తల్లికి సిజేరియన్..23 ఏళ్ల కొడుక్కి నష్టపరిహారం
తల్లికి సిజేరియన్..23 ఏళ్ల కొడుక్కి నష్టపరిహారం
Published Thu, Dec 1 2016 7:13 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
న్యూఢిల్లీ:
23 ఏళ్ల కిందట సిజేరియన్ ఆపరేషన్ చేస్తుండగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ డాక్టర్కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్(ఢిల్లీ) భారీ జరిమానా విధించింది. సిజేరియన్ ఆపరేషన్ చేస్తుండగా నిర్లక్ష్యంగా వ్యవహరించి, 22 ఏళ్ల వయసున్న ఓ మహిళ మృతికి డాక్టర్ సద్నకళ కారణమయ్యారని, బాధితురాలి కుమారుడు, భర్త, తండ్రికి రూ. 15 లక్షల నష్టపరిహారం అందించాలని ఆదేశించింది. వినియోగదారుల కమిషన్ బెంచ్ అధ్యక్షులు ఎన్పీ కౌశిక్, డాక్టర్ సద్న కళను బాధిత కుటుంబ సభ్యులైను కుమారుడు దీపాన్షు మిశ్రా(23), తండ్రి ఉదయ్ కాంత్ ఝా, భర్త శంకర్ మిశ్రాలకు నష్టపరిహారం అందించాలని స్పష్టం చేశారు.
డాక్టర్ సద్నకళ నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్యంగా ఉన్న ఓ 22 ఏళ్ల మహిళ తన ప్రాణాన్ని కోల్పోవాల్సి రావడం దురదృష్టకరమని బెంచ్ అభిప్రాయపడింది. 1993 ఏప్రిల్ 12వ తేదీన డెలివరీ కోసం తన కూతురు అంజనా మిశ్రాను, మూల్ చంద్ కైరాటీ రామ్ ఆసుపత్రిలో చేర్పించామని తండ్రి ఉదయ్ కాంత్ ఝా తెలిపారు. ఆపరేషన్ సమయంలో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా అంజనా మిశ్రాకు రక్తస్రావం అధికంగా జరిగిందని, బాబుకు జన్మనిచ్చిన తర్వాత అంజనా ఆరోగ్యం మరింత క్షీణించి, చివరకు కృత్రిమ శ్వాసను అందించారని ఝా వివరించారు. అధిక రక్త స్రావంతో పాటూ కామెర్ల వ్యాధి సోకడంతో ఆమె కాలెయం పని చేయడం ఆగిపోయిందని తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంజనా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డాక్టర్ సద్నకళ మరో డాక్టర్ సహాయాన్ని కోరారు. అప్పటికే ఆలస్యం కావడంతో 1993 ఏప్రిల్ 22న అంజనా మృతిచెందిందని ఝా తెలిపారు.
కాగా, డాక్టర్ సద్నకళ మాత్రం తాను సిజేరియన్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని తెలిపింది. ఆపరేషన్ చేసి ఆరోగ్యంగా ఉన్న బాబుకు పురుడు పోశానని పేర్కొన్నారు.
Advertisement
Advertisement