ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : జిల్లాలో మాతాశిశువుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. మాతాశిశు మరణాల నివారణ కోసం ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఖర్చుచేస్తున్నప్పటికీ వైద్యారోగ్యశాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆశించిన ఫలితాలు లేకుండా పోయాయి. ప్రతి ఏడాదీ వందల సంఖ్యలో మాతాశిశు మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. మాతాశిశు మరణాల నివారణే ప్రధాన ఉద్దేశంగా ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) లక్ష్యం నెరవేరడం లేదు. తల్లీబిడ్డల సంపూర్ణ ఆరోగ్యం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించి బిడ్డకు ఏడాది వయసు వచ్చేంత వరకూ అవసరమైన పరీక్షలు, మందులు, వ్యాధి నిరోధక టీకాలతో పాటు పౌష్టికాహారాన్ని కూడా ప్రభుత్వమే అందజేస్తోంది. వాటితో పాటు అధికారులు, సిబ్బంది జీతభత్యాల కోసం ఏటా కోట్ల రూపాయల నిధులు ఖర్చుచేస్తోంది. దానిలో భాగంగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వైద్యారోగ్యశాఖకు 25.61 కోట్ల రూపాయల నిధులు విడుదల కాగా, వాటిలో 20.59 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. కానీ, వైద్యారోగ్యశాఖలో జిల్లాస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ చిత్తశుద్ధిలోపం కారణంగా ఫలితం శూన్యంగా ఉంది. గత ఏడాది జిల్లావ్యాప్తంగా 583 మంది శిశువులు, 32 మంది బాలింతలు మృతిచెందగా ఈ ఏడాది ఇప్పటి వరకూ 175 మంది శిశువులు, 14 మంది బాలింతలు మరణించారు.
గర్భిణులు ఆస్పత్రుల్లోనే ప్రసవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకోసం పట్టణాలు, గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలను ఏర్పాటు చేసింది. ఇళ్లవద్ద కాన్పుల వల్ల కలిగే నష్టాలు, ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల వల్ల ప్రయోజనాలపై మహిళలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించింది. గర్భిణులందరికీ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించడంలో ఒకరకంగా విజయవంతమైనప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఇళ్లలోనే కాన్పులు చేస్తున్నారు. నూరుశాతం ఫలితాల సాధనకు ఇంకా కృషి చేయాల్సి ఉంది. కాగా, మాతాశిశు మరణాల నివారణలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. నిర్దేశించిన లక్ష్యాలు ఆమడ దూరంలో ఉన్నాయి. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ప్రకారం... గర్భిణులను గుర్తించినప్పటి నుంచి వారికి నెలవారీ పరీక్షలు, తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలను వివరించాల్సిన బాధ్యత గ్రామీణ ఆరోగ్య సిబ్బందిపై ఉంటుంది. నెలలు నిండగానే ఆస్పత్రిలోనే కాన్పు జరిగేలా చూడాలి. కానీ, వైద్యాధికారుల పర్యవేక్షణ కరువవడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారి నామమాత్రపు సేవలను నమ్ముకోలేక గర్భిణుల్లో ఎక్కువ శాతం ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. నిరుపేదలు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామీణ వైద్యసిబ్బంది అందించే మొక్కుబడి సేవలపై ఆధారపడుతున్నారు. అలా ఆధారపడిన వారిలో ఎక్కువశాతం మంది శిశువులను కోల్పోతుండగా కొన్నిసార్లు తల్లుల ప్రాణాలు కూడా పోతున్నాయి.
లోపాలు గుర్తించకపోవడమే ప్రధాన కారణం...
గర్భిణుల్లో లోపాలను ప్రారంభంలోనే గుర్తించి వారు తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించకుండా గ్రామీణ వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గర్భిణుల్లో రక్తహీనత, అధిక రక్తస్రావం కారణంగా మాతాశిశు మరణాలు సంభవిస్తుంటాయి. బాల్యవివాహాలు, పౌష్టికాహారలోపం, మేనరికాలు తదితర కారణాల వల్ల లోపాలు తలెత్తుతుంటాయి. శిశువుల్లో కూడా నెలలు నిండకుండానే జన్మించడం, అధిక బరువు, బరువు లేమి, ఉదరకోశ వ్యాధులు, వంశపారంపర్య రుగ్మతలు, ఇతర అనారోగ్యాల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. మాతాశిశువుల్లో సకాలంలో లోపాలు గుర్తించి చికిత్స చేయించుకుంటే మరణాల శాతాన్ని తగ్గించవచ్చు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. గర్భిణులకు నామమాత్రంగా వైద్య పరీక్షలు నిర్వహించి కాన్పుల కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించేందుకే వైద్య సిబ్బంది పరిమితమవుతున్నారు.
వైద్య నిపుణుల కొరత మరో కారణం...
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య నిపుణుల పోస్టులన్నీ దాదాపు ఖాళీగానే ఉన్నాయి. ఒకటీరెండు చోట్ల నిపుణులు ఉన్నప్పటికీ డిప్యుటేషన్‌పై పట్టణాల్లో సేవలందిస్తున్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ఎంబీబీఎస్ వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో కాన్పుల సమయంలో తల్లీబిడ్డకు ఏదైనా ప్రమాదం తలెత్తితే వెంటనే మెరుగైన చికిత్స చేసే వారు కరువయ్యారు.
వారిని అక్కడి నుంచి సమీపంలోని పట్టణాలకుగానీ, జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరానికిగానీ తరలించాల్సి వస్తోంది. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడం ప్రైవేటు వాహనాలను బాడుగకు మాట్లాడుకుని తరలించాలి. ఈలోగా వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా వైద్యశాలల్లో గైనకాలజిస్ట్‌లు, చిన్నపిల్లల వైద్యనిపుణులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. కారణాలు ఏవైనప్పటికీ మాతాశిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వాటి నివారణ కోసం ఖర్చు చేస్తున్న నిధులు బూడిదలో పోసిన పన్నీరులా మారుతున్నాయి. వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తీరు మారితేనే ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
గాలిలో దీపాలు..మాతాశిశు ప్రాణాలు
Published Wed, Oct 23 2013 6:10 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement