మూడో వేవ్‌పై ఆందోళనొద్దు.. ఏడాదికోసారి టీకా | Telangana Medical Council Webinar On Covid-19 | Sakshi
Sakshi News home page

మూడో వేవ్‌పై ఆందోళనొద్దు.. ఏడాదికోసారి టీకా

Published Wed, Jun 16 2021 1:55 AM | Last Updated on Wed, Jun 16 2021 1:57 AM

Telangana Medical Council Webinar On Covid-19 - Sakshi

వెబినార్‌లో మాట్లాడుతున్న డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌:  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలున్న కొందరు కరోనా మూడో డోస్‌ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. మిగతావారు రెండు డోసులు తీసుకుంటే సరిపోతుందన్నారు. వ్యాక్సిన్‌ ప్రభావం ఏడాది పాటు ఉంటుందని, తర్వాత సంవత్సరానికోసారి కోవిడ్‌ టీకా తీసుకోవాల్సిన అవసరం పడుతుందని చెప్పారు. మంగళవారం రాష్ట్ర వైద్య మండలి ఆధ్వర్యంలో ‘కోవిడ్‌–19: నేర్చుకున్న పాఠాలు, భవిష్యత్‌ వ్యూహాలు’ అంశంపై ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా, డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, మరికొందరు వైద్య నిపుణులు మాట్లాడారు. ఫ్లూ, కోవిడ్‌ టీకాలు రెండూ కలిపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి సూచించారు.

ఒక డోసు కోవాగ్జిన్‌ తీసుకుని రెండో డోస్‌ కోవిషీల్డ్‌ తీసుకున్నా ఏమీకాదని.. ‘టీకాల మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌’ విషయంలో మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. డెల్టా ప్లస్‌ వేరియెంట్‌పైనా ప్రస్తుత వ్యాక్సిన్లు బాగానే పనిచేస్తున్నాయని.. దీనిపై తాము చేస్తున్న పరిశోధనల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కోవిషీల్డ్‌ రెండో డోసు వ్యవధిని 12 వారాల నుంచి 8 వారాలకు తగ్గిస్తే మంచిదనే సూచనలు వస్తున్నాయన్నారు. దేశంలో రోజుకు కోటి మందికి చొప్పున టీకాలు వేస్తేనే మంచిదని, దీనిని సాధించేందుకు వ్యాక్సిన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవాల్సి ఉందని నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది చివరిలోగా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరం ఉందని.. అప్పటిదాకా వ్యాక్సినేషన్‌తోపాటు అందరూ మాస్క్‌లు, ఇతర కోవిడ్‌ జాగ్రత్తలు కచ్చితంగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. థర్డ్‌ వేవ్, ఫోర్త్‌ వేవ్‌ వస్తుందనే ఆందోళన అవసరం లేదని.. రాబోయే రోజుల్లో ఒకటి తర్వాత మరొకటి చిన్న చిన్న వేవ్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. వందేళ్ల క్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేకున్నా కూడా ప్రమాదకర స్థాయిలో థర్డ్‌ వేవ్‌ రాలేదని గుర్తు చేశారు.

కొత్త వేరియంట్లను అదుపుచేసేలా టీకాలు రావాలి: గులేరియా 
కోవిడ్‌ వ్యాక్సిన్లపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, సందేహాలను హెల్త్‌ వర్కర్లు దూరం చేయాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా సూచించారు. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ కేసులు, తీవ్రత పెరగడానికి కరోనా డెల్టా వేరియెంట్‌ కారణమని చెప్పారు. వీలైనంతగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుకుని, ఎక్కువ మందికి వేయించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న నాలుగు నుంచి ఆరు వారాల్లో వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకుంటుందని ఆశాభావం వెలిబుచ్చారు. భవిష్యత్‌లో ఉత్పత్తి చేసే టీకాలు కొత్త వేరియెంట్లను అదుపు చేసేలా ఉండాలన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో పోస్ట్‌ కోవిడ్, లాంగ్‌ కోవిడ్‌ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని గులేరియా సూచించారు. కరోనా నుంచి కోలుకున్నాక రెండు, మూడు నెలల పాటు పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు ఉంటాయని చెప్పారు. మ్యుకోర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్‌ నుంచి బయటపడ్డాక 18 రోజుల సమయంలో అది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎస్‌ సోమేశ్‌
ఒకవేళ కరోనా మూడో వేవ్‌ వస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ చెప్పారు. కోవిడ్‌ నియంత్రణ కోసం పటిష్ట చర్యలు చేపట్టేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని కార్యోన్ముఖులను చేయడంలో సీఎం కేసీఆర్‌ ముందున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా గాంధీ, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రులను సందర్శించి రోగులు, వైద్యుల్లో మనోస్టైర్యాన్ని పెంచారని పేర్కొన్నారు. కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుందని, ఫలితంగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్రియాశీలంగా వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర వైద్యులు, సిబ్బంది భాగస్వాములై కరోనాను పూర్తిగా పారదోలేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వెబినార్‌లో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ కరుణాకర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంసీ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో వివిధ అంశాలపై హైదరాబాద్‌లోని వివిధ కార్పొరేట్‌ ఆస్పత్రుల వైద్య నిపుణులు ప్రసంగించారు. రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణకు తీసుకున్న చర్యలపై టీఎస్‌ఎంఎస్‌ రూపొందించిన మూడు నిముషాల నిడివి గల వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement