సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి.. ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ (ఏఎస్‌జీఈ) వారి అత్యున్నత క్రిస్టల్ అవార్డును స్వీకరించారు. అంతర్జాతీయ స్థాయిలో గ్యాస్ట్రో స్కోపీ పితామహుడిగా పేరుపొందిన రుడాల్ఫ్ వి.షిండ్లర్ అవార్డును క్రిస్టల్ అవార్డ్స్‌లో అత్యున్నత కేటగిరీగా పరిగణిస్తారు. షిండ్లర్ పేరిట ఇచ్చిన ఈ పురస్కారానికి ఎంపికైన మొదటి భారతీయుడిగా నాగేశ్వర్‌రెడ్డి అరుదైన ఘనత సాధించారు.
సోమవారం ఉదయం ఏఎస్‌జీఈ అధ్యక్షుడు డాక్టర్ క్లాస్ మెర్జెనర్ వర్చువల్ కార్యక్రమంలో నాగేశ్వర్‌రెడ్డికి ఈ అవార్డును అందజేశారు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ రంగంలో పరిశోధన, శిక్షణ, సేవలలో భాగస్వామ్యానికి ఈ పురస్కా రాన్ని అందజేస్తున్నట్టు మెర్జెనర్ తెలిపారు. భారత దేశంలో ఎండోస్కోపీకి ఆదరణ కల్పించి, విస్తృతికి కారణమైన వారిలో నాగేశ్వర్‌రెడ్డి ఒకరని ప్రశంసించారు.
ఎండోస్కోపీ వ్యాప్తికి పునరంకితమవుతా
ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారం లభించిన సందర్భంగా నాణ్యమైన ఎండోస్కోపీ విద్య, వ్యాప్తికి తాను పునరంకితం అవుతానని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. తన సతీమణి, కుటుంబసభ్యులు, ఏఐజీ సహచరులకు నాగేశ్వర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. అంకితభావంతో కృషి చేస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వారికీ గుర్తింపు లభిస్తుందని ఈ అవార్డుతో స్పష్టమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment