టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం
నకిలీ వైద్యులు, భారీగా వసూళ్లకు పాల్పడుతున్న ఆస్పత్రులపై ఉక్కుపాదం
ఉమ్మడి జిల్లా యూనిట్‌గా వైద్యులతో బృందాల ఏర్పాటు
సభ్యులుగా పోలీస్, ఆరోగ్య, డ్రగ్ కంట్రోల్, జర్నలిస్టు, ఎన్జీవోలు కూడా..
ఇప్పటికే వరంగల్, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్‌లో బృందాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ వైద్యులు, ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) సిద్ధమైంది. ఎలాంటి సదుపాయాలు లేకపోయినా వైద్యం పేరిట పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్న ఆసుపత్రులతో పాటు ఎంబీబీఎస్ డాక్టర్ల పేరిట, స్పెషలిస్ట్ వైద్యులుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నవారి ఆట కట్టించేందుకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న విజిలెన్స్ బృందాలకు తోడు ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక మెడికల్ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. వరంగల్, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ బృందాలు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, విచారణ జరిపి, అవసరమైన చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నాయి.
ఒక్కో టీంలో 30 మంది వైద్యులు
టీజీఎంసీ మెడికల్ టాస్క్‌ఫోర్స్ ఒక్కో బృందంలో దాదాపు 30 మంది స్పెషలిస్టు డాక్టర్లు ఉంటారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (తానా), హెల్త్‌కేర్ రిఫారŠమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్‌ఆర్డీఏ), తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ)లకు చెందిన డాక్టర్లు ఇందులో ఉంటారు. మెడికల్ అండ్ హెల్త్, డ్రగ్ కంట్రోల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పోలీస్ ఆధికారులు, న్యాయవాదులు, ఎన్జీవోల ప్రతినిధులు, జర్నలిస్టులను సైతం ఈ బృందాల్లో భాగస్వాములను చేస్తున్నారు.
ఎక్కడికక్కడ నిఘా
నకిలీ వైద్యులు, ఆసుపత్రులపై ఎక్కడికక్కడ నిఘా పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాల్లో కీలక రంగాలవారికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విజిలెన్స్ టీంలు క్రియాశీలంగా పనిచేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. టీజీఎంసీ బృందాల ద్వారా క్షేత్రస్థాయి వరకు నిఘా ఉంటుందని భావిస్తున్నారు. గ్రామాల్లోని ఆర్‌ఎంపీలు, ప్రాథమిక చికిత్స క్లినిక్‌లు, అంబులెన్స్ సర్వీస్‌లు నడిపేవారు పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు దళారులుగా వ్యవహరిస్తున్న అంశాన్ని టీజీఎంసీ సీరియస్‌గా పరిగణిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు విజిలెన్స్ బృందాల తనిఖీల్లో 400 మంది నకిలీ డాక్టర్లు, ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment