
చట్టంలోని లొసుగులతో దందా చేస్తున్న కొన్ని ఆస్పత్రులు
ప్రస్తుత చట్టంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ అయితేకిడ్నీ మాత్రమే జనరల్ పూల్‌కు..
ఇలాంటి నిబంధనలను మార్చేలాసూచనలు చేసిన రాష్ట్ర కమిటీ
బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి 10 ఆర్గాన్స్‌లో 50% జనరల్ పూల్‌కు ఇచ్చేలా సిఫార్సు
సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదంతో త్వరలో కొత్త మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: అవయవ మార్పిడి పేరుతో జరుగుతున్న కార్పొరేట్ దందాకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మానవ అవయవాల మార్పిడి చట్టం (టీహెచ్‌ఓఏ)– 1994లో ఉన్న కొన్ని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకొని కార్పొరేట్ ఆసుపత్రులు సాగిస్తున్న అవయవ మార్పిడి వ్యాపారాన్ని అడ్డుకొనేందుకు కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే 2014లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన టీహెచ్‌ఓటీఏ– తోటా (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్)ను అడాప్ట్ చేసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టంలో రాష్ట్రాలకు ఇచ్చిన హక్కులను సద్వినియోగం చేసుకొంటూ, కొన్ని నిబంధనలను మార్చేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదంతో త్వరలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
ఒక్కో కేసు నుంచి 9 ఆర్గాన్స్ విక్రయం
జిల్లాల్లో గానీ, హైదరాబాద్‌లోని సాధారణ ప్రైవేటు ఆసుపత్రుల్లో గానీ బ్రెయిన్ డెడ్ అయిన కేసులు వెలుగు చూస్తే, కుటుంబసభ్యుల అనుమతితో ఆ విషయాన్ని ప్రభుత్వ ‘జీవన్‌దాన్’నోడల్ ఆఫీస్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి అవయవాలను సేకరించి ‘జనరల్ పూల్’కింద అవయవ మార్పిడి కోసం వేచి ఉన్న వారికి అమరుస్తారు. ఇక్కడే కార్పొరేట్ దందా మొదలవుతోంది.
జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకొనే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు బ్రెయిన్ డెడ్ వ్యక్తిని హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్పించి రికార్డులు మార్చి, బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసి, అవయవాల మార్పిడిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు.
కార్పొరేట్ ఆసుపత్రికి వచ్చిన రోగిని కేవలం 24 గంటల్లోపు బ్రెయిన్ డెడ్‌గా డిక్లేర్ చేయడం ద్వారా ఒక అవయవం (సాధారణంగా కిడ్నీ) మాత్రమే జనరల్ పూల్‌కు పంపే అవకాశం ఉంటుంది. మిగిలిన గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, చర్మం, పేగులు, శుక్లాలు వంటి 9 అవయవాలను కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు విక్రయించుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
జనరల్ పూల్‌కు వాటా పెంచే సూచన
కార్పొరేట్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి ఎక్కువ సంఖ్యలో జనరల్ పూల్‌కు ఆర్గాన్స్‌ను తీసుకునేలా నిపుణుల కమిటీ సూచనలు చేసినట్లు తెలిసింది. కార్పొరేట్ ఆసుపత్రిలో అవయవ మార్పిడికి సిద్ధంగా ఉన్న వ్యక్తికి అవసరమైన అవయవాన్ని అమర్చి, మిగతా అవయవాలను జనరల్ పూల్‌కు ఇవ్వడం, వాటిలో ‘జీవన్‌దాన్’లో నమోదై ఉన్న వారికి కనీసం 50 శాతం ఆర్గాన్స్‌ను అందించాలని చెప్పింది. దీనివల్ల కార్పొరేట్ దందాకు చెక్ పెట్టాలని భావిస్తోంది.
డిక్లరేషన్ సమయాన్ని మార్చాలి
ప్రస్తుత చట్టంలో ఆస్పత్రికి వచ్చిన రోగికి చికిత్స చేస్తూ, మెదడు స్పందించడం మానేస్తే... 24 గంటల్లోపు బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొన్న కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు జిల్లాల నుంచి వచ్చిన రోగులను ఆసుపత్రిలో చేర్చుకొని రికార్డులు మార్చి కొన్ని గంటల ముందు బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసి అవయవాలను సేకరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ టైమ్‌ను 48 గంటలు, లేదా 74 గంటలకు పెంచితే జిల్లాలు, దూరప్రాంతాల నుంచి వచ్చే రోగుల కుటుంబాలు, ఆర్‌ఎంపీలు, ఇతర డాక్టర్లతో బేరసారాలాడి ఆర్గాన్స్‌ను సేకరించే అవకాశం కోల్పోతారని కమిటీ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి కీలక మార్పులు సూచించినట్లు తెలిసింది.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే అవయవదానాలపై..
రాష్ట్రంలో వేలాది ఆసుపత్రులు ఉన్నప్పటికీ అవయవ మార్పిడి చేసే అనుమతి హైదరాబాద్‌లోని 41 ఆసుపత్రులకు మాత్రమే ఉంది. అందులో ప్రభుత్వ పరిధిలోని నిమ్స్, గాం«దీ, ఉస్మానియా, ఈఎస్‌ఐసీ ఆసుపత్రులు.. కాగా, మిగతా 37 ఆసుపత్రులు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులే. ఇవి కాకుండా కరీంనగర్‌లోని అపోలో రీచ్, హైదరాబాద్‌లోని మరో ఏడు ఆసుపత్రులకు అవయవాలను సేకరించి భద్రపరిచేందుకు మాత్రమే అనుమతి ఉంది. నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన అవయవాలను జనరల్ పూల్‌లోనే వరుస సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు.
ప్రస్తుతం జీవన్‌దాన్ వద్ద ఆర్గాన్స్ కోసంవేచి చూస్తున్నవారు: 4,000