17 నుంచి వైద్యుల నియామకానికి ఇంటర్వ్యూలు | Interviews for appointment of doctors from 17 October Andhra Pradesh | Sakshi
Sakshi News home page

17 నుంచి వైద్యుల నియామకానికి ఇంటర్వ్యూలు

Published Wed, Oct 12 2022 6:10 AM | Last Updated on Wed, Oct 12 2022 7:00 AM

Interviews for appointment of doctors from 17 October Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: వైద్య శాఖలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు, ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ)లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ (సీఏఎస్‌ఎస్‌) పోస్టుల భర్తీకి ఈ నెల 17, 18, 19 తేదీల్లో వాకిన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావుండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో 40 వేలకు పైగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లలో భర్తీ చేసింది. ఇటీవల ఏపీవీవీపీలో 351 సీఏఎస్‌ఎస్, డీఎంఈలో 622 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటిలో సీఏఎస్‌ఎస్‌ పోస్టులు 240, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 304 భర్తీ అయ్యాయి. కొన్ని స్పెషాలిటీలు, సూపర్‌ స్పెషాలిటీల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, ఇతర నియామక నిబంధనలకు లోబడి అభ్యర్థులు లేకపోవడంతో మిగిలిన పోస్టులు భర్తీ అవ్వలేదు.

అలాగే గతంలో భర్తీ కాకుండా కొన్ని మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో డీఎంఈలో మిగిలిపోయిన 304 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఏపీవీవీపీలో 150 సీఏఎస్‌ఎస్‌ పోస్టులకు వాకిన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులను శాశ్వత ప్రాతిపదికన లేదా కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించనున్నారు. కాగా ఏపీవీవీపీలో వైద్యుల వినతి మేరకు బదిలీలకు ఇటీవల ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇందుకు 135 మంది వైద్యులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి బుధవారం బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

అన్ని పోస్టుల భర్తీకి చర్యలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఒక్కటి కూడా ఖాళీగా ఉండకూడదని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు పోస్టులన్నీ భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే స్పెషలిస్ట్, సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల పోస్టుల భర్తీకి వాకిన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాం. ఈ అవకాశాన్ని వైద్యులు సద్వినియోగం చేసుకోవాలి. 
– డాక్టర్‌ వినోద్‌ కుమార్, కమిషనర్, ఏపీవీవీపీ, ఇన్‌చార్జి డీఎంఈ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement