సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్, మరో పక్క కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధించే ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవ స్థలు, దుకాణాలు, మాల్స్, సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, ఐఆర్ థర్మామీటర్/థర్మల్ స్కానర్, శానిటైజర్ సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జనవరి 2 వరకు రాష్ట్రంలో ఇలాంటి ఆంక్షలు ఇప్పటికే అమల్లో ఉండగా, తాజాగా ఈ నెల 10 వరకు ప్రభుత్వం వాటిని పొడిగించింది. అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం సందర్భంగా కోవిడ్ పరిస్థితులను సమీక్షించిన అనంతరం సీఎస్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు, కోవిడ్–19 కేసు లు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో సైతం ముందు జాగ్రత్తగా నివారణ చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment