రాంగోపాల్‌పేట్: విశాఖ పట్టణం కేంద్రంగా సరోగసీ పేరుతో సంతానం లేని దంపతుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన ‘సృష్టి’ ఆస్పత్రి యాజమాన్యం నిర్వాకాలు హైదరాబాద్ నగరంలోనూ వెలుగులోకి వస్తున్నాయి. నగరానికి చెందిన దంపతులకు సరోగతి ద్వారా శిశువు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌కు చెందిన దంపతులకు వివాహం జరిగి చాలా ఏళ్లు గడిచినా సంతానం కలుగకపోవడంతో వారు గత నవంబర్ 11న సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్ ఎదురుగా ఉన్న ‘సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్’ను సంప్రదించారు. ఆస్పత్రి ఎండీ డాక్టర్ నమ్రత సరోగసి (అద్దె గర్భం) ద్వారా శిశువును ఇస్తామని ఇందకు రూ.10లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో వారు అప్పటికప్పుడే రూ.10లక్షలు చెల్లించారు.
అద్దె గర్భం ఇచ్చేందుకు అంగీకరించిన మహిళ విశాఖపట్టణంలోని తమ ఆస్పత్రిలో చికిత్సపొందుతుందని, ఈ ఏడాది అక్టోబర్‌లో శిశువును అప్పగిస్తామని చెప్పారన్నారు. అయితే ఇటీవల విశాఖపట్టణంలో సదరు ఆస్పత్రి సరోగసీ పేరుతో చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా సదరు ఆస్పత్రిలో సరోగసీ మహిళ ప్రసవించి శిశువును ఆస్పత్రికి అప్పగించి సొంతూరికి వెళ్లిపోయింది. అయితే ఆమె శిశువు లేకుండా ఇంటికి రావడంతో స్థానికులు దీనిపై ఆరా తీయడంతో వివాదానికి కారణమైంది. దీంతో శిశువును నగరానికి చెందిన దంపతులకు అప్పగించ లేదు. ఈ లోగా అక్రమాలు వెలుగులోకి రావడంతో నిర్వాహకులు సికింద్రాబాద్ ఆస్పత్రికి తాళం వేసి పరారయ్యారు. దీంతో బాధితులు గురువారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా డాక్టర్ నమ్రత గత ఎనిమిదేళ్ల క్రితం సికింద్రాబాద్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచే సరోగసీ పేరుతో శిశు విక్రయాలకు పాల్పడినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment