కాకినాడ : జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా ఈ ఏడాది వివిధ ఆరోగ్య సేవల విస్తరణ కోసం రూ.1,400 కోట్లు మంజూరయ్యాయని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కేవీ సత్యనారాయణ వెల్లడించారు. వీటి ద్వారా ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని కోరారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో ఆయన సమీక్షించారు.
నివేదికలన్నీ ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని, వైద్య సేవలకు సంబంధించి, కోర్ డ్యాష్‌బోర్డులో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని ఆదేశించారు. ఎంఎంఆర్, ఐఎంఆర్ మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్‌ఎం, పేరా మెడికల్ స్టాఫ్ నుంచి సమాచారాన్ని సేకరించాలన్నారు. నూరు శాతం వ్యాక్సినేషన్ చేయాలని, ప్రసుతి మరణాలపై సమీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో వైద్యాధికారులు పర్యటించి, తనిఖీలు నిర్వహించాలని, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇమ్యూనైజేషన్ అమలు జరిగేలా చూడాలని చెప్పారు.
పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు ఉండాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు నిరంతరాయంగా ఉండాలని, అప్పుడే ఆస్పత్రి ప్రసవాలు పెరుగుతాయని కమిషనర్ తెలిపారు. వైద్యులు వారి వృత్తికి న్యాయం చేసేలా కృషి చేయాలని సూచించారు. ఎన్టీఆర్ వైద్య పరీక్షలకు సంబంధించి ఏ రోజు రిపోర్టులు, అదేరోజు ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖలో అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను మెరుగుపర్చవలసిన అవసరం ఉందని చెప్పారు.
చింతూరులో వైద్య సిబ్బంది కొరత ఉందని, పోస్టులు భర్తీ చేయాలని కమిషనర్‌ను కోరారు. ఆల్ట్రా సౌండ్ మెషీన్లు ఆయా ఆస్పత్రుల్లో రెండు రోజుల్లో ఇన్‌స్టలేషన్ చేయాలని కలెక్టర్ సూచించారు. కొత్తగా చేపట్టిన అన్ని పైలట్ ప్రాజెక్టులను ప్రజల్లో తీసుకు వెళతామని, కోర్ డ్యాష్ బోర్డుల్లో నివేదికలు పంపేలా చర్యలు చేపడతామన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్.ఉమాసుందరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటబుద్ధ, ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.పవన్‌కుమార్, రాజమండ్రి డీసీహెచ్‌ఎస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, వైద్యాధికారులు
పాల్గొన్నారు.
ఆరోగ్య సేవలకు రూ.1,400 కోట్లు
Published Fri, Apr 22 2016 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM
Advertisement
Advertisement