sarogasi bill
-
సరోగసీకి దగ్గరి బంధువులే కానక్కర్లేదు
న్యూఢిల్లీ: సరోగసీ ద్వారా బిడ్డల్ని కనిచ్చేందుకు దగ్గరి బంధువులే కానక్కర్లేదనీ, ఆరోగ్యవంతులైన స్త్రీలెవ్వరైనా అందుకు సమ్మతిస్తే సరోగసీ పద్ధతుల్లో బిడ్డని కనివ్వొచ్చనీ రాజ్యసభ సెలెక్ట్ కమిటీ తేల్చి చెప్పింది. 35–45 ఏళ్ల మధ్య వయస్కులైన ఒంటరి స్త్రీలు సరోగసీని ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేసింది. సరోగసీ తల్లులుగా దగ్గరి బంధువులే ఉండాలన్న నిబంధనను అద్దెగర్భాల తల్లులపై పరిమితులు సృష్టిస్తుందనీ, అందుకే దీన్ని తొలగించాలని కమిటీ సూచించింది. ఒంటరి స్త్రీలంతా సరోగసీకి అర్హులేననీ, భర్తలేకున్నా, భర్తతో విడిపోయినా, భర్త చనిపోయిన స్త్రీలకూ సంతానాన్ని పొందే అవకాశం ఉండాలని స్పష్టం చేసింది. భారతీయురాలైన 35–45 ఏళ్ల మధ్యవయస్సులో ఉన్న స్త్రీలు ఇందుకు అర్హులంది. అద్దెగర్భాన్ని వ్యాపారంగా మార్చొద్దని హెచ్చరించింది. లాభాపేక్షతో కాకుండా మాతృత్వపు విలువలను కాపాడేవిధంగా సరోగసీని అనుమతించాలని అభిప్రాయపడింది. సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు–2019ని నవంబర్ 21, 2019న రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశమైంది. కమిటీ చైర్మన్ భూపేందర్ యాదవ్ బుధవారం నివేదికను సమర్పించారు. 23 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ బృందం సరోగసీ రెగ్యులేషన్ బిల్లులో పలు మార్పులను సూచించింది. ► అదేవిధంగా సరోగసీ ద్వారా బిడ్డని కనాలనుకునే జంట పెళ్ళైన ఐదేళ్ళ పాటు భార్యాభర్తలు కలిసి ఉండీ పిల్లల్ని కనలేని పరిస్థితుల్లోనే అద్దెగర్భాన్ని ఆశ్రయించాలన్న నిబంధనను కూడా కమిటీ సడలించింది. సంతానలేమిని కొత్తగా నిర్వచించిన కమిటీ పిల్లల కోసం ఒక జంట ఐదేళ్ళపాటు ఎదురుచూడడం చాలా ఎక్కువ కాలం అవుతుందని పేర్కొంది. ► ఇష్టమైన ఏ స్త్రీ అయినా సరోగసీ ద్వారా బిడ్డలను కనే అనుమతినివ్వాలనీ, అయితే అందుకు సంబంధించిన అన్ని విషయాలూ సరోగసీ చట్టప్రకారమే జరగాల్సి ఉంటుందనీ తెలిపింది. అలాగే అద్దెగర్భం దాల్చే మహిళలకు గతంలో ఉన్న 16 నెలల ఇన్సూరెన్స్ కవరేజ్‌ను 36 నెలలకు పెంచాలని సూచించింది. ► పిల్లలు పుట్టని వారుసైతం సరోగసీ ద్వారా బిడ్డను పొందేందుకు ఐదేళ్ళు వేచి ఉండాలన్న నిబ«ంధనను తొలగించాలని అభిప్రాయపడిన కమిటీ పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలుంటాయని వివరించింది. కొందరికి పుట్టుకతోనే గర్భాశయం లేకపోవడం, లేదా గర్భాశయం పనిచేయకపోవడం, క్యాన్సర్‌కారణంగా గర్భాశయాన్ని తొలగించాల్సి రావడం, కొందరు స్త్రీలకు ఎప్పటికీ పిల్లలను కనే అవకాశంలేని అనారోగ్య స్థితిలో ఉన్న వారికి సరోగసీ ఒక ప్రత్యామ్నాయమని అభిప్రాయపడింది. ► బిడ్డలు కావాలనుకునేవారు ఎప్పుడైనా సరోగసీ ద్వారా బిడ్డలను కనొచ్చనీ, అయితే అందుకు వైద్యపరమైన ఆమోదం పొందాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. ► అలాగే భారతీయ సంతతికి చెందిన వారెవ్వరైనా సరోగసీ బోర్డు ద్వారా అనుమతిపొందిన తరువాత దేశంలో సరోగసీ ద్వారా బిడ్డలను పొందే వీలుండేలా బిల్లులో మార్పులు చేయాలని కమిటీ సూచించింది. -
పెళ్లైన ఐదేళ్లలోపే సరోగసీ బెటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సరోగసీ రెగ్యులేషన్ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచించింది. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత సరోగసీకి అనుమతివ్వాలన్న బిల్లులోని అంశాన్ని సవరించాలని, పెళ్లయిన ఐదేళ్లలోపే అనుమతిస్తే బాగుంటుందని పేర్కొంది. కేంద్ర సరోగసీ రెగ్యులేషన్ బిల్లు అమలులో అనుసరించాల్సిన విధానాలు, ఇతర అంశాలపై అభిప్రాయ సేకరణకు పార్లమెంటరీ కమిటీ బృందం గురువారం హైదరాబాద్‌కు వచ్చింది. సరోగసీ పార్లమెంటరీ సెలక్ట్ కమిటీ చైర్మన్ భూపేం ర్ యాదవ్ నేతృత్వంలో ఇక్కడకు వచ్చిన బృందంలో డాక్టర్ బండా ప్రకాశ్, వికాశ్ మహాత్మ్, సరోజ్ పాండే, అశ్వనీ వైష్ణవ్, అమీయాజ్నిక్, ఏఆర్ బిశ్వాస్, ఎ.నవనీత్ కృష్ణన్, రవిప్రకాశ్ వర్మ తదితరులున్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, వైద్య,ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బిల్లులో రెండు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. ఎంత వయసులో సరోగసీకి అనుమతించాలన్న అంశాన్ని కమిటీ బృందం ప్రశ్నించగా, పెళ్లయిన ఐదేళ్లలోపే అనుమతించాలని సూచించినట్లు సమాచారం. సరోగసీ తల్లులకు నష్టపరిహారం ఎంతివ్వాలన్న దానిపై బిల్లులో ఉన్న దాన్నే పూర్తిగా సమర్థించినట్లు తెలిసింది. వ్యాపారాత్మకంగా సరోగసీ ఉండకూడదని, బిల్లులో దాన్ని నిషేధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించినట్లు సమాచారం. అయితే పూర్తి అభిప్రాయాలను రాతపూర్వకంగా పంపించాలని పార్లమెంటరీ కమిటీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు సూచించింది. అంతకుముందు ఈ బృందం కామినేని ఫెర్టిలిటీ ఆసుపత్రిలో సరోగసీ తల్లిదండ్రులతో మాట్లాడింది. ఆ తర్వాత సరోగసీ తల్లుల అభిప్రాయాలను సేకరించింది. కాగా, బిల్లులో కఠిన నిబంధనలను సవరించాలని తల్లిదండ్రులు కోరినట్లు సమాచారం. -
సరోగసీ బిల్లుకు ఓకే
న్యూఢిల్లీ: రఫేల్ వివాదంపై రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. సభా కార్యకలాపాలకు ఆటంకం జరిగింది. అయితే ఆందోళనల నడుమనే సరోగసీ (రెగ్యులేషన్) బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కావేరీ డ్యాం సమస్యపై డీఎంకే, అన్నా డీఎంకే సభ్యులు ఉభయ సభలను నినాదాలతో హోరెత్తించారు. రఫేల్ విమానాల కొనుగోలు వివాదంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ గోయెల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రఫేల్ వివాదంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు కొనసాగడంతో ఉదయం11 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ.. కొద్దిసేపటికే మరుసటి రోజుకు వాయిదా పడింది. సభ నడవడం ఎవరికీ ఇష్టం లేనట్లు ఉందంటూ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. కాగా, లోక్‌సభలో మాత్రం సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు ఆమోదం పొందింది. వినియోగదారు హక్కుల రక్షణ బిల్లుకు మాత్రం మోక్షం కలగలేదు. ఆందోళనలు తీవ్రతరం కావడంతో ఈ బిల్లుపై చర్చ సాధ్యం కాదని, దీనిపై గురువారం చర్చిస్తామని స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. 24, 26 తేదీల్లోనూ రాజ్యసభకు సెలవు సభ్యుల వినతి మేరకు రాజ్యసభకు శనివారం(డిసెంబర్ 22) మొదలుకొని బుధవారం (డిసెంబర్ 26) వరకు సెలవు ప్రకటించారు. క్రిస్మస్ను పురస్కరించుకుని డిసెంబర్ 25న మాత్రమే సెలవు దినంగా నిర్ణయిస్తూ గతంలో ప్రకటన వెలువడింది. సరోగసీ బిల్లు ముఖ్యాంశాలు ► 23–55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు, 26–55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులు మాత్రమే సరోగసీ(అద్దె గర్భం) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ► వాణిజ్య అవసరాల కోసం సరోగసీ చేపట్టడాన్ని నిషేధించారు. ► ఎన్ఆర్ఐలు, విదేశీయులు, పీఐవోలు, హోమో సెక్సువల్స్, సింగిల్ పేరెంట్స్, సహ జీవనం చేసే జంటలు సరోగసీకి అనర్హులు. ► ఒకే సంతానం ఉన్న జంటలు సైతం సరోగసికి అర్హులు కారు. కానీ వీరు ఇతర చట్టాల ప్రకారం చిన్నారులను దత్తత తీసుకోవచ్చు. ► సమీప బంధువులు అంటే సోదరి లేదా మరదలు వంటివారినే సరోగసీ కోసం అనుమతిస్తారు. ► ఓ మహిళను సరోగసీ కోసం జీవితకాలంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. ► సరోగసికి ముందుకొచ్చే మహిళకు అప్పటికే వివాహమై, ఓ కుమారుడు/కుమార్తె ఉండాలి. ► ఈ చట్టం జమ్మూకశ్మీర్ తప్ప దేశమంతటా వర్తిస్తుంది. ► 3 నెలల్లోగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సరోగసీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. -
'సరోగసీ' బిల్లు-సమస్యలు
సంతానం కోసం పరితపించే దంపతులు పిల్లల్ని కనడానికి అమల్లోకొచ్చిన వివిధ రకాల సాంకేతికతల్లో అద్దె గర్భం(సరోగసీ) విధానం ఒకటి. ఇంచుమించు 2000 సంవత్సరంలో మొదలై మన దేశానికి ‘క్రాడిల్ ఆఫ్ ద వరల్డ్’(ప్రపంచ ఊయల) అని పేరొచ్చేంతగా ఇప్పుడది విస్తరించింది. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర కేబినెట్ అద్దె గర్భం(నియంత్రణ) బిల్లును ఆమోదించింది. మహిళా ఉద్య మకారులు, ఆరోగ్యరంగ కార్యకర్తలు నియంత్రణ చట్టం అవసరమని పదేళ్లుగా చెబుతున్నారు. 2008లో అప్పటి యూపీఏ సర్కారు ఆ పని ప్రారంభించింది. మరో రెండేళ్లకు బిల్లు రూపొందించింది. అనంతరకాలంలో దానిలో ఎన్నో మార్పులు జరిగాయి. కానీ ఏవో కారణాల వల్ల అది కేంద్ర కేబినెట్ ముందుకే రాలేదు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులో ఎన్నో అనుకూలాంశాలున్నట్టే ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. సరోగసీ భావన చుట్టూ సామాజిక, వాణిజ్య, ఆరోగ్య, నైతిక సంబంధమైన అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. ప్రస్తుత బిల్లు ఇందులో కొన్ని అంశాలను ఉపేక్షించగా, మరికొన్నిటిని అతిగా పట్టించుకుందని చెప్పక తప్పదు. కొందరు సామాజిక ఉద్యమకారులు చెబుతున్నట్టు ఈ బిల్లు చట్టమైతే సరోగసీ విధానం చీకటి వ్యాపారంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అద్దె గర్భం విషయానికొచ్చేసరికి మన దగ్గరున్నట్టే చాలా దేశాల్లో భిన్నాభి ప్రాయాలు, వాదనలు ఉన్నాయి. వేర్వేరు రకాల చట్టాలున్నాయి. కొన్నిచోట్ల ఈ విధానాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి నిషేధిస్తే, మరికొన్నిచోట్ల డబ్బు ప్రసక్తి లేని సందర్భాల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. గర్భందాల్చడానికి సిద్ధపడే మహిళ... దంపతుల్లో ఎవరో ఒకరి రక్తసంబంధీకురాలై ఉండాలని బ్రిటన్ చట్టం షరతు విధిస్తోంది. కారుణ్య మరణంలాంటి వివాదాస్పద అంశాల్లో సైతం అనుకూలమైన చట్టం తీసుకొచ్చిన స్విట్జర్లాండ్ కూడా సంతానాన్ని పొందడానికి ఐవీఎఫ్ ప్రక్రియను మాత్రమే గుర్తిస్తోంది. సరోగసీని అంగీకరించిన దేశాల్లో అందుకయ్యే ఖర్చు మన కరెన్సీలో దాదాపు 50 లక్షలు. కనుకనే ఏ నియంత్రణా లేని మన దేశంలో సంతాన సాఫల్య పర్యాటకం (ఫెర్టిలిటీ టూరిజం) గత కొన్నేళ్లుగా పెరిగింది. ఏటా దాదాపు ఆరేడు వేల కోట్ల రూపాయల మేర ఈ వ్యాపారం సాగుతున్నదని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. సరోగసీ విధానంలో బిడ్డను కని ఇచ్చే తల్లి ఎదుర్కొనవలసివచ్చే వివిధ సమస్యల్లో ఆరోగ్య సమస్య అత్యంత కీలకమైనది. అలాగే సంతానం కోసం వచ్చిన దంపతులు శిశువును వివిధ కారణాలవల్ల తిరస్కరిస్తే ఏర్పడే సమస్యలు దీనికి అదనం. తమకంటూ సంతానం కలగడం సాధ్యంకాదని నిరాశా నిస్పృహలకు లోనైన దంపతులకు ఈ ప్రక్రియ వరమే కావొచ్చుగానీ... మహిళను ‘కని ఇచ్చే యంత్రం’గా, బిడ్డను ఒక ‘సరుకు’గా ఇది పరిగణిస్తున్నదన్న వాదన ఉంది. మాతృత్వం, దానితో ముడిపడి ఉండే భావోద్వేగాలకు సరోగసీలో తావులేదు. కడుపులో బిడ్డ పెరుగుతున్నకొద్దీ తల్లిలో ఏర్పడే మమకారం, అనుబంధాలను ఇది పట్టించుకోదు. ఇక ప్రసవ సమయంలో కొందరిలో వచ్చే మధుమేహం, అధిక రక్తపోటు... ప్రసవానంతరం వచ్చే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వారిని జీవితాంతం వేధిస్తాయి. గర్భస్రావమైతే ముందుగా కుదుర్చు కున్న ఒప్పందం మేరకు ఇవ్వాల్సిన డబ్బుల్ని ఎగ్గొట్టే అవకాశాలుంటాయి. వాణిజ్య అద్దె గర్భాలను నిషేధించడమే వీటన్నిటికీ పరిష్కారమవుతుందా? సరోగసీ ద్వారా తొమ్మిది నెలల్లో అయిదారు లక్షలు సంపాదించవచ్చునని ఆశపడి ముందుకొచ్చేవారిని రాబోయే చట్టం నిరోధించడం మాట అటుంచి దాన్ని కాస్తా చీకటి వ్యాపారంగా మార్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ మార్పిడికి సంబంధించిన చట్టం మాఫియాలకు వేల కోట్లు ఆర్జించిపెడుతోంది. మనలాంటి పితృస్వామిక వ్యవస్థలో సరోగసీపై నిర్ణయం తీసుకునేది ఎక్కువ సందర్భాల్లో భర్తేనని వేరే చెప్పనవసరం లేదు. డబ్బుకు ఆశపడి అతను శాసించినప్పుడు ఆ మహిళకు వేరే గత్యంతరం ఉండదు. చట్టాన్ని కాదని బిడ్డను కనడానికి సిద్ధపడిన తల్లికి ప్రామాణికమైన వైద్య సేవలు అందే అవకాశాలు కుంచించుకుపోతాయి. ఇది ఆ మహిళను మరిన్ని సమస్యల్లోకి నెడుతుంది. పేద మహిళలనూ... ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంత మహిళలను కాపాడటమే ఈ బిల్లు ధ్యేయమంటున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ దీన్ని గుర్తించినట్టు లేరు. దంప తులకు చెందిన దగ్గరి బంధువుల్లోని మహిళలను మాత్రమే సరోగసీకి అనుమతిస్తామని బిల్లు అంటున్నది. వారైతేనే సంతానం లేని దంపతులకు బిడ్డను కని ఇస్తే పుణ్యమని భావిస్తారని, బయటి వారైతే లాభాపేక్షతో మాత్రమే చేస్తారన్నది బిల్లు భావన కావొచ్చు. కుటుంబంపై పెత్తనంవహించే మగవాడి పాత్రను, అతడు పెట్టే ఒత్తిళ్లను ఇది గుర్తించినట్టు లేదు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నవారికి తప్ప సహజీవనం చేసే జంటకు సరోగసీలో బిడ్డను పొందే హక్కు లేకుండా చేయడం మరో వివాదాస్పద నిర్ణయం. వివాహ మనేది లేకుండా దీర్ఘకాలం ఒక జంట కలిసి ఉన్నప్పుడు దాన్ని చట్టబద్ధమైన వివాహంతో సమానంగా గుర్తించాలని ఏడెనిమిదేళ్లక్రితం సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. 2013లో వెలువడిన తీర్పు దాన్ని మరింత విశదీకరించింది. ఆడ, మగ మధ్య ప్రేమానుబంధం ఏర్పడి, వారు సహజీవనం చేస్తే అది వారి ‘జీవించే హక్కు’లో అంతర్భాగమని, ఆ చర్యను నేరంగా పరిగణించడం చెల్లదని చెప్పింది. సహజీవనం చేసే జంటకు బిడ్డను పొందే హక్కు లేదనడం... అందుకు నైతికత, విలువలు వంటివి కారణాలుగా చెప్పడం ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఒకపక్క మన జువెనైల్ చట్టం పెళ్లయిందా, లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రతివారికీ దత్తత చేసుకునే హక్కు కల్పిస్తుంటే... ఈ బిల్లు సరోగసీ ద్వారా బిడ్డను పొందాలనుకున్నవారికి పెళ్లయి ఉండాలని చెప్పడం ఓ వైచిత్రి. బిల్లుపై పార్ల మెంటు వెలుపలా, లోపలా మరింత లోతైన చర్చ జరిగి మెరుగైన, ఆచరణాత్మకమైన విధానం రూపు దిద్దుకోవాలని ఆశిద్దాం.