వ్యాక్సిన్‌కు ముందస్తు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కాదు | Pre Registration For Vaccination Is Not Mandatory | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌కు ముందస్తు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కాదు

Published Thu, Feb 25 2021 3:08 AM | Last Updated on Thu, Feb 25 2021 4:41 AM

Pre Registration For Vaccination Is Not Mandatory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లబ్ధిదారులు నేరుగా కేంద్రాలకే వచ్చి కరోనా టీకా వేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్కడకు వచ్చాక కోవిన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేస్తారు. అనంతరం వారికి టీకా వేస్తారు. ఇక నుంచి యాప్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి కాదని సర్కారు తేల్చి చెప్పింది. అయితే ఎవరైనా తమ పేర్లను ముందస్తుగా నమోదు చేసుకోవాలంటే, అటువంటి వారికి కూడా అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం కోవిన్‌ యాప్‌లో పేర్లు నమోదైన వారికే టీకా వేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే దానిలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. కోవిన్‌ యాప్‌తో సమస్యలు ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం సెకండ్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తోంది. అది ఒకట్రెండు రోజుల్లో విడుదల కానుందని వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో లబ్ధిదారులు నేరుగా వచ్చి టీకా వేసుకోవడంతో పాటు, ముందస్తుగానూ రిజిస్ట్రేషన్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. 

దాదాపు 55 లక్షల మందికి..
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలు వేయాలని నిర్ణయించారు. అందుకోసం రాష్ట్రంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వాస్తవంగా 50 ఏళ్లు పైబడిన వారందరికీ, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ టీకా వేయాలనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ కేటగిరీ వ్యక్తులు రాష్ట్రంలో 69 లక్షల మంది ఉంటారు. అయితే తాజా నిర్ణయంతో ఆ సంఖ్య 55 లక్షలకు పడిపోనుంది. అంటే రాష్ట్రంలో 14 లక్షల మంది కరోనా టీకా లబ్ధిదారులు తగ్గుతారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. 60 ఏళ్లు పైబడిన వారు రాష్ట్రంలో 45 లక్షల మంది.. 45 నుంచి 60 ఏళ్లలోపు వారు దాదాపు 10 లక్షల మంది ఉంటారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు లెక్కగట్టారు. వీరందరికీ టీకా ఉచితంగానే వేస్తారని తెలిపారు. 

1,500 కేంద్రాల్లో.. రోజుకు లక్షన్నర మందికి
ఇక రాష్ట్రంలో టీకా కార్యక్రమం 1,500 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ‘పీహెచ్‌సీ స్థాయి నుంచి గాంధీ, ఉస్మానియా సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ జాబితాలోని 230 ప్రైవేట్, కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ టీకా కేంద్రాలుంటాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మంది చొప్పున లక్షన్నర మందికి వేసేలా లక్ష్యం పెట్టుకున్నాం. గ్రామాల్లో ఉన్న ఆయా లబ్ధిదారులంతా సమీపంలో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి టీకా వేయించుకోవచ్చు. లబ్ధిదారులు టీకా వేయించుకునేలా ప్రోత్సహించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలను కోరాం. పీహెచ్‌సీలు మండలానికి ఒకటి చొప్పున ఉంటాయి. అయితే మున్ముందు లబ్ధిదారులకు ఇబ్బంది కలిగితే, రాష్ట్రంలో 4,500కు పైగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. అంటే రానున్న రోజుల్లో రాష్ట్రంలో 6 వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ జరుగుతుంది. రాష్ట్రంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలు వేస్తున్నాం. అందులో లబ్ధిదారుల ఇష్టానుసారంగా కాకుండా, కేంద్రంలో ఏ వ్యాక్సిన్‌ ఉంటే దాన్నే వేసుకోవాలి. ప్రతీ కేంద్రంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండవు. ఒక్కోచోట ఒక కంపెనీ వ్యాక్సిన్‌ను ఉంచుతారు. కాబట్టి లబ్ధిదారులకు ఎలాంటి చాయిస్‌ ఇవ్వడం లేదు..’అని శ్రీనివాసరావు తెలిపారు. 

లబ్ధిదారుల గుర్తింపు ఇలా..
ఇక 60 ఏళ్లు పైబడిన ప్రజలను గుర్తించేందుకు వారి వద్ద ఉండే ఓటర్‌ ఐడీ కార్డు సహా ఏదైనా వయసు తెలియజేసే కార్డు తీసుకొని రావాలి. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను మాత్రం తమ వద్ద ఉన్న కొద్దిపాటి సమాచారం ఆధారంగా గుర్తిస్తారు. తమ వద్ద సమాచారం లేని మిగిలిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైనా డాక్టర్‌ వద్ద వైద్యం చేయించుకున్నట్లు ప్రిస్కిప్షన్, వైద్య పరీక్షల నివేదికలు తీసుకొని రావాలి. అలాగే వయసును తెలియజేసే గుర్తింపు కార్డులు కూడా తేవాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు త్వరలో కేంద్రం విడుదల చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక టీకా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఒక బృందం రానుంది. కోవిన్‌–2 వెర్షన్‌పైనా వారు స్పష్టత ఇస్తారు. నేరుగా వచ్చిన లబ్ధిదారుల పేర్లను టీకా కేంద్రంలో ఎలా నమోదు చేయాలో శిక్షణ ఇస్తారు. 

నేటి నుంచి 4 రోజులు మాప్‌అప్‌ రౌండ్
ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకా మొదటి డోస్‌ పూర్తి కాగా రెండో డోస్‌ నడుస్తోంది. ఇక ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకూ మొదటి డోస్‌ దాదాపు పూర్తయింది. అయితే వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో చాలామంది ఇంకా మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. చాలా మంది మిగిలిపోయారు. 3.31 లక్షల మంది వైద్య సిబ్బంది టీకా వేసుకోవాల్సి ఉండగా, వారిలో 1.96 లక్షల మంది మాత్రమే మొదటి డోస్‌ వేసుకున్నారు. అలాగే 2.57 లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో 89 వేల మంది మాత్రమే టీకా వేసుకున్నారు. వ్యాక్సిన్‌ వేసుకోని మిగిలిన వారందరికీ గురువారం నుంచి నాలుగు రోజుల పాటు మాప్‌అప్‌ రౌండ్‌ నిర్వహించనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల వ్యాక్సిన్లు సిద్ధంగా ఉండగా, ఒకటో తేదీ నాటికి 10 లక్షల వ్యాక్సిన్లు రాష్ట్రానికి రానున్నాయని శ్రీనివాసరావు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement