caesarean operation
-
పొట్టలో మర్చిపోయిన కత్తెరను 17 ఏళ్ల తర్వాత తీశారు!
లక్నో: సిజేరియన్ సమయంలో మహిళ పొట్టలోనే కత్తెరను మర్చిపోయి కుట్లేశాడో వైద్యుడు. 2008లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 17 ఏళ్ల పాటు కడుపు నొప్పితో ఎంతో బాధపడింది ఆ మహిళ. చివరికి ఎక్స్ రేతో పొట్టలో కత్తెర ఉన్న విషయం తెల్సి ఆపరేషన్‌తో వెలుపలికి తీశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంధ్యా పాండే అనే మహిళకు 2008 ఫిబ్రవరి 28వ తేదీన లక్నోలోని ‘షీ మెడికల్ కేర్’ఆస్పత్రిలో సిజేరియన్తో కాన్పు చేశారు. ఆ సర్జరీ జరిగినప్పటి నుంచి పొట్టలో విపరీతమైన బాధతో ఇబ్బంది పడుతున్నారు. ఎందరో డాక్ట ర్ల వద్దకు వెళ్లారు. అయినా ఉపశమనం దొరకలేదు. ఇటీవల సంధ్యా పాండే వైద్య పరీక్షల కోసం లక్నోలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎక్స్ రే కూడా తీశారు. ఆమె పొట్టలో కత్తెర ఉన్నట్లు ఎక్స్ రే రిపోర్టుతో తెలిసింది. దీంతో ఆమె కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేరారు. మార్చి 26వ తేదీన ఆపరేషన్ చేసి వైద్యులు కడుపులో ఉన్న కత్తెరను బయటకు తీశారు. ఎంతో సంక్లిష్టమైన ఆపరేషన్ ద్వారా కత్తెరను బయట కు తీశామని, కోలుకున్నాక సంధ్యా పాండేను డిశ్చార్జి చేశామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సంధ్య భర్త అరవింద్ కుమార్ పాండే ఫిర్యాదు మేరకు సిజేరియన్ చేసిన డాక్టర్ పుష్పా జైశ్వాల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
అంతటా కడుపు ‘కోతే’!
సాధారణ ప్రసవాల సంఖ్య తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తగ్గుతోంది. కాసుల కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లే ఎక్కువగా నమోదవుతున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు (Cesarean) పెరిగాయి. సాధారణ ప్రసవాలపై వైద్యారోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పించాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు లేవు. గత ప్రభుత్వ హయాంలో సాధారణ ప్రసవాల పెంపునకు మొదలుపెట్టిన మిడ్‌వైవ్స్ (Midwife) సేవలు ఇప్పుడు నామమాత్రమయ్యాయి.అమ్మో సాధారణ ప్రసవమా?సాధారణ ప్రసవాల విషయంలో నొప్పులు అనుభవించాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొందరు గర్భిణులు విముఖత చూపుతున్నారు. కొందరు వైద్యులు సిజేరియన్లతో భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. శిశువు తలకిందులుగా ఉన్నప్పుడు, పెద్దగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. అయితే, సాధారణ ప్రసవంతో త్వరగా దినచర్యలో భాగం కావొచ్చని, సిజేరియన్లతో దీర్ఘకాలంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నా, గర్భిణులు, వారి కుటుంబసభ్యులు ఆపరేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మిడ్‌వైవ్స్ అంతంతేప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు గత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 2019లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మిడ్‌వైవ్స్ సేవలను ప్రారంభించి 30 మందికి శిక్షణ ఇవ్వగా, వీరు గర్భిణులకు సాధారణ ప్రసవంతో లాభాలను వివరించి వ్యాయామాల ద్వారా ప్రసవాలకు సిద్ధం చేసేవారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో ఇప్పుడా సేవలు అందుబాటులో లేవు. అవగాహన కల్పించక..గర్భిణిగా నమోదైనప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు ప్రభుత్వ ఆస్ప త్రిలో వైద్య సేవలు పొందితే వారి ఆరోగ్యంపై డాక్టర్లకు అవగాహన ఉంటుంది. అలా కాకుండా డెలివరీ సమయంలోనే వస్తుండడంతో ఏదో ఒక సమస్య తలెత్తగానే ఆపరేషన్ చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా సాధారణ ప్రసవాలతో కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిసినా, ఆ దిశగా ప్రయత్నించడం లేదు. » భద్రాచలం ఏరియా ఆస్పత్రిని పరిశీలిస్తే షిఫ్ట్‌కు ఎనిమిది మంది చొప్పున మూడు షిఫ్ట్‌ల్లో 24 మంది సిబ్బంది ఉండాలి. కానీ ఐదుగురే ఉన్నారు.» ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియా ఆస్పత్రిలోనూ 8 నెలలుగా మిడ్‌వైవ్స్ సేవలు నామమాత్రమయ్యాయి. ఇక్కడ నలుగురు సిబ్బంది చేయాల్సిన మిడ్‌వైవ్స్ సేవలు ఇద్దరే చేస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారంఉండటం లేదు.. ప్రసవం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోచేరిన గర్భిణులకు సాధారణ ప్రసవం చేసేందుకే ప్రయత్నిస్తున్నాం, కానీ వారి కుటుంబసభ్యులనుంచి సహకారం ఉండటం లేదు. గర్భిణి కొద్దిసేపు నొప్పులు తట్టుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు మాపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుతోంది. - డాక్టర్ రామకృష్ణ, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, భద్రాచలం.బిడ్డకు హార్ట్‌బీట్ ఎక్కువగా ఉందని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సత్యవతికి గతనెల 31న పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తే పరీక్షలు చేసిన వైద్యులు బిడ్డ హార్ట్‌బీట్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ వెంటనే ఆపరేషన్‌కు నిర్ణయించి సత్యవతికి సిజేరియన్ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది.- సత్యవతి,మణుగూరు,భద్రాద్రికొత్తగూడెం జిల్లా -
రెండో సారి సిజేరియన్ తప్పదా?
-
తొలి కాన్పు సిజేరియన్ చేశారు.. రెండోసారి కూడా తప్పదా?
నా వయసు 28 ఏళ్లు. రెండేళ్ల కిందట తొలి కాన్పు జరిగింది. బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి, సిజేరియన్ చేశారు. ప్రస్తుతం నాకు ఆరో నెల. ఒకసారి సిజేరియన్ జరిగితే, రెండోసారి కూడా సిజేరియన్ తప్పదని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఒకసారి సిజేరియన్ జరిగితే నార్మల్ డెలివరీకి అవకాశం ఉండదా? రెండోసారి కూడా సిజేరియన్ జరిగితే ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? ఎలాంటి జగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించగలరు. – సాయిగీత, శ్రీకాకుళం మొదటి కాన్పు సిజేరియన్ అయితే తప్పనిసరిగా రెండో కాన్పు సిజేరియన్ ద్వారానే కావాలనేమీ లేదు. కాకపోతే అనేక అంశాలను పరిశీలించిన తర్వాతనే రెండోది నార్మల్ డెలివరీకి ప్రయత్నించవచ్చా, లేదా, రిస్క్ అనేది ఎంత మేరకు ఉంది అనే అంచనాకు వచ్చి సలహా ఇవ్వడం జరుగుతుంది. సాధారణ కాన్పు కావాలంటే బిడ్డ బరువు ఎక్కువగా లేకుండా ఉండాలి. బిడ్డ తల కిందకు ఉండి, పెల్విస్ దారిలోకి ఫిక్స్ అయి ఉండాలి. బిడ్డ బయటకు వచ్చే దారి బిడ్డకు సరిపడా వెడల్పుగా ఉండాలి. అంతేకాకుండా, ముందు సిజేరియన్ కాన్పుకి, మళ్లీ గర్భం దాల్చడానికి మధ్య కనీసం మూడు సంవత్సరాలకు పైగా గ్యాప్ ఉండాలి. ఇవన్నీ సరిగానే ఉన్నా, సిజేరియన్ సమయంలో గర్భాశయంపైన కోత పెట్టి బిడ్డను బయటకు తీసి, మళ్లీ కుట్టడం జరుగుతుంది. ఆ కుట్లు తొమ్మిది నెలలు బిడ్డ పెరిగే కొద్ది సాగి, అవి పల్చబడటం జరుగుతుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కుట్లు మానే తీరును బట్టి మరో కాన్పును సాధారణ కాన్పు కోసం ప్రయత్నించినప్పుడు, కొందరిలో గర్భాశయం కుట్లు విడిపోయి, గర్భాశయం పగిలి బిడ్డ కడుపులోకి రావడం, బిడ్డ ఊపిరి ఆగిపోవడం, తల్లికి విపరీతమైన బ్లీడింగ్ అవడం, షాక్‌లోకి వెళ్లడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులలోకి వెళ్లే అవకాశాలు చాలా ఉంటాయి. కొందరిలో పెద్దగా ఇబ్బంది లేకుండా, సాధారణ కాన్పు కావచ్చు. ఎవరిలో ఎలా జరుగుతుంది, కాంప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది అంచనా వేయడం కాస్త కష్టం. ముందు కాన్పు ఆపరేషన్ ద్వారా జరిగి, మళ్లీ కాన్పును సాధారణంగా ప్రయత్నించడాన్ని ‘వీబీఏసీ’ (వజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్) అంటారు. వీబీఏసీకి ప్రయత్నించాలని అనుకున్నప్పుడు 24 గంటలు గైనకాలజిస్ట్, పిల్లల డాక్టర్, మత్తు డాక్టర్ అందుబాటులో ఉండి, అన్ని పరికరాలు, వసతులు ఉన్న హాస్పిటల్లోనే అడ్మిట్ అవడం మంచిది. లేకపోతే ఆఖరి నిమిషంలో ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండటాయి. మీకు మొదటి బిడ్డ అడ్డంగా ఉండటం వల్ల ఆపరేషన్ చేసి తీశారు. మళ్లీ ఇప్పుడు రెండు సంవత్సరాలకే గర్భం అందింది. తొమ్మిదో నెలలో బిడ్డ బరువు, పొజిషన్ని బట్టి, మీ డాక్టర్ చెప్పే సలహాను అనుసరించడం మంచిది. రెండోది కూడా సిజేరియన్ అయినప్పుడు పెద్దగా సమస్యలేవీ ఉండవు. కాకపోతే మళ్లీ మత్తు ఇవ్వాలి, పొట్ట కొయ్యాలి, కుట్లు వెయ్యాలి, కుట్లు సరిగా మానాలి కాబట్టి కొద్దిగా నొప్పి, అసౌకర్యం తప్పవు. నా వయసు 30 ఏళ్లు. మూడేళ్ల కిందట రీకానలైజేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకుంటే, ట్యూబులు బాగానే ఉన్నాయని చెప్పారు. అయితే ఇంతవరకు మళ్లీ గర్భం రాలేదు. రీకానలైజేషన్ ఫెయిలై ఉంటుందా? ఒకవేళ ఫెయిలైతే ట్యూబులు బాగానే ఉండే అవకాశాలు ఉంటాయా? – సౌజన్య, ఉరవకొండ రీకానలైజేషన్ ఆపరేషన్‌లో కుటుంబ నియంత్రణ కోసం చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ ద్వారా ముడి వేసి కట్ చేసిన ఫెలోపియన్ ట్యూబ్‌లను మళ్లీ అతికించడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ చేసినంత మాత్రాన అది సక్సెస్ అయి, మళ్లీ గర్భం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఆపరేషన్ సమయంలో ట్యూబ్‌లు తెరుచుకున్నట్లు అనిపించినా, కొంతకాలానికి అవి కొద్దిగా లేదా పూర్తిగా మూసుకుపోవచ్చు. మూసుకుపోయిన ట్యూబ్లలో గర్భం వచ్చినా, అది ట్యూబ్‌లోనే ఉండిపోయి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవొచ్చు. కొందరిలో ట్యూబ్‌లు బయటి నుంచి బాగానే ఉన్నా, లోపలి భాగంలో ఉండే సీలియా పాడై, దాని పనితీరు సరిగా లేకపోవచ్చు. అందువల్ల కూడా గర్భం అందకపోవచ్చు. ట్యూబ్స్ బాగానే ఉన్నా, కొన్నిసార్లు అండం విడుదల సరిగా లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, భర్తలో వీర్యకణాల లోపాలు వంటి ఇతరేతర సమస్యల వల్ల కూడా గర్భం రాకపోవచ్చు. కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. లేకపోతే టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. - డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఆందోళన: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు
సాక్షి, అమరావతి: సిజేరియన్ ప్రసవాలు పెరుగుతుండటం దుష్పరిణామాలు కలిగించే అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన దానికంటే 6.2 మిలియన్లు అంటే 62 లక్షల సిజేరియన్ ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయనేది డబ్ల్యూహెచ్‌వో అంచనా. తాజాగా సిజేరియన్ ప్రసవాలపై డబ్ల్యూహెచ్‌వో అన్ని దేశాలకు ఓ నివేదిక ఇచ్చింది. కోత ద్వారా ప్రసవం చేయడానికి ఎలాంటి కారణమూ చూపలేని పరిస్థితులు ఉన్నాయని, ఒత్తిడి వల్లనో, వాణిజ్యపరంగా లాభాలను ఆశించో, మరే ఇతర కారణాల వల్లనో గర్భిణి చేరిన గంటల వ్యవధిలోనే కోతల ద్వారా బిడ్డను బయటకు తీస్తున్నారని, ఇది భవిష్యత్‌లో తీవ్ర దుష్ఫలితాలను ఇస్తుందని పేర్కొంది. వైద్యపరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ ప్రసవం చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే 90 శాతం మంది డాక్టర్లు ఎందుకు సిజేరియన్ ప్రసవం చేయాల్సి వచ్చింది అనేందుకు సరైన కారణాలు చెప్పలేకపోతున్నారని పేర్కొంది. సిజేరియన్ ప్రసవానికి సాక్ష్యాలతో కూడిన క్లినికల్ ఆధారాలను చూపించేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో సూచించింది. చదవండి: గర్భిణులకు కోవిడ్ సోకితే, నెలలు నిండకముందే ప్రసవం క్రాస్ ఆడిట్‌కు ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రంలోనూ కోతల ప్రసవాల సంఖ్య పెరుగుతున్నట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా సిజేరియన్ ప్రసవాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గడిచిన నాలుగైదు మాసాల్లో ప్రభుత్వ పరిధిలోని పెద్దాసుపత్రుల్లోనూ సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగానే ఉన్నాయి. రాత్రి 8 గంటల సమయం నుంచి ఉదయం 8 గంటల ముందు ఆస్పత్రిలో చేరిన వారికి ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలు చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో సిజేరియన్ల వల్ల కలిగే నష్టాలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ చేపట్టింది. కోతల ప్రసవాలపై కలిగే నష్టాలపై ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులో క్రాస్ ఆడిట్ నిర్వహిస్తారు. ఒక జిల్లాలో జరిగిన ప్రసవాలపై మరో జిల్లా అధికారులతో క్రాస్ ఆడిట్ నిర్వహించి, అకారణంగా కోతలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. చదవండి: గర్భధారణ సమయంలో టిఫా స్కానింగ్ ఎందుకు చేస్తారు? 25 శాతానికి మించకూడదు మొత్తం ప్రసవాల్లో 25 శాతానికి మించి కోతల ప్రసవాలు జరగకూడదు. అలాంటిది ప్రైవేటు ఆస్పత్రుల్లో 65 శాతం పైగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పరిధిలోనూ 35 నుంచి 40 శాతం జరుగుతున్నాయి. అవగాహన లేక కొంతమంది గర్భిణుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ‘మా బిడ్డ నొప్పులు భరించలేదు.. ఆపరేషన్ చేయండి డాక్టర్..’ అంటున్నారు. లేదంటే ‘ఈ రోజు మంచి రోజు.. ప్రసవం ఈ రోజు జరిగితే బావుంటుందని పంతులు చెప్పారు..’ అంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి నిర్ణయాల వల్ల తల్లికీ బిడ్డకూ నష్టం చేసిన వారవుతారు. – డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు సిజేరియన్తో ఆరోగ్య సమస్యలు ►సాధారణ ప్రసవం ద్వారా పుట్టిన వారికంటే సిజేరియన్ ప్రసవం ద్వారా పుట్టిన పిల్లలకు ఐక్యూ తక్కువగా ఉంటుంది. ►చిన్న వయసులోనే తల్లులకు నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. సిజేరియన్ వల్ల చాలామంది తల్లులు స్థూలకాయం బారిన పడుతున్నారు. ►పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. 2021 మార్చి నుంచి జూన్ వరకు ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ప్రసవాలు ఇలా.. ఆస్పత్రి మొత్తం ప్రసవాలు సిజేరియన్ ప్రసవాలు జీజీహెచ్, అనంతపురం 2,150 945 జీజీహెచ్, విజయవాడ 2,351 1,173 జీజీహెచ్, కాకినాడ 1,900 645 జీజీహెచ్, కర్నూలు 2,119 921 కింగ్‌జార్జి, విశాఖపట్నం 2,484 1087 జీజీహెచ్, శ్రీకాకుళం 583 308 జీజీహెచ్, గుంటూరు 1,986 971 జీజీహెచ్, నెల్లూరు 1,074 596 జీజీహెచ్, కడప 1,536 826 జీజీహెచ్, ఒంగోలు 260 143 -
కలవరపెడుతున్న కడుపు ‘కోత’లు
నగరంలో కడుపు‘కోత’లు కలవరపెడుతున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నా.. ధన సంపాదనే లక్ష్యంగా పలు ప్రైవేటు గైనకాలజిస్టులు అడ్డగోలుగా సిజేరియన్లు చేస్తున్నారు. మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువ శాతం సిజేరియన్లు జరుగుతుండటంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గర్భం దాల్చిన తర్వాత చెకప్‌లకు వస్తున్న వారి శాతం తొలుత ఆశించిన స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడయ్యింది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పలు కార్పొరేట్, ప్రవేటు నర్సింగ్ హోంలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. సంపాదనే లక్ష్యంగా తల్లుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ.. ఉమ్మనీరు తక్కువగా ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని, గుండె వేగంగా కొట్టుకుంటోందని, పురిటి నొప్పుల బాధ భరించలేరని పేర్కొంటూ బాధిత బంధువులను భయపెట్టి అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారు. సాధారణ ప్రసవంతో పోలిస్తే.. సిజేరియన్ ప్రసవాలకు పట్టే సమయం కూడా చాలా తక్కువ. సర్జరీ చేయడం వల్ల ఆస్పత్రికి ఆదాయం సమకూరుతుంది. ఈ రెండు అంశాలు గైనకాలజిస్టులకు కలిసి వచ్చే అంశాలు. సిజేరియన్ ప్రసవాలు ఆ తర్వాత తరచూ కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్, అధిక బరువు, నెలసరి వంటి సమస్యలకు కారణమవుతున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్లో 98.3 శాతం ప్రసవాలు ప్రభుత్వ, ప్రవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నప్పటికీ మొత్తం ప్రసవాల్లో 59.7 శాతం సిజేరియన్లు ఉండగా.. వీటిలో ఎక్కువ శాతం సిజేరియన్ డెలివరీలు ప్రైవేటులోనే జరుగుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. గర్భం దాల్చిన తర్వాత చెకప్‌లకు వస్తున్న వారి శాతం తొలుత ఆశించిన స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి: 8,289 ఎకరాలు.. 789 కేసులు సోమ, శుక్రవారాల్లోనే అధికం.. కాన్పు కోతలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే అత్యధికంగా జరుగుతున్నాయి. ఆదాయం పెంచుకోవడానికి ప్రైవేటు ఆస్పత్రులు వీటికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆరోగ్యబీమా ఉన్న వారు ఎక్కువగా ఈ ఆపరేషన్లకే మొగ్గుచూపుతున్నారు. కాన్పుకోతలు సోమ, శుక్రవారాల్లోనే అత్యధికంగా జరుగుతుండటం విశేషం. చాలా మంది ఈ రెండు రోజులను శుభసూచకంగా భావిస్తుంటారు. అంతేకాదు ప్రసవానికి ముందే వార, తిథి, నక్షత్ర బలాలను బట్టి ముహూర్తాలు ఖరారు చేస్తుండటం కూడా ఇందుకు కారణం. ఆదివారం ప్రసవాల సంఖ్య మాత్రమే కాదు సిజేరియన్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. వైద్యులకు ఆ రోజు సెలవు కావడమే. కారణాలనేకం.. ♦ ప్రసవ సమయం దగ్గర పడే కొద్దీ గర్భిణుల్లో ఆందోళన మొదలవుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వెలుగు చూస్తున్నాయి. తొలి ప్రసవం సిజేరియన్ అయితే ఆ తర్వాతి ప్రసవానికీ సర్జరీకే ప్రాధాన్యమిస్తున్నారు. ♦ సంతాన సాఫల్య శాతం తగ్గిపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. మరికొన్ని కేసుల్లో మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకొని 35 ఏళ్ల వయసులో తొలి సంతానానికి జన్మనిస్తున్నారు. ఇలాంటి కేసులను అరుదుగా పరిగణిస్తున్న వైద్యులు తప్పనిసరిగా చికిత్సలకు వెళుతున్నారు. ♦ కొందరు మహిళలు తొలి కాన్పు సమయంలో ఎదురైన నొప్పులు, ఇతర అనుభవాలకు భయపడి రెండో కాన్పు సిజేరియన్‌కు వెళుతున్నారు. చాలా మంది మహిళలు ఆ నిర్ణయాన్ని వైద్యులకే వదిలేస్తున్నారు. సహజ కాన్పుల సమయంలో పారామెడికల్ సిబ్బంది చేసే వెకిలి వ్యాఖ్యలు, ఇతరత్రా భావోద్వేగ పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలు.. సిజేరియన్‌కే వెళ్లడం మంచిదని తోటి మహిళలకు చెబుతుండటం కూడా సిజేరియన్లు పెరగడానికి కారణమవుతోంది. గర్భం దాల్చిన తర్వాత పరీక్షలకు వస్తున్న వారు ఇలా.. శాతాల్లో తొలి యాంటినెంటల్ చెకప్‌కు హాజరువుతున్న వారు 87.9 కనీసం నాలుగు వారాల పాటు చెకప్‌కు వస్తున్నవారు 69.9 మొదటి, రెండో కాన్పుకు మధ్య కనీస వ్యతాసం పాటిస్తున్న వారు 89.6 వంద రోజుల పాటు ఐరెన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతున్నవారు 72.2 180 రోజుల పాటు వాడుతున్నవారు 38.4 ఎంసీపీ కార్డు పొందుతున్న వారు 94.4 సిజేరియన్లతో ఆరోగ్య సమస్యలు సిజేరియన్తో పురిటినొప్పుల బాధ నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందినప్పటికీ.. దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సిజేరియన్తో అధిక రక్తస్రావంతో పాటు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కత్తిగాటు గాయం మానడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ఆ తర్వాత నెలసరి సమస్యలు తలెత్తి అధిక బరువు సమస్య ఉత్పన్నమవుతుంది. కోత, కుట్ల వద్ద ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తుతుంది. సాధ్యమైనంత వరకు సహజ ప్రసవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. – డాక్టర్ సంగీత, గైనకాలజిస్ట్ -
తల్లికి సిజేరియన్..23 ఏళ్ల కొడుక్కి నష్టపరిహారం
న్యూఢిల్లీ: 23 ఏళ్ల కిందట సిజేరియన్ ఆపరేషన్ చేస్తుండగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ డాక్టర్‌కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్(ఢిల్లీ) భారీ జరిమానా విధించింది. సిజేరియన్ ఆపరేషన్ చేస్తుండగా నిర్లక్ష్యంగా వ్యవహరించి, 22 ఏళ్ల వయసున్న ఓ మహిళ మృతికి డాక్టర్ సద్నకళ కారణమయ్యారని, బాధితురాలి కుమారుడు, భర్త, తండ్రికి రూ. 15 లక్షల నష్టపరిహారం అందించాలని ఆదేశించింది. వినియోగదారుల కమిషన్ బెంచ్ అధ్యక్షులు ఎన్పీ కౌశిక్, డాక్టర్ సద్న కళను బాధిత కుటుంబ సభ్యులైను కుమారుడు దీపాన్షు మిశ్రా(23), తండ్రి ఉదయ్ కాంత్ ఝా, భర్త శంకర్ మిశ్రాలకు నష్టపరిహారం అందించాలని స్పష్టం చేశారు. డాక్టర్ సద్నకళ నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్యంగా ఉన్న ఓ 22 ఏళ్ల మహిళ తన ప్రాణాన్ని కోల్పోవాల్సి రావడం దురదృష్టకరమని బెంచ్ అభిప్రాయపడింది. 1993 ఏప్రిల్ 12వ తేదీన డెలివరీ కోసం తన కూతురు అంజనా మిశ్రాను, మూల్ చంద్ కైరాటీ రామ్ ఆసుపత్రిలో చేర్పించామని తండ్రి ఉదయ్ కాంత్ ఝా తెలిపారు. ఆపరేషన్ సమయంలో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా అంజనా మిశ్రాకు రక్తస్రావం అధికంగా జరిగిందని, బాబుకు జన్మనిచ్చిన తర్వాత అంజనా ఆరోగ్యం మరింత క్షీణించి, చివరకు కృత్రిమ శ్వాసను అందించారని ఝా వివరించారు. అధిక రక్త స్రావంతో పాటూ కామెర్ల వ్యాధి సోకడంతో ఆమె కాలెయం పని చేయడం ఆగిపోయిందని తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంజనా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డాక్టర్ సద్నకళ మరో డాక్టర్ సహాయాన్ని కోరారు. అప్పటికే ఆలస్యం కావడంతో 1993 ఏప్రిల్ 22న అంజనా మృతిచెందిందని ఝా తెలిపారు. కాగా, డాక్టర్ సద్నకళ మాత్రం తాను సిజేరియన్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని తెలిపింది. ఆపరేషన్ చేసి ఆరోగ్యంగా ఉన్న బాబుకు పురుడు పోశానని పేర్కొన్నారు.