telangana medical council
-
గర్భ విచ్ఛిత్తికి ఆర్ఎంపీల ప్రోత్సాహం
ఎంజీఎం: ఆర్ఎంపీ, పీఎంపీల వైద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడంపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా హనుమకొండ జీఎంహెచ్ ఆస్పత్రి నుంచి వచ్చిన మహిళల ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు నరేష్, ఐఎంఏ అధ్యక్షుడు అన్వర్ ఆదివారం విచారణ చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన నాలుగు నెలల గర్భిణి అక్టోబర్ 3న మంగపేటకు చెందిన ఆర్ఎంపీ రామును కలవగా, గర్భ విచ్ఛిత్తికి మందులు ఇచ్చాడు. కడుపు నొప్పి రావడంతో మరిన్ని ట్యాబ్లెట్లు ఇవ్వగా.. కొంత ఉపశమనం కలిగినా, మళ్లీ నొప్పి తీవ్రత పెరగడంతో కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ఈనెల 1న హనుమకొండ జీఎంహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి గర్భాశయం పగలడంతోపాటు శరీరంలోని రక్తం విషతుల్యమైందని నిర్ధారించారు. గర్భసంచి తొలగించి వెంటిలేటర్ చికిత్స అందించడానికి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల తనిఖీ బృందం గుర్తించింది. ఈ ఘటనపై ములుగు జిల్లా వైదారోగ్యశాఖ అధికారులు, పోలీసులకు సదరు ఆర్ఎంపీపై ఫిర్యాదు చేయనున్నట్టు కౌన్సిల్ సభ్యులు తెలిపారు.సిద్దిపేట జిల్లా అక్కంపేట మండలానికి చెందిన మరో గర్భిణికి సైతం కేశవపూర్‌కు చెందిన రమణాచారి అనే నకిలీ వైద్యుడు గర్భ విచ్ఛిత్తికి మందులు ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయస్థితికి చేరుకుందని చెప్పారు. ఆమె ప్రాణాలను కాపాడిన వైద్యులు టీజీఎంసీ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు అతడిపై కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు.ములుగులో మెడికల్ స్టోర్ యజమాని సొంత వైద్యం ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన మరో గర్భిణికి జిల్లా కేంద్రం బస్టాండ్ సమీపాన ఉన్న మెడికల్ స్టోర్ యజమాని ఇచ్చిన గర్భ విచ్ఛిత్తి మందులు వేసుకున్నాక..ఆమె స్పృహ కోల్పోవడంతో హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు కౌన్సిల్ సభ్యులు తెలిపారు. వైద్యులు సత్వర చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు.బాధిత మహిళ షాపు పేరు చెప్పకపోవడంతో ములుగు జిల్లా బస్టాండ్ ప్రాంతంలో అన్ని మందుల దుకాణాలను తనిఖీ చేసి సదరు మెడికల్ స్టోర్లపై చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
టీఎస్‌ఎంసీలో సభ్యుల తగ్గింపుపై తీర్పు 18న
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్(టీఎస్ఎంసీ)లో ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల సంఖ్య తగ్గింపుపై దాఖలైన పిటిషన్లో తీర్పును హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. ఈలోగా గతంలో ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏమైనా ఉంటే కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ న్యాయవాదికి స్పష్టం చేసింది. టీఎస్‌ఎంసీలో ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల సంఖ్య తగ్గింపుపై హెల్త్‌కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది సామ సందీప్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం 13 నుంచి 5కు తగ్గించడం అన్యాయం, చట్టవిరుద్ధమన్నారు. అప్పుడు ప్రభుత్వ నామినేటెడ్ సభ్యులు ఆరుగురిదే పైచేయి అవుతుందన్నారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ కూడా ప్రభుత్వం చెప్పిన వారికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ‘అటానమస్’హోదా కూడా కోల్పోతుందని వెల్లడించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య దాదాపు 90 వేలకు పైగా ఉండేదన్నారు. ఇప్పుడు అది దాదాపు 37 వేలకు తగ్గిందని.. ఈ నేపథ్యంలోనే ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల సంఖ్యను కూడా తగ్గించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అవకాశం ఇవ్వాల్సి ఉన్న క్రమంలో నామినేటెడ్ సభ్యుల సంఖ్యను మాత్రం తగ్గించలేదని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. -
