ఇం‘ధన’మేది! | Vehicles Diesel Shortage In Health Department Khammam | Sakshi
Sakshi News home page

ఇం‘ధన’మేది!

Feb 11 2019 7:38 AM | Updated on Feb 11 2019 7:38 AM

Vehicles Diesel Shortage In Health Department Khammam - Sakshi

డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద నిరుపయోగంగా ఉన్న వాహనాలు

ఖమ్మంవైద్యవిభాగం: పెండింగ్‌ నిధులు విడుదల కాక..వైద్య, ఆరోగ్యశాఖ వాహనాలకు డీజిల్‌ పోయించలేని దుస్థితి నెలకొంది. పెట్రోల్‌బంక్‌లో లక్షల రూపాయలు కట్టాల్సి ఉండడంతో సదరు బంక్‌ యజమాని..వాటి చెల్లింపు పూర్తయ్యేదాకా ఆయిల్‌ పోసేందుకు నిరాకరించడంతో ఈ వాహనాలు దాదాపు నెలన్నర కాలంగా మూలకే పరిమితమయ్యాయి. దీంతో వైద్య, ఆరోగ్య శాఖకు సేవలు అందిస్తున్న బండ్లు కార్యాలయం నుంచి కదలట్లేదు. ఫలితంగా పలు అత్యవసర సేవలపై దాని ప్రభావం పడుతోంది. డీఎంహెచ్‌ఓ, డీఐఓ, వ్యా క్సిన్ల సరఫరా కోసం ప్రభుత్వం మొత్తం నాలుగు వాహనాలు సమకూర్చింది. వాటి డీజిల్‌కు సంబంధించి..రూ.4.5 లక్షలు బాకీ పడడంతో బంక్‌ యజమాని డిజిల్‌ పోయట్లేదు.

వైద్య, ఆరోగ్యశాఖలో వ్యాధి నిరోధక వ్యాక్సినేషన్‌ అన్ని పీహెచ్‌సీల పరిధిలో నిరంతరాయంగా కొనసాగు తూ ఉంటుంది. జిల్లాలోని 22 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీ, 3 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు ప్రతి రోజూ డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి వ్యాక్సి న్‌ను సరఫరా చేసేందుకు రెండు వాహనాలు వెళుతుంటాయి. ఎక్కడ అవసరమైతే అక్కడికి ఈ వాహనాలను పంపిస్తుంటారు. నెల 15 రోజులుగా వాహనాలకు డిజిల్‌ పోయని కారణంగా ఈ బండ్లు కదలని పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాక్సిన్‌ సరఫరాలో తరచూ అంతరాయం కలుగుతోంది. ఇక డీఎంహెచ్‌ఓ, డీఐఈఓ తనిఖీలు, పర్యవేక్షణకు కూడా అంతరాయం కలుగుతోంది. అడపాదడపా అప్పుచేసి డీజిల్‌ కొట్టించి సేవలు నిలిచిపోకుండా వాహనాలు నడుపుతున్నారు.

టీకాల ప్రక్రియపై ప్రభావం.. 
కేంద్ర ప్రభుత్వం టీకాలు వేయడంలో జిల్లాను వెనుకబడిన జిల్లా జాబితాలో చేర్చింది. గత 45 రోజలుగా డిజిల్‌ కష్టాలతో, సరఫరాలో తరచూ అంతరాయాలు కలుగుతుండటంతో జిల్లా పరి స్థితి ఇంకా దిగజారుతోంది. వ్యాక్సినేషన్‌ అందించడంలో మరింత అధ్వానంగా తయారయ్యే పరి స్థితి ఏర్పడింది. ఇంత ఇబ్బందికర పరిస్థితులు కలిగినా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేకుండా పోయింది. అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించట్లేదనే అపవాదు మూటకట్టుకుంటున్నారు.
 
సొంతానికి వాహనాలు వినియోగించడం వల్లనేనా?  
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కొందరు అధికారులు వాహనాలు సొంతానికి వినియోగించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా వాహన బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. నిబంధనల ప్రకారం వాహనాలను ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. అంతే కాకుండా అధికారులు తాము తిరిగిన వివరాలతో ప్రతినెలా టూర్‌ డైరీ సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి కలెక్టర్‌ బిల్లులు చెల్లించేందుకు అనుమతి ఇస్తారు. అయితే వాహలు అడ్డగోలుగా తిరగడం, టూర్‌ డైరీని సమర్పించక పోవ డం వంటి కారణాలతో బిల్లులు పాస్‌ కావట్లేదు. దీంతో బంక్‌ యజమానికి చెల్లించాల్సిన బిల్లులు పెరిగిపోతున్నాయి. వీరి నిర్లక్ష్యం మూలంగా భారీ గా బాకీ పెరిగిపోవడంతో డిజిల్‌ పోయడం నిలిపివేశారు. దీంతో అత్యవసర సేవలకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement