Sarogasi
-
తల్లి కాబోతోన్న నయనతార?
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార, కాబోయే భర్త విఘ్నేశ్ శివన్‌లకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. లాక్డౌన్లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట రీసెంట్గా వివాహం కూడా చేసుకున్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నయన్, విఘ్నేశ్‌లు జంటగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వీడియోలో బయటకు రాగా అందులో నయన్ పాపిటన సింధూరం పెట్టుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటి నుంచి నయన్, విఘ్నేశ్‌లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే! ఈ క్రమంలో వీరికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త హాట్‌టాపిక్‌గా నిలిచింది. నయన్, విఘ్నేశ్‌లు పిల్లల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారట. సరోగసి ద్వారా తల్లి కావాలని అనుకుంటుందట నయన్. దీనికి విఘ్నేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సరోగసి(అద్దే గర్భం) ద్వారా తల్లిదండ్రులు అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో నయన్, విఘ్నేశ్‌లు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఇప్పటికే తమిళ మీడియా, వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరస ఆఫర్లతో నయన్ ఫుల్ బిజీగా ఉంది, అందుకే తల్లి కావడానికి సరోగసి మార్గాన్ని ఆమె ఎంచకుకున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. చదవండి: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌కి దూరంగా విజయేంద్ర ప్రసాద్.. అందుకేనా? ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి జరిగిందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. కానీ వారు సరోగసి ద్వారా పిల్లలను పొందాలని అనుకుంటున్నారంటూ వస్తున్న ఈ వార్తలు కొందరు కొట్టిపారేస్తుండగా.. మరికొందరు.. ‘ఏమో ఇది నిజమై ఉండోచ్చు, సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారేమో’ అని అభిప్రాయ పడుతున్నారు. కాగా గత ఆరేళ్లుగా నయనతారా, విఘ్నేశ్ శివన్‌తో రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. విఘ్నేష్ దర్శకత్వం వహించిన 'నానుమ్ రౌడీ ధాన్' సినిమా సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట లాక్డౌన్లో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించి.. పెళ్లి మాత్రం అందరి సమక్షంలో అంగరంగ వైభవం చేసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. -
నగరంలోనూ ‘సృష్టి’ ప్రకంపనలు
రాంగోపాల్‌పేట్: విశాఖ పట్టణం కేంద్రంగా సరోగసీ పేరుతో సంతానం లేని దంపతుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన ‘సృష్టి’ ఆస్పత్రి యాజమాన్యం నిర్వాకాలు హైదరాబాద్ నగరంలోనూ వెలుగులోకి వస్తున్నాయి. నగరానికి చెందిన దంపతులకు సరోగతి ద్వారా శిశువు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌కు చెందిన దంపతులకు వివాహం జరిగి చాలా ఏళ్లు గడిచినా సంతానం కలుగకపోవడంతో వారు గత నవంబర్ 11న సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్ ఎదురుగా ఉన్న ‘సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్’ను సంప్రదించారు. ఆస్పత్రి ఎండీ డాక్టర్ నమ్రత సరోగసి (అద్దె గర్భం) ద్వారా శిశువును ఇస్తామని ఇందకు రూ.10లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో వారు అప్పటికప్పుడే రూ.10లక్షలు చెల్లించారు. అద్దె గర్భం ఇచ్చేందుకు అంగీకరించిన మహిళ విశాఖపట్టణంలోని తమ ఆస్పత్రిలో చికిత్సపొందుతుందని, ఈ ఏడాది అక్టోబర్‌లో శిశువును అప్పగిస్తామని చెప్పారన్నారు. అయితే ఇటీవల విశాఖపట్టణంలో సదరు ఆస్పత్రి సరోగసీ పేరుతో చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా సదరు ఆస్పత్రిలో సరోగసీ మహిళ ప్రసవించి శిశువును ఆస్పత్రికి అప్పగించి సొంతూరికి వెళ్లిపోయింది. అయితే ఆమె శిశువు లేకుండా ఇంటికి రావడంతో స్థానికులు దీనిపై ఆరా తీయడంతో వివాదానికి కారణమైంది. దీంతో శిశువును నగరానికి చెందిన దంపతులకు అప్పగించ లేదు. ఈ లోగా అక్రమాలు వెలుగులోకి రావడంతో నిర్వాహకులు సికింద్రాబాద్ ఆస్పత్రికి తాళం వేసి పరారయ్యారు. దీంతో బాధితులు గురువారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా డాక్టర్ నమ్రత గత ఎనిమిదేళ్ల క్రితం సికింద్రాబాద్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచే సరోగసీ పేరుతో శిశు విక్రయాలకు పాల్పడినట్లు సమాచారం. -
సరోగసీకి దగ్గరి బంధువులే కానక్కర్లేదు
న్యూఢిల్లీ: సరోగసీ ద్వారా బిడ్డల్ని కనిచ్చేందుకు దగ్గరి బంధువులే కానక్కర్లేదనీ, ఆరోగ్యవంతులైన స్త్రీలెవ్వరైనా అందుకు సమ్మతిస్తే సరోగసీ పద్ధతుల్లో బిడ్డని కనివ్వొచ్చనీ రాజ్యసభ సెలెక్ట్ కమిటీ తేల్చి చెప్పింది. 35–45 ఏళ్ల మధ్య వయస్కులైన ఒంటరి స్త్రీలు సరోగసీని ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేసింది. సరోగసీ తల్లులుగా దగ్గరి బంధువులే ఉండాలన్న నిబంధనను అద్దెగర్భాల తల్లులపై పరిమితులు సృష్టిస్తుందనీ, అందుకే దీన్ని తొలగించాలని కమిటీ సూచించింది. ఒంటరి స్త్రీలంతా సరోగసీకి అర్హులేననీ, భర్తలేకున్నా, భర్తతో విడిపోయినా, భర్త చనిపోయిన స్త్రీలకూ సంతానాన్ని పొందే అవకాశం ఉండాలని స్పష్టం చేసింది. భారతీయురాలైన 35–45 ఏళ్ల మధ్యవయస్సులో ఉన్న స్త్రీలు ఇందుకు అర్హులంది. అద్దెగర్భాన్ని వ్యాపారంగా మార్చొద్దని హెచ్చరించింది. లాభాపేక్షతో కాకుండా మాతృత్వపు విలువలను కాపాడేవిధంగా సరోగసీని అనుమతించాలని అభిప్రాయపడింది. సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు–2019ని నవంబర్ 21, 2019న రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశమైంది. కమిటీ చైర్మన్ భూపేందర్ యాదవ్ బుధవారం నివేదికను సమర్పించారు. 23 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ బృందం సరోగసీ రెగ్యులేషన్ బిల్లులో పలు మార్పులను సూచించింది. ► అదేవిధంగా సరోగసీ ద్వారా బిడ్డని కనాలనుకునే జంట పెళ్ళైన ఐదేళ్ళ పాటు భార్యాభర్తలు కలిసి ఉండీ పిల్లల్ని కనలేని పరిస్థితుల్లోనే అద్దెగర్భాన్ని ఆశ్రయించాలన్న నిబంధనను కూడా కమిటీ సడలించింది. సంతానలేమిని కొత్తగా నిర్వచించిన కమిటీ పిల్లల కోసం ఒక జంట ఐదేళ్ళపాటు ఎదురుచూడడం చాలా ఎక్కువ కాలం అవుతుందని పేర్కొంది. ► ఇష్టమైన ఏ స్త్రీ అయినా సరోగసీ ద్వారా బిడ్డలను కనే అనుమతినివ్వాలనీ, అయితే అందుకు సంబంధించిన అన్ని విషయాలూ సరోగసీ చట్టప్రకారమే జరగాల్సి ఉంటుందనీ తెలిపింది. అలాగే అద్దెగర్భం దాల్చే మహిళలకు గతంలో ఉన్న 16 నెలల ఇన్సూరెన్స్ కవరేజ్‌ను 36 నెలలకు పెంచాలని సూచించింది. ► పిల్లలు పుట్టని వారుసైతం సరోగసీ ద్వారా బిడ్డను పొందేందుకు ఐదేళ్ళు వేచి ఉండాలన్న నిబ«ంధనను తొలగించాలని అభిప్రాయపడిన కమిటీ పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలుంటాయని వివరించింది. కొందరికి పుట్టుకతోనే గర్భాశయం లేకపోవడం, లేదా గర్భాశయం పనిచేయకపోవడం, క్యాన్సర్‌కారణంగా గర్భాశయాన్ని తొలగించాల్సి రావడం, కొందరు స్త్రీలకు ఎప్పటికీ పిల్లలను కనే అవకాశంలేని అనారోగ్య స్థితిలో ఉన్న వారికి సరోగసీ ఒక ప్రత్యామ్నాయమని అభిప్రాయపడింది. ► బిడ్డలు కావాలనుకునేవారు ఎప్పుడైనా సరోగసీ ద్వారా బిడ్డలను కనొచ్చనీ, అయితే అందుకు వైద్యపరమైన ఆమోదం పొందాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. ► అలాగే భారతీయ సంతతికి చెందిన వారెవ్వరైనా సరోగసీ బోర్డు ద్వారా అనుమతిపొందిన తరువాత దేశంలో సరోగసీ ద్వారా బిడ్డలను పొందే వీలుండేలా బిల్లులో మార్పులు చేయాలని కమిటీ సూచించింది. -
సరోగసీని రద్దు చేయాలి
సీతంపేట(విశాఖ ఉత్తర): మహిళా వ్యతిరేక, పితృస్వామ్య స్వభావాన్ని కలిగిన సరోగసీని అంతర్జాతీయంగా అనేక దేశాల్లో నిషేధించారని ప్రగతి శీల మహిళా సంఘటన్ ప్రధాన కార్యదర్శి, సుప్రీంకోర్టు న్యాయవాది పూనమ్ కౌశిక్ అన్నారు. సరోగసీని నిషేధించాలంటూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. కెనడా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో వ్యాపార రహిత సరోగసీకి మాత్రమే అనుమతి ఉందన్నారు. 2015 తర్వాత థాయ్‌లాండ్ దేశంలో నిషేధించారన్నారు. నియంత్రణ లేని సరోగసీ శిశువుల వ్యాపారంగా మారుతుందని యూఎన్వో పేర్కొందని గుర్తు చేశారు. 2017వ సంవత్సరంలో ఒక్క భారతదేశంలోనే సరోగసీపై రూ.3వేల కోట్ల మేర వ్యాపారం జరిగిందన్నారు. సరోగసీ పూర్తిగా అమానవీయమైనదని, శాస్త్ర సాంకేతిక విజయాలను వ్యాపార సరుకుగా మారుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు సాధారణ మహిళలను ఈ వ్యాపారం నుంచి కాపాడలేకపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో పద్మశ్రీ ఆస్పత్రిలో నాగలక్ష్మికి సంబంధించిన సరోగసీ ఉదంతమూ దీనికి పెద్ద ఉదాహరణగా నిలుస్తుందన్నారు. నాగలక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని కోరారు. భారతదేశంలో సరోగసీనీ పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ మాట్లాడుతూ పేద మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అద్దె గర్భాల దందాకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ సరోగసీ పెద్ద మాఫియాగా మారిందన్నారు. పేద మహిళలను ప్రలోభపెట్టి సరోగసీ ఉచ్చులోకి లాగుతున్నారని, ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ పేరుతో సాగుతున్న సరోగసీ వ్యాపారం అందులో పేర్కొన్న నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. సరోగసీ బాధిత మహిళ నాగలక్ష్మి ఫిర్యాదు చేస్తే పోలీస్, సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్లు, కలెక్టర్ బాధ్యత తీసుకోలేదని విమర్శించారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు ఇచ్చిన ఆదేశాలను సైతం పట్టించుకోలేదన్నారు. సరోగసీని రద్దు చేస్తూ ప్రభుత్వాలు చట్టం చేసే వరకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు పోరాడాలని కోరారు. సమావేశంలో ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్.వెంకటలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.జానకి, జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిణి, కార్యదర్శి యు.ఇందిర, వివిధ ప్రజా సంఘాల నాయకులు లలిత, టి.శ్రీరామమూర్తి, వై.నూకరాజు, పి.వి.రమణ పాల్గొన్నారు. -
గర్భగుడికి నడిచొచ్చిన నంది
మాతృత్వం ఒక వరం. అయితే, కొన్ని కారణాంతరాల వల్ల సహజంగా తల్లి అయ్యే భాగ్యానికి నోచుకో (లే)నివారు, సహజసిద్ధంగా తండ్రి కాలేనివారు సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందుతున్నారు. చట్టాలు కూడా ఇందుకు అనుమతిస్తున్నాయి. సరోగసీ పద్ధతిలో పేద మహిళలు తమ గర్భాలను అద్దెకిచ్చి, పెద్దింటి వారి బిడ్డలను నవమాసాలు మోసి, కని, కూలి తీసుకుని బిడ్డలను వారి చేతిలో పెడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే– అద్దె గర్భం అయినా, అసలు గర్భమైనా అమ్మతనంలో తేడా ఏముటుంది? అసలు అమ్మ అయినా, నొప్పులు పడాల్సిందే, అద్దె తల్లి కూడా ఆ భారాన్ని మోయాల్సిందే, అన్ని నొప్పులూ పడాల్సిందే. ఆ తర్వాత బాలింతరాలి బాధలు అనుభవించవలసిందే. మరి వీరిని వేరు చేస్తున్నదేమిటి? ఉన్నవారు, లేని వారు అనే తేడానే కదా! ఆ ఒక్క తేడా వల్లే తన కడుపులోంచి భూమి మీద పడిన పిల్లల పట్ల మమతానురాగాలు పెంచుకోడానికి వీల్లేదా? ఇది ఏమైనా న్యాయమా? సరోగసీ తల్లికి తన కడుపు చించుకుని పుట్టిన బిడ్డల పట్ల కనీసపు హక్కులు ఉండాలనుకోవడంలో అభ్యంతరం ఎందుకు? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు. ఇలాంటి ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ... అవసరం అయితే చట్టంలో మార్పులు తెచ్చి అయినా సరే, తల్లితనానికి విలువ ఇవ్వాలని చెబుతూ ప్రముఖ జర్నలిస్టు, కథా, నవలా రచయిత డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు రాసిన నాటికే ‘గర్భగుడి’. అమ్మతనంలోని కమ్మదనాన్ని అద్భుతంగా వివరిస్తూనే, ఆ కమ్మదనానికి ఖరీదు కట్టడం సమంజసం కాదని, అసలు తల్లిదండ్రులు కిరాయి చెల్లించి, బిడ్డను సొంతం చేసుకున్న తర్వాత తన కడుపు చించుకుని పుట్టిన ఆ పసికందును కనీసం కంటినిండా చూసుకోరాదని, ఒడినిండా తీసుకోరాదని, ఆ బిడ్డకు చనుబాలివ్వరాదనీ అనడం సహేతుకం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులోని చట్టబద్ధతపై ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో చూసిన ఒక నిజ జీవిత సంఘటన చింతకిందిని చాన్నాళ్లు ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు. దాంతో తన మనసులో చోటు చేసుకున్న భావ సంఘర్షణలకు ఓ రూపం ఇచ్చారు. గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన ఆవేదన ఆధారంగా రాసిన చక్కటి ఇతివృత్తంతో కూడిన ఈ నాటికను కళాకారులు ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. ఎంతోమంది కంట తడి పెట్టించి ఎన్నో ప్రదర్శనలను అందుకున్నది ఈ నాటిక. నాటక ప్రియులు, విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేనా...దాంతోబాటు 2017 రాష్ట్రప్రభుత్వ నాటకోత్సవాలలో ప్రథమ ఉత్తమ నాటికగా నిలిచిందీ నాటిక. ఆ నాటిక రచయితగా నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు చింతకింది.విశాఖపట్నం జిల్లా చోడవరంకు చెందిన చింతకింది చక్కటి ఉత్తరాంధ్ర మాండలికంలో సొగసైన రచనలు చేయడంలో అందె వేసిన చేయి. మానవీయ కోణంతో కూడిన వార్తలు రాయడంలో మేటి. ‘అదిగో ద్వారక’, ‘వికర్ణ’ వంటి పౌరాణిక నవలలు, ‘దాలప్ప తీర్థం’, ‘కాన్పుల దిబ్బ’, ‘కప్పస్తంభం’ కథాసంపుటాలతో అశేష పాఠకాభిమానాన్ని సంపాదించుకున్న చింతకింది, ఇప్పుడు ఈ నాటికతో నంది పురస్కారాన్ని సాధించారు. – డి.వి.ఆర్. -
ఎస్సీలంటే అంత చులకనా?
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం): ఎస్సీల బాధల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు.. వీరికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.. నేను వస్తున్నానని చెప్పినా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ రాకపోవడంలోనే పరిస్థితి అర్థం అవుతోంది.. అంటూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు ధ్వజమెత్తారు. పద్మజా ఆసుపత్రిలో తనను మోసం చేసి గర్భంలో రెండు పిండాల్ని ప్రవేశపెట్టారంటూ నేతల నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆమెను రాములు శుక్రవారం పరామర్శించారు. దీనికి ముందు ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నుంచి వివరాలు సేకరించి, బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం బాధితురాల్ని పరామర్శించి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, దళిత మహిళను మోసం చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికే ముగ్గురు బిడ్డలకు తల్లి అయిన బాధితురాలు నాగలక్ష్మి తిరిగి ఎలా గర్భం ధరించేందుకు ఒప్పుకుంటుందని ప్రశ్నించారు. ఉష అనే అమ్మాయి వీరి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని పద్మశ్రీ ఆసుపత్రి ఎండీ పద్మశ్రీతో కుమ్మక్కై నాగలక్ష్మిని మోసం చేశారనన్నారు. నాగలక్ష్మికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆమె గర్భంలో రెండు పిండాల్ని ప్రవేశపెట్టడం అన్యాయమన్నారు. ఇటువంటి ద్రోహానికి పాల్పడిన వైద్యురాలు పద్మశ్రీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. బాధితురాలకి ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.8 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ గృహం మంజూరు చేయడంతోపాటు ఆమె సంతానం అయిన ముగ్గురికి సాంఘిక శాఖ ద్వారా ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ వేయాలని, 24 గంటల్లో పూర్తి స్థాయి సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు ఆదేశానికి స్పందించిన కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్.రమేష్, కృష్ణా ఆసుపత్రి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ జి.ఎ.రామరాజు, ప్రభుత్వ విక్టోరియా (ఘోషా) ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.హేమలతాదేవి కమిటీలో సభ్యులుగా ఉంటారు. నా అనుమతి లేకుండా పిండాల్ని ప్రవేశపెట్టారు భర్తగా నా అనుమతి లేకుండా నా భార్య నాగలక్ష్మి గర్భంలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ పద్మశ్రీ రెండు పిండాలను ప్రవేశపెట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇలా చేయడం అన్యాయం. ఇటీవల కుటుంబంలో వచ్చిన కలహాల వల్ల నేను నా స్వంత ఊరు రాజాం వెళ్లి ఉంటున్నాను తప్ప నా భార్యను వదిలేయలేదు. మా ఆర్థిక స్థితి బాగులేకపోవడంతో నా భార్యను మోసం చేసి ఇలా చేసారు. ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న నా కుటుంబం తిరిగి మరొ ఇద్దరిని (తండ్రి ఎవరో తెలియని) ఎలా పెంచగలను. నా కుటుంబానికి తగిన న్యాయం చేయాలి.-నేతల ఆదినారాయణ, బాధితురాలు నాగలక్ష్మి భర్త -
నాగలక్ష్మి ఇష్టంతోనే ‘సరోగసి’
అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): సరోగసి నిబంధనల ప్రకారం లీగల్ అగ్రిమెంట్ పరిశీలించిన తర్వాతే అద్దె గర్భంలో ఎంబ్రియో ప్రవేశపెట్టానని పద్మశ్రీ ఆస్పత్రి ఎండీ డాక్టర్ సుధాపద్మశ్రీ అన్నారు. అండాలు తీసుకుంటామని చెప్పి, తనకి తెలియకుండా గర్భంలో పిండాలు ప్రవేశపెట్టారంటూ దళిత మహిళ నేతల నాగలక్ష్మి ప్రగతి శీల మహిళా సంఘం ప్రతినిధులతో కలసి బుధవారం అక్కయ్యపాలెం దరి శాంతిపురంలోని పద్మశ్రీ ఆస్పత్రి వద్ద ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆస్పత్రి ఎండీ డాక్టర్ సుధా పద్మశ్రీ గురువారం శంకరమఠం రోడ్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓ మహిళ ఆరోపణలు చేయడం, దానికి మహిళా సంఘాలు మద్దతు పలకడం సరికాదన్నారు. తమపై వచ్చిన ఆరోపణలు వాస్తవమా? కాదా? అని అడిగి తాము చెప్పిన సమాధానం సంతృప్తి లేకుంటే ఆందోళన చేస్తే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంసీఎంఆర్ నిబంధనల మేరకు అనుమతులతో ఈ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేశానని తెలిపారు. నేతల నాగలక్ష్మి ఆరోపిస్తున్నట్టుగా తాను ఎలాంటి మత్తు మందు ఇచ్చి, ఆమె గర్భంలో పిల్లలను పెంచడం లేదని స్పష్టం చేశారు. బయలాజికల్ పేరెంట్స్‌తో కలసి నాగలక్ష్మి, కేర్‌టేకర్ కిలాడి ఉషా కలసి మార్చి 22న తన వద్దకు వచ్చారన్నారు. బేబీ కోసం ఫలానా మహిళతో ఒప్పందం చేసుకున్నట్టు లీగల్ అగ్రిమెంట్‌తో వచ్చారని చెప్పారు. నాగలక్ష్మి అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేసిందన్నారు. దీని ఆధారంగానే సరోగసి చేసేందుకు ముందుకు వెళ్లానని స్పష్టం చేశారు. సరోగసి మహిళకు ఇష్టం లేకుండా.. ఆమెకు చెప్పకుండా.. తొమ్మిది నెలల పాటు గర్భంలో పిల్లలను పెంచడం చాలా కష్టమన్నారు. నాగలక్ష్మి ఇష్టపూర్వకంగానే మందులు వేశామన్నారు. ఆ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. 14 రోజుల తర్వాత పరీక్ష చేయగా నాగలక్ష్మి గర్భంలో రెండు పిండాలు పెరుగుతున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. భర్త, పిల్లలు లేరని చెప్పిన నాగలక్ష్మి ఈ నెల 21న భర్తతో కలసి ఆస్పత్రికి వచ్చి, నీరసంగా ఉందని గర్భం తీసే యాలని కోరిందన్నారు. ఒప్పందం కుదుర్చుకు న్న బయలాజికల్ పేరెంట్స్‌తో మాట్లాడుకోవా లని, వారు అంగీకరిస్తే తీసేస్తామని చెప్పామ న్నారు. ఈ విషయంలో డబ్బుల వ్యవహారంతో తమకు సంబంధం లేదన్నారు. పద్మశ్రీ ఆస్పత్రిలో తనిఖీలు అక్కయ్యపాలెంలోని పద్మశ్రీ ఆస్పత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రోణంకి రమేష్ గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. బయలాజికల్ పేరెంట్స్‌తో నాగలక్ష్మి చేసుకున్న ఒప్పంద పత్రాలు, ఆస్పత్రికి ఉన్న అనుమతులను పరిశీలించారు. నివేదిక అనంతరం కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని డీఎంహెచ్‌వో తెలిపారు. -
సరోగసీ పేరుతో చెలగాటం
అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అనుమతి లేకుండా సరోగసి పేరిట అద్దె గర్భాల అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న ఉదంతం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగుచూసింది. బాధితురాలు నాగలక్ష్మి, మహిళా సంఘాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... భర్తతో గొడవపడి మధురవాడలో తల్లి వద్ద ఉంటున్న నేతల నాగలక్ష్మికి అదే కాలనీకి చెందిన కిలాడి ఉష ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. నెల నెలా వృథాగా పోయే అండాలు తీసుకొని రూ.20వేలు ఇస్తారని అక్కయ్యపాలెంలోని పద్మశ్రీ ఆస్పత్రికి తీసుకొచ్చింది. కాగితాలపై సంతకాలు చేయించిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చారు. గంటున్నర తర్వాత నాగలక్ష్మికి తెలివి వచ్చాక ప్రశ్నించడంతో... నీ కడుపులో రెండు పిండాలు పెట్టాం, 9 నెలలు మోయాలి, ఆ తర్వాత మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, ఆస్పత్రి డాక్టర్ సుధా పద్మశ్రీ రూ. 5వేలు నాగలక్ష్మి చేతిలో పెట్టింది. అనంతరం సెల్‌ఫోన్ లాక్కొని, ఆస్పత్రిలో నిర్బంధించారు. ఈ క్రమంలో బాధితురాలు అతికష్టంపై ఈ నెల 21న ఆస్పత్రి నుంచి తప్పించుకొని భర్త వద్దకు చేరుకొంది. తనకు జరిగిన అన్యాయంపై మహిళా సంఘాలతో కలసి అదే రోజు రాత్రి ఫోర్త్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజులు గడిచినా ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు ఎం.లక్ష్మి, ఎస్.వెంకటలక్ష్మి, యు.ఇందిర, ఈ.లక్ష్మి సాయంతో బాధితురాలి కుటుంబం బుధవారం పద్మశ్రీ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనుమతి లేకుండా సరోగసీ నిర్వహిస్తున్న ఆస్పత్రి నిర్వాహకులను అరెస్టు చేయాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐని నిలదీసిన మహిళలు ఆస్పత్రి నుంచి తప్పించుకొని బయటపడిన బాధితురాలు నాగలక్ష్మి భర్తతో కలిసి ఫిర్యాదు చేయడానికి సోమవారం ఫోర్త్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు చేసిన తర్వాత బాధితురాలిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించడంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సురేష్ నిర్లక్ష్యం వహించారని మహిళా సంఘాలు ఆరోపించాయి. అనారోగ్యంతో ఉన్న నాగలక్ష్మిని అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించకపోగా, మీరే తీసుకెళ్లండని నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దీంతో మేమే ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆస్పత్రి ఎదుట జరిగిన ధర్నాకు విచ్చేసిన ఎస్ఐ సురేష్‌ను భాదిత మహిళ కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు చుట్టుముట్టి నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగా బాధితురాలికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..? ఆమె ముగ్గురు పిల్లలను ఎవరు చూస్తారని ప్రశ్నించారు. సోమవారం ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. -
సరోగసీ మహిళ అదృశ్యం
హైదరాబాద్: అద్దె గర్భాన్ని ధరించేందుకు సంతాన సాఫల్యతా కేంద్రానికి వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. ఈ ఘటనపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.14లోని సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో సరోగసీ పద్ధతిలో అద్దె గర్భం దాల్చేందుకు మహిళలు కావాలంటూ ఆసుపత్రి సంచాలకుడు డాక్టర్ సమిత్ శేఖర్ అలియాస్ డాక్టర్ సాయి కిరణ్ నుంచి నరేశ్‌కుమార్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో తమ బంధువైన విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతానికి చెందిన లక్ష్మి(31)ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో తీసుకొచ్చి ఒప్పందం మేరకు ఇక్కడ ఉంచి సంబంధిత ధ్రువపత్రాలపై సంతకాలు కూడా చేశారు. అద్దె గర్భం ధరిస్తే రూ. 2.50 లక్షలు ఇస్తారంటూ చెప్పడంతో పేదరికంలో ఉన్న లక్ష్మి ఇందుకు అంగీకరించింది. అప్పటి నుంచి వారి సంరక్షణలో ఉన్న లక్ష్మి వారం రోజుల నుంచి కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు దాచిపెట్టాయి. ఆమెను చూడటానికి వచ్చిన నరేశ్ రెండుసార్లు కలవడానికి యత్నించగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. లక్ష్మి కనిపించడం లేదంటూ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. కమిషన్ ఆదేశాలతో వైద్యాధికారులు సాయికిరణ్ ఫెర్టిలిటీ సెంటర్లో తనిఖీలు చేపట్టడంతోపాటు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులకు కేసు నమోదు చేయాల్సిందిగా ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి బుధవారం ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. -
సరోగసీ దందాకు ఇక అడ్డుకట్ట
కొత్త విధానం రూపకల్పనకు అధ్యయన కమిటీ సాక్షి, హైదరాబాద్: సరోగసీ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర సరోగసీ బోర్డు(ఎస్ఎస్బీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త విధానంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్రంలోని వైద్య నిపుణులు, తెలంగాణ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సారథ్యంలో ఈ కసరత్తు వేగం పుంజుకుంది. 6 నెలల క్రితం ఓ విదేశీయురాలు హైదరాబాద్‌లోని ఓ క్లినిక్‌లో సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం భర్తతో కలసి వారి దేశం తిరుగుపయనమయ్యే సమయంలో ఎంబసీ అధికారులు అభ్యంతరం తెలిపారు. పాపను తీసుకెళ్లాలంటే డీఎన్ఏ పరీక్షలు చేయించాలని స్పష్టంచేశారు. తీరా ఆ పరీక్షల ఫలితాల్లో ఆ పాపకు, దంపతులకు జన్యు సంబంధం లేదని తేలింది. దీంతో అప్పుడే సరోగసీ ముసుగులో ప్రైవేటు క్లినిక్‌ల అక్రమాలు తెరపైకి వచ్చాయి. కానీ తనిఖీలు లేకపోవటంతో ఈ దందా క్రమంగా విస్తరించినట్లు ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
సీజ్ చేయం.. గర్భిణులను తరలించం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మజ వెల్లడి - సాయికిరణ్ ఆస్పత్రిలో మళ్లీ తనిఖీలు.. నోటీసులు జారీ - అనుమతులు లేకుండానే అల్లోపతి ముసుగులో సరోగసీ - ఐదేళ్లలో అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కన్నది 400 మంది సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సరోగసీ దందా నిర్వహిస్తున్న సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌కు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. రెండ్రోజుల కిందట తనిఖీలు నిర్వహించిన తాము మరిన్ని రికార్డులు పరిశీలించేందుకు సోమవారం కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సరోగసీ బాధితులను విచారించిన అనంతరం కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఆస్పత్రికి అల్లోపతి వైద్యానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని, సరోగసీకి అనుమతి లేదని విచారణలో తేలిందన్నారు. సరోగసీ నిర్వహించాలంటే ఆర్టిఫిషియల్ రీ ప్రొడక్షన్ టెక్నిక్స్(ఏఆర్సీ)లో నమోదై ఉండాలని, కానీ ఈ ఆసుపత్రి అందులో రిజిస్టర్ కాలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించినందున ఈ ఆస్పత్రిపై రెండు మూడ్రోజుల్లో కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ‘‘ఇప్పటి కిప్పుడు ఆస్పత్రిని సీజ్ చేస్తే.. అందులో చికిత్స పొందుతున్న సరోగసీ గర్భిణులు ఇబ్బందులకు గురవుతారు. అందుకే మానవతా దృక్పథంతో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదు. ఈ ఆస్పత్రిపై చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులకు ఉంటుంది’’ అని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ 48 మంది సరోగసీ ద్వారా గర్భం దాల్చినట్లు తెలిపారు. ఆస్పత్రి యజమాని సుమిత్ శేఖర్‌కు నోటీసులు అందించి, వివరణ కోరినట్లు తెలిపారు. అద్దె గర్భం దాల్చినందుకు తమకు రూ.2.50 లక్షలు ఇస్తున్నట్లు గర్భిణీలు అంగీకరించినట్లు చెప్పారు. ఇందులో గత ఐదేళ్లలో ఇప్పటివరకు 400 మంది అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనివ్వగా.. వారంతా పేదరికంలో ఉన్న మహిళలేనన్నారు. ప్రస్తుతం అద్దె గర్భాలను మోస్తున్న బాధితుల్లో అత్యధికులు నాగాలాండ్, నేపాల్, మణిపూర్‌కు చెందిన వారుగా గుర్తించినట్లు వివరించారు. 400 మందికి సరోగసీ చేసినట్లు లభించిన రికార్డుల్లో కొన్ని సంతకాలు పోలిక లేకుండా ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ఒక్కో విదేశీ కేసుకు కోటి? సాయికిరణ్ ఆస్పత్రిలో ఐదేళ్ల నుంచి అనుమతులు లేకుండానే ఇన్ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తుంటే అధికారులు ఏం చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆసుపత్రిలో 60 శాతం మంది.. విదేశీయులకు పిల్లల్ని కని ఇచ్చేందుకే సరోగసీ ద్వారా గర్భాలను మోస్తున్నారు. ఇందుకోసం ఆస్పత్రి యాజమాన్యం ఒక్కో విదేశీయుడి నుంచి రూ.కోటి వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. స్వదేశీయులైతే రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. -
త్వరలో సరోగసీ బోర్డు
- అద్దె గర్భం వ్యాపారానికి ముకుతాడు - 22న మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో వెలుగుచూసిన అద్దె గర్భాల దందాపై ప్రభుత్వం దృష్టి సారించింది. సరోగసీ వ్యాపారాన్ని నిలువరించేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర సరోగసీ చట్టం–2016 ప్రకారం రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ నెల 22న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులోనే సరోగసీ బోర్డు ఏర్పాటుతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్రం తెచ్చిన సరోగసీ నియంత్రణ చట్టం–2016 ప్రకారం అద్దె గర్భాన్ని వ్యాపారం చేస్తే కనీసం పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో హైదరాబాద్ కేంద్రంగా సరోగసీ వ్యాపారం ఎల్లలు దాటింది. సరోగసీపై ఏ దేశంలో ఎలా..? సరోగసీని వ్యాపారం చేస్తే దక్షిణాఫ్రికాలో గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష విధిస్తారు. బ్రిటన్‌లో గరిష్టంగా మూడు నెలలు, నెదర్లాండ్‌లో ఏడాది, గ్రీస్‌లో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. రష్యాలో అలాంటి శిక్షలేమీ లేవు. ఆ దేశంలో సరోగసీ ద్వారా వ్యాపారం చేసుకోవచ్చు. మన దేశంలో పెళ్లయిన దంపతులే సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు అర్హులు. పైన పేర్కొన్న ఏ దేశంలోనూ ఈ నిబంధన లేదు. పెళ్లి కాని వారెవరైనా సరోగసీ ద్వారా బిడ్డకు తల్లి కావచ్చు. నెదర్లాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లోనైతే పురుషుడు లేదా మహిళ పెళ్లికాకపోయినా సరోగసీ ద్వారా బిడ్డను పొందవచ్చు. సరోగసీకి బంధుత్వం తప్పనిసరి.. విదేశాల్లో అద్దె గర్భం ఇచ్చే తల్లికి, బిడ్డను పొందే వారికి మధ్య బంధుత్వం అవసరం లేదు. కానీ మన దేశంలో మాత్రం సరోగసీ ఇచ్చే మహిళకు, సరోగసీ ద్వారా బిడ్డను పొందే దంపతులకు మధ్య తప్పనిసరిగా బంధుత్వం ఉండాలన్న నిబంధనను కేంద్ర చట్టంలో పొందుపరిచారు. దీనివల్ల వ్యాపారాత్మక చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. -
సరోగసీ అక్రమాలకు కళ్లెమేదీ?
కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో చర్యలు శూన్యం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అద్దె గర్భం (సరోగసీ) వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సరోగసీ క్లినిక్‌ల కాసుల కక్కుర్తికి అమాయక నిరుపేద మహిళలు బలవుతున్నా అధికారులు కళ్లు తెరవడం లేదు. అద్దె గర్భం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం తెచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో సరోగసీ బోర్డు (ఎస్ఎస్బీ) ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ ఫైలు సిద్ధం చేసినా దానికి ఇప్పటికీ మోక్షం కలగలేదు. దీంతో అద్దె గర్భం వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఘటన అందుకు ఉదాహరణ. రాష్ట్రంలో దాదాపు 20 వరకు సరోగసీ క్లినిక్‌లు పనిచేస్తున్నాయని అంచనా. అందులో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాటిపై వైద్య ఆరోగ్యశాఖకు ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో క్లినిక్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. సరోగసీపై కేంద్రం తెచ్చిన చట్టంలో ఏముందంటే.. ► వ్యాపారపరమైన సరోగసీ పూర్తిగా నిషేధం. అద్దె గర్భం మోసే మహిళకు బీమా, వైద్య ఖర్చులు తప్ప ఇతరత్రా ఆర్థిక లావాదేవీలేవీ ఉండకూడదు ► సరోగసీ ద్వారా సంతానం పొందాలనుకునేవారు భారతీయులై ఉండాలి. వారి వయసు మహిళలైతే 23 నుంచి 50 ఏళ్లు, పురుషులైతే 26 నుంచి 55 ఏళ్లుండాలి. పెళ్లై కనీసం ఐదేళ్లు నిండి ఉండాలి. అప్పటి వరకు వారికి సంతానం ఉండకూడదు. దత్తత తీసుకొని ఉండకూడదు. తమకు సంతానం కలగడం లేదని జిల్లా మెడికల్ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి ► అద్దె గర్భం దాల్చే మహిళ వయసు 25–35 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండొద్దు. ఆమెకు అంతకుముందే సంతానం ఉండాలి ► జీవితంలో ఒక్కసారి మాత్రమే అద్దె గర్భం దాల్చడానికి అనుమతి ఉంటుంది ► సరోగసీకి మహిళ ఆరో గ్యం సహకరిస్తుందన్న ధ్రువీకరణ పత్రం తప్పనిసరి ► సరో గసీ క్లినిక్‌లు తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి ► ప్రమాణాల మేరకు సరైన చికిత్స, వసతి, పరికరాలు ఉన్నాయా లేదా అని తనిఖీలు చేశాకే ఆ క్లినిక్‌లకు అనుమతివ్వాలి ► సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డను అమ్మటంగానీ.. వేరే దేశాలకు ఎగుమతి చేయడం గానీ నేరం. -
పెళ్లి కాకుండానే తండ్రైన కరణ్
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తండ్రి అయ్యాడు. తన వ్యక్తిగత విషయాలను కూడా బహిరంగంగా మాట్లాడే కరణ్ ఫిబ్రవరిలోనే కవల పిల్లలకు తండ్రి అయిన ఇన్నాళ్లు ఆ విషయాన్ని దాచిపెట్టాడు. సరోగసి విధానం ద్వారా ఓ బాబు, ఓ పాపకి ఆయన జన్మనిచ్చాడు. ముంబై అంధేరిలోని మస్రానీ హాస్పిటల్ లో ఇద్దరు పిల్లలు జన్మించగా ఆ ఇద్దరు పిల్లలకు తండ్రిగా కరణ్ పేరుని బర్త్ సర్టిఫికెట్ లో రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆది వారం కరణ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. అయితే కరణ్ అవివాహితుడు కావటంతో తల్లి పేరును మాత్రం తెలపలేదు. శుక్రవారం (మార్చి 3) రోజు ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఇద్దరు పిల్లల పేర్లను రిజిస్టర్ చేయించాడు. కరణ్ తన ఆటోబయోగ్రఫీలో పిల్లలను దత్తత తీసుకుంటాను లేదంటే సరోగసి ద్వారా పిల్లలకు తండ్రిని అవుతాను అని చెప్పాడు. తాజాగా ఆ మాటలను నిజం చేస్తూ కరణ్ తండ్రి అయ్యాడన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరో బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ కూడా ఇటీవల ఇదే బాటలో సరోగసి ద్వారా తండ్రి అయ్యాడు. pic.twitter.com/OyGb4SnwId — Karan Johar (@karanjohar) 5 March 2017 -
చట్టాలు మారాలి
⇒ మారుతున్న మానవ బంధాలతో కొత్త సమస్యలు ⇒ సరోగసీపై స్పష్టమైన చట్టం అవసరం ⇒ అంతర్జాతీయ సదస్సులో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు సాక్షి, అమరావతి: మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మారకపోవడంతో తీర్పులు వెల్లడించడానికి ఇబ్బందిగా మారు తోందని సుప్రీం, హైకోర్టు జడ్జిలు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలు, మారుతున్న మానవ సంబం ధాలతో కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని, వీటికి అనుగుణంగా మన చట్టాలు కూడా మారాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ అభిప్రాయపడ్డారు. విజయవాడలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో రెండో రోజు వాణిజ్య లావాదేవీలు, ఆర్బిట్రేషన్, మాట్రి మోని యల్, పిల్లల హక్కులు, ఆస్తి తగాదాలు తదితర అంశాలపై మేధోమథనం జరిగింది. ఈ సందర్భంగా లోకూర్ మాట్లాడుతూ... సహజీవనం, సరోగసీ, ఎన్నారై విడాకులకు చెందిన సరైన చట్టాలు లేకపోవడం సమస్య జఠిలంగా మారుతోందని తెలిపారు. ఈ విషయాలపై కొత్త చట్టాలను తీసుకురా వడంపై చట్టసభలు దృష్టిసారించాలన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ చాలా వ్యయంతో కూడుకున్నది కావడంతో దేశీయంగా ఈ అంశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. సరోగసీ విధానానికి అంతర్జాతీయంగా ఇండియా ప్రధాన కేంద్రంగా మారుతోందని, దీంతో న్యాయపరంగా అనేక వివాదాలు తలెత్తుతు న్నాయని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి ఆందోళన వ్యక్తంచేశారు. మనదేశంలో కూడా సరోగసీ విధానానికి సంబంధించి స్పష్టమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. మెడ్–ఆర్బ్‌తో అవకాశాలు అనేకం ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాన్ని కోర్టుల వరకు రాకుండానే మీడియేటర్ (మధ్యవర్తి) ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ను ఇస్తున్నారని సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఆర్.వి.రవీంద్రన్ చెప్పారు. ఇందులో ఒకరు ఓడిపోవడం మరొకరు గెలవడం ఉండదని, ఇద్దరి సమస్యను మీడియేటర్ పరిష్కరిస్తార న్నారు. ఒకవేళ ఈ సమస్యను మీడియేటర్ పరిష్కరించకపోతే అప్పుడు ఆ కేసు ఆర్బిట్రేటర్ వద్దకు చేరుతుందన్నారు. దీన్ని న్యాయ భాషలో మెడ్–ఆర్బ్‌గా వ్యవహరిస్తు న్నట్లు తెలిపారు. మెడ్–ఆర్బ్‌లో అవకాశాలు పెరుగుతుండటంతో న్యాయవాదులు దీనిపై దృష్టిసారించాలని సూచించారు. నూతన రాజధాని అమరావతి ఆర్బిట్రేషన్‌కు కేంద్రంగా ఎదుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి ఎన్.వి.రమణతో పాటు రిటైర్జ్ జడ్జిలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
సరోగసీ వ్యాపారానికి అడ్డుకట్ట
కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో సరోగసీ బోర్డు ⇒ ఫైలును సిద్ధం చేసిన వైద్యారోగ్యశాఖ ⇒ అద్దె గర్భం ఇచ్చే వారికి, సంతానం కోరుకునే వారికి బంధుత్వం తప్పనిసరి ⇒ రిజిస్టర్డ్ క్లినిక్‌లలో మాత్రమే సరోగసీకి అనుమతి ⇒ నిబంధనలు కట్టుదిట్టం.. దుర్వినియోగానికి చెక్ సాక్షి, హైదరాబాద్: పిల్లలు పుట్టే అవకాశం లేని దంపతులకు వరంగా ఉండాల్సిన సరోగసీ దుర్వినియోగం అవుతుండడంతో.. దానికి అడ్డుకట్ట వేసేలా సరోగసీ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఫైలును సిద్ధం చేసింది. త్వరలోనే సరోగసీ బోర్డు ఏర్పాటు ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి, న్యాయ శాఖ ప్రతినిధి, పేరెన్నికగన్న మహిళా సంఘానికి చెందిన ప్రతినిధి, ప్రముఖ వైద్యులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు. సరోగసీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి బోర్డు కృషి చేస్తుంది. తెలంగాణలో దాదాపు 20 వరకు సరోగసీ క్లినిక్‌లు పనిచేస్తున్నాయని అంచనా. అందులో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కానీ వాటిపై వైద్య ఆరోగ్యశాఖకు నియంత్రణ లేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి. మహిళల పేదరికాన్ని అడ్డుపెట్టుకొని.. పిల్లలు పుట్టనివారు, పిల్లలను కనడానికి సమయం కేటాయించలేని కొందరు సెలబ్రిటీలు సరోగసీ పద్ధతిలో తల్లిదండ్రులు అవుతున్నారు. పిల్లలు కలగనివారి కోసం టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ఉన్నా.. అందులో సక్సెస్ రేటు తక్కువ కావడంతో సరోగసీ వైపు మొగ్గుతున్నారు. కానీ ఇది తీవ్ర స్థాయిలో దుర్వినియోగానికి గురవుతోంది. పేద మహిళలకు గాలం వేసి సరోగసీ తల్లులుగా వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సరోగసీ విధానం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. కేంద్ర చట్టంలోని కీలక అంశాలు.. ► వ్యాపారపరమైన సరోగసీపై నిషేధం. సరోగసీ తల్లికి, పిల్లల తల్లిదండ్రులకు మధ్య బీమా, వైద్య ఖర్చులు తప్ప ఇతర ఆర్థిక లావాదేవీలేవీ ఉండకూడదు. ► దేశంలో సరోగసీ ద్వారా బిడ్డను కనాలనుకునేవారు భారతీయులై ఉండాలి. సంతానం కావాలనుకునే దంపతుల వయసు మహిళలైతే 23 నుంచి 50 ఏళ్లు, పురుషులైతే 26 నుంచి 55 ఏళ్లు ఉండాలి. వారికి వివాహమై కనీసం ఐదేళ్లు నిండి ఉండాలి. వారికి అప్పటివరకు ఎటువంటి సంతానం ఉండకూడదు. దత్తత కూడా తీసుకుని ఉండకూడదు. ► పిల్లలు కలిగే అవకాశం లేదని, సరోగసీ అవసరమని జిల్లా మెడికల్ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. ► సరోగసీ ద్వారా పుట్టే బిడ్డకు సాధారణ పిల్లల్లాగే సర్వహక్కులూ ఉంటాయి. ► సరోగసీ ద్వారా సంతానం కోరుకునేవారికి, అద్దె గర్భం దాల్చేందుకు సిద్ధమయ్యే వారికి మధ్య దగ్గరి బంధుత్వం ఉండాలి. ► అద్దె గర్భం దాల్చే మహిళ వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. ఆమెకు అంతకుముందు సంతానం ఉండాలి. ఆమెకు ఒక్కసారికి మాత్రమే ఆమె అద్దె గర్భం దాల్చడానికి అనుమతిస్తారు. సరోగసీకి ఆమె ఆరోగ్యం సహకరిస్తుందన్న ధ్రువీకరణ పత్రం సైతం తప్పనిసరి. ► సరోగసీ క్లినిక్‌లు తప్పనిసరిగా రిజిస్టరై ఉండాలి. ప్రమాణాల మేరకు సరైన చికిత్స, వసతి, పరికరాలు ఉన్నాయా లేదా అని తనిఖీలు చేశాకే అనుమతివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారం కోసం వాటిని నడపకూడదు. ► సరోగసీ క్లినిక్‌లు సంబంధిత రికార్డులను 25 ఏళ్లపాటు తప్పనిసరిగా దాచిపెట్టాలి. ► సరోగసీ పద్ధతిలో పుట్టిన బిడ్డను అమ్మటం గానీ, విదేశాల వారికి అప్పగించడంగానీ నేరం. ఎన్నో చిక్కులు.. సందేహాలు కొందరు విదేశీయులు భారత దేశంలోని పేద మహిళలను సరోగసీ కోసం వినియోగించుకుని పిల్లలను కంటున్నారు. అయితే ఇలా కన్న బిడ్డను తమ దేశానికి తీసుకెళ్లాక సరిగా చూసుకుంటున్నారా, ఎవరికైనా అమ్మేస్తున్నారా? అన్న సందేహాలు ఉన్నాయి. సరోగసీ తల్లి ప్రసవించిన తర్వాత పుట్టిన బిడ్డ అనారోగ్యంతో ఉన్నా, ఏవైనా శారీరక లోపాలు ఉన్నా వదిలేసి పోతున్న సంఘటనలూ జరుగుతున్నాయి. ఇక ఒకే మహిళ పలుమార్లు సరోగసీ విధానంలో గర్భాన్ని మోస్తుండడంతో.. ఆమె ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోంది. పలుమార్లు సరోగసీ తల్లులు 9 నెలలు కడుపులో మోసి, కన్న పిల్లలను ఇవ్వడానికి మానసికంగా సంఘర్షణ పడుతున్నారు. దాంతో న్యాయపరమైన చిక్కులూ వస్తున్నాయి. మరోవైపు దళారులు, పలు సరోగసీ కేంద్రాలు దీనిని ఓ వ్యాపారంలా నిర్వహిస్తున్నాయి. ఒక్కో జంట నుంచి మూడు నాలుగు లక్షలకుపైగా వసూలు చేస్తున్నాయని ఆరోపణలున్నాయి. -
'సరోగసీ' బిల్లు-సమస్యలు
సంతానం కోసం పరితపించే దంపతులు పిల్లల్ని కనడానికి అమల్లోకొచ్చిన వివిధ రకాల సాంకేతికతల్లో అద్దె గర్భం(సరోగసీ) విధానం ఒకటి. ఇంచుమించు 2000 సంవత్సరంలో మొదలై మన దేశానికి ‘క్రాడిల్ ఆఫ్ ద వరల్డ్’(ప్రపంచ ఊయల) అని పేరొచ్చేంతగా ఇప్పుడది విస్తరించింది. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర కేబినెట్ అద్దె గర్భం(నియంత్రణ) బిల్లును ఆమోదించింది. మహిళా ఉద్య మకారులు, ఆరోగ్యరంగ కార్యకర్తలు నియంత్రణ చట్టం అవసరమని పదేళ్లుగా చెబుతున్నారు. 2008లో అప్పటి యూపీఏ సర్కారు ఆ పని ప్రారంభించింది. మరో రెండేళ్లకు బిల్లు రూపొందించింది. అనంతరకాలంలో దానిలో ఎన్నో మార్పులు జరిగాయి. కానీ ఏవో కారణాల వల్ల అది కేంద్ర కేబినెట్ ముందుకే రాలేదు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులో ఎన్నో అనుకూలాంశాలున్నట్టే ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. సరోగసీ భావన చుట్టూ సామాజిక, వాణిజ్య, ఆరోగ్య, నైతిక సంబంధమైన అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. ప్రస్తుత బిల్లు ఇందులో కొన్ని అంశాలను ఉపేక్షించగా, మరికొన్నిటిని అతిగా పట్టించుకుందని చెప్పక తప్పదు. కొందరు సామాజిక ఉద్యమకారులు చెబుతున్నట్టు ఈ బిల్లు చట్టమైతే సరోగసీ విధానం చీకటి వ్యాపారంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అద్దె గర్భం విషయానికొచ్చేసరికి మన దగ్గరున్నట్టే చాలా దేశాల్లో భిన్నాభి ప్రాయాలు, వాదనలు ఉన్నాయి. వేర్వేరు రకాల చట్టాలున్నాయి. కొన్నిచోట్ల ఈ విధానాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి నిషేధిస్తే, మరికొన్నిచోట్ల డబ్బు ప్రసక్తి లేని సందర్భాల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. గర్భందాల్చడానికి సిద్ధపడే మహిళ... దంపతుల్లో ఎవరో ఒకరి రక్తసంబంధీకురాలై ఉండాలని బ్రిటన్ చట్టం షరతు విధిస్తోంది. కారుణ్య మరణంలాంటి వివాదాస్పద అంశాల్లో సైతం అనుకూలమైన చట్టం తీసుకొచ్చిన స్విట్జర్లాండ్ కూడా సంతానాన్ని పొందడానికి ఐవీఎఫ్ ప్రక్రియను మాత్రమే గుర్తిస్తోంది. సరోగసీని అంగీకరించిన దేశాల్లో అందుకయ్యే ఖర్చు మన కరెన్సీలో దాదాపు 50 లక్షలు. కనుకనే ఏ నియంత్రణా లేని మన దేశంలో సంతాన సాఫల్య పర్యాటకం (ఫెర్టిలిటీ టూరిజం) గత కొన్నేళ్లుగా పెరిగింది. ఏటా దాదాపు ఆరేడు వేల కోట్ల రూపాయల మేర ఈ వ్యాపారం సాగుతున్నదని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. సరోగసీ విధానంలో బిడ్డను కని ఇచ్చే తల్లి ఎదుర్కొనవలసివచ్చే వివిధ సమస్యల్లో ఆరోగ్య సమస్య అత్యంత కీలకమైనది. అలాగే సంతానం కోసం వచ్చిన దంపతులు శిశువును వివిధ కారణాలవల్ల తిరస్కరిస్తే ఏర్పడే సమస్యలు దీనికి అదనం. తమకంటూ సంతానం కలగడం సాధ్యంకాదని నిరాశా నిస్పృహలకు లోనైన దంపతులకు ఈ ప్రక్రియ వరమే కావొచ్చుగానీ... మహిళను ‘కని ఇచ్చే యంత్రం’గా, బిడ్డను ఒక ‘సరుకు’గా ఇది పరిగణిస్తున్నదన్న వాదన ఉంది. మాతృత్వం, దానితో ముడిపడి ఉండే భావోద్వేగాలకు సరోగసీలో తావులేదు. కడుపులో బిడ్డ పెరుగుతున్నకొద్దీ తల్లిలో ఏర్పడే మమకారం, అనుబంధాలను ఇది పట్టించుకోదు. ఇక ప్రసవ సమయంలో కొందరిలో వచ్చే మధుమేహం, అధిక రక్తపోటు... ప్రసవానంతరం వచ్చే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వారిని జీవితాంతం వేధిస్తాయి. గర్భస్రావమైతే ముందుగా కుదుర్చు కున్న ఒప్పందం మేరకు ఇవ్వాల్సిన డబ్బుల్ని ఎగ్గొట్టే అవకాశాలుంటాయి. వాణిజ్య అద్దె గర్భాలను నిషేధించడమే వీటన్నిటికీ పరిష్కారమవుతుందా? సరోగసీ ద్వారా తొమ్మిది నెలల్లో అయిదారు లక్షలు సంపాదించవచ్చునని ఆశపడి ముందుకొచ్చేవారిని రాబోయే చట్టం నిరోధించడం మాట అటుంచి దాన్ని కాస్తా చీకటి వ్యాపారంగా మార్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ మార్పిడికి సంబంధించిన చట్టం మాఫియాలకు వేల కోట్లు ఆర్జించిపెడుతోంది. మనలాంటి పితృస్వామిక వ్యవస్థలో సరోగసీపై నిర్ణయం తీసుకునేది ఎక్కువ సందర్భాల్లో భర్తేనని వేరే చెప్పనవసరం లేదు. డబ్బుకు ఆశపడి అతను శాసించినప్పుడు ఆ మహిళకు వేరే గత్యంతరం ఉండదు. చట్టాన్ని కాదని బిడ్డను కనడానికి సిద్ధపడిన తల్లికి ప్రామాణికమైన వైద్య సేవలు అందే అవకాశాలు కుంచించుకుపోతాయి. ఇది ఆ మహిళను మరిన్ని సమస్యల్లోకి నెడుతుంది. పేద మహిళలనూ... ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంత మహిళలను కాపాడటమే ఈ బిల్లు ధ్యేయమంటున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ దీన్ని గుర్తించినట్టు లేరు. దంప తులకు చెందిన దగ్గరి బంధువుల్లోని మహిళలను మాత్రమే సరోగసీకి అనుమతిస్తామని బిల్లు అంటున్నది. వారైతేనే సంతానం లేని దంపతులకు బిడ్డను కని ఇస్తే పుణ్యమని భావిస్తారని, బయటి వారైతే లాభాపేక్షతో మాత్రమే చేస్తారన్నది బిల్లు భావన కావొచ్చు. కుటుంబంపై పెత్తనంవహించే మగవాడి పాత్రను, అతడు పెట్టే ఒత్తిళ్లను ఇది గుర్తించినట్టు లేదు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నవారికి తప్ప సహజీవనం చేసే జంటకు సరోగసీలో బిడ్డను పొందే హక్కు లేకుండా చేయడం మరో వివాదాస్పద నిర్ణయం. వివాహ మనేది లేకుండా దీర్ఘకాలం ఒక జంట కలిసి ఉన్నప్పుడు దాన్ని చట్టబద్ధమైన వివాహంతో సమానంగా గుర్తించాలని ఏడెనిమిదేళ్లక్రితం సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. 2013లో వెలువడిన తీర్పు దాన్ని మరింత విశదీకరించింది. ఆడ, మగ మధ్య ప్రేమానుబంధం ఏర్పడి, వారు సహజీవనం చేస్తే అది వారి ‘జీవించే హక్కు’లో అంతర్భాగమని, ఆ చర్యను నేరంగా పరిగణించడం చెల్లదని చెప్పింది. సహజీవనం చేసే జంటకు బిడ్డను పొందే హక్కు లేదనడం... అందుకు నైతికత, విలువలు వంటివి కారణాలుగా చెప్పడం ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఒకపక్క మన జువెనైల్ చట్టం పెళ్లయిందా, లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రతివారికీ దత్తత చేసుకునే హక్కు కల్పిస్తుంటే... ఈ బిల్లు సరోగసీ ద్వారా బిడ్డను పొందాలనుకున్నవారికి పెళ్లయి ఉండాలని చెప్పడం ఓ వైచిత్రి. బిల్లుపై పార్ల మెంటు వెలుపలా, లోపలా మరింత లోతైన చర్చ జరిగి మెరుగైన, ఆచరణాత్మకమైన విధానం రూపు దిద్దుకోవాలని ఆశిద్దాం. -
వాణిజ్య అద్దెగర్భంపై నిషేధం
-
వాణిజ్య అద్దెగర్భంపై నిషేధం
- పెళ్లైన జంటలకు ఐదేళ్ల తర్వాత మాత్రమే సరోగసీ అవకాశం - విదేశీయులు, భారత సంతతి, ఎన్నారైలకు ఎదురుదెబ్బ - ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: పిల్లలు లేని దంపతులకు వరంగా మారిన సరోగసీ (అద్దెగర్భం) విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుండడంతో ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించే ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వారు మాత్రమే (వివాహమైన ఐదేళ్ల వరకు పిల్లలు పుట్టకుంటే) ఈ విధానం ద్వారా పిల్లలు పొందేందుకు వీలు కల్పించనున్నారు. సరోగసీ (నియంత్రణ) బిల్లు 2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అంగీకారం తెలిపింది. విదేశీయులు అక్రమంగా భారత్‌లో అద్దెగర్భం ద్వారా సంతానాన్ని పెంచుకోవటంతో.. వాణిజ్య సరోగసీకి భారత్ కేంద్రంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు అమలయ్యాక అక్రమ చర్యలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 10 లక్షల జరిమానా విధించనున్నారు. సెలబ్రిటీలు, డబ్బున్న కుటుంబాల్లో సరోగసి ద్వారా పిల్లలను కనటం ఫ్యాషన్ (పురిటి నొప్పుల బాధపడకుండా) అయిపోయిందని సుష్మ విమర్శించారు. కేబినెట్ భేటీ తర్వాత కేబినెట్ నిర్ణయాలను మీడియాకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఉగ్ర కాల్పుల్లో మరణించిన వారికి పరిహారం.. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల్లో చనిపోయే వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం కారణంగా చనిపోయే వారికిచ్చే పరిహారాన్ని 5 లక్షలకు పెంచనుంది. ఈ తరహా దాడులు, ఘటనల్లో చనిపోయే వారికి నష్టపరిహారం మాత్రమే అందుతుందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇతర కేబినెట్ నిర్ణయాలు పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నంలో భాగంగా.. భారత్, సైప్రస్ మధ్య డీటీఏఏ (డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్)కు కేంద్రం ఆమోదం తెలిపింది. భారత సమాచార సేవల (ఐఐఎస్) విభాగంలో గ్రూపు-ఏ కేడర్‌ను పునర్వ్యవస్థీకరించటంతోపాటు వివిధ దశల్లో అధికారుల నియామకానికి పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ మీడియా, కమ్యూనికేషన్ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకే ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా 1,120 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి కోసం రూ. 6,461 కోట్ల కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్లులో ముఖ్యాంశాలు ►పెళ్లై ఐదేళ్లు దాటిన జంటలకే అవకాశం ►భార్య వయసు 23-50 మధ్యలో.. ►భర్త వయసు 26-55 మధ్యలో ఉండాలి. ►దంపతుల్లో ఒకరికి పిల్లలు కనేందుకు అవసరమైన సామర్థ్యం తక్కువగా ఉంది/లేదు అనే సర్టిఫికెట్ ఉండాల్సిందే. ►సంతానం లేని దంపతులకు మాత్రమే అద్దెగర్భం ద్వారా తల్లిదండ్రులయ్యే అవకాశం. ►అద్దెగర్భం ద్వారా పుట్టిన పిల్లలకు ఆస్తిపై సంపూర్ణ హక్కు ►గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ కచ్చితంగా వివాహిత అయి ఉండాలి. అంతకుముందే.. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. ►కచ్చితంగా దంపతుల్లో ఒకరికి దగ్గరి బంధువై ఉండాలి. ►ఒకసారి మాత్రమే గర్భాన్ని అద్దెకు ఇచ్చేందుకు అనుమతి. ►ఈ విధానం ద్వారా పుట్టిన పిల్లలు అమ్మాయిలైనా, అంగవైకల్యంతో జన్మించినా వారికి భద్రత కలిపించేలా చట్టంలో మార్పులు. ►ఇతరులకు సాయం చేసేందుకు చేసే సరోగసికీ కొన్ని నియమాలతో అనుమతి. సింగిల్ పేరెంట్స్, లివిన్ పార్ట్నర్స్ (పెళ్లికు ముందే కలిసుండే జంట), స్వలింగ సంపర్కులకు సరోగసీ ద్వారా పిల్లలు కనటంపై నిషేధం. ►విదేశీయులు, ఎన్నారైలు, పీఐవో (భారత సంతతి)లు, స్వలింగ సంపర్కులు, సహజీవనం చేసేవారిపై నిషేధం. పేద మహిళలను ‘అద్దెగర్భం’ ఆశతో దోచుకోవటం నుంచి విముక్తి. -
‘బేబీ ఫ్యాక్టరీల’పై దాడులు
-
‘బేబీ ఫ్యాక్టరీల’పై దాడులు
హైకోర్టు ఆదేశాలతో ఐవీఎఫ్ కేంద్రాల్లో తనిఖీలు సాక్షి, విశాఖపట్నం: సంచలనం సృష్టించిన ‘సాక్షి’ కథనం బేబీ ఫ్యాక్టరీలపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. విశాఖపట్నంలో పలు ఐవీఎఫ్ కేంద్రాలపై శనివారం దాడులు నిర్వహించింది. ఫ్రీజింగ్ బ్యాంకుల్లో పిండాలతో సరోగసీ ద్వారా పిల్లలను పుట్టించి, విక్రయాలకు పాల్పడుతున్న వైనంపై ‘సాక్షి’ ఇటీవల ‘విశాఖలో బేబీ ఫ్యాక్టరీ’ శీర్షికతో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయవాది అరుణ్‌కుమార్ రాసిన లేఖ ఆధారంగా హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. పిల్లల విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలన్న కోర్టు ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ యువరాజ్ నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. విశాఖ, అనకాపల్లి ఆర్డీవోలు, ఆర్ అండ్ ఆర్ (ఏపీఐఐసీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలోని ఈ బృందాలు నగరంలోని 11 సంతాన సాఫల్య కేంద్రాల్లో శనివారం తనిఖీలు చేశాయి. ఆయా కేంద్రాల్లో ఏడాదిగా ఎంతమంది సంప్రదించారు? ఎంతమందికి సరోగసీ, అండదానం చేశారు? చికిత్సకు ఎందరు వచ్చారు? వంటి అంశాలను ఆరా తీసినట్టు తెలిసింది. ఈ కేంద్రాల ద్వారా బిడ్డలను పొందిన వారితోనూ ఫోన్లో మాట్లాడి వివరాలు రాబట్టినట్లు సమాచారం. అలాగే వీరు ఎవరి ద్వారా ఆయా సెంటర్లకు వచ్చారు? దళారులు ఉన్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు విచారణ వివరాలను రహస్యంగా ఉంచారు. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పలు సంతాన సాఫల్య కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని ఐవీఎఫ్ కేంద్రాల్లో గత ఐదేళ్లుగా సరైన రికార్డులు నిర్వహించడంలేదని సమాచారం. ఇటువంటి అవకతవకలను తనిఖీ అధికారులు నమోదు చేసుకొని, కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. తుది నివేదికను ఆయన ఈ నెల 11 నాటికి హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. అనుమతిలేకుండా సరోగసీ! నగరంలో నడుస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలకు సరోగసి అనుమతుల్లేవని అధికారులే చెబుతున్నారు. తాము సరోగసీ చేయడం లేదని ఈ కేంద్రాల నిర్వాహకులు తనిఖీల సమయంలో బుకాయించారు. అయితే కొన్ని కేంద్రాల ఆవరణలో తమ వద్ద ‘సరోగసీ, ఎగ్ డొనేషన్ సదుపాయం’ ఉందంటూ పెద్దపెద్ద బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. పోలీసుల తనిఖీలు పోలీసులు కూడా పలు సంతాన సాఫల్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. మహారాణిపేట పోలీస్‌స్టేషన్ ఎస్ఐ గంగాధర్ శనివారం సాగరతీరంలో శిశు విక్రయాలకు నిలయంగా ఉన్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఐవీఎఫ్ కేంద్రాలకు వెళ్లి అక్కడున్న గర్భిణుల నుంచి వివరాలు సేకరించారు. ట్రీట్మెంట్లో భాగంగా మూడు నెలల పాటు కదలకుండా కేంద్రాల్లోనే ఉండాలని వైద్యులు చెప్పడంతో ఇక్కడే ఉంటున్నామని అక్కడి రోగులు పోలీసులకు తెలిపారు. ‘బేబీ ఫ్యాక్టరీ’పై ఎఫ్ఐఆర్ ‘బేబీ ఫ్యాక్టరీ’ల నిర్వాహకులపై తొలి కేసు నమోదైంది. సరోగసీ ద్వారా పిల్లలను విక్రయిస్తున్న ముఠాలపై ‘సాక్షి’ కథనాలకు విశాఖ జిల్లా శిశు సంక్షేమ అధికారి ఎ.సత్యనారాయణ స్పందించారు. బీచ్ రోడ్డు సమీపంలోని భాగ్యసాయి అపార్ట్మెంటులో పిల్ల ల విక్రయాలు సాగుతున్నట్టు ‘సాక్షి’ కథనాల వల్ల తెలుస్తోందని, దాని ఆధారంగా బేబీ ఫ్యాక్టరీ నిర్వాహకులు విజయలక్ష్మి, మూర్తిలపై కేసు నమోదు చేసి తగు చర్యలు చేపట్టాలని విశాఖలోని మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం సీఐ ఆర్ గోవిందరావు కేసు నమోదు చేశారు. ఇంత వరకూ ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయడానికి ఆలస్యమైందని, ఫిర్యాదు వచ్చినందున ఇప్పటికే పరారైన నిందితులను పట్టుకోవడానికి చర్యలు చేపడతామని సీఐ వెల్లడించారు. -
మనకు తెలియకుండానే..మన పిల్లల్ని అమ్మేసుకుంటున్నారు!
ఐవీఎఫ్ కేంద్రాలు, ఏజెంట్ల అక్రమాలతో విపరీత పరిణామాలు ఐవీఎఫ్ కోసం వచ్చేవారి పిండాలను విక్రయిస్తున్న దుర్మార్గం అండాలు, వీర్యకణాలు, సరోగసీ తల్లి.. అంతా రెడీమేడ్ ఆ పిండాలతో సరోగసీ ద్వారా పిల్లల్ని పుట్టించి అమ్ముకునే దారుణం సరైన చట్టాలు లేక, నిబంధనల్లో లొసుగులతో వ్యవహారం మారుతున్న జీవన పరిస్థితులు.. వ్యాధులు.. శారీరక లోపాలు.. కారణాలేవైనా కొన్ని వేల జంటలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాయి. అలాంటి వారికి సంతానం కల్పిస్తామంటూ వీధికో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) కేంద్రాలు వెలుస్తున్నాయి. ఎన్నో ఆసుపత్రులూ ఐవీఎఫ్ సేవలను అందిస్తున్నాయి. కానీ ఇవి ఎన్నో అక్రమాలకు, అనైతిక వ్యవహారాలకు వేదికలుగా మారుతున్నాయి. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారి నుంచి అండాలు, వీర్యకణాలు సేకరించి ఫలదీకరణం చెందించిన పిండాలను కొందరు విక్రయిస్తున్నారు. అంతేకాదు ఈ పిండాలతో సరోగసీ తల్లిద్వారా పిల్లలను పుట్టించి, వారినీ అమ్మేసుకుంటున్నారు. నాలుగు రోజుల కింద ‘సాక్షి’ బయటపెట్టిన విశాఖ తీరాన పిల్లల విక్రయం అలాంటి వ్యవహారంలో భాగమే. అక్కడ సుజాత, వెంకట్ అనే ఇద్దరు ఏజెంట్లు ఆడపిల్లకు రెండున్నర లక్షలు, మగపిల్లాడికి నాలుగున్నర లక్షలు ఖరీదు కట్టి విక్రయిస్తూ... ఈ బాగోతాన్ని నడిపించారు. ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరెన్నో చోట్ల ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయి. అసలు ఈ ఐవీఎఫ్ ఏమిటి, అందులో లోపాలు, అక్రమాల తీరుపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్... - భువనేశ్వరి, తెలంగాణ బ్యూరో సంతానం కోసం తపన.. పురుషుల్లోగానీ, స్త్రీలలోగానీ లోపం ఎవరిలో ఉన్నా... పిల్లలను పొందేందుకు ఐవీఎఫ్ విధానం తోడ్పడుతోంది. స్త్రీ నుంచి అండాల్ని తీసి భాగస్వామి శుక్రకణాలతో ప్రయోగశాలలో ఫలదీకరణం చేస్తారు. అలా ఏర్పడిన పిండం (ఎంబ్రియో)ను స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఒకవేళ స్త్రీ గర్భాశయంలో ఏదైనా సమస్య ఉంటే సరోగసీ విధానం (మరో మహిళ గర్భాశయంలో పిండాన్ని ప్రవేశపెట్టి నెలలు నిండాక కనడం) ద్వారా బిడ్డను పొందవచ్చు. అయితే ఒకేసారి, ఒకే పిండంతో ఐవీఎఫ్ ప్రక్రియ విజయవంతం కాదు. అందువల్ల ముందు జాగ్రత్తగా స్త్రీ నుంచి ఎక్కువ సంఖ్యలో అండాలను సేకరించి, శుక్రకణాలతో ఫలదీకరణం చెందించి... రెండు, మూడు పిండాలను అభివృద్ధి చేస్తారు. వాటిని అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద జాగ్రత్తగా భద్రపరుస్తారు. మొదటి ప్రయత్నం విఫలమైతే రెండో పిండంతో ఐవీఎఫ్ ప్రక్రియ కొనసాగిస్తారు. అవగాహన లేమి ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనేందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వీటిని తమ వద్దకు వచ్చే దంపతులకు తెలియజేయాల్సిన బాధ్యత వైద్యులదే. ఐసిఎమ్ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్) నిబంధనల ప్రకారం... వైద్యానికి అవసరమైన పిండాల్ని వాడుకుని, మిగతావాటిని ఆ దంపతుల అనుమతితో క్రయోబ్యాంకుల్లో భద్రపరచవచ్చు. లేదంటే వాటిని నాశనం చేయాలి. అంతేతప్ప దానం చేయడం, విక్రయించడం వంటివి చేయకూడదు. ఒకవేళ ఐవీఎఫ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దంపతుల్లో ఎవరైనా మరణిస్తే ఆ పిండం భవిష్యత్తు ఏమిటో కూడా దంపతులు ముందే రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఈ నియమ నిబంధనలను చాలా ఐవీఎఫ్ కేంద్రాలు పాటించడం లేదు. ఇక్కడే అసలు సమస్య మొదలయింది. అండాలను, వీర్యాన్ని సేకరిస్తున్న వైద్యులు.. ఎన్ని పిండాలను రూపొందిస్తున్నారన్న సమాచారాన్ని దంపతులకు తెలియజేయడం లేదు. పెద్దగా చదువుకోనివారి విషయంలో అయితే వారికున్న సమస్య, వైద్యం ఖర్చు మినహా డాక్టర్లకు వారికి మధ్య మరెలాంటి సంభాషణా ఉండడం లేదు. దీంతో వారికి ఐవీఎఫ్ అనంతరం మిగిలిపోయిన పిండాలను వైద్యులు, ఏజెంట్లు అమ్ముకుంటున్నారు. ఎవరికి పుట్టారో.. ఎవరి పిల్లలో.. పిండాల విక్రయం ఎంత పెద్ద నేరమో, దానికి పాల్పడ్డవారికి ఎంత పెద్ద శిక్ష వెయ్యాల్లో చెప్పలేముగానీ... దీని పర్యవసానాలు ఎంత అనైతికంగా, భయానకంగా ఉంటాయో ఊహిస్తే ఆందోళన ఆవరిస్తుంది. ఉదాహరణకు రమేష్, రాధ అనే దంపతులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డల్ని పొందడానికి ఆసుపత్రికి వెళ్లారు. రాధ అండాలు, రమేష్ వీర్యంతో ఫలదీకరణ చెందించి... నాలుగైదు పిండాలను రూపొందిస్తారు. వారు మొదటి ప్రయత్నంలోనే బిడ్డను పొందారనుకుందాం. మిగతా పిండాలను దళారులు మరొకరికి విక్రయిస్తారు. వారు అద్దె గర్భం ద్వారా బిడ్డను పొందితే... ఆ బిడ్డకు రమేష్-రాధల డీఎన్ఏ, లక్షణాలు వస్తాయి. ఆ బిడ్డ రమేష్ రూపురేఖలతోనో, రాధ పోలికలతోనో ఉండే అవకాశం ఎక్కువ. పిండాల విక్రయం అంటే మనకు తెలియకుండా మన బిడ్డను దొంగిలించి, అమ్ముకోవడమే. ఇక ఒక జంట నుంచి మిగిలిపోయిన రెండు పిండాల ద్వారా పిల్లలుగానీ, కవలలుగానీ పుడితే... వారిని వేర్వేరు వ్యక్తులకు విక్రయించడం, వేర్వేరుగా పెరగడం మరింత దారుణమైన అంశం. ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన ఈ వ్యవహారం గురించి తెలియగానే... పిల్లల కోసం ఐవీఎఫ్‌ను ఆశ్రయించిన వారిలో చాలా మంది ఆలోచనలో పడ్డారు. సరైన చట్టాలే లేవు దేశంలో ఇన్ఫెర్టిలిటీ కేంద్రాలకు సంబంధించి కానీ, ఆ వైద్య విధానం గురించి కానీ ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించలేదు. పదేళ్లుగా సరోగసీ, ఐవీఎఫ్ విధానంలోని లొసుగుల గురించి కేంద్రానికి కొన్ని వందల ఫిర్యాదులు అందాయి. అయినా దీనిపై ఇంకా ఎటువంటి చట్టం చేయలేదు. కేవలం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనలపైనే ఐవీఎఫ్ కేంద్రాలు నడుస్తున్నాయి. అయితే ఈ నిబంధనలనైనా ఎంతవరకు పాటిస్తున్నారనే దానిని పర్యవేక్షించే యంత్రాంగం లేకపోవడంతో.. పిండాలు, వాటి నుంచి సరోగసీ ద్వారా పుట్టించిన పిల్లల విక్రయాలు జరుగుతున్నాయి. ఇక అండాలు, పిండాలను నిల్వ చేసే క్రయో బ్యాంకులకు సంబంధించి ప్రత్యేక చట్టం లేకపోవడం వల్ల అటు దంపతులు, ఇటు వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం క్రయో బ్యాంకులకు సంబంధించి మన వైద్యులు విదేశాల్లో అమల్లో ఉన్న చట్టాల్ని అనుసరిస్తున్నారు. నిజానికి మన భారతీయ సమాజం నైతికంగా ఆ విధానాలకు పూర్తిగా విరుద్ధం. కొంతకాలం కింద ఓ విదేశీ యువతి ఇక్కడ సరోగసీ పద్ధతి ద్వారా బిడ్డను పొంది తిరుగు ప్రయాణంలో మనవాళ్లకు తలబొప్పి కట్టే సమస్యను తెచ్చిపెట్టింది. ఆరోగ్య సమస్యలు ఉండవంటూ.. విశాఖ నర్సు సుజాత దీనికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. ‘‘మా దగ్గర పుట్టే పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. మానసికంగా కూడా చురుగ్గా ఉంటారు. మామూలుగా పుట్టే పిల్లలకు, మేం విక్రయించే పిండాల ద్వారా పుట్టే పిల్లలకు చాలా తేడా ఉంటుంది..’’ అని పేర్కొన్నారు. ఇందులో కొంత వరకు వాస్తవం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులైన తల్లిదండ్రుల నుంచి పుట్టే పిల్లలు అదే విధంగా ఉంటారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనల ప్రకారం దాతలకు హెచ్ఐవి, హెపటైటిస్ బి, సి, హైపర్ టెన్షన్, డయాబెటిస్, లైంగిక వ్యాధులు, జన్యులోపాలు, తలసేమియా వంటి జబ్బులేమీ ఉండకూడదు. ఇన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆ పిం డాల నుంచి ఎదిగిన పిల్లలు అ న్ని రకాలుగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీనినే ఏ జెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ‘‘మామూలుగా పిల్లలను యాభై వేలకు, లక్ష రూపాయలకు కొనుక్కుంటారు. కానీ మేం పూర్తి ఆరోగ్యంగా, చురు గ్గా ఉండే పిల్లలను ఇస్తున్నాం.. ఇందుకు నాలుగు లక్షలు ఖర్చుచేయడంలో తప్పులేదు కదా..’’ అంటూ విక్రయానికి ఒడిగడుతున్న వారు చెప్పుకొంటున్నారు. భద్రత పరిస్థితి ఏమిటి? ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లిన దంపతులకు తమ అండాలు, వీర్యకణాలు, పిండాలకు సంబంధించి వైద్యులు చెప్పే సమాచారంపై సందేహాలుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలనేది తెలియదు. ఐవీఎఫ్ నిపుణులు చేస్తున్న ప్రక్రియలో ఎంతవరకు నిజాయితీ ఉందో కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. నిజానికి క్రయో బ్యాంకు (అండం, వీర్య కణాలు, పిండాన్ని భద్రపరిచే చోటు) అవసరం చాలా ఉంది. ఫలదీకరణం చెందిన తొలిదశ పిండాలను, స్త్రీ నుంచి సేకరించిన అండాన్ని భద్రపరిచే ప్రక్రియ దాదాపు ఒకేలా ఉంటుంది. వీటిని మైనస్ 190 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వచేస్తారు. అయితే ఒక్కసారిగా మైనస్ 190 డిగ్రీల చల్లదనానికి తీసుకెళితే పిండాలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా కొద్ది నిమిషాలపాటు రకరకాల చిక్కటి ద్రవాల్లో ఉంచడం ద్వారా వాటిలోని నీటి శాతాన్ని తగ్గిస్తారు. తర్వాత నిమిషానికి ఒక డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత తగ్గించుకుంటూ మైనస్ 40 డిగ్రీల వరకూ శీతలీకరిస్తారు. దీంతో వాటిలోని జీవక్రియలన్నీ నిలిచిపోతాయి. అప్పుడు వాటిని సన్నటి నాళికల్లో ఉంచి ద్రవరూప నైట్రోజన్ ట్యాంకుల్లో ఉంచుతారు. ఈ ట్యాంకులో మైనస్ 190 డిగ్రీల చల్లదనం ఉంటుంది. అండాలను, పిండాలను తిరిగి వినియోగించాలనుకుంటే రెండు రోజుల ముందే తీసి... చల్లబరిచిన తీరుకు సరిగ్గా వ్యతిరేక పద్ధతిలో ఉష్ణోగ్రతను, నీటి శాతాన్ని పెంచుతారు. దీంతో కణం పూర్తి జవజీవాలతో పునరుత్పత్తికి సిద్ధంగా తయారవుతుంది. ఇలా నెలలు, సంవత్సరాల తరబడి క్రయో బ్యాంకుల్లో పిండాల్ని దాచుకోవచ్చు. ఒక పిండాన్ని క్రయో బ్యాంకులో భద్రపరుచుకోవాలంటే ఆరునెలలకు రూ. పదిహేను వేల నుంచి నలభై వేల వరకు ఉంటుంది. మామూలుగా అయితే అండం ఇచ్చే స్త్రీ, వీర్య కణాలు ఇచ్చే పురుషుడు, ‘సరోగసీ’ మహిళ... వీరెవరైనా వైద్యుల సమక్షంలోనే దాతలు కాగలరు. వారి వివరాలు ఆయా ఆసుపత్రులు గోప్యంగా ఉంచాలి. కానీ కొంతకాలంగా ప్రైవేటు ఏజెంట్లు రంగంలోకి వచ్చారు. వారు అండాలు, వీర్యకణాల దాతలను, సరోగసీ తల్లుల్ని వైద్యులకు, తల్లిదండ్రులకు నేరుగా సరఫరా చేసేస్తున్నారు. ప్రత్యేక చట్టం లేకపోవడం, నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని రకరకాల దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. విశాఖలో వెంకట్ అనే ఏజెంటు తన దగ్గర అన్ని రకాల దాతలు ఉన్నారని బాహాటంగా మార్కెటింగ్ చేసుకుంటుండడం గమనార్హం. సాధారణంగా సరోగసీ విధానం ద్వారా తల్లి కావాలనుకుంటే... మొత్తం ప్రక్రియకు పది నుంచి పన్నెండు లక్షలు ఖర్చవుతుంది. అదే ఇలాంటి ప్రైవేటు ఏజెంట్ల ద్వారా సరోగసీ తల్లిని దంపతులే తీసుకెళితే ఎనిమిది లక్షల్లో పూర్తవుతుంది. అండం, వీర్య కణాలకు చెల్లించే సొమ్మూ తగ్గుతుంది. ఐవీఎఫ్ ప్రక్రియ కోసం ఆస్పత్రులు, కేంద్రాలు పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేస్తుండడంతో చాలా మంది ప్రైవేటు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. పరిస్థితి దయనీయంగా ఉంది.. ‘‘మన దగ్గర ఐవీఎఫ్ విధానంలోని లోపాలు దంపతులను, వైద్యులను సమస్యల్లోకి నెడుతున్నాయి. దేశంలో వందల సంఖ్యలో ఐవీఎఫ్ సెంటర్లున్నాయి. ఇవన్నీ తమ క్రయో బ్యాంకు డేటాను పదేళ్లకోసారి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు అందజేయాలి. కానీ ఎన్నో సంస్థలు ఆ పని చేయడం లేదు. పిండాల్ని విక్రయించి, బిడ్డల్ని పుట్టించి అమ్ముకుంటున్నారనేందుకు అవకాశం లేదని చెప్పలేం. నిబంధనలు ఉల్లంఘించడానికి ఎన్నో అవకాశాలున్నాయి. చాలా సెంటర్లు చికిత్సకు ముందు కౌన్సెలింగ్ కూడా ఇవ్వడం లేదని కొందరు దంపతులు చెప్పారు. అలాగే ఎలాంటి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయించుకోవడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చట్టం తేవడంతో పాటు ప్రభుత్వం ఐవీఎఫ్ సెంటర్లపై ఒక కన్నేసి ఉంచాలి.’’ - డాక్టర్ హిమదీప్తి, నోవా ఐవీఎఫ్ సెంటర్, హైదరాబాద్ దాతలను సరఫరా చేసే ఏజెంట్లు! మామూలుగా అయితే అండం ఇచ్చే స్త్రీ, వీర్య కణాలు ఇచ్చే పురుషుడు, ‘సరోగసీ’ మహిళ... వీరెవరైనా వైద్యుల సమక్షంలోనే దాతలు కాగలరు. వారి వివరాలు ఆయా ఆసుపత్రులు గోప్యంగా ఉంచాలి. కానీ కొంతకాలంగా ప్రైవేటు ఏజెంట్లు రంగంలోకి వచ్చారు. వారు అండాలు, వీర్యకణాల దాతలను, సరోగసీ తల్లుల్ని వైద్యులకు, తల్లిదండ్రులకు నేరుగా సరఫరా చేసేస్తున్నారు. ప్రత్యేక చట్టం లేకపోవడం, నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని రకరకాల దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. విశాఖలో వెంకట్ అనే ఏజెంటు తన దగ్గర అన్ని రకాల దాతలు ఉన్నారని బాహాటంగా మార్కెటింగ్ చేసుకుంటుండడం గమనార్హం. సాధారణంగా సరోగసీ విధానం ద్వారా తల్లి కావాలనుకుంటే... మొత్తం ప్రక్రియకు పది నుంచి పన్నెండు లక్షలు ఖర్చవుతుంది. అదే ఇలాంటి ప్రైవేటు ఏజెంట్ల ద్వారా సరోగసీ తల్లిని దంపతులే తీసుకెళితే ఎనిమిది లక్షల్లో పూర్తవుతుంది. అండం, వీర్య కణాలకు చెల్లించే సొమ్మూ తగ్గుతుంది. ఐవీఎఫ్ ప్రక్రియ కోసం ఆస్పత్రులు, కేంద్రాలు పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేస్తుండడంతో చాలా మంది ప్రైవేటు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. కవలల సమస్య ఐవీఎఫ్ చికిత్స ద్వారా బిడ్డల్ని కంటున్న వారిలో డెబ్బై శాతం మందికి కవలలు పుట్టే అవకాశం ఉంది. ఒకేసారి మూడు పిండాలు పెట్టి ఐవీఎఫ్ చేసినప్పుడు.. చాలా వరకు రెండు పిండాలు గర్భంలో జీవం పోసుకుంటాయి. దీంతో కవలలు పుడతుండడంతో తల్లిదండ్రులు, వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఫెర్టిలిటీ సెంటర్లో ఐవీఎఫ్ చేయించుకున్న దంపతులు ‘మేం మధ్య తరగతి వాళ్లం. ఉన్న సొమ్మంతా ఐవీఎఫ్కే పెట్టాం. ఇప్పుడు ఇద్దరు పిల్లలను ఎలా పోషించగలం? మాకు ఒక్కరే చాలు..’ అంటూ వైద్యులను ఇబ్బంది పెట్టారు. దీంతో వారికి నాలుగైదు సార్లు కౌన్సెలింగ్ చేసి, ఇద్దరు పిల్లల్ని అప్పగించి పంపారు. ఇక వేరొకరి పిండాల్ని విక్రయించి, సరోగసీ ద్వారా కవలలు పుట్టినప్పుడు పరిస్థితి మరీ దారుణం. ఆ బిడ్డల పరిస్థితి ఏమిటని దళారులను అడిగితే.. ‘‘ఏముంది.. ఇద్దరిని వేరు వేరు దంపతులకి అమ్మేస్తాం..’’ అని చెప్పడం మనసును కలచివేస్తుంది. ఇలా పుట్టినవారిలో శారీరక లోపాలు ఉన్నవారుంటే.. వారి పరిస్థితి ఏమిటనేదానికి సమాధానం లేదు. వారిని యాచకులకు అమ్మేస్తారనే ఆరోపణ ఉంది. ప్రత్యేక చట్టం చేయాలి ‘‘రెండు దశాబ్దాలుగా దేశంలో లక్షల మంది ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కన్నారు, సరోగసీ ద్వారా తల్లులవుతున్నారు. ఇటు దంపతులకు కానీ, అటు వైద్యులకు కానీ చట్టపరమైన నిబంధనలు లేకపోవడం దురదృష్టకరం. ఈ ఐవీఎఫ్ కేంద్రాల్లో లొసుగులు, లోపాలను గుర్తించే యంత్రాంగం లేకపోవడం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఈ విధానానికి సంబంధించి మనదేశంలో ఉన్న లొసుగులను గమనించే.. విదేశీయులు సరోగసీ తల్లి (గర్భంలో బిడ్డను మోసి, కనిచ్చే తల్లి) కావాలంటూ క్యూ కడుతున్నారు. ఇలా మన దేశంలో పుట్టి, విదేశాలకు వెళ్లిన పిల్లలు.. వారి బిడ్డగా పెరుగుతున్నారా, బానిసలుగా మారుతున్నారా అన్నది కూడా తెలియని పరిస్థితి. ఇదే పని మనం మరే ఇతర దేశంలో కూడా చేయలేం..’’ - నిశ్చిల సిద్ధారెడ్డి, ప్రభుత్వఅదనపు న్యాయవాది -
డీఎన్ఏతో సరోగసీ చిన్నారులకు పాస్‌పోర్ట్
హైదరాబాద్ పాస్‌పోర్టు అధికారుల నిర్ణయం దేశంలోనే తొలిసారిగా ఎన్నారై దంపతుల సరోగసీ బిడ్డకు టెస్టుట హైదరాబాద్: పిల్లలకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తే అందులో తల్లిదండ్రుల పేర్లు తప్పనిసరి.. తల్లిదండ్రుల చిరునామా, వారి పాస్‌పోర్టులు, గుర్తింపు ఆధారంగానే పిల్లలకు పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. మరి ఒక తండ్రి, ఇద్దరు తల్లులు ఉంటే పాస్‌పోర్టులో తల్లి పేరుగా ఎవరిది ఉండాలి? అద్దె గర్భం (భర్త వీర్యకణాలు, భార్య అండాలను ఫలదీకరించి.. మరో మహిళ గర్భంలో బిడ్డను పెరిగేలా చేసే ప్రక్రియ - సరోగసీ) ద్వారా సం తానాన్ని పొందుతున్న వారి సమస్య ఇది. ఇలా ‘సరోగసీ’ విస్తృతమవుతున్న నేపథ్యంలో... బిడ్డలకు తల్లిదండ్రులెవరో తేల్చేం దుకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని హైదరాబాద్ పాస్‌పోర్టు అధికారులు నిర్ణయించారు. దేశంలోనే తొలిసారిగా ఓ ప్రవాస భారతీయ దంపతుల సరోగసీ బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయించాలని ఆదేశించారు. తల్లి ఎవరనే దానిపైనే వివాదం.. తల్లిదండ్రులకు పాస్‌పోర్ట్ ఉండి బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం ఇస్తే చాలు రెండుమూడు రోజుల్లోనే బిడ్డకు పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. కానీ సరోగసీ వల్ల పుట్టే బిడ్డకు తల్లి విషయంలో వివాదాలు వస్తున్నాయి. అండం ఇచ్చిన తల్లి పేరును పాస్‌పోర్ట్‌లో చేర్చాలా? నవమాసాలు మోసి కన్న తల్లిని చేర్చాలా? అన్నది తేలలేదు. సరోగసీ బిడ్డల పాస్‌పోర్ట్ విషయమై మార్గదర్శకాలు ఇవ్వాలని గతంలోనే హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి విదేశీ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కానీ, దీనిపై ఇప్పటికీ మార్గదర్శకాలు రాలేదు. దీంతో ‘సరోగసీ’ బిడ్డలకు డీఎన్ఏ పరీక్షలు చేయించి, పాస్‌పోర్టు ఇవ్వాలని నిర్ణయించారు. వాన్‌బ్యూరెన్ కేసు వివాదంతోనే.. జమైకాకు చెందిన వాన్‌బ్యూరెన్ అనే మహిళ అమెరికా జాతీయుడిని పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాలతో వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని తేలడంతో సరోగసీని ఆశ్రయించారు. భారత్‌లోని ఓ మహిళ ద్వారా వారికి మగబిడ్డ జన్మించాడు. కానీ ఈ బిడ్డకు పాస్‌పోర్టు కోసం ఆమె పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లగా.. ధ్రువపత్రాలు పరిశీలించిన అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె పాస్‌పోర్ట్ కార్యాలయం వద్దే పిల్లాడ్ని వదిలేసి వెళ్లిపోయారు. తర్వాత సంతాన సాఫల్య కేంద్రం యాజమాన్యం బిడ్డను తీసుకెళ్లి తిరిగి వాన్బ్యూరెన్కు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి బిడ్డతో సహా అమెరికాకు వెళ్లగలిగింది. తాజాగా ఎన్నారై దంపతులు.. వాన్‌బ్యూరెన్ వివాదం తర్వాత ఒక ప్రవాస భారతీయ జంట తమ సరోగసీ బిడ్డకు పాస్‌పోర్ట్ కోసం హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వచ్చారు. దీనిపై పాస్‌పోర్ట్ అధికారి అన్ని ధ్రువపత్రాలూ పరిశీలించాక.. ఆ బిడ్డకు డీఎన్ఏ టెస్టు చేయించాలన్నారు. ఎన్నారై దంపతులు అంగీకరించడంతో... గత డిసెంబర్లో దంపతుల రక్తనమూనాలను సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)కి పంపించి పరీక్షలు చేయించారు. ఈ డీఎన్ఏ పరీక్ష ఫలితాల నివేదిక ఇటీవలే పాస్‌పోర్ట్ కార్యాలయానికి అందింది. దాని ఆధారంగా త్వరలోనే ఆ బిడ్డకు పాస్‌పోర్ట్ అందజేయనున్నట్టు పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో డీఎన్ఏ టెస్టు ద్వారా తల్లిదండ్రులను నిర్ణయించి పాస్‌పోర్ట్ అందజేస్తున్న తొలి ఘటనగా ఇది రికార్డులకెక్కనుంది. -
సరోగసీ మోసే మారుటమ్మే అద్దె అమ్మ! పెంచే అసలు తల్లే మాయమ్మ!!
సాధారణంగా ఒక స్త్రీ కడుపు పండి, పండంటి బిడ్డను ప్రసవించడానికి పిండాన్ని తొమ్మిది నెలలు తన గర్భంలో మోయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సజావుగా జరగాలంటే ఆమె శరీరంలోని అనేక అవయవాలు... అంటే గర్భాశయం, అండాశయం, ఫెలోఫియన్ ట్యూబ్స్... ఇవన్నీ సక్రమంగా పనిచేయాలి. అలాగే హార్మోన్లన్నీ సక్రమంగా విడుదలవ్వాలి. వీటితో పాటు భర్త శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత కూడా ప్రధానమే. ఈ అన్ని అంశాలలో ఏ ఒక్కదాని పనితీరు సక్రమంగా లేకపోయినా గర్భధారణ ప్రక్రియలో ఆటంకం ఎదురవుతుంది. చాలా సందర్భాల్లో 100 మంది దంపతుల్లో 80 మందికి గర్భధారణకు ఏడాది వ్యవధి పట్టవచ్చు. మిగతా 20 మందిలో పదిమందికి రెండేళ్లు పట్టవచ్చు. అయితే చివరి పది మందికి మాత్రమే చికిత్స అవసరమవుతుంది. వీరిలోనూ 80 శాతం మందికి సమస్యను బట్టి హార్మోన్ల (మాత్రలు, ఇంజెక్షన్లు)తో చికిత్స చేస్తే గర్భం దాలుస్తారు. మిగతా 20 మందికి ఐయూఐ, ఐవీఎఫ్, ఇక్సీ వంటి అత్యాధునికమైన, ఖర్చుతో కూడిన చికిత్సా విధానాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా సాధ్యపడనప్పుడు కొన్ని సందర్భాల్లో ‘సరోగసీ’ పద్ధతిని ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు కొందరు బిడ్డలను పెంచాలనే తమ కోరికను సాకారం చేసుకోడానికి బిడ్డను పెంచుకుంటారు. మరికొందరు బిడ్డ తమ సంతానమై ఉండాలనే తపనతో ‘సరోగసీ’ ప్రక్రియను ఆశ్రయిస్తారు. సరోగసీ అంటే... ఒక స్త్రీకి తన అండాశయం తాలూకు అండాల వల్లనే గర్భధారణ జరిగినా, అది పిండంగా మారాక, తన సొంత కడుపు (గర్భాశయం)లో ఆ పిండాన్ని తొమ్మిది నెలల పాటు పెంచే అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడు సదరు పిండాన్ని తొమ్మిది నెలల పాటు పెంచడానికి వేరేస్త్రీ ముందుకు వస్తే... అలా ముందుకు వచ్చిన తల్లిని సరోగేట్ మదర్ అంటారు. సరోగేట్ మదర్ ఆ గర్భాన్ని తొమ్మిది నెలలు మోసి,ప్రసవం అయ్యాక బిడ్డను అసలు తల్లికి ఇచ్చేస్తుంది. ప్రక్రియను ‘సరోగసీ’ అంటారు. సరోగసీ... ఎవరికి, ఎప్పుడు? అండాశయాలు ఉండి, గర్భాశయం లేకపోవడం. అది పుట్టుకతో లేకపోవడం గానీ లేదా ఆపరేషన్ ద్వారా తొలగించాల్సి వచ్చిన సందర్భంలో. గర్భాశయంలో పుట్టుకతో లోపాలు ఉండటం; టీబీ లాంటి ఏదైనా ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల గర్భాశయం పాడవడం; లోపలి పొర సన్నగా ఉండటం; అతుకులు ఉండటం. గర్భాశయంలో గడ్డలు; గర్భాశయంపైన చాలాసార్లు ఆపరేషన్ చేయడం; దానివల్ల గర్భం దాల్చినా నెలలు నిండేవరకు గర్భం నిలవకపోవడం. తీవ్రమైన మధుమేహం; గుండెజబ్బులు; కిడ్నీ సంబంధిత వ్యాధులు వంటివి ఉండి గర్భం దాల్చడం వల్ల తల్లి ప్రాణానికే ముప్పు ఉన్నప్పుడు; కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నప్పుడు. అన్ని రకాల పరీక్షలూ, చికిత్సలూ చేసినా మాటిమాటికీ అబార్షన్లు అవుతూ ఉంటే. ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకపోతే. సింగిల్ పేరెంట్‌గా ఉండదలచిన వాళ్లు. సరోగసీలో రకాలు జెస్టేషనల్ సరోగసీ ఇందులో దంపతుల నుంచి సేకరించిన అండాన్ని, శుక్రకణాలని ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియ ద్వారా ల్యాబ్‌లో ఫలదీకరణ చేసి, తద్వారా వచ్చిన పిండాన్ని వేరొక స్త్రీ (సరోగేట్ మదర్) గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇలా వచ్చే గర్భం వల్ల జన్మించే బిడ్డ జన్యుపరంగా దంపతులిద్దరికీ చెందినదయ్యే ఉంటుంది. (గర్భాన్ని వేరే తల్లి (సరోగేట్ మదర్)మోసినప్పటికీ). కొందరిలో అండం సరిగా లేనప్పుడు దాత నుంచి తీసిన అండాన్ని, భర్త వీర్యకణాలతో ఫలదీకరణ చేయించి, తద్వారా తయారైన పిండాన్ని సరోగేట్ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. సాంప్రదాయిక సరోగసీ (ట్రెడిషనల్ సరోగసీ) ఇందులో భార్య అండాలు, అండాశయం సరిగా లేనప్పుడు భర్త శుక్రకణాలను సరోగేట్ మదర్ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. పిండం సరోగేట్ మదర్ గర్భంలో పెరిగేలా చేస్తారు. కమర్షియల్ సరోగసీ ఇందులో గర్భాన్ని మోసేందుకు సిద్ధపడ్డ తల్లి (సరోగేట్ మదర్)కి గర్భాన్ని మోసినందుకూ, ఆమె సమయాన్ని వెచ్చించినందుకూ, వైద్యపరమైన ఖర్చులకూ... ఇలా వీటన్నింటితో పాటు ఇంకా కొంత ఎక్కువ డబ్బును అందజేస్తారు. ఇలా సరోగసీ ద్వారా గర్భాన్ని అద్దెకు ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు ఆమోదించింది. ఇక రష్యా, థాయిల్యాండ్, ఉక్రెయిన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కొన్నింటిలో సరోగసీకి ఆమోదం ఉంది. అయితే ఇంగ్లాండ్‌లో కమర్షియల్ సరోగసీకి ఆమోదం లేదు. ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ ఇందులో గర్భాన్ని మోసే తల్లి డబ్బు కోసం చూసుకోదు. తన సొంత బంధువులు లేదా స్నేహితుల సంతృప్తి కోసం డబ్బు ప్రమేయం లేకుండా ఈ పని చేస్తుంది. సాధారణంగా దంపతుల బంధువులు, స్నేహితులు ఈ పనికి ఒప్పుకుంటారు. సరోగసీ జరిగేదిలా... దంపతుల్లోని స్త్రీకి లేదా అండం దానం చేసే దాతకు అండాలు తయారయ్యేలా చికిత్స అందిస్తూ ఉండగానే... అదే సమయంలో సరోగేట్ మదర్ గర్భాశయం పిండాన్ని స్వీకరించేందుకు వీలుగా అయ్యేలా చికిత్స చేస్తారు. అండాశయంలో తయారయ్యే అండాలను బయటకు తీసి వాటిని భర్త తాలూకు శుక్రకణాలతో (కొన్ని పరిస్థితుల్లో దాత శుక్రకణాలతో) ఫలదీకరణం చేయిస్తారు. తద్వారా తయారయ్యే పిండాన్ని సరోగేట్ మదర్ గర్భాశయంలోకి పంపిస్తారు. తర్వాత సరోగేట్ మదర్ తాలూకు గర్భాశయం ఆ పిండాన్ని స్వీకరిస్తే... సాధారణ గర్భం నిలిచి, పెరిగినట్లే... ఈ గర్భమూ నిలుస్తుంది. పెరుగుతుంది. అయితే ఒక్కోసారి గర్భం నిలిచినా ఆ తర్వాత అందరి గర్భవతుల్లోలాగే వీరిలో కూడా అబార్షన్లు, అవయవలోపాలు, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని చట్టబద్ధమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సరోగసీకి సంబంధించిన చట్టాలు, విధానాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. భారత్‌లో అద్దె గర్భం ఆమోదయోగ్యమే కానీ... భారతదేశంలో గర్భాన్ని అద్దెకు తీసుకోవడం 2002 నుంచి ఆమోదయోగ్యంగానే ఉంది. 2008 నాటికి సుప్రీం కోర్టు అధికారికంగా అనుమతించింది. అయితే దీనికి సంబంధించి సరైన నియమావళి లేదు. ఇక 2005లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) దీనికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. పూర్తిస్థాయి చట్టం కోసం మన దేశంలోని ఐయూఎఫ్ నిపుణులు, ప్రముఖ న్యాయవాదులు, ఈ రంగాలకు సంబంధించిన ఇతర నిపుణులు కలిసి సరోగసీ సంబంధిత చట్టాన్ని రూపొందించేందుకు గాను ఒక ముసాయిదా (డ్రాఫ్ట్) తయారు చేశారు. అయితే ఈ డ్రాఫ్ట్‌ను పార్లమెంట్లో బిల్లుగా ఇంకా ప్రవేశపెట్టలేదు. ఐసీఎమ్ఆర్, కేంద్ర ఆరోగ్య శాఖ, కేంద్ర కుటుంబసంక్షేమ శాఖ కలిసి ఏఆర్టీ రెగ్యులేషన్ బిల్ 2010ని రూపొందించాయి. అయితే ఈ బిల్లు ఇంకా భారత న్యాయశాఖ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. గత కొన్నేళ్లుగా భారతదేశం సరోగసీకి పెట్టింది పేరుగా తయారవుతోంది. స్వదేశీయులే కాకుండా, విదేశీయులు కూడా ఈ చికిత్సా విధానం కోసం మన దేశానికి వస్తున్నారు. మన మహిళల గర్భాలను అద్దెకు తీసుకుంటున్నారు. అయితే విధిలేని పరిస్థితుల్లో ఆచరించాల్సిన నైతిక ప్రక్రియకూ, డబ్బు కోసం పాటించే అనైతిక విధానాలకూ మధ్య తేడాలను గుర్తించినప్పుడు ఏ విధానమైనా సత్ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ ఆధునికతను అనైతికత కోసం ఉపయోగిస్తే అది అనర్థాలకు దారి తీస్తుంది. ఆ తేడాను గుర్తించి విచక్షణ ఉన్నప్పుడు ఏ విధానమైనా సత్ఫలితాలు ఇస్తుంది. సరోగసీకి మొగ్గు చూపడానికి కారణాలివే... ఈ ఆధునిక కాలంలో ఇటీవల ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, కెరియర్‌కు ఎక్కువగా ప్రాముఖ్యమివ్వడం, గర్భధారణను బాగా ఆలస్యం చేయడం వల్ల వారి శరీరంలో హార్మోన్లపరమైన మార్పులు వచ్చి గర్భధారణ కోరుకున్నప్పుడు జరిగేందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం, సాధారణ చికిత్స, ఐవీఎఫ్లతోనూ గర్భం దాల్చలేకపోవడం వల్ల కొంతమంది సరోగసీకి వెళ్తున్నారు. మరికొందరు గర్భాన్ని మోయడానికి భయపడటం, అన్ని నెలల సమయాన్ని గర్భాన్ని మోయడానికి కేటాయించలేకపోవడం, శరీర ఆకృతి పాడవుతుందేమోననే భయంతో కొందరు సరోగసీకి వెళ్తున్నారు. కానీ ఇది నైతికంగా ఆమోదయోగం కాదు. చట్టబద్ధంగా కూడా దీనికి ఆమోదం లేదు. సరోగసీ ప్రక్రియకు వెళ్లాలంటే ఉండాల్సిన అర్హతలు దంపతుల వయసు 21 - 45 మధ్య ఉండాలి ఇద్దరి ఆరోగ్యపరిస్థితి బాగుండాలి ఎలాంటి కాంప్లికేషన్లు ఉండకూడదు జన్యుపరమైన సమస్యలు ఉండకూడదు ఒకవేళ అంతకుముందే వారికి పిల్లల ఉంటే మంచిదే. ఎందుకంటే అది వారి ప్రత్యుత్పత్తి ఆరోగ్యం బాగుందన్న అంశానికి ఒక సూచన గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళ మూడు సార్ల కంటే ఎక్కువగా తన గర్భాన్ని అద్దెకు ఇవ్వకూడదు. బిడ్డ పుట్టాక ఇచ్చే బర్త్ సర్టిఫికేట్లో దంపతులిద్దరి పేర్లనే రాస్తారు. ఒకవేళ సింగిల్ పేరెంట్ అయితే ఒక్కరి పేరే ఉంటుంది. డబ్బుకోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళ వాళ్ల మధ్య జరిగిన ఒప్పందాన్ని బట్టి దాదాపు రూ. 50,000 నుంచి రెండు లక్షల వరకు వసూలు చేయవచ్చు. మన దేశ మహిళల గర్భాలకు గిరాకీ...? కమర్షియల్ సరోగసీకి సుప్రీం కోర్టు ఆమోదం తర్వాత విదేశీయులు సైతం భారతీయ మహిళల గర్భాలను అద్దెకు తీసుకోవడం కోసం ఇక్కడికి విరివిగా వస్తున్నారు. దీంతో మెడికల్ టూరిజం అభివృద్ధి చెందింది. దాంతోపాటు విదేశీయులకు ఆ సేవలందించేందుకు వీలుగా అధునాతన వైద్య ఉపకరణాలు, మౌలిక సదుపాయాలు, అత్యున్నత స్థాయి నిపుణుల ఆవిర్భావం... ఇవన్నీ జరిగాయి. దీనికి మరో కారణం కూడా ఉంది. విదేశీ మహిళల్లాగా మన దేశ మహిళల్లో ధూమపానం, ఆల్కహాల్ వంటి దురలవాట్లు లేకపోవడం వల్ల మన దేశ మహిళల గర్భాలను అద్దెకు తీసుకోడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇక మన దేశంలోని పేదరికం వల్ల సరోగసీకి సిద్ధపడే మహిళలు ఎక్కువ. వీళ్లు విదేశీ మహిళలతో పోలిస్తే చాలా చవకగా లభించడం వల్ల ఇక్కడ సరోగసీకి ప్రాధాన్యం పెరిగింది . పైగా సరోగసీ ప్రక్రియ కోసం విదేశాల్లో చేయాల్సిన ఖర్చుతో పోలిస్తే మన దేశంలో జరిగే వ్యయం కేవలం ఐదో వంతు మాత్రమే. ఉదాహరణకు యూఎస్ఏలో సరోగసీ మొత్తం ప్రక్రియకు అయ్యే ఖర్చు రూ. 40 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు ఉంటుంది. అదే మన దేశంలో ఇది రూ. 9 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉండవచ్చు. ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాలు ఇవే... సరోగసీకి వెళ్లాలంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ విధించిన మార్గదర్శకాలివే... సాధారణంగానే గర్భధారణ జరిగి, ప్రసవం అయ్యేందుకు అవకాశం ఉన్న దంపతులకు సరోగసీకి అవకాశం లేదు. సరోగసీ ఒప్పందాలు చట్టబద్ధంగా అమలు చేయడానికి యోగ్యమైనవి. (లీగల్లీ ఎన్‌ఫోర్సబుల్) ఒకవేళ వివాహిత ... సరోగసీ ద్వారా బిడ్డను పొందాలనుకుంటే భర్త అనుమతి తప్పనిసరి. గర్భాన్ని అద్దెకు వచ్చే సరోగేట్ మదర్... అలా మూడు సార్లకు మించి చేయకూడదు. సొంత బిడ్డలున్న మహిళ అయితే ఆమెఐదుసార్లకు మించి ప్రసవానికి అనుమతించబడదు. అండాన్ని దానం చేసే దాతల వివరాలన్నీ గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. సాఫల్య కేంద్రాలు, శుక్రకణ బ్యాంకుల వివరాలన్నీ ఒక అక్రిడిటేషన్ ప్రక్రియ ద్వారా గుర్తింపును కలిగి ఉండాలి. భారతదేశంలోని ఆరోగ్య సంబంధిత పరిశోధన సంస్థలు ఒక ‘జాతీయ ఏఆర్టీ రిజిస్ట్రీ’ని నిర్వహించాలి. దీంతోపాటు ఈ రంగంలో పనిచేసే వ్యక్తులు, ఏజెంట్లు, సైంటిస్టులు, ఇతరుల వివరలతో జాతీయ, రాష్ట్ర సలహా బోర్డుల ఏర్పాటు జరగాలి. సరోగసీ ప్రక్రియ జరిగేదిలా... పైన పేర్కొన్న కారణాల వల్ల ఒక తల్లి గర్భాన్ని మోసేందుకు వీలు కాని పరిస్థితుల్లో సరోగసీకి ప్రయత్నిస్తారు. దానికి సిద్ధపడ్డ దంపతులు తొలుత ఈ ప్రక్రియ పట్ల అవగాహన పెంచుకోవాలి. అన్ని రకాల సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఇందులో మిళితమై ఉన్న చట్టపరమైన అంశాలు (లీగల్ యాస్పెక్ట్స్), చట్టపరమైన ఇబ్బందులు (లీగల్ ప్రాబ్లమ్స్) గురించి విపులంగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. లేకపోతే తర్వాత రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను అనుసరించ దలచినప్పుడు బిడ్డను కోరుకునే దంపతులు, గర్భాన్ని మోసేందుకు సిద్ధపడ్డ తల్లి (సరోగేట్ మదర్), ఆమె భర్త, కుటుంబ సభ్యులు, సాఫల్య చికిత్సా నిపుణులు (ఫెర్టిలిటీ స్పెషలిస్ట్), సరోగసీ ఏజెంట్స్, లీగల్ అడ్వైజర్స్... ఇలా అందరూ కలసి సమష్టిగా నిర్ణయం తీసుకుని పనిచేయాల్సి ఉంటుంది. దంపతులు, సరోగేట్ మదర్... ఈ ఇరువురూ అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. వీరిని మానసికంగా సంసిద్ధం చేయడం కోసం సైకలాజికల్ కౌన్సెలింగ్ చేయడం కూడా ఎంతో ముఖ్యం. ఇందులో గర్భం మోసే తల్లిని ఎంపిక చేసేప్పుడు సరైన వారిని ఎంచుకోవడం ఎంతో అవసరం. ఈ సరోగేట్ మదర్... స్నేహితురాలు, బంధువులు ఇలా ఎవరైనా కావచ్చు. లేదా ఇందుకోసమే ఉద్దేశించిన ఏజెంట్స్ వెతికిపెట్టే సరోగేట్ మదర్స్ కూడా కావచ్చు. సరోగేట్ మదర్‌కు స్కానింగ్, హార్మోన్ పరీక్షలూ, రక్తపరీక్షలూ చేయాల్సి ఉంటుంది. ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో తెలుసుకోవడంతో పాటు హెచ్ఐవీ, వీడీఆర్ఎల్, హెచ్‌బీఎస్‌ఏజీ వంటి పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. చట్టబద్ధమైన అంశాలు... ఇది నేరుగా దంపతులిద్దరికీ సంబంధించిన వ్యవహారం కాకపోవడం వల్ల... గర్భాన్ని మోసేందుకు సిద్ధపడే మరో తల్లి ప్రమేయం కూడా ఉండటం వల్ల కొన్ని చట్టబద్ధమైన అంశాలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల బిడ్డను కోరుకునే దంపతులకూ, గర్భాన్ని మోసే తల్లికీ మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. ఈ ఒప్పందం చట్టబద్ధంగా జరగాల్సి ఉన్నందున న్యాయవాది ప్రమేయమూ ఉంటుంది. ఈ చట్టబద్ధమైన వ్యవహారాలకు అవసరమైన ఖర్చులన్నీ బిడ్డను కోరే దంపతులు భరించాల్సి ఉంటుంది. ఏదైనా అనుకోని అవాంతరాలో, అనుకోని సమస్యలో వస్తే వాటిని పరిష్కరించుకునే దిశగా అనుసరించాల్సిన వ్యవహారశైలిపై కూడా ముందుగానే ఒప్పందాలు, ఒడంబడికలూ జరుగుతుంటాయి. విదేశీయులూ... కాస్త జాగ్రత్త విదేశీయులైన దంపతులు సరోగసీ కోసం భారత్‌కు వస్తే... ఆ దంపతుల్లో ఏ ఒక్కరిదైనా... అండంగానీ లేదా శుక్రకణాలు గాని ఉపయోగించి ఫలదీకరణ జరగాలి. లేకపోతే అలా పుట్టిన బిడ్డకు ఆ దేశ పౌరసత్వం, పాస్‌పోర్టు వంటివి ఇవ్వరు. ఇందుకోసం డీఎన్ఏ పరీక్ష జరిపి, పుట్టిన బిడ్డలో ఆ దంపతుల డీఎన్ఏలు ఉన్నాయని నిర్ధారణ చేశాకనే పౌరసత్వం వంటి హక్కులు ఇస్తారు. ఒకవేళ అలా కాకుండా ఉంటే... వారికి సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డకు భారతదేశపు పౌరసత్వం లభించదు. అందుకే విదేశాలనుంచి వచ్చి ఇక్కడ సరోగసీ ద్వారా బిడ్డను కోరుకునేవారు చట్టబద్ధమైన అన్ని అంశాలనూ ముందుగానే తెలుసుకుని రావడం మంచిది. భారతదేశం... సరోగసీ రంగం మన దేశంలో సరోగసీ ప్రక్రియ ద్వారా ఏటా రూ. 25,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా సరోగసీ ప్రక్రియకు మన దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏ పాశ్చాత్య దేశాలతో పోల్చినా... ఇక్కడ ఈ సౌకర్యం చాలా చవకగా లభ్యం కావడమే దీనికి కారణం. 2010లో భారతీయ సరోగసీ కేంద్రాల్లో దాదాపు 1500 సరోగసీ ప్రసవాలు అయినట్లు ఒక అంచనా. అంతకు మునుపు రెండేళ్ల గణాంకాలతో పోలిస్తే అది 50 శాతం ఎక్కువ. భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఈ కింది వాటిల్లో ఏడాదికి జరుగుతున్న సరోగసీ ప్రసవాల సంఖ్య... ఢిల్లీ - 300 గుజరాత్ - 300 హైదరాబాద్ - 100 బెంగళూరు - 50 ముంబాయి - 25. ఇదో మహా వ్యాపారం... ఐక్యరాజ్య సమితి 2012లో నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో ఏడాదికి దాదాపు 400 మిలియన్ డాలర్ల వ్యాపారం సరోగసీ ద్వారా జరుగుతోంది. దేశవ్యాప్తంగా 3000 కు పైగా ఫెర్టిలిటీ క్లినిక్స్ (సంతాన సాఫల్య కేంద్రాలు) ఉన్నాయి. చివరగా... నాణేనికి రెండు పక్కలు ఉన్నట్లే అభివృద్ధికీ రెండు పార్శ్వాలుంటాయి. ఆధునిక వైద్య విజ్ఞానం ఇచ్చిన వరాన్ని మనం సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగపరుస్తున్నామా అన్నది మన నైతికత, విచక్షణ మేరకు చేయాల్సిన పని ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి