సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సరోగసీ రెగ్యులేషన్ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచించింది. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత సరోగసీకి అనుమతివ్వాలన్న బిల్లులోని అంశాన్ని సవరించాలని, పెళ్లయిన ఐదేళ్లలోపే అనుమతిస్తే బాగుంటుందని పేర్కొంది. కేంద్ర సరోగసీ రెగ్యులేషన్ బిల్లు అమలులో అనుసరించాల్సిన విధానాలు, ఇతర అంశాలపై అభిప్రాయ సేకరణకు పార్లమెంటరీ కమిటీ బృందం గురువారం హైదరాబాద్‌కు వచ్చింది. సరోగసీ పార్లమెంటరీ సెలక్ట్ కమిటీ చైర్మన్ భూపేం ర్ యాదవ్ నేతృత్వంలో ఇక్కడకు వచ్చిన బృందంలో డాక్టర్ బండా ప్రకాశ్, వికాశ్ మహాత్మ్, సరోజ్ పాండే, అశ్వనీ వైష్ణవ్, అమీయాజ్నిక్, ఏఆర్ బిశ్వాస్, ఎ.నవనీత్ కృష్ణన్, రవిప్రకాశ్ వర్మ తదితరులున్నారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, వైద్య,ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బిల్లులో రెండు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. ఎంత వయసులో సరోగసీకి అనుమతించాలన్న అంశాన్ని కమిటీ బృందం ప్రశ్నించగా, పెళ్లయిన ఐదేళ్లలోపే అనుమతించాలని సూచించినట్లు సమాచారం.
సరోగసీ తల్లులకు నష్టపరిహారం ఎంతివ్వాలన్న దానిపై బిల్లులో ఉన్న దాన్నే పూర్తిగా సమర్థించినట్లు తెలిసింది. వ్యాపారాత్మకంగా సరోగసీ ఉండకూడదని, బిల్లులో దాన్ని నిషేధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించినట్లు సమాచారం. అయితే పూర్తి అభిప్రాయాలను రాతపూర్వకంగా పంపించాలని పార్లమెంటరీ కమిటీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు సూచించింది. అంతకుముందు ఈ బృందం కామినేని ఫెర్టిలిటీ ఆసుపత్రిలో సరోగసీ తల్లిదండ్రులతో మాట్లాడింది. ఆ తర్వాత సరోగసీ తల్లుల అభిప్రాయాలను సేకరించింది. కాగా, బిల్లులో కఠిన నిబంధనలను సవరించాలని తల్లిదండ్రులు కోరినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment