state health department
-
కరోనాతో జాగ్రత్త: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా వ్యవహరించాలని, కోవిడ్–19 మేనేజ్మెంట్ కోసం సన్నద్ధం కావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఎక్కడ అధికంగా వ్యాప్తిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు గుర్తించాలని చెప్పారు. ఎమర్జెన్సీ హాట్స్పాట్లలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని కోరారు. కోవిడ్–19 వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రజా చైతన్యం ద్వారానే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలి గతంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేశాయని, చక్కని ఫలితాలు సాధించాయని మాండవీయ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సమన్వయంతో పనిచేయాలన్నారు. పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరోగ్య శాఖ సన్నద్ధతపై ఈ నెల 8, 9న జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులకు పిలుపునిచ్చారు. 10, 11న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాక్‌డ్రిల్స్ నిర్వహించాలన్నారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా వైరస్ నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని వివరించారు. టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేట్‌తోపాటు కోవిడ్–19 నియంత్రణ చర్యల పటిష్ట అమలుతో సత్ఫలితాలు లభిస్తాయని వెల్లడించారు. అర్హులైన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. కోవిడ్–19 బాధితులకు ఆసుపత్రుల్లో సరిపడా పడకలు సిద్ధంగా ఉండేలా, ఔషధాలు లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు. 6 వేల మార్కు దాటిన కోవిడ్ కేసులు దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 203 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,050 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసులు 28,303కు చేరుకున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. మొత్తం కేసులు 4.47 కోట్లకు చేరాయి. దీంతోపాటు, మరో 14 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాలు 5,30,943కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేట్ 3.39%కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06%గా ఉంది. ప్రతి 10 లక్షల జనాభాకు 100 టెస్టులు ఎక్స్‌బీబీ.1.5తోపాటు బీక్యూ.1, బీఏ.2.75, సీహెచ్.1.1, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీఎఫ్, ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని వెల్లడించింది. ఇతర వేరియంట్ల ప్రభావం బాగా తగ్గిందని పేర్కొంది. ఎక్స్‌బీబీ.1.16 అనే వేరియంట్ వ్యాప్తి ఫిబ్రవరిలో 21.6 శాతం ఉండగా, మార్చిలో 35.8 శాతానికి చేరిందని వివరించింది. అయితే, వైరస్ వ్యాప్తి పెరిగినప్పటికీ ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు పెద్దగా నమోదు కాలేదని స్పష్టం చేసింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు నిత్యం సగటున 100 కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హరియాణాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు పేర్కొంది. -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,535 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా 2,075 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 2,55,95,949 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,60,350 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,631 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 19,92,191 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. -
ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 70,757 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,859 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో 13 మంది మృతి చెందారు. తాజాగా 1,575 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 2,54,53,520 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,56,627 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,595 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,688 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 19,88,910 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. -
ఏపీలో కొత్తగా 1,908 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 80,376 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,908 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో 23 మంది మృతి చెందారు. తాజాగా 2,103 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 2,51,08,146 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,46,370 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,513 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,375 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 19,80,258 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. -
లండన్ నుంచి వచ్చిన 433 మంది ఎక్కడున్నారు?
సాక్షి, చెన్నై : బ్రిటన్‌లో పుట్టిన కొత్త కరోనా భయంతో ప్రజలు వణికిపోతుండగా తిన్నగా లండన్ నుంచి తమిళనాడుకు చేరుకున్న ప్రయాణికులు ఆరోగ్యశాఖ కన్నుకప్పి ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇంగ్లండ్ నుంచి తమిళనాడుకు వచ్చిన 433 మంది ప్రయాణికుల కోసం గాలిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. వందరోజులకు పైగా చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు రోగులకు గురవారం ఆయన పుష్పగుచ్ఛం ఇచ్చి సాగనంపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం మొత్తం మీద 20 మంది రూపుమార్చుకున్న కరోనా బారినపడగా తమిళనాడులో ఒక్కరు మాత్రమే ఉన్నారని అన్నారు. నవంబర్, డిసెంబర్లో బ్రిటన్ నుంచి 2,080 మంది తమిళనాడుకు చేరుకోగా వీరిలో 487 మంది ఆచూకీ తెలియలేదు. వీరంతా చెన్నై, చెంగల్పట్టు జిల్లాలకు చెందిన వారని తేలడంతో అవిశ్రాంతంగా గాలిస్తుండగా వీరిలో 54 మంది మరలా లండన్‌కు వెళ్లిపోయినట్లు తెలుసుకున్నామని చెప్పారు. ఎలాంటి వైరసైనా కబసుర కషాయం అణచివేస్తుందని ఆయన తెలిపారు. స్పెయిన్ నుంచి కోయంబత్తూరుకు వచ్చిన యువ కుని (27)కి కరోనా సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రిలోని ప్రత్యేకవార్డులో యువకుడిని ఉంచి కరోనా చికిత్స చేస్తున్నారు. కొత్త, పాత కరోనా నిర్ధారణకు యువకుడి నుంచి సేకరించిన నమూనాలను బెంగళూరుకు పంపారు. సేలం ఎంపీకి కరోనా: సేలం లోక్‌సభ సభ్యుడు, డీఎంకే నేత ఎస్ఆర్ పార్థిబన్ కరోనా వైరస్‌కు గురయ్యారు. ఇటీవల జ్వరం సోకడంతో సేలంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేరి పరీక్షలు చేయించుకోగా గురువారం పాజిటివ్ నిర్ధారౖణెంది. దీంతో అదే ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు. పోరాడి గెలిచిన కరోనా యోధులు: వందరోజుల వరకు కరోనాతో పోరాడి గెలిచిన ఇద్దరు యోధులు గురువారం ఇంటిదారిపట్టారు. చెన్నై రాజీవ్‌గాంధీ సూపర్‌స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి (జీహెచ్)లో కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందుతుండగా 90 ఏళ్లకు పైబడినవారు సైతం కోలుకుంటున్నారు. ఇదే ఆస్పత్రిలో అత్యధికరోజులు కరోనా చికిత్స పొందిన ధనపాల్ (45), కార్తిక్ (37) గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. కిరణ్‌బేడీ వ్యక్తిగత కార్యదర్శికి కరోనా? పుదుచ్చేరీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న కోయంబత్తూరుకు చెందిన యువతికి పాజిటివ్ నిర్ధారౖణెంది. గవర్నర్ కిరణ్‌బేడీ రాజ్‌నివాస్ మొదటి అంతస్థులో నివసించడం వల్ల ఆ అంతస్థులోని ఉద్యోగులకు పరీక్షలు చేశారు. కిరణ్‌బేడీ ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు చేయించుకున్నారు. వ్యక్తిగత కార్యదర్శి పాజిటివ్ బారినపడడంతో గురువారం మళ్లీ కిరణ్‌బేడి పరీక్షలు చేయించుకున్నారు. -
తెలంగాణలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
-
పెళ్లైన ఐదేళ్లలోపే సరోగసీ బెటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సరోగసీ రెగ్యులేషన్ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచించింది. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత సరోగసీకి అనుమతివ్వాలన్న బిల్లులోని అంశాన్ని సవరించాలని, పెళ్లయిన ఐదేళ్లలోపే అనుమతిస్తే బాగుంటుందని పేర్కొంది. కేంద్ర సరోగసీ రెగ్యులేషన్ బిల్లు అమలులో అనుసరించాల్సిన విధానాలు, ఇతర అంశాలపై అభిప్రాయ సేకరణకు పార్లమెంటరీ కమిటీ బృందం గురువారం హైదరాబాద్‌కు వచ్చింది. సరోగసీ పార్లమెంటరీ సెలక్ట్ కమిటీ చైర్మన్ భూపేం ర్ యాదవ్ నేతృత్వంలో ఇక్కడకు వచ్చిన బృందంలో డాక్టర్ బండా ప్రకాశ్, వికాశ్ మహాత్మ్, సరోజ్ పాండే, అశ్వనీ వైష్ణవ్, అమీయాజ్నిక్, ఏఆర్ బిశ్వాస్, ఎ.నవనీత్ కృష్ణన్, రవిప్రకాశ్ వర్మ తదితరులున్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, వైద్య,ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బిల్లులో రెండు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. ఎంత వయసులో సరోగసీకి అనుమతించాలన్న అంశాన్ని కమిటీ బృందం ప్రశ్నించగా, పెళ్లయిన ఐదేళ్లలోపే అనుమతించాలని సూచించినట్లు సమాచారం. సరోగసీ తల్లులకు నష్టపరిహారం ఎంతివ్వాలన్న దానిపై బిల్లులో ఉన్న దాన్నే పూర్తిగా సమర్థించినట్లు తెలిసింది. వ్యాపారాత్మకంగా సరోగసీ ఉండకూడదని, బిల్లులో దాన్ని నిషేధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించినట్లు సమాచారం. అయితే పూర్తి అభిప్రాయాలను రాతపూర్వకంగా పంపించాలని పార్లమెంటరీ కమిటీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు సూచించింది. అంతకుముందు ఈ బృందం కామినేని ఫెర్టిలిటీ ఆసుపత్రిలో సరోగసీ తల్లిదండ్రులతో మాట్లాడింది. ఆ తర్వాత సరోగసీ తల్లుల అభిప్రాయాలను సేకరించింది. కాగా, బిల్లులో కఠిన నిబంధనలను సవరించాలని తల్లిదండ్రులు కోరినట్లు సమాచారం. -
ఆ రెండింటితో చచ్చేచావు!
రాష్ట్రంలో రక్తపోటు, మధుమేహం జబ్బులు ఎక్కువగా ఉన్నట్లు వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షల్లో తేలింది. ఆహార అలవాట్లలో వచ్చిన మార్పులు, వ్యాయామం లేకపోవడమే ఇందుకు ప్రాథమిక కారణం. మద్యం, పొగాకు మితిమీరిన వినియోగంవల్ల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి వారి కోసం రాష్ట్రంలో డీ–అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుచేయాలని చెప్పాం. రొటీన్ జీవితంలో మార్పులు వచ్చేలా వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. లేదంటే ఎక్కువగా నమోదవుతున్న క్యాన్సర్, గుండెపోటు వంటి వాటిపై గ్రామీణ ప్రాంతాల వారికి అవగాహన ఉండదు. ఫలితంగా ప్రజలకూ, ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉంటుంది. – సుజాతారావు, రిటైర్డ్ ఐఏఎస్, రాష్ట్ర ఆరోగ్యశాఖ నిపుణుల కమిటీ చైర్పర్సన్ సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా రెండు రకాల జబ్బులు అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అందరూ ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్న ఈ పరిస్థితి చూసి వైద్య నిపుణులతోపాటు సర్కారూ ఆందోళన వ్యక్తంచేస్తోంది. బాధిత కుటుంబాల పరిస్థితి అయితే ఊహించలేనిది. ముఖ్యంగా కుటుంబ పెద్ద ఈ రోగాల బారిన పడితే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లే. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిశీలనలో తాజాగా వెలుగుచూసిన ఈ వాస్తవాలు అందరినీ విస్మయానికి.. ప్రధానంగా ప్రభుత్వాన్నీ తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే.. ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.వెయ్యి కోట్లు ఖర్చయితే.. ఇందులో రెండు జబ్బులకే రూ. 500 కోట్లు అయింది. సగం వ్యయం ఆ రెండు రోగాలకే గుండెజబ్బులు, క్యాన్సర్లదే సింహ వాటా కోటీ 32 లక్షల మంది ఎన్సీడీ కోరల్లో రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధులు (ఎన్సీడీ–నాన్ కమ్యునికబుల్ డిసీజెస్) బారిన పడిన వారిలో 1.35 కోట్ల మంది ఉన్నట్లు తేలింది. వీరిలో అనేకమంది క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు.. ఇలా జీవనశైలి జబ్బుల్లో ఏదో ఒక జబ్బుకు దగ్గరై ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వాస్పత్రుల్లో ఎన్సీడీ క్లినిక్‌ల పేరిట చికిత్సలు చేస్తుండగా.. అందులో నమోదైన వారు కేవలం 53 వేల మంది మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో 13, సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 85 క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్లినిక్‌లలో అన్ని రకాల జీవన శైలి జబ్బులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. బాధితుల జనాభాను బట్టి చూస్తే మరో 200 ఎన్సీడీ క్లినిక్‌లు పెంచాల్సిన అవసరం ఉందని, దీనికి రూ.32 కోట్లు వ్యయమవుతుందని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ఇచ్చింది. గుండెజబ్బులు.. క్యాన్సర్లకే తడిసిమోపెడు మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో జీవనశైలి జబ్బులు (లైఫ్‌స్టైల్ డిసీజెస్) ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా గుండెపోటు జబ్బులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆరోగ్యశ్రీలో గత ఏడాది జరిగిన చికిత్సల వివరాలు పరిశీలిస్తే ఈ విషయం బయటపడింది. కార్డియో వాస్క్యులర్ జబ్బులకు ఒక్క ఏడాదిలో రూ.365.14 కోట్ల వ్యయమైంది. ఇక క్యాన్సర్ రోగులకూ గతేడాదిలో రూ.197.40 కోట్లు వ్యయం చేశారు. అలాగే, కిడ్నీ బాధితుల చికిత్స, డయాలసిస్‌లకు కలిపి రూ.69.31 కోట్లు ఖర్చయింది. ఇలా మొత్తం 1048 జబ్బులకు గాను రూ.1000 కోట్లు నిధులు ఇస్తే ఇందులో రూ.532.12 కోట్లు ఈ మూడు జబ్బులకే వ్యయమైందంటే పరిస్థితి తీవ్రతను అంచనా వెయ్యొచ్చు. క్యాన్సర్‌కు కారణాలు చాలా.. పురుగు మందుల అవశేషాలున్న ఆహార పదార్థాలు, మేనరికాలు, మద్యం సేవించడం, పొగతాగడం వంటివి క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా చెప్పచ్చు. మన రాష్ట్రంలో 35 ఏళ్లు దాటిన ప్రతి 28 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నట్టు అంచనా. వీలైనంత వరకూ నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకపోవడం. తాజా పళ్లు, కూరగాయాలు తినడం మంచిది. – డా. సీహెచ్ సులోచనాదేవి, క్యాన్సర్ వైద్య నిపుణులు, విజయవాడ జీవనశైలి జబ్బులు పెరిగాయి గ్రామాల్లోనూ బీపీ, మధుమేహం మందుల వినియోగం బాగా పెరిగింది. గుండెజబ్బులు విపరీతంగా పెరిగాయి. వీటి చికిత్స ఖరీదైపోవడంతో అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రజలకూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ప్రాథమిక దశలో గుర్తించడం లేదా రాకుండా చూడటం చేయాలి. నాలుగు క్యాన్సర్ ఆస్పత్రులను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించాం. – డా. బి.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రముఖ న్యూరో వైద్యులు, నిపుణుల కమిటీ సభ్యులు అవగాహన కల్పించాలి మనం ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఎక్కువగా గుండెజబ్బులు, క్యాన్సర్‌కు ఖర్చుచేస్తున్న విషయం వాస్తవమే. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ నమోదవుతున్నాయి. వీటిని అరికట్టాలంటే చిన్నతనం నుంచే ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచి ఆహార అలవాట్లు, వ్యాయామం నేర్పాలి. – డా. ఎ. మల్లిఖార్జున, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
శిశువులు తక్కువ..తల్లులు ఎక్కువ!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని శాఖల గణాంకాలను ఈ ఐదేళ్లల్లో కాకిలెక్కలతో రూపొందిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం గర్భిణుల విషయంలోనూ తప్పుడు సంఖ్యలు.. పొంతనలేని వివరాలతో జాబితాలు రూపొందించి కేంద్రం దృష్టిలో అభాసుపాలవుతోంది. గర్భిణుల సంఖ్య, పుట్టే పిల్లల సంఖ్య ఎక్కడా సరిపోలడంలేదు. రాష్ట్రంలో గర్భిణులను గుర్తించి వారికి వైద్య సేవలు అందించే క్రమంలో ఈ తప్పులతడకలు భారీగా చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బర్త్ రేటు (పుట్టే చిన్నారుల శాతం) తగ్గుతూంటే మరోవైపు గర్భిణుల శాతం మాత్రం అమాంతంగా పెరిగిపోతోంది. మన రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి 16.4 శాతం చిన్నారులు పుడుతున్నారు. కానీ, గర్భిణులను మాత్రం 19 శాతానికి పైగానే అని ఆరోగ్య శాఖాధికారులు చూపిస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని ఇలా చేస్తున్నారా లేదా ఎక్కువ మందికి వైద్యం అందిస్తున్నామని చెప్పడానికి ఇలా చేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో మాతా శిశు మరణాల విషయంలో ఇలాగే తప్పుడు లెక్కలు చూపించి దక్షిణాదిలో అద్భుతంగా నివారణ చర్యలు చేపడుతున్నట్టు పలుమార్లు జరిగిన కలెక్టర్ల సదస్సుల్లో నివేదికలు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా తప్పుడు లెక్కలు చూపించి గందరగోళం సృష్టించారు. ఓ వైపు ప్రజాసాధికార సర్వేలో రాష్ట్ర జనాభా 4.50 కోట్లు అని చెబుతుంటే.. కేంద్రం మాత్రం 5.30 కోట్లు అని చెబుతోంది. కేంద్ర లెక్కలనే అధికారులు పరిగణనలోకి తీసుకుని అద్భుతంగా చేస్తున్నామని చూపించడానికి ఇలా తప్పటడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. గర్భిణుల గణాంకాల్లో గందరగోళం! కాగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ రూపొందించిన జాబితాలో తల్లులను ఎక్కువ మందిని చూపించి పిల్లల సంఖ్యను మాత్రం తక్కువగా చూపించారు. ఉదాహరణకు.. కృష్ణా జిల్లాలో ఒక ఏడాదిలో 52 వేల మంది చిన్నారులు (0 వయసు) అని లెక్కల్లో తేల్చారు. అదే గర్భిణుల నమోదులో 82 వేల మందికి పైగా నమోదైనట్లు చూపించారు. అంటే 30 వేల మంది చిన్నారులు పుట్టగానే మృతిచెందినట్లయినా ఉండాలి.. లేదా గర్భిణుల నమోదులో ఎక్కువైనా చేసి చూపించి ఉండాలి. క్షేత్రస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టి ఈ లక్ష్యాలను ఎలాగైనా సాధించాలంటూ ఒత్తిడి తేవడంతో చాలాచోట్ల గర్భిణుల నమోదులో డబుల్ ఎంట్రీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉదా.. విశాఖపట్నం జిల్లాలోని దొరకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక గర్భిణి నమోదై ఉంది. అదే గర్భిణి దేవరాపల్లి, బీమాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా నమోదై ఉంది. అధికారులు తమ నివేదికలో ముగ్గురు గర్భిణులుగా చూపించి ముగ్గురికీ ప్రతినెలా వైద్యపరీక్షలు అందించినట్టు పేర్కొన్నారు. ఇలా సుమారు 82వేల మంది గర్భిణులను ఒకటికి రెండు లేదా మూడుసార్లు నమోదుచేసి అమాంతంగా వారి సంఖ్యను పెంచేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి 7 లక్షల పైచిలుకు ప్రసవాలు జరుగుతుండగా, 8.50 లక్షల మంది గర్భిణులను రిజిస్ట్రేషన్ చేసి, వారికి వైద్యమందించినట్లు చూపించారు. ఈ లెక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం సంభ్రమాశ్చర్యాలకు గురవుతోంది. అడ్డగోలుగా టార్గెట్లు రాష్ట్రంలో సరాసరిన 7.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. అందులోనూ ప్రతి ఏడాదీ బర్త్ రేటు తగ్గుతోంది కాబట్టి గర్భిణుల శాతం కూడా తగ్గాలి. కానీ, ఉన్నతాధికారులు మాత్రం ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు విధిస్తున్న టార్గెట్లు విస్మయం కలిగిస్తున్నాయి. ఏకంగా 9.90 లక్షల మందిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ టార్గెట్లు విధించారు. ఏ జిల్లాలో ఎంత టార్గెట్ ఇచ్చారో చూస్తే అవాక్కవాల్సిందే. అసలు లేని గర్భిణులను ఎక్కడ్నుంచి చూపించాలని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు. గర్భిణుల విషయంలో జిల్లాల వారీగా ప్రభుత్వం విధించిన టార్గెట్లు ఇవీ.. రిజిస్ట్రేషన్లు ఎక్కువ.. బర్త్ రేటు తక్కువ రాష్ట్రంలో 2011 నుంచి బర్త్ రేటు బాగా తగ్గుతోంది. ఉదా.. 2011లో వైఎస్సార్ కడప జిల్లాలో 43,378 మంది చిన్నారులు పుట్టారు. అప్పటి జనన నిష్పత్తి వెయ్యి జనాభాకు 17.5 శాతం. ఆ తర్వాత 16.4కు తగ్గింది. కానీ, ఇప్పుడు చిన్నారుల రిజిస్ట్రేషన్ టార్గెట్ 57,443 మందిని ఇచ్చారు. ఓ వైపు బర్త్ రేటు తగ్గుతూంటే ఎక్కువ చూపించడమేంటో అర్థంకాని పరిస్థితి. కాగా, బర్త్ రేటును సంవత్సరాల వారీగా చూస్తే.. -
పారిశుద్ధ్య లోపం వల్లే విషజ్వరాలు
బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లో పారిశుధ్య లోపం వల్లే విషజ్వరాలు ప్రబ లుతున్నాయని రాష్ట్ర వైద్య శాఖ అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ శంకర్ అన్నారు. ‘బోన‘కిల్’.. డెంగీ పంజాకు జనం విలవిల అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించిన రాష్ట్ర వైద్య బృందం బోనకల్ పీహెచ్‌సీని బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అడిషనల్ డెరైక్టర్ శంకర్, రాష్ట్ర మలేరియా విభాగం అడిషనల్ డెరైక్టర్ ప్రభావతి మాట్లాడారు. ఈ ప్రాంతంలో రెండున్నర నెలలుగా ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని, డెంగీతో 20 మంది మృతి చెందడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేరుుంచుకున్న వారు ఎవరూ మృతి చెందలేదన్నారు. బోనకల్లో 20కి చేరిన మృతులు బోనకల్ మండలంలో బుధవారం మరో ఇద్దరు డెంగీతో మృతి చెందారు. రావినూతలవాసి పూలబోరుున (32)ని ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా 4 రోజుల అనంతరండెంగీ జ్వరం విషమించి మృతి చెందింది. గార్లపాడు గ్రామానికి చెందిన కట్టా సరస్వతి (30)ని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
రాష్ట్ర వైద్యబృందం ‘రుద్రారం’ పరిశీలన
మిరుదొడ్డి: జాతీయ పైలేరియా నివారణ వారోత్సవాల్లో భాగంగా భూంపల్లి పీహెచ్సీ పరిధిలోని రుద్రారం గ్రామాన్ని గురువారం రాష్ట్ర వైద్య బృందం సభ్యులు డీఈసీ, అల్బెండజోల్ మాత్రల పంపిణీపై ఇంటింటికి తిరిగి పరిశీలన జరిపారు. పైలేరియా వారోత్సవాల్లో భాగంగా వ్యాధి నిర్మూలనకు క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు మాత్రలను ప్రతి ఒక్కరి చేత మింగించాల్సి ఉంది. అలా కాకుండా ఇంటింటికి తూతూ మంత్రంగా మాత్రలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నట్లు రాష్ట్ర వైద్య బృందం పరిశీలనలో తేట తెల్లమైంది. చాలా మటుకు ప్రతి ఇంటిలో పంపిణీ చేసిన పైలేరియా మాత్రలను ప్రజలు వేసుకోకుండా ఉండటాన్ని వైద్య బృందం సభ్యులు రికార్డు చేశారు. కార్యక్రమంలో రీజినల్ హెల్త్ కార్యాలయం డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, స్టేట్ పైలేరియా కన్సల్టెంట్ ఆఫీసర్ లక్ష్మణ్, భూంపల్లి పీహెచ్సీ డాక్టర్ అరుణ్‌కుమార్, హెల్త్ ఎక్స్టెన్షన్ అధికారి ఎం. భాస్కర్, దుబ్బాక క్లస్టర్ సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, వైద్య సిబ్బంది రోజెట్టి, తార, కిరణ్, అంగన్వాడీ కార్యకర్తలు సురేఖ, పద్మ, రేణుక, ఆశ వర్కర్లు అరుణ, సుమలత, సుజాత, స్వప్న, వీరమణి తదితరులు పాల్గొన్నారు.