మెడి‘కిల్’ సీట్లపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెన్నార్, మహవీర్, టీఆర్ఆర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది చేరిన ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల అడ్మిషన్లను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వైద్య విద్యా సంచాలకుడు రమేశ్‌రెడ్డి ఇందులో ఉన్నారు. అడ్మిషన్లు పూర్తయి, తరగతులు కూడా ప్రారంభించాక మెడికల్ సీట్లను ఉపసంహరించుకోవడం సమంజసం కాదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని కమిటీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీ అధికారులతో కమిటీ పలు దఫాలుగా మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు చెందిన విద్యార్థులు కొందరు మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి గోడు విన్నవించుకున్నారు. మరికొందరు విద్యార్థులు వరంగల్‌లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులను కలిసి తమ పరిస్థితిని విన్నవించారు. సర్దుబాటు సాధ్యం కాదు! ఒకవైపు ఉన్నతస్థాయి కమిటీ సంప్రదింపులు కొనసాగుతుండగా మరోవైపు ఎన్ఎంసీకి నేరుగా లేఖ రాయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మంత్రి హరీశ్‌రావును కలిసిన సందర్భంగా ఆయన ఈ విషయం తమకు చెప్పినట్లు విద్యార్థులు వెల్లడించారు. అడ్మిషన్లకు ముందు అనుమతి ఇచ్చి విద్యార్థులు చేరిన తర్వాత కొంతకాలానికే వాటిని ఉపసంహరించుకోవడం వల్ల విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, కాబట్టి వారు ఈ సంవత్సరం ఆయా కాలేజీల్లోనే చదివేలా చూడాల్సిందిగా లేఖలో కోరాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కాలేజీలు నిర్ణీత సమయంలోగా లోపాలను సరిచేసుకునేలా యాజమాన్యాలను ఆదేశించాలి్సందిగా ఎన్ఎంసీకి సూచించడంతోపాటు ఆ మేరకు ప్రభుత్వం కూడా ప్రైవేటు కాలేజీలపై ఒత్తిడి తెస్తుందనే హామీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మూడు కాలేజీల్లో పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థులను ఇతర చోట్ల సర్దుబాటు చేయడం సాధ్యం కాదనే విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించే అవకాశముందని చెబుతున్నారు. కోర్టుకెళ్లడమే మార్గమా? వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినా ఆయా కాలేజీల యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలు లేనప్పుడు కౌన్సెలింగ్జాబితాలో వాటిని ఎందుకు చూపించాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కాళోజీ వర్సిటీపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల యాజమాన్యాల కారణంగా ఉత్పన్నమైన ఈ సమస్య పరిష్కారానికి కోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గమని కొందరు అధికారులు చెబుతున్నారు. కాగా, మరిన్ని ప్రైవేటు కాలేజీల్లో సీట్లు రద్దయ్యే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారంతో వసతులు సరిగా లేని కాలేజీల యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. ప్రొఫెసర్లను మీరే తెచ్చుకోండి.. ఇదీ ఓ కాలేజీ వరస మౌలిక వసతులు లేకపోవడం, అధ్యాపకుల కొరత వంటి ప్రధాన కారణాలతోపాటు ఇతరత్రా కారణాలతో ఎన్ఎంసీ అడ్మిషన్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఒక కాలేజీలో కీలకమైన పీజీ స్పెషలైజేషన్‌కు ప్రొఫెసర్లు లేనేలేరు. లైబ్రరీ వసతి లేదు. దీనిపై కొందరు విద్యార్థులు ఇటీవల యాజమాన్యాలను నిలదీస్తే ‘మీరే ప్రొఫెసర్లను తెచ్చుకోండి’ అంటూ దురుసుగా సమాధానమిచ్చారని విద్యార్థులు తెలిపారు. ఇలాంటి కాలేజీల్లో చేరి తాము తప్పు చేశామని, ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి పెట్టి ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. -
మూడో వేవ్‌పై ఆందోళనొద్దు.. ఏడాదికోసారి టీకా
సాక్షి, హైదరాబాద్: రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలున్న కొందరు కరోనా మూడో డోస్ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. మిగతావారు రెండు డోసులు తీసుకుంటే సరిపోతుందన్నారు. వ్యాక్సిన్ ప్రభావం ఏడాది పాటు ఉంటుందని, తర్వాత సంవత్సరానికోసారి కోవిడ్ టీకా తీసుకోవాల్సిన అవసరం పడుతుందని చెప్పారు. మంగళవారం రాష్ట్ర వైద్య మండలి ఆధ్వర్యంలో ‘కోవిడ్–19: నేర్చుకున్న పాఠాలు, భవిష్యత్ వ్యూహాలు’ అంశంపై ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, మరికొందరు వైద్య నిపుణులు మాట్లాడారు. ఫ్లూ, కోవిడ్ టీకాలు రెండూ కలిపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి సూచించారు. ఒక డోసు కోవాగ్జిన్ తీసుకుని రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకున్నా ఏమీకాదని.. ‘టీకాల మిక్స్ అండ్ మ్యాచ్’ విషయంలో మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. డెల్టా ప్లస్ వేరియెంట్పైనా ప్రస్తుత వ్యాక్సిన్లు బాగానే పనిచేస్తున్నాయని.. దీనిపై తాము చేస్తున్న పరిశోధనల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధిని 12 వారాల నుంచి 8 వారాలకు తగ్గిస్తే మంచిదనే సూచనలు వస్తున్నాయన్నారు. దేశంలో రోజుకు కోటి మందికి చొప్పున టీకాలు వేస్తేనే మంచిదని, దీనిని సాధించేందుకు వ్యాక్సిన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవాల్సి ఉందని నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది చివరిలోగా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరం ఉందని.. అప్పటిదాకా వ్యాక్సినేషన్‌తోపాటు అందరూ మాస్క్‌లు, ఇతర కోవిడ్ జాగ్రత్తలు కచ్చితంగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ వస్తుందనే ఆందోళన అవసరం లేదని.. రాబోయే రోజుల్లో ఒకటి తర్వాత మరొకటి చిన్న చిన్న వేవ్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చినపుడు ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేకున్నా కూడా ప్రమాదకర స్థాయిలో థర్డ్ వేవ్ రాలేదని గుర్తు చేశారు. కొత్త వేరియంట్లను అదుపుచేసేలా టీకాలు రావాలి: గులేరియా కోవిడ్ వ్యాక్సిన్లపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, సందేహాలను హెల్త్ వర్కర్లు దూరం చేయాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కేసులు, తీవ్రత పెరగడానికి కరోనా డెల్టా వేరియెంట్ కారణమని చెప్పారు. వీలైనంతగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుకుని, ఎక్కువ మందికి వేయించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న నాలుగు నుంచి ఆరు వారాల్లో వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంటుందని ఆశాభావం వెలిబుచ్చారు. భవిష్యత్‌లో ఉత్పత్తి చేసే టీకాలు కొత్త వేరియెంట్లను అదుపు చేసేలా ఉండాలన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని గులేరియా సూచించారు. కరోనా నుంచి కోలుకున్నాక రెండు, మూడు నెలల పాటు పోస్ట్ కోవిడ్ సమస్యలు ఉంటాయని చెప్పారు. మ్యుకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నుంచి బయటపడ్డాక 18 రోజుల సమయంలో అది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎస్ సోమేశ్ ఒకవేళ కరోనా మూడో వేవ్ వస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పారు. కోవిడ్ నియంత్రణ కోసం పటిష్ట చర్యలు చేపట్టేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని కార్యోన్ముఖులను చేయడంలో సీఎం కేసీఆర్ ముందున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ స్వయంగా గాంధీ, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులను సందర్శించి రోగులు, వైద్యుల్లో మనోస్టైర్యాన్ని పెంచారని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుందని, ఫలితంగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్రియాశీలంగా వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర వైద్యులు, సిబ్బంది భాగస్వాములై కరోనాను పూర్తిగా పారదోలేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వెబినార్‌లో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో వివిధ అంశాలపై హైదరాబాద్‌లోని వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల వైద్య నిపుణులు ప్రసంగించారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై టీఎస్ఎంఎస్ రూపొందించిన మూడు నిముషాల నిడివి గల వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. -
ఆపరేషన్..పరేషాన్
-
అనైతిక వైద్యులపై నిషేధం కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: అనైతిక వైద్యుల ప్రాక్టీసుపై విధించిన నిషేధం కొనసాగుతుందని తెలంగాణ వైద్యమండలి ప్రకటించింది. గతంలో చేపట్టిన విచారణను, జారీ చేసిన నిషేధిత ఉత్తర్వులను సవాల్ చేస్తూ సదరు వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ వైద్యమండలి బుధవారం బాధితుల వాదనలు వినడమే కాకుండా సద రు వైద్యుల నుంచి వివరణ కోరింది. అయితే, చికిత్సలకు సంబంధించి సరైన ఆధారాలను వైద్యులు సమర్పించలేదు. దీంతో గతంలో జారీ చేసిన నిషేధిత ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని వైద్య మండలి మరోసారి నిర్ణయించిందని చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి ప్రకటించారు. గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్‌రెడ్డి ఎత్తు పెంపునకు చికిత్స చేసిన ఆర్థోపెడిక్ డాక్టర్ చంద్రభూషణ్ ప్రాక్టీస్‌ను రెండేళ్లపాటు నిలుపుదల చేస్తూ 2016 నవంబర్‌లో తెలంగాణ వైద్యమండ లి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రభూషణ్ ప్రాక్టీసుపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. కూకట్‌పల్లిలోని శృతిటెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ప్రాక్టీస్‌పై ఐదేళ్లపాటు, అభిప్రాయభేదాలు తలెత్తిన దంపతులకు ఒకే సమయంలో కాకుండా వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహించి మోసం చేసిన బేగంపేటలోని సైక్రియాటిస్ట్ డాక్టర్ సోనాకాకర్ ప్రాక్టీస్‌పై ఆరు మాసాలు నిషేధం విధించింది. సికింద్రాబాద్‌లోని ఇన్ఫెర్టిలిటీ ఇనిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ మమత దీన్‌దయాళ్, భువనగిరిలోని కస్తూరి ఆస్పత్రికి చెందిన డాక్టర్ కేఎల్ఎన్ ప్రసాద్‌లకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. -
వైద్య వృత్తిని పటిష్టం చేయడంలో ఐఎంఏ కీలకం
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి హైదరాబాద్: వైద్య వృత్తిని పటిష్టం చేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కీలకంగా పనిచేస్తుందని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కోఠిలోని ఐఎంఎ ఆడిటోరియంలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న వైద్యులు ఈ నెల 30వ తేది వరకు ఏలాంటి అపరాధ రుసుం లేకుండా తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలన్నారు. డాక్టర్లకు 30 క్రెడిట్ అవర్స్ నిబంధన సడలింపు జరిగిందని దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో వైద్యుల కొరతను దృష్టిలో ఉంచుకుని పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్యులకు ఎమ్మెల్సీ సీటును కేటారుుంచాలని కోరారు. అనంతరం ఐఎంఏ నియమ నిబంధనల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ భరత్‌ప్రకాశ్, ఐఎంఏ జాతీయ మాజీ అధ్యక్షుడు భూంరెడ్డి, గవర్నమెంట్ డాక్టర్ల వింగ్ చైర్మన్ డాక్టర్ రవిశంకర్, ఎ. గోపాలకిషణ్, డాక్టర్ బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వాడి బాధ చూడలేకపోతున్నాం.. చికిత్స నిలిపేయండి
వైద్యుడికి నిఖిల్‌రెడ్డి తల్లిదండ్రుల అభ్యర్థన సాక్షి, హైదరాబాద్: మూడు ఇంచుల ఎత్తు పెంపు కోసం కాళ్లకు శస్త్రచికిత్స చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి నిఖిల్‌రెడ్డి కోరిక నెరవేరకుండానే చికిత్స ప్రక్రియ నిలిచిపోయింది. తమ కొడుకు రోజూ పడుతున్న నరకయాతన చూడలేకపోతున్నామని, రెండు కాళ్లలో ‘ఇల్‌జర్వ్’ పద్ధతిలో వేసిన రాడ్లతో ఎముకల పెంపు చికిత్సను నిలిపేయాల్సిందిగా తండ్రి గోవర్ధన్‌రెడ్డి వైద్యులను కోరారు. ఈ మేరకు వీడియో ఫుటేజీతో పాటు, లిఖిత పూర్వక లేఖను గ్లోబల్ ఆసుపత్రి వైద్యుడు చంద్రభూషణ్‌కు అందజేశారు. రెండు మాసాల్లో నిఖిల్‌రెడ్డి కాళ్ల ఎముకలు 1.1 ఇంచుల మేర పెరిగాయని వైద్యులు చెబుతుంటే... పెరిగింది కండ మాత్రమేనని అతడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. నొప్పుల బాధ భరించలేక రోజూ మూడు పెయిన్‌కిల్లర్ ఇంజక్షన్లు తీసుకోవాల్సి వస్తోందన్నారు. అనైతికంగా, అశాస్త్రీయంగా తన కుమారుడికి చేసిన శస్త్రచికిత్స విఫలమైందని గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరెవరూ తన కుమారుడిలా బాధ పడకూడదని, ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. మెడికల్ కౌన్సిల్ విచారణ: నిఖిల్‌రెడ్డి శస్త్రచికిత్సపై ఇప్పటికే ఫిర్యాదులు స్వీకరించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణను ముమ్మరం చేసింది. నిఖిల్ ఆరోగ్య పరిస్థితి, వైద్యులు ఏం చెప్పారు తదితర వివరాలు ఇవ్వాలని అతడి తండ్రి గోవర్ధన్‌రెడ్డికి లేఖ పంపించింది. -
కాసులకు కక్కుర్తి పడి గర్భసంచి ఆపరేషన్లు
కరీంనగర్ జిల్లా దూలూరులో 200 మందికిపైగా బాధితులు కథలాపూర్: కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలో అనవసరపు ఆపరేషన్ల వ్యవహారం వెలుగుచూసింది. కొంతమంది వైద్యులు, ఆర్ఎంపీలు, పీఎంపీలు కాసుల కక్కుర్తితో అడ్డగోలుగా అపెండిసైటిస్ ఆపరేషన్లు చేయడం రాష్ట్రంలో సంచల నం సృష్టించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు తెలంగాణ వైద్యమండలి, వైద్య, ఆరోగ్యశాఖ విచారణ జరుపుతున్నారుు. ఈ క్రమంలో మండలంలోని దూలూ రులో గర్భసంచి ఆపరేషన్ల తొలగింపు విషయం వెలుగులోకి వచ్చింది. 200 మందికిపైగా బాధితులు ఉన్నట్లు తెలిసింది. అంతా 40 ఏళ్ల లోపు వారే : మహిళలకు 45 ఏళ్ల పైబడిన తర్వాత గర్భసంచికి సంబంధించిన ఏదైనా ఆరోగ్య సమస్యలుంటేనే వారికి ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించాల్సి ఉం టుందని వైద్యులు పేర్కొంటున్నారు. దూలూర్‌లో 1,800 మంది జనాభా ఉండగా మహిళలు 700 మంది ఉన్నారు. ఇందులో 25 నుంచి 40 ఏళ్లలోపు వారు 350 మంది మహిళలు ఉన్నట్లు స్థానిక అధికారులు చెప్పారు. 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకే గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు జరిగినట్లు తేలింది. గర్భసంచి తొలగింపు ఆపరేషన్‌కు రూ.30వేల వరకు ప్రైవేట్ ఆస్పత్రిలో వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. కేసులు తీసుకొచ్చిన గ్రామీణ వైద్యుడికి రూ.10వేల చొప్పున కమీషన్ ఇచ్చినట్లు సమాచారం. గర్భసంచి తొలగింపు ఆపరేషన్లపైనా విచారణ నిర్వహిస్తే మరిన్ని విషయూలు బహిర్గతమయ్యే అవకాశముంది. -
ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే అక్కడే ప్రాక్టీస్
* లేదంటే వైద్యానికి గుర్తింపు ఉండదు * మెడికో లీగల్, ఆరోగ్యశ్రీ క్లెయిముల తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: ఎక్కడో రిజిస్ట్రేషన్ చేశాం.. కానీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం.. అంటే వైద్యులకు కుదరదు. ఈ రాష్ట్రంలో ప్రాక్టీస్ చెయ్యాలంటే ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి... ఇదీ తాజా నిబంధన. గతంలో భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) రిజిస్ట్రేషన్(సెంట్రల్ రిజిస్ట్రేషన్)తో ఎక్కడైనా వైద్యం చేసుకునే అవకాశం ఉండేది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ నిబంధన మార్చారు. ఎంబీబీఎస్ గానీ, పీజీగానీ పూర్తి చేసి, ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే ఏపీ లేదా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఇందుకు విధిగా ఏడాది ప్రభుత్వ సర్వీసు చేసి ఉండాలి. హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో చాలామంది ఉత్తరాదికి చెందిన వైద్యులు వైద్యం చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన అనేకమంది ఇతర రాష్ట్రాల్లో పీజీ పూర్తి చేసిన వాళ్లున్నారు. వీళ్లందరూ విధిగా ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసు (ఏదో ఒక ప్రభుత్వాసుపత్రిలో వైద్యం) చేస్తేనే మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తోంది. ఆస్పత్రుల్లో ప్రభుత్వ సర్వీసు చేసినట్టు ధ్రువీకరణ తెస్తేనే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తున్నారు. ఒక వేళ ఇక్కడ రిజిస్ట్రేషన్ చెయ్యకపోతే.. ఆ వైద్యుల ప్రాక్టీస్‌కు గుర్తింపు ఉండదు. అంటే మెడికో లీగల్ కేసులకు ఇలా గుర్తింపులేని వైద్యుల ట్రీట్మెంట్ చెల్లదు. ఆరోగ్యశ్రీ కేసులకు క్లెయిమ్ చేసుకోవడానికి అనర్హులు. వీరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లకు ఇన్సూరెన్స్ క్లెయిము చేసుకునేందుకు వీలులేదు. విధిగా ఏపీ/ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆనంబరును విధిగా నోట్ చేసి ఉంటేనే క్లెయిములు వస్తాయి. అయినా సరే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వందలాదిమంది వైద్యులు ప్రాక్టీస్ చేస్తుండటం గమనార్హం.