న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా వ్యవహరించాలని, కోవిడ్–19 మేనేజ్‌మెంట్ కోసం సన్నద్ధం కావాలని సూచించారు.
కరోనా లక్షణాలు ఎక్కడ అధికంగా వ్యాప్తిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు గుర్తించాలని చెప్పారు. ఎమర్జెన్సీ హాట్‌స్పాట్లలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని కోరారు. కోవిడ్–19 వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రజా చైతన్యం ద్వారానే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలి
గతంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేశాయని, చక్కని ఫలితాలు సాధించాయని మాండవీయ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సమన్వయంతో పనిచేయాలన్నారు. పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరోగ్య శాఖ సన్నద్ధతపై ఈ నెల 8, 9న జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులకు పిలుపునిచ్చారు. 10, 11న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాక్‌డ్రిల్స్ నిర్వహించాలన్నారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా వైరస్ నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని వివరించారు.
టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేట్‌తోపాటు కోవిడ్–19 నియంత్రణ చర్యల పటిష్ట అమలుతో సత్ఫలితాలు లభిస్తాయని వెల్లడించారు. అర్హులైన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. కోవిడ్–19 బాధితులకు ఆసుపత్రుల్లో సరిపడా పడకలు సిద్ధంగా ఉండేలా, ఔషధాలు లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు.
6 వేల మార్కు దాటిన కోవిడ్ కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 203 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,050 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసులు 28,303కు చేరుకున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. మొత్తం కేసులు 4.47 కోట్లకు చేరాయి. దీంతోపాటు, మరో 14 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాలు 5,30,943కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేట్ 3.39%కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06%గా ఉంది.
ప్రతి 10 లక్షల జనాభాకు 100 టెస్టులు
ఎక్స్‌బీబీ.1.5తోపాటు బీక్యూ.1, బీఏ.2.75, సీహెచ్.1.1, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీఎఫ్, ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని వెల్లడించింది. ఇతర వేరియంట్ల ప్రభావం బాగా తగ్గిందని పేర్కొంది. ఎక్స్‌బీబీ.1.16 అనే వేరియంట్ వ్యాప్తి ఫిబ్రవరిలో 21.6 శాతం ఉండగా, మార్చిలో 35.8 శాతానికి చేరిందని వివరించింది. అయితే, వైరస్ వ్యాప్తి పెరిగినప్పటికీ ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు పెద్దగా నమోదు కాలేదని స్పష్టం చేసింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు నిత్యం సగటున 100 కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హరియాణాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment