మృత్యు శకటాలు | 104 Mobile Health Service Vehicles No Body Fitness | Sakshi
Sakshi News home page

మృత్యు శకటాలు

Published Sun, Apr 22 2018 11:02 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

104 Mobile Health Service Vehicles No Body Fitness - Sakshi

జిల్లాలో ఫిట్‌నెస్‌లు లేకుండా తిరుగుతున్న 104 వాహనం

ప్రత్తిపాడు : అది విజయనగరం జిల్లాలోని నారాయణపురం గ్రామం. ఎప్పటిలానే ఈ నెల కూడా ఆ ఊరికి 104 వాహనం వచ్చింది. ఏ పెద్దమ్మా బాగున్నావా.. ఏంది తాతా ఆరోగ్యం ఎలా ఉంది.. అంటూ పలకరిస్తూ స్టాఫ్‌ నర్సుతో పాటు తోటి సిబ్బంది చంద్రన్న సంచార చికిత్స వాహనం నుంచి కిందకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వర్తించారు. తిరిగి బొబ్బిలి సీహెచ్‌సీకి తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యలో మిర్తివలస వద్ద మృత్యువు కాపు కాసింది. ఫిట్‌నెస్, బీమా లేని 104 వాహనం ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.

అంతే వాహనం నడుపుతున్న పైలట్‌ సిల్ల మోహన్‌రావు, నిండు నెలల గర్భిణి స్టాఫ్‌ నర్సు సంతోషిమారిలు ఆ దుర్ఘటనలో దుర్మరణం చెందారు. ఇది ఈనెల 14వ తేదీన విజయనగరం జిల్లా మిర్తివలస వద్ద జరిగిన ప్రమాదం. వాస్తవానికి ఇది అక్షరాలా ప్రమాదమే. కానీ ప్రమాదమే కదా అని తేలిగ్గా తీసుకుందామా.. అంటే ఆ ప్రమాదం వెనుక ఆయా శాఖల పెను నిర్లక్ష్యం దాగి ఉంది. కారణం ప్రభుత్వం తిప్పుతున్న ఈ 104 వాహనాలకు ఫిట్‌నెస్‌ గానీ ఇన్సూరెన్స్‌ గానీ లేకపోవడమే. ఇప్పుడు ఇదే 104 ఉద్యోగులను ఆందోళన బాట పట్టేలా చేసింది. చంద్రన్న మా ప్రాణాలకు రక్షణ ఏదన్నా.. అంటూ ఉద్యోగులు నిరవధిక సమ్మెబాట పట్టారు.

బాధ్యులు ఎవ్వరు.. 
వాహనానికి సంబంధించి ఏ చిన్న కాగితం లేకపోయినా ఎక్కడికక్కడ నిలబెట్టి రోడ్డుపైనే ముక్కుపిండి జరిమానాలు విధించే అధికారులు, ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారు.  నిబంధనలతో ఏ మాత్రం పనిలేకుండా వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా ఇటు రవాణాశాఖ గానీ, అటు పోలీస్‌ శాఖకు గానీ చర్యలకు ఉపక్రమించడం లేదు. జిల్లాలోని ఐదు డివిజన్లలో 24 చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క వాహనానికి రెండేళ్లుగా బీమా గానీ, ఫిట్‌నెస్‌ గానీ లేదు. అయినా సంబంధిత శాఖల అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. 

ఉన్నపళంగా రోడ్డున పడాల్సిన దుస్థితి.. 
పొరబాటున ఈ వాహనాల్లో ప్రయాణించే సమయంలో ఏదైనా ప్రమాదం సంభవించి సిబ్బంది మరణిస్తే వారికి ఎలాంటి ఆర్థిక సాయమూ అందే పరిస్థితి లేదు. అదే జరిగితే ఉద్యోగుల కుటుంబాలు ఉన్నపళంగా రోడ్డున పడాల్సిన దుస్థితి చోటు చేసుకుంటుంది. కారణం బీమా లేని వాహనంలో ప్రయాణించడమే. విజయనగరం జిల్లాలోనూ ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో యూనియన్లు పోరాటం చేయడంతో సంస్థ కొంత మొత్తాన్ని మృతుల కుటుంబాలకు అందజేసిందని సిబ్బంది చెబుతున్నారు. ఇదే విషయమై పలుమార్లు పోలీసులు, కమిషనర్లు, రవాణాశాఖ అధికారులకు వినతిపత్రాలు అందించినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని 104 సిబ్బంది ఆరోపిస్తున్నారు. అందుచేతనే ఈ నెల 17వ తేదీ నుంచి 104 కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ నిరవధిక సమ్మెను           చేపడుతున్నారు.

లేనిమాట వాస్తవమే 
జిల్లాలోని 104 వాహనాలకు ఎఫ్‌సీ, ఇన్సూరెన్స్‌ లేని మాట వాస్తవమే. కారణం వాహనాలు ప్రభుత్వం పేరుతో ఉన్నాయి. యునైటెడ్‌ ఆంధ్రాలో కొన్నా వాహనాలు కావడంతో తెలంగాణ నుంచి వీటికి ఎన్‌వోసి రావలసి ఉంది. బహుశా వారంలో వీటికి ఎన్‌వోసీ వచ్చే అవకాశం ఉంది. ఎన్‌వోసీ రాగానే ఫిట్‌నెస్‌ వస్తుంది. సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ వాహనాలను గ్రామాలకు పంపుతున్నాం. సేవలు ఎక్కడా నిలిచిపోలేదు. 
– ఎం.వి.సత్యనారాయణ, 104 జిల్లా మేనేజర్‌

ఉద్యోగుల ప్రాణాలకు భద్రత ఏదీ
104 వాహనాలకు ఆర్‌సీలు, ఎఫ్‌ఏసీ, ఇన్సూరెన్స్‌లు లేకుండా రోడ్లపై తిప్పుతున్నారు. అవి ప్రమాదాలకు గురై ఉద్యోగుల నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వాహనాలకు బీమా లేక బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్‌ వచ్చే అవకాశం లేకుండా ఉంది. కనీసం ఉద్యోగస్తులకు భద్రత లేకుండా ఉంది. ప్రభుత్వం స్పందించాలి. త్వరితగతిన సమస్యను పరిష్కరించాలి. 
–పి.విజయ్, 104 కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement