'సరోగసీ' బిల్లు-సమస్యలు
సంతానం కోసం పరితపించే దంపతులు పిల్లల్ని కనడానికి అమల్లోకొచ్చిన వివిధ రకాల సాంకేతికతల్లో అద్దె గర్భం(సరోగసీ) విధానం ఒకటి. ఇంచుమించు 2000 సంవత్సరంలో మొదలై మన దేశానికి ‘క్రాడిల్ ఆఫ్ ద వరల్డ్’(ప్రపంచ ఊయల) అని పేరొచ్చేంతగా ఇప్పుడది విస్తరించింది. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర కేబినెట్ అద్దె గర్భం(నియంత్రణ) బిల్లును ఆమోదించింది. మహిళా ఉద్య మకారులు, ఆరోగ్యరంగ కార్యకర్తలు నియంత్రణ చట్టం అవసరమని పదేళ్లుగా చెబుతున్నారు. 2008లో అప్పటి యూపీఏ సర్కారు ఆ పని ప్రారంభించింది. మరో రెండేళ్లకు బిల్లు రూపొందించింది. అనంతరకాలంలో దానిలో ఎన్నో మార్పులు జరిగాయి. కానీ ఏవో కారణాల వల్ల అది కేంద్ర కేబినెట్ ముందుకే రాలేదు. ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులో ఎన్నో అనుకూలాంశాలున్నట్టే ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. సరోగసీ భావన చుట్టూ సామాజిక, వాణిజ్య, ఆరోగ్య, నైతిక సంబంధమైన అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. ప్రస్తుత బిల్లు ఇందులో కొన్ని అంశాలను ఉపేక్షించగా, మరికొన్నిటిని అతిగా పట్టించుకుందని చెప్పక తప్పదు. కొందరు సామాజిక ఉద్యమకారులు చెబుతున్నట్టు ఈ బిల్లు చట్టమైతే సరోగసీ విధానం చీకటి వ్యాపారంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు.
అద్దె గర్భం విషయానికొచ్చేసరికి మన దగ్గరున్నట్టే చాలా దేశాల్లో భిన్నాభి ప్రాయాలు, వాదనలు ఉన్నాయి. వేర్వేరు రకాల చట్టాలున్నాయి. కొన్నిచోట్ల ఈ విధానాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి నిషేధిస్తే, మరికొన్నిచోట్ల డబ్బు ప్రసక్తి లేని సందర్భాల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. గర్భందాల్చడానికి సిద్ధపడే మహిళ... దంపతుల్లో ఎవరో ఒకరి రక్తసంబంధీకురాలై ఉండాలని బ్రిటన్ చట్టం షరతు విధిస్తోంది. కారుణ్య మరణంలాంటి వివాదాస్పద అంశాల్లో సైతం అనుకూలమైన చట్టం తీసుకొచ్చిన స్విట్జర్లాండ్ కూడా సంతానాన్ని పొందడానికి ఐవీఎఫ్ ప్రక్రియను మాత్రమే గుర్తిస్తోంది. సరోగసీని అంగీకరించిన దేశాల్లో అందుకయ్యే ఖర్చు మన కరెన్సీలో దాదాపు 50 లక్షలు. కనుకనే ఏ నియంత్రణా లేని మన దేశంలో సంతాన సాఫల్య పర్యాటకం (ఫెర్టిలిటీ టూరిజం) గత కొన్నేళ్లుగా పెరిగింది. ఏటా దాదాపు ఆరేడు వేల కోట్ల రూపాయల మేర ఈ వ్యాపారం సాగుతున్నదని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.
సరోగసీ విధానంలో బిడ్డను కని ఇచ్చే తల్లి ఎదుర్కొనవలసివచ్చే వివిధ సమస్యల్లో ఆరోగ్య సమస్య అత్యంత కీలకమైనది. అలాగే సంతానం కోసం వచ్చిన దంపతులు శిశువును వివిధ కారణాలవల్ల తిరస్కరిస్తే ఏర్పడే సమస్యలు దీనికి అదనం. తమకంటూ సంతానం కలగడం సాధ్యంకాదని నిరాశా నిస్పృహలకు లోనైన దంపతులకు ఈ ప్రక్రియ వరమే కావొచ్చుగానీ... మహిళను ‘కని ఇచ్చే యంత్రం’గా, బిడ్డను ఒక ‘సరుకు’గా ఇది పరిగణిస్తున్నదన్న వాదన ఉంది. మాతృత్వం, దానితో ముడిపడి ఉండే భావోద్వేగాలకు సరోగసీలో తావులేదు. కడుపులో బిడ్డ పెరుగుతున్నకొద్దీ తల్లిలో ఏర్పడే మమకారం, అనుబంధాలను ఇది పట్టించుకోదు. ఇక ప్రసవ సమయంలో కొందరిలో వచ్చే మధుమేహం, అధిక రక్తపోటు... ప్రసవానంతరం వచ్చే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వారిని జీవితాంతం వేధిస్తాయి. గర్భస్రావమైతే ముందుగా కుదుర్చు కున్న ఒప్పందం మేరకు ఇవ్వాల్సిన డబ్బుల్ని ఎగ్గొట్టే అవకాశాలుంటాయి. వాణిజ్య అద్దె గర్భాలను నిషేధించడమే వీటన్నిటికీ పరిష్కారమవుతుందా? సరోగసీ ద్వారా తొమ్మిది నెలల్లో అయిదారు లక్షలు సంపాదించవచ్చునని ఆశపడి ముందుకొచ్చేవారిని రాబోయే చట్టం నిరోధించడం మాట అటుంచి దాన్ని కాస్తా చీకటి వ్యాపారంగా మార్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ మార్పిడికి సంబంధించిన చట్టం మాఫియాలకు వేల కోట్లు ఆర్జించిపెడుతోంది. మనలాంటి పితృస్వామిక వ్యవస్థలో సరోగసీపై నిర్ణయం తీసుకునేది ఎక్కువ సందర్భాల్లో భర్తేనని వేరే చెప్పనవసరం లేదు. డబ్బుకు ఆశపడి అతను శాసించినప్పుడు ఆ మహిళకు వేరే గత్యంతరం ఉండదు. చట్టాన్ని కాదని బిడ్డను కనడానికి సిద్ధపడిన తల్లికి ప్రామాణికమైన వైద్య సేవలు అందే అవకాశాలు కుంచించుకుపోతాయి. ఇది ఆ మహిళను మరిన్ని సమస్యల్లోకి నెడుతుంది. పేద మహిళలనూ... ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంత మహిళలను కాపాడటమే ఈ బిల్లు ధ్యేయమంటున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ దీన్ని గుర్తించినట్టు లేరు. దంప తులకు చెందిన దగ్గరి బంధువుల్లోని మహిళలను మాత్రమే సరోగసీకి అనుమతిస్తామని బిల్లు అంటున్నది. వారైతేనే సంతానం లేని దంపతులకు బిడ్డను కని ఇస్తే పుణ్యమని భావిస్తారని, బయటి వారైతే లాభాపేక్షతో మాత్రమే చేస్తారన్నది బిల్లు భావన కావొచ్చు. కుటుంబంపై పెత్తనంవహించే మగవాడి పాత్రను, అతడు పెట్టే ఒత్తిళ్లను ఇది గుర్తించినట్టు లేదు.
చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నవారికి తప్ప సహజీవనం చేసే జంటకు సరోగసీలో బిడ్డను పొందే హక్కు లేకుండా చేయడం మరో వివాదాస్పద నిర్ణయం. వివాహ మనేది లేకుండా దీర్ఘకాలం ఒక జంట కలిసి ఉన్నప్పుడు దాన్ని చట్టబద్ధమైన వివాహంతో సమానంగా గుర్తించాలని ఏడెనిమిదేళ్లక్రితం సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. 2013లో వెలువడిన తీర్పు దాన్ని మరింత విశదీకరించింది. ఆడ, మగ మధ్య ప్రేమానుబంధం ఏర్పడి, వారు సహజీవనం చేస్తే అది వారి ‘జీవించే హక్కు’లో అంతర్భాగమని, ఆ చర్యను నేరంగా పరిగణించడం చెల్లదని చెప్పింది. సహజీవనం చేసే జంటకు బిడ్డను పొందే హక్కు లేదనడం... అందుకు నైతికత, విలువలు వంటివి కారణాలుగా చెప్పడం ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఒకపక్క మన జువెనైల్ చట్టం పెళ్లయిందా, లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రతివారికీ దత్తత చేసుకునే హక్కు కల్పిస్తుంటే... ఈ బిల్లు సరోగసీ ద్వారా బిడ్డను పొందాలనుకున్నవారికి పెళ్లయి ఉండాలని చెప్పడం ఓ వైచిత్రి. బిల్లుపై పార్ల మెంటు వెలుపలా, లోపలా మరింత లోతైన చర్చ జరిగి మెరుగైన, ఆచరణాత్మకమైన విధానం రూపు దిద్దుకోవాలని ఆశిద్దాం.