కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో చర్యలు శూన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అద్దె గర్భం (సరోగసీ) వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సరోగసీ క్లినిక్‌ల కాసుల కక్కుర్తికి అమాయక నిరుపేద మహిళలు బలవుతున్నా అధికారులు కళ్లు తెరవడం లేదు. అద్దె గర్భం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం తెచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో సరోగసీ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ ఫైలు సిద్ధం చేసినా దానికి ఇప్పటికీ మోక్షం కలగలేదు. దీంతో అద్దె గర్భం వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఘటన అందుకు ఉదాహరణ. రాష్ట్రంలో దాదాపు 20 వరకు సరోగసీ క్లినిక్‌లు పనిచేస్తున్నాయని అంచనా. అందులో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాటిపై వైద్య ఆరోగ్యశాఖకు ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో క్లినిక్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
సరోగసీపై కేంద్రం తెచ్చిన చట్టంలో ఏముందంటే..
► వ్యాపారపరమైన సరోగసీ పూర్తిగా నిషేధం. అద్దె గర్భం మోసే మహిళకు బీమా, వైద్య ఖర్చులు తప్ప ఇతరత్రా ఆర్థిక లావాదేవీలేవీ ఉండకూడదు
► సరోగసీ ద్వారా సంతానం పొందాలనుకునేవారు భారతీయులై ఉండాలి. వారి వయసు మహిళలైతే 23 నుంచి 50 ఏళ్లు, పురుషులైతే 26 నుంచి 55 ఏళ్లుండాలి. పెళ్లై కనీసం ఐదేళ్లు నిండి ఉండాలి. అప్పటి వరకు వారికి సంతానం ఉండకూడదు. దత్తత తీసుకొని ఉండకూడదు. తమకు సంతానం కలగడం లేదని జిల్లా మెడికల్ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి
► అద్దె గర్భం దాల్చే మహిళ వయసు 25–35 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండొద్దు. ఆమెకు అంతకుముందే సంతానం ఉండాలి
► జీవితంలో ఒక్కసారి మాత్రమే అద్దె గర్భం దాల్చడానికి అనుమతి ఉంటుంది
► సరోగసీకి మహిళ ఆరో గ్యం సహకరిస్తుందన్న ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
► సరో గసీ క్లినిక్‌లు తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి
► ప్రమాణాల మేరకు సరైన చికిత్స, వసతి, పరికరాలు ఉన్నాయా లేదా అని తనిఖీలు చేశాకే ఆ క్లినిక్‌లకు అనుమతివ్వాలి
► సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డను అమ్మటంగానీ.. వేరే దేశాలకు ఎగుమతి చేయడం గానీ నేరం.