ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికీ దిక్కులేదు | No medicines in Andhra Pradesh Government Hospitals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికీ దిక్కులేదు

Published Mon, Dec 16 2024 4:48 AM | Last Updated on Mon, Dec 16 2024 2:48 PM

No medicines in Andhra Pradesh Government Hospitals

విశాఖ కేజీహెచ్‌లో అరకొర మందుల కోసం పడిగాపులు పడుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులు

పేరుకే పెద్దాస్పత్రులు.. ఏ మందులూ ఉండవు  

డ్రెస్సింగ్‌ మెటీరియల్‌కూ చేతులెత్తేస్తున్న వైనం

గ్యాస్, షుగర్, బీపీ సమస్యలకూ మందులివ్వలేని దైన్యం

అన్ని బయటికే రాస్తున్న వైద్యులు 

నిరుపేద రోగులపై మందుల భారం మోపుతున్న పాలకులు 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి  

విజయవాడ జీజీహెచ్‌లో జెంటామైసిన్‌ డ్రాప్స్, గ్లౌస్‌లూ కరువే 

మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌కు నోచుకోని గుంటూరు జీజీహెచ్‌ 

విశాఖ కేజీహెచ్‌లో ఏ అత్యవసర మందులూ లేవు 

అన్ని ఆస్పత్రుల్లో సర్జికల్‌ సరంజామా తెచ్చుకోవాల్సింది రోగులే  

ఆస్పత్రికి వచ్చింది మొదలు తిరిగి వెళ్లే వరకు అన్నీ కొనాల్సిందే 

ఎన్నిమార్లు ఇండెంట్‌ పెట్టినా మొద్దు నిద్ర వీడని సర్కారు

సాక్షి, అమరావతి: రోగులకు అవసరమైన మందులన్నింటినీ బయట తెచ్చుకోవాలంటూ రాస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఏపీఎంఎస్‌ఐడీసీ సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌(సీడీఎస్‌)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. 

ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్‌ల సూపరింటెండెంట్‌లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్‌ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో ఉండటం లేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది.  

రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్‌ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్‌ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్‌ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. 

ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్‌ స్టోర్‌లో ట్యూబ్స్‌ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు.  

పేరుకే పెద్దాస్పత్రులు.. ఏ మందులూ ఉండవు

మూడు దఫాలుగా బయటే కొంటున్నాను 
నేను వాచ్‌మెన్‌గా పని చేస్తుంటాను. నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. ఆ తర్వాత కాళ్ల నొప్పులు ఉన్నాయి. దీంతో తరచూ ఆస్పత్రికి చెకప్‌కు వస్తుంటాను. గడిచిన మూడు దఫాలుగా నొప్పులకు వాడే మందులు లేవని బయటకు రాస్తున్నారు. ఏం చేస్తాం? అతి కష్టంగా కొనుగోలు చేయక తప్పడం లేదు.      
– గోవింద్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు, విజయవాడ

మందులన్నీ బయటకే రాస్తున్నారు 
మా నాన్న తిరుపతికి షుగర్‌ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఉదయం నుంచి రాత్రి వరకు డాక్టర్లు చూస్తున్నా.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. మందులు ప్రతిదీ బయటకే రాస్తున్నారు. మందులకే రూ.1,800 ఖర్చు అయింది. సాయంత్రం 7.30 గంటలకు నమ్మకం లేదని చెప్పారు. పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తే రోగిని పట్టించుకోకపోవడం దుర్మార్గం.     
– క్రాంతి కుమార్, గద్వాల

షుగర్, బీపీ బిళ్లలకూ కటకట
బీపీ, షుగర్, గ్యాస్‌ వంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్‌ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్‌ మిక్ట్సార్డ్‌ ఇన్సులిన్‌ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్‌ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీíÙయా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్‌ కూడా అందుబాటులో లేక బయట కొనుగోలు చేయాలని రోగులపైనే భారం మోపుతున్నారు.  

విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేట్‌ మెడికల్‌ షాపులో మందులు కొనుగోలు చేస్తున్న రోగుల బంధువులు   

⇒ గుంటూరు జీజీహెచ్‌లో బ్యాక్టీరియా, ఇతర ఇన్‌ఫెక్షన్‌ చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్‌ యాంటిబయోటిక్స్, ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌లకు తీవ్ర కొరత ఉంది. పిప్లాజ్, మోరోపెనెమ్‌ వంటి మరికొన్ని యాంటి బయోటిక్స్, నెబులైజేషన్‌ మాస్క్‌లు, ప్లాస్టిక్‌ యాప్రాన్‌లు అందుబాటులో లేవు. మల్టీ విటమిన్‌ మాత్రలు ఉండటం లేదు. న్యూరో, కిడ్నీ, కార్డియాలజీ, పీడియాట్రిక్‌ విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. ఎముకలు, గైనిక్‌ విభాగాల్లో స్పైనల్‌ నీడిల్స్, రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కల్పించే బుటోర్పనాల్, ఫెంటానిల్, మత్తు ఇచ్చే ఇంజెక్షన్‌ల కొరత ఉంది.  

⇒ విజయవాడ జీజీహెచ్‌లో ఎగ్జామినేషన్‌ గ్లౌజ్‌లు, ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌లు, బ్లడ్‌ థిన్నర్, నొప్పులు, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌లకు సంబంధించిన మందులు, ఇంజెక్షన్‌ల కొరత వేధిస్తోంది. మెట్రోజిల్‌–400ఎంజీ, సిట్రిజన్‌ హెచ్‌సీఎల్‌ 10 ఎంజీ, క్లోరో ఫినరమైన్‌ హెచ్‌సీఎల్, బి.కాంప్లెక్స్, ఐరెన్‌ పోలిక్‌ యాసిడ్, నియోమైసిన్‌ టాబ్లెట్స్‌ కొరత ఉంది. నుప్రోసిన్, సిల్వర్‌ సల్పోడైజన్, పేరా మెట్రిన్, డైక్లో సోడియం ఆయింట్‌మెంట్లు లేవు. సిప్రో ప్లాక్సిన్, జెంటా­మైసిన్, జెంటాప్లాక్స్‌ డ్రాప్స్‌ లేవు.  పాంటాప్‌ ఇంజక్షన్ల కొరత ఉంది. 

డెలివరీ సర్జరీలకు, ఆపరేషన్‌ సమయంలో అవసరమైన మందులను, కిట్లను రోగులు ప్రైవేట్‌ దుకాణాల్లో కొనుక్కు రావాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా ఆస్పత్రిలో ఫ్లూ్కనజోల్, హైవిస్కిన్‌ బ్యూటైల్‌ బ్రోమైడ్, లంబార్‌ పంక్చర్‌ (ఎల్పీ సూది), ఎల్పీ నీడిల్, విటమిన్‌ కే 1 ఇంజెక్షన్‌తో పాటు పలు యాంటీబయోటిక్స్‌ అందుబాటులో లేవు. లివర్‌ సిర్రోసిస్‌ రోగులకు వాడే బిలిరుబిన్‌ ఇంజక్షన్‌ కొరత ఉంది. బ్రెయిన్‌ స్ట్రోక్‌ రోగులకు ఇచ్చే థ్రోంబలైజ్‌ ఇంజక్షన్స్‌ అందుబాటులో లేవు. ఇవన్నీ రోగులు బయటే  కొంటున్నారు. 

⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజిలు, ఐవీ సెట్‌లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్‌ ట్యూబ్స్, డిస్పోజబుల్‌ బెడ్‌షీట్స్, బెటాడియన్‌ సొల్యూషన్‌ కొరత ఉంది. ప్రోఫ్లాక్సిన్, గెటిఫ్లానిక్స్, జెంటామైసిన్, మాక్సీఫ్లాక్సిన్, మానసిక జబ్బులకు సంబంధించిన అమిజుల్రీ్ఫడే –200 ఎంజీ, లిథియం 450 ఎంజీ, క్వటియాపైన్‌ 25 ఎంజీ, క్లోజాఫైన్‌ 50 ఎంజీ, క్లోణజపం 0.5 ఎం.జీ., లోరాజెపామ్‌ 2 ఎం.జీ. మాత్రలు స్టాక్‌ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పాంటాప్‌ మాత్రలు కూడా లేవు.

⇒ విశాఖ కేజీహెచ్‌లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో ఉండటం లేదు. విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్టీ ఆస్పత్రి, రాణి చంద్రమతిదేవి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ మందుల కొరత ఉంది. దెబ్బలు తగిలిన వారికి డ్రెస్సింగ్‌ చేయడానికి కిట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్సులిన్, ఫిట్స్‌ నివారణ కోసం వాడే మందులు, అన్ని రకాల బ్లీడింగ్‌ నివారణకు వాడే మందులు, పలు రకాల యాంటి బయోటిక్స్, హిమోగ్లోబిన్‌ పెంచే మందులు, వెంటిలేటర్స్‌ కిట్స్, ఆక్సిజన్‌ పైపులు, కార్డియాలజీ సమస్యలకు వాడే మందుల కొరత తీవ్రంగా ఉంది. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, తిమ్మిర్ల నియంత్రణ, రుతుక్రమంలో వచ్చే లోపాల నియంత్రణ, ఆపరేషన్‌ సమయంలో కుట్లు వేసే దారం, మలబద్ధకం, గాయాలు మానడం కోసం వాడే మందులు, గర్భాశయ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందుల కొరత వేధిస్తోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి. 

⇒ కర్నూలు జీజీహెచ్‌లో యాంటిబయోటిక్స్‌ కొరత ఉంది. కార్డియాలజీ, న్యూరో, ఇతర సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. 

⇒ కడప రిమ్స్‌లో అధిక రక్తపోటు బాధితులు వాడే రామిప్రిల్, అమాక్సిలిన్‌ 500 ఎంజీ, డోపామైన్‌ వంటి చాలా రకాల మందుల సరఫరా ఆగిపోయింది.    


రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్‌ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్‌ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్‌ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్‌ స్టోర్‌లో ట్యూబ్స్‌ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు.    

ఇంజక్షన్లకు రోజుకు రూ.2 వేలు  
మా నాన్న ఆళ్ల పెంటారావుకు కాలు, చేయి పడిపోవడంతో విజయవాడ ఆస్పత్రికి తీసుకొచ్చాం. డాక్టర్లు పరీక్షించి పెరాలసిస్‌ అని నిర్ధారణ చేశారు. 

ఇంజక్షన్లు, మందుల కొరత తీవ్రంగా ఉండటంతో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. పిరాసెటమ్‌ ఇంజక్షన్, సిటికొలైన్‌ ఇంజక్షన్‌లు, లెవోకార్టినిటైన్‌ టాబ్లెట్స్, మొడాఫినైల్‌ టాబ్లెట్స్‌ ఇక్కడ ఆస్పత్రిలో లేకపోవడంతో రోజుకు రూ.2 వేలు  పెట్టి బయట కొంటున్నాం.     
– ఆళ్ల మహేష్‌, సీతానగరం, తాడేపల్లి, గుంటూరు జిల్లా  


ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలింత పేరు జ్యోతి. అనంతపురం జిల్లా యాడికి మండలం వెంకటాంపల్లి గ్రామం. బత్తలపల్లి ఆస్పత్రిలో సిజేరియన్‌ జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. వైద్యం అందించడంలో భాగంగా గైనిక్‌ వైద్యులు..  పారాసిటమాల్‌ ఇంజెక్షన్లు, థైరోనార్మ్, పారాసిటమాల్‌ ఇన్‌ఫ్యూషన్‌ ఐపీ తదితరాలు కావాలని చెప్పారు. సర్వజనాస్పత్రిలో అవి లేకపోవడంతో గత్యంతరం లేక జ్యోతి కుటుంబీకులు బయట ప్రైవేట్‌ మందుల షాపులో కొనుగోలు చేశారు. రూ.2 వేల వరకు ఖర్చు అయ్యింది.  

మచిలీపన్నానికి చెందిన ఎం.కామేశ్వరరావు కిడ్నీ 
సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఐదు రోజుల క్రితం చికిత్స కోసం గర్భిణి అయిన కుమార్తెను వెంట బెట్టుకుని విజయవాడ జీజీహెచ్‌కు వచ్చాడు. ఆస్పత్రికి రాకముందు 5గా ఉన్న అతడి క్రియాటిన్‌ లెవెల్, ఇప్పుడు 6.5 దాటింది. ఆస్పత్రిలో చూపించుకుంటే నోడోసిస్, ఆర్కామిన్‌ వంటి మాత్రలను బయట తెచ్చుకోవాలని రాశారు. సమస్య ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇక ఇంటికి వెళ్లిపోవాలంటూ వైద్యులు డిశ్చార్జి రాశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేసే కామేశ్వరరావు కుమార్తె సిబ్బందితో వాదించింది. 

సమస్య తగ్గకుండానే ఎలా డిశ్చార్జి చేస్తారని ప్రశ్నించడంతో డిశ్చార్జి చేయలేదు. ఆ తర్వాత మలబద్ధకం నివారణ కోసం ప్రోక్టోలిసిస్‌ ఎనిమా 100 ఎంఎల్‌ బయట తెచ్చుకోవాలని చీటి రాసిచ్చారు. ‘వచ్చిన రోజు నుంచి మందులు బయట తెచ్చుకోవాలని చీటిలు రాసిస్తున్నారు. మందులు ఎలాగోలా తిప్పలు పడి కొనుగోలు చేస్తాం. వార్డుల్లో రోగులను పట్టించుకుంటే చాలు. ఇక్కడికి వచ్చాక మా నాన్నకు జబ్బు తగ్గాల్సింది పోయి... పెరిగింది’ అని కామేశ్వరరావు కుమార్తె వాపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement