పీహెచ్‌సీలకు సౌరవిద్యుత్ పరిస్థితేంటి?
- లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) సౌరవిద్యుత్ వ్యవస్థ ఏర్పాటు పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించా రు. 13వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులతో తెలంగాణలోని 55 పీహెచ్‌సీల్లో సౌరవిద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు వచ్చాయా? ఒక వేళ వస్తే అందుకు సంబంధించిన నిధులు, ప్లాంట్ ఏర్పాటు కు సంబంధిం చిన వివరాలు వెల్లడించాలని గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పొంగులేటి అడిగారు.
దీనిపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ తెలంగాణ పీహెచ్‌సీలకు సౌరవిద్యుత్ కల్పనకు రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతి పాదనలు రాలేదని బదులిచ్చారు. కేం ద్ర, రాష్ట్ర భవనాలు సహా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిసెంబరు 31, 2014 నాటికి 11,296 సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఏపీలోని పుడిమడకలో థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్టీపీసీ ప్రతిపాదన చేసిందని మంత్రి వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్తు దిగుమతి బొగ్గు ఆధారంగా ఉత్పత్తి అవుతుందని, దీని నివేదికకు గతేడాది నవంబర్ 11న ఆమోదం లభించిందని పేర్కొన్నారు. 13వ పంచవర్ష ప్రణాళిక చివరిలో విద్యుదుత్పత్తి జరగనుందని చెప్పారు. దీనిపై పొంగులేటి అడిగిన ప్రశ్నకు పీయూష్ గోయెల్ బదులిచ్చారు.