రాష్ట్రంలో భారీగా జరుగుతున్న సిజేరియన్లు
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ తగ్గిన సాధారణ ప్రసవాలు
ప్రైవేటు ఆస్పత్రుల్లో 80 శాతం వరకు అవే...
పురిటినొప్పుల భయంతో సాధారణ ప్రసవాలకు
విముఖత చూపుతున్న కొందరు గర్భిణులు
తగ్గిన మిడ్‌వైవ్స్ సేవలు... అవగాహన కల్పించని సర్కార్
సాధారణ ప్రసవాల సంఖ్య తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తగ్గుతోంది. కాసుల కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లే ఎక్కువగా నమోదవుతున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు (Cesarean) పెరిగాయి. సాధారణ ప్రసవాలపై వైద్యారోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పించాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు లేవు. గత ప్రభుత్వ హయాంలో సాధారణ ప్రసవాల పెంపునకు మొదలుపెట్టిన మిడ్‌వైవ్స్ (Midwife) సేవలు ఇప్పుడు నామమాత్రమయ్యాయి.
అమ్మో సాధారణ ప్రసవమా?
సాధారణ ప్రసవాల విషయంలో నొప్పులు అనుభవించాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొందరు గర్భిణులు విముఖత చూపుతున్నారు. కొందరు వైద్యులు సిజేరియన్లతో భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. శిశువు తలకిందులుగా ఉన్నప్పుడు, పెద్దగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. అయితే, సాధారణ ప్రసవంతో త్వరగా దినచర్యలో భాగం కావొచ్చని, సిజేరియన్లతో దీర్ఘకాలంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నా, గర్భిణులు, వారి కుటుంబసభ్యులు ఆపరేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.
మిడ్‌వైవ్స్ అంతంతే
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు గత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 2019లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మిడ్‌వైవ్స్ సేవలను ప్రారంభించి 30 మందికి శిక్షణ ఇవ్వగా, వీరు గర్భిణులకు సాధారణ ప్రసవంతో లాభాలను వివరించి వ్యాయామాల ద్వారా ప్రసవాలకు సిద్ధం చేసేవారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో ఇప్పుడా సేవలు అందుబాటులో లేవు.
అవగాహన కల్పించక..
గర్భిణిగా నమోదైనప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు ప్రభుత్వ ఆస్ప త్రిలో వైద్య సేవలు పొందితే వారి ఆరోగ్యంపై డాక్టర్లకు అవగాహన ఉంటుంది. అలా కాకుండా డెలివరీ సమయంలోనే వస్తుండడంతో ఏదో ఒక సమస్య తలెత్తగానే ఆపరేషన్ చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా సాధారణ ప్రసవాలతో కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిసినా, ఆ దిశగా ప్రయత్నించడం లేదు.
» భద్రాచలం ఏరియా ఆస్పత్రిని పరిశీలిస్తే షిఫ్ట్‌కు ఎనిమిది మంది చొప్పున మూడు షిఫ్ట్‌ల్లో 24 మంది సిబ్బంది ఉండాలి. కానీ ఐదుగురే ఉన్నారు.
» ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియా ఆస్పత్రిలోనూ 8 నెలలుగా మిడ్‌వైవ్స్ సేవలు నామమాత్రమయ్యాయి. ఇక్కడ నలుగురు సిబ్బంది చేయాల్సిన మిడ్‌వైవ్స్ సేవలు ఇద్దరే చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల సహకారంఉండటం లేదు..
ప్రసవం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోచేరిన గర్భిణులకు సాధారణ ప్రసవం చేసేందుకే ప్రయత్నిస్తున్నాం, కానీ వారి కుటుంబసభ్యులనుంచి సహకారం ఉండటం లేదు. గర్భిణి కొద్దిసేపు నొప్పులు తట్టుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు మాపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుతోంది.
- డాక్టర్ రామకృష్ణ, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, భద్రాచలం.
బిడ్డకు హార్ట్‌బీట్ ఎక్కువగా ఉందని..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సత్యవతికి గతనెల 31న పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తే పరీక్షలు చేసిన వైద్యులు బిడ్డ హార్ట్‌బీట్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ వెంటనే ఆపరేషన్‌కు నిర్ణయించి సత్యవతికి సిజేరియన్ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది.
- సత్యవతి,మణుగూరు,భద్రాద్రికొత్తగూడెం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment