్ఘకాలిక రోగులను గుర్తించడానికి నాలుగు దశల్లో వడబోత జరుగుతోంది. ఆశా కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి 30ఏళ్లు పైబడిన వారితో మాట్లాడి వారికి ఉన్న వ్యాధుల వివరాలను వైద్యాధికారులు రూపొందించిన సీ–బ్యాక్ దరఖాస్తులో పొందుపరుస్తారు. వీటిని ఏఎన్ఎంలు పరిశీలించి నాలుగు పాయింట్ల కన్నా అధికంగా వచ్చిన వారిని మరోసారి పరీక్షిస్తారు. దీర్ఘకాలిక రోగాల ప్రాథమిక సమాచారాన్ని సంబంధిత హెడ్‌నర్సుకు అందజేస్తారు. హెడ్ నర్సు తన వద్ద ఉండే బీపీ, షుగర్ పరీక్షలు చేసే యంత్రాలతో వ్యాధిగ్రçస్తులను మరోసారి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేస్తారు. కాగా, కేన్సర్లను గుర్తించేందుకు హెడ్ నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. గర్భాశయ ముఖద్వారా కేన్సరు గుర్తింపు కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. మూడు దశల్లో వ్యాధి ఉన్నట్లు అనుమానమొస్తే వారిని వైద్యాధికారి ప్రత్యేకంగా పరీక్షిస్తారు. పకడ్బందీగా ఆరోగ్య పరీక్షలు జిల్లాలో అసంక్రమిత వ్యాధుల గుర్తింపుపై ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో సర్వే పకడ్బందీగా జరుగుతోంది. గ్రామాల వారీగా సేకరించిన వివరాల ఆధారంగా చికిత్స అందజేస్తాం. జిల్లాలో ఆరు నెలల పాటు సర్వే కొనసాగుతుంది. రోగ నిర్ధారణ జరిగాక ఒక కార్డు ఇస్తాం. ఇందులో వారి ఆరోగా>్యనికి సంబంధించిన సమగ్ర వివరాలను పొందు పరుస్తాం. వివరాలు సేకరించేందుకు ఇళ్లకు వచ్చే ఆశా కార్యకర్తలకు ప్రజలు సహకరించాలి. పూర్తి ఆరోగ్య వివరాలను దాచుకోకుండా తెలియజేయాలి. అప్పుడే పథకం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది. – డాక్టర్ రజిని, డీఎంహెచ్ఓ -
కిట్‌కట !
పాలమూరు: ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు సర్కార్ దవాఖానాల్లో ప్రసవాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణమో ఇతరత్రా ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలియదు కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు కేసీఆర్ కిట్ అండం లేదు. తల్లీ, బిడ్డకు ఉపయోగపడే రూ.2వేలకు పైగా విలువైన వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు అమ్మ ఒడి పథకంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులకు పరీక్షలు, ప్రసవాల కోసం వచ్చే గర్భిణులకు నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నారు. ఈ పథకం ఇన్నాళ్లు సాఫీగానే సాగగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ సమయంలో కేసీఆర్ చిత్రం ముద్రించిన కిట్ ఇవ్వొద్దన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలు వచ్చాయి. దీంతో అయితే, కేసీఆర్ చిత్రం లేకుండా కిట్ మాత్రం అందజేశారు. అలా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో సాఫీగా అందిన కిట్ గత నెల రోజులుగా అందడం లేదు. గత నెల 29వ తేదీ నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రవసవించిన బాలింతలకు కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదు. ప్రసవించిన సమయంలో ఇవ్వకుండా తర్వాత రావాలని సిబ్బంది చెబుతుండడంతో దూరప్రాంతాల నుంచి రావాల్సిన వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులు, పీహెచ్‌సీలు మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు నారాయణపేట ఏరియా ఆస్పత్రి, జడ్చర్ల, మక్తల్, కోస్గి, కోయిల్‌కొండల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉండగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 28ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు ఉన్నాయి. అయితే, వైద్యసేవలందించడంలో మా త్రం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి కీలకపాత్ర పోషిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన గర్భిణులు కూడా ప్రసవం కోసం ఇక్కడకు వస్తున్నారు. దీంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో జనరల్ ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ ఇవ్వకపోవడంతో బాలింతలు ఆందోళన చెందుతున్నారు. వివరాలు నమోదు కేసీఆర్ కిట్లు లేకపోవడంతో బాలింతల వివరాలను సంబంధిత సిబ్బంది సేకరిస్తున్నారు. ఆస్పత్రి నుంచి ప్రతి రోజు డిశ్చార్జ్ అవుతున్న బాలింతల ఫొటోలు, ఫోన్ నెంబర్లు, తల్లి ఆధార్ కార్డు, చిరునామా తీసుకొని కిట్లు వచ్చిన తర్వాత సమాచారం ఇస్తామని చెబుతున్నారు. దాదాపు 25 రోజులుగా కిట్ల పంపిణీ లేకపోవడం వల్ల చాలా మంది బాలింతలు, వారి బంధువులు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే, వచ్చిన ప్రతీసారి ఇంకా కిట్ రాలేదని సిబ్బంది చెబుతుండడంతో వారు నిరాశగా తిరుగుముఖం పడుతున్నారు. నగదు జమ ఏదీ? అమ్మ ఒడి పథకంలో భాగంగా నగదు సాయాన్ని అందచేసేందుకు గ్రామాల్లో మూడు నుంచి ఐదు నెలల గర్భంతో ఉన్న మహిళలను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. అర్హుల ఎంపిక బాధ్యతను అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు అప్పగించారు. తమ పరిధిలోని ప్రాంతాల్లో గర్భిణులను గుర్తించి వారి పేర్లు, బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ ఇతర వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం అందజేసిన ట్యాబ్‌ల ద్వారా ఏఎన్సీ కార్డుతో గర్భిణుల వివరాలను నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలి. ఆ తర్వాత ప్రభుత్వం అర్హులను ఎంపిక చేసి నిధులు మంజూరు చేస్తోంది. ఈ ఆర్థిక సాయాన్ని పొందడానికి ప్రతీ గర్భిణి తనకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పేరు నమోదు చేసుకుని కనీసం రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించుకుంటే రూ.3వేలు బ్యాంకులో జమ చేస్తారు. రెండో విడతగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తర్వాత ఆడ బిడ్డ పుడితే రూ.5వేలు, మగ బిడ్డ పుడితే రూ.4వేలు ఇస్తారు. ఇక మూడో విడతగా బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడున్నర నెలల కాలంలో ఇప్పించాల్సిన టీకాలు సక్రమంగా ఇప్పించిన తర్వాత రూ.3వేలు జమ చేస్తారు. అయితే క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది గర్భిణులను గుర్తించడంలో అలసత్వం చేస్తున్నారు. ఫలితంగా సర్కారు ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకున్నా ప్రభుత్వం ఇచ్చే నగదు అందడం లేదు. ఇటీవల కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో గర్భిణులను నమోదు 28శాతం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కనీసం 50శాతమైనా ఉండాలని ఆదేశించడం సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోంది. -
వీల్‌చైర్ ఉన్నా.. పనికిరాలే..
సాక్షి, దహెగాం: ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేదు కు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకున్నా కిందిస్థాయిలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కల్పించలేదు. శుక్రవారం మండలంలోని లగ్గాం గ్రామానికి చెందిన హస్త నారాయణ అనే దివ్యాంగుడిని ఆటోలో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. బూత్ వద్ద వీల్ చైర్ ఉన్నప్పటికీ అధికారులు వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో దివ్యాంగుడు ఆటోలో నుంచి పోలీంగ్ బూత్‌లోకి ఇబ్బంది పడుతూ వెళ్లడాన్ని ఫొటో తీయడంతో అధికారులు ప్యాక్ చేసిన వీల్‌చైర్‌ను బయటకు తీశారు. వీల్‌చైర్ ఉన్నా ఉపయోగించకపోవడంతో అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. -
సీఎం ప్రారంభించినా..
ఒకటి కాదు.. రెండు కాదు.. తొమ్మిది నెలలు బిడ్డను తన కడుపున మోస్తుంది అమ్మ. అలాంటి అమ్మకు ప్రసవ సమయంలో సమయానికి సరైన వైద్యమందకపోతే తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదమే.. కానీ 24 గంటల మహిళా పీహెచ్సీ కదా.. పైగా సీఎం చంద్రబాబు స్వయంగా ఈ ఆసుపత్రి భవనాలను ప్రారంభించారు.. ఇక్కడికి వెళ్తే అంతా మంచే జరుగుతుందని నమ్మి అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడికి వస్తే గర్భిణులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కర్నూలు, జూపాడుబంగ్లా: ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ ఏడాది మార్చిలో జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం ఓర్వకల్లు నుంచి రిమోట్ సిస్టం ద్వారా స్వయంగా ఈ ఆసుపత్రి నూతన భవనాలను ప్రారంభించారు. ఎనిమిది నెలలవుతున్నా నేటికీ ఆసుపత్రి భవనం తలుపులు తెరచుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం భవనాలు నిరుపయోగంగా ఉండడంతో గర్భిణులకు ప్రసవాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే అవకాశం లేదు. రూ.1.20కోట్ల వ్యయంతో వీటిని నిర్మించినా.. కనీసం విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే భవనాల గోడలు బీటలు వారాయి. ఆసుపత్రిలో సరైన సౌకర్యాల్లేక ప్రసవాలు, కుటుంబ ఆపరేషన్లు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల మహిళలు ఆత్మకూరు, నందికొట్కూరు, కర్నూలు ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ‘ముఖ్యమంత్రి తనే స్వయంగా ఈ ఆసుపత్రి భవనాలను ప్రారంభించారు. ఇప్పటికీ ఎనిమిది నెలలైనా మహిళలకు ఇక్కడ వైద్యం అందడం లేదు. విద్యుత్ సౌకర్యం లేదు. సౌకర్యాలు లేవు. జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం మొత్తం నిద్రావస్థలో ఉన్నట్లు తేటతెల్లమవుతోంది’అంటూ పలువురు ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందుబాటులో ఉండని వైద్యులు ఇది పేరుకు 24గంటల ఆసుపత్రి అయినా ఇక్కడ వైద్యసేవలు అందడం లేదని రోగులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల గర్భిణీ, బాలింత స్త్రీలు తీవ్ర వేదన పడుతున్నారు. రాత్రివేళల్లో గర్భిణులకు పురిటినొప్పులు వస్తే ప్రసవం చేసేందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24గంటల పాటు ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో ఉండాలన్న నిబంధనలున్నా అవేవీ ఇక్కడ అమలు కావడం లేదని వాపోతున్నారు. సిబ్బంది నివాసం ఉండేందుకు భవనాలున్నా ఎవ్వరూ స్థానికంగా నివాసం ఉండడడం లేదని మండిపడుతున్నారు. భవనాలను ఉపయోగంలోకి తేవాలి 24గంటల మహిళా ఆసుపత్రి నూతన భవనాలను ఇప్పటికైనా ఉపయోగంలోకి తేవాలి. 24గంటల పాటు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తే ఇక్కడి ప్రజల కష్టాలు తీరుతాయి. ఏడాది క్రితం భవనాలు నిర్మించినా ఇప్పటికీ కరెంటు సౌకర్యం కల్పించకపోవడం దారుణం. అధికారులు స్పందించి నూతన ఆసుపత్రి భవనాలు వెంటనే ప్రారంభించాలి. - రంగస్వామి, పారుమంచాల -
అత్యవసర వైద్యం.. అందనంత దూరం
సాక్షి, నర్వ: ప్రమాదాలు సంభవించినప్పుడు, అకస్మాత్తుగా గుండెనొప్పో, మరే ఇతర అనారోగ్య కారణాలు ఎదురై అత్యవసర వైద్యం అవసరమైన పరిస్థితుల్లో గుర్తొచ్చేది కుయ్..కుయ్ అంటూ వచ్చే వాహనం 108. ఈ వాహనాలను అత్యవసర చికిత్సల కోసం మెరుగైన వైద్యకోసం తీసుకవెళ్లేందుకు ప్రతి మండల కేంద్రానికి ఒక్కటి వైద్యా ఆరోగ్య శాఖ కేటాయించింది. ఈ నేపథ్యంలో నర్వ మండలానికి మాత్రం 108 సౌకర్యం అందనంత దూరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రక్కనున్న మండలాల నుంచే వాహనం రావల్సిన పరిస్థితిపై ‘సాక్షి ’అందిస్తున్న కథనం. మండలంలో పరిస్థితి మండలంలో 15 పంచాయతీలుండగా మరో నాలుగు కొత్తపంచాయతీల ఏర్పాటుతో మొత్తం 19 పంచాయతీలున్నాయి. ఇందులో దాదాపు 35వేలకు పైగా జనాభా ఉంది. ఈ గ్రామాల్లో ప్రమాదవశాత్తు ఏమైన ప్రమాదం సంభవించిన, అనారోగ్య కారణాలతో ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇక్కడ 108 వాహనం అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం వెళ్ళాలంటే ఇతర మండలాల నుంచి 108 వాహనం పిలుపించుకోవాలంటే సుమారు 25 కిలోమీటర్ల దూరం నుండి రావల్సిందే. ఈనేపథ్యంలో మండలంలో ఇలాంటి ఇబ్బందులు నిత్యాకృత్యం. గత ఏడాది మండల కేంద్రానికి హైదరాబాద్ నుండి వస్తున్న ఆర్టీసి బస్సు డ్రైవర్‌కు నర్వకు రావడంతో గుండె నొప్పి తీవ్రంగా వచ్చింది. దీంతో ఆయన బస్సును నర్వ చౌరస్తాలో నిలిపి నొప్పితో బాదపడుతుండగా సమయానికి అంబులెన్స్ కాని, 108 అందుబాటులో లేక పోవడంతో అక్కడే నొప్పి భరిస్తూ.. ప్రాణాలు విడిచాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నా పాలకులు, అధికారులు 108 వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాతలు ఇచ్చిన అంబులెన్స్ ఏది..? ఇలాంటి పరిస్థితులు రాకుడదని దాత లక్ష్మీకాంత్‌రెడ్డి అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసి ఆసుపత్రికి అందజేస్తే డ్రైవర్ పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేక మూలన పడేశారు. దీంతో కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా అందని ద్రాక్షగా మారింది. దూరంగా శివారు గ్రామాలు మండలంలోని శివారు గ్రామాలలో కొత్తపల్లి, జక్కన్నపల్లి, లక్కర్‌దొడ్డి, గ్రామాలకు రహదారి సరిగ్గా లేదు. దీంతో పాటు చివరి గ్రామాలకు ఎటు వైపు నుంచి 108 వాహనం రావాలన్నా సుమారు 25 కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో మండల కేంద్రానికి 108 వాహనం కేటాయిస్తే ఇలాంటి ఏ ప్రమాదాలు సంభవించిన వెంటనే మెరుగైన చికిత్స కోసం తీసుకవెళ్ళవచ్చని ఆయా గ్రామాలు ప్రజలు కోరుతున్నారు. వాహన సదుపాయం కల్పించాలి మండలంలో 108 వా హనం లేక అత్యవసర స మయంలో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అవసరమైనప్పుడు ప్రవేటు వాహనాలలో తీసుకవెళ్లిన అందులో సరైన సౌకర్యాలు లేక పోవడంతో ప్రాణనష్టం సంభవించింది. సకాలంలో వైద్య సేవల అందలంటే 108 వాహనం సరైన పరిస్థితుల్లో అందులో అవసరమైతే అత్యవసర ప్రాథమిక చికిత్సకు అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు మండల కేంద్రానికి ఒక్క 108 వాహనం సమకూర్చాలి. – అన్సారి, లంకాల్ -
జానంపేట నం.1
సాక్షి, పాలమూరు : జాతీయ స్థాయిలోనే జిల్లా లోని మూసాపేట మండలం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సత్తా చాటింది. జాతీయ ప్రమాణ ధ్రువపత్రం కోసం రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో 29 పీహెచ్‌సీలు పోటీ పడగా జానంపేటకు పీహెచ్సీ 97 మార్కులతో మొదటి స్థానం దక్కించుకుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం నుంచి తాజాగా ధ్రువీకరణ పత్రం అందింది. అంతేకాకుండా జిల్లా లోని మరికల్, మిడ్జిల్ పీహెచ్‌సీలు సత్తా చాటి మెరుగైన మార్కులు సాధించాయి. ఇలా ఒకే జిల్లాలో మూడు పీహెచ్‌సీలు ఒకేసారి ధ్రువీకరణ పత్రాలు అందుకోవడం అరుదైన ఘటనగా వైద్య,ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. 97 మార్కులు ఏటా జాతీయ ప్రమాణ ధృవపత్రం అందజేసేందుకు పీహెచ్‌సీలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బృందాలు పరిశీలిస్తాయి. ఈ మేరకు రాష్ట్రంలో 29 పీహెచ్‌సీలు దరఖాస్తు చేయగా.. జిల్లా నుంచి జానాపేట, మరికల్, మిడ్జిల్ నుంచి దరఖాస్తులు వెళ్లాయి. ఇందులో భాగంగా ఆగస్టు 10, 11వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆయా పీహెచ్‌సీలను పరిశీలించి వెళ్లారు. తాజాగా జానంపేట పీహెచ్‌సీకి 97 మార్కులతో రాష్ట్రంలోనే మొదటి స్థానం కేటాయిస్తూ ధృవీకరణ పత్రం జారీ చేశారు. అలాగే, మిడ్జిల్ పీహెచ్‌సీకి 94.6 మార్కులు, మరికల్ పీహెచ్‌సీకి 90.2 మార్కులు కేటాయించి పత్రాలు అందజేశారు. వైద్యులు, ఉద్యోగుల పనితీరుతో పాటు సౌకర్యాల కల్పన, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల వారీగా మార్కులు కేటాయించారు. కాగా, జాతీయ ప్రమాణ ధృవీకరణ పత్రాలకు ఎంపికైన జానంపేట, మిడ్జిల్, మరికల్ పీహెచ్‌సీలకు ఏటా రూ.3లక్షల చొప్పున మూడేళ్ల పాటు రూ.9లక్షల నిధులు అందనున్నాయి. ఏయే అంశాల్లో.. పీహెచ్‌సీల పరిశీలన సందర్భంగా కేంద్రప్రభుత్వ అధికారులు పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు పీహెచ్‌సీలకు వస్తున్న రోగులతో సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది, ఆప్యాయంగా ఉంటున్నారా అని చూడడంతో పాటు మందులు సక్రమంగా ఇస్తున్నారా, స్వాంతన కలి గించే విధంగా మాట్లాడుతున్నారా అని పరిశీలించారు. అలాగే, ఆస్పత్రిలో మంచాలు, పరుపులు, బెంచీలు, కుర్చీల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత, ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందా, లేదా అని చూశారు. ఇలా పలు అంశాల ప్రాతిపదికన మార్కులు కేటాయించారు. -
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
ఖమ్మం వైద్యవిభాగం: మారుమూల ప్రాంతాల్లో గర్భిణులు అవస్థలు పడొద్దని.. సుఖ ప్రసవం జరగాలని.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2017, జూన్ 2న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచేలా కార్యాచరణ రూపొందించి.. అమలు చేస్తోంది. కేసీఆర్ కిట్ అందజేయడంతోపాటు ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేల చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 15 నెలల కాలంలోనే రెట్టింపు అయింది. పథకానికి ముందు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏడాదికి 22వేలకు పైగా ప్రసవాలు జరగగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాటి సంఖ్య 5వేలకు మించని పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నా.. పీహెచ్సీలలో ఆశించిన మేర జరగకపోవడంతో పథకం లక్ష్యం నెరవేరకుండా పోతోంది. పీహెచ్‌సీల్లో 8 శాతం మాత్రమే.. జిల్లాలో 22 పీహెచ్‌సీలు ఉండగా.. పథకం ప్రారంభమైన 15 నెలల కాలంలో కేవలం 8 శాతం మాత్రమే ప్రసవాలు జరగడం గమనార్హం. కల్లూరు పీహెచ్సీలో మాత్రమే 182 ప్రసవాలు జరిగాయి. వైరా 101, బోనకల్ 98 ప్రసవాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొన్ని పీహెచ్సీలలో రెండు అంకెలు కూడా దాటకపోవడం శోచనీయం. మంచుకొండ 2, సుబ్లేడు 3, కూసుమంచి 5, పెద్దగోపతి 6, కామేపల్లి పీహెచ్సీలలో 9 డెలివరీలు మాత్రమే చేయడంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 12,606 ప్రసవాలు చేయగా.. పీహెచ్సీలలో 1,019 మాత్రమే చేశారు. ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పీహెచ్‌సీల్లో మాత్రం 8 శాతం మాత్రమే కావడం వల్ల ఆ శాఖ పనితీరు అర్థమవుతోంది. 92 శాతం వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లోనే.. జిల్లాలోని పెద్దాస్పత్రితోపాటు సత్తుపల్లి, పెనుబల్లి, మధిరలో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులున్నాయి. అయితే పీహెచ్సీలకన్నా వీటిలోనే అధికంగా ప్రసవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు కావడంతో ఎక్కువ మంది గర్భిణులు ఆయా ప్రాంతాల్లో ప్రసవాలు చేయించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడైతే మంచి సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతో వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. 15 నెలల కాలంలో 92 శాతం డెలివరీలు ఈ ఆస్పత్రుల్లోనే జరిగాయి. పెద్దాస్పత్రిలో రికార్డు స్థాయిలో.. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రసవాలు హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 15 నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా 12,606 ప్రసవాలు జరగగా.. ఒక్క పెద్దాస్పత్రిలోనే 10,082 ప్రసవాలు జరగడం గమనార్హం. ముఖ్యంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇక్కడ ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు ఆసక్తి చూపుతున్నారు. పెద్దాస్పత్రిలో ప్రతి రోజు 20 నుంచి 30 వరకు ప్రసవాలు చేస్తున్నారు. 90 శాతం వరకు ఇక్కడే ప్రసవాలు జరుగుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు చెపుతున్నాయి. అయితే ఎక్కువ సంఖ్యలో గర్భిణులు పెద్దాస్పత్రికి వస్తుండడంతో ఇక్కడి వైద్యులపై మరింత భారం పడుతోంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యధికంగా ప్రసవాలు జరుగుతుండగా.. పీహెచ్‌సీల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పీహెచ్‌సీల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, మారుమూల ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం వంటి కారణాల వల్ల అక్కడ ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు ఇష్టపడట్లేదని తెలుస్తోంది. సబ్‌సెంటర్ స్థాయిలో అవగాహన పెంచాలి.. పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను సబ్‌సెంటర్ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తే మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. పీహెచ్‌సీల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, ఆర్థికంగా వచ్చే ప్రయోజనం ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల ద్వారా గర్భిణులకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ కిట్ల పథకం వచ్చాక ఎక్కువ మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేసీఆర్ కిట్‌తోపాటు ప్రోత్సాహకం కూడా ఇస్తుండడంతో గర్భం దాల్చిన వెంటనే పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 12,606 ప్రసవాలు జరగగా.. 11,225 మందికి కేసీఆర్ కిట్లు అందించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పీహెచ్‌సీలకు వచ్చేందుకు మాత్రం గర్భిణులు ఇష్టపడటం లేదు. ఆ విధానం మారాలంటే వైద్య, ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతపై వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పీహెచ్‌సీల్లో పెంచేందుకు ప్రణాళికలు పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. సబ్‌సెంటర్లలోని ఆశ, ఏఎన్ఎం, సూపర్వైజర్ల ద్వారా గర్భిణులను గుర్తించి.. వారికి అవగాహన కల్పిస్తున్నాం. దగ్గర్లోని పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరిస్తున్నాం. అలాగే తొలిసారి సాధారణ కాన్పు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. - కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
నాడి పట్టే నాథుడేడి?
ఈదగోని రాజలింగం.. వరంగల్ జిల్లా మరిపెడ.. కూలి పనులతో పొట్టబోసుకుంటాడు.. ఇటీవల వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మధ్యాహ్నం పూట స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు.. అక్కడ డాక్టర్ లేడు.. ఇతర వైద్య సిబ్బంది కూడా లేరు.. చేసేది లేక ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్తే రూ.2,500 ఖర్చయింది! నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడుకు చెందిన కుంభం నాగార్జున (12)కు గత సోమవారం తీవ్రంగా జ్వరమొచ్చింది. చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తే డాక్టర్ లేరు. ఉదయం 10 గం. దాటినా ఎవరూ రాలేదు. దీంతో 15 కి.మీ. దూరంలోని మల్లేపల్లికి వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు!! సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : ..ఇది ఈ ఇద్దరి వ్యథ మాత్రమే కాదు. రాష్ట్రంలోని అనేక పల్లెల్లో పీహెచ్సీ దుస్థితిS ఇలాగే ఉంది. మామూలు రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట దాటితే వైద్యులు పత్తా లేకుండా పోతున్నారు. సెలవు తర్వాత డాక్టర్లు, నర్సులు మధ్యాహ్నం దాటినా అందుబాటులో ఉండటం లేదు. సోమవారం మధ్యాహ్నం 12 దాకా అసలు ఆస్పత్రుల ముఖమే చూడటం లేదు. రాష్ట్రంలోని పది పాత జిల్లాల్లో 675 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ఉండగా.. వాటిలో పనిచేస్తున్న డాక్టర్లలో అత్యధికులు స్థానికంగా ఉండటం లేదు. సమీప పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటూ మొక్కుబడిగా పీహెచ్‌సీకి వెళ్తున్నవారు 90 శాతం దాకా ఉంటారని వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. నల్లగొండ, యాదాద్రి, జనగామ, నాగర్‌కర్నూలు, వికారాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే డాక్టర్లలో 80 శాతం (ఓ డీఎంఅండ్‌హెచ్‌వో అంచనా ప్రకారం) మంది హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మిగిలిన 20 శాతం మంది పాత జిల్లాలు నల్లగొండ, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి వెళ్తున్నారు. దీంతో చాలాచోట్ల డాక్టర్లు అనధికారికంగా ఐదు రోజుల పని దినాలు పాటిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. కొన్నిచోట్ల అయితే వారంలో నాలుగు రోజులు కూడా డాక్టర్లు విధులకు వెళ్లడం లేదని, నర్సులే పీహెచ్‌సీలకు పెద్ద దిక్కు అని వైద్యారోగ్య శాఖ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. శనివారం చాలా చోట్ల డాక్టర్లు విధుల్లో ఉండటం లేదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నల్లగొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు గతంలో ఆయా జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. అయితే నాలుగు రోజులు హడావుడి చేయడమే తప్ప దీనికి పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నామని ఓ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. పలుకుబడి ముందు బలాదూర్ హైదరాబాద్‌కు సమీపంలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పోస్టింగ్‌లు వేయించుకున్న నలుగురు వైద్యులు వారం అంతకంటే ఎక్కువ రోజులు గైర్హాజరు కావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వారిపై చర్యలకు సిద్ధమయ్యే లోపే తమకు సంబంధించిన వారని, చూసీ చూడనట్లు వెళ్లమని సంబంధిత అధికారులకు ఉన్నతస్థాయి నుంచి ఆదేశాయి అందాయి. ఈ నలుగురు వైద్యుల్లో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తనయులు కావడం గమనార్హం. మరొకరు సీనియర్ ఐఎఎస్ అధికారి కూతురు. వీరు పని చేస్తున్న చోట నర్సులే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తుంటారు. మామూలుగా జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఈ కేంద్రాలకు వచ్చేవారే అధికం. డాక్టర్లు