వైద్య వృత్తిని పటిష్టం చేయడంలో ఐఎంఏ కీలకం
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి
హైదరాబాద్: వైద్య వృత్తిని పటిష్టం చేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కీలకంగా పనిచేస్తుందని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కోఠిలోని ఐఎంఎ ఆడిటోరియంలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న వైద్యులు ఈ నెల 30వ తేది వరకు ఏలాంటి అపరాధ రుసుం లేకుండా తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలన్నారు.
డాక్టర్లకు 30 క్రెడిట్ అవర్స్ నిబంధన సడలింపు జరిగిందని దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో వైద్యుల కొరతను దృష్టిలో ఉంచుకుని పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్యులకు ఎమ్మెల్సీ సీటును కేటారుుంచాలని కోరారు. అనంతరం ఐఎంఏ నియమ నిబంధనల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ భరత్‌ప్రకాశ్, ఐఎంఏ జాతీయ మాజీ అధ్యక్షుడు భూంరెడ్డి, గవర్నమెంట్ డాక్టర్ల వింగ్ చైర్మన్ డాక్టర్ రవిశంకర్, ఎ. గోపాలకిషణ్, డాక్టర్ బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.