Health service
-
‘ఫ్యామిలీ డాక్టర్’ ట్రయల్ రన్
సాక్షి, అమరావతి: ప్రజలు, ప్రభుత్వ వైద్యుల మధ్య బంధాన్ని బలపరచడం ద్వారా మరింత మెరుగ్గా ఆరోగ్య సంరక్షణపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణ ప్రజలు చిన్న అనారోగ్యాలకు పీహెచ్సీ, సీహెచ్‌సీ, పెద్దాస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంతూరిలోనే వైద్య సేవలు పొందేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతిష్టాత్మకంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని శుక్రవారం నుంచి ట్రయల్ రన్ ప్రాతిపదికన మొదలు పెడుతోంది. ఇందుకోసం వైద్య శాఖ యలో ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలుంటే సంక్రాంతి లేదా ఉగాది నాటికి సరిదిద్ది ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తారు. ఈ విధానం లక్ష్యం, ఎవరి పాత్ర ఏమిటి? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్ల నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా పలుమార్లు శిక్షణ ఇచ్చారు. ప్రత్యేకంగా యాప్ కూడా సిద్ధం చేశారు. ఏమిటీ ఫ్యామిలీ డాక్టర్? సాధారణంగా ఆర్థిక స్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాలు స్వల్ప అనారోగ్య సమస్య తలెత్తినా తమకు బాగా పరిచయం ఉన్న ఒక వైద్యుడిని ఫ్యామిలీ డాక్టర్‌గా ఎంచుకుని సంప్రదిస్తాయి. లక్షణాల ఆధారంగా జబ్బును గుర్తించి చిన్న సమస్యలైతే ప్రాథమిక వైద్యం అందించి స్పెషలిస్ట్ వైద్యం అవసరమైతే ఆయన రిఫర్ చేస్తారు. ఇలా వారి ఆరోగ్యం పట్ల కుటుంబ వైద్యుడు నిరంతరం శ్రద్ధ తీసుకుంటారు. ఆ కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యంపై ఆయనకు సమగ్ర అవగాహన ఉంటుంది. తద్వారా ఒక చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. ఇదే తరహాలో గ్రామీణ పేద ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించాలనేది ఫ్యామిలీ డాక్టర్ విధానం లక్ష్యం. ఎలా నిర్వహిస్తారు..? వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను విభజిస్తారు. వైద్యులు తమకు కేటాయించిన సచివాలయాలను నెలలో రెండు సార్లు సందర్శిస్తారు. 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు గ్రామానికి వెళ్లి రోజంతా అక్కడే ఉండి ప్రజలకు వైద్య సేవలు అందచేస్తారు. మధ్యాహ్నం వరకూ 104 ఎంఎంయూ వద్ద ఓపీలు నిర్వహిస్తారు. ఆ తరువాత నిర్దేశిత గృహాలను సందర్శిస్తారు. అంగన్వాడీ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తారు. 67 రకాల మందులు.. 14 రకాల పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)తో పాటు సచివాలయ ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వీటిలో అందుబాటులో ఉంటారు. ప్రతి క్లినిక్‌లో 67 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలకు సంబంధించిన కిట్లు ఉంటాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో విలేజ్ క్లినిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. సీహెచ్‌వో, ఏఎన్ఎం, ఆశాలు వైద్యుడు గ్రామానికి వచ్చే ముందు రోజే ప్రజలకు సమాచారం అందజేస్తారు. బాలింతలు, గర్భిణులు, సాంక్రమిక, అసాంక్రమిక సమస్యలతో బాధపడే వారికి వైద్య సేవలు అందేలా చూస్తారు. వైద్యులకు ఫోన్లు వైద్యుడు గ్రామానికి రాని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే వెంటనే సంప్రదించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పీహెచ్సీ వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను ప్రభుత్వం సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో 2,300 ఫోన్లను అందజేశారు. వైద్యుడు మారినా ఫోన్ నంబర్ మారకుండా శాశ్వత నంబర్ కేటాయించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్/సచివాలయంలో ఆ గ్రామానికి కేటాయించిన వైద్యుడు, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ప్రదర్శిస్తారు. సమర్థంగా అమలుకు ట్రయల్ రన్ – ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఫ్యామిలీ డాక్టర్ విధానం సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక. దీన్ని సమర్థంగా అమలు చేసేందుకు తొలుత ట్రయల్ రన్ చేపట్టాలని నిర్ణయించాం. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుని మెరుగ్గా తీర్చిదిద్దుతాం. ఈ ఏడాది ఆఖరు వరకూ ట్రయల్ రన్ ఉంటుంది. ఎక్కడైనా సమస్యలుంటే పరిష్కరించి కొత్త సంవత్సరంలో సమర్థంగా కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ లోగా కొత్తగా కొనుగోలు చేస్తున్న అదనపు 104 ఎంఎంయూలు అందుబాటులోకి వస్తాయి. న్యాయపరమైన ఇబ్బందులతో ఆగిన సీహెచ్‌వోల నియామకం పూర్తవుతుంది. ట్రయల్ రన్ కోసం ప్రతి జిల్లాకు అడిషనల్ డీఎంహెచ్‌వో స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్‌గా ఎంపిక చేశాం. ఎక్కడైనా పీహెచ్సీ వైద్యుడు సెలవు పెడితే ఆ రోజు సేవలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. నియోజకవర్గానికి ఒకరు చొప్పున 175 మంది వైద్యులను ఆయా సీహెచ్‌సీల్లో ఉంచుతున్నాం. జిల్లాకు నలుగురు చొప్పున వైద్యులను డీఎంహెచ్‌వోల కార్యాలయాలకు కేటాయించాం. వీరి సేవలను పీహెచ్‌సీల్లో వైద్యులు సెలవులు పెట్టినప్పుడు ప్రత్యామ్నాయం కింద వినియోగించుకుంటాం. మిగిలిన రోజుల్లో సీహెచ్‌సీ, డీఎంహెచ్‌వో కార్యాలయంలో విధుల్లో ఉంటారు. వైద్యుల విధులు - ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఔట్‌పేషెంట్ సేవలు. బీపీ, షుగర్, ఇతర జీవన శైలి జబ్బులకు రోగులకు రెగ్యులర్ చెకప్. - గర్భిణులు, బాలింతలకు యాంటీ నేటల్, పోస్ట్ నేటల్ హెల్త్ చెకప్స్. - నవజాత, శిశు సంరక్షణ. అంగన్వాడీలను సందర్శించి రక్తహీనతతో బాధ పడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి పరిశీలన. - పిల్లల్లో ఎదుగుదల, పౌష్టికాహార లోపాలను గుర్తించేందుకు పరీక్షలు. - మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హోమ్ విజిట్స్. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఫాలో అప్ సేవలు. - మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఇతర రోగులకు ఇళ్ల వద్దే వైద్య సేవలు. క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పాలియేటివ్ కేర్ సేవలు. పాఠశాల విద్యార్థులకు జనరల్ చెకప్. రక్త హీనత నివారణకు ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీపై పర్యవేక్షణ. సీహెచ్‌వో టెలీ మెడిసిన్ ద్వారా గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, స్పెషలిస్ట్ సేవలు ప్రజలకు అందించడం. 30 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి జబ్బులను గుర్తించేందుకు స్క్రీనింగ్. మొత్తంగా గ్రామ స్థాయిలో 12 రకాల వైద్య సేలను ప్రజలకు అందిస్తారు. ఏఎన్ఎం గ్రామ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాస్పత్రులకు రిఫర్ చేసిన ఆరోగ్యశ్రీ కేసులను ఫాలోఅప్ చేస్తారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులకు సీఎం వైఎస్ జగన్ సందేశంతో కూడిన లేఖలను అందజేస్తారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. 104 ఎంఎంయూ వద్ద వైద్య సేవలు అందించాల్సిన యాంటీనేటల్, పోస్ట్ నేటల్ కేసులను నిర్ధారిస్తారు. ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. - ఆశ వర్కర్ ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు పొందడానికి ప్రజలను సమీకరిస్తారు. బాలింతలు, గర్భిణులు, కౌమార దశ పిల్లలకు వైద్య సేవలు అందేలా చూస్తారు. వైద్యుడు గృహాలను సందర్శించేందుకు మంచానికి పరిమితం అయిన రోగులు, వృద్ధుల వివరాలు సేకరిస్తారు. -
గాంధీ ఆస్పత్రి: 110 రోజుల తర్వాత సాధారణ సేవలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆగస్ట్ 3వ తేదీ నుంచి కోవిడ్‌తోపాటు సాధారణ వైద్యసేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. పలు విభాగాలకు చెందిన హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు, వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వ హించిన అనంతరం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఎనిమిది అంతస్తుల ఆస్పత్రి ప్రధాన భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆర్థోపెడిక్ ఐసీయూలో కోవిడ్ ట్రైయాజ్ ఏరి యా, రెండు, మూడు అంతస్తుల్లో కోవిడ్, నాల్గవ అంతస్తులో మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్‌ఫంగస్) బాధితులకు కేటాయించినట్లు వివరించారు. కోవిడ్‌కు 40 శాతం, నాన్‌కోవిడ్‌కు 60 శాతం వైద్యులు, సిబ్బందిని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశామని, ఎమర్జెన్సీ, సాధారణ, ఓపీ సేవలు గతంలో మాదిరిగానే అందుబాటులో ఉంటాయని తెలిపారు. కోవిడ్ కారణంగా 110 రోజుల తర్వాత ఇక్కడ సాధారణ వైద్యం అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. గాంధీఆస్పత్రిలో 153 బ్లాక్‌ఫంగస్, 219 కోవిడ్ రోగులకు ప్రస్తుతం వైద్యసేవలు అందిస్తున్నామని నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
ఆఖరి మజిలీలో ఆత్మీయ స్పర్శ
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి, చికిత్స లేని వ్యాధులతో అవసాన దశలో ఉన్న వారికి ఇచ్చే శారీరక, మానసిక ఉపశమన చికిత్సే ‘హస్పీస్ అండ్ పాలియాటివ్ కేర్’గా పేర్కొంటారు. చివరి దశలో ఉన్న కేన్సర్ బాధితులకు 9 సంవత్సరాలుగా నగరంలోని ‘స్పర్శ్ హస్పీస్ అండ్ పాలియాటివ్ కేర్ సెంటర్’ అందిస్తున్న ఉచిత సేవలపై నేడు వరల్డ్ హస్పీస్ అండ్ పాలియాటివ్ కేర్ డే సందర్భంగా కథనం.. ఆస్పత్రిలో ఉన్నా నయం కాదు.. అలాగని ఇంటి దగ్గర వారి నొప్పులకు ఉపశమనం దొరకదు. ఈ పరిస్థితుల్లో జీవితం నరకప్రాయంగా మారిన కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి బాధితులు ఎందరో.. అలాంటి వారికి శారీరక, మానసిక సాంత్వనకు ప్రత్యేకంగా అందించే చికిత్స పేరే ‘పాలియాటివ్ కేర్ ట్రీట్మెంట్’. అయితే ప్రత్యేకంగా పాలియాటివ్ కేర్ సేవలు ఉంటాయని తెలియక ఎందరో అవస్థలతో, నొప్పులతోనే తుది శ్వాసకు చేరువవుతున్నారు. కేవలం నగరంలోనే ప్రతినెలా 20 వేల వరకు ఇలాంటి కేసులు బయటపడుతున్నాయని డాక్టర్ల అంచనా.. వీటిలో కేవలం 1 శాతం మంది మాత్రమే పాలియాటివ్ కేర్ సేవలు పొందగలుగుతున్నారు. రోగుల సేవలో తొమ్మిదేళ్లుగా.. కేన్సర్ మహమ్మారితో పోరాడుతూ చివరి దశలో ఉన్న వారికి ఉపశమన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో 2011లో రోటరీ క్లబ్ బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ‘స్పర్శ్ హస్పీస్ అండ్ పాలియాటివ్ కేర్ సెంటర్’ ఏర్పాటైంది. ఈ ఆస్పత్రి పూర్తి ‘ఉచితంగా’ హస్పీస్ అండ్ పాలియాటివ్ కేర్ సేవలను అందిస్తోంది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 3,100 మందికి సేవలను అందించారు. నగరం నుంచే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. పాలియాటివ్ కేర్, కేన్సర్ మహమ్మారిపై మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అన్ని రకాల సదుపాయాలూ... ఈ సెంటర్లో పేషెంట్లకు కావాల్సిన అన్ని రకాల మెడికల్ సదుపాయాలతో పాలియాటివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్లు, కౌన్సెలింగ్ స్పెషలిస్ట్, నర్స్‌లు, సోషల్ వర్కర్స్ నిత్యం సేవలు అందిస్తుంటారు. దీని కోసం ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేశారు. నొప్పులు, ఆయాసం నుంచి స్వస్థతకు మెడికల్ ట్రీట్మెంట్తో పాటు వారికి నిర్ధేశించబడిన అనువైన ఆహారాన్ని అందిస్తారు. దుర్భరప్రాయమైన అవసానదశలో ఎదురయ్యే వాంతులు, రక్తస్రావాలకు ప్రేమతో సపర్యలు చేస్తారు. అంతేగాకుండా అవసాన దశలో ఉన్న వారికి, వారి కుటుంబ సభ్యులకు కావాల్సిన మానసిక, ఆధ్యాత్మిక స్థైర్యాన్ని కౌన్సెలింగ్ ద్వారా అందిస్తారు. మేమే వస్తాం.. వివిధ కారణాల వలన ఈ సెంటర్‌కి రాలేని వారి కోసం స్పర్శ్ టీం బృందాలుగా వారి ఇళ్లకే వెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా అవసరమైన మెడికల్ కిట్స్ ఇతర అవసరాలైన డైపర్స్, హెల్త్ న్యూట్రియంట్స్ తదితరాలను అందిస్తారు. ఇలా నగర పరిధిలో 40 కిలో మీటర్ల వరకు ఎక్కడికైనా వెళ్లి సేవలు అందిస్తారు. మరికొందరు ఔట్‌పేషెంట్ సేవలు పొందుతున్నారు. అన్నీ తామై.. కుల మతాలకతీతంగా అన్ని పండగలను నిర్వహిస్తారు. రోగుల పుట్టిన రోజులు జరుపుతూ, చివరి కోరికలు తీరుస్తూ ఆటలు పాటలతో నచ్చిన పని చేసుకునేందుకు అన్నీ సమకూరుస్తారు. ఇక్కడికి వచ్చే పేషంట్లకు, వారి అటెండర్లకు వసతి, భోజన సౌకర్యాలు అందిస్తారు. ఈ సేవలో ఎందరో దాతలు, స్వచ్ఛంద సేవకులు భాగం పంచుకుంటున్నారు. గౌరవప్రదమైన మరణం సాంత్వనతో కూడిన జీవితం, గౌరవప్రదమైన మరణం అనే లక్ష్యాలతో స్పర్శ్ సిబ్బంది పనిచేస్తున్నాం. చివది దశలో ప్రశాంతమైన జీవితం ఇవ్వాలనేదే మా ధ్యేయం.. మరికొన్ని రోజుల్లోగచ్చిబౌలిలో 75 పడకలతో పాలియాటివ్ కేర్ సెంటర్లో సేవలు అందించే దిశగాముందుకెళ్తున్నాం. – రామ్మోహన్రావు, సీఈఓ -
మృత్యు శకటాలు
ప్రత్తిపాడు : అది విజయనగరం జిల్లాలోని నారాయణపురం గ్రామం. ఎప్పటిలానే ఈ నెల కూడా ఆ ఊరికి 104 వాహనం వచ్చింది. ఏ పెద్దమ్మా బాగున్నావా.. ఏంది తాతా ఆరోగ్యం ఎలా ఉంది.. అంటూ పలకరిస్తూ స్టాఫ్ నర్సుతో పాటు తోటి సిబ్బంది చంద్రన్న సంచార చికిత్స వాహనం నుంచి కిందకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వర్తించారు. తిరిగి బొబ్బిలి సీహెచ్‌సీకి తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యలో మిర్తివలస వద్ద మృత్యువు కాపు కాసింది. ఫిట్నెస్, బీమా లేని 104 వాహనం ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. అంతే వాహనం నడుపుతున్న పైలట్ సిల్ల మోహన్‌రావు, నిండు నెలల గర్భిణి స్టాఫ్ నర్సు సంతోషిమారిలు ఆ దుర్ఘటనలో దుర్మరణం చెందారు. ఇది ఈనెల 14వ తేదీన విజయనగరం జిల్లా మిర్తివలస వద్ద జరిగిన ప్రమాదం. వాస్తవానికి ఇది అక్షరాలా ప్రమాదమే. కానీ ప్రమాదమే కదా అని తేలిగ్గా తీసుకుందామా.. అంటే ఆ ప్రమాదం వెనుక ఆయా శాఖల పెను నిర్లక్ష్యం దాగి ఉంది. కారణం ప్రభుత్వం తిప్పుతున్న ఈ 104 వాహనాలకు ఫిట్నెస్ గానీ ఇన్సూరెన్స్ గానీ లేకపోవడమే. ఇప్పుడు ఇదే 104 ఉద్యోగులను ఆందోళన బాట పట్టేలా చేసింది. చంద్రన్న మా ప్రాణాలకు రక్షణ ఏదన్నా.. అంటూ ఉద్యోగులు నిరవధిక సమ్మెబాట పట్టారు. బాధ్యులు ఎవ్వరు.. వాహనానికి సంబంధించి ఏ చిన్న కాగితం లేకపోయినా ఎక్కడికక్కడ నిలబెట్టి రోడ్డుపైనే ముక్కుపిండి జరిమానాలు విధించే అధికారులు, ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారు. నిబంధనలతో ఏ మాత్రం పనిలేకుండా వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా ఇటు రవాణాశాఖ గానీ, అటు పోలీస్ శాఖకు గానీ చర్యలకు ఉపక్రమించడం లేదు. జిల్లాలోని ఐదు డివిజన్లలో 24 చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క వాహనానికి రెండేళ్లుగా బీమా గానీ, ఫిట్నెస్ గానీ లేదు. అయినా సంబంధిత శాఖల అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నపళంగా రోడ్డున పడాల్సిన దుస్థితి.. పొరబాటున ఈ వాహనాల్లో ప్రయాణించే సమయంలో ఏదైనా ప్రమాదం సంభవించి సిబ్బంది మరణిస్తే వారికి ఎలాంటి ఆర్థిక సాయమూ అందే పరిస్థితి లేదు. అదే జరిగితే ఉద్యోగుల కుటుంబాలు ఉన్నపళంగా రోడ్డున పడాల్సిన దుస్థితి చోటు చేసుకుంటుంది. కారణం బీమా లేని వాహనంలో ప్రయాణించడమే. విజయనగరం జిల్లాలోనూ ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో యూనియన్లు పోరాటం చేయడంతో సంస్థ కొంత మొత్తాన్ని మృతుల కుటుంబాలకు అందజేసిందని సిబ్బంది చెబుతున్నారు. ఇదే విషయమై పలుమార్లు పోలీసులు, కమిషనర్లు, రవాణాశాఖ అధికారులకు వినతిపత్రాలు అందించినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని 104 సిబ్బంది ఆరోపిస్తున్నారు. అందుచేతనే ఈ నెల 17వ తేదీ నుంచి 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నిరవధిక సమ్మెను చేపడుతున్నారు. లేనిమాట వాస్తవమే జిల్లాలోని 104 వాహనాలకు ఎఫ్‌సీ, ఇన్సూరెన్స్ లేని మాట వాస్తవమే. కారణం వాహనాలు ప్రభుత్వం పేరుతో ఉన్నాయి. యునైటెడ్ ఆంధ్రాలో కొన్నా వాహనాలు కావడంతో తెలంగాణ నుంచి వీటికి ఎన్వోసి రావలసి ఉంది. బహుశా వారంలో వీటికి ఎన్వోసీ వచ్చే అవకాశం ఉంది. ఎన్వోసీ రాగానే ఫిట్నెస్ వస్తుంది. సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ వాహనాలను గ్రామాలకు పంపుతున్నాం. సేవలు ఎక్కడా నిలిచిపోలేదు. – ఎం.వి.సత్యనారాయణ, 104 జిల్లా మేనేజర్ ఉద్యోగుల ప్రాణాలకు భద్రత ఏదీ 104 వాహనాలకు ఆర్సీలు, ఎఫ్ఏసీ, ఇన్సూరెన్స్‌లు లేకుండా రోడ్లపై తిప్పుతున్నారు. అవి ప్రమాదాలకు గురై ఉద్యోగుల నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వాహనాలకు బీమా లేక బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేకుండా ఉంది. కనీసం ఉద్యోగస్తులకు భద్రత లేకుండా ఉంది. ప్రభుత్వం స్పందించాలి. త్వరితగతిన సమస్యను పరిష్కరించాలి. –పి.విజయ్, 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
ప్రాథమిక ఆరోగ్య సేవలన్నీ ఒకేచోట
- త్వరలో ఈహెచ్ఎస్ ఓపీ ప్రారంభం - ఖైరతాబాద్ ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు - పైలట్ ప్రాజెక్ట్‌గా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ ఓపీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు ఓ శుభవార్త. జ్వరం, దగ్గు, తలనొప్పి, కడుపునొప్పి వంటి సాధారణ సమస్యలతోపాటు బీపీ, షుగర్, గుండెపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఈ వర్గాల రోగులకు రెగ్యులర్ హెల్త్‌చెకప్‌లు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చే సింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఖైరతాబాద్ ఏరియా ఆస్పత్రిలోని రెండో ఫ్లోర్లో అధునాతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) ఓపీ సేవలను డిసెంబర్ చివరినాటికల్లా అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అల్లోపతి వైద్యంతోపాటు ఆయూస్, ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్య సేవలను కూడా ఓపీలో అందిస్తారు. దంత వైద్యునితోపాటు మెడికల్, సర్జికల్, పీడియాట్రిక్, గైనిక్ నిపుణులు అందుబాటులో ఉంటారు. వాక్సినేషన్ ప్రక్రియ, ఫ్యామిలీ ప్లానింగ్ చికిత్సలు కూడా చేస్తారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా రక్త, మూత్ర పరీక్షలతోపాటు అల్ట్రా సౌండ్, ఎక్స్‌రే, డార్క్‌రూమ్, ఈసీజీ, క్లినికల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. హెచ్ఐవీ బాధితుల కోసం ఐసీటీసీ సెంటర్‌తోపాటు కౌన్సిలర్‌ను కూడా నియమించారు. ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందడం లేదు. అనివార్య పరిస్థితుల్లో ఓపీకి డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందాల్సి వస్తోంది. ఈ అంశంపై ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆరోగ్య శ్రీ తరహాలోనే ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ రోగులకు ప్రత్యేక ఓపీ సేవలను అందుబాటు లోకి తీసుకురావాలని భావించింది. ఆ మేరకు ఆరోగ్యశ్రీ ఈహెచ్ ఎస్ సీఈవో పద్మ నేతృత్వంలో ఖైరతాబాద్ ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సహా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సభ్యుడు మధుసూదన్‌లు ఓపీ కేంద్రానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. -
అపోలోకు అర్బన్‌హెల్త్ సెంటర్లు
– టెలీనన్సల్టెన్సీతో స్పెషాలిటీ వైద్యం – అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కర్నూలు(హాస్పిటల్): అర్బన్‌హెల్త్ సెంటర్లు ప్రముఖ కార్పొరేట్ సంస్థ అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం చేతికి దక్కాయి. వీటిని అక్టోబర్ 2 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోణహన్ను అపోలో ప్రతినిధులు కలిశారు. జిల్లావ్యాప్తంగా 20 అర్బన్‌హెల్త్ సెంటర్లు పట్టణాల్లోని మురికివాడల్లో పేదలకు ఉచితంగా ప్రాథమిక వైద్యసేవలు అందిస్తూ వచ్చాయి. ఇప్పటి వరకు వీటిని స్వచ్ఛంద సంస్థలు నిర్వహించేవి. ఈ సంస్థల నుంచి రెండు నెలల క్రితం వైద్య ఆరోగ్యశాఖ అర్బన్‌హెల్త్ సెంటర్లను స్వాధీనం చేసుకుంది. వీటి నిర్వహణ సరిగ్గా లేదన్న కారణం చూపి తెలుగుదేశం ప్రభుత్వం అపోలో హాస్పిటల్స్ యాజమాన్యానికి అప్పగించింది. ఇకపై అర్బన్‌హెల్త్ సెంటర్లను అర్బన్ పీహెచ్‌సీలుగా పరిగణిస్తారు. ఇందులో పలు రకాల వ్యాధినిర్దారణ పరీక్షలు చేస్తారు. అవసరమైతే స్పెషాలిటి వైద్యుల(అపోలో వైద్యులు)తో అర్బన్పీహెచ్సీలో ఉన్న వైద్యులు టెలి కన్సల్టేషన్ విధానంలో మాట్లాడి చికిత్స అందిస్తారు. ఈ ఆసుపత్రికి వచ్చిన రోగి హెల్త్ ప్రొఫైల్‌ను ఆధార్‌నెంబర్ ద్వారా లింక్ చేసి కంప్యూటరైజ్ చేస్తారు. తర్వాత సదరు రోగి ఎప్పుడు వచ్చినా ఆధార్ నెంబర్ ఆధారంగా వ్యాధి వివరాలు తీసి వైద్యం అందించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి శుక్రవారం అపోలో హాస్పిటల్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ అందించే సేవల గురించి వారు చర్చించినట్లు సమాచారం. -
విషజ్వరాలను పట్టించుకోని సర్కార్
ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్యసేవలందించాలి మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కాళేశ్వరం: మంథని డివిజన్లో విషజ్వరాలతో ప్రజలు మృతి చెందుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో విఫలమైందని టీపీసీసీ ఉపాద్యక్షుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాళేశ్వరంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. విషజ్వరాలబారిన పడిన నిరుపేదలకు ఆరోగ్యశ్రీకార్డు కింద వైద్యసేవలందించాలన్నారు. బెగులూర్ గ్రామంలో విషజ్వరాలతో ఐదుగురు మృతి చెందినా ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి చలనం లేదన్నారు. మహదేవపూర్ మండలంలో విషజ్వరాలతో 12మంది వరకు మృతిచెందినట్లు తెలిపారు. ఈ విషయంలో జిల్లా మంత్రులు, కలెక్టర్ పట్టించుకోకపోవడం బాధాకర మన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను నియమించి ప్రాథమిక చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. విషజ్వరాలు ప్రబలుతున్న గ్రామాల్లో ప్రభుత్వం వైద్య బృందాలను ఏర్పాటుచేసి వ్యాధులు నయమయ్యేవరకు పర్యవేక్షించాలని కోరారు. మృతిచెందిన కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. సమావేశంలో మహదేవపూర్ సర్పంచ్ కోటరాజబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జవ్వాజీ తిరుపతి, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు విలాస్‌రావు, కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు తిరుపతిరెడ్డి,సమ్మయ్య పాల్గొన్నారు. -
ఆరోగ్య సేవలకు రూ.1,400 కోట్లు
కాకినాడ : జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా ఈ ఏడాది వివిధ ఆరోగ్య సేవల విస్తరణ కోసం రూ.1,400 కోట్లు మంజూరయ్యాయని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కేవీ సత్యనారాయణ వెల్లడించారు. వీటి ద్వారా ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని కోరారు. గురువారం కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. నివేదికలన్నీ ఆన్లైన్లోనే సమర్పించాలని, వైద్య సేవలకు సంబంధించి, కోర్ డ్యాష్‌బోర్డులో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని ఆదేశించారు. ఎంఎంఆర్, ఐఎంఆర్ మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్ఎం, పేరా మెడికల్ స్టాఫ్ నుంచి సమాచారాన్ని సేకరించాలన్నారు. నూరు శాతం వ్యాక్సినేషన్ చేయాలని, ప్రసుతి మరణాలపై సమీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో వైద్యాధికారులు పర్యటించి, తనిఖీలు నిర్వహించాలని, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇమ్యూనైజేషన్ అమలు జరిగేలా చూడాలని చెప్పారు. పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు ఉండాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు నిరంతరాయంగా ఉండాలని, అప్పుడే ఆస్పత్రి ప్రసవాలు పెరుగుతాయని కమిషనర్ తెలిపారు. వైద్యులు వారి వృత్తికి న్యాయం చేసేలా కృషి చేయాలని సూచించారు. ఎన్టీఆర్ వైద్య పరీక్షలకు సంబంధించి ఏ రోజు రిపోర్టులు, అదేరోజు ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖలో అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను మెరుగుపర్చవలసిన అవసరం ఉందని చెప్పారు. చింతూరులో వైద్య సిబ్బంది కొరత ఉందని, పోస్టులు భర్తీ చేయాలని కమిషనర్‌ను కోరారు. ఆల్ట్రా సౌండ్ మెషీన్లు ఆయా ఆస్పత్రుల్లో రెండు రోజుల్లో ఇన్స్టలేషన్ చేయాలని కలెక్టర్ సూచించారు. కొత్తగా చేపట్టిన అన్ని పైలట్ ప్రాజెక్టులను ప్రజల్లో తీసుకు వెళతామని, కోర్ డ్యాష్ బోర్డుల్లో నివేదికలు పంపేలా చర్యలు చేపడతామన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎన్.ఉమాసుందరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటబుద్ధ, ఏడీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.పవన్‌కుమార్, రాజమండ్రి డీసీహెచ్ఎస్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.