PHC center
-
ఆసుపత్రిలో కరెంట్ లేకపోతే ఎట్లా?
గోల్కొండ (హైదరాబాద్): ‘ఆసుపత్రిలో ఇన్నాళ్లు కరెంటు లేకపోతే మీరు ఏం చేస్తున్నారు’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఓ ప్రాథమిక ఆరోగ్య (పీహెచ్సీ) కేంద్రం మెడికల్ ఆఫీసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గుడిమల్కాపూర్ ఉషోదయ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు మూడు నెలలుగా ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంపై ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కవితపై మండిపడ్డారు. బాధ్యతగల ప్రభుత్వ అధికారిగా ఉంటూ ఇన్నాళ్లూ ఆసుపత్రిలో కరెంటు లేకపోయినా పట్టించుకోకపోవడం తగదని అన్నారు. పేద ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు ఇలా ఉంటే ఎట్లా? అని మండిపడ్డాడు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆసుపత్రుల కోసం ప్రత్యేక నిధులు వస్తాయని, కరెంటు పునరుద్ధరణ గురించి ఉన్నతాధికారులను ఎందుకు అడగలేకపోయారని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధి సలహాలు, సూచనలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ఆయన డాక్టర్ కవితను నిలదీశారు. అనంతరం కార్వాన్ క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాధతో ఫోన్లో మాట్లాడి ఉషోదయకాలనీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కరెంటు లేకపోవడంపై నిలదీశారు. పీహెచ్‌సీలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన మీరు ఎందుకు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారుల పనితీరు ఇలా ఉంటే ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు ఎలా అందిస్తారని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. వెంటనే ఉషోదయకాలనీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కరెంటు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి ఆదేశించారు. కాగా, మూడు నెలలకిందట ఈ పీహెచ్సీలో షార్ట్‌సర్క్యూట్‌తో కరెంటువైర్లు కాలిపోయాయని, దాంతో అప్పటి నుంచి కరెంటు లేకుండా పోయిందని తెలుస్తోంది. గత కొంతకాలం నుంచి ఈ ఆరోగ్య కేంద్రం పనితీరుపై స్థానికులు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు కేంద్రమంత్రి ఈ ఆసుపత్రిని సందర్శించడంతో పీహెచ్సీ పనితీరు మారుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
9 నుంచి 5 వరకు డ్యూటీలో ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రతి ఒక్క వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. 24 గంటలు నడిచే పీహెచ్‌సీలు అత్యవసర సేవలను అన్ని వేళల్లో అందించాలని చెప్పారు. పాము, కుక్క కాటు మందులు పీహెచ్‌సీల్లో ఉండాలని.. మందుల్లేక వైద్యం అందలేదని ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీహెచ్‌సీల్లో అన్ని రకాల మందులు అందుబాటు లో ఉండేలా చూసుకోవాలని, మందుల కోసం బయటికి రాస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమీకృత ఆరోగ్య సమాచార వ్యవస్థలో ఎప్పటికప్పుడు వివరాలు అప్లోడ్ చేయాలని.. టి–డయాగ్నొస్టిక్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. డీఎంహెచ్వోలు ఆకస్మిక తనిఖీలు చేసి పనితీరును పరిశీలించాలని ఆదేశించారు. పీహెచ్‌సీల పనితీరుపై మంగళవారం అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజరీ సిబ్బందితో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీహెచ్‌సీలు ముఖ్యం ప్రజారోగ్య రక్షణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) పాత్ర ప్రధానమైనదని మంత్రి అన్నారు. ప్రాథమిక స్థాయిలో వ్యాధిని గుర్తించి చికిత్స చేస్తే తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు రాకుండా ప్రజలను కాపాడొచ్చని చెప్పారు. పీహెచ్సీ స్థాయికి ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని, ఇందుకు అనుగుణంగా అన్ని పీహెచ్‌సీలు ఎన్రోల్ చేసుకోవాలని మంత్రి సూచించారు. సాధారణ ప్రసవాలు పెంచాలని.. వైద్యులకు, నర్సులకు ప్రోత్సాహాకాలు ఇస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఉండి సేవలు అందిస్తున్న వైద్యులకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 30% ఇన్ సర్వీస్ కోటా కల్పించామని చెప్పారు. పీహెచ్‌సీల స్థానంలో కొత్త నిర్మాణాలు పాత పీహెచ్‌సీల స్థానంలో అవసరమైతే కొత్త నిర్మాణాలు చేపడతామని, మరమ్మతులు అవసరమున్న వాటిల్లో వెంటనే పనులు మొదలు పెడతామని, అందుకు నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. డీఎంహెచ్వోలు, డిప్యూ టీ డీఎంహెచ్వోలు, ఇంజనీర్లు పరిశీలించి వారంలో ప్రతిపాదనలు పంపాలన్నారు. టెలి మెడిసిన్ విధానాన్ని విస్తృతంగా వినియోగించుకొవాలని చెప్పారు. -
85% పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యులు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యమే పరమావధిగా భావిస్తూ.. గ్రామస్థాయిలో వైద్యసేవల విస్తరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ వైద్యం చేరువ కావడంతో గ్రామీణ ప్రజల్లో సంతోషం కనిపిస్తోంది. ప్రతి మండలంలోను ఐదుగురు డాక్టర్లు అందుబాటులో ఉండటంతో ప్రజలకు మరింతగా వైద్యసేవలు అందనున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ పద్ధతిలో అన్ని కుటుంబాలకు వైద్యసదుపాయం కలగనుంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో (పీహెచ్‌సీల్లో) డాక్టరు ఉంటారో లేదో అన్న పరిస్థితి నుంచి ఎప్పుడు వైద్యానికి వెళ్లినా డాక్టరు అందుబాటులో ఉంటారన్న భరోసా వచ్చింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఇద్దరు వైద్యులను నియమించడంతో గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కనిపిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలన్న ఆలోచన నుంచి బయటపడుతున్నారు. అందుబాటులో డాక్టరు ఉన్నప్పుడు మళ్లీ ప్రైవేటు ఆస్పత్రికి ఎందుకన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు వైద్యుల నియామకం తర్వాత వైద్యుల్లోను కొంత బాధ్యత పెరిగింది. గతంలో ఎంబీబీఎస్ చదివినా ఉద్యోగాలు ఉండేవి కావు. ఈ పరిస్థితుల్లో పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉండాలన్న నిర్ణయంతో వారికి ప్రభుత్వ సర్వీసులో పనిచేసే అవకాశమూ వచ్చింది. ఇలా ప్రాథమిక వైద్యం బలోపేతం అవుతోంది. ప్రతి గ్రామానికి వైద్యుడి రాక ప్రతి మండలంలో 2 పీహెచ్‌సీల్లోను నలుగురు డాక్టర్లు ఉంటారు. ఒక్కో పీహెచ్‌సీలోని ఇద్దరు డాక్టర్లు దాని పరిధిలోని గ్రామాలను విభజించుకుని ప్రతి గ్రామానికి నెలకు రెండుసార్లు వెళతారు. 104 వాహనం నెలకు ఒకసారి ప్రతి గ్రామానికి వెళుతుంది. అందులో వైద్యుడు ఉంటారు. దీంతో గ్రామంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ వైద్యులు అందుబాటులో ఉన్నట్లవుతుంది. గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ఉంటుంది. అక్కడికి వెళ్లినవారికి అవసరాన్ని బట్టి అక్కడి సిబ్బంది పీహెచ్‌సీలోని వైద్యుడితో మాట్లాడించి చికిత్స అందిస్తారు. ఓపీ సేవల్లో మార్పులు పీహెచ్‌సీల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు 12 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉండాలి. ఉదయం 8 గంటలకు వచ్చిన వైద్యుడు మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన డాక్టరు రాత్రి 8 గంటల వరకు పనిచేయాలి. ఆ తర్వాత ఎవరైనా అవసరం ఉండి వైద్యానికి రావాలనుకుంటే ఆన్‌కాల్ అంటే ఫోన్ చేస్తే వైద్యం చేయడానికి డాక్టరు విధిగా రావాల్సిందే. ప్రస్తుతం ప్రతి పీహెచ్సీలోను ఒక వైద్యుడు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీలు ఉండగా, కొత్తగా 179 ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రతి మండలంలో 2 వంతున మొత్తం 1,328 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉంటాయి. ఇప్పటికే 85 శాతం పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యుల నియామకం పూర్తయింది. 2019 తర్వాత భారీసంఖ్యలో వైద్యులను నియమించారు. రోగ నిర్ధారణ పరీక్షల విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో మెడాల్ వంటి సంస్థలు ల్యాబ్టెస్టులు చేసేవి. ఇప్పుడు పీహెచ్‌సీలోనే 14 రకాల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి పీహెచ్సీలో ల్యాబ్‌టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పక్కాగా ఉంటున్నారు. అప్పట్లో చాలాచోట్ల ఒకరు, కొన్నిచోట్ల ఇద్దరు స్టాఫ్‌నర్సులు ఉండేవారు. ఇప్పుడు ప్రతి పీహెచ్సీలో ముగ్గురు స్టాఫ్‌నర్సులను ఏర్పాటు చేశారు. ఇద్దరు డాక్టర్లు వచ్చాక బాగా మార్పు ఇద్దరు వైద్యులను నియమించాక పేషెంట్లలో ధైర్యం వచ్చింది. ఎప్పుడు ఆస్పత్రికి వెళ్లినా డాక్టరు ఉంటారనేది వాళ్ల నమ్మకం. ప్రస్తుతం ఒక డాక్టరు వ్యాక్సిన్ ప్రక్రియలో ఉన్నారు. వచ్చాక షిఫ్ట్ పద్ధతిలో పనిచేస్తాం. - డాక్టర్ ప్రశాంత్, మెడికల్ ఆఫీసర్, నెల్లిమర్ల పీహెచ్సీ, విజయనగరం జిల్లా ఇప్పుడు ప్రసవాలూ చేస్తున్నాం ఇద్దరు వైద్యులు వచ్చాక ఇప్పుడు ప్రసవాలు కూడా చేస్తున్నాం. ముగ్గురు స్టాఫ్ నర్సులను ఇచ్చారు. ఒక డాక్టరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకుంటాం. నెలకు కనీసం 5 సాధారణ ప్రసవాలు చేస్తున్నాం. కోవిడ్ దృష్ట్యా కొద్దిగా ఓపీ తగ్గింది కానీ.. సాధారణ పరిస్థితుల్లో బాగా రోగులు వస్తారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది. మందుల కొరత లేకుండా చేశారు. - డాక్టర్ ప్రతిమ, మెడికల్ ఆఫీసర్, వెనిగండ్ల పీహెచ్సీ, గుంటూరు జిల్లా కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కొన్ని పీహెచ్‌సీల్లో మాత్రమే ఇద్దరు వైద్యులు లేరు. వాటిలో ఉన్న రెండో వైద్యుడి ఖాళీతో పాటు కొత్తగా వచ్చే 179 పీహెచ్‌సీలకు వైద్యుల నియామకానికి ఆర్థికశాఖ ఆమోదానికి పంపించాం. ఆమోదం రాగానే వాటిలో కూడా వైద్యుల భర్తీ జరుగుతుంది. ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు వచ్చాక పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యం అందుతోంది. - డాక్టర్ గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు ప్రతి మండలంలో 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఒక్కోదాన్లో ఇద్దరు వైద్యులు. మండలానికి ఒక 104 వాహనం. అందులో ఒక వైద్యుడు. వెరసి ఐదుగురు వైద్యులు మండల ప్రజలకు వైద్యసేవలు అందించనున్నారు. ఇక ప్రతి గ్రామంలోను వైఎస్సార్ హెల్త్‌క్లినిక్ అందుబాటులో ఉంటుంది. -
కరోనా: ఆర్ఎంపీల అత్యుత్సాహం.. టైపాయిడ్ పేరిట వైద్యం
‘జన్నారం మండల కేంద్రంలోని ఓ వ్యక్తికి ఇటీవల జ్వరం వచ్చింది. కరోనా పరీక్ష కోసం స్థానిక పీహెచ్‌సీకి వెళ్లాడు. అక్కడ కీట్ల కొరతతో పరీక్ష చేయలేదు. జ్వరం తీవ్రత పెరగడంతో ఓ ప్రైవెట్ క్లినిక్‌కు వెళ్లాడు. బ్లడ్ టెస్ట్ చేసిన సదరు ఆర్ఎంపీ టైపాయిడ్ అని చెప్పి చికిత్స ప్రారంభించాడు. ఐదు రోజులకు మందులు ఇచ్చాడు. మందులు వాడినా ఫలితం లేకపోవడంతో బాధితుడు మళ్లీ పీహెచ్‌సీకి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. కోవిడ్ నిర్ధారణలో జాప్యం, ఆర్ఎంపీ తెలిసీ తెలియని వైద్యంతో బాధితుడు ఐదు రోజులు కుటుంబ సభ్యులతో ఉన్నాడు. ఫలితంగా అతడి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులకు కూడా వైరస్ సోకింది. ‘జిల్లాకు చెందిన ఓ నాయకుడితోపాటు అతడి కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా సోకింది. అందరూ హోం క్వారంటైన్లో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇటీవల కోలుకోగా, సదరు నాయకుడికి షుగర్ వ్యాధి ఉండడంతో స్థానికంగా ఓ ప్రైవేటు క్లినిక్ వైద్యుడిని సంప్రదించాడు. ఆయన మంచిర్యాలలో తనకు తెలిసిన ఆస్పత్రి ఉందని, అక్కడ చికిత్స చేయించుకోవాలని రెఫర్ చేశాడు. ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రి యాజమాన్యంతో రూ.4 లక్షలకు ప్యాకేజీ మాట్లాడినట్లు తెలిసింది. ఈ ప్యాకేజీలో రూ.2 లక్షలు ముందే చెల్లించాడు. పది రోజుల తర్వాత భార్య నగలు అమ్మి మిగతా రూ.2 లక్షలు చెల్లించాడు. ఇందులో సదరు క్లినిక్ యజమానికి రూ.15 నుంచి 20 శాతం కమీషన్ వచ్చినట్లు తెలిసింది. సాక్షి,ఖానాపూర్: కరోనా బాధితుల కష్టాలు గ్రామీణ వైద్యులు అయిన ఆర్ఎంపీలు, పీఎంపీలకు సందపగా మారాయి. కోవిడ్ సెకండ్ వేవ్ ఒకవైపు విజృంభిస్తుంటే.. గ్రామీణ వైద్యులు అత్యుత్సాహంతో బాధితులకు చికిత్స చేస్తూ కాసులు దండుకుంటున్నారు. పరిస్థితి విషమించిన తర్వాత పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులతో కమీషన్ మాట్లాడుకుని రెఫర్ చేస్తున్నారు. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్ట్ కిట్ల కొరత గ్రామీణ వైద్యుల దందాకు అండగా నిలుస్తోంది. పీహెచ్సీలలో టెస్ట్ చేయకపోవడంతో కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఆర్ఎంపీలు, పీఎంపీలు రక్త పరీక్షలు నిర్వహించి టైఫాయిడ్, వైరల్, సీజనల్ జ్వరాల పేరిట దోపిడి చేస్తున్నారు. కిట్ల కొరతతో క్లినిక్‌లకు.. కరోనా మొదటి వేవ్ సమయంలో గ్రామాల్లో జ్వరం వచ్చిన వారికి వైద్యం చేయడానికి కూడా గ్రామీణ వైద్యులు భయపడ్డారు. వైరస్ ఎక్కడ తమను అంటుకుంటుందో అని నాడి పట్టేందుకు కూడా వెనుకాడారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ విజృంభిస్తుండడం, గ్రామీణులు కూడా వైరస్ బారిన పడుతుండడంతో ఆర్ఎంపీలు, పీఎంపీలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్సకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటిజెన్ కిట్లు అందుబాటులో లేక టెస్టులు తగ్గించడం వీరికి కలిసొస్తుంది. పీహెచ్సీలలో పరిమిత సంఖ్యలో టెస్టులు చేస్తుండడంతో మిగతావారు క్లినిక్‌లకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రైవేటు క్లినిక్‌లలో కోవిడ్ టెస్టులకు అనుమతి లేకపోవడంతో రక్త పరీక్షలు నిర్వహించి టైఫాయిడ్ జ్వరం అంటూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. చదవండి: కరోనా కల్లోలం: ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి అడ్మిషన్లు కూడా.. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులను కొంతమంది క్లినిక్‌ల నిర్వాహకులు అడ్మిట్ కూడా చేసుకుంటున్నారు. ఇందుకు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. టైఫాయిడ్‌కు ఐదు రోజుల కోర్సు అంటూ క్లినిక్‌లోనే ఉంచుకుని మందులు ఇస్తున్నారు. ఇందుకు బాధితుడి ఆర్థిక పరిస్థితిని బట్టి ఫీజు వసూలు చేస్తున్నారు. మందులకు అదనంగా చెల్లించాల్సిందే. ఇంతలో పరిస్థితి మెరుగు పడితే ఇంటికి.. విషమిస్తే వాళ్లకు తెలిసిన ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. పరిస్థితి విషమిస్తే... క్లినిక్‌లలో లేదా ఇంటి వద్ద ఉండి ఆర్ఎంపీ, పీఎంపీ ద్వారా చికిత్స పొందుతున్నవారిలో చాలా మంది పరిస్థితి విషమిస్తోంది. కోవిడ్ నిర్ధారణ చేయకుండా తమకు తెలిసీ తెలియని వైద్యం చేస్తుండడంతో వారం రోజుల్లోనే బాధితుల్లో ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో గ్రామీణ వైద్యులు చేతులెత్తేస్తున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని, వెంటనే మంచిర్యాల లేదా కరీంనగర్, హైదరాబాద్ తీసుకెళ్లాలని బంధువులకు సూచిస్తున్నారు. తమకు తెలిసిన ఆస్పత్రికి తీసుకెళ్లే మెరుగైన వైద్యం అందుతుందని చెబుతూ కమీషన్ ఎక్కువ ఇచ్చే కార్పొరేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్సకు చెల్లించే బిల్లుపై 10 నుంచి 15 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా క్లినిక్‌లు.. కరోనా వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మండల కేంద్రాల్లోని ప్రైవేటు క్లినిక్‌లు మారుతున్నాయి. జ్వరంతో వచ్చే వారికి టైఫాయిడ్ అని నిర్ధారిస్తూ వైద్యం చేస్తున్నారు. బాధితులు కూడా తమకు టైఫాయిడ్ అనుకుని కుటుంబ సభ్యులతో కలిసే ఉంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. దీంతో కోవిడ్ ఉన్నవారి నుంచి నాలుగైదు రోజుల్లో కుటుంబ సభ్యులకు వ్యాపిస్తోంది. అడ్మిట్ అయిన వారికి కూడా చికిత్స చేయడం.. ఇతర సమస్యలతో వచ్చే వారికి కూడా అక్కడే చికిత్స అందిస్తుండడంతో వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇలా గ్రామాల్లోనూ వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోంది. పట్టించుకోని అధికారులు.. అనుమతి లేకుండా క్లినిక్‌లు, ల్యాబ్‌లు నిర్వహిస్తూ పరీక్షలు చేస్తున్న వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి గ్రామీణ వైద్యులు చికిత్స చేయొద్దని ప్రభుత్వం చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు గ్రామాలవైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో సెకండ్ వేవ్ పల్లెలనూ తాకింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారుల స్పందించి ప్రైవేటు క్లినిక్‌లు, ఆర్ఎంపీలు, పీఎంపీలు కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి చికిత్స చేయకుండా కట్టడి చేయాలని టైఫాయిడ్ పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు. -
వ్యాక్సిన్‌కు ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు
సాక్షి, హైదరాబాద్: లబ్ధిదారులు నేరుగా కేంద్రాలకే వచ్చి కరోనా టీకా వేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్కడకు వచ్చాక కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేస్తారు. అనంతరం వారికి టీకా వేస్తారు. ఇక నుంచి యాప్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి కాదని సర్కారు తేల్చి చెప్పింది. అయితే ఎవరైనా తమ పేర్లను ముందస్తుగా నమోదు చేసుకోవాలంటే, అటువంటి వారికి కూడా అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం కోవిన్ యాప్‌లో పేర్లు నమోదైన వారికే టీకా వేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే దానిలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. కోవిన్ యాప్‌తో సమస్యలు ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం సెకండ్ వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తోంది. అది ఒకట్రెండు రోజుల్లో విడుదల కానుందని వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో లబ్ధిదారులు నేరుగా వచ్చి టీకా వేసుకోవడంతో పాటు, ముందస్తుగానూ రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. దాదాపు 55 లక్షల మందికి.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలు వేయాలని నిర్ణయించారు. అందుకోసం రాష్ట్రంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వాస్తవంగా 50 ఏళ్లు పైబడిన వారందరికీ, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ టీకా వేయాలనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ కేటగిరీ వ్యక్తులు రాష్ట్రంలో 69 లక్షల మంది ఉంటారు. అయితే తాజా నిర్ణయంతో ఆ సంఖ్య 55 లక్షలకు పడిపోనుంది. అంటే రాష్ట్రంలో 14 లక్షల మంది కరోనా టీకా లబ్ధిదారులు తగ్గుతారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. 60 ఏళ్లు పైబడిన వారు రాష్ట్రంలో 45 లక్షల మంది.. 45 నుంచి 60 ఏళ్లలోపు వారు దాదాపు 10 లక్షల మంది ఉంటారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు లెక్కగట్టారు. వీరందరికీ టీకా ఉచితంగానే వేస్తారని తెలిపారు. 1,500 కేంద్రాల్లో.. రోజుకు లక్షన్నర మందికి ఇక రాష్ట్రంలో టీకా కార్యక్రమం 1,500 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ‘పీహెచ్సీ స్థాయి నుంచి గాంధీ, ఉస్మానియా సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ జాబితాలోని 230 ప్రైవేట్, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ టీకా కేంద్రాలుంటాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మంది చొప్పున లక్షన్నర మందికి వేసేలా లక్ష్యం పెట్టుకున్నాం. గ్రామాల్లో ఉన్న ఆయా లబ్ధిదారులంతా సమీపంలో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి టీకా వేయించుకోవచ్చు. లబ్ధిదారులు టీకా వేయించుకునేలా ప్రోత్సహించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలను కోరాం. పీహెచ్‌సీలు మండలానికి ఒకటి చొప్పున ఉంటాయి. అయితే మున్ముందు లబ్ధిదారులకు ఇబ్బంది కలిగితే, రాష్ట్రంలో 4,500కు పైగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. అంటే రానున్న రోజుల్లో రాష్ట్రంలో 6 వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. రాష్ట్రంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేస్తున్నాం. అందులో లబ్ధిదారుల ఇష్టానుసారంగా కాకుండా, కేంద్రంలో ఏ వ్యాక్సిన్ ఉంటే దాన్నే వేసుకోవాలి. ప్రతీ కేంద్రంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండవు. ఒక్కోచోట ఒక కంపెనీ వ్యాక్సిన్‌ను ఉంచుతారు. కాబట్టి లబ్ధిదారులకు ఎలాంటి చాయిస్ ఇవ్వడం లేదు..’అని శ్రీనివాసరావు తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు ఇలా.. ఇక 60 ఏళ్లు పైబడిన ప్రజలను గుర్తించేందుకు వారి వద్ద ఉండే ఓటర్ ఐడీ కార్డు సహా ఏదైనా వయసు తెలియజేసే కార్డు తీసుకొని రావాలి. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను మాత్రం తమ వద్ద ఉన్న కొద్దిపాటి సమాచారం ఆధారంగా గుర్తిస్తారు. తమ వద్ద సమాచారం లేని మిగిలిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైనా డాక్టర్ వద్ద వైద్యం చేయించుకున్నట్లు ప్రిస్కిప్షన్, వైద్య పరీక్షల నివేదికలు తీసుకొని రావాలి. అలాగే వయసును తెలియజేసే గుర్తింపు కార్డులు కూడా తేవాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు త్వరలో కేంద్రం విడుదల చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక టీకా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఒక బృందం రానుంది. కోవిన్–2 వెర్షన్‌పైనా వారు స్పష్టత ఇస్తారు. నేరుగా వచ్చిన లబ్ధిదారుల పేర్లను టీకా కేంద్రంలో ఎలా నమోదు చేయాలో శిక్షణ ఇస్తారు. నేటి నుంచి 4 రోజులు మాప్‌అప్ రౌండ్ ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి టీకా మొదటి డోస్ పూర్తి కాగా రెండో డోస్ నడుస్తోంది. ఇక ఫ్రంట్‌లైన్ వర్కర్లకూ మొదటి డోస్ దాదాపు పూర్తయింది. అయితే వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో చాలామంది ఇంకా మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకోలేదు. చాలా మంది మిగిలిపోయారు. 3.31 లక్షల మంది వైద్య సిబ్బంది టీకా వేసుకోవాల్సి ఉండగా, వారిలో 1.96 లక్షల మంది మాత్రమే మొదటి డోస్ వేసుకున్నారు. అలాగే 2.57 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 89 వేల మంది మాత్రమే టీకా వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకోని మిగిలిన వారందరికీ గురువారం నుంచి నాలుగు రోజుల పాటు మాప్‌అప్ రౌండ్ నిర్వహించనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల వ్యాక్సిన్లు సిద్ధంగా ఉండగా, ఒకటో తేదీ నాటికి 10 లక్షల వ్యాక్సిన్లు రాష్ట్రానికి రానున్నాయని శ్రీనివాసరావు తెలిపారు. -
అన్ని చోట్లా ఆర్టీ-పీసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ), బస్తీ దవాఖానాల్లోనూ ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాలకు ఆర్టీ–పీసీఆర్ కిట్లను పంపించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పెద్దాసుపత్రుల నుంచి పీహెచ్సీ స్థాయి వరకు 1,100 పరీక్షా కేంద్రాల్లో అన్ని చోట్లా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుతో అరగంటలోపే ఫలితం తెలుస్తోంది. అందులో కరోనా పాజిటివ్ వస్తే పూర్తిస్థాయి పాజిటివ్‌గానే గుర్తించవచ్చు. కానీ యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వస్తే దాని కచ్చితత్వం కేవలం 50 నుంచి 70 శాతమేనని ఐసీఎంఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నెగెటివ్ వచ్చి, లక్షణాలు ఏమాత్రం లేకపోతేనే దాన్ని నెగెటివ్‌గా గుర్తించాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఒకవేళ నెగెటివ్ వచ్చి కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ తేల్చిచెప్పింది. కాబట్టి ఇప్పుడు పీహెచ్సీ స్థాయిలో యాంటీజెన్ టెస్టులు చేయించుకొని నెగెటివ్ వచ్చి లక్షణాలున్న వారు సాధారణంగా తిరుగు తున్నారన్న భావన ఉంది. దీంతో అటువంటి వారికి ఇక నుంచి తక్షణమే ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేస్తారు. ఆర్టీ–పీసీఆర్ కోసం తీసుకున్న శాంపిళ్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోని లేబొరేటరీలకు పంపిస్తారు. వాటి ఫలితాలు 24 గంటల నుంచి రెండు, మూడ్రోజుల్లో వస్తాయి. నేడు కేంద్ర బృందం రాక రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సల వివరాలను తెలుసుకునేందుకు సోమవారం కేంద్ర బృందం ఢిల్లీ నుంచి వస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్రం ఇక్కడకు బృందాన్ని పంపిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రానికి వచ్చే కేంద్ర బృందం సోమవారం పలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలను పరిశీలించనుంది. మరోవైపు యాంటీజెన్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన వారికి లక్షణాలుంటే ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా కేంద్ర బృందం పరిశీలించనున్నట్లు తెలిసింది. అయితే హైదరాబాద్‌లో చాలా యూపీహెచ్సీ, బస్తీ దవాఖానాల్లో ఇంకాఆర్టీ–పీసీఆర్ టెస్టులు మొదలు కాలేదు. దీంతో ఆగమేఘాల మీద శని, ఆదివారాల్లో ఆర్టీ–పీసీఆర్ కిట్లను ఆయా సెంటర్లకు పంపించినట్లు తెలిసింది. కేంద్ర బృందం వస్తే ఎలా వ్యవహరించాలో కూడా వారికి చెప్పినట్లు సమాచారం. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులను కూడా కేంద్ర బృందం పరిశీలించనుంది. -
సర్కారు ఆస్పత్రులకు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించిన పలు సర్కారు ఆసుపత్రులకు కేంద్రం గుర్తింపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలో 35 ప్రభుత్వ ఆసుపత్రులు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) ధ్రువీకరణ పత్రాలు పొందాయి. నాణ్యత ప్రమాణాలను పాటించే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీహెచ్) గుర్తింపు ఇస్తున్న తరహాలోనే ప్రభుత్వ ఆసుపత్రులకూ ఎన్‌క్వాష్‌ను కేంద్రం ప్రారంభించింది. నాణ్యత ధ్రువీకరణ పత్రాలు పొందిన ఆసుపత్రుల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంది. వాటిల్లో పనిచేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తుంది. గతంలో మన రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఆసుపత్రి, భద్రాచలం, బాన్సువాడ ఏరియా ఆసుపత్రులు సహా పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్‌క్వాష్ సర్టిఫికెట్లు పొందాయి. కొత్తగా ఎన్‌క్వాష్ సర్టిఫికెట్లు పొందిన ఆసుపత్రులు అనేకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే ఉండటం గమనార్హం. బిక్నూరు, దేవరకొండ, హన్వాడ, బొమ్మలరామారం, కొండమడుగు, ధర్మాసాగర్, గోపాల్పూర్, థరూర్, మనూపాడు, ఎర్రగుంట, గండంపల్లి, కంభాలపల్లి, కంగ్టి, రఘునాధపల్లి, ఘన్పూర్, తాండూరు, కత్లాపూర్, మేడిపల్లి, గారెపల్లి, జైపూర్, శంకరంపట్నం, లీజా, గట్టు, ఆత్మకూర్, సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్‌క్వాష్ సర్టిఫికేట్లు అందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి కూడా సర్టిఫికేట్ వచ్చింది. గతంలో 39 దవాఖానాలకు ఈ ఎన్‌క్వాష్ సర్టిఫికెట్లు ఉండగా, ప్రస్తుత సర్టిఫికెట్లతో ఆస్పత్రుల సంఖ్య 74కు చేరింది. దీంతో ఈ సర్టిఫికెట్లు పొందడంలో దేశంలోనే తెలంగాణ టాప్ గా నిలిచింది. -
పీహెచ్సీ నిధుల్లో కోత
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 73 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కోఆస్పత్రికి అభివృద్ధి కింద ఎన్హెచ్ఎం నిధులు రూ.1.75 లక్షల చొప్పున ఉమ్మడి జిల్లాకు రూ.1.27 కోట్లు రావాల్సి ఉండగా గతేడాది కేవలం రూ.27.74 లక్షలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఏడాది ఒక్కో పీహెచ్సీ కి రూ.75లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇలా ఏడాదికేడాది ఈ నిధులను తగ్గిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ)లు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఆస్పత్రి అభివృద్ధి కోసం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా ప్రతీ సంవత్సరం వచ్చే నిధుల్లో కోత పెట్టడమే దీనికి కారణమైంది. దీంతో అరకొర నిధులతో ఆరోగ్య కేంద్రాలను నెట్టుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అత్యవసర సమయాల్లో ఈ నిధిని వినియోగించుకునే పరిస్థితి ఉండగా నిధుల కోత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాలకులతో పాటు అధికారులు ఈ నిధుల విషయంలో పట్టించుకుంటేనే ఏదైనా ప్రయోజనం దక్కే పరిస్థితి ఉంది. అభివృద్ధి ఆ నిధులతోనే.. జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి ప్రతీ ఏడాది ఆసుపత్రి అభివృద్ధి నిధులు మంజూరవుతాయి. ఒక్కో ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లకు రూ.5లక్షల చొప్పున, ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)కి రూ.1.75లక్షల చొప్పున ప్రతీ ఏడాది నిధులు రావడం జరుగుతోంది. ఏహెచ్, సీహెచ్‌సీలకు నిర్ధారిత ఎన్హెచ్ఎం నిధులు వస్తుండగా పీహెచ్‌సీలకే పూర్తిస్థాయిలో రావడంలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, బోథ్, సిర్పూర్, ఆసిఫాబాద్, జైనూర్‌లలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మంచిర్యాల, భైంసా, ఖానాపూర్, నిర్మల్(ఎంసీహెచ్)లలో ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 73 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆస్పత్రి అభివృద్ధి నిధులకు సంబంధించిన ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులకు ఆయా ఎమ్మెల్యేలు చైర్మన్‌గా, సూపరింటెండెంట్లు మెంబర్ కన్వీనర్లు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. పీహెచ్‌సీలకు సంబంధించి మండల పరిషత్ అధ్యక్షుడు చైర్మన్‌గా, మెడికల్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్‌గా, స్థాని క జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సభ్యులు గా ఉంటారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు సమావేశమై నిధుల వినియోగానికి సంబంధించిన తీ ర్మాణం చేసి వినియోగిస్తారు. ప్రధాన ఆస్పత్రుల్లో భవన మరమ్మతులు, రంగులు వేయడం, ల్యాబ్ పనిముట్ల కొనుగోలు, రోగికి సౌకర్యంగా ఉండే విధంగా ఈ నిధులను వెచ్చించాలి. ఆస్పత్రుల్లో మందులు లేనిపక్షంలో, సెంట్రల్ డ్రగ్‌స్టోర్ (సీడీసీ)లో కూడా ఆ మందులు అందుబాటులో లేకుంటే ఈ నిధుల నుంచి వాటిని బయట కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నిధులలేమి కారణంగా ఒకవేళ సీడీసీలో కూడా ఆ మందులు అందుబాటులో లేకపోతే ఏంచేయలేని పరిస్థితుల్లో చేతులు దులుపుకుంటున్నారు. దీంతో పేదలకు మందులు అందని పరిస్థితి. వరుసగా కోత.. ఎన్హెచ్ఎం నిధుల విషయంలో గత రెండేళ్లుగా నిర్ధారిత కోటా రావడం లేదు. దీంతో పీహెచ్‌సీల్లో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోంది. ప్రతీ సంవత్సరం రెండు విడతల్లో రూ.1.75 లక్షలు విడుదల చేసేవారు. అయితే గత మార్చిలో కేవలం రూ.38వేలు, అంతకుముందు ఏడాది రూ.75వేలు మాత్రమే విడుదల చేశారు. వరుసగా ఈ నిధుల్లో భారీగా కోత విధిస్తుండడంతో ఆస్పత్రుల్లో చిన్నచిన్న మరమ్మతులకు కూడా నిధులు లేని పరిస్థితి కనిపిస్తోంది. కారణాలేమిటి? ఎన్హెచ్ఎం నిధులు పీహెచ్‌సీలకు కోత విధించడం పట్ల కారణం ఏమై ఉంటుందన్న అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిధుల వినియోగం అంచనా ప్రకారం కేంద్రం నుంచి ఆ నిధులను విడుదల చేస్తారని చెబుతున్నారు. అయితే వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు యూటిలైజేషన్ సర్టిఫికెట్ (యూసీ) అందజేయాల్సి ఉంటుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇది ప్రతీ సంవత్సరం నిరంతరంగా జరిగే ప్రక్రియ. అయితే నిధుల వినియోగంలో అసమర్థత కారణంగా ఈ కోత జరిగిందా?..లేనిపక్షంలో యూసీలు సమర్పించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం నిధులకు అనుగుణంగా.. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఎన్హెచ్ఎం నిధులకు అనుగుణంగా జిల్లాలకు ఈ నిధులు విడుదల చేస్తారు. గతం కంటే ఇప్పుడు నిధులు తక్కువగా వచ్చాయి. రాష్ట్రం నుంచి నేరుగా ఈ ఎన్హెచ్ఎం నిధులు ఆస్పత్రులకు వస్తాయి. ఒకవేళ ఈ నిధులు సరిపోని పక్షంలో కలెక్టర్‌కు నోట్ పెట్టి ఏదైనా పనులు చేపడతారు. దానికి సంబంధించి కలెక్టర్ నుంచి నిధులు ప్రత్యామ్నాయంగా ఇస్తారు. – డాక్టర్ రాజీవ్‌రాజ్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్ -
ఇం‘ధన’మేది!
ఖమ్మంవైద్యవిభాగం: పెండింగ్ నిధులు విడుదల కాక..వైద్య, ఆరోగ్యశాఖ వాహనాలకు డీజిల్ పోయించలేని దుస్థితి నెలకొంది. పెట్రోల్‌బంక్‌లో లక్షల రూపాయలు కట్టాల్సి ఉండడంతో సదరు బంక్ యజమాని..వాటి చెల్లింపు పూర్తయ్యేదాకా ఆయిల్ పోసేందుకు నిరాకరించడంతో ఈ వాహనాలు దాదాపు నెలన్నర కాలంగా మూలకే పరిమితమయ్యాయి. దీంతో వైద్య, ఆరోగ్య శాఖకు సేవలు అందిస్తున్న బండ్లు కార్యాలయం నుంచి కదలట్లేదు. ఫలితంగా పలు అత్యవసర సేవలపై దాని ప్రభావం పడుతోంది. డీఎంహెచ్ఓ, డీఐఓ, వ్యా క్సిన్ల సరఫరా కోసం ప్రభుత్వం మొత్తం నాలుగు వాహనాలు సమకూర్చింది. వాటి డీజిల్‌కు సంబంధించి..రూ.4.5 లక్షలు బాకీ పడడంతో బంక్ యజమాని డిజిల్ పోయట్లేదు. వైద్య, ఆరోగ్యశాఖలో వ్యాధి నిరోధక వ్యాక్సినేషన్ అన్ని పీహెచ్‌సీల పరిధిలో నిరంతరాయంగా కొనసాగు తూ ఉంటుంది. జిల్లాలోని 22 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీ, 3 అర్బన్ హెల్త్ సెంటర్లకు ప్రతి రోజూ డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి వ్యాక్సి న్ను సరఫరా చేసేందుకు రెండు వాహనాలు వెళుతుంటాయి. ఎక్కడ అవసరమైతే అక్కడికి ఈ వాహనాలను పంపిస్తుంటారు. నెల 15 రోజులుగా వాహనాలకు డిజిల్ పోయని కారణంగా ఈ బండ్లు కదలని పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాక్సిన్ సరఫరాలో తరచూ అంతరాయం కలుగుతోంది. ఇక డీఎంహెచ్ఓ, డీఐఈఓ తనిఖీలు, పర్యవేక్షణకు కూడా అంతరాయం కలుగుతోంది. అడపాదడపా అప్పుచేసి డీజిల్ కొట్టించి సేవలు నిలిచిపోకుండా వాహనాలు నడుపుతున్నారు. టీకాల ప్రక్రియపై ప్రభావం.. కేంద్ర ప్రభుత్వం టీకాలు వేయడంలో జిల్లాను వెనుకబడిన జిల్లా జాబితాలో చేర్చింది. గత 45 రోజలుగా డిజిల్ కష్టాలతో, సరఫరాలో తరచూ అంతరాయాలు కలుగుతుండటంతో జిల్లా పరి స్థితి ఇంకా దిగజారుతోంది. వ్యాక్సినేషన్ అందించడంలో మరింత అధ్వానంగా తయారయ్యే పరి స్థితి ఏర్పడింది. ఇంత ఇబ్బందికర పరిస్థితులు కలిగినా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేకుండా పోయింది. అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించట్లేదనే అపవాదు మూటకట్టుకుంటున్నారు. సొంతానికి వాహనాలు వినియోగించడం వల్లనేనా? జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కొందరు అధికారులు వాహనాలు సొంతానికి వినియోగించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా వాహన బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. నిబంధనల ప్రకారం వాహనాలను ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. అంతే కాకుండా అధికారులు తాము తిరిగిన వివరాలతో ప్రతినెలా టూర్ డైరీ సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి కలెక్టర్ బిల్లులు చెల్లించేందుకు అనుమతి ఇస్తారు. అయితే వాహలు అడ్డగోలుగా తిరగడం, టూర్ డైరీని సమర్పించక పోవ డం వంటి కారణాలతో బిల్లులు పాస్ కావట్లేదు. దీంతో బంక్ యజమానికి చెల్లించాల్సిన బిల్లులు పెరిగిపోతున్నాయి. వీరి నిర్లక్ష్యం మూలంగా భారీ గా బాకీ పెరిగిపోవడంతో డిజిల్ పోయడం నిలిపివేశారు. దీంతో అత్యవసర సేవలకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
జానంపేట నం.1
సాక్షి, పాలమూరు : జాతీయ స్థాయిలోనే జిల్లా లోని మూసాపేట మండలం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సత్తా చాటింది. జాతీయ ప్రమాణ ధ్రువపత్రం కోసం రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో 29 పీహెచ్‌సీలు పోటీ పడగా జానంపేటకు పీహెచ్సీ 97 మార్కులతో మొదటి స్థానం దక్కించుకుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం నుంచి తాజాగా ధ్రువీకరణ పత్రం అందింది. అంతేకాకుండా జిల్లా లోని మరికల్, మిడ్జిల్ పీహెచ్‌సీలు సత్తా చాటి మెరుగైన మార్కులు సాధించాయి. ఇలా ఒకే జిల్లాలో మూడు పీహెచ్‌సీలు ఒకేసారి ధ్రువీకరణ పత్రాలు అందుకోవడం అరుదైన ఘటనగా వైద్య,ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. 97 మార్కులు ఏటా జాతీయ ప్రమాణ ధృవపత్రం అందజేసేందుకు పీహెచ్‌సీలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బృందాలు పరిశీలిస్తాయి. ఈ మేరకు రాష్ట్రంలో 29 పీహెచ్‌సీలు దరఖాస్తు చేయగా.. జిల్లా నుంచి జానాపేట, మరికల్, మిడ్జిల్ నుంచి దరఖాస్తులు వెళ్లాయి. ఇందులో భాగంగా ఆగస్టు 10, 11వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆయా పీహెచ్‌సీలను పరిశీలించి వెళ్లారు. తాజాగా జానంపేట పీహెచ్‌సీకి 97 మార్కులతో రాష్ట్రంలోనే మొదటి స్థానం కేటాయిస్తూ ధృవీకరణ పత్రం జారీ చేశారు. అలాగే, మిడ్జిల్ పీహెచ్‌సీకి 94.6 మార్కులు, మరికల్ పీహెచ్‌సీకి 90.2 మార్కులు కేటాయించి పత్రాలు అందజేశారు. వైద్యులు, ఉద్యోగుల పనితీరుతో పాటు సౌకర్యాల కల్పన, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల వారీగా మార్కులు కేటాయించారు. కాగా, జాతీయ ప్రమాణ ధృవీకరణ పత్రాలకు ఎంపికైన జానంపేట, మిడ్జిల్, మరికల్ పీహెచ్‌సీలకు ఏటా రూ.3లక్షల చొప్పున మూడేళ్ల పాటు రూ.9లక్షల నిధులు అందనున్నాయి. ఏయే అంశాల్లో.. పీహెచ్‌సీల పరిశీలన సందర్భంగా కేంద్రప్రభుత్వ అధికారులు పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు పీహెచ్‌సీలకు వస్తున్న రోగులతో సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది, ఆప్యాయంగా ఉంటున్నారా అని చూడడంతో పాటు మందులు సక్రమంగా ఇస్తున్నారా, స్వాంతన కలి గించే విధంగా మాట్లాడుతున్నారా అని పరిశీలించారు. అలాగే, ఆస్పత్రిలో మంచాలు, పరుపులు, బెంచీలు, కుర్చీల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత, ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందా, లేదా అని చూశారు. ఇలా పలు అంశాల ప్రాతిపదికన మార్కులు కేటాయించారు. -
పీహెచ్సీలో ప్రసవానికి వైద్యుల నిరాకరణ
కొయ్యలగూడెం : ప్రసవం కోసం పీహెచ్‌సీకి వెళ్లిన గర్భిణికి పురుడు పోసేందుకు వైద్యులు నిరాకరించిన ఘటన ఇది. దీంతో ఆమె ఇంటిలోనే ప్రసవించి అపస్మారకస్థితికి చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పాతపరింపూడిలోని మారుమూల నివసిస్తున్న యడ్లపల్లి వెంకటలక్ష్మికి మూడో కాన్పుకు పురుడు పోసుకోవడానికి 15వ తేదీ కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే పురుడు పోయడానికి వైద్యులు నిరాకరించారని, ఆసుపత్రిలో చేర్చుకోకుండానే పరీక్షలు నిర్వహించి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా పంపించి వేసినట్టు భర్త వెంకన్న తెలిపాడు. దీంతో ఇంటికి తీసుకుని రాగా మంగళవారం ఉదయం వెంకట లక్ష్మికి పురిటినొప్పులు ఎక్కువై డెలివరీ అయ్యిందని, పాప పుట్టిన కొద్ది నిమిషాలకే వెంకటలక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వెంకన్న విలపించాడు స్థానిక ప్రైవేట్ వైద్యులు వెంకట లక్ష్మిని పరిశీలించి వెంటనే రాజమండ్రి తరలించాల్సిందిగా పేర్కొన్నారని, గంగిరెద్దులతో యాచక వృత్తి కొనసాగించే తనకు ఆర్థికస్థోమత లేదని వాపోయాడు. 16వ తేదీ వచ్చిన భారీ వానకు పూరింటిలోకి నీరు చేరిందని, పురుడు పోసుకోవడానికి తన భార్యను పడుకోబెట్టడానికి సరైన ప్రదేశం లేకపోయిందని తెలిపాడు. ఇరుగుపొరుగు మహిళలు కష్టం మీద ఆమెకు పురుడు పోశారని తెలిపాడు. స్థానికుల సహాయంతో వెంకటలక్ష్మిని రాజమండ్రికి తరలించారు. దీనిపై వైద్యారోగ్య శాఖ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారెవరూ అందుబాటులో లేరు. -
పక్కాగా బయోమెట్రిక్ అమలు
నెల్లూరు(అర్బన్) : పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ విధానం పక్కాగా అమలయ్యేలా ప్రోగ్రాం ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రమాదేవి అన్నారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో పీహెచ్‌సీల డాక్టర్లతో గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అనమోల్ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. ఆరోగ్య సేవల్లో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఐఓ జయసింహ, క్షయనివారణాధికారి డా.సురేష్‌కుమార్, మలేరియా అధికారి వేణుగోపాల్, గూడూరు డిప్యూటి డీఈఓ ఈదూరు సుధాకర్ పాల్గొన్నారు. -
పీహెచ్‌సీలకు సౌరవిద్యుత్ పరిస్థితేంటి?
లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) సౌరవిద్యుత్ వ్యవస్థ ఏర్పాటు పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించా రు. 13వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులతో తెలంగాణలోని 55 పీహెచ్‌సీల్లో సౌరవిద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు వచ్చాయా? ఒక వేళ వస్తే అందుకు సంబంధించిన నిధులు, ప్లాంట్ ఏర్పాటు కు సంబంధిం చిన వివరాలు వెల్లడించాలని గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పొంగులేటి అడిగారు. దీనిపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ తెలంగాణ పీహెచ్‌సీలకు సౌరవిద్యుత్ కల్పనకు రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతి పాదనలు రాలేదని బదులిచ్చారు. కేం ద్ర, రాష్ట్ర భవనాలు సహా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిసెంబరు 31, 2014 నాటికి 11,296 సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఏపీలోని పుడిమడకలో థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్టీపీసీ ప్రతిపాదన చేసిందని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్తు దిగుమతి బొగ్గు ఆధారంగా ఉత్పత్తి అవుతుందని, దీని నివేదికకు గతేడాది నవంబర్ 11న ఆమోదం లభించిందని పేర్కొన్నారు. 13వ పంచవర్ష ప్రణాళిక చివరిలో విద్యుదుత్పత్తి జరగనుందని చెప్పారు. దీనిపై పొంగులేటి అడిగిన ప్రశ్నకు పీయూష్ గోయెల్ బదులిచ్చారు. -
పీహెచ్‌సీకి తాళం వేసిన గ్రామస్తులు
నర్సంపేట, న్యూస్‌లైన్ : నెల రోజులుగా వైద్యులు విధులకు రావడం లేదని ఆరోపిస్తూ భాంజీపేట సర్పంచ్ భూక్య లలిత ఆధ్వర్యంలో గ్రామస్తులు పీహెచ్‌సీకి బుధవారం తాళం వేశారు. అనంతరం పీహెచ్సీ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతోపాటు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్డీఓ అరుణకువూరితో వూట్లాడారు. వెంటనే ఆమె పీహెచ్‌సీని సందర్శించి, విచారణ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ వూట్లాడుతూ పీహెచ్‌సీకి వైద్యులు, సిబ్బంది వస్తున్నారా లేదా అని విచారణ చేపట్టగా గైర్హారవుతున్నట్లు తెలిసిందని చెప్పారు. పీహెచ్‌సీలోని స్టాక్ రిజిష్టర్, అటెండెన్స్ రిజిష్టర్‌ను సీజ్ చేసి, సిబ్బందిపై చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఆమె వివరించారు.