
లక్నో: సిజేరియన్ సమయంలో మహిళ పొట్టలోనే కత్తెరను మర్చిపోయి కుట్లేశాడో వైద్యుడు. 2008లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 17 ఏళ్ల పాటు కడుపు నొప్పితో ఎంతో బాధపడింది ఆ మహిళ. చివరికి ఎక్స్ రేతో పొట్టలో కత్తెర ఉన్న విషయం తెల్సి ఆపరేషన్‌తో వెలుపలికి తీశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంధ్యా పాండే అనే మహిళకు 2008 ఫిబ్రవరి 28వ తేదీన లక్నోలోని ‘షీ మెడికల్ కేర్’ఆస్పత్రిలో సిజేరియన్‌తో కాన్పు చేశారు. ఆ సర్జరీ జరిగినప్పటి నుంచి పొట్టలో విపరీతమైన బాధతో ఇబ్బంది పడుతున్నారు. ఎందరో డాక్ట ర్ల వద్దకు వెళ్లారు. అయినా ఉపశమనం దొరకలేదు.
ఇటీవల సంధ్యా పాండే వైద్య పరీక్షల కోసం లక్నోలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎక్స్ రే కూడా తీశారు. ఆమె పొట్టలో కత్తెర ఉన్నట్లు ఎక్స్ రే రిపోర్టుతో తెలిసింది. దీంతో ఆమె కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేరారు. మార్చి 26వ తేదీన ఆపరేషన్ చేసి వైద్యులు కడుపులో ఉన్న కత్తెరను బయటకు తీశారు. ఎంతో సంక్లిష్టమైన ఆపరేషన్ ద్వారా కత్తెరను బయట కు తీశామని, కోలుకున్నాక సంధ్యా పాండేను డిశ్చార్జి చేశామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సంధ్య భర్త అరవింద్ కుమార్ పాండే ఫిర్యాదు మేరకు సిజేరియన్ చేసిన డాక్టర్ పుష్పా జైశ్వాల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.