state consumer commission
-
స్థలాల కొనుగోళ్లు వాణిజ్యం కిందకు రాదు
సాక్షి, హైదరాబాద్: భూముల్ని ప్లాట్లుగా చేసి ఒప్పం దం ప్రకారం వినియోగదారుడికి స్థలాన్ని ఇవ్వకపోతే తీసుకున్న సొమ్మును వడ్డీతో చెల్లించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. స్థలాల కొనుగోలు వాణిజ్యం పరిధిలోకి రాదని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ బీఎన్ రావు నల్లా, సభ్యుడు జస్టిస్ పాటిల్ విఠల్‌రావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. రంగారెడ్డి జిల్లా విజయవాడ జాతీయ రహదారిలో ప్రిస్టేజ్ అవెన్యూ లిమిటెడ్‌కు చెందిన ఓషన్ ప్రిస్టేజ్ ప్రాజెక్టులో వెయ్యి గజాల స్థలం కోసం రుచిత అనే మహిళ 2007లో రూ.4.25 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. అది ప్రభుత్వ భూమి కావడంతో సంస్థ స్థలాన్ని అప్పగించలేకపోయింది. చెల్లించిన సొమ్మును తిరిగి ఇవ్వలేదు. దాంతో రుచిత వేసిన కేసులో రూ.4.25 లక్షలకు వడ్డీగా రూ.3.82 లక్షలు, పరిహారంగా రూ.ఒక లక్ష చెల్లించాలని జిల్లా ఫోరం చెప్పింది. దీనిని ప్రిస్టేజ్ ప్రాజెక్టు ఏజెంట్ సీహెచ్ కృష్ణయ్య రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో సవాల్ చేశారు. వాణిజ్య అవసరాలతోనే ప్లాట్‌పై పెట్టుబడి పెట్టారని, లాభం కోసమే పెట్టుబడి పెట్టా రనే అప్పీల్ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. -
‘నార్నే’ సంస్థకు భారీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: ప్లాటు కోసం వినియోగదారు నుంచి వాయిదాల పద్ధతిలో డబ్బు వసులు చేసి రిజిస్ట్రేషన్ చేయని నార్నే రియల్ ఎస్టేట్ సంస్థకు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. వినియోగదారు చెల్లించిన మొత్తాన్ని 18%తో తిరిగి చెల్లించాలని, వినియోగదారు మరో ప్లాట్ తీసుకునేందుకు ఆసక్తి చూపితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని తీర్పు చెప్పింది. దీంతోపాటుగా నష్టపరిహారంగా రూ.లక్ష, ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ బి.ఎన్.రావు నల్లా, సభ్యులు పాటిల్ విఠల్‌రావులతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. రిజిస్ట్రేషన్లు ఆపేసిందన్న సాకుతో.. నార్నే రియల్ ఎస్టేట్స్ సంస్థ హైదరాబాద్ శివారులోని ఈస్ట్ సిటీ వెంచర్ వేసింది. అందులోని 250 గజాల స్థలాన్ని కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన శ్రీలక్ష్మి ఎం.కొత్వాల్ అనే మహిళ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేశారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేసిందనే కారణంతో నార్నే సంస్థ ఆమెకు ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయలేదు. నిమ్స్ నిర్మాణం వల్ల 500 ప్లాట్లు పోతున్నాయని, అందుకు గజానికి రూ.1500 వరకూ తిరిగి చెల్లిస్తామని శ్రీలక్ష్మికి నార్నే సంస్థ లేఖ రాసింది. అయితే జాతీయ రహదారి విస్తరణలో ప్లాట్ పోయిందని, మరో వెంచర్లో ప్లాట్ తీసుకోవాలని నార్నే సంస్థ తెలిపింది. స్థలం రిజిస్ట్రేషన్ చేయాలని 2009 నుంచి 2011 వరకూ ఆ సంస్థకు లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో శ్రీలక్ష్మి జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేసి గెలుపొందారు. దీనిని నార్నే సంస్థ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీల్ చేసింది. శ్రీలక్ష్మి చెల్లించిన మొత్తం డబ్బును నార్నే సంస్థ తిరిగి ఆమెకు చెల్లించకపోవడమే కాకుండా జాతీయ రహదారి కోసం జరిగిన భూసేకరణలో ఆమెకిచ్చిన పరిహారా న్ని కూడా ఆ సంస్థే తీసేసుకుంది. ఈ కేసును విచారించిన కమిషన్ పైవిధంగా తీర్పునిచ్చింది. -
తల్లికి సిజేరియన్..23 ఏళ్ల కొడుక్కి నష్టపరిహారం
న్యూఢిల్లీ: 23 ఏళ్ల కిందట సిజేరియన్ ఆపరేషన్ చేస్తుండగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ డాక్టర్‌కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్(ఢిల్లీ) భారీ జరిమానా విధించింది. సిజేరియన్ ఆపరేషన్ చేస్తుండగా నిర్లక్ష్యంగా వ్యవహరించి, 22 ఏళ్ల వయసున్న ఓ మహిళ మృతికి డాక్టర్ సద్నకళ కారణమయ్యారని, బాధితురాలి కుమారుడు, భర్త, తండ్రికి రూ. 15 లక్షల నష్టపరిహారం అందించాలని ఆదేశించింది. వినియోగదారుల కమిషన్ బెంచ్ అధ్యక్షులు ఎన్పీ కౌశిక్, డాక్టర్ సద్న కళను బాధిత కుటుంబ సభ్యులైను కుమారుడు దీపాన్షు మిశ్రా(23), తండ్రి ఉదయ్ కాంత్ ఝా, భర్త శంకర్ మిశ్రాలకు నష్టపరిహారం అందించాలని స్పష్టం చేశారు. డాక్టర్ సద్నకళ నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్యంగా ఉన్న ఓ 22 ఏళ్ల మహిళ తన ప్రాణాన్ని కోల్పోవాల్సి రావడం దురదృష్టకరమని బెంచ్ అభిప్రాయపడింది. 1993 ఏప్రిల్ 12వ తేదీన డెలివరీ కోసం తన కూతురు అంజనా మిశ్రాను, మూల్ చంద్ కైరాటీ రామ్ ఆసుపత్రిలో చేర్పించామని తండ్రి ఉదయ్ కాంత్ ఝా తెలిపారు. ఆపరేషన్ సమయంలో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా అంజనా మిశ్రాకు రక్తస్రావం అధికంగా జరిగిందని, బాబుకు జన్మనిచ్చిన తర్వాత అంజనా ఆరోగ్యం మరింత క్షీణించి, చివరకు కృత్రిమ శ్వాసను అందించారని ఝా వివరించారు. అధిక రక్త స్రావంతో పాటూ కామెర్ల వ్యాధి సోకడంతో ఆమె కాలెయం పని చేయడం ఆగిపోయిందని తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంజనా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డాక్టర్ సద్నకళ మరో డాక్టర్ సహాయాన్ని కోరారు. అప్పటికే ఆలస్యం కావడంతో 1993 ఏప్రిల్ 22న అంజనా మృతిచెందిందని ఝా తెలిపారు. కాగా, డాక్టర్ సద్నకళ మాత్రం తాను సిజేరియన్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని తెలిపింది. ఆపరేషన్ చేసి ఆరోగ్యంగా ఉన్న బాబుకు పురుడు పోశానని పేర్కొన్నారు.