లేకపోయినా నర్సులు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. మరీ సీరియస్ కేసు అయితే స్థానికంగా ఉండే లేదా సమీప పట్టణాలకు తీసుకువెళ్లమని సూచిస్తారు. మామూలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం నాలుగు గంటల దాకా పని చేయాలి. కానీ ఏ రోజూ సగటున మూడు గంటలకు మించి ఇవి పని చేయడం లేదని సెస్ గతంలో ఓ నివేదికలో స్పష్టంచేసింది. ‘‘ఆస్పత్రికి వెళ్తే డాక్టర్, ఇతర సిబ్బంది ఎవరూ ఉండటం లేదంటూ వచ్చే ఫిర్యాదులు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయి. ఇవి సగటున రోజు ప్రతి జిల్లాలో వంద దాకా వస్తుంటాయి. కలెక్టరేట్ల నుంచి వచ్చే ఆ ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవడానికి మా వద్ద సరైన యంత్రాంగం కూడా లేదు’’ అని వైద్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది కొరత గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు అటు డాక్టర్లు, ఇటు పారామెడికల్ సిబ్బంది ఆసక్తి చూపకపోవడం కూడా పీహెచ్‌సీల పరిస్థితి దారుణంగా మారడానికి ఓ కారణం. ఏదో మొక్కుబడిగా వారు పనిచేస్తారని, ఒత్తిడి తెచ్చి వారిని ఇబ్బంది పెద్దవద్దంటూ ఇటీవల ఓ ఉన్నతాధికారి ఒక జిల్లా వైద్యాధికారిని మందలించారు. ఇదిలా ఉంటే పీహెచ్‌సీల్లో ఉండాల్సిన మేరకు సిబ్బంది లేకపోవడం వల్ల తెలంగాణలోని 675 పీహెచ్‌సీలు, 264 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఉండాల్సిన మేరకు సిబ్బంది లేరు. ఒక్కో పీహెచ్సీలో ఒక మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్)తో పాటు ఒక ఫార్మాసిస్ట్, ఒక స్టాఫ్ నర్స్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక బ్లాక్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్‌తో పాటు ఒకరు చొప్పున మగ, ఆడ హెల్త్ అసిస్టెంట్లు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి. మొత్తం 675 పీహెచ్సీలలో 40 శాతం అంటే 270 చోట్ల నిర్దేశిత మొత్తంలో సిబ్బంది ఉన్నారు. 200 కేంద్రాల్లో డాక్టర్ ఉన్నా తగిన సంఖ్యలో ఇతర సిబ్బంది లేరు. మరో 205 కేంద్రాల్లో 25 నుంచి 30 శాతం మాత్రమే సిబ్బంది ఉన్నారు. డాక్టర్లు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్ని అన్న స్పష్టమైన వివరాలు లేవని అధికారులు చెపుతున్నారు. పీహెచ్‌సీకి వచ్చిన వారు ఏ రకమైన జ్వరంతో బాధపడుతున్నారో తెలుసుకోవడానికి అవకాశం లేని పీహెచ్‌సీలు 50 శాతం కంటే ఎక్కువ ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ల కొరత వల్ల మామూలు రక్త పరీక్షలకు కూడా పేద ప్రజలు నోచుకోవడం లేదు. -
పీహెచ్‌సీకి జిల్లాస్థాయిలో ప్రశంస
బొంరాస్‌పేట: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) సేవలకు జిల్లా స్థాయిలో ఉత్తమ పీహెచ్సీగా గుర్తింపు అభించింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీఎంఅండ్హెచ్ఓల సమక్షంలో మండల వైద్యాధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ బుధవారం ప్రశంసలు అందుకున్నారు. స్థానిక పీహెచ్సీలో పెరిగిన కాన్పులు, ఓపీలకు అందించిన సేవల విషయంలో ప్రగతి సాధించినందుకుగానూ జిల్లా అధికారుల అభినందనలు లభించాయని డాక్టర్ రవీంద్ర చెప్పారు. మండల వైద్య ఆరోగ్య సిబ్బంది, మండల ప్రజల సహకారంతో పీహెచ్సీ గుర్తింపు దక్కిందన్నారు. మెరుగైన సేవలు కొనసాగిస్తూ మండలానికి ప్రత్యేకను తెచ్చేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈమేరకు ఎంపీడీఓ హరినందనరావు తదితర మండలస్థాయి అధికారులు అభినందనలు తెలియజేశారు. జిల్లా ఉత్తమ పీహెచ్సీ సూపర్వైజర్గా నర్సిములు మర్పల్లి: జిల్లా కలెక్టర్ సమక్షంలో జిల్లా వైద్యాధికారి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ సూపర్వైజర్గా ప్రశంస పత్రం అందుకోవడం సంతోషంగా ఉందని పట్లూర్ పీహెచ్సీ సూపర్వైజర్ నర్సిములు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవంను పురస్కరించుకొని జిల్లాలో జనాభా నియంత్రణ కోసం అత్యుత్తమ సేవలు అందించిన వైద్యశాఖ సిబ్బందికి జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్, జిల్లా వైద్యాధికారి దశరథ్ పలువురికి ఆవార్డులు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో పట్లూర్ పీహెచ్సీ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న నర్సిములుకు బుధవారం కలెక్టర్ సమక్షంలో ఆవార్డుతో పాటు ప్రశంసపత్రం అందజేసినట్లు నర్సిములు తెలిపారు. ఈ అవార్డుతో తనపై మరింత పనిభారం పెరగనుందని ఆయన అన్నారు. ఆవార్డు, ప్రశంస పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్‌కు, జిల్లా వైద్యాధికారి దశరథ్కు నర్సిములు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రజల్లో మార్పు తీసుకురాకపోతే.. మీకెందుకు జీతాలు?
శ్రీకాకుళం, అరసవల్లి: ‘‘సార్ జిల్లాలో సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు ఎక్కువ. గర్భం దశను కూడా కొంతమంది బయటకు చెప్పరు. ♦ డెలివరీలకు ప్రభుత్వ ఆస్పత్రులకు రారు.. వస్తున్నవారు ముహూర్తాలంటూ సిజేరియన్ చేయమంటుంటారు. ♦ చాలా మండలాలు ఒడిశా బోర్టర్‌లో ఉన్నాయి సార్.. ఇక్కడ ఇలాంటి సంప్రదాయ పరిస్థితులతో ఇబ్బందులు తప్పడం లేదు.. ♦ చాలా పీహెచ్‌సీల్లో స్టాప్ లేరు...ఓపీ ఎక్కువగా ఉంటోంది. అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్పత్రుల కు వెళ్లిపోతున్నారు’’ గురువారం జిల్లా పరిషత్ సమావే శ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ సమీక్షను నిర్వహిం చిన జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డికి హాజరైన వైద్యులు, అధికారులు దాదాపుగా చెప్పిన సమాధానాలివి..! ఏ విభాగంలో ప్రగతి అంశాన్ని అడిగినా, వైద్యుల నుంచి ఇవే సమాధానాలు వస్తుండడంతో కలెక్టర్‌కు కోపమోచ్చింది. ‘‘ ఎందుకిలా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు?. 20 ఏళ్ల నాటి పాత కారణాలు పదేపదే చెబుతుంటే వినడానికి నేను సిద్ధంగా లేను.. వెనుకబడిన జిల్లా కాబట్టే ఇన్ని గంటలపాటు సమీక్షలు చేయాల్సి వస్తోంది..అయినా మీరు పనిచేస్తున్న ప్రాంతాల ప్రజల్లో మార్పులు తేలేకపోతే మీకెందుకు జీతాలు..? ప్రజలు మారడం లేదా...లేదా మీరు హ్యాపీగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారా..! ఎందరు గ్రామాల్లో ఉన్నారో..ఇంకెందరు పట్టణాల్లో ఉన్నారో ..నాకు తెలియదనుకున్నారా...! అంటూ కలెక్టర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో సమావేశం సీరియస్‌గా మారిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపై నమ్మకం పెరగాలి గ్రామీణ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై నమ్మకం కలిగించేలా విధులు నిర్వహించా లని కలెక్టర్ వైద్యులకు సూచించారు. 24 గంటల ఆస్పత్రుల్లో తప్పనిసరిగా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఖాళీగా ఉన్న వైద్యయేతర పోస్టులను ఈ నెల 20వ తేదీలోగా అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని డీఎంహెచ్‌వో తిరుపతిరావును ఆదేశించా రు. ఇటీవల తాను ఓ ప్రభుత్వ పాఠశాలలో 238 మంది విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశానని.. అయితే అక్కడ అమ్మాయిలకు చూపు సామర్ధ్యం –6, –4 కూడా ఉండడం బాధించిందన్నారు. ఇక మీదట జిల్లాలో విద్యార్థులందరికీ నేత్ర పరీక్షలు చేయాలని, అవసరమైతే చికిత్సలు కచ్చితంగా జరగాలన్నారు. ఈ ప్రక్రియను వైద్యులు ఉద్యమంలా చేయాలని.. ఇందుకోసం రూ.50 లక్షలైనా నిధులు ఇస్తానని ప్రకటించారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘తల్లీబిడ్డ’ ఎక్స్‌ప్రెస్‌పై అనుమానాలు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల వినియోగంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కలెక్టర్ అన్నా రు. జిల్లాలో 2016–17లో 20 వేలకు పైగా డెలివరీలు అయితే 11,205 మంది మాత్రమే ఈ వాహన సేవలను వినియోగిచుకున్నారన్నారు. అలాగే 2017–18లో డెలివరీలు 16,082 కాగా, వాహనాలను విని యోగించుకున్నవారు కేవలం 9,785 మంది మాత్రమే నమోదయ్యావన్నారు. ఓడీఎఫ్ ఉద్యమంలో కీలకంగా వ్యవహారించాలి జిల్లాను ఈ ఏడాది మార్చి 31 నాటికి ఓడీఎఫ్ జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో ఉద్యమంగా పనిచేస్తున్నామని, ఇందులో ప్రతి వైద్యుడు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు. మీ వద్దకు వచ్చే రోగులతో అదనంగా రెండు నిమిషాలు మాట్లాడి వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఉపాధ్యాయుడు, వైద్యుడికి చాలా గౌరవం ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాల్లో వీరి భాగస్వామ్యం కీలకమన్నారు. ఉద్దానంలోని 8 మండలాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని కోరారు. కిడ్నీ వ్యాధుల నిర్ధారణకు కొందరు సోషల్ సిగ్మాతో వెనకంజ వేస్తున్నారని, దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు వైద్యం కోసం వేలాది రూపాయాలు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ఈ ప్రాంతంలో వైద్య పరీక్షలు అందరికీ జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ మాత్రమే చేయగలదని తాను విశ్వసిస్తున్నానన్నారు. ఏజెన్సీలో రక్తహీనత (హెచ్‌బీ) 11కి మించి పెరిగేలా చర్యలు చేపట్టాలని, అందుకు తగ్గ సూచనలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. పీహెచ్‌సీల్లో పనితీరుపై అసంతృప్తి పీహెచ్సీలో ఆంటీనాటల్ చెకింగ్ (ఏఎన్సీ), ఎర్లీ ఆంటీనాటల్ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని తాడివలస, గోవిందపురం, బూరాడ, బొరివంక, తొగరాం, సారవకోట, కొర్లాం, కంచిలి, వెంకటాపురం, బూరగాం, కె.సైరిగాం, దండుగోపాలపురం, కింతలి తదితర సీహెచ్‌సీల్లో పనితీరు, ప్రగతి రిపోర్టులు బాగాలేవని, దీనిపై వైద్యుల నుంచి వచ్చిన సమాధానాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలు డాక్టర్లుగా ఉన్నచోట కూడా డెలివరీలు జరగకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాత్రమే మేం మాట్లాడతాం..బయట వారిని ఏఎన్ఎంలు చూసుకుంటారులే అని వైద్యులు భావిస్తే సహించనని హెచ్చరించారు. మీరంతా అసలు ఆస్పత్రుల్లో ఉంటున్నారా? ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పీహెచ్‌సీల్లో వెంటనే విచారణ చేపట్టి, వైద్యులు చెబుతున్న కారణాలు నిజమో కాదో నివేదిక అందజేయాలని డీఎంహెచ్‌వో తిరుపతిరావు కలెక్టర్ ఆదేశించారు. నిజంగా మీకు గుర్తింపు రావాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేయాలని, ఇక ఇలాంటి కారణాలు, నిర్లక్ష్యం మళ్లీ కనిపిస్తే చర్యలు తప్పవన్నా రు. సమావేశం అనంతరం ఐసీడీఎస్ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించా రు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ఈ రెండు శాఖలు సమన్వయంగా పనిచేయాల్సి ఉందని సూచించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి బొడ్డేపల్లి సూర్యారావు, డీఐవో బగాది జగన్నాథరా వు, అడిషినల్ డీఎంహెచ్‌వో మెండ ప్రవీణ్, వై.వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ లీలావతి, పీవో పక్కి చంద్రకళ, నోడల్ అధికారిణి సీహెచ్. ఝాన్సీ, మాస్ మీడియా ప్రచార అధికారి పాలవలస విశ్వనాథం పాల్గొన్నారు. -
సివిల్ ఆస్పత్రికి చికిత్స చేయరూ!
చిట్యాల : మండల కేంద్రంలోని వైద్య విధానపరిషత్ సామాజిక వైద్యశాల జిల్లా విభజనకు ముందు ప్రసూతి ఆపరేషన్లలో రాష్ట్ర స్థాయిలో రికార్డు సాధించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో 190 రోజుల్లో 175 ప్రసూతి ఆపరేషన్లు ఆస్పత్రి నిర్వహించి వైద్యులు రికార్డు నెలకొల్పారు. రోగులకు, గర్భిణీలకు మెరుగైన వైద్యసేవలందిస్తూ భూపాలపల్లి నియోజకవర్గంలో ఆదర్శ ఆస్పత్రిగా పేరు గడించింది. కష్టాలు మొదలు.. ఆస్పత్రికి గత నెల 20 నుంచి కష్టాలు మొదలయ్యాయి. గత నెల 19న స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వెలిశాల పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ క్రమంలో చిట్యాల సివిల్ ఆస్పత్రిలో పని చేస్తున్న నలుగురు డాక్టర్లను డిప్యూటేష¯ŒS పై ఎందుకు పంపావని జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల సంజీవయ్యను అడిగారు. దీంతో డిప్యూటేషన్లను రద్దు చేయాల్సింది పోయి మరుసటి రోజు మరో డాక్టర్‌ను జనగాంకు డిప్యూటేష¯ŒS పై పంపారు. మొత్తం నూతన జిల్లాల్లో ఏ ఆస్పత్రి సూపరింటెండెంట్ పోస్టును ఎత్తివేయలేదు. కానీ చిట్యాల సివిల్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ పోస్టును జిల్లా కో ఆర్డినేటర్ రద్దు చేసినట్లు వైద్యశాఖలో చర్చ జరుగుతోంది. పాత జిల్లాలో పది సివిల్ ఆస్పత్రిల్లో చిట్యాల ఆస్పత్రి పేరు లేకపోవడంతో వచ్చే నిధులు రాకుండాపోయాయనే విమర్శలు వినబడుతున్నాయి. గర్భిణులను వెనక్కి పంపిన వైనం.. సివిల్ ఆస్పత్రిలో ప్రసూతి ఆపరేషన్లు చేసే డాక్టర్ పద్మను సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా జయశంకర్ జిల్లా కో ఆర్డినేటర్‌గా నియమించారు. ఈక్రమంలో బుధవారం ఆరుగురు గర్భిణులు ప్రసూతి కోసం ఆస్పత్రికి వచ్చారు. ఇప్పటి వరకు 100కు పైగా ప్రసూతి ఆపరేషన్లు చేసిన డాక్టర్ పద్మ ఇప్పుడు చేయలేనని నిరాకరించారు. ఒక ఆపరేష¯ŒSకి అనస్తీషియా డాక్టర్‌కు రూ.1200 లు ఇవ్వలేనని చెప్పడంతో ఆరుగురు గర్భిణులు వెనక్కి పంపడం మండల కేంద్రంలో చర్చనీయాంశమైంది. స్పీకర్ మధుసూదనాచారి, జిల్లా కలెక్టర్ మురళి చిట్యాల సివిల్ ఆస్పత్రిని సందర్శించి అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేసి, ఆస్పత్రికి సూపరింటెండెంట్‌ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. వైద్యసేవలు, ప్రసూతి కాన్పులు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.