విచారణ చేపట్టిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు
ములుగు జిల్లా మహిళ పరిస్థితి విషమం
ఎంజీఎంలో చికిత్స అందిస్తున్న వైద్యులు
ఎంజీఎం: ఆర్‌ఎంపీ, పీఎంపీల వైద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడంపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా హనుమకొండ జీఎంహెచ్ ఆస్పత్రి నుంచి వచ్చిన మహిళల ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు నరేష్, ఐఎంఏ అధ్యక్షుడు అన్వర్ ఆదివారం విచారణ చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన నాలుగు నెలల గర్భిణి అక్టోబర్ 3న మంగపేటకు చెందిన ఆర్‌ఎంపీ రామును కలవగా, గర్భ విచ్ఛిత్తికి మందులు ఇచ్చాడు.
కడుపు నొప్పి రావడంతో మరిన్ని ట్యాబ్లెట్లు ఇవ్వగా.. కొంత ఉపశమనం కలిగినా, మళ్లీ నొప్పి తీవ్రత పెరగడంతో కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ఈనెల 1న హనుమకొండ జీఎంహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి గర్భాశయం పగలడంతోపాటు శరీరంలోని రక్తం విషతుల్యమైందని నిర్ధారించారు.
గర్భసంచి తొలగించి వెంటిలేటర్ చికిత్స అందించడానికి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల తనిఖీ బృందం గుర్తించింది. ఈ ఘటనపై ములుగు జిల్లా వైదారోగ్యశాఖ అధికారులు, పోలీసులకు సదరు ఆర్‌ఎంపీపై ఫిర్యాదు చేయనున్నట్టు కౌన్సిల్ సభ్యులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా అక్కంపేట మండలానికి చెందిన మరో గర్భిణికి సైతం కేశవపూర్‌కు చెందిన రమణాచారి అనే నకిలీ వైద్యుడు గర్భ విచ్ఛిత్తికి మందులు ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయస్థితికి చేరుకుందని చెప్పారు. ఆమె ప్రాణాలను కాపాడిన వైద్యులు టీజీఎంసీ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు అతడిపై కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు.
ములుగులో మెడికల్ స్టోర్ యజమాని సొంత వైద్యం
ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన మరో గర్భిణికి జిల్లా కేంద్రం బస్టాండ్ సమీపాన ఉన్న మెడికల్ స్టోర్ యజమాని ఇచ్చిన గర్భ విచ్ఛిత్తి మందులు వేసుకున్నాక..ఆమె స్పృహ కోల్పోవడంతో హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు కౌన్సిల్ సభ్యులు తెలిపారు. వైద్యులు సత్వర చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు.
బాధిత మహిళ షాపు పేరు చెప్పకపోవడంతో ములుగు జిల్లా బస్టాండ్ ప్రాంతంలో అన్ని మందుల దుకాణాలను తనిఖీ చేసి సదరు మెడికల్ స్టోర్‌లపై చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment