Dr Nageshwar Reddy
-
థర్డ్‌వేవ్: పిల్లలపై ప్రభావం ఎలా ఉండొచ్చు?
పిల్లలపై ప్రభావం ఎలా ఉండొచ్చు? థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని చాలా మంది భయపడ్డారు. అయితే అంత ఎక్కువగా ప్రభావం చూపకపోవచ్చు. పిల్లల్లోనూ యాంటీబాడీస్ ఏర్పడుతున్నాయి. పిల్లలకు వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. వారికి వ్యాక్సిన్లు వేస్తే సురక్షితంగా స్కూళ్లకు పంపొచ్చు. సాక్షి, హైదరాబాద్: ఆగస్టు చివరన లేదా సెప్టెంబర్ మొదటి వారంలో మైల్డ్‌గా కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయని ప్రముఖ వైద్యుడు, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా సెకండ్ వేవ్ కేసులు పూర్తిగా తగ్గలేదని, థర్డ్ వేవ్ వచ్చినా తక్కువ తీవ్రతతోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే 3, 4 నెలల దాకా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, వ్యాక్సినేషన్ వేగం పెంచితే ఈ గండం నుంచి గట్టెక్కొచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై డా.డి.నాగేశ్వర్రెడ్డితో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ.. ప్రశ్న: ప్రస్తుత కోవిడ్ పరిస్థితిపై మీ అంచనా? జవాబు: సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గలేదు. దేశవ్యాప్తంగా కేసులు వస్తూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ వచ్చినా మధ్యస్థంగానే ఉండొచ్చు. దేశవ్యాప్తంగా రోజుకు కోటి డోసుల లెక్కన వ్యాక్సిన్ వేస్తే.. డెల్టా వేరియేషన్ కూడా సమస్య కాకపోయేది. ప్రస్తుతం రోజుకు 40 లక్షల డోసులే వేస్తున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్‌ను బయోలాజికల్ ఇవాన్స్ మొదలుపెట్టనుంది. త్వరలోనే జైడస్‌కు కూడా అనుమతి వస్తే మరో నెల రోజుల్లో టీకా కార్యక్రమం వేగవంతం అవుతుంది. అప్పుడు థర్డ్ వేవ్ ప్రభావాన్ని మరింత తగ్గించొచ్చు. ప్రశ్న: ‘డెల్టా’ ఏ మేరకు వ్యాప్తిలో ఉంది? జవాబు: కోవిడ్ జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వందలాది మంది చేరడం వంటి కారణాలతో ఇంకా కేసులు పెరుగుతున్నాయి. 80% మందికి ఇమ్యునిటీ వస్తేనే ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ఏర్పడి డెల్టా వేరియెంట్ పూర్తిగా పోతుంది. కొత్త వేరియెంట్లు కూడా రావు. మన దగ్గర డెల్టా ప్లస్ ఎక్కువగా లేదు. యాంటీ బాడీస్ పెరిగిన వారిపై కరోనా ప్రభావం చూపట్లేదు. కొందరు టీకా తీసుకున్నా కూడా యాంటీబాడీస్ ఏర్పడట్లేదు. అలాంటి వారిలో ఈ వ్యాధి సీరియస్‌గా మారే అవకాశాలున్నాయి. ప్రశ్న: చికిత్సకు సంసిద్ధమై ఉన్నామా? జవాబు: సెకండ్ వేవ్ అంత సీరియస్‌గా థర్డ్ వేవ్ ఉండదనే అంచనాలున్నాయి. థర్డ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా గరిష్టంగా రోజు లక్ష దాకా కేసులు రావొచ్చు. వచ్చే అక్టోబర్ చివరి నుంచి కరోనా కేసులు బాగా తగ్గిపోవచ్చనేది అంచనా. అయినా ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా 3, 4 నెలలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచితే సెప్టెంబర్‌లో మైల్డ్‌గా థర్డ్ వేవ్ వచ్చి వెళ్లిపోతుంది. మోనో క్లోనల్ యాంటీ బాడీస్ చికిత్స అందుబాటులో ఉంది. ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇప్పటివరకు 375 మంది కోలుకున్నారు. ప్రశ్న: టీకాల ప్రభావశీలత ఎలా ఉంటోంది? జవాబు: రెండు డోసులు తీసుకున్న వారిలో వ్యాక్సిన్ల ప్రభావశీలత (ఎఫికసీ) 95 శాతానికి పైగానే ఉంటోంది. ఇందులో కూడా వ్యాధి రాకుండా నిరోధించడం 75 శాతంగా ఉండగా, మరణాలు సంభవించకుండా టీకాలు 99 శాతం దోహదపడుతున్నాయి. సెకండ్ డోసు తీసుకున్న 15 రోజుల తర్వాతే పూర్తి రక్షణ వస్తుంది. ఒక డోసు వేయించుకున్న వారు, తగిన జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ సోకే అవకాశాలున్నాయి. సింగిల్ డోస్ తీసుకున్న వారిలో కోవాగ్జిన్, కోవీషీల్డ్లో కొంచెం అటుఇటుగా 60 నుంచి 65 శాతం రక్షణ లభిస్తోంది. మొదటి టీకా తీసుకున్న 12 నెలల తర్వాత బూస్టర్ డోస్ వేసుకుంటే మంచిది. కరోనా వచ్చిన వారు ఒక్కడోస్ వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోతుంది. ప్రశ్న: ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారా? జవాబు: ప్రధాన నగరాల్లో బాగానే ఉన్నా చిన్న పట్టణాల్లో కొంత నిర్లక్ష్యం కన్పిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, గాలి బాగా ఆడే ప్రదేశాల్లో ఉండటం, మూసి ఉన్న ప్రదేశాల్లో గుంపులుగా చేరకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్న: పండుగల సీజన్ వల్ల కేసులు పెరిగే అవకాశాలున్నాయా? జవాబు: అక్టోబర్, నవంబర్ దాకా వివిధ పండుగలు ఉన్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది దసరా, దీపావళి పండుగలు పరిమితంగా ఇళ్లలోనే చేసుకుంటే మంచిది. ప్రశ్న: సెకండ్ వేవ్ నుంచి పాఠాలు నేర్చుకున్నామా? జవాబు: ఈ వైరస్‌కు వేగంగా మ్యుటేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేగంగా టీకాలు వేసుకుని అందరిలో ఇమ్యూనిటీ ఏర్పడేలా చూసుకోవాలన్నది తెలిసొచ్చింది. కరోనా సోకిణ వంద మందిలో కనీసం 30 మందిలో జీనోమ్ టైపింగ్ క్రమం తప్పకుండా చేయాలి. వైరస్‌లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో జాగ్రత్తగా గమనించాలి. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, అందుబాటులో ఉన్న చికిత్స పద్ధతులు, ప్రోటోకాల్స్‌తో మరణాల సంఖ్య బాగా తగ్గించుకోగలిగాం. ప్రశ్న: కొత్త కేసులు నమోదవుతున్నాయా? జవాబు: ఇప్పుడు పరిమితంగా క్లస్టర్స్, పాకెట్స్గా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ప్రభుత్వపరంగా క్లస్టర్ కంటైన్మెంట్ చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో లేదా ఏదో ఒక కాలనీ, ప్రాంతంలో కేసుల పెరుగుదల కనిపిస్తే ఆ పరిధి వరకు క్లస్టర్ కంటైన్మెంట్ చేస్తే వ్యాప్తిని నియంత్రించొచ్చు. ప్రశ్న: వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం ఎందుకు పుంజుకోవట్లేదు? జవాబు: మనకు తగినంతగా టీకా నిల్వలు అందుబాటులో లేకపోవడం ఓ కారణం. ఇప్పుడు వీటి లభ్యత క్రమంగా పెరుగుతోంది. సోషల్ మీడియాలో టీకా వ్యతిరేక ప్రచారంతో నష్టం జరిగింది. ఎవరికి ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే అది తీసుకోవాలి. ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్నా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు ఎందుకు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. -
స్టెరాయిడ్స్ వల్లే పోస్ట్ కోవిడ్ సమస్యలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న 40 శాతానికి పైగా పేషెంట్లు బలహీనత, అలసట తదితర లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడైనట్లు ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డా.డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. చాలామందిలో నిద్రలేమి, నాడీ, మానసిక సంబంధ సమస్యలు వెంటాడుతున్నట్లు పేర్కొన్నారు. 30 ఏళ్ల వయసు పైబడి కరోనా నుంచి కోలుకున్న వారికి అకస్మాత్తుగా గుండెపోటు, ఊపిరితిత్తులు, జీర్ణకోశ సమస్యలు, కీళ్లు, కండరాలు, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 34 శాతం మందికే ఆక్సిజన్, స్టెరాయిడ్స్ అందించాల్సి ఉండగా, 74 శాతం మందికి స్టెరాయిడ్స్ వినియోగించినట్లు తేలినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మనదేశంలోనే మందుల దుకాణాల్లో ‘ఓవర్ ది కౌంటర్’ స్టెరాయిడ్స్ సులభంగా లభించడమే ఇందుకు కారణం కావొచ్చని చెప్పారు. ప్రస్తుతం ఎదురవుతున్న పోస్ట్ కోవిడ్ సమస్యలకు స్టెరాయిడ్స్ వినియోగం కారణంగా కనిపిస్తోందని, అందుకే దీనిపై లోతైన పరిశోధన జరపాల్సిన అవ సరం ఉందని వివరించారు. ప్రస్తుతం దేశం థర్డ్‌వేవ్ ముంగిట ఉన్న నేపథ్యంలో ఏఐజీ ఆధ్వర్యంలో జీనోమ్ సీక్వెన్సింగ్, ఇతర అధ్యయనాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 90 శాతం వరకు డెల్టా వైరస్ ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాల్లో స్పష్టమైనట్లు చెప్పారు. డెల్టా ప్లస్ లేదని తేలినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5 వేల మందిపై ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. సోమవారం ఏఐజీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ‘పోస్ట్ కోవిడ్ కేర్ క్లినిక్’ను సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ప్రారంభించారు. వర్చువల్‌గా మాట్లాడుతూ కోవిడ్ సమస్యలపై ప్రత్యేకంగా క్లినిక్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది తొలిసారని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ క్లినిక్‌లో పలు విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటారని వివరించారు. సర్కారు ఆస్పత్రుల్లోనూ పోస్ట్ కోవిడ్ కేర్: నర్సింగ్‌రావు కోవిడ్ అనంతరం ఎదురయ్యే సమస్యలపై స్పష్టమైన అవగాహన వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ దీనికి అవసరమైన చికిత్స అం దించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పోస్ట్ కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు అభినందనీయమని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో స్వల్ప లక్షణాలున్న వారు నెలలో, మధ్యంతర సమస్యలున్న వారు నెల నుంచి 3 నెలల్లో, సుదీర్ఘకాలం పాటు సమస్యలున్న వారు కోలుకునేందుకు 6నెలలు పడుతున్నట్లు ఓ ప్రశ్నకు నాగేశ్వర్‌రెడ్డి సమాధానమిచ్చారు. శరీరంలో విటమిన్ డి, జింక్, ప్రో టీన్లు తగ్గిపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నా యని పేర్కొన్నారు. కోవిడ్ వచ్చి తగ్గాక 3 నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్రం చెబుతున్నా.. తాను మాత్రం నెల తర్వాత ఒక డోస్ తీసుకుంటే పెద్దసంఖ్యలో యాంటీబాడీస్ ఏర్పడుతాయనే అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. -
మూడో వేవ్‌పై ఆందోళనొద్దు.. ఏడాదికోసారి టీకా
సాక్షి, హైదరాబాద్: రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలున్న కొందరు కరోనా మూడో డోస్ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. మిగతావారు రెండు డోసులు తీసుకుంటే సరిపోతుందన్నారు. వ్యాక్సిన్ ప్రభావం ఏడాది పాటు ఉంటుందని, తర్వాత సంవత్సరానికోసారి కోవిడ్ టీకా తీసుకోవాల్సిన అవసరం పడుతుందని చెప్పారు. మంగళవారం రాష్ట్ర వైద్య మండలి ఆధ్వర్యంలో ‘కోవిడ్–19: నేర్చుకున్న పాఠాలు, భవిష్యత్ వ్యూహాలు’ అంశంపై ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, మరికొందరు వైద్య నిపుణులు మాట్లాడారు. ఫ్లూ, కోవిడ్ టీకాలు రెండూ కలిపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి సూచించారు. ఒక డోసు కోవాగ్జిన్ తీసుకుని రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకున్నా ఏమీకాదని.. ‘టీకాల మిక్స్ అండ్ మ్యాచ్’ విషయంలో మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. డెల్టా ప్లస్ వేరియెంట్పైనా ప్రస్తుత వ్యాక్సిన్లు బాగానే పనిచేస్తున్నాయని.. దీనిపై తాము చేస్తున్న పరిశోధనల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధిని 12 వారాల నుంచి 8 వారాలకు తగ్గిస్తే మంచిదనే సూచనలు వస్తున్నాయన్నారు. దేశంలో రోజుకు కోటి మందికి చొప్పున టీకాలు వేస్తేనే మంచిదని, దీనిని సాధించేందుకు వ్యాక్సిన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవాల్సి ఉందని నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది చివరిలోగా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరం ఉందని.. అప్పటిదాకా వ్యాక్సినేషన్‌తోపాటు అందరూ మాస్క్‌లు, ఇతర కోవిడ్ జాగ్రత్తలు కచ్చితంగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ వస్తుందనే ఆందోళన అవసరం లేదని.. రాబోయే రోజుల్లో ఒకటి తర్వాత మరొకటి చిన్న చిన్న వేవ్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చినపుడు ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేకున్నా కూడా ప్రమాదకర స్థాయిలో థర్డ్ వేవ్ రాలేదని గుర్తు చేశారు. కొత్త వేరియంట్లను అదుపుచేసేలా టీకాలు రావాలి: గులేరియా కోవిడ్ వ్యాక్సిన్లపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, సందేహాలను హెల్త్ వర్కర్లు దూరం చేయాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కేసులు, తీవ్రత పెరగడానికి కరోనా డెల్టా వేరియెంట్ కారణమని చెప్పారు. వీలైనంతగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుకుని, ఎక్కువ మందికి వేయించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న నాలుగు నుంచి ఆరు వారాల్లో వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంటుందని ఆశాభావం వెలిబుచ్చారు. భవిష్యత్‌లో ఉత్పత్తి చేసే టీకాలు కొత్త వేరియెంట్లను అదుపు చేసేలా ఉండాలన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని గులేరియా సూచించారు. కరోనా నుంచి కోలుకున్నాక రెండు, మూడు నెలల పాటు పోస్ట్ కోవిడ్ సమస్యలు ఉంటాయని చెప్పారు. మ్యుకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నుంచి బయటపడ్డాక 18 రోజుల సమయంలో అది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎస్ సోమేశ్ ఒకవేళ కరోనా మూడో వేవ్ వస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పారు. కోవిడ్ నియంత్రణ కోసం పటిష్ట చర్యలు చేపట్టేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని కార్యోన్ముఖులను చేయడంలో సీఎం కేసీఆర్ ముందున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ స్వయంగా గాంధీ, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులను సందర్శించి రోగులు, వైద్యుల్లో మనోస్టైర్యాన్ని పెంచారని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుందని, ఫలితంగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్రియాశీలంగా వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర వైద్యులు, సిబ్బంది భాగస్వాములై కరోనాను పూర్తిగా పారదోలేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వెబినార్‌లో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో వివిధ అంశాలపై హైదరాబాద్‌లోని వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల వైద్య నిపుణులు ప్రసంగించారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై టీఎస్ఎంఎస్ రూపొందించిన మూడు నిముషాల నిడివి గల వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. -
కరోనా చికిత్సలో ఈ మెడిసిన్ వాడేటప్పుడు జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్సలో బ్రహ్మాస్త్రం లాంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ మందును అవసరమున్న వారికే ఉపయోగించాలి తప్ప విచక్షణరహితంగా వాడొద్దని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డా.డి.నాగేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఖరీదైన మందు (దాదాపు రూ.70 వేలు) కావడంతో పాటు దీని వల్ల వచ్చే దుష్ప్రభావాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. అవసరం లేకపోయినా దీన్ని ఉపయోగిస్తే వైరస్ మ్యూటెంట్లు మరింత ముదిరే అవకాశం ఉందని, యాంటీబాడీ చికిత్సకు కూడా లొంగని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చాక మూడు రోజుల్లో లేదా వారంలోనే దీన్ని తీసుకోవాలని, ఆ తర్వాత దీని ప్రభావం ఉండదని చెప్పారు. తమ ఆస్పత్రిలో ‘కసిరివిమాబ్, ఇమ్దెవిమాబ్ కాంబినేషన్లోని యాంటీబాడీస్ మందు వేయడం ప్రారంభించినట్లు తెలిపారు. గురువారం జూమ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. కోవిడ్ తొలిదశలో స్వల్ప, ఒక మోస్తరు లక్షణాలు ఉన్న వారిపైనే ఇది పనిచేస్తుందని, అయితే ఇది ఇచ్చాక త్వరగా కోలుకుంటారని చెప్పారు. ఇంజెక్షన్ రూపంలో.. ప్రస్తుతం మన దగ్గర ఇంజెక్షన్ రూపంలో దీనిని ఇస్తున్నట్టు చెప్పారు. ఈ మందు తీసుకున్నాక ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం తగ్గిపోవడమే కాకుండా 70 శాతం వరకు మరణించే అవకాశాలు తగ్గి వైరల్ క్లియరెన్స్‌లోనూ చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ప్రస్తుతం అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. అయితే ఇండియాలో డబుల్ మ్యుటెంట్‌పై ఇది ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందన్న దానికి సంబంధించి వంద మందిపై నిర్వహిస్తున్న పరిశోధన ఫలితాలు నెలలో వెల్లడి అవుతాయని చెప్పారు. ఈ మందు తీసుకున్న వారికి కనీసం 3 నెలల ద్వారా వ్యాక్సిన్ వేయకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో తయారవుతున్న ఈ మందును సిప్లా కంపెనీ ద్వారా దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతించిందని వెల్లడించారు. దీని ఫలితాల ఆధారంగా త్వరలోనే దేశీయంగా ఉత్పత్తి చేసే అవకాశముందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 12 ఏళ్లకు పైబడిన పిల్లలకు కనీస బరువు 40 కిలోలు ఉన్న వారికి ఈ చికిత్సకు అనుమతిస్తారు. ఎవరెవరికి ఇవ్వొచ్చు.. 65 ఏళ్లు పైబడిన వారు. అనియంత్రిత మధుమేహం ఉన్న స్థూలకాయులు గుండెజబ్బులున్న వారు. ఇమ్యునో సప్రెషన్స్ తీసుకునే కేన్సర్, ఇతర జబ్బుల వారు. 55 ఏళ్లకు పైగా వయసున్న వారిలో అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులున్న వారికి. -
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘షిండ్లర్’.. తొలి భారతీయుడిగా..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి.. ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ (ఏఎస్‌జీఈ) వారి అత్యున్నత క్రిస్టల్ అవార్డును స్వీకరించారు. అంతర్జాతీయ స్థాయిలో గ్యాస్ట్రో స్కోపీ పితామహుడిగా పేరుపొందిన రుడాల్ఫ్ వి.షిండ్లర్ అవార్డును క్రిస్టల్ అవార్డ్స్‌లో అత్యున్నత కేటగిరీగా పరిగణిస్తారు. షిండ్లర్ పేరిట ఇచ్చిన ఈ పురస్కారానికి ఎంపికైన మొదటి భారతీయుడిగా నాగేశ్వర్‌రెడ్డి అరుదైన ఘనత సాధించారు. సోమవారం ఉదయం ఏఎస్‌జీఈ అధ్యక్షుడు డాక్టర్ క్లాస్ మెర్జెనర్ వర్చువల్ కార్యక్రమంలో నాగేశ్వర్‌రెడ్డికి ఈ అవార్డును అందజేశారు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ రంగంలో పరిశోధన, శిక్షణ, సేవలలో భాగస్వామ్యానికి ఈ పురస్కా రాన్ని అందజేస్తున్నట్టు మెర్జెనర్ తెలిపారు. భారత దేశంలో ఎండోస్కోపీకి ఆదరణ కల్పించి, విస్తృతికి కారణమైన వారిలో నాగేశ్వర్‌రెడ్డి ఒకరని ప్రశంసించారు. ఎండోస్కోపీ వ్యాప్తికి పునరంకితమవుతా ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారం లభించిన సందర్భంగా నాణ్యమైన ఎండోస్కోపీ విద్య, వ్యాప్తికి తాను పునరంకితం అవుతానని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. తన సతీమణి, కుటుంబసభ్యులు, ఏఐజీ సహచరులకు నాగేశ్వర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. అంకితభావంతో కృషి చేస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వారికీ గుర్తింపు లభిస్తుందని ఈ అవార్డుతో స్పష్టమైందన్నారు. -
కొత్త కరోనా: భారత్‌లో ఆందోళన అవసరం లేదు!
బ్రిటన్, దక్షిణాఫ్రికాలో సెప్టెంబర్ నుంచే కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు 70 శాతం ఉన్నా.. అంత ప్రమాదకరం కాదనే భావిస్తున్నాం. ఎందుకంటే బ్రిటన్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన వ్యాక్సిన్ ఈ కొత్త వైరస్‌పై ప్రభావం చూపుతుందని అంచనా. యువతరం అధికంగా ఉండటం, ఊబకాయం, బీపీ, గుండె సంబంధిత రోగులు తక్కువగా ఉండటం మంచి విషయం. సాక్షి, హైదరాబాద్: పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఎదురవుతున్న సమస్యలతో పోలిస్తే భారత్‌లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తక్కువగా సెకండ్ వేవ్ రావొచ్చని, జనవరిలో మళ్లీ కేసులు పెరిగే అవకాశాలున్నాయని, అయితే అది పెద్ద ఆందోళన కరమైనది కాకపోవచ్చని పేర్కొన్నారు. జనవరి నాటికి వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే, ఏప్రిల్ కల్లా వ్యాక్సిన్లు అందిస్తే.. మే నాటికి కేసులు తగ్గుముఖం పడతాయని చెప్పారు. వచ్చే అక్టోబర్ కల్లా సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయుల్లో రోగ నిరోధకశక్తి కాస్త ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కరోనా సంబంధిత అంశాలంపై ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా.నాగేశ్వర్‌రెడ్డి తెలిపిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. ఇక్కడ తక్కువగానే కేసులు..: అమెరికా, ఐరోపాలతో పోలిస్తే భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉంది. అమెరికా, లండన్‌లో థర్డ్ వేవ్ కూడా వచ్చేసింది. భారత్‌లో ఫస్ట్ వేవ్ మాత్రమే ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ కేసులు నమోదు అవుతుండటంతో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో సెప్టెంబర్ నుంచే కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు 70 శాతం ఉన్నా.. అంత ప్రమాదకరం కాదనే భావిస్తున్నాం. ఎందుకంటే బ్రిటన్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన వ్యాక్సిన్ ఈ కొత్త వైరస్‌పై ప్రభావం చూపుతుందని అంచనా. యువతరం అధికంగా ఉండటం, ఊబకాయం, బీపీ, గుండె సంబంధిత రోగులు తక్కువగా ఉండటం మంచి విషయం. చదవండి: (కరోనా కొత్త అవతారం!) అధిక రోగ నిరోధకతపై పరిశోధన.. భారతీయుల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండటం, జన్యుపరంగా రక్షణలు, వైరస్ ప్రవేశించే తీరు తక్కువగా ఉండటం, హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ నిరోధక వ్యవస్థ.. మన దేశంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ఏఐజీలో పరిశోధనలు నిర్వహిస్తున్నాం. దీని వివరాలు మరో నెలలో వెల్లడిస్తాం. వ్యాక్సిన్‌పై ట్రయల్స్ మేమూ నిర్వహించాం. ఇక్కడి వ్యాక్సిన్లు 70 శాతానికిపైగా ప్రభావం చూపుతున్నాయి. ఇండియాలో లేని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు ఫైజర్, మోడర్నా 95 శాతం కచ్చితత్వం ఉన్నట్లు వెల్లడైంది. వ్యాక్సిన్ల ధరలు, భద్రపరచడం మన దేశంలో కాస్త సమస్య. ఈ వ్యాక్సిన్లను అత్యల్ప ఉష్ణోగ్రతల్లో భద్రపరచాల్సి ఉంటుంది. ఇక్కడి పెద్ద పట్టణాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో ఈ వెసులుబాటు లేకపోవడం మైనస్. ఇండియాలో ఆక్స్ఫర్డ్, భారత్ బయోటెక్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు తొందరగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. గర్భిణులు,16 ఏళ్లలోపు వారు మినహా.. గర్భిణులు, 16 ఏళ్లలోపు పిల్లలు మినహా అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్న వారు వ్యాక్సిన్లు తీసుకుంటే యాంటీబాడీస్ ఏర్పడతాయి. మొదటి డోస్ తీసుకున్నాక 3, 4 వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 15 రోజులకు యాంటీబాడీస్ ఏర్పడతాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశం కావడంతో భారత్‌లో ఇప్పటికీ ఇంకా 20 నుంచి 30 శాతమే హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడినట్లు అంచనా. అలాగే వ్యాక్సిన్ వచ్చే వరకు మాస్క్ శ్రీరామ రక్ష. అయితే బయటికి వెళ్లినప్పుడే మాస్క్ ధరించాలి. ఇంట్లో ఉన్నప్పుడు అవసరం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి భారత్‌లో మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. కోవిడ్‌పై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు చైతన్యం కలిగించింది. సోషల్ మీడియాలో మాత్రం కొంత అసత్యాల ప్రచారం జరిగి భయాలు ఏర్పడ్డాయి. మొత్తం కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుంటే 30 శాతం కంటే ఎక్కువగా గ్యాస్ట్రో ఎంటరాలజీ సంబంధిత సమస్యలతో కూడుకున్నవే ఉన్నాయి. డయేరియా, వాంతులు, కడుపులో నొప్పి, బరువు తగ్గుదల, వాసన కోల్పోవడం వంటి కారణాలతో ఈ కేసులు ట్రేస్ అయ్యాయి. చదవండి: (బ్రిటన్ నుంచి ముంబైకు ఐదు విమానాలు!) పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు... భారత్‌లో జీర్ణకోశ సంబంధ వ్యాధులు, వాటితో ముడిపడిన సమస్యలు పెరుగుతున్నాయి. ఆహారం, నీరు కలుషితం కావడం, పరిశుభ్రత పాటించకపోవడం, హెపటైటిస్ బీ, సీ వైరస్ సోకడం, జీవనశైలిలో మార్పులే ఇందుకు ప్రధాన కారణం. ధూమపానం, మద్యం అలవాట్లు పెరుగుతున్నాయి. పెయిన్ కిల్లర్ మందులు విచక్షణారహితంగా వాడుతున్నారు. దీంతో అసిడిటీ పెరుగుతోంది. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు కరోనాకే కాకుండా హెపటైటిస్ బీ, ఏ వ్యాక్సిన్లు కూడా తీసుకుంటే మంచింది. -
లాక్‌డౌనే అసలు మందు!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌కు నిర్దిష్టంగా మందు లేదు. మనిషి సాంఘిక జీవి కాబట్టి సామాజిక దూరం అని చెప్పడం కంటే భౌతికంగా మాత్రమే ఎడంగా ఉంటూ.. సామాజికంగా దగ్గరగా ఉండాలి. ఇందుకు మొబైల్స్ వంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే మొబైల్స్ మీద వైరస్ చాలా ఎక్కువ సేపు ఉంటుంది. కాబట్టి మొబైల్ హైజీన్, మొబైల్ శానిటైజేషన్ పాటించాలి. అన్నిటికంటే ముఖ్యం లాక్‌డౌన్‌ను తప్పక పాటిస్తే.. వ్యాధి తీవ్రత తగ్గడమే కాదు.. మనం త్వరగా ఈ కష్టకాలం నుంచి బయటపడతామంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అధినేత డాక్టర్ నాగేశ్వరరెడ్డి. ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కరోనా గురించి పలు అంశాలు చెప్పారు. వివరాలివీ.. సాక్షి: ఈ ప్రపంచంలోని జీవరాశి మొత్తం బరువు కంటే.. ఈ లోకంలో ఉన్న వైరస్ల బరువే ఎక్కువంటారు. అంత ఎక్కువ మొత్తంలో వైరస్లు ఉన్నదే వాస్తవమైతే, ఆ వైరస్లన్నింటితో ముప్పు లేదెందుకు? ఈ వైరస్‌తోనే ఇంత ముప్పు ఎందుకు? డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి: పరిణామక్రమంలో ఈ ప్రపంచంలోకి మొదటే వైరస్లు వచ్చాయి. దాదాపు 500 మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి వైరస్లు ఉన్నాయి. మనం భూమ్మీదికి చాలా లేట్‌గా వచ్చాం. చాలా ముందు నుంచి ఉండటం వల్ల ఈ భూమికి నిజమైన యజమానులు వైరస్‌లే అనుకోవచ్చు. అయితే అవి తమంతట తాము మనుగడ సాగించలేవు కాబట్టి ఒంటెలు, గబ్బిలాలు.. ఇలాంటి చాలా వాటిని ఆశ్రయించి మనుగడ సాగిస్తూ వచ్చాయి. చాలా అటవీ జంతువుల్లో వైరస్లు ఎప్పుడూ ఉంటాయి. అవి తమ హద్దులు (బ్యారియర్స్) దాటకుండా బతికేస్తూ ఉంటాయి. వాటి వాటి జన్యువులను బట్టి ఏ జంతువుకు పరిమితమైన వైరస్లు ఆ జంతువులోనే ఉండిపోతాయి. కొన్నికొన్ని మ్యుటేషన్స్ వల్ల అవి జన్యుస్వరూపం మార్చుకోవడం వల్ల మనుషులకు వస్తాయి. ఇప్పుడు మనం ఈ ఉత్పాతాన్ని చూస్తున్నాం. కానీ పరిణామక్రమంలో చాలా చాలా వైరస్ల ఆర్‌ఎన్‌ఏలూ, డీఎన్ఏలూ మన జీన్స్‌లోకి వచ్చి.. వాటిలోకి పూర్తిగా ఇంకిపోవడం వల్ల పరిణామంలో చాలా సానుకూల ఫలితాలే వచ్చాయి. ఇప్పుడు వస్తున్న వైరస్ కూడా నేరుగా మానవులకు రాలేదు. మొదట గబ్బిలాలు, అక్కణ్నుంచి మరికొన్ని జంతువుల్లోకి వెళ్లి.. అలా మానవులకు వచ్చాయి. నిజానికి మనిషి తన పరిధులను అతిక్రమించి అటవీ జంతువుల ప్రపంచంలోకి వెళ్లడం వల్లనే.. ప్రస్తుతం ఉన్న వైరస్ మానవులకు సోకేలా మార్పు చెంది, మనుషుల్లో వ్యాధికి కారణమవుతోంది. విటమిన్–సి వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరిగి వైరస్ ప్రభావం లేకుండా చేసే అవకాశాలున్నాయంటున్నారు. చాలామందికి నిమ్మ, నారింజ, కమలాల వంటి సిట్రస్ ఫ్రూట్స్, మరికొందరికి పుచ్చకాయ వంటివి తినగానే జలుబు చేస్తుంది. అలాంటివారి సంగతేమిటి? నిమ్మ, నారింజ, కమలాల వంటి సిట్రస్ ఫ్రూట్స్ వల్ల జలుబు చేయడం, దగ్గు రావడం జరుగుతుందని చాలామంది అంటుంటారు గానీ సైంటిఫిక్‌గా దానికి తగిన తార్కాణాలు లేవు. అయితే కొంతమందికి వారి వ్యక్తిగత శారీరక స్వభావం బట్టి ఇలా జరుగుతున్నప్పుడు మందులు దుకాణాల్లో దొరికే విటమిన్–సి టాబ్లెట్స్ రోజుకొకటి వాడుకోవచ్చు. చాలామంది ఇది శ్వాస సమస్యలనే కలగజేస్తుందంటున్నారు. కానీ కొందరిలో నీళ్ల విరేచనాలు, రుచులు, వాసనలు తెలియకపోవడం, ఒళ్లునొప్పులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయట కదా? జ్వరం, శ్వాస సరిగా ఆడకపోవడం వంటి ప్రధాన లక్షణాలతో పాటు.. రుచులు, వాసనలు తెలియకపోవడం ఉంటాయి. 20 నుంచి 30 శాతం మందిలో నీళ్ల విరేచనాలు (డయేరియా), వికారం (నాజియా), వాంతుల వంటి లక్షణాలు కనిపించవచ్చు. మరో 20 శాతం మందిలో రుచులు, వాసనలు తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జలుబు చేసినప్పుడు వాసనలు తెలియకపోవడం మామూలే కదా అని అనుకోవచ్చు. కానీ ఈ వైరస్ ప్రత్యేకత ఏమిటంటే.. జలుబు లేనప్పటికీ ఇది సోకినప్పుడు మనకు వాసనలు తెలియకుండా పోతాయి. చైనా, ఇటలీ, అమెరికాలలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.. కానీ ఇండియాలో తక్కువగానే ఉందంటున్నారు. కారణాలేంటి? మొదట ఈ వైరస్ చైనాలో వచ్చినప్పుడు ‘ఎస్’, ‘ఎల్’అనే తరహాలను చూశాం. కానీ ఇప్పుడు ‘ఎస్’వేరియెంట్, ‘ఎల్’వేరియెంట్ అనే భావనలు పూర్తిగా పోయాయి. అనేక కొత్త అంశాలు తెలియవచ్చాయి. మన దేశంలో, ఇటలీలో, యూఎస్ఏలో, చైనాలో కనిపించిన వైరస్ల తాలూకు జీన్స్ చాలా నిశితంగా అధ్యయనం చేస్తున్నాం. కరోనా వైరస్‌కు పైన ముళ్లు ముళ్లులా అంటే స్పైక్స్లా ఉండటం బొమ్మల్లో చూశారు కదా. ఇటలీలో కనుగొన్న కరోనా వైరస్‌లోని జీనోమ్‌లో మూడు మ్యూటేషన్ల ద్వారా మార్పులు వచ్చినట్లు కనుగొన్నారు. దాంతో అక్కడి ‘కరోనా’లో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇక భారత్‌లో వచ్చిన కరోనా వైరస్ రకంలో వచ్చి న ఒక మ్యూటేషన్ కారణంగా ఈ స్పైక్ ప్రోటీన్‌లో మార్పు వచ్చి అది సరిగా కణానికి అతుక్కోకపోవడాన్ని చూస్తున్నాం. దీని వల్లనే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉందా తెలియడం లేదు. దీనిపై అధ్యయనం జరగాలి. ఈ వైరస్ తనలాంటి ఎన్నో కాపీలను ప్రొడ్యూస్ చేసుకుంటుందట కదా నిజమేనా? ఈ వైరస్ చాలా తెలివైనది. అదో త్రీడీ మెషీన్ వంటి జిరాక్స్ మెషీన్ సహాయంతో ఎన్నెన్నో కాపీలను పుట్టించినట్లుగా తన కాపీలను (అం టే తనలాంటి వైరస్‌లను) పుట్టించుకుంటుంది. ఇందుకు మన కణాలను ఉపయోగించుకుంటుంది. ‘స్పీషిస్ బ్యారియర్’అంటే ఏమిటో చెప్పండి. ఆ బ్యారియర్ లేకపోవడం వల్లనే ఇది మన మానవుల్లో విపరీతంగా విస్తరిస్తోందట కదా? ప్రతి జీవిలోనూ చాలా వైరస్లు ఎప్పుడూ నివసిస్తుంటాయి. మన కడుపులో ఈ క్షణంలోనూ ఎన్నెన్నో వైరస్లు ఉంటాయి. అవన్నీ మనలోనే ఉన్నా.. మనకు నిరపాయకరంగా ఉంటాయి. మనకు నిరపాయకరమైన ఈ వైరస్లు ఇతర జీవుల్లోకి వెళ్లినప్పుడు వాటికి అపాయకరం కావచ్చు. ఇలా ఒక ప్రజాతికి (స్పీషి స్కు) నిరపాయకరంగా ఉండటాన్ని స్పీషిస్ బ్యారియర్ అంటారు. అయితే ఇది వేరే స్పీషీస్‌కు చేరినప్పుడు అది వాటికి అపాయక రం కావచ్చు. ఇలా ఇతర జీవుల్లో నిరపాయకరంగా ఉన్న వైరస్.. మ్యుటేషన్లకు గురై మనకు రావ డం వల్ల అపాయకరం గా పరిణమించిందనే అభిప్రాయం కొంతమంది నిపుణుల్లో ఉంది. అయితే ఇది చాలా రోజులు మనలోనే ఉండిపోయిందనుకోండి. కాలక్రమంలో ఇది కూడా మనపట్ల నిరపాయకరం గా మారిపోవచ్చు. అప్పుడు ఇది మనకే పరిమితమైపోతుంది. ఇలా మనకు పరిమితం కావడాన్ని మళ్లీ స్పీషిస్ బ్యారియర్గా చెప్పవచ్చు. కొన్ని ఆఫీసుల్లో కామన్ బాత్రూమ్ల వల్ల ఇది విస్తరించే ప్రమాదం ఉందా? మూత్రవిసర్జన ప్రాంతాలతో ఎలాంటి ప్రమాదం లేదన్నది స్పష్టమే అయినా.. మలం ద్వారా వైరస్ వ్యాపిస్తుందనేది కొందరి అభిప్రాయంగా ఉన్నప్పటికీ దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. వాస్తవానికి బాత్రూమ్ల కంటే వాటి డోర్ నాబ్స్, గొళ్లేల వంటివి చాలా ప్రమాదం. అలాంటివి తాకినప్పుడు చేతులను చక్కగా కడుక్కోవడం అవసరం. శానిటైజర్లతో ఈ బాత్రూమ్ డోర్ నాబ్స్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే, వెస్ట్రన్ కమోడ్ విషయంలో దాన్ని ఉపయోగించాక ఫ్లష్ చేసిన తర్వాత, దాని పైన ఉండే మూత వేసి పెట్టాలి. ఒకరు బాత్రూమ్ వెళ్లి వచ్చాక.. వెంటనే మరొకరు వెళ్లడం కంటే... ఇలా మరొకరు వెళ్లాల్సి వచ్చినప్పుడు కాస్తంత వ్యవధి తర్వాతే వెళ్లడం మంచిది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిలో కంటే గుండెజబ్బులు, డయాబెటిస్ ఉన్నవారే ఎక్కువగా బలయ్యారు. కారణమేంటి? గుండె సమస్యలు ఉన్నవారికి చికిత్సగా ఏసీఈ–2 రిసెప్టార్స్‌ను ఇస్తుంటాం. దాంతో వారిలో ఏసీఈ–2 రిసెప్టార్స్ ఎక్కువగా ఉంటాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే... ఈ ఏసీఈ–2 రిసెప్టార్స్ అనేది తాళం చెవి రంధ్రాలు అనుకుంటే, వైరస్‌కు ఉండే స్పైక్స్ తాళం చెవులుగా చెప్పుకోవచ్చు. గుండెజబ్బులున్న వారిలో తాళం చెవి రంధ్రాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల స్పైక్స్ దూరిపోడానికి అవకాశాలెక్కువ. దానివల్ల వైరస్ గుండెజబ్బులున్నవారి కణాల్లోకి దూరిపోవడం మిగతావారికంటే సులువు. అందుకే వారిలో ముప్పూ ఎక్కువే. మరణాలూ ఎక్కువే. ఇక డయాబెటిస్ ఉన్నవారి శరీరాల్లో రోగనిరోధక శక్తి తక్కువ. అందుకే గుండెజబ్బులూ, డయాబెటిస్ ఉన్నవారిలో ముప్పు ఎక్కువ. ఆ తర్వాత ఊపిరితిత్తుల సమస్యలున్నవారిలోనూ ముప్పు ఎక్కువే. మాంసాహారం మానేయడం వల్ల వైరస్ తీవ్రత తగ్గుతుందా? చికెన్, మటన్, ఫిష్ వంటి వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ. మనం ఆరోగ్యంగా ఉండటం వల్ల వైరస్ అంత తేలిగ్గా సోకదు. కాబట్టి మాంసాహారం తినేవారు నిరభ్యంతరంగా తినవచ్చు. ఒక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒకే సబ్బు, ఒకే దువ్వెన వాడటం సురక్షితమేనా? ఆ ఇంట్లో ఉండేవారు అందరూ ఆరోగ్యవంతులైతే ఈ దువ్వెనలూ వంటి వాటిని వాడుకోవచ్చు. వాటి కంటే ముఖ్యంగా మొబైల్ ఫోన్ శానిటేషన్ చాలా ప్రధానం. మన ఫోన్ ఇంకెవ్వరికీ ఇవ్వకూడదు. మన ఫోన్‌ను ఎవరైనా వాడినా వెంటనే దూదిని కాస్తంత శానిటైజన్లో ముంచి దాన్ని శుభ్రం చేసి వాడాలి. ప్లాస్టిక్, స్టీల్ మీద వైరస్ దాదాపు 36 నుంచి 48 గంటలకు పైగా జీవించి ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. హెర్డ్ ఇమ్యూనిటీ’అంటే ఏమిటి? అది వస్తే ఎలాంటి ప్రమాదమూ ఉండదా? మన జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ మందికి ఇమ్యూనిటీ వచ్చిందనుకోండి. అప్పుడు ఆ జనాభా అంతటికీ ఇమ్యూనిటీ వచ్చిందని అనుకోవడాన్నే ‘హెర్డ్ ఇమ్యూనిటీ’అంటారు. ఇలా ఒక ప్రాంతంలోని సమూహానికి ఇమ్యూనిటీ వచ్చినప్పుడు.. మళ్లీ వైరస్ దాడి చేసినా నష్టం చాలా తక్కువగా ఉంటుంది. అయితే మైల్డ్‌గా ఉండే వైరస్ల విషయంలో హెర్డ్ ఇమ్యూనిటీ అన్నది సేఫ్ అని అనుకోవచ్చు. మరణాలు చాలా ఎక్కువగా ఉండే వైరస్ విషయంలో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’రావడాన్ని సురక్షితమైన అంశంగా భావించడానికి వీలుండదు. కరోనా విషయంలోనూ తదుపరి సీజన్‌కల్లా మనకు హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని అనుకోవచ్చు. దానివల్ల మనకు కలిగే రక్షణా ఎక్కువే అయినా.. హెర్డ్ ఇమ్యూనిటీని నమ్మడం కంటే జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలు. మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి? లాక్డౌన్ వంటి చర్యలు చాలా అవసరం. అవి వైరస్ వ్యాప్తిని అరికడతాయి. అందుకే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను, వాళ్లు పడుతున్న కష్టాలను గుర్తించి, ప్రజలంతా సహకరించాలి. లాక్‌డౌన్‌ను పాటించాలి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. అతిగా ఆందోళన పడితే, ఆ ఒత్తిడి ప్రభావం దేహంపై పడి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగని పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తే మొదటికే ముప్పు వస్తుంది. అందువల్ల అనవసరంగా ఆందోళన పడకండి. అలాగని అప్రమత్తత వీడి నిర్లక్ష్యంగానూ ఉండకండి. ఈ రెండిటి మధ్య విభజన రేఖ ఎక్కడ గీయాలో తెలుసుకుని విజ్ఞతతో మెలగండి. వార్తాపత్రికలతో వైరస్ వ్యాపిస్తుందనే అనుమానాల్లో నిజమెంత? న్యూస్‌పేపర్ వల్ల వైరస్ వ్యాపిస్తుందని చాలామంది అపోహ పడుతున్నారు. కానీ దీనిపై అమెరికాలో జరిగిన అధ్యయనంలో న్యూస్పేపర్లపై ఒక గంట సేపటి కంటే వైరస్ ఉండే అవకాశం లేదని తెలిసింది. ఇక ‘సాక్షి’వంటి పెద్దపెద్ద సంస్థలన్నీ శానిటైజ్ చేసే ఇస్తున్నారు. దానివల్ల ప్రమాదమే లేదు. ఇక అంతగా అనుమానం ఉందనుకోండి. మీకు పేపర్ వేసిన గంట తర్వాత తీసి, దాన్ని హాయిగా చదువుకోవచ్చు. ఒకవైపు మందులు లేవంటున్నారు. మరోవైపు హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిథ్రోమైసిన్‌తో ఫలితం కనిపిస్తుందంటున్నారు. ఇదెంతవరకు కరెక్ట్? ఈ వ్యాధికి యాంటీవైరల్ డ్రగ్స్ ఇంతవరకు కనుక్కోలేదు. ఇంకా రీసెర్చ్ కొనసాగుతూ ఉంది. రెండు మూడు ట్రయల్స్ జరిగాయి. ఒకటి జపాన్ నుంచి వచ్చిన మందు అవిగాన్ అని ఉంది. దాన్ని చైనాలో వాడారు. ఒక ట్రయల్ ఫ్రాన్స్‌లో జరిగింది. అందులో రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు అజిథ్రోమైసిన్ కాంబినేషన్‌గా వాడారు. ఇది 22 మంది రోగుల మీద జరిగింది. ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చాయి. ఇంత చిన్న సమూహం మీద జరిగిన ట్రయల్‌ను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారనే విమర్శలున్నాయి.ఇప్పుడు చైనాలో, యూఎస్ఏలో దీనిమీదే అధ్యయనం జరుగుతోంది. దీని ఫలితాలు మే కల్లా వస్తాయి. ఇప్పుడు ఐసీఎమ్ఆర్, డబ్ల్యూహెచ్ఓ వాళ్లు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిథ్రోమైసిన్లను ప్రొఫిలాక్టిక్ చికిత్సగా అంటే.. జబ్బు రాకుండా ఉండేం దుకు ముందుజాగ్రత్త చర్యగా వాడుకోవచ్చ ని చెప్పాయి. అవి కూడా రెండు వర్గాలకు మాత్రమే. మొదటిది డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికీ, రెండోది కుటుంబంలో ఎవరికైనా పాజిటివ్ వస్తే.. ఆ కుటుంబ సభ్యులకు జబ్బు రాకుం డా నివారణ కోసం.. ఇలా ఈ ఇరువర్గాలకు మందు ఇవ్వవచ్చని సిఫార్సు చేశారు. ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ 200 ఎంజీ మోతాదులో వారంలో రెండు సార్లు ఇవ్వవచ్చని సూచించారు. ఇక విటమిన్–సి, విటమిన్–డి, జింక్ వంటి పోషకాలు దీని నివారణలో చాలా ప్రధాన భూమిక పోషిస్తాయి. డాక్టర్లు ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్గా తీసుకుంటున్నారంటున్నారు కదా.. అలాంటప్పుడు దేశంలోని ప్రతి ఒక్కరికీ వాటిని ఇవ్వడం ద్వారా వైరస్‌ను అరికట్టలేమా? ఆ మందుల వల్ల కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. గుండెజబ్బులు ఉన్న వారిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో వికారం, వాంతులు వంటివి ఉండవచ్చు. పూర్తిగా 100 శాతం సురక్షితం అని నిరూపణ కాలేదు కాబట్టి అందరికీ ఇవ్వలేం. మనలాంటి వేడి ఎక్కువగా ఉండే దేశాల్లోని ఉష్ణోగ్రత ప్రభావం వల్ల వైరస్ తీవ్రత అంత ఎక్కువగా ఉండదంటున్నారు నిజమేనా? ఒకవేళ వేసవిలో తగ్గినా.. మళ్లీ వర్షాకాలం, శీతాకాలంలో విజృంభించే అవకాశం ఉంది కదా? దాదాపు 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటాక ఈ వైరస్ బతికి ఉండటం లేదని ల్యాబ్ ఫలితాలు చెబుతున్నా.. వాటిని బయట ఉన్న వాతావరణ పరిస్థితులకు అన్వయించలేం. బయట 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ.. మన గది ఉష్ణోగ్రత సాధారణంగా 25 డిగ్రీల నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండవచ్చు. మనం గదుల్లో ఉన్నప్పుడే ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశాలు ఎక్కువ కదా. అలాగే చలికాలంలో మళ్లీ వచ్చేందుకు అవకాశాలు కూడా ఎక్కువే. అయితే అప్పటికే చాలామందిలో ఈ వ్యాధి వచ్చి తగ్గిపోయినందువల్ల వారిలోని యాంటీబాడీస్ వల్ల ఇమ్యూనిటీ ఉంటుంది. దానివల్ల ఇంతటి తీవ్రత ఉండకపోవచ్చు. ఇక ఆపై ఏడాది వచ్చే చలికాలానికి అసలు సమస్యే ఉండకపోవచ్చు. ఎందుకంటే... దాదాపు 16 నెలల వ్యవధిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుంది. మిగతావాళ్లతో పోలిస్తే దాదాపు 70, 80 ఏళ్ల కంటే పెద్దవాళ్లలోనే రిస్క్ అంటున్నారు కదా.. వాళ్ల పట్ల ఏవైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా? వయసు విషయానికి వస్తే రెండు అంశాలున్నాయి. మొదటిది బయలాజికల్ ఏజ్, రెండోది ఫిజికల్ ఏజ్. బయలాజికల్ ఏజ్ అంటే కాలం గడుస్తున్న కొద్దీ పెరిగిపోయే వయసు. ఇక ఫిజికల్ ఏజ్ అంటే.. ఉదాహరణకు మనకు 65 ఏళ్ల వయసనుకుందాం. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, స్మోకింగ్ లాంటి దురలవాట్లు లేకపోవడం, మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఏ 50.. 52 ఏళ్ల వ్యక్తిలా ఉన్నామనుకోండి. ఇలాంటివారిలో ముప్పు తక్కువ. అదే ఎలాంటి వ్యాయామం లేకుండా, స్మోకింగ్ లాంటివి చేసేవారు, మద్యం అలవాటు ఉన్నవారు, ఏ గుండెజబ్బులో, కేన్సరో ఉన్నవారైతే వారికి బయలాజికల్ వయసు తక్కువే అయినా ఫిజికల్‌గా సరిగా లేకపోతే.. వాళ్లకు ముప్పు ఎక్కువ. ఇలాంటివారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల చాలా ప్రాణాలు కాపాడవచ్చు. ఈ జబ్బు వస్తే చాలావరకు చచ్చిపోతారు అనే అభిప్రాయం ఉంది. అది సరికాదు. జబ్బు వచ్చిన వారిలో 90 శాతం మంది కోలుకుంటారు. -
డా.నాగేశ్వర్‌రెడ్డికి ధన్వంతరి అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి ధన్వంతరి అవార్డు వరించింది. ధన్వంతరి మెడికల్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి.కె.గోయల్ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 26న ముంబైలో జరిగే కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి 44వ ధన్వంతరి అవార్డును మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు బహూకరిస్తారని తెలిపారు.