National Rural Health Mission
-
ఆరోగ్యం..ఆయుష్మాన్!
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.61,398 కోట్లను కేటాయించారు. అందులో రూ.6,400 కోట్లను ఆయుష్మాన్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్)కు ప్రత్యేకించారు. గత ఏడాది కన్నా ఈసారి ఆరోగ్య రంగానికి 16 శాతం అధికంగా కేటాయింపులు జరపడం గమనార్హం. ఇతర విశేషాలు.. ► జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం)లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్‌సెంటర్ల ఏర్పాటుకు రూ.250 కోట్ల కేటాయింపు. ► జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల ఏర్పాటు నిమిత్తం రూ.1,350.01 కోట్ల కేటాయింపు. ► ఈ పథకం కింద 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఉప ఆరోగ్య కేంద్రాల్ని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతారు. రక్తపోటు, డయాబెటిస్, కేన్సర్, వృద్ధాప్య సంబంధ వ్యాధులకు ఈ కేంద్రాల్లో చికిత్స అందిస్తారు. ► జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) పథకానికి రూ.31,745 కోట్లు కేటాయించారు. ► ఎన్హెచ్ఎంలో అంతర్భాగమైన రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన కు రూ. 156 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం గతేడాది కన్నా రూ.1,844 కోట్లు తక్కువ కావడం గమనార్హం. ► ఎయిడ్స్, అసురక్షిత లైంగిక వ్యాధుల నివారణ కార్యక్రమానికి రూ.2,500 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం రూ.400 కోట్లు అధికం. ► ఎయిమ్స్‌కు రూ.3,599.65 కోట్లు కేటాయించారు. ► జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి కేటాయింపులను రూ.50 కోట్ల నుంచి రూ.40 కోట్లకు తగ్గించారు. ► కేన్సర్, డయాబెటిస్, హృద్రోగ సంబంధ వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమానికి కేటాయింపులను రూ.295 కోట్ల నుంచి రూ.175 కోట్లకు తగ్గించారు. ► టెర్షరీ కేర్(ప్రత్యేక సంరక్షణ, చికిత్సలు) కార్యక్రమాలకు కేటాయింపులను రూ.750 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గించారు. ► నర్సింగ్ సేవల ఆధునీకరణకు రూ.64 కోట్లు, ఫార్మసీ స్కూల్స్, కళాశాలల బలోపేతానికి రూ.5 కోట్లు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలల(పీజీ సీట్లు) ఆధునీకరణకు రూ.800 కోట్లు కేటాయించారు. ► ప్రభుత్వ మెడికల్ కళాశాలలు(డిగ్రీ సీట్లు), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి రూ.1,361 కోట్ల కేటాయింపు. కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ.2 వేల కోట్లు, రాష్ట్రాల్లో ప్రభుత్వ పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించారు. ‘ఆయుష్మాన్’తో 3 వేల కోట్లు ఆదా: పీయూష్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటిదాకా ఉచితంగా వైద్యం చేయించుకున్న సుమారు 10 లక్షల మంది పేదలు రూ.3 వేల కోట్లను ఆదాచేసుకున్నారని పీయూష్ గోయల్ చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రభుత్వం చౌక ధరలకే ఔషధాల్ని అందిస్తోందని, గుండెలో అమర్చే స్టెంట్లు, కృత్రిమ మోకాలి చిప్పల ధరల తగ్గింపుతో లక్షలాది మంది పేదలు ప్రయోజనం పొందారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయని, అందులో 14 ఆసుపత్రుల్ని ఎన్డీయే ప్రభుత్వమే ప్రారంభించిందని అన్నారు. పేదలకు ఆరోగ్య సేవల్ని చేరువచేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఉటంకిస్తూ..2030 నాటికి ఎలాంటి అవాంతరాలు లేని సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసేలా పనిచేస్తున్నామని వెల్లడించారు. అలాంటి ఆరోగ్య భారత నిర్మాణంలో మహిళలనూ సమాన భాగస్వాముల్ని చేస్తామని తెలిపారు. దీర్ఘాయుష్మాన్ భవ... ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం నోచుకోని పల్లెలున్న భారతమిది. ఇక్కడ నిరుపేదకు సుస్తీ చేస్తే చావే శరణ్యం. కాబట్టి కార్పొరేట్ వైద్యాన్ని సాకారం చేసే సార్వత్రిక ఆరోగ్య బీమానిచ్చే ఏ పథకాన్నయినా దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించాల్సిందే. కాకపోతే గత బడ్జెట్లో ప్రకటించి ఊరుకున్నారు. ప్రయోగాలకే పరిమితమయ్యారు. ఈ సారి ఎన్నికలొస్తున్నాయి కనక పూర్తి స్థాయి కేటాయింపులు చేస్తూ... వెల్నెస్ సెంటర్ల నుంచి ఎయిమ్స్ దాకా పూర్తిస్థాయి వైద్య సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చే విజన్‌నూ ఆవిష్కరించారు. ఏ ప్రభుత్వమున్నా ఆ విజన్ సాకారం కావాలన్నదే నిరుపేదల ఆకాంక్ష. ఎందుకంటే వారికి కావాల్సింది వైద్యం మరి. -
‘ఆరోగ్యానికి’ అనారోగ్యం!
సాక్షి, హైదరాబాద్: ‘ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు లేవు. సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టలేదు. తల్లీబిడ్డల సంరక్షణ అంశాలను అమలు చేయడంలేదు. బాలింతలు, శిశువులు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద ఎన్ఆర్హెచ్ఎం (జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్) కింద రాష్ట్రంలో అమలు చేస్తున్న సంతాన సాఫల్యత, శిశు సంరక్షణ కార్యక్రమం సంతృప్తికరంగా లేదు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు.. భారత ప్రజారోగ్య ప్రమాణాలను (ఐపీహెచ్ఎస్) అందుకోలేదు’అని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వైద్య సేవలు, కుటుంబ సంక్షేమ పథకాల నిర్వహణ సరిగా లేవంది. కేంద్ర నిధులను ఖర్చు చేయడంలోనూ కుటుంబ సంక్షేమ శాఖ విఫలమవుతోందని చెప్పింది. కాగ్ పేర్కొన్న అంశాలివీ.. మందుల పంపిణీ: పేదలకు అత్యవసర మందులను ఉచితంగా పంపిణీ చేయాల్సిన వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉచిత అత్యవసర మందుల కోసం 2014–17 మధ్య రూ.83.99 కోట్లు కేటాయిస్తే రూ.10.11 కోట్లే ఖర్చు చేసింది. ఏ ఏడాది నిధులను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. నిధుల వినియోగం 2012–14 వరకు కేవలం 38 నుంచి 44 శాతం, 2014–17 వరకు 39 నుంచి 46 శాతం ఉంది. ప్రసూతి వైద్యం: ప్రసూతి వైద్యం నిధుల వినియోగంలో కొరత 2014–17 మధ్య 31 నుంచి 50 శాతం వరకు ఉంది. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు 2014–17 మధ్యలో ఒక్క ఏడాది కూడా 26 శాతం మించి ఖర్చు చేయలేదు. వైద్య సేవల్లో నాణ్యతకు కేటాయించిన మొత్తాలను వినియోగించలేదు. రాష్ట్ర ఆరోగ్య సంఘం దగ్గర రూ.3.12 కోట్లు (99 శాతం) ఖర్చు కాకుండా మిగిలిపోయాయి. ప్రసవాలు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు తగ్గాయి. 2013–14లో 69 శాతం ఉంటే 2016–17లో 42 శాతానికి తగ్గిపోయాయి. ఇదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులు 31 శాతం నుంచి 58 శాతానికి పెరిగాయి. తెలంగాణలోనే శస్త్ర చికిత్స ద్వారా కాన్పులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తం ప్రసవాల్లో 45 శాతం శస్త్ర చికిత్స ద్వారానే జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇది 67 శాతం వరకు ఉంది. జనన నిష్పత్తి: 2012–13లో వెయ్యి మగ శిశువుల జననాలకు, 925 మంది ఆడపిల్లల జననాలు నమోదయ్యేవి. 2015–16లో అది 915కు తగ్గిపోయింది. 2016–17లో పరిస్థితి కొంచెం మెరుగుపడి 959కి పెరిగింది. పిల్లలకు వ్యాధి నిరోధక వైద్యం: ఏడాది లోపు పిల్లలకు వ్యాధి నిరోధక వైద్యం విషయంలో రాష్ట్రం 100 శాతం లక్ష్యాలను సాధించింది. అయితే మిషన్ ఇంద్రధనుష్ కింద డ్రాపౌట్ పిల్లలు కూడా కలిపి లెక్కించారు. 19 పీహెచ్‌సీల్లో సిబ్బంది లేరు: కాగ్ బృందం మూడు జిల్లాల్లోని ఆస్పత్రుల మౌలిక వసతుల పరిస్థితిని తనిఖీ చేసింది. 13వ ఆర్థిక సంఘం గ్రాంటు, ఎన్ఆర్హెచ్ఎం నిధులతో 2012–17 మధ్య నిర్మించిన 21 పీహెచ్‌సీలను పరిశీలిస్తే.. 19 చోట్ల సిబ్బంది లేరు, పరికరాలు లేవు. సబ్సెంటర్లలో పురుష సహాయకుల కొరత 100 శాతం, పీహెచ్సీలో సిబ్బంది కొరత 43 శాతం ఉంది. తనిఖీ చేసిన వైద్యశాలల్లో సమాచార సాంకేతిక వ్యవస్థ, నెట్వర్కింగ్, సిబ్బంది తగినంత లేరు. దీని వల్ల ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ (హెచ్ఎంఐఎస్) పోర్టల్‌కు సమాచారం సకాలంలో అందజేయడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. నాణ్యత సమితులు: వైద్య సేవల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రాష్ట్ర నాణ్యత హామీ సమితి ఏర్పాటైనా.. తగినన్ని సమావేశాలు నిర్వహించలేదు. జిల్లా నాణ్యత సమితులు ఇంకా ఏర్పాటు కాలేదు. దీంతో వైద్య సేవల పరిస్థితిపై అంచనాలు తెలియడంలేదు. సమీక్షలు: రాష్ట్రంలో ప్రసూతి మరణాల సమీక్ష (ఎండీఆర్), శిశు మరణాల సమీక్ష (ఐడీఆర్) నిర్వహించడం లేదు. తల్లీపిల్లల మరణాలకు దారితీసేç పరిస్థితులను గుర్తించి ఎన్ఆర్హెచ్ఎం కింద చర్యలు చేపట్టడంలేదు. ప్రసూతి మరణాల రేటు: ప్రసూతి మరణాల రేటు, ఫెర్టిలిటీ రేటు తగిన స్థాయిలోనే ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ (ప్రతి లక్ష మందికి 152), ఖమ్మం (99), మహబూబ్‌నగర్ (98) జిల్లాల్లో ప్రసూతి మరణాల నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఇక రాష్ట్ర సగటు 92గా ఉంది. 2015–17లో శిశు మరణాల రేటు (వెయ్యి జననాలకు) 28 ఉంది. ఎన్ఆర్హెచ్ఎం నిర్దేశించిన నిష్పత్తి (25) కంటే ఇది ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క లక్ష్యాన్నీ సాధించలేదు.. 2012–13 నుంచి 2016–17 వరకు రికార్డులను పరిశీలించిన కాగ్ అన్ని అంశాల్లోనూ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఎన్ఆర్హెచ్ఎం 2005 ఏప్రిల్‌లో మొదలు కాగా, ఆ పథకం కింద సంతాన సాఫల్యత, పిల్లల ఆరోగ్యం, గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ, నవజాత శిశువుల రక్షణ, వ్యాధి నిరోధక చికిత్సలు, పోషకాహార లోపాల నివారణ చర్యలు అమలు చేయాలి. కుటుంబ నియంత్రణ, రక్తహీనతకు చికిత్స అందించాలి. సామాజిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ట పరిచి అత్యవసర ప్రసూతి వైద్యం అందించాలని ఎన్ఆర్హెచ్ఎం విధివిధానాల్లో స్పష్టం చేశారు. ప్రసూతి మరణాల రేటును 1,00,000:100 కన్నా దిగువకు తగ్గించాలని, పసిపిల్లల మరణాల రేటును 1,000:25కు తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే వీటిలో ఏ లక్ష్యాన్నీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సాధించలేకపోయింది. -
ఆయుష్ ఉద్యోగులకు జగన్ భరోసా
సాక్షి, అమరావతి బ్యూరో : ఆయుష్ శాఖలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆయుష్ పారా మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ఆర్అండ్బీ విశ్రాంతి గృహం వద్ద జగన్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఆర్ఎం) పథకం కింద ఆయుష్ వైద్యశాలల్లో రెగ్యులర్ డాక్టర్లు లేరన్న కారణంతో 800 మంది పారామెడికల్ ఉద్యోగులను తొలగించారని, ప్రభుత్వం తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం గెస్ట్‌హౌస్ నుంచి అసెంబ్లీకి బయల్దేరిన వైఎస్ జగన్ పెనుమాక, కృష్ణాయపాలెం గ్రామాల్లో తన రాక కోసం వేసిచూస్తున్న వృద్ధులను, మహిళలను, విద్యార్థినులను కలిసి ఆప్యాయంగా పలకరించారు. విద్యార్థులకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. వృద్ధుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ నుంచి సాయంత్రం గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నాక.. అక్కడ జగన్ కోసం వేచి ఉన్న యువతను పలకరించి సెల్ఫీలు దిగారు. అనంతరం ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన బిజీగా గడిపారు. -
లెక్కల్లేవ్!
♦ ఆస్పత్రి అభివృద్ధి నిధుల్లో అవకతవకలు ♦ జననీ సురక్ష యోజనలోనూ గందరగోళం ♦ ఖర్చు చేసిన నిధులకు లెక్క చూపని వైనం ♦ వివరాలు సమర్పించని పలు ఆస్పత్రులు ♦ తలపట్టుకుంటున్న వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలో 61 ఆస్పత్రులకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, జననీ సురక్ష యోజన కింద రూ.1.75 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను ఏఏ పనులకు ఖర్చు చేశారన్న దానిపై 29 ఆస్పత్రులు నివేదికలు ఇవ్వలేదు. ఈ నెలాఖరులోపు ఖర్చుచేసిన వాటిపై లెక్కలు సమర్పించకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన నిధులకు కేంద్రం కోతపెట్టే అవకాశం ఉంది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్)కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి నిధుల్లో అక్రమాలు నెలకొన్నాయా? వైద్యశాలలో సౌకర్యాల కల్పన.. సామగ్రి కొనుగోలు.. మరమ్మతులకు వెచ్చించాల్సిన డబ్బులు దారిమళ్లాయా? ప్రస్తుతం జిల్లాలోని పలు ఆస్పత్రుల తీరు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. యేటా ప్రభుత్వం ఇచ్చే నిధులకు సంబంధించి వినియోగ పత్రాలను క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన ఆస్పత్రి యాజమాన్యాలు.. ఈ ఏడాది ఇప్పటికీ వాటిని సమర్పించలేదు. దీంతో అవకతవకలు జరిగాయనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. అంతేకాకుండా ప్రాంతీయ, క్లస్టర్ ఆస్పత్రులు 12, జిల్లా ఆస్పత్రితో కలిపి 61 వైద్యశాలలున్నాయి. వీటికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద యేటా రూ.70లక్షలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా గతేడాది జనవరిలో ఈ నిధులను ఆయా ఆస్పత్రి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. అంతే కాకుండా జననీ సురక్ష యోజన పథకం కింద రూ.1.05 కోట్లు కూడా ఈ ఆస్పత్రుల ఖాతాల్లో జమచేసింది. అయితే వీటికి సంబంధించి మార్చి 31 నాటికి తప్పనిసరిగా వినియోగ పత్రాల్ని సమర్పించాల్సి ఉంది. కానీ ఏప్రిల్ నెల ముగుస్తున్నా పలు ఆస్పత్రి కమిటీలు ఈ లెక్కల్ని బయటకు వెల్లడించకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. లెక్కాపత్రం లేని 29 ఆస్పత్రులు.. వివిధ పద్దుల కింద ప్రభుత్వం ఇచ్చిన నిధుల వినియోగాన్ని పైసాతో సహా నమోదు చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జిల్లాలో 61 ఆస్పత్రులకు రూ.1.75 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా.. వీటి వినియోగాన్ని లిఖిత పూర్వకంగా వివరించడంలో 29 ఆస్పత్రులు జాప్యం చేశాయి. ఈ నెల పదో తేదీన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కీలక సమావేశానికి సైతం ఈ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్లు గైర్హాజరు కావడం గమనార్హం. వినియోగ పత్రాలను సమర్పించాల్సిందిగా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశించినప్పటికీ.. స్పందన కొరవడడంతో ఆయా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈనెలాఖర్లోపు వినియోగ పత్రాలను సమర్పించకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన నిధులకు కేంద్రం కోతపెట్టే అవకాశం ఉంది. ఈనేపధ్యంలో ఉన్నతాధికారులు పీహెచ్సీ డాక్టర్లపై ఒత్తిడి తెస్తుండగా.. వారు మాత్రం తాపీగా వ్యవహరించడంతో జిల్లా వైద్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
ఆరోగ్య సేవలకు రూ.1,400 కోట్లు
కాకినాడ : జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా ఈ ఏడాది వివిధ ఆరోగ్య సేవల విస్తరణ కోసం రూ.1,400 కోట్లు మంజూరయ్యాయని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కేవీ సత్యనారాయణ వెల్లడించారు. వీటి ద్వారా ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని కోరారు. గురువారం కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. నివేదికలన్నీ ఆన్లైన్లోనే సమర్పించాలని, వైద్య సేవలకు సంబంధించి, కోర్ డ్యాష్‌బోర్డులో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని ఆదేశించారు. ఎంఎంఆర్, ఐఎంఆర్ మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్ఎం, పేరా మెడికల్ స్టాఫ్ నుంచి సమాచారాన్ని సేకరించాలన్నారు. నూరు శాతం వ్యాక్సినేషన్ చేయాలని, ప్రసుతి మరణాలపై సమీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో వైద్యాధికారులు పర్యటించి, తనిఖీలు నిర్వహించాలని, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇమ్యూనైజేషన్ అమలు జరిగేలా చూడాలని చెప్పారు. పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు ఉండాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు నిరంతరాయంగా ఉండాలని, అప్పుడే ఆస్పత్రి ప్రసవాలు పెరుగుతాయని కమిషనర్ తెలిపారు. వైద్యులు వారి వృత్తికి న్యాయం చేసేలా కృషి చేయాలని సూచించారు. ఎన్టీఆర్ వైద్య పరీక్షలకు సంబంధించి ఏ రోజు రిపోర్టులు, అదేరోజు ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖలో అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను మెరుగుపర్చవలసిన అవసరం ఉందని చెప్పారు. చింతూరులో వైద్య సిబ్బంది కొరత ఉందని, పోస్టులు భర్తీ చేయాలని కమిషనర్‌ను కోరారు. ఆల్ట్రా సౌండ్ మెషీన్లు ఆయా ఆస్పత్రుల్లో రెండు రోజుల్లో ఇన్స్టలేషన్ చేయాలని కలెక్టర్ సూచించారు. కొత్తగా చేపట్టిన అన్ని పైలట్ ప్రాజెక్టులను ప్రజల్లో తీసుకు వెళతామని, కోర్ డ్యాష్ బోర్డుల్లో నివేదికలు పంపేలా చర్యలు చేపడతామన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎన్.ఉమాసుందరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటబుద్ధ, ఏడీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.పవన్‌కుమార్, రాజమండ్రి డీసీహెచ్ఎస్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
‘ఆశ’ నిరాశల మధ్య..
♦ పెండింగ్‌లో ఆశ కార్యకర్తల పారితోషికాల పెంపు ♦ అధికారుల ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం ♦ కేవలం రూ. 3 కోట్లు కేటాయించడానికి వెనుకాడుతున్న వైనం ♦ రెండు నెలలుగా కొనసాగుతున్న సమ్మె ♦ పల్లెల్లో రోగులకు తప్పని ఇక్కట్లు సాక్షి, హైదరాబాద్: ఆశ కార్యకర్తలపై సర్కారు కరుణ చూపడం లేదు. వారి సమ్మె ను విరమింపచేయాలని, వారికిచ్చే పారితోషికాలను 10% వరకు పెంచాలని ఉన్నతాధికారులు విన్నవించినా ప్రభుత్వ పెద్దల్లో కదలిక లేదు. పరిష్కారం చూపిస్తూ అధికారులు పంపిన ఫైలు కొన్నాళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఫలితంగా ఆశ కార్యకర్తల సమ్మె 2 నెలలుగా కొనసాగుతూనే ఉంది. సర్కారు తీరుపై వారు మండిపడుతున్నారు. పల్లెల్లో వైద్య సేవలకు ఆటంకం వ్యాధుల సీజన్లో దాదాపు 25 వేల మంది ఆశ వర్కర్లు సమ్మె చేస్తుండటంతో పల్లెల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. పదేళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) మార్గదర్శకాల ప్రకారం వీరిని నియమించారు. కుటుంబ నియంత్రణ, ఆసుపత్రిలో కాన్పు, ఇమ్యునైజేషన్ వంటి వాటితోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎయిడ్స్ రోగులకు అవసరమైన సేవలు చేస్తున్నారు. కుష్టు, టీబీ రోగులకు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి వ్యాధులు గుర్తిస్తున్నారు. ఇంత చేసినా వారికి నామమాత్రపు పారితోషికాలనే సర్కారు ఇస్తోంది. పనిని బట్టి ఒక్కో ఆశ వర్కర్‌కు నెలకు రూ.400 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే ఇస్తున్నారు. పారితోషికాలు కాకుండా కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నెల జీతం లేకుండా పనిని బట్టి పారితోషికం అంటూ తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనేది కార్యకర్తల ఆరోపణ. కానీ కనీస వేతనం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తోస్తోంది. ఇదిలావుంటే కొందరు వైద్యాధికారుల్లోనూ ఆశ కార్యకర్తల సేవలపై చిన్నచూపు నెలకొంది. ఆశ వర్కర్లు సమ్మె చేస్తే వచ్చే నష్టమేమీ లేదంటున్నారు. ‘‘మనం రోజూ ఉదయాన్నే టీ తాగుతాం. అలా అలవాటు పడిపోయాం. అలాంటిది అకస్మాత్తుగా టీ తాగకుంటే ఏమవుతుంది? అలాగే కొన్నాళ్లపాటు తాగకుండా ఉంటే అలవాటుగా మారుతుంది. అంతకుమించి ఏమీ కాదుగా. అలాగే ‘ఆశ’ల సమ్మెతో వచ్చే నష్టం కానీ... గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు జరిగే ఆటంకం కానీ ఏమీ లే దు’’ కీలక స్థాయిలో ఉన్న ఒక వైద్యాధికారి వ్యాఖ్యానించారంటే ఆశ వర్కర్ల సమస్యలపై కొందరు అధికారుల్లో ఉన్న చిన్నచూపు అర్థమవుతోంది. రూ. 3 కోట్లు కేటాయించలేరా? ఆశ వర్కర్లు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలోకి వస్తారు. తెలంగాణలో పనిచేసే ఆశ వర్కర్ల పారితోషికం, ఇతరత్రా ఖర్చుల కోసం ఎన్హెచ్ఎం రూ. 30 కోట్లు కేటాయిస్తోంది. అందులో 25 శాతం రాష్ట్రం వాటా. మిగిలిన 75 శాతం కేంద్రం తన వాటాగా భరిస్తుంది. ఆశ వర్కర్లు చేస్తున్న డిమాండ్ ప్రకారం వేతనాల పెంపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదని.. దీనిపై కేంద్రానికి విన్నవించామని చెబుతున్నారు. అయితే వేతనాల పెంపు కాకపోయినా కనీసం పారితోషికం పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. పారితోషికం పెంపు కోసం కేంద్రం ఇచ్చే నిధుల్లో 10 శాతం కేటాయిస్తే సరిపోతుందని.. ఆ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు కేటాయిస్తే చాలని వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం. కానీ ఆ ఫైలు ముందుకు కదలడం లేదు. కేవలం రూ. 3 కోట్లు చెల్లించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా అన్న విమర్శలు వస్తున్నాయి. -
‘ఆశ’ గోస చూడండి!
♦ ‘ఆశ’ వర్కర్ల పారితోషికంపై కేంద్రానికి నివేదన ♦ ఎంతోకొంత పెంచాలంటూ వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదన ♦ నెల రోజులుగా జరుగుతున్న సమ్మెకు తెరదించాలని నిర్ణయం ♦ నికర వేతనం పెంపు అసాధ్యమంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ‘ఆశ’ వర్కర్లు నెల రోజులుగా చేస్తున్న సమ్మెకు తెరదించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. వారి పారితోషికం పెంపు డిమాండ్‌ను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలోకి ఆశ వర్కర్లు వస్తారని... దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయన్న విమర్శలున్నాయి. సమ్మెను ఉధృతం చేసిన ఆశ వర్కర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి పెద్దఎత్తున అరెస్టులు చేసింది. అయినా సమ్మెను కొనసాగించేందుకే ఆశ వర్కర్లు సిద్ధమయ్యారు. వెట్టిచాకి రిలో వర్కర్లు దాదాపు 25 వేల మంది చేస్తున్న సమ్మెతో గ్రామాలు వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నాయి. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, విషజ్వరాలతో పల్లెలు గజగజ వణుకుతున్న తరుణంలో సమ్మె మరింత ఇబ్బందిగా మారింది. పారితోషికాలు కాకుండా కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నెల జీతం లేకుండా పనిని బట్టి పారితోషికం అంటూ తమను వెట్టిచాకిరీ చేయిస్తున్నారని వాపోతున్నారు. పదేళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ మార్గదర్శకాల ప్రకారం నియమితులైన వీరు.. కుటుంబ నియంత్రణ, ఆసుపత్రిలో కాన్పు, ఇమ్యునైజేషన్ వంటి వాటితోపాటు కేంద్ర కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు. అలాగే 104, 108, ఆరోగ్యశ్రీ పథకాలకు సహకరిస్తున్నారు. హెచ్ఐవీ రోగులకు సేవలు చేస్తున్నారు. కుష్ఠు, టీబీ రోగులకు మందుల పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజలకు వచ్చే వ్యాధులను గుర్తిస్తున్నారు. ఇంత చేసినా వారికి పనిని బట్టి నెలకు 400 నుంచి రూ. 2 వేల వరకే ఇస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలి కేంద్ర ప్రభుత్వ పథకం అయినందున పారితోషికం పెంచడం సాధ్యం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. తమిళనాడులో అసలు ఆశ వర్కర్లు లేరని, వీరి స్థానంలో ఏఎన్ఎంలే సేవలందిస్తున్నారని అంటున్నారు. ఏఎన్ఎంలు అయితే ప్రాథమిక చికిత్సలో శిక్షణ కలిగి ఉంటారని... ఆశ వర్కర్లు కేవలం ఇంటింటికి తిరిగి వ్యాధులను గుర్తించడం వరకే పరిమితమవుతారని అధికారులు చెబున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య సేవల్లోనే ఆశ వర్కర్లు పనిచేస్తున్నందున తెలంగాణ సర్కారే కనీస వేతనం పెంచాలని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిందేనని ఆమె అంటున్నారు. -
ఎన్ఆర్హెచ్ఎం నిధుల గోల్మాల్ !
రిమ్స్‌క్యాంపస్: జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్.ఆర్.హెచ్.ఎం) నిధులంటే చాలు కోట్లాది రూపాయలు కళ్ల ముందు కనిపిస్తాయి. మరి ఆ సొమ్ము ఖర్చు మన చేతుల్లో ఉండడంతోపాటు ఉన్నతాధికారుల అండ ఉంటే...ఇంకేముంది ఎచెక్కా కొల్లగొట్టడం ఖాయం. ఇదే ఆలోచన వైద్య ఆరోగ్యశాఖలోని కొంతమంది అధికారులకు కలిగింది. ఎన్.ఆర్.హెచ్.ఎం నిధుల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలే చెబుతున్నాయి. ఈ నిధులు సక్రమంగా సద్వినియోగం చేశారా అని తెలుసుకోవడం కోసం ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకూ జరిగిన స్టాటిట్యురీ టీమ్ ఆడిట్ కూడా అంతా మాయాజాలంగానే సాగినట్టు సమాచారం. చేయని ఆడిట్‌ను చేసినట్టు చూపేందుకు పీహెచ్‌సీకి రూ. 2,000 చొప్పున, అసలు ఆడిట్ చేయకుండా ఉండేందుకు పలు పీహెచ్‌సీలకు రూ. 2,500 చొప్పున వసూలు చేశారు. ప్రస్తుతం వైద్యశాఖలో దీనిపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటన్నింటికీ ఏటా ఎన్.ఆర్.హెచ్.ఎం నిధులు వివిధ రకాలుగా కోట్లాది రూపాయలు వస్తుంటాయి. హెచ్‌డీఎస్ నిధులు, ఎన్యూవల్ మెంటేనన్స్ గ్రాంట్ (ఏఎంజీ), ఆర్సీహెచ్-2 ఏఎన్ఎమ్ల వేతనాలు, డీఎంహెచ్‌వో కార్యాలయానికి మౌలిక వసతుల కల్పనకు, సబ్ సెంటరు అన్‌టైడ్ ఫండ్, శానిటేషన్ ఫండ్ ఇలా వివిధ రకాల నిధులు ఎన్.ఆర్.హెచ్.ఎం కింద విడుదల అవుతుంటారుు. ఈ ఏడాది కూడా సుమారు రూ. ఐదు కోట్లు వరకు నిధులు వచ్చినట్టు సమాచారం. అయితే ఈ నిధుల ఖర్చులో కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్టు తెలిసింది. అన్నీ నకిలీ బిల్లులు, నకిలీ ఆడిట్‌తోనే ఈ మాయజాలం సాగినట్టు సమాచారం. ఆర్సీహెచ్-2 ఏఎన్ఎంల వేతనాలకు సంబంధించి విడుదలయ్యే నిధుల మినహా మిగిలిన నిధులన్నింటిలో కూడా అవకతవకలు చోటుచేసుకున్నట్టు భోగట్టా. నిధుల దుర్వినియోగమిలా.. ఎన్.ఆర్.హెచ్.ఎం నిధులకు సంబంధించి ముఖ్యంగా హెచ్‌డీఎస్ నిధులు, ఎన్యూవల్ మెంటేనన్స్ నిధులు, సబ్‌సెంటరు అన్‌టైడ్ ఫండ్, శానిటేషన్ ఫండ్‌లో ఎక్కువ అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. హెచ్‌డీఎస్ నిధులకు మెడికల్ ఆఫీసర్, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లకు (ఎస్పీహెచ్వో) డ్రాయింగ్ పవర్ ఉంటుంది. ఎస్పీహెచ్వోలకు కొంత కమీషన్ ఇచ్చి ఈ నిధుల్లో మరికొంత మొత్తాన్ని కొందరు మెడికల్ ఆఫీసర్లు గోల్మాల్ చేస్తుంటారు. ఎన్యూవల్ మెంటేనన్స్ గ్రాంట్‌కు సంబంధించి కేవలం మెడికల్ ఆఫీసర్ ఒక్కరికే డ్రాయింగ్ పవర్ ఉంటుంది. కొంతమంది మెడికల్ ఆఫీసర్లు ఈ నిధుల్లో దర్జాగ తమ చేతివాటాన్ని చూపిస్తుంటారు. సబ్ సెంటర్ అన్‌టైడ్ ఫండ్‌కు సంబంధించి ఏఎన్ఎం, పీహెచ్ఎన్లకు డ్రాయింగ్ పవర్ ఉంటుంది. అయితే కొంతమంది మెడికల్ అధికారులు వీరితో కుమ్మకై ఈ నిధుల్లో కూడా కొంత మొత్తాన్ని గోల్మాల్ చేస్తుంటారు. శానిటేషన్ ఫండ్ పరిస్థితి కూడా అంతే. దీనికి పంచాయతీ సెక్రటరీ, ఏఎన్ఎంలకు డ్రాయింగ్ పవర్ ఉంటుంది. దీంట్లో కూడా చేతివాటం తప్పటం లేదు. హెచ్‌డీఎస్ కమిటీ అమోదం లేకుండానే... హెచ్‌డీఎస్ నిధులకు సంబంధించి మెడికల్ ఆఫీసర్, ఎస్పీవోలకు డ్రాయింగ్ పవర్ ఉన్నప్పటికీ హెచ్‌డీఎస్ కమిటీ అమోదం తప్పనిసరి. అయితే కనీసం ఈ కమిటీకి ఎంత నిధులు ఖర్చు అయ్యావనే విషయం తెలియని పరిస్థితి. కమిటీలో ఎంఆర్వో, సర్పంచ్, డ్వాక్రా మహిళ, వార్డు మెంబరు, జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీడీవో ఇలా కొంత మంది సభ్యులుంటారు. హెచ్‌డీఎస్ నిధుల నుంచి ఏయే మందులు కొనుగోలు చేశారు, ఇంకా ఏ పనులకు వాడుతున్నారు అన్నదానిపై ఈ కమిటీ తమ అమోదం తెలపాలి. అయితే కమిటీ అమోదం తెలిపిన దాఖలులు ఎక్కడా లేదు. ఎందుకంటే అసలీ కమిటీ సమావేశాలే జరగవు కనుక. కమిటీ సభ్యులకు ఇవేవి తెలియక తమకేమీ పట్టనట్టు నిమ్మకుండిపోతున్నారు. ఇదే అదునుగా కొంత మంది మెడికల్ ఆఫీసర్లు, ఎస్పీహెచ్వోలు కుమ్మకై మందులు కొనుగోలు చేసినట్టు నకిలీ బిల్లులు పెట్టి నిధులు గోల్మాల్ చేస్తున్నారు. దీంతో బిల్లులో ఉన్న మందులు పీహెచ్‌సీల్లో ఉండడం లేదు. వసూళ్ల పర్వంతో ఆడిట్ మాయజాలం పీహెచ్‌సీకి రెండు వేల రూపాయల చొప్పున వసూళ్లు చేయటంతో ఆడిట్లో మాయజాలం చోటుచేసుకుంది. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరిగిన స్టెటీట్యూటరీ ఆడిట్ అంతా పచ్చనోట్ల వెనకే సాగినట్టు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలే చెబుతున్నాయి. పూర్తిస్థాయిలో ఆడిట్ జరిగితే నిధుల దుర్వినియోగం బయటపడుతుందన్న ఉద్దేశంతో కొంతమంది వసూళ్ల పర్వానికి తేరలేపినట్టు సమాచారం. గతంలో జరిగిన పీహెచ్‌సీలను విడిచిపెడితే ఈ నెలలో జరిగిన ఆడిట్లో 40 పీహెచ్‌సీలు, పలాస సీహెచ్‌సీ, టెక్కలి ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. అయితే చూసీచూడనట్టు ఆడిట్ జరిపినందుకు రూ. 2,000 వసూలు చేశారు. కొన్ని పీహెచ్‌సీలకైతే అసలు ఆడిట్ చేయకుండా ఉండేందుకు రూ. 2,500 వసూలు చేశారు. కొన్ని పీహెచ్‌సీల్లో మాత్రమే అవకతవకలు జరుగుతుంటాయని, కాని అన్ని పీహెచ్‌సీల వారి నుంచి డబ్బులు వసూలు చేయటం ఎంత మాత్రం సరికాదంటూ కొంత మంది వైద్యాధికారులు ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్.ఆర్.హెచ్.ఎం నిధుల గోల్మాల్ కోట్ల రూపాయల్లో ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. -
ఆశ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచాలి
* టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌కు వెన్నెముకగా ఉన్న ఆశ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచడానికి కమిటీని నియమించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీపాద యశోనాయక్‌కు టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ బుధవారం వినతి పత్రం ఇచ్చారు. గ్రామాల్లో ప్రతి వెయ్యి మందికి ఒక ఆశ కార్యకర్త వైద్య సేవల సమాచారాన్ని అందిస్తున్నారని, వారికిచ్చే ప్రతిఫలం నెలకు రూ.600 నుంచి రూ.800 మాత్రమే ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కో ఆశ కార్యకర్తకు రోజుకు రూ.26 మాత్రమే అందుతున్నాయని, దీనితో కుటుంబపోషణ అసాధ్యమని చెప్పారు. కనీసం అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న గౌరవ వేతనం తరహాలో ఆశ కార్యకర్తలకు ఇచ్చేందుకు సాధ్యమైన కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. -
‘ఢిల్లీ’ వైద్య బృందం ఆకస్మిక తనిఖీ
సిద్దిపేట జోన్: ఢిల్లీ వైద్య బృందం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, మాతా శిశు సంక్షేమ కేంద్రం, హైరిస్క్ కేంద్రం, పొన్నాల పీహెచ్‌సీలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) నిధుల వినియోగం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పథకం నిధులతో అందుతున్న సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ స్థాయి హోదా కలిగిన అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం సిద్దిపేటకు చేరుకుంది. జాతీయ స్థాయిలోని వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ నేతృత్వంలో ఏటా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఎన్ఆర్హెచ్ఎం కింద నిధులు విడుదలవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సముచిత వైద్య సేవలను అందించడానికి వీటిని వినియోగస్తుంటారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇండియా డాక్టర్ కె.జె. రామ్, కేంద్ర రీజినల్ డెరైక్టర్ మహేష్, డా. అజిత్ సుడుకె, భారత ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కన్సల్టెంట్లు రాజేష్, జనార్ధన్, ఫైనాన్స్ విభాగం కన్సల్టెంట్ గుప్తాతో కూడిన ప్రత్యేక బృందం మొదట మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆస్పత్రి స్థితిగతులు, వైద్యుల సంఖ్య, ఆస్పత్రిలో అందుతున్న సేవలపై బృందం ఆరా తీసింది. అనంతరం హైరిస్క్ కేంద్రాన్ని సందర్శించి కేంద్రం ఇన్చార్జి డా. కాశీనాథ్‌తో పరిస్థితులపై సమీక్షించారు. అత్యవసర వైద్య సేవల కేంద్ర వినియోగం, కేంద్రానికి వచ్చే కేసులు, నిధుల వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించి రికార్డులను పరిశీలించారు. నిధుల పెంపుపై నివేదిక బృందం టీమ్ లీడర్, రీజనల్ డెరైక్టర్ డా. మహేష్ మాట్లాడుతూ తెలంగాణ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జాతీయ, గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా మంజూరైన నిధుల వినియోగంపై నివేదిక కోసం రెండు బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. వీటిలో ఒక బృందం ఆదిలాబాద్‌లో ఉండగా రెండో బృందం మెదక్ జిల్లాలో పర్యటిస్తుందన్నారు. మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్ఆర్హెచ్ఎం కింద అమలవుతున్న వైద్య సేవలు గురించి వివరాలు సేకరిస్తామన్నారు. ప్రధానంగా ఖాళీల సమస్య, నిధుల శాతాన్ని 20 నుంచి 30కి పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నామన్నారు. ము ఖ్యంగా పిల్లలకు వైద్య సేవలను సముచితంగా ఈ నిధుల ద్వారా అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్ఆర్హెచ్ఎం కింద మంజూరైన నిధుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. -
నిధులిస్తేనే స్వచ్ఛత!
పడకేసిన ‘జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్’ గ్రామాల్లో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యపు నీడలు పంచాయతీలకు నిధులు విదల్చని కేంద్రం స్వచ్ఛ భారత్.. దేశవ్యాప్తంగా ఓ ఉద్యమంలా సాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమం.. ఇంటి నుంచి మొదలై.. దేశాన్నంతా పరిశుభ్రంగా ఉంచాలనే తలంపుతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి వెల్లువలా మద్దతు వస్తోంది. అయితే ఇది పట్టణాల్లో కాస్త ఫలితమిస్తున్నా పల్లె జనంలో చైతన్యం తేలేకపోతోంది. మురికి కూపాలుగా మారిన పల్లెల్లో శాశ్వత పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) పడకేసింది. ఈ మిషన్ ద్వారా పంచాయతీలకు అందాల్సిన రూ.10వేలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియని పరి స్థితి. ఆ నిధులొస్తేనే పారిశుద్ధ్య పనులు చేపట్టేది. జిల్లాలో 684 పంచాయతీలున్నాయి. పారిశుద్ధ్య నిధుల కింద జిల్లాకు రూ.68.4లక్షలు రావాల్సి ఉంది. ఈ నిధుల విడుదలలో అంతులేని జాప్యం కారణంగా పల్లెలన్నీ మురికికూపాలుగా మారాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో పారిశుద్ధ్యం పనులు అటకెక్కాయి. పంచాయతీ ఖాతాల్లో పారిశుద్ధ్య పనులకు వెచ్చించేందుకు చిల్లిగవ్వ లేదు. దీంతో సర్పంచ్‌లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైపు చూస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10వేలు విడుదల చేస్తుంది. గ్రామ సర్పంచ్, ఆరోగ్య కార్యకర్తల ఉమ్మడి ఖాతాలో ఈ నిధులు జమ చేస్తారు. వీటితో గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపడతారు. జిల్లాలో 684 గ్రామ పంచాయతీలున్నాయి. పారిశుద్ధ్య నిధుల కింద జిల్లాకు రూ. 68.4లక్షలు రావాల్సి ఉంది. ఈమేరకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నెలరోజుల్లో ఈ నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ 2014-15 వార్షిక సంవత్సరం ప్రారంభమై ఆర్నెళ్లు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిధుల ఊసెత్తకపోవడంతో పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పడకేశాయి. వాస్తవానికి వర్షాకాలం మునుపే ఈ నిధుల విడుదలైతే.. వాటితో సీజన్ ప్రారంభానికి ముందే పారిశుద్ధ్య పనులు చేపట్టేవారు. కానీ నిధుల జాడ లేకపోవడంతో పనులు ముం దుకు సాగలేదు. ఫలితంగా పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. ఫలితంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కదలని యంత్రాంగం.. పరిశుభ్రమైన సమాజం కోసం తలపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై యువత, స్వచ్ఛంధ సంస్థలు హడావుడి చేస్తున్నా.. అధికారగణం నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో జిల్లాలో పారిశుద్ధ్య చైతన్య కార్యక్రమం ముందుకు సాగడంలేదు. కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటిసరఫరా విభాగం, పంచాయతీ శాఖలు పారిశుద్ధ్య పనుల్లో భాగస్వామ్యమైన దాఖలాలు లేవు. శానిటేషన్ నిధులు అందకపోవడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టలేదని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడగా.. తాగునీటి సమస్యల పరిష్కారంలో బిజీ అయ్యామంటూ ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరు పేర్కొనడం గమనార్హం. -
ప్రసవ వేదన
సాక్షి, ఒంగోలు: ప్రజారోగ్యం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా..పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగానే ఉంటోంది. జనాభా ప్రాతిపదికన ప్రతీ 10 వేల మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉండాలి. కానీ జిల్లాలో ప్రతీ 15 వేల మందికి ఒకరు లేకపోవడం గమనార్హం. వైద్యారోగ్యశాఖకు కేంద్రప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ ద్వారా నిధులు విడుదల చేస్తోంది. జిల్లాకు ఏటా రూ.20 కోట్లు అందుతున్నాయి. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం కోసం పంచాయతీకి రూ.10 వేలు చొప్పున 880 గ్రామాలకు రూ.88 లక్షలు ఖర్చుచేస్తున్నారు. ఎలాంటి ఫలితాలు ఉండటం లేదు. గ్రామాల్లో అపరిశుభ్రత, అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు ఏటా ప్రబలుతూనే ఉన్నాయి. జననీ సురక్ష యోజన (జేఎస్వై), జననీ శిశుసంరక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే) కింద గర్భిణులకు కాన్పుల కోసం ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నా.. ఇవి రికార్డులకే పరిమితమవుతున్నాయి. ఇక జిల్లాలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఆస్పత్రులు 37 ఉన్నాయి. వీటిపై ఏటా రూ.కోటి వరకు ఖర్చుచేస్తున్నా.. వీటిల్లో కాన్పులు చేసుకునే వారి సంఖ్య ఏటా తగ్గిపోతూనే ఉంది. గణాంకాలు చెబుతున్నదేమిటంటే.. జిల్లా జనాభా 33,92,764 మంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం మంది ప్రజలుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 85 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 550 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 280 మంది వైద్యులకు గాను ప్రస్తుతం 200 మందే ఉన్నారు. 804 గ్రామాల్లో వైద్యసేవలు అందుబాటులో లేవు. ఇక్కడ ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలే దిక్కు. ఉత్సవ విగ్రహాలే.. జిల్లాలో 37 కేంద్రాల్లో గర్భిణులకు ఆపరేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవి 24 గంటలు సేవలందించాలి. ఇక్కడి కేంద్రాల్లో ఆపరేషన్లు జరగకపోయినా ఏటా కోట్లల్లో ఖర్చులు చూపిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద ఈ ఏడాది రూ.30 కోట్లు రాగా, అధికారులు ఖర్చుచేసింది రూ.25 కోట్లు. వీటి ఖర్చుకు సంబంధించి పీహెచ్‌సీల నుంచి నివేదికలు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ మత్తువైద్యులు అందుబాటులో లేకపోవడం, సిబ్బంది కొరతతో ఆపరేషన్లు జరగడం లేదు. పరికరాలూ అందుబాటులో లేవు. తగ్గని మాతాశిశు మరణాలు మాతాశిశు మరణాలను పూర్తిస్థాయిలో తగ్గిం చేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వైద్యఆరోగ్యశాఖ నుంచి ప్రయత్నిస్తున్నాయి. 24 గంటల సీమాంక్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే, ప్రతీ గ్రామపరిధిలో అంగన్వాడీ ఆశవర్కర్తో పాటు ఏఎన్ఎంను నియమించారు. వీరు గ్రామీ ణ ప్రాంతాల్లో తిరిగి గర్భిణుల వివరాలను నమోదుచేసి.. వారికి కాన్పుచేసి ఇంటికి వెళ్లేంత వరకు బాధ్యత తీసుకోవాలి. దీనికోసం ఎన్ఆర్హెచ్ఎం కింద జేఎస్ఎస్కే (జననీ శిశుసంక్షణ కార్యక్రమం), జేఎస్వై (జననీ సురక్షయోజన) పథకాల రూపంలో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా రు. జిల్లాలో మాతాశిశు మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. 2013-14 సంవత్సరంలో మాతృమరణాలు 127, శిశుమరణాలు 39 సంభవించాయి. గడచిన తొమ్మిది నెలల కాలంలో రెండూ కలిపి సుమారు 200 పైగానే ఉంటాయని వైద్యవర్గాలు పేర్కొనడం గమనార్హం. ప్రైవేటు వైపు ఎందుకు...? ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా, సిజేరియన్లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు గుంజుతున్నారు. అయినా ఎక్కువగా ప్రసవాలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. దీనికితోడు ఆర్ఎంపీలు ఒక్క కేసును గ్రామం నుంచి పంపితే రోగి ఇచ్చే ఫీజులో 40 శాతం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లమని సూచిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇందుకు ఒక్కో కేసుకు కొంతమొత్తంలో ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో అనుమతుల్లేని ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నా.. వైద్యారోగ్యశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం దురదృష్టకరం. -
78 జీవోను రద్దు చేయాలి
- అసెంబ్లీలో రోజా డిమాండ్ తిరుపతి : తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన 300 పడకల ఆస్పత్రిని స్విమ్స్‌కు అప్పగించడాన్ని నగరి శాసనసభ్యురాలు ఆర్కే.రోజా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆందుకు సంబంధించిన జీవో 78ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రోజా మెటర్నిటీ ఆస్పత్రి అంశాన్ని లేవనెత్తారు. రాయలసీమకు తలమానికంగా ఉన్న తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి పేద మహిళలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. ఆస్పత్రికి కాన్పుల కోసం వచ్చే గర్భిణీలు, గైనిక్ సంబంధ జబ్బులతో వచ్చే మహిళారోగుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గతంలో జీవోనెంబర్ 87 ద్వారా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నిధులతో 300 పడకల ఆస్పత్రి మంజూరైందన్నారు. అయితే ఆ ఆస్పత్రిని జీవో 78 ద్వారా కార్పొరేట్ సేవలకు ప్రతీకగా ఉన్న స్విమ్స్‌కు అప్పగించడం అనుచితమైన చర్యగా రోజా పేర్కొన్నారు. జీవో 78ని రద్దు చేసి 300 పడకల భవనాన్ని మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగానే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. జీవో 78 కి వ్యతిరేకంగా మూడు వారాలుగా జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనను ఆమె ఈసందర్భంగా గుర్తు చేశారు. -
‘ఆరోగ్య మిషన్’కు సుస్తీ
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధుల వినియోగంలో నిర్లక్ష్యం గత ఏడాది నిధులు ఖర్చుచేయని పంచాయతీలకు ఈ సారి మొండిచేయి గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం పట్టించుకోని వైద్యాధికారులు మచిలీపట్నం : వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా విడుదలైన నిధులు నిరుపయోగంగా మారాయి. పీహెచ్‌సీలకు విడుదలైన ఈ నిధుల ఖర్చుపై పర్యవేక్షణ లోపించడం, గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో వీధులన్నీ మురుగు, చెత్తతో దర్శనమిస్తున్నాయి. సర్పంచుల హవా కొనసాగుతున్న కొన్ని పంచాయతీల్లో ఈ నిధులు స్వాహా అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 969 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో వర్షాకాలంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా ఒక్కొక్క పంచాయతీకి రూ.10 వేల చొప్పున నిధులు విడుదలవుతాయి. ఈ నిధులు పంచాయతీలో పనిచేసే సబ్‌సెంటరు, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి జాయింట్ అకౌంట్లో పీహెచ్సీ ద్వారా జమ చేయాల్సి ఉంది. ఈ నగదుతో వర్షాకాలంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించడం, తాగునీటి కుండీలను శుభ్రపరచడం, శుద్ధి చేసిన తాగునీటిలో క్లోరినేషన్ చేయించడం వంటి పనులు చేయాలి. జిల్లా వ్యాప్తంగా 86 పీహెచ్‌సీలు ఉండగా జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా విడుదలైన నిధులు ఆయా పీహెచ్‌సీల ఖాతాల్లోకి వెళ్లాయి. కొన్ని చోట్ల గత ఏడాది విడుదలైన నిధులే ఖర్చు చేయని పరిస్థితి నెలకొంది. మరికొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో ఈ నిధులను డ్రా చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఈ నెల 5వ తేదీ నుంచి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. దీని కోసం జిల్లాలోని పలు మండలాల్లో రెండు రోజులుగా పారిశుద్ధ్యం మెరుగుదలకు పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు గ్రామైక్య సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే జాతీయ ఆరోగ్యమిషన్ నిధులను ఖర్చు చేసేందుకు ఆయా పీహెచ్‌సీల్లో ప్రజాప్రతినిధులతో ఇంత వరకు సమావేశాలు ఏర్పాటు చేయకపోవటం గమనార్హం. మచిలీపట్నం మండలంలోని 34 పంచాయతీలకు 14 మంది కార్యదర్శులే ఉన్నారు. జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా విడుదలైన నిధులు కొన్ని పంచాయతీలకు ఇంకా చేరనేలేదు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఇప్పటికే పెరిగింది. అయినప్పటికీ ఆరోగ్యమిషన్ నిధులతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్న వారే లేరు. ఈ నిధులు ఎక్కడున్నాయో, ఎలా ఖర్చు చేయాలో పట్టించుకోని దాఖలాలు నెలకొన్నాయి. కృత్తివెన్ను మండలంలోని 16 పంచాయతీలకు గత ఏడాది ముగ్గురు పంచాయతీ కార్యదర్శులే ఉన్నారు. దీంతో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా పంచాయతీలకు విడుదలైన నిధులను ఖర్చు చేయలేదు. గత ఏడాది నిధులు ఖర్చు చేయకపోవటంతో ఈ సంవత్సరం నిధులు నిలిచిపోయాయి. ఇంతా జరుగుతున్నా పీహెచ్సీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. నందిగామ మండలంలోని పంచాయతీలకు నిధులు విడుదలైనా అరకొరగా ఖర్చు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారి వర్షపునీరు ఇళ్ల మధ్య నిలిచి, దోమలు ప్రబలుతున్నాయి. అయితే వాటి నిర్మూలనకు తీసుకున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మైలవరం మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు నిధులు విడుదలైనా వాటిని ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నిధులను ఖర్చు చేసే విషయంలో ఎంపీపీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాల్సిన ప్రజాప్రతినిధులు నిధుల వినియోగంలో తమ మాటే నెగ్గాలని పంతాలకు పోవడం గమనార్హం. గూడూరు మండలంలో 27 పంచాయతీలకు గత ఏడాది విడుదలైన నిధులను 12 పంచాయతీల్లో ఖర్చు చేశారు. మిగిలిన 15 పంచాయతీల్లో నిధులు అలానే ఉండిపోయాయి. దీంతో ఈ ఏడాది నిధుల విడుదల నిలిచిపోయింది. గుడివాడ మండలంలో 21 పంచాయతీలకు గత ఏడాది రూ 2.10 లక్షలు విడుదలవగా పది పంచాయతీల్లో నిధులు వినియోగించలేదు. దీంతో ఈ సంవత్సరం నిధులు విడుదల కాలేదు. దీంతో మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం ఆధ్వానంగా మారింది. నందివాడ మండలంలో 23 పంచాయతీలకు నిధులు విడుదలైనా ఐదు పంచాయతీల్లోనే ఖర్చు చేశారు. మిగిలిన పంచాయతీల్లో ఈ నిధులను ఖర్చు చేయకుండా, గ్రామాల్లో పారిశుద్ద్య చర్యలు చేపట్టకుండా జాప్యం చేశారు. 2012 సంవత్సరం నుంచి ఈ మండలంలో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను ఖర్చు చేయకుండా ఉంచటం గమనార్హం. అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ మండలాల్లో 91 పంచాయతీలు ఉన్నాయి. గత ఏడాది వీటికి రూ. 9.10 లక్షల నిధులు విడుదలవగా రూ.2.50 లక్షలు నిధులను వినియోగించలేదు. ఈ ఏడాది జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా ఇంకా నిధులు విడుదల కాలేదు. -
అన్‌టైడ్‌లో కోత
భువనగిరి : జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) ద్వారా పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు కేటాయిస్తున్న అన్‌టైడ్(తిరిగి చెల్లించని) నిధుల్లో కోతపడింది. ఈ నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలు సమర్పించడంలో వైద్యసిబ్బంది అలసత్వం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం కోత విధించింది. దీంతో వైద్యసేవలకు విఘాతం కలగనుంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సబ్సెంటర్లలో.. జిల్లాలో 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 565 సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటిలో వసతుల కల్పన, అత్యవసర మందుల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం ఎన్ఆర్హెచ్ఎం ద్వారా 2005 నుంచి అన్‌టైడ్ నిధులు (ఆస్పత్రిస్థాయిని బట్టి) విడుదల చేస్తోంది. ఈ నిధులతో ఆయా పీహెచ్‌సీలు, సబ్సెంటర్లలో సౌకర్యాలు కల్పించడమే గాక అత్యవసర మందులు కొనుగోలు చేసి మెరుగైన వైద్యసేవలు అందించేవారు. అలాగే సబ్‌సెంటర్ల పరిధిలోని గ్రామపంచాయతీల్లో శానిటేషన్ పనులు నిర్వహించడం ద్వారా ప్రజారోగ్యం కాపాడేందుకు వైద్యశాఖ చర్యలు తీసుకునేది. ఎస్ఓఈ సమర్పించకపోవడంతో.. ఏటా విడుదలయ్యే అన్‌టైడ్ నిధులు, చేసిన ఖర్చుల వివరాలు పీహెచ్సీ, సబ్‌సెంటర్లు ఎన్ఆర్హెచ్ఎంకు సమర్చించాలి. కానీ జిల్లాలో ఉన్న 50శాతం పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్ఓఈ (విడుదలైన నిధులు, ఖర్చులు వివరాలు)సమర్పించలేదు. దీంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన నిధుల్లో కేంద్రప్రభుత్వం కోత విధించినట్టు అధికారులు తెలిపారు. ఇక ఈ నిధులు సరిపోక పీహెచ్‌సీలు, సబ్సెంటర్లలో సరైన వైద్యసేవలు అందే అవకాశం లేదు. అలాగే గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జిల్లా అధికారులు సకాలంలో స్పందించకపోతే ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. నిధుల దుర్వినియోగమే కారణమా? పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లకు ఎన్ఆర్ హెచ్ఎం ద్వారా వస్తున్న నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా తప్పుడు నివేదికలను రూపొందించడం వల్లే కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత విధించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు రావడం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు. నిధుల వినియోగంలో సరైన నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. -
ఎన్ఆర్హెచ్ఎం నిధులకు గ్రహణం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ఎన్ఆర్హెచ్ఎం(జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్) విడుదల చేసే నిధులకు గ్రహణం పట్టడమే అందుకు కారణం. 2013-14 ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు కావస్తున్నా నిధుల విడదల జాడ లేదు. మాతృ శిశు మరణాలను కనీస స్థాయికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో ఎన్ఆర్హెచ్ఎంకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రతీ పీహెచ్‌సీకి రూ.1.75లక్షలు, సీహెచ్‌సీకి రెండు లక్షలు, ఏరియా ఆస్పత్రులకు రూ.ఐదు లక్షల చొప్పున కేటాయిస్తుంది. వీటిని ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యశిబిరాలు, రోగుల తరలింపు, అత్యవసర మందుల కొనుగోళ్లకు వెచ్చించాల్సి ఉంటుంది. 2013-14 ఆర్థిక సంవత్సరం నిధుల విడుదల కోసం ఆయా వైద్య కేంద్రాలు ఎదురు చూస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 72 పీహెచ్‌సీలకు గాను ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి సుమారు రూ.1.26 కోట్లు విడుదల కావాల్సి ఉండగా.. రూ.54.25 లక్షలు ఏజెన్సీ పీహెచ్‌సీలకు విడుదల కావాలి. ఉట్నూర్, లక్సెట్టిపేట, బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్, బెల్లంపల్లి, ముథోల్, సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రులకు రూ.రెండు లక్షల చొప్పున, నిర్మల్, మంచిర్యాల, భైంసా ఏరియా ఆస్పత్రులకు రూ.5లక్షల చొపుపన విడుదల కావాల్సి ఉంది. జిల్లాలోని 469 సబ్‌సెంటర్లకు అన్‌టైడ్ ఫండ్స్ రూ.పది వేల చొప్పున రూ.46.90లక్షలు విడుదలకు నోచుకొలేదు. ఏజెన్సీలో పలు పీహెచ్‌సీల్లో కిటికీలు, నీటి సమస్యలు, మరుగుదొడ్లు తదితర సమస్యలు తాండవం చేస్తున్నాయి. నిధులు విడుదల కాక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అత్యవసర మందులు లేక వైద్యం కోసం వచ్చేవారిని బయటే కొనుక్కోవాలని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏజెన్సీలోని గిరిజనులు గ్రామాల్లో జ్వరాలు, అతిసార తదితర వ్యాధులతో సతమతం అవుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో మందుల్లేక.. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక దేవుడిపై భారం వేసి మృత్యు ఒడికి చేరుతున్నారు. యూసీ ఖర్చులు, వసతుల నివేదికలు సంబంధిత ఆస్పతులు సకాలంలో పంపించకపోవడంతోనే నిధుల విడుదలలో జాప్యమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డిని సంప్రదించగా.. నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో నివేదికలు పంపించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నిధులు విడుదలయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. -
డీపీఎల్ క్యాంపులో అవస్థలు
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శుక్రవారం కుటుంబ నియంత్రణ కోసం డీపీఎల్ (డబుల్ ఫంక్షర్ ల్యాప్రోస్కోపిక్) క్యాంపు నిర్వహిం చారు. ఈ క్యాంపులో ఆపరేషన్లు చేసిన మహిళలను ఆసుపత్రి సిబ్బంది కింద పడుకోబెట్టారు. కనీసం కార్పెట్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఆపరేషన్ నొప్పులతో ఉన్న వారు పడుకోడానికి సరైన వసతి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరి గోసను పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారి వెంట వచ్చిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వారికి తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు. నిబంధనల ప్రకారం శస్త్ర చికిత్స నిర్వహించిన అనంతరం వారికి మంచం ఏర్పాటు చేయడంతో పాటు తినడానికి బ్రెడ్, తాగేందుకు పాలు అందించాలి. సహాయకులుగా వచ్చిన వారికి కూడా తాగునీరు, టీ, స్నాక్స్ అందించాలి. వారు కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయాలి. కానీ, ఆసుపత్రి సిబ్బంది ఇవేవీ సమకూర్చలేదు. ఈ సమస్య కేవలం జిల్లా కేంద్రాసుపత్రిలోనే కాదు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ప్రతి నెల 15వ తేదీ నుంచి 20 వరకు డీపీఎల్ క్యాంపులు నిర్వహిస్తారు. దీనికి కావాల్సిన నిధులను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) ద్వారా విడుదల చేస్తారు. క్యాంపు నిర్వహణ ఖర్చుల కోసం ఒక్కో క్యాంపునకు సుమారు రూ 6వేల నుంచి 10వేల వరకు నిధులిస్తారు. కానీ, క్యాంపులకు వచ్చే వారికోసం ఆ నిధులు ఖర్చు చేయకుండా అధికారులు జేబు నింపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కుటుంబ నియంత్రణ పేరుతో కుమ్ముతున్నారు జిల్లాలో ప్రతి నెల నిర్వహిస్తున్న డీపీఎల్ క్యాంపులకు ప్రతి నెలా సుమారు రూ లక్ష వరకు నిర్వాహకులు వెనుకేసుకుంటున్నట్టు కార్యాలయం సిబ్బందే బాహాటంగా ఆరోపిస్తున్నారు. నెలలో కనీసం 20 వరకు క్యాంపులను నిర్వహిస్తున్నందున ప్రతినెల ఎన్ఆర్హెచ్ఎం నుంచి రూ లక్షల్లో నిధులు డ్రా చేస్తున్నారు. క్యాంపులో టెంట్లు, కుర్చీలు, కనీస సౌకర్యాలు కల్పించకుండానే.. కల్పించినట్టుగా బిల్లులు సృష్టించి నిధులు డ్రా చేస్తున్నారు. డీపీఎల్ క్యాంపులో ఉపయోగించే సర్జికల్ కిట్ ప్రతి నెల రిపేర్ చేయించినట్టుగా రాసి రూ వేలల్లో బిల్లులు డ్రా చేస్తున్నారని సమాచారం. కుటుంబ నియంత్రణ క్యాంపులను పర్యవేక్షించడం కోసం ఒక అద్దెకారును కూడా వినియోగిస్తున్నారు. దీనికోసం ప్రతి నెల రూ 24 వేలు వెచ్చిస్తున్నారు. కానీ కారును క్యాంపుల కోసం కాకుండా స్వంత పనుల కోసం వినియోగిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. డీపీఎల్ క్యాంపుల పేరుతో నిధులను వెనుకేసుకుంటున్న అంశంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు. -
వైద్యసేవలు మెరుగుపడాలి
ఉప్పునుంతల/అచ్చంపేట, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు అందించే వైద్యసేవలు మరింత మెరుగుపడాలని, మహిళలు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోకుండా పురుషులు కూడా వెసక్టమీ ఆపరేషన్లు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తేజోరాం కోరారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాలో గత 30 ఏళ్లుగా పురుషులు అధికంగా వెసక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారని వివరించారు. ఈ ఆపరేషన్లపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా వైద్యాధికారిణి రుక్మిణమ్మకు సూచిం చారు. మంత్రిత్వశాఖ అధికారుల బృందం ఆ దివారం నల్లమలలోని ఉప్పునుంతల పీహెచ్ సీ, అచ్చంపేట సివిల్ ఆస్పత్రిని సందర్శించింది. ఇక్కడ ప్రజలకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో డాక్టర్ వెంకటేష్ శ్రీనివాసన్(యూఎన్ఎఫ్పీఏ), డా క్టర్ అనామికా సక్సేనా ట్రైనింగ్ డివిజన్ ఇన్చా ర్జి), డాక్టర్ రితేష్ (ఎన్ఆర్హెచ్ఎం ప్రతినిధి) లు ఉన్నారు. బృందం సభ్యులు ముందుగా ఉప్పునుంతల పీహెచ్‌సీలోని లేబర్‌రూం, బేబీ వామర్, ఫార్మసీ రూం, వ్యాక్సిన్ భద్రపర్చుగది, ల్యాబ్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో నమోదవుతున్న ఓపీ, నెలలో జరుగుతున్న డెలివరీలను డాక్డర్ రజనీని అడిగి తెలుసుకున్నారు. లేబర్ రూంలో డెలివరీ నుంచి తల్లిబిడ్డలను ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించే వరకు అందుతున్న వైద్యసేవలను వైద్యులు, సిబ్బందిని అడిగారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ..కాన్పు అయిన 48 గంటల వరకు తప్పకుండా తల్లిబిడ్డలను ఆస్పత్రిలోనే ఉంచాలని వైద్యసిబ్బందికి సూచించారు. ఆస్పత్రుల్లోనే కాన్పులు అయ్యే విధంగా చూడాలన్నారు. కాన్పు, కాన్పుకు ఎడం ఉండాలన్న విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కుటుంబ నియంత్రణ కోసం కేవలం ఆపరేషన్లే కాకుండా పదేళ్ల వరకు గర్భం దాల్చకుండా పనిచేసే ఐయూడీ లూబ్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. నేషనల్ రూరల్‌హెల్త్ మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) నిధుల వినియోగం, పథకాల అమలుపై ఏడాదికొకసారి నిర్వహించే కామన్ రివ్యూమిషన్లో భాగంగా రాష్ట్రంలో రెండు బృందాలుగా ఏర్పడి మహబూబ్‌నగర్, చిత్తూరు జిల్లాల్లో ఈనెల 14వరకు ఆస్పత్రులను తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. అచ్చంపేట ఆస్పత్రిస్థాయి పెంపు అచ్చంపేట సివిల్ ఆస్పత్రిస్థాయి పెంచే అలోచన ఉందని డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తేజరాం అన్నారు. ఆస్పత్రిలో అన్ని వసతులు బాగున్నాయని, అవసరమైతే అన్ని వసతులతో కూడిన ఏరియా ఆస్పత్రిగా రూపాంతరం చెందే అవకాశం ఉందని ప్రభత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆపరేషన్ థియేటర్, రక్తనిధి కేంద్రం, ఎక్స్‌రే సెంటర్, ల్యాబ్, నిధులు, ఖర్చుల నివేదిక ఆస్పత్రి పనితీరు బాగుందన్నారు.కేంద్ర బృందం వెంట ప్లానింగ్, మెటర్నటీ, చైల్డ్‌హెల్త్ రాష్ట్ర అదనపు సంచాలకులు డాక్టరు నీరద, కుటుంబ నియంత్రణ రాష్ట్ర సంయుక్త సంచాలకులు డాక్టర్ జయకుమారి, వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర సంయుక్త సంచాలకులు డాక్టర్ గాయిత్రీ, డీఐఓ జనార్దన్, ఎంహెచ్ఎన్ జేడీ డాక్టర్ జనార్దన్, జిల్లా మలేరియా అధికారి డాక్డర్ శశికాంత్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎయిడ్స్, కుష్టురోగ నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్పీహెచ్ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గాలిలో దీపాలు..మాతాశిశు ప్రాణాలు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : జిల్లాలో మాతాశిశువుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. మాతాశిశు మరణాల నివారణ కోసం ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఖర్చుచేస్తున్నప్పటికీ వైద్యారోగ్యశాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆశించిన ఫలితాలు లేకుండా పోయాయి. ప్రతి ఏడాదీ వందల సంఖ్యలో మాతాశిశు మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. మాతాశిశు మరణాల నివారణే ప్రధాన ఉద్దేశంగా ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) లక్ష్యం నెరవేరడం లేదు. తల్లీబిడ్డల సంపూర్ణ ఆరోగ్యం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించి బిడ్డకు ఏడాది వయసు వచ్చేంత వరకూ అవసరమైన పరీక్షలు, మందులు, వ్యాధి నిరోధక టీకాలతో పాటు పౌష్టికాహారాన్ని కూడా ప్రభుత్వమే అందజేస్తోంది. వాటితో పాటు అధికారులు, సిబ్బంది జీతభత్యాల కోసం ఏటా కోట్ల రూపాయల నిధులు ఖర్చుచేస్తోంది. దానిలో భాగంగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వైద్యారోగ్యశాఖకు 25.61 కోట్ల రూపాయల నిధులు విడుదల కాగా, వాటిలో 20.59 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. కానీ, వైద్యారోగ్యశాఖలో జిల్లాస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ చిత్తశుద్ధిలోపం కారణంగా ఫలితం శూన్యంగా ఉంది. గత ఏడాది జిల్లావ్యాప్తంగా 583 మంది శిశువులు, 32 మంది బాలింతలు మృతిచెందగా ఈ ఏడాది ఇప్పటి వరకూ 175 మంది శిశువులు, 14 మంది బాలింతలు మరణించారు. గర్భిణులు ఆస్పత్రుల్లోనే ప్రసవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకోసం పట్టణాలు, గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలను ఏర్పాటు చేసింది. ఇళ్లవద్ద కాన్పుల వల్ల కలిగే నష్టాలు, ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల వల్ల ప్రయోజనాలపై మహిళలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించింది. గర్భిణులందరికీ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించడంలో ఒకరకంగా విజయవంతమైనప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఇళ్లలోనే కాన్పులు చేస్తున్నారు. నూరుశాతం ఫలితాల సాధనకు ఇంకా కృషి చేయాల్సి ఉంది. కాగా, మాతాశిశు మరణాల నివారణలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. నిర్దేశించిన లక్ష్యాలు ఆమడ దూరంలో ఉన్నాయి. ఎన్ఆర్హెచ్ఎం ప్రకారం... గర్భిణులను గుర్తించినప్పటి నుంచి వారికి నెలవారీ పరీక్షలు, తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలను వివరించాల్సిన బాధ్యత గ్రామీణ ఆరోగ్య సిబ్బందిపై ఉంటుంది. నెలలు నిండగానే ఆస్పత్రిలోనే కాన్పు జరిగేలా చూడాలి. కానీ, వైద్యాధికారుల పర్యవేక్షణ కరువవడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారి నామమాత్రపు సేవలను నమ్ముకోలేక గర్భిణుల్లో ఎక్కువ శాతం ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. నిరుపేదలు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామీణ వైద్యసిబ్బంది అందించే మొక్కుబడి సేవలపై ఆధారపడుతున్నారు. అలా ఆధారపడిన వారిలో ఎక్కువశాతం మంది శిశువులను కోల్పోతుండగా కొన్నిసార్లు తల్లుల ప్రాణాలు కూడా పోతున్నాయి. లోపాలు గుర్తించకపోవడమే ప్రధాన కారణం... గర్భిణుల్లో లోపాలను ప్రారంభంలోనే గుర్తించి వారు తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించకుండా గ్రామీణ వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గర్భిణుల్లో రక్తహీనత, అధిక రక్తస్రావం కారణంగా మాతాశిశు మరణాలు సంభవిస్తుంటాయి. బాల్యవివాహాలు, పౌష్టికాహారలోపం, మేనరికాలు తదితర కారణాల వల్ల లోపాలు తలెత్తుతుంటాయి. శిశువుల్లో కూడా నెలలు నిండకుండానే జన్మించడం, అధిక బరువు, బరువు లేమి, ఉదరకోశ వ్యాధులు, వంశపారంపర్య రుగ్మతలు, ఇతర అనారోగ్యాల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. మాతాశిశువుల్లో సకాలంలో లోపాలు గుర్తించి చికిత్స చేయించుకుంటే మరణాల శాతాన్ని తగ్గించవచ్చు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. గర్భిణులకు నామమాత్రంగా వైద్య పరీక్షలు నిర్వహించి కాన్పుల కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించేందుకే వైద్య సిబ్బంది పరిమితమవుతున్నారు. వైద్య నిపుణుల కొరత మరో కారణం... జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య నిపుణుల పోస్టులన్నీ దాదాపు ఖాళీగానే ఉన్నాయి. ఒకటీరెండు చోట్ల నిపుణులు ఉన్నప్పటికీ డిప్యుటేషన్‌పై పట్టణాల్లో సేవలందిస్తున్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ఎంబీబీఎస్ వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో కాన్పుల సమయంలో తల్లీబిడ్డకు ఏదైనా ప్రమాదం తలెత్తితే వెంటనే మెరుగైన చికిత్స చేసే వారు కరువయ్యారు. వారిని అక్కడి నుంచి సమీపంలోని పట్టణాలకుగానీ, జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరానికిగానీ తరలించాల్సి వస్తోంది. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడం ప్రైవేటు వాహనాలను బాడుగకు మాట్లాడుకుని తరలించాలి. ఈలోగా వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా వైద్యశాలల్లో గైనకాలజిస్ట్లు, చిన్నపిల్లల వైద్యనిపుణులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. కారణాలు ఏవైనప్పటికీ మాతాశిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వాటి నివారణ కోసం ఖర్చు చేస్తున్న నిధులు బూడిదలో పోసిన పన్నీరులా మారుతున్నాయి. వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తీరు మారితేనే ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.