సాక్షి, అమరావతి: ప్రజారోగ్యమే పరమావధిగా భావిస్తూ.. గ్రామస్థాయిలో వైద్యసేవల విస్తరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ వైద్యం చేరువ కావడంతో గ్రామీణ ప్రజల్లో సంతోషం కనిపిస్తోంది. ప్రతి మండలంలోను ఐదుగురు డాక్టర్లు అందుబాటులో ఉండటంతో ప్రజలకు మరింతగా వైద్యసేవలు అందనున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ పద్ధతిలో అన్ని కుటుంబాలకు వైద్యసదుపాయం కలగనుంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో (పీహెచ్‌సీల్లో) డాక్టరు ఉంటారో లేదో అన్న పరిస్థితి నుంచి ఎప్పుడు వైద్యానికి వెళ్లినా డాక్టరు అందుబాటులో ఉంటారన్న భరోసా వచ్చింది.
ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఇద్దరు వైద్యులను నియమించడంతో గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కనిపిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలన్న ఆలోచన నుంచి బయటపడుతున్నారు. అందుబాటులో డాక్టరు ఉన్నప్పుడు మళ్లీ ప్రైవేటు ఆస్పత్రికి ఎందుకన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు వైద్యుల నియామకం తర్వాత వైద్యుల్లోను కొంత బాధ్యత పెరిగింది. గతంలో ఎంబీబీఎస్ చదివినా ఉద్యోగాలు ఉండేవి కావు. ఈ పరిస్థితుల్లో పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉండాలన్న నిర్ణయంతో వారికి ప్రభుత్వ సర్వీసులో పనిచేసే అవకాశమూ వచ్చింది. ఇలా ప్రాథమిక వైద్యం బలోపేతం అవుతోంది.
ప్రతి గ్రామానికి వైద్యుడి రాక
ప్రతి మండలంలో 2 పీహెచ్‌సీల్లోను నలుగురు డాక్టర్లు ఉంటారు. ఒక్కో పీహెచ్‌సీలోని ఇద్దరు డాక్టర్లు దాని పరిధిలోని గ్రామాలను విభజించుకుని ప్రతి గ్రామానికి నెలకు రెండుసార్లు వెళతారు. 104 వాహనం నెలకు ఒకసారి ప్రతి గ్రామానికి వెళుతుంది. అందులో వైద్యుడు ఉంటారు. దీంతో గ్రామంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ వైద్యులు అందుబాటులో ఉన్నట్లవుతుంది. గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ఉంటుంది. అక్కడికి వెళ్లినవారికి అవసరాన్ని బట్టి అక్కడి సిబ్బంది పీహెచ్‌సీలోని వైద్యుడితో మాట్లాడించి చికిత్స అందిస్తారు.
ఓపీ సేవల్లో మార్పులు
పీహెచ్‌సీల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు 12 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉండాలి. ఉదయం 8 గంటలకు వచ్చిన వైద్యుడు మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన డాక్టరు రాత్రి 8 గంటల వరకు పనిచేయాలి. ఆ తర్వాత ఎవరైనా అవసరం ఉండి వైద్యానికి రావాలనుకుంటే ఆన్‌కాల్ అంటే ఫోన్ చేస్తే వైద్యం చేయడానికి డాక్టరు విధిగా రావాల్సిందే. ప్రస్తుతం ప్రతి పీహెచ్‌సీలోను ఒక వైద్యుడు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీలు ఉండగా, కొత్తగా 179 ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రతి మండలంలో 2 వంతున మొత్తం 1,328 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉంటాయి. ఇప్పటికే 85 శాతం పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యుల నియామకం పూర్తయింది. 2019 తర్వాత భారీసంఖ్యలో వైద్యులను నియమించారు. రోగ నిర్ధారణ పరీక్షల విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో మెడాల్ వంటి సంస్థలు ల్యాబ్‌టెస్టులు చేసేవి. ఇప్పుడు పీహెచ్‌సీలోనే 14 రకాల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి పీహెచ్‌సీలో ల్యాబ్‌టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పక్కాగా ఉంటున్నారు. అప్పట్లో చాలాచోట్ల ఒకరు, కొన్నిచోట్ల ఇద్దరు స్టాఫ్‌నర్సులు ఉండేవారు. ఇప్పుడు ప్రతి పీహెచ్‌సీలో ముగ్గురు స్టాఫ్‌నర్సులను ఏర్పాటు చేశారు.
ఇద్దరు డాక్టర్లు వచ్చాక బాగా మార్పు
ఇద్దరు వైద్యులను నియమించాక పేషెంట్లలో ధైర్యం వచ్చింది. ఎప్పుడు ఆస్పత్రికి వెళ్లినా డాక్టరు ఉంటారనేది వాళ్ల నమ్మకం. ప్రస్తుతం ఒక డాక్టరు వ్యాక్సిన్ ప్రక్రియలో ఉన్నారు. వచ్చాక షిఫ్ట్ పద్ధతిలో పనిచేస్తాం.
- డాక్టర్ ప్రశాంత్, మెడికల్ ఆఫీసర్, నెల్లిమర్ల పీహెచ్‌సీ, విజయనగరం జిల్లా
ఇప్పుడు ప్రసవాలూ చేస్తున్నాం
ఇద్దరు వైద్యులు వచ్చాక ఇప్పుడు ప్రసవాలు కూడా చేస్తున్నాం. ముగ్గురు స్టాఫ్ నర్సులను ఇచ్చారు. ఒక డాక్టరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకుంటాం. నెలకు కనీసం 5 సాధారణ ప్రసవాలు చేస్తున్నాం. కోవిడ్ దృష్ట్యా కొద్దిగా ఓపీ తగ్గింది కానీ.. సాధారణ పరిస్థితుల్లో బాగా రోగులు వస్తారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది. మందుల కొరత లేకుండా చేశారు.
- డాక్టర్ ప్రతిమ, మెడికల్ ఆఫీసర్, వెనిగండ్ల పీహెచ్‌సీ, గుంటూరు జిల్లా
కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
కొన్ని పీహెచ్‌సీల్లో మాత్రమే ఇద్దరు వైద్యులు లేరు. వాటిలో ఉన్న రెండో వైద్యుడి ఖాళీతో పాటు కొత్తగా వచ్చే 179 పీహెచ్‌సీలకు వైద్యుల నియామకానికి ఆర్థికశాఖ ఆమోదానికి పంపించాం. ఆమోదం రాగానే వాటిలో కూడా వైద్యుల భర్తీ జరుగుతుంది. ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు వచ్చాక పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యం అందుతోంది.
- డాక్టర్ గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు
ప్రతి మండలంలో 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఒక్కోదాన్లో ఇద్దరు వైద్యులు. మండలానికి ఒక 104 వాహనం. అందులో ఒక వైద్యుడు. వెరసి ఐదుగురు వైద్యులు మండల ప్రజలకు వైద్యసేవలు అందించనున్నారు. ఇక ప్రతి గ్రామంలోను వైఎస్సార్ హెల్త్‌క్లినిక్ అందుబాటులో ఉంటుంది.
85% పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యులు
Published Fri, Jun 18 2021 4:22 AM | Last Updated on Fri, Jun 18 2021 4:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment