త్వరలో సరోగసీ బోర్డు
త్వరలో సరోగసీ బోర్డు
Published Mon, Jun 19 2017 12:56 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM
- అద్దె గర్భం వ్యాపారానికి ముకుతాడు
- 22న మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో వెలుగుచూసిన అద్దె గర్భాల దందాపై ప్రభుత్వం దృష్టి సారించింది. సరోగసీ వ్యాపారాన్ని నిలువరించేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర సరోగసీ చట్టం–2016 ప్రకారం రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ నెల 22న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులోనే సరోగసీ బోర్డు ఏర్పాటుతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్రం తెచ్చిన సరోగసీ నియంత్రణ చట్టం–2016 ప్రకారం అద్దె గర్భాన్ని వ్యాపారం చేస్తే కనీసం పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో హైదరాబాద్ కేంద్రంగా సరోగసీ వ్యాపారం ఎల్లలు దాటింది.
సరోగసీపై ఏ దేశంలో ఎలా..?
సరోగసీని వ్యాపారం చేస్తే దక్షిణాఫ్రికాలో గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష విధిస్తారు. బ్రిటన్‌లో గరిష్టంగా మూడు నెలలు, నెదర్లాండ్‌లో ఏడాది, గ్రీస్‌లో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. రష్యాలో అలాంటి శిక్షలేమీ లేవు. ఆ దేశంలో సరోగసీ ద్వారా వ్యాపారం చేసుకోవచ్చు. మన దేశంలో పెళ్లయిన దంపతులే సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు అర్హులు. పైన పేర్కొన్న ఏ దేశంలోనూ ఈ నిబంధన లేదు. పెళ్లి కాని వారెవరైనా సరోగసీ ద్వారా బిడ్డకు తల్లి కావచ్చు. నెదర్లాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లోనైతే పురుషుడు లేదా మహిళ పెళ్లికాకపోయినా సరోగసీ ద్వారా బిడ్డను పొందవచ్చు.
సరోగసీకి బంధుత్వం తప్పనిసరి..
విదేశాల్లో అద్దె గర్భం ఇచ్చే తల్లికి, బిడ్డను పొందే వారికి మధ్య బంధుత్వం అవసరం లేదు. కానీ మన దేశంలో మాత్రం సరోగసీ ఇచ్చే మహిళకు, సరోగసీ ద్వారా బిడ్డను పొందే దంపతులకు మధ్య తప్పనిసరిగా బంధుత్వం ఉండాలన్న నిబంధనను కేంద్ర చట్టంలో పొందుపరిచారు. దీనివల్ల వ్యాపారాత్మక చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన.
Advertisement
Advertisement