ప్రాథమిక ఆరోగ్య సేవలన్నీ ఒకేచోట
- త్వరలో ఈహెచ్‌ఎస్ ఓపీ ప్రారంభం
- ఖైరతాబాద్ ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు
- పైలట్ ప్రాజెక్ట్‌గా ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ ఓపీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు ఓ శుభవార్త. జ్వరం, దగ్గు, తలనొప్పి, కడుపునొప్పి వంటి సాధారణ సమస్యలతోపాటు బీపీ, షుగర్, గుండెపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఈ వర్గాల రోగులకు రెగ్యులర్ హెల్త్‌చెకప్‌లు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చే సింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఖైరతాబాద్ ఏరియా ఆస్పత్రిలోని రెండో ఫ్లోర్‌లో అధునాతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) ఓపీ సేవలను డిసెంబర్ చివరినాటికల్లా అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
అల్లోపతి వైద్యంతోపాటు ఆయూస్, ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్య సేవలను కూడా ఓపీలో అందిస్తారు. దంత వైద్యునితోపాటు మెడికల్, సర్జికల్, పీడియాట్రిక్, గైనిక్ నిపుణులు అందుబాటులో ఉంటారు. వాక్సినేషన్ ప్రక్రియ, ఫ్యామిలీ ప్లానింగ్ చికిత్సలు కూడా చేస్తారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా రక్త, మూత్ర పరీక్షలతోపాటు అల్ట్రా సౌండ్, ఎక్స్‌రే, డార్క్‌రూమ్, ఈసీజీ, క్లినికల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. హెచ్‌ఐవీ బాధితుల కోసం ఐసీటీసీ సెంటర్‌తోపాటు కౌన్సిలర్‌ను కూడా నియమించారు. ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందడం లేదు. అనివార్య పరిస్థితుల్లో ఓపీకి డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందాల్సి వస్తోంది. ఈ అంశంపై ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆరోగ్య శ్రీ తరహాలోనే ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ రోగులకు ప్రత్యేక ఓపీ సేవలను అందుబాటు లోకి తీసుకురావాలని భావించింది. ఆ మేరకు ఆరోగ్యశ్రీ ఈహెచ్ ఎస్ సీఈవో పద్మ నేతృత్వంలో ఖైరతాబాద్ ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సహా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సభ్యుడు మధుసూదన్‌లు ఓపీ కేంద్రానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు.