మూసాపేట మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
సాక్షి, పాలమూరు : జాతీయ స్థాయిలోనే జిల్లా లోని మూసాపేట మండలం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సత్తా చాటింది. జాతీయ ప్రమాణ ధ్రువపత్రం కోసం రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో 29 పీహెచ్‌సీలు పోటీ పడగా జానంపేటకు పీహెచ్‌సీ 97 మార్కులతో మొదటి స్థానం దక్కించుకుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం నుంచి తాజాగా ధ్రువీకరణ పత్రం అందింది. అంతేకాకుండా జిల్లా లోని మరికల్, మిడ్జిల్ పీహెచ్‌సీలు సత్తా చాటి మెరుగైన మార్కులు సాధించాయి. ఇలా ఒకే జిల్లాలో మూడు పీహెచ్‌సీలు ఒకేసారి ధ్రువీకరణ పత్రాలు అందుకోవడం అరుదైన ఘటనగా వైద్య,ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
97 మార్కులు
ఏటా జాతీయ ప్రమాణ ధృవపత్రం అందజేసేందుకు పీహెచ్‌సీలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బృందాలు పరిశీలిస్తాయి. ఈ మేరకు రాష్ట్రంలో 29 పీహెచ్‌సీలు దరఖాస్తు చేయగా.. జిల్లా నుంచి జానాపేట, మరికల్, మిడ్జిల్ నుంచి దరఖాస్తులు వెళ్లాయి. ఇందులో భాగంగా ఆగస్టు 10, 11వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆయా పీహెచ్‌సీలను పరిశీలించి వెళ్లారు. తాజాగా జానంపేట పీహెచ్‌సీకి 97 మార్కులతో రాష్ట్రంలోనే మొదటి స్థానం కేటాయిస్తూ ధృవీకరణ పత్రం జారీ చేశారు.
అలాగే, మిడ్జిల్ పీహెచ్‌సీకి 94.6 మార్కులు, మరికల్ పీహెచ్‌సీకి 90.2 మార్కులు కేటాయించి పత్రాలు అందజేశారు. వైద్యులు, ఉద్యోగుల పనితీరుతో పాటు సౌకర్యాల కల్పన, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల వారీగా మార్కులు కేటాయించారు. కాగా, జాతీయ ప్రమాణ ధృవీకరణ పత్రాలకు ఎంపికైన జానంపేట, మిడ్జిల్, మరికల్ పీహెచ్‌సీలకు ఏటా రూ.3లక్షల చొప్పున మూడేళ్ల పాటు రూ.9లక్షల నిధులు అందనున్నాయి.
ఏయే అంశాల్లో..
పీహెచ్‌సీల పరిశీలన సందర్భంగా కేంద్రప్రభుత్వ అధికారులు పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు పీహెచ్‌సీలకు వస్తున్న రోగులతో సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది, ఆప్యాయంగా ఉంటున్నారా అని చూడడంతో పాటు మందులు సక్రమంగా ఇస్తున్నారా, స్వాంతన కలి గించే విధంగా మాట్లాడుతున్నారా అని పరిశీలించారు. అలాగే, ఆస్పత్రిలో మంచాలు, పరుపులు, బెంచీలు, కుర్చీల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత, ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందా, లేదా అని చూశారు. ఇలా పలు అంశాల ప్రాతిపదికన మార్కులు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment