న్యూఢిల్లీ: సరోగసీ ద్వారా బిడ్డల్ని కనిచ్చేందుకు దగ్గరి బంధువులే కానక్కర్లేదనీ, ఆరోగ్యవంతులైన స్త్రీలెవ్వరైనా అందుకు సమ్మతిస్తే సరోగసీ పద్ధతుల్లో బిడ్డని కనివ్వొచ్చనీ రాజ్యసభ సెలెక్ట్ కమిటీ తేల్చి చెప్పింది. 35–45 ఏళ్ల మధ్య వయస్కులైన ఒంటరి స్త్రీలు సరోగసీని ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేసింది. సరోగసీ తల్లులుగా దగ్గరి బంధువులే ఉండాలన్న నిబంధనను అద్దెగర్భాల తల్లులపై పరిమితులు సృష్టిస్తుందనీ, అందుకే దీన్ని తొలగించాలని కమిటీ సూచించింది. ఒంటరి స్త్రీలంతా సరోగసీకి అర్హులేననీ, భర్తలేకున్నా, భర్తతో విడిపోయినా, భర్త చనిపోయిన స్త్రీలకూ సంతానాన్ని పొందే అవకాశం ఉండాలని స్పష్టం చేసింది.
భారతీయురాలైన 35–45 ఏళ్ల మధ్యవయస్సులో ఉన్న స్త్రీలు ఇందుకు అర్హులంది. అద్దెగర్భాన్ని వ్యాపారంగా మార్చొద్దని హెచ్చరించింది. లాభాపేక్షతో కాకుండా మాతృత్వపు విలువలను కాపాడేవిధంగా సరోగసీని అనుమతించాలని అభిప్రాయపడింది. సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు–2019ని నవంబర్ 21, 2019న రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశమైంది. కమిటీ చైర్మన్ భూపేందర్ యాదవ్ బుధవారం నివేదికను సమర్పించారు. 23 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ బృందం సరోగసీ రెగ్యులేషన్ బిల్లులో పలు మార్పులను సూచించింది.
► అదేవిధంగా సరోగసీ ద్వారా బిడ్డని కనాలనుకునే జంట పెళ్ళైన ఐదేళ్ళ పాటు భార్యాభర్తలు కలిసి ఉండీ పిల్లల్ని కనలేని పరిస్థితుల్లోనే అద్దెగర్భాన్ని ఆశ్రయించాలన్న నిబంధనను కూడా కమిటీ సడలించింది. సంతానలేమిని కొత్తగా నిర్వచించిన కమిటీ పిల్లల కోసం ఒక జంట ఐదేళ్ళపాటు ఎదురుచూడడం చాలా ఎక్కువ కాలం అవుతుందని పేర్కొంది.
► ఇష్టమైన ఏ స్త్రీ అయినా సరోగసీ ద్వారా బిడ్డలను కనే అనుమతినివ్వాలనీ, అయితే అందుకు సంబంధించిన అన్ని విషయాలూ సరోగసీ చట్టప్రకారమే జరగాల్సి ఉంటుందనీ తెలిపింది. అలాగే అద్దెగర్భం దాల్చే మహిళలకు గతంలో ఉన్న 16 నెలల ఇన్సూరెన్స్ కవరేజ్‌ను 36 నెలలకు పెంచాలని సూచించింది.
► పిల్లలు పుట్టని వారుసైతం సరోగసీ ద్వారా బిడ్డను పొందేందుకు ఐదేళ్ళు వేచి ఉండాలన్న నిబ«ంధనను తొలగించాలని అభిప్రాయపడిన కమిటీ పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలుంటాయని వివరించింది. కొందరికి పుట్టుకతోనే గర్భాశయం లేకపోవడం, లేదా గర్భాశయం పనిచేయకపోవడం, క్యాన్సర్‌కారణంగా గర్భాశయాన్ని తొలగించాల్సి రావడం, కొందరు స్త్రీలకు ఎప్పటికీ పిల్లలను కనే అవకాశంలేని అనారోగ్య స్థితిలో ఉన్న వారికి సరోగసీ ఒక ప్రత్యామ్నాయమని అభిప్రాయపడింది.
► బిడ్డలు కావాలనుకునేవారు ఎప్పుడైనా సరోగసీ ద్వారా బిడ్డలను కనొచ్చనీ, అయితే అందుకు వైద్యపరమైన ఆమోదం పొందాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది.
► అలాగే భారతీయ సంతతికి చెందిన వారెవ్వరైనా సరోగసీ బోర్డు ద్వారా అనుమతిపొందిన తరువాత దేశంలో సరోగసీ ద్వారా బిడ్డలను పొందే వీలుండేలా బిల్లులో మార్పులు చేయాలని కమిటీ సూచించింది.
సరోగసీకి దగ్గరి బంధువులే కానక్కర్లేదు
Published Thu, Feb 6 2020 4:17 AM | Last Updated on Thu, Feb 6 2020 4:